ఖతార్ కి ఖతర్నాక్ షాకిచ్చిన ట్రంప్!
ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఎవ్వరూ ఊహించని పనులు చేయటం కొత్త కాదు! ఆయన స్టైలే షాకివ్వటం! తాజాగా ఆయన మొదటి సారి కాలు బయటపెట్టి ఒక విదేశీ గడ్డపై పర్యటించాడు. అయితే, ఇది కూడా అనూహ్యంగానే చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా సౌదీ అరేబియాకు బయలుదేరాడు! ఎందుకు అనే సమాధానం ట్రంప్ పర్యటిస్తున్నంత సేపూ దొరకలేదు! కాని, ఇప్పుడు అర్థమవుతోంది మెల్ల మెల్లగా!
ట్రంప్ మొదటి నుంచీ ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకం. ఆ విషయం ఎన్నికల సందర్భంలో కూడా ఆయన దాచి పెట్టలేదు. కాని, సౌదీ లాంటి ముస్లిమ్ గడ్డపై కూడా ఆ మాట మాట్లాడతాడని ఎవ్వరూ ఊహించలేదు. కాని, ట్రంప్ ఇస్లామిక్ టెర్రరిజమ్ అనకుండా… ఉగ్రవాదానికి మూలాలు ఏ దేశంలో వున్నా సహించేది లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. దాన్ని తమకు అనుకూలంగా స్వీకరించాయి కొన్ని ఇస్లామిక్ దేశాలు! దాని ఫలితమే… ఖతార్ తో సౌదీ అరేబియా, ఈజీప్ట్, యూఏఈ, బహ్రైన్ లు ఉన్నపళంగా సంబంధాలు తెంచేసుకోటం!
ఖతార్ చమురు సమృద్ధిగా దొరికే మధ్య ప్రాచ్యంలోనే వున్న కీలకమైన ముస్లిమ్ దేశం. కాని, దానితో ప్రధాన ఇస్లామిక్ రాజ్యమైన సౌదీకి పడదు. బహ్రైన్, ఈజీప్ట్, యూఏఈ లాంటి దేశాలకు ఖాతార్ తో పొసగదు. ఎందుకంటే, లోపాయికారిగా ఖతార్ ఇరాన్ తో కలిసి పని చేస్తోంది. ఇరాన్ అటు అమెరికాకి, ఇటు సౌదీ అరేబియాకి కూడా శత్రువు. ఇరాన్ అండతోనే అమెరికాకు వ్యతిరేకంగా ఉగ్రవాదం పెచ్చుమీరుతోందని చాలా మంది వాదన! అటువంటి దేశానికి ఖతార్ అండగా నిలబడటం వైట్ హౌజ్ కి నచ్చదు. కాని, ఇంత వరకూ ఒబామా లాంటి అమెరికన్ ప్రెసిడెంట్లు ఖతార్ ను చూసి చూడనట్లే వదిలారు. కాని, ట్రంప్ సౌదీకి వచ్చి మరీ అగ్గి రాజేసి వెళ్లాడు!
సౌదీ, ఖతార్లకు వున్న విభేదాలు, వాట్ని వాడుకుని అమెరికా ఖతార్ ను కంట్రోల్ చేయాలని చూడటం… ఇవన్నీ ఎలా వున్నా… మధ్య ప్రాచ్యంలో ఇప్పుడప్పుడే రాజకీయ సంక్షోభం మాత్రం సమసిపోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఖతార్ షియా జనాభా వున్న బలమైన రాజకీయ శక్తి. సౌదీ లాంటి దేశాలు సున్నీ ముస్లిమ్ లు మెజార్జీలుగా వున్నవి. కాబట్టి ఇక ఇప్పుడు షియా, సున్నీ ముస్లిమ్ దేశాల మధ్య మనస్పర్థలు మరింత ముదరవచ్చు. హింసాత్మక పరిణామాలకు దారి తీయవచ్చు. అంతే కాదు, ఖతార్ పై వివిధ దేశాల విపరీత ఆంక్షాల వల్ల చమురు రేట్లు పెరిగే ఛాన్స్ వుంది. ముఖ్యంగా, ఎల్ పీజీ ధర అదుపు తప్పవచ్చు. ఎల్ పీజీ అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఖతారే!
ట్రంప్ సౌదీకి వచ్చి తిరిగి వెళ్లే దాకా ఆయన భార్య అతడి చేయి పట్టుకోలేదు, విసిరికొట్టింది అని వార్తలు రాసిన ఇంటర్నేషనల్ మీడియా ఖతార్ పరిణామం అస్సలు ఊహించలేదు! కాని, అమెరికా తన మిత్ర దేశాలైన అరబ్ శక్తుల్ని ఏకం చేసి ఖతార్ పై ప్రయోగించింది! దీనికి ఆ దేశం, ఆ దేశాన్ని సపోర్ట్ చేసే ఇరాన్, ఉగ్రవాదుల రియాక్షన్ ఎలా వుంటుందో వేచి చూడాలి…