జూలై ఒకటి… ఆధార్ ఒట్టి కార్డ్ కాదు... జీవనాధారం!
posted on Jun 29, 2017 @ 12:42PM
మనిషి బతకాలంటే ఏంటి ఆధారం? భూమి, గాలి, నీరు, ఆహారం… ఇవే కదా ఆధారం! కానీ, జూలై ఫస్ట్ నుంచీ మరో కొత్త జీవనాధరం అవసరం అవబోతోంది భారతీయులకి! గాలి, నీరు, ఆహారంలాగే ఆధార్ కూడా ఇక పై తప్పనిసరి! అంతలా రూల్స్ మారిపోనున్నాయి!
జూలై ఒకటవ తేదీ నుంచీ జీఎస్టీ వస్తోంది. కాబట్టి రేట్లు తగ్గుతాయి, పెరుగుతాయి అంటూ అంతా చర్చల్లో మునిగిపోయారు. కానీ, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది ఆధార్ విషయంలో! జూలై ఒకటి తరువాత అనేక విషయాల్లో ఆధారే కీలక ఆధారమై కూర్చోనుంది. కాబట్టి ఆధార్ లేకుంటే సగటు భారతీయుడి పరిస్థితి నిరాధారమే అనాలి!
ఐటీ రిటర్న్స్ వేయాలంటే ఇక మీదట ఆధార్ తప్పనిసరి అంటోంది ప్రభుత్వం. ఆధార్ నెంబర్ లేకుంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటం కుదరదన్నమాట! ప్యాన్ కార్డు పరిస్థితి కూడా అంతే! మీకు ఆల్రెడీ ప్యాన్ కార్డ్ వుంటే వెంటనే ఆధార్ ను ప్యాన్ తో లింక్ చేయించుకోవాలి. కొత్తది తీసుకునే ఆలోచనలో వుంటే ఆధార్ లేకుండా ప్యాన్ కార్డ్ ఇక మీదట ఇవ్వరు! దీని వల్ల ఆధార్ నెంబర్ సాయంతో ఏ ఒక్కరూ ఒకటికి మించి ప్యాన్ కార్డ్ లు సంపాదించకుండా చెక్ పెట్టవచ్చు!
పాస్ పోర్ట్ తీసుకుని విదేశాలకు ఎగిరిపోవాలనుకున్నా ఆధారే ఆధారం! జూలై ఒకటి తరువాత ఆధార్ లేకుండా పాస్ పోర్ట్ ఇష్యూ చేయరు! అదే బాటలో నడుస్తోంది పీఎఫ్ సంస్థ. ఇక మీద ఉద్యోగులు అందరూ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. దీని వల్ల ఎవరైనా తమ ఈపీఎఫ్ డ్రా చేయదలుచుకుంటే చాలా తక్కువ రోజుల్లో వ్యవహారం పూర్తవుతుంది. కేవలం పది రోజుల్లో ఆధార్ నెంబర్ సాయంతో పీఎఫ్ డబ్బులు బ్యాంక్లో క్రెడిట్ అయిపోతాయి!
రై్ల్వే టికెట్ల బుకింగ్ లో లభించే రాయితీలు కూడా ఆధార్ వుంటేనే అంటోంది రైల్వే శాఖ! విద్యార్థులకి స్కాలర్ షిప్ లు కావాలన్నా ఆధార్ చూపాల్సిందేనని తేల్చేసింది కేంద్ర మానవ వనరుల శాఖ! రేషన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేయకుంటే సబ్సిడీ మీద ఇచ్చే బియ్యం, పంచదార వంటి వాటి మీద కూడా ఆశ వదులుకోవాల్సిందే!
అన్నీటికీ ఆధార్ అంటే ఇప్పటికిప్పుడు సామాన్య జనానికి కొంత వరకూ ఇబ్బందే. చిరాకు కూడా. కానీ, ఆధార్ లింక్ చేయటం వల్ల నిజమైన లబ్ధిదారులు మాత్రమే మేలు పొందుతారు. అలాగే, ఇంటి దొంగల్ని పట్టుకోవటమే కాదు… బంగ్లాదేశ్ నుంచి ఇక్కడకు వచ్చేసి తిష్ఠవేసిన విదేశీ దొంగల్ని కూడా ఆధార్ తో ఆటకట్టించవచ్చు!