ఓ మనిషీ... నీ దారెటువైపు

మానవత్వం అన్న పదానికి అర్ధం లేకుండా పోతుంది. ఇంతకు మునుపు రాజులు రాజ్యాధికార దాహంతో యుద్దాలు చేసేవారు. ఈ ప్రక్రియలో బలి అయింది సామాన్యులే. ఇప్పుడు, మతం, అధికార కాంక్షతో మనుషులు మృగాలుగా మారుతున్నారు. ఈ ప్రక్రియలో అసువులు బాస్తుంది కూడా సామాన్య జనమే.    నిన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిలో కొందరు ప్రాణాలు విడువగా, మరి కొందరు క్షతగాత్రులయ్యారు. అమర్నాథ్ యాత్రకి వెళ్తున్న వాహనంపై ఉగ్ర వాదులు మెరుపు దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హిందువులు పవిత్ర పుణ్య క్షేత్రం కి వెళ్లి, తిరుగు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే, ముస్లిం అయిన డ్రైవర్ చాకచక్యంగా ఉగ్రవాదులకు భయపడకుండా బస్సు ని అలాగే ముందుకు పోనివ్వబట్టి చాలా మంది ప్రాణాలతో బయట పడ్డారు, లేదంటే పరిస్థితులు దారుణంగా ఉండేవి. ఆ డ్రైవర్ మీడియా తో మాట్లాడుతూ, "అసలు ఉగ్రవాదులకు కులం, మతం, హిందూ, ముస్లిం అన్న భావన ఉండదని, ఎవర్ని లక్ష్యం చేసుకుంటున్నామో కూడా ఆలోచించకుండా మారణకాండ సాగించడమే వాళ్ళ ముఖ్యోద్దేశమని," అన్నాడు. ముస్లింలు, ముస్లింలనే చంపుకుంటే అసలు వాళ్ళ గమ్యం ఎటు వెళ్తున్నట్టు? అర్ధం లేని పయనం వ్యర్ధమే కదా! చూస్తుంటే వాళ్ళకి తెలిసింది చంపడం మాత్రమే, ఎవరిని చంపాము అని కూడా అనవసరమే.   ఇదిలా ఉంటే, చైనా కవ్వింపు చర్యలు కూడా ఉగ్రవాదం కన్నా తక్కువేం కాదు. ఆ దేశ సైనికుల చర్యలు మన జవానులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాము చావాలి కర్ర విరగకూడదు అన్నట్టుగా ఉంది మన సైనికుల పరిస్థితి. పరిస్థితులు చేయి దాటకుండా చూడాలి, అలాగని తొందరపడి చైనా సైనికుల పై ఎలాంటి దాడి చేయకూడదు. మనకేంటి ఇంట్లో కూర్చొని మంచి, చెడూ అన్ని మాట్లాడుతాం. చావు ముందు పెట్టుకొని బోర్డర్ లో గర్వంగా నిలబడే సైనికుడికే తెలుస్తుంది- తాము ఎలాంటి పరిస్థితులకి ఎదురొడ్డి నిల్చున్నామో అని. ఇంతకీ, మన వాళ్ళు ఇంత శాంతంగా ఉన్నా, చైనా ఎందుకు కవ్వింపు చర్యలకి పాల్పడుతుంది. తమది కాని ఒక భూభాగం కోసమే కదా! ప్రపంచం మొత్తం చైనా ని వేలు పెట్టి చూపిస్తున్న వేళ, తాము చేసేది ముమ్మాటికీ సరియైనదే అన్న ధోరణిలో ఉన్నారు. అయినా మన సైనికులు మాత్రం పక్క వాళ్ళు తొందర పడే వరకు వేచి చూడాలి, అంటే ఎవరో కనీసం ఒక్కరు ప్రాణాలు కోల్పోయే వరకు!   ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అగ్ర దేశం అమెరికాకే సవాళ్లు విసురుతున్నాడు. తాము ఏ సమయంలో యుద్ధం వచ్చినా సిద్దమే అని.... వరుస అణు పరీక్షలు చేస్తూ ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాడు. ఉత్తర కొరియా లాంచ్ చేసిన ఒక క్షిపణి వేల మైళ్ళు దాటి అమెరికా లో పేలగలదు అని కిమ్ జాంగ్ ప్రకటించాడు. అసలు, అతడి ఉద్దేశ్యం ఏంటి? మూడవ ప్రపంచ యుద్దానికి భీజం వేసే పనులు కాకపోతే! అసలు నిజంగా మూడవ ప్రపంచ యుద్ధమే గనక జరిగితే, భూమిపై మానవాళి అసలుంటుందా?   ఒకరిని అధిగ మించాలనే తపనతో, లేదా మత ఛాందసవాదంతో... మనిషి, సాటి మనిషిని శత్రువుగా చూస్తున్న వేళ... ఒకరిని ఇంకొకరు చంపుకుంటున్న వేళ... మానవత్వపు ఛాయలు మంటగలిసి పోతున్న వేళ... ఓ మనిషి నీ గమ్యం ఎటు వైపు... అందరూ పోయాక నువ్ సాధించేదేమిటి...

భారత్‌లో ఉగ్ర దాడులకి… పాక్‌తో పాటూ చైనా కూడా కారణమా?

  జమ్మూ, కాశ్మీర్ రక్తమోడుతూనే వుంది. ఇన్ని నెలలు ఆర్మీ, పోలీస్ బలగాలు ఉన్మాదుల రక్త దాహానికి బలయ్యాయి. ఇప్పుడు సాధారణ భారతీయ పౌరులు, ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రాణ త్యాగాలు చేయాల్సి వస్తోంది. అంతా కేవలం ఉగ్ర మూకల ఉన్మాదం వల్ల. అమర్ నాథ్ యాత్రీకుల బస్సుపై దాడితో మరోసారి టెర్రరిస్టులు తమ శాడిజాన్ని చాటుకున్నారు. నిరాయుధులైన యాత్రీకుల్ని చంపి వాళ్లు ఏం సాధించదలుచుకున్నారో అందరికీ తెలిసిందే! పాక్ లోని టెర్రర్ బాసుల మెప్పుపొందటమే ఆ జిహాదీల లక్ష్యం…   అమర్ నాథ్ యాత్రీకులపై దాడి ఎప్పుడూ కాశ్మీర్లో జరిగే ఉగ్రవాదాడుల్లో భాగంగా చూడకూడదు. అసలు గతంలోనూ 2001, 2002లో అమర్ నాథ్ యాత్రీకులపై దాడులు జరిగాయి. అయితే, అప్పుడు యాత్రీకుల క్యాంపు దాడి జరిగింది. ఓ సారి 13మంది, మరోసారి 8మంది చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో మొత్తం 7గురు గుజరాతీలు ప్రాణాలు కోల్పోయారు. కాకపోతే, తాజా ఉగ్రదాడి మనం అనేక కోణాల్లో విళ్లేషించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే, నెలల తరబడి కాశ్మీర్లో హింసాకాండ చెలరేగుతోంది. రాళ్లు రువ్వే అరాచకుల వల్ల మొత్తం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇటు ఆర్మీ కూడా ఎందరో జవాన్లను కోల్పోవాల్సి వస్తోంది. అయినా మన వారు పట్టుదలగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నారు. అదే ఇప్పుడు పాక్ లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ ఒత్తిడిలోనే సైన్యాన్ని ఎదుర్కోలేక అమాయకులపై దాడికి దిగుతున్నారు…   తాజా దాడిని చైనా కోణం నుంచి కూడా చూడాలి. అమర్ నాథ్ యాత్రీకులపై దాడి చైనా చేయించి వుండకపోవచ్చు. కాని, చైనా కూడా సిక్కిం సెక్టార్ లో ఎప్పుడూ లేని ఎదురు దాడిని భారత్ నుంచి ఎదుర్కొంటలోంది. మన సైన్యం ఒక్క అడుగు ముందుకు వేయనీయకుండా చైనీస్ సోల్జర్స్ అడ్డుకుంటోంది. ఇది ఘోర అవమానంగా భావించిన చైనా ఉడికిపోతోంది. అవసరమైతే పాక్ కు మద్దతుగా మూడో దేశం కాశ్మోర్లో అడుగుపెడుతుందంటూ బెదిరించే మాటలు మాట్లాడుతోంది! సరిగ్గా ఆ సమయంలోనే అమర్ నాథ్ యాత్రకు అడ్డంకి కలిగిందంటే… పాక్, చైనా కలిసే భారత్ లో దాడులకు ప్లాన్ చేస్తున్నాయని అనుమానించవచ్చు! చైనా అమర్ నాథ్ యాత్రకే కాదు తన ఆధీనంలో వున్న మానస సరోవర్ క్షేత్రానికి కూడా ఈ సారి భారతీయుల్ని రాకుండా అడ్డుకుంటోంది.   మొత్తంగా అమర్ నాథ్ యాత్రీకులపై దాడి లోకల్ కాశ్మీరీ హింసోన్మాదులు మొదలు … సరిహద్దుకు ఆవల వున్న పాకిస్తాన్, చైనా కుట్రదారుల పనిగా మనం ఖచ్చితంగా భావించవచ్చు. అంతే కాదు, చైనీస్ దౌత్యవేత్త రహస్యంగా రాహుల్ గాంధీని కలవటం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. మోదీతో ప్రతిపక్షాలకి, ముఖ్యంగా కాంగ్రెస్ కి వున్న విభేదాల్ని చైనా తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది. కనీసం మోదీనీ, బీజేపిని ఆందోళన పరిచే విధంగానైనా సంకేతాలు ఇవ్వాలని చూస్తోంది. తెలిసో, తెలియకో రాహుల్ గాంధీ చైనా ట్రాప్ లో పడ్డాడు. అనవసర మచ్చ తన మీద వేసుకున్నాడు. కాని, ఇప్పుడిక బాల్ తిరిగి తిరిగి ప్రదాని కోర్టులోకే వచ్చింది…   ప్రపంచ ముస్లిమ్ లకు పరమ శత్రువైన ఇజ్రాయిల్ లో మోదీ పర్యటించారు, కాశ్మీర్ లో ఉగ్రవాదుల్ని మన సైన్యం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది, జీ20 సదస్సు సందర్భంగానూ చైనా ప్రెసిడెంట్ తో మోదీ సమవేశమవ్వలేదు, సిక్కింలో ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఇండియా సంకేతాలిచ్చింది… వీటన్నిటి నేపథ్యంలో సహజంగానే శత్రువులందరికీ యసిడిటీ తీవ్రస్థాయిలో వుంటుంది. వాళ్లు తిన్నది అరగక హింసకి పాల్పడటం సహజం. అందుకే, ముందు ముందు అమర్ నాథ్ యాత్రీకుల్లాంటి అమాయకుల్ని మనం కోల్పోకుండా వుండేలా వ్యూహాలు వుండాలి. అదే సమయంలో పాక్, చైనా ఒత్తిళ్లకు లొంగకుండా ముందుకు సాగాలి. ఈ కత్తి మీద సాము… మోదీ, అజిత్ ధోవల్ జోడీ సమర్థంగానే చేస్తుందని ఆశిద్దాం…

కాంగ్రెస్ మెడకు… నిజమో కాదో తెలియని రాహుల్ చైనీస్ మీటింగ్

రాహుల్ మరో వివాదంలో ఇరుక్కున్నారు! ఈసారి వయా చైనా మీదుగా రచ్చలో కాలేశారు! ఇంకేముంది, సోషల్ మీడియాలోని మోదీ భక్తులు చాకిరేవు పెడుతున్నారు. వారి ఏకపక్ష ఆరోపణల్ని సీరియస్ గా తీసుకోకున్నా… ఓ జాతీయ మీడియా ఛానల్ కూడా రాహుల్ ను తప్పుపడుతూ కథనం ప్రసారం చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది!   సిక్కిం ప్రాంతంలో ఇండియా, చైనా సైనికులు ఫేస్ టూ ఫేస్ పోరాటానికి దిగుతున్న సంగతి మనకు తెలిసిందే! ఆ కారణం చేతనే మోదీ, చైనీస్ ప్రెసిడెంట్ జిన్ పింగ్ జీ20 సమావేశాల సందర్భంగా కలిసే అవకాశమున్న కలవలేదు. ఊరికే కరచాలనంతోనే సరిపెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇండియన్ సోల్జర్స్ చైనాను అడ్డుకవటంతో జిన్ పింగ్ కూడా అంతర్జాతీయ వేదికపై టోను మార్చాడు. చుట్టు పక్కల దేశాలతో చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని నీతులు వల్లించాడు. కాని, నిజంగా మాత్రం చైనా నీతి అలా వుండటం లేదు…   సిక్కింలో భూటాన్, భారత భూభాగాల్లోకి చైనా చొచ్చుకొచ్చింది. కాని, తప్పంతా ఇండియాదే అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ విదేశాల నుంచి తన పర్సనల్ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చి రాగానే మోదీపై ఫైరైపోయారు. చైనా విషయంలో ఆయనేం చేయటం లేదంటూ విమర్శలు గుప్పించారు. కాని, అంతలోనే చైనా ఓ బాంబులాంటి ప్రెస్ నోట్ తన వెబ్ సైట్లో పోస్టు చేసింది. తరువాత ఠపీమని తొలగించేసింది! దాని సారాంశం ప్రకారం… రాహుల్ గాంధీ చైనా దూతను దిల్లీలో కలుసుకున్నారు. వారిద్దరి మధ్యా చర్చలు జరిగాయి!   సాక్షాత్తూ చైనీస్ ఎంబసీ తమ వెబ్ సైట్లో పోస్టు చేసిన రాహుల్ గాంధీ మీటింగ్ నిజం కాదని చెబుతున్నారు కాంగ్రెస్ వారు! అంతా మోదీ భక్తులు, బీజేపి అనుకూల మీడియా దుష్ప్రచారం అనేస్తున్నారు. కాని, చైనీస్ ఎంబసీ వెబ్ సైట్లో పెట్టి మళ్లీ తొలగించిన ప్రెస్ నోట్ గురించి మాత్రం మాట్లాడటం లేదు! అయితే, సోషల్ మీడియాలో ఇప్పటికే చైనా పెట్టి, తీసేసిన ప్రెస్ నోట్ ఇమేజ్ రూపంలో సర్క్యులేట్ అవుతోంది!   కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చైనా దూతతో మాట్లాడారా? లేదా? మాట్లాడితే ఏం మాట్లాడి వుంటారు? అసలు రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆయన ఏ హోదాలో మీటింగ్ లో పాల్గొన్నారు? ఇలా బోలెడు ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. అన్నిట్ని ఖండించి తమ నాయకుడి తప్పేం లేదంటున్నారు కాంగ్రెస్ వారు. మరో వైపు బీజేపి వారు, బీజేపి అభిమానులు … అమెరికా ప్రతినిధితో కూడా గతంలో నోరు జారి మాట్లాడిన రాహుల్ ఈసారీ అలాగే చేసుంటాడంటున్నారు! వికిలీక్స్ ప్రకారం… రాహుల్ ఇంతకు ముందు ఆరెస్సెస్ గురించి , హిందూ ఉగ్రవాదం గురించి అమెరికా అధికారితో ఇష్టానుసారం మాట్లాడాడు!   చైనా విషయంలో మోదీని టార్గెట్ చేద్దామనుకున్న కాంగ్రెస్ కు తమ రాహుల్ మీటింగ్ ఆత్మరక్షణలో పడేలా చేసింది! బీజేపి వారికి చాలా కాలంపాటూ విమర్శించటానికి చక్కటి కారణం దొరికింది!

రామోజీరావును ఇరికించిన రోజా..?

తనని ఎలాంటి ప్రశ్న వేసినా దబాయించి సమాధానం చెప్పటం వైసీపీ నేత రోజాకి వచ్చినంతగా మరెవరికీ రాదు. తాజాగా ఆమె తాను చేస్తున్న టీవీ షోల గురించి స్పందించింది. తన షో  ఏమీ రియాల్టీ షో కాదనీ… కామెడీ షో అని చెప్పింది! అక్కడితో ఆగకుండా అందులో జడ్జ్ గా తాను పాల్గొనటం అంత తప్పైతే వెళ్లి రామోజీ రావుని అడగమని తనదైన స్టైల్లో ఎదురుదాడి చేసింది. ఆమె ఈటీవీలో వచ్చే జబర్దస్త్ గురించి ఇలాంటి ఘాటుగా స్పందించింది!   రోజా లాజిక్ ఒకవైపు నుంచీ కరెక్టే! జబర్దస్త్ నిర్మించేది ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, అలాగే, దాన్ని ప్రసారం చేసేది రామోజీ రావు. వాళ్లద్దరిదీ ప్రధానమైన బాధ్యతే. ఎవరైనా కామెడీ పేరుతో బూతులు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తే ఖచ్చితంగా వారిద్దర్నే అడగాలి! కాని, జడ్జ్ గా పార్టిసిపెంట్స్ స్కిట్ లని హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజా కేవలం ఒక నటి మాత్రమే కాదు కదా? ఆమె ఇప్పుడు అసెంబ్లీలో వున్న ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే! మరి ప్రజాప్రతినిధిగా ఆమెకంటూ ఎలాంటి నైతిక బాధ్యతలుండవా? దీని గురించి వైసీపీ నాయకురాలు రోజా మాట్లాడలేదు!   ఇక రోజానే చేసే మరో కార్యక్రమం కూడా మీడియాలో పెద్ద రచ్చగా మారింది. రోజాలాగే సుమలత, పోసానీ వంటి వారు కూడా ఈ ఫ్యామిలీ గొడవల కార్యక్రమాలు ఎడాపెడా చేసేస్తున్నారు. అసలు అలాంటి షోల గురించి జనం, మేధావులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎంత వరకూ నిజమో తెలియని కుటుంబ గొడవల్ని పది మందిలో ఈ సెలబ్రిటీ హోస్టులు తీర్చటం ఏంటి అనేది పెద్ద ప్రశ్న! అంతే కాక ఆ షోల్లో జరిగే రచ్చ కూడా విచిత్రంగా, విపరీతంగా వుంటూ కేవలం టీఆర్పీల కోసమే నడుస్తున్నట్టుగా వుంటోందంటున్నారు మానసిక నిపుణులు! యండమూరి వీరేంద్రనాథ్ అయితే ఆ షోలు నిర్వహించే వారు శవాల మీద చిల్లర ఏరుకునే టైపు అంటూ ఘాటుగా స్పందించారు!   ఇంత రచ్చకి కారణమవుతోన్న సదరు షోని కూడా రోజా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అసలామె ఒక ఎమ్మెల్యేగా వుంటూ ఇలాంటిది చేయటం ఏమాత్రం బాగాలేదంటున్నారు కొందరు. మరి రోజా ఏమంటారు? ప్రస్తుతానికైతే నో ఆన్సర్! జబర్దస్త్ గురించి రామోజీరావుని అడగమన్నట్టు ఎవర్నైనా అడగండి పొమ్మని అంటారేమో! ఆ సంగతి ఎలా వున్నా పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం … రోజా మరింత హుందాగా సాగే టీవీ కార్యక్రమాలు, సినిమాలు చేస్తే బెటర్! అంతే తప్ప జనంలో ఎంతో కొంత వ్యతిరేక భావం తెచ్చే వాటిలో భాగమైతే ఆమె ఇమేజ్ డ్యామేజై పొలిటికల్ కెరీర్ రిస్క్ లో పడవచ్చు!

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ్ని ఏపీలో ఫాలో అవుతున్న కార్లు ఎవరివి?

  కురుక్షేత్రం అంటూ ఏపీలో కాలుమోపిన మంద కృష్ణ మాదిగ సభ సంగతెలా వున్నా కలకలం మాత్రం రేపారు! ఒక రోజంతా ఏపీ పోలీసుల్ని ఉరుకులు, పరుగులు పెట్టించారు. చంద్రబాబు ఇంకా స్వయంగా స్పందించకపోయినా టీడీపీ నేతల చేత కూడా మాట్లాడించగలిగారు! అయితే, ఉన్నట్టుండీ ఆంధ్రాలో దిగిన మంద కృష్ణ ఏం ఆశిస్తున్నారు? పైకి చెబుతన్నట్టుగా కేవలం ఎస్పీ వర్గీకరణే ఆయన ఆశయమా? లేక మరేదైనానా?   మంద కృష్ణ సమైక్యాంధ్ర రాష్ట్రం వున్నప్పుడు చంద్రబాబుతోనూ, చంద్రశేఖర రావుతోనూ… ఇద్దరితోనూ కలిసి పని చేశారు! కాని, ఇప్పుడు ఆయన వారిద్దరికీ రివర్స్ అవుతున్నారు. కారణం వర్గీకరణ విషయంలో సీఎంలిద్దరూ మాటతప్పారన్నదే ఆయన ఆరోపణ! కాకపోతే, తెలుగు ప్రాంతం రెండుగా విడిపోయాక ఏపీలో మాలలు అధికంగా, తెలంగాణలో మాదిగలు అధికంగా వున్నారు. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ వచ్చే భారీ లాభాలంటూ ఏం లేవు. మాలలు, మాదిగల మధ్య అవకాశాల విషయంలో పోటీ ముందున్నంత ఇప్పుడు లేదు. రాష్ట్ర విభజనే అందుక్కారణం. ఆ సంగతెలా వున్నా వర్గీకరణ ఉద్యమం మాత్రం ఎమ్మార్పీఎస్ సీరియస్ గానే ముందుకు తీసుకెళ్లె ఉద్దేశంలో వుంది. దాని వల్ల మాదిగలకి జరిగే లాభంతో పాటూ రాజకీయ రాబడి కూడా వుండటమే కారణమంటున్నారు విశ్లేషకులు!   తాజాగా మంద కృష్ణ తనపై హత్యా ప్రయత్నం జరగొచ్చని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో తనని కొన్ని కార్లు ఎప్పుడూ వెంబడిస్తున్నాయని అన్నారు. మొత్తం పది రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ పని చేస్తున్నా ఎక్కడా ఇలా జరగలేదని చెప్పారు. తనని ఎవరు ఫాలో చేస్తున్నారో చంద్రబాబుకు, కేసీఆర్ కు ఇద్దరికీ తెలుసునని ఆయన అనటం కొసమెరుపు! అసలు ఫాలో అవుతున్న వారి సంగతి పక్కన పెడితే మంద కృష్ణ చంద్రబాబుని, కేసీఆర్ ని కలిపి టార్గెట్ చేయటంలోని ఆంతర్యం ఏంటి? మూడేళ్లు పూర్తైన సందర్భంలో ఎన్నికలు వడి వడిగా వచ్చేస్తున్నాయి. ఆయన రాబోయే ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నారని కొందరంటున్నారు!   రెండు రాష్ట్రాల్లో ఎస్పీ ఓట్లను టీఆర్ఎస్ గాని, టీడీపీగాని తేలిగ్గా తీసుకోవు. అందుకే, రంగంలోకి దిగిన మంద కృష్ణ అధికార పార్టీలకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. తద్వారా ప్రతిపక్షాలకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా నెక్ట్స్ ఎలక్షన్స్ టైంలో తానూ రేసులో వుండాలని ఆయన వ్యూహం పన్నుతున్నట్టు కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పాల్గొని పోటీ చేసిన మంద కృష్ణ రాజకీయ ఉద్దేశంతో వ్యవహరించటం తప్పేం కాదు. కాని, మరోసారి వర్గీకరణ రణం మొదలుపెట్టిన ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఎంత ప్రభావం చూపగలిగే స్థాయికి చేరుతారో వేచి చూడాలి!

ప్లీనరీ సరే… ప్లానింగ్ ఏది?

  వైసీపీ ప్లీనరీ ఘనంగా జరిగింది! జగన్ తన ముప్పై ఏళ్ల సీఎం కలని మరోసారి జనం ముందుంచారు! ఇక రాజన్న రాజ్యం నినాదమైతే సభలో మార్మోగింది. కాని, నిజంగా ఈ హడావిడితో వైసీపీ సాధించింది ఏమిటి? అధికార టీడీపీ దశాబ్దాలుగా మహానాడు నిర్వహిస్తోంది. అదే తరహాలో జగన్ కూడా ఆర్బాటంగా పార్టీ వేడుక నిర్వహించారు. అది తప్పేం కాదు. కాని, ప్లీనరీ తరువాత జనంలోకి వెళ్లిన సంకేతాలే ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి!   ఆ మధ్య ప్రత్యేక హోదా గురించి వైజాగ్ వెళ్లిన జగన్ ఎయిర్ పోర్ట్ లో నెక్స్ట్ సీఎం తానే అంటూ హల్ చల్ చేశారు! అప్పట్నుంచీ రెండు, మూడు సార్లు నేనే మంత్రి, నేను రాజు అన్నట్టు డైలాగ్స్ వదలనే వదిలారు. ఇక ప్లీనరీలో ఏకంగా ముప్పై ఏళ్లు నేనేనంటూ లాలూని గుర్తు చేశారు! లాలూ ప్రసాద్ యాదవ్ కూడా … ‘’ సమోసాలో ఆలూ వున్నంత వరకూ బీహార్లో లాలూ వుంటా’’డని ఛమత్కారంగా చెప్పేవాడు! ఇప్పుడు లాలూ పరిస్థితి ఏంటన్నది పక్కన పెడితే… జగన్ ఇంకా మొదటిసారి కూడా సీఎం అవ్వకుండానే దశబ్దాల తరబడి అమరావతి నాదే అన్నట్టు మాట్లాడటం మెచ్యురిటీ అనిపించుకోదంటున్నారు కొందరు క్రిటిక్స్!   ప్లీనరీలో జగన్ మాటలు మాత్రమే కాదు. కొందరు టీడీపీ నేతలు విమర్శించినట్టుగా… అనేక ఆర్దిక కేసుల్లో ఏ1 నుంచీ ఏ13దాకా తమ పేర్లు నమోదైన వారంతా వేదిక మీదకి చేరారు! ఇదేదో ఆరోపణ కాదు. నిజంగానే టీడీపీ నేతలు చెప్పింది నిజం. ఒకవైపు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక్క సారి కూడా కోర్టు బోను ఎక్కని చంద్రబాబు, మరో వైపు జగన్ తో సహా సీబీఐ, ఈడీల దృష్టిలో వున్న పార్టీలోని అనేక మంది నాయకుల వైసీపీ ఒకవైపు! కాబట్టి జనం ఎటు వైపు వుండాలో తేలిగ్గానే నిర్ణయించుకుంటారు!   ఇక 2014లో మోదీ, తరువాత బీహార్లో నితీష్ ప్రశాంత్ కి కిషోర్ ని తమ వైపున నిలుపుకున్నారు. అది వారికి కలిసొచ్చి ఘనవిజయాలు సాధించారు. అందుకే, ఇప్పుడు జగన్ కూడా పీకే ను తీసుకొచ్చారు. ఇంత వరకూ బాగానే వున్నా అదే ప్రశాంత్ కిషోర్ యూపీలో కాంగ్రెస్ కు ఏమాత్రం మేలు చేయలేకపోయాడని కూడా యువనేత గుర్తించాలి! ప్రశాంత్ కిషోర్ వున్నా లేకున్నా ముందు అవినీతి విషయంలో జనంలో వున్న అనుమానాల్ని జగన్ దూరం చేయాలి. ఆయనొస్తే గతంలోలాగా అవినీతి అరాచకం సృష్టించదని భరోసా కల్పించాలి. అటువంటిదేం ప్లీనరీలో జరిగినట్టు కనిపించలేదు! పైగా ఏ ఆధారం లేకుండా మూడు లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారనీ, ఆయన అవినీతి చక్రవర్తి అని రోటీన్ పొలిటికల్ స్టేట్మెంట్లే ఇచ్చారు! ఇలాంటి స్ట్రాటజీతో చంద్రబాబు లాంటి చాణుక్యుడ్ని గద్దె దించగలననుకోవటం…. జగన్ మళ్లీ మళ్లీ ఆలోచించుకోవాల్సిన అంశం! ఎందుకంటే, అదృష్టవశాత్తూ రాబోయే ఎన్నికలకి ఇంకా తగినంత టైం వుంద కాబట్టి!

స్కూల్ బెల్ వినాలని ఆరాటపడింది! నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది!

  ఆమె వయస్సు ఇప్పుడు 19. లండన్ లో హైస్కూల్ పూర్తి చేసింది. అదే విషయాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేసింది. వెంటనే ఆమె చేసిన వరుస ట్వీట్లు నిమిషాల వ్యవధిలో వేల మంది లైక్ చేశారు. రీట్వీట్ చేశారు. అంతలా ఆమెలోని ప్రత్యేకత ఏంటి అంటారా? ఆమె పేరు చెబితే మీకే అంతా అర్థమైపోతుంది! తను … మలాలా యూసుఫ్ జాహి!   మలాలా అన్న పేరు వినగానే చాలా మందికి పాకిస్తాన్, తాలిబాన్ గుర్తుకువస్తాయి. అక్టోబర్ 9, 2012న ఆమెపై హత్యా యత్నం జరిగింది. మలాలా తలలోకి కాల్చి పారిపోయిన తాలిబాన్ ఉగ్రవాది ఆమె చచ్చిపోయింది అనుకున్నాడు. కాని, అక్కడ్నుంచే మలాలా కొత్త జీవితం ప్రారంభమైంది. అంతకు ముందు నుంచే పాకిస్తాన్ లో బాలికల విద్య కోసం గళం వినిపిస్తోన్న మలాలా హత్యా ప్రయత్నంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. లండన్ తీసుకువెళ్లి ఆమెని ప్రాణాపాయం నుంచి కాపాడారు. తరువాత అక్కడే చదువు కొనసాగించింది మలాలా.   2012 నుంచీ బ్రిటన్ లోనే వుంటున్న పాకిస్తానీ అయిన మలాలా హైస్కూల్ పూర్తి చేసి త్వరలో కాలేజ్ కి వెళ్లనుంది. ప్రవేశం లభిస్తే ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య నేర్వాలని ఆశపడుతున్న ఆమె త్వరలో మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో పర్యటించనుంది. అక్కడ వున్న కోట్లాది మంది అమ్మాయిలకి చదువు నేర్పించమని తల్లిదండ్రుల్ని అభ్యర్థించనుంది! 2014లో నోబెల్ ప్రైజ్ కూడా పొందిన మలాలా అత్యంత పిన్న వయస్సులో ఆ బహుమతి సాధించిన రికార్డ్ స్వంతం చేసుకుంది. ఆ కారణంగానే మలాలాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. వారి అండతోనే మలాలా ఫండ్ పేరిట సంస్థ ఏర్పాటు చేసి ఆడపిల్లల విద్య కోసం ఉద్యమిస్తోంది!   తాలిబన్ ల ఒక్క బుల్లెట్ కారణంగా… పాకిస్తాన్ లోని మారుమూల స్వాత్ లోయ నుంచి లండన్ లోని బ్రిమింగ్ హామ్ వరకూ చాలా దూరం వచ్చేసింది మలాలా! అందుకే ఆమె యాత్ర ఆశ్చర్యకరం! పోరాటం ప్రేరణాత్మకం!

గ్రంథాల గందరగోళం @ ఏపీ రాజకీయం!

  రాజకీయాలు అనేక రకాలు! అసెంబ్లీ లోపల జరిగేవి, బయట జరిగేవి, ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో జరిగేవి, ఎలక్షన్ బూతుల్లో జరిగేవి, ఇప్పుడు కొత్తగా టీవీ స్టూడియోల్లో, సోషల్ మీడియా జరిగే రాజకీయకాలు కూడా తోడయ్యాయి! కాకపోతే, అసెంబ్లీలో అల్లరి చేసినా, రోడ్డుపై రాస్తారోకో చేసినా… అన్నిటి పరమార్థం ఒక్కటే! అధికార పక్షాన్ని కార్నర్ చేయటం. అలాగే, అధికారంలో వున్న వారు ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయటం! అయితే, ఇప్పుడు ఏపీలో కొత్తగా పుస్తకాల రాజకీయం మొదలైంది!   అమరావతి ప్రాంతంలో అట్టహాసంగా జరుగుతోంది వైసీపీ ప్లీనరీ! మరిక ప్రతిపక్ష పార్టీ సభ అంటే ఆశించేది ఏముంటుంది? టీడీపీ పై నిప్పులు చెరిగారు జగన్. అలాగే, తండ్రి వైఎస్ఆర్ ను తీవ్రంగా తలుచుకున్నారు. ఇదంతా కొత్తదేం కాదు. కాని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఓ బుక్ రిలీజ్ చేయటమే వైసీపీ ప్లీనరీలో కొంచెం రొటీన్ కి భిన్నంగా కనిపించింది!   టీడీపీ అధినేత అవినీతి చక్రవర్తి అంటూ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకం విడుదల చేసింది వైసీపీ! ఇందులో ఏముంటుందో అందరికీ తెలిసిందే! రోజా లాంటి జగన్ శిబిరం లీడర్లు రోజువారీగా చేసే ప్రెస్ మీట్ ఆరోపణలు ఓ బుక్ లాగా మన ముందుకు తీసుకొచ్చారు. అందులో చంద్రబాబు అవినీతిపరుడని నిరూపించేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. అంతే కాదు, ఈ గ్రంథాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్లాలని జగన్ పిలుపు కూడా ఇచ్చారు!   తమ నాయకుడి మీద అవినీతి బురదజల్లే ప్రయత్నం చేసిన వైసీపీని టీడీపీ వదిలిపెడుతుందా? వెంటనే ఇటు వైపు నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. టీడీపీ సీనియర్ నేత యనమల… నేరాల చక్రవర్తి అంటూ తామూ ఓ పుస్తకం ఓటర్లకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు! అందులో జగన్ చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ వుంటాయని తెలిపారు! వైసీపికి ఎంపరర్ ఆఫ్ కరప్షన్ కి ధీటుగా ఈ ఎంపరర్ ఆఫ్ క్రైమ్స్ వుంటుందట!   అధికార, ప్రతిపక్షాలు ఇలా మాస్ మసాలా గ్రంథాలు విడుదల చేయటం కొత్తేం కాదు. వైఎస్ఆర్, చంద్రబాబు పరస్పర రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఇంతకు ముందు కూడా బుక్కులు అచ్చేసి మార్కెట్లోకి వదిలారు! వాటి వల్ల వచ్చిన స్పష్టమైన ప్రయోజనం మాత్రం ఏం తేలలేదు! కాకపోతే, ఇప్పుడు మరోసారి తమ ప్లీనరీ సందర్భంగా జగన్ తమ కార్యకర్తలకి ఉత్సాహం కలిగేలా చంద్రబాబు మీద బుక్ విడుదల చేశారు! దాన్ని జనం సీరియస్ గా తీసుకుంటారంటే మాత్రం డౌటే!

రాళ్లు రువ్వే గుంపుపై… ఇండియన్ ఆర్మీ కంపు బాంబు!

  ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ జోక్ చక్కర్లు కొడుతోంది! ఒకాయన పులావ్ ఆర్డర్ చేస్తే అందులో విపరీతంగా రాళ్లు వచ్చాయట. ఏంటని ప్రశ్నించిన ఆతడికి… హోటల్ సర్వర్ ఇలా చెప్పాడట… ‘’ నువ్వు ఆర్డర్ చేసింది కాశ్మీరీ పులావ్ మరి! రాళ్లు రాక ఏం వస్తాయ్?’’   కాశ్మీర్లో అల్లరి మూకల రాళ్ల వర్షం ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయింది. నెలల తరబడి పాకిస్తాన్ నుంచి వస్తోన్న డబ్బుతో కాశ్మీర్లో ఎందరో యువకులు రాళ్లు పట్టుకుని భీభత్సం సృష్టిస్తున్నారు. మరప్పుడు దేశ రక్షణలో వున్న సైన్యం చేయగలిగింది ఏముంటుంది? కాల్పులు జరిపితే ప్రాణాలే పోతాయి కాబట్టి పెల్లెట్ గన్స్ వాడుతున్నారు జవాన్లు! వాటి వల్ల కూడా రాళ్లు రువ్వే వారికి, చాలా సార్లు అమాయక ప్రజలకి తీవ్రమైన గాయాలవుతున్నాయి. కొందరికి శాశ్వతంగా చూపు కూడా పోయింది. ఇదంతా కోర్టు దాకా వెళ్లింది. ఆ మధ్య ఓ ఆర్మీ అధికారి రాళ్లు రువ్వే అల్లరి మూకల్ని నియంత్రించటానికి మరో రాళ్లు రువ్వే కాశ్మీరీనే జీపుకి కట్టుకుని తీసుకెళ్లటం కూడా పెద్ద దుమారం రేపింది!   కాశ్మీర్లో రాళ్ల వర్షంతో నానా ఇబ్బందులు పడుతోన్న ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాల గురించి తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. అయితే, మరి కొద్ది రోజుల్లో రాళ్లు రువ్వే ఆకతాయిల ఆటకట్టించే ఛాన్స్ వచ్చేసింది. అదీ ఉత్తర్ ప్రదేశ్ లోని కనౌజ్ ప్రాంతం నుంచీ! అవును… కాశ్మీరీ రాళ్ల రువ్వే గుంపుల మీద ప్రయోగించటానికి యూపీలో కంపు రెడీ అయింది!   కనౌజ్ ప్రాంతం సుగంధ భరితమైన వాసనలు పుట్టించే అత్తర్లు, సెంట్లకి ఫేమస్. అక్కడ అవ్వి ఉత్పత్తి చేసే పరిశ్రమ విస్తృతంగా వ్యాపించి వుంది. అక్కడే వుంది… ఫ్రాగరెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్. ఎఫ్ఎఫ్ డీసీగా పిలవబడే ఈ సెంటర్లో సైంటిస్టులు కొత్త కొత్త పర్ఫ్యూమ్ లని, స్ప్రేలని తయారు చేస్తుంటారు. అయితే, ఈసారి రొటీన్ కి భిన్నంగా వారు ఇంపైనది కాకుండా కంపైన ఐటెమ్ తయారు చేశారు. క్యాప్సుల్ రూపంలో వారు తయారు చేసిన స్టింక్ బాంబ్ టియర్ గన్ లో పెట్టి పేల్చేవచ్చు! ఒక్క సారి ఈ కంపు బాంబు గన్ లోంచి దూసుకు వెళ్లిదంటే అది పడ్డ చోట దట్టంగా పొగలు కమ్ముకుంటాయి. ఆ తరువాత అమాంతం తట్టుకోలేని దుర్వాసన వచ్చేస్తుంది! రాళ్లు రువ్వే బ్యాచ్ ఇక చేసేది లేక అక్కడ్నుంచి ముక్కు మూసుకుని పారిపోవాల్సిందే! అయితే, ఈ కంపు బాంబు లోంచి పుట్టుకొచ్చే దుర్వాసన ఎలాంటి ఆరోగ్య సమస్యలు తీసుకురాదని చెబతున్నారు సైంటిస్టులు!   ప్రస్తుతం వివిధ రకాల పరీక్షల దశలో వున్న కనౌజ్ కంపు బాంబు… మరి కొద్ది రోజుల్లోనే కేంద్ర రక్షణ శాఖ ద్వారా  సైన్యానికి, అక్కడ్నుంచీ రాళ్లు రువ్వే కాశ్మీరీ గుంపుల మీదకి వెళ్లనుంది! మరి స్టింక్ కాశ్మీరీ అల్లరి మూకల పని పడుతుందా? అదే జరగాలని ఆశిద్దాం…

నాగార్జున వైసీపీలోకి వస్తే..జగన్‌కి లాభమా..? నాగ్‌కి లాభమా..?

రోజూ మీడియాలో..అంతకు మించి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూ ఉంటాయి..కొన్నింటి పై చూపు కూడా పడదు..కానీ కొన్ని వార్తలు మాత్రం రెప్పకూడా వేయకుండా చదువుతాం..ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమను, తెలుగు రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు, కింగ్ నాగార్జున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన ఒక వార్త ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్‌గా మారింది. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన నాగార్జున..యువసామ్రాట్‌గా, మన్మథుడిగా టాలీవుడ్‌ను మోస్తున్న నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ సక్సెస్ కొట్టిన నాగార్జున..రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.   అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లాలి అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది నాగార్జునకి.. తొలి నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా పేరొందినప్పటికీ ఇటీవలి కాలంలో బాలకృష్ణతో మనస్పర్థల కారణంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేడు..కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది.. టీఆర్ఎస్‌లోకి వెళ్లలేడు..ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్. తన వ్యాపార సన్నిహితులంతా వైసీపీ అధినేత జగన్‌కు కావాల్సిన వారే కావడంతో..వారి ద్వారా ఆ పార్టీలో అడుగుపెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు కింగ్. దీనికి తోడు నాగ్‌కు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు నాగ్..కేంద్ర, రాష్ట్ర పథకాలను ఫ్రీగా ప్రచారం చేశారు కూడా. ఇప్పుడు వైఎస్ లేకపోయినా ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు కింగ్..మొన్నామధ్య అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు స్వయంగా పరామర్శించి వచ్చారు కూడా..   మరి అలాంటి నాగార్జున కోరి పార్టీలోకి వస్తే జగన్‌కు అంతకన్నా కావాల్సింది ఏముంది. టీడీపీతో పోలిస్తే వైసీపీకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక్క రోజా తప్పించి అక్కడ ఎవ్వరూ లేరు. ఈ సమయంలో నాగ్ వైసీపీ జెండా కప్పుకుంటే..టోటల్‌గా అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ జగన్‌కే..అదొక్కటేనా, నాగ్‌కు సన్నిహితులైన ఇండస్ట్రీ పెద్దలంతా ఫ్యాన్‌కు మద్ధతు తెలుపుతారు. కాబట్టి జగన్‌కు అన్ని రకాలుగా లాభమే..ఇక చేసే ప్రతీ పని వెనుక తన లాభాన్ని చూసుకుంటారు అన్న పేరున్న నాగార్జున ఇంకెంతలా ఆలోచించి ఉంటారు..నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్న నాగ్‌‌ అందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి విజయావకాశాలు చాలా తక్కువ అని ఊహించి వైసీపీ మీద కన్నేశాడు..జగన్‌ను ఎలాగైనా ఒప్పించి విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా పోటి చేయాలని నాగార్జున స్కెచ్ గీస్తున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయం మీద నాగార్జున కానీ..లోటస్ పాండ్‌ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు..ఇది గాలి వార్తో, లేక నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా..? చూద్దాం ఏం జరుగుతుందో.

అయ్యో రామయ్య..!

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి టైం బ్యాడ్ గా వున్నట్టుంది! కోర్టుల్లో ఆయన ప్రభుత్వాన్ని కార్నర్ చేద్దామనుకుంటే ఆయనకే చిక్కులొచ్చి పడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఆర్కే సుప్రీమ్ లో వ్యతిరేకత తీర్పు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోదలిచిన భూముల విషయంలో ఆయనకు సుప్రీమ్ లో చుక్కెదురైంది. ఆయన పీటీషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది!   కోర్టుల్లో కచేరీలు అంటే సంగీత కచేరీల్లా వుండవు. పక్కా ముందు చూపుతో కోర్టును ఆశ్రయించాలి. అదీ ఒక రాష్ట్రాన్ని పాలిస్తోన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మరింత జాగ్రత్తగా లాయర్లతో సంప్రదింపులు చేసి కోర్టు మెట్లెక్కాలి. కాని, ఆళ్ల అలాంటివేం చేస్తున్నట్టు లేదు. ఒకవైపు నాలుగు గ్రామాల్లో ప్రభుత్వం అక్రమంగా భూములు స్వాధీనం చేసుకుంటోంది అంటూ హైకోర్టును చేరారు. అక్కడ ఇంకా ఆ కేసు విచారణకు రాక ముందే సుప్రీమ్ కి వెళ్లి అదే విషయంపై పిటీషన్ వేశారు. అందుకే, సుప్రీమ్ కోర్టు జడ్జీలు ముందు హైకోర్టులో తేల్చుకుని తరువాత దిల్లీకి రావాలని సూచించారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే అప్పుడు చూద్దామని పీటీషన్ తిరస్కరించారు!   ఇదే కాదు… ఈ మధ్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సదావర్తి భూముల విషయంలో కూడా హైకోర్టులో వ్యతిరక తీర్పు ఎదుర్కోక తప్పలేదు. కోర్టు భూములకి ధర నిర్ణయిస్తూ అంత మొత్తం చెల్లించిగాని భూములు తీసుకోరాదని తేల్చి చెప్పింది. అలా కాక భుముల్ని వదులుకుంటే ఆళ్ల రామకృష్ణ రెడ్డికి, ఐటీ మంత్రి లోకేష్ చెప్పినట్టుగా, అది రాజకీయ ఓటమే అవుతుంది! కోర్టు దాకా వెళ్లి భూముల్ని కోల్పోవాల్సిన స్థితిలో వున్నారు వైసీపీ ఎమ్మెల్యే!   ఆర్కే డబ్బులు చెల్లిస్తే ఐటీ దాడులు, చేయకపోతే రాజకీయంగా అవమానం అన్నట్టుగా ఇబ్బందికర పరిస్థితిలో వున్నారు. లోకేష్ ఎలాగో విమర్శలు చేసి దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేశారాయన. కానీ, ఇంతలోనే సుప్రీమ్ లో మరో ఎదురుదెబ్బ ఆయనకి మింగుపడని విషయమే! ఇక త్వరలో అమరావతి భూముల గురించి ఆయన కేసు హైకోర్టులో విచారణకు రానుంది. అందులో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి!

లాలూకి టెన్షన్! నితీష్ అటెన్షన్!

  బీహార్ రాజకీయం భీభత్సంగా తయారైంది. లాలూకి మోదీ  మార్క్ ట్రీట్మెంట్ లభిస్తోంది. అదే సమయంలో నితీష్ చల్లగా పక్కకు తప్పుకునే ప్రయత్నంలో వున్నాడు. ఇక బీహార్ కాంగ్రెస్ పరిస్థితి ఎప్పటిలాగే అయోమయంగా కంటిన్యూ అవుతుంది. వీటన్నిటికి కారణం లాలూ ఇళ్లపై, వివిధ స్థావరాలపై జరుగుతోన్న ఐటీ దాడులే!   మోదీ 2014లో ప్రధాని అయ్యాక అమిత్ షా నేతృత్వంలోని కమలదళానికి తీవ్రమైన ఓటమి ఎదురైంది దిల్లీ, బీహార్ అసెంబ్లీలలోనే! అందుకే, ఒకవైపు యూపీ నుంచి గోవా దాకా చిన్న , పెద్దా రాష్ట్రాలు ఎన్ని తమ ఖాతాలో పడ్డా బీహార్ , దిల్లీల్ని మాత్రం ఓ కంట కనిపెడుతూనే వున్నారు బీజేపి పెద్దలు! ప్రస్తుతం అమిత్ షా సీరియస్ హ్యాండిల్ చేస్తోన్న రెండు, మూడు రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి! దిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే! అసలు ఏ ఒక్క రోజు కూడా మీడియాని ఖాళీగా వుండనీయని ఆప్ అధినేత గత మున్సిపల్ ఎన్నికల తరువాత గప్ చిప్ అయిపోయాడు. ఆయన వ్యూహాలు ఆయనకు వుండొచ్చు. కాని, బీజేపి ఒకవైపు ఎన్నికల విజయాలతో, మరో వైపు పార్టీలోని అంతర్గత విభేదాల్ని రెచ్చగొట్టడంతో … రెండు వైపుల నుంచి కేజ్రీవాల్ పై దాడి చేసింది. ఇప్పుడు చేసేది లేక ఆయన సైలెంట్ అయిపోయాడు! అసలు రాష్ట్రపతి ఎన్నిక లాంటి కీలక ఘట్టంలో కేజ్రీ ఎక్కడా కనిపించటమే లేదు!   అరవింద్ కేజ్రీవాల్ లాగే మోదీ, అమిత్ షా దృష్టి పెట్టిన మరో నాయకుడు లాలూ! నితీష్ ను బీజేపికి దూరం చేసిన ఆయన కాంగ్రెస్ తో కూడా జతకట్టించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాడు. అప్పట్లో లాలూ ములాయంని కూడా తమతో కలుపుకుని బీజేపి యూపీ ఆశల్ని కూడా ఆడియాసలు చేయాలనుకున్నాడు. కాని, అవేవీ కుదరలేదు. బీహార్ లో మహాఘట్ బంధన్ సక్సెస్ అయింది కాని యూపీలో బీజేపిదే హవా నడిచింది. ఇప్పుడిక మోదీ, అమిత్ షా తమ రివెంజ్ కి టైమొచ్చినట్టుగా భావిస్తున్నట్టే కనిపిస్తోంది! ఏక కాలంలో లాలూని పర్సనల్ గా,పొలిటికల్ గా దెబ్బ కొట్టే రాజకీయ క్రీడ నడుస్తోంది!   లాలూ ఆల్రెడీ కోర్టు తీర్పుతో రాజ్యసభ సీటు కోల్పోయిన నేత. అటువంటి అవినీతి ఆరోపణలున్న వ్యక్తిపై ఐటీ దాడులు చేయించటం కేంద్రానికి పెద్ద పనేం కాదు. అందుకే, దిల్లీ ప్రభుత్వం ఐటీని, ఈడీని ప్రయోగించి లాలూని, ఆయన కుటుంబ సభ్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే అదనుగా లాలూ చేతిలో చిక్కి సతమతం అవుతోన్న నితీష్ కూడా పావులు కదుపుతున్నాడు. అత్యవసర సమావేశాలు నిర్వహించి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ మద్దతు తీసుకోవాలా వద్దా అన్నట్టుగా ఆలోచనలు చేస్తున్నాడు. నితీష్ లాలూ మద్దతు వద్దంటే బీజేపి అండగా నిలవటానికి రెడీ వుంది!   నితీష్ ఒకప్పటి తన మిత్ర పక్షం అయిన బీజేపికి దగ్గరై లాలూని వద్దు పొమ్మంటే ఆర్జేడీతో పాటూ కాంగ్రెస్ నష్టమే! బీహార్లో నితీష్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగం. ఒకవేళ నితీష్ బీజేపి మద్దతుతో కొనసాగితే కాంగ్రెస్ బయటకు వచ్చేయటం తప్ప చేయగలిగింది ఏం లేదు! అందుకే, లాలూ పై ఐటీ, ఈదీ దాడుల ప్రబావం త్వరలోనే బీహార్ రాజకీయాలపై తీవ్రంగా వుండనుంది. ఇప్పటికే బీజేపి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు పలికిన నితీష్ కుమార్ పూర్తిగా ఎన్డీఏ గూటికి చేరితే అది ప్రతిపక్షాలకి పెద్ద దెబ్బే అవుతుంది! ఇప్పుడే కాదు… 2019లో కూడా!

చైనాపై రెండుసార్లు మనం గెలిచాం! ఆ యుద్ధాలు మీకు తెలుసా?

  చైనా సైనికుల్ని కళ్లలో కళ్లు పెట్టి తీక్షణంగా చూస్తున్నారు మన జవాన్లు సిక్కింలో! ఇక రేపో, మాపో యుద్ధమే అన్నట్టు మాట్లాడుతోంది చైనీస్ మీడియా! అంతే కాదు, సిక్కింలో వేర్పాటువాదులకి మద్దతు తెలిపి ఆ రాష్ట్రాన్ని భారత్ నుంచి విడదీసేస్తుందట డ్రాగన్! ఇలాంటి ప్రేలాపనలు చాలానే రాస్తున్నాయి అక్కడి పత్రికలు! అంతకు ముందు చైనా అదికారులు 1962 నాటి రోజులు గుర్తు చేసుకోవాలని కూడా మనల్ని బెదిరించే ప్రయత్నం చేశారు. 1962నాటి రోజులు ఇప్పుడు పోయాయని రక్షణ శాఖ మంత్రి జైట్లీ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు!   చైనా 1962ని గుర్తు చేసి మనల్ని భయపెడుతోంది కదా… అసలు నిజంగా చైనా కంటే భారత్ అంత బలహీనమైన దేశమా? యుద్ధం వస్తే రెండు దేశాలకీ నష్టమా? కేవలం ఇండియా మాత్రమే కోలుకోలేని నష్టం చవి చూడాల్సి వస్తుందా? అలాంటిదేం లేదంటున్నారు విశ్లేషకులు. యుద్ధం వస్తే ఏం జరుగుతుందో తెలియదుగాని… అసలు కమ్యూనిస్టు దేశం మన మీదకి దండెత్తి రావటమే సాధ్యమయ్యే పని కాదంటున్నారు కొందరు ఎక్స్ పర్ట్స్ . అందుకు చరిత్రలో సాక్షాలు కూడా చూపిస్తున్నారు!   1962 యుద్ధంలో భారత్ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఎదుర్కొన్న మాట వాస్తవమే! కాని, ఆ తరువాత అయిదేళ్లకు ఇప్పుడు టెన్షన్ గా వున్న సిక్కిం ప్రాంతంలోనే ఇండియా , చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది. దీన్ని మినీ బ్యాటిల్ అంటారు! రెండు చోట్ల భారత్ భూభాగంలో చొరబడాలని ప్రయత్నించిన ఎర్ర సైనికులు మన జవాన్ల నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. నాతూ లా , సెబు లా అనే ప్రాంతాల మధ్య కాల్పులు జరిగాయి. అలాగే, మరో సారి చో లా అనే ప్రాంతం వద్ద కూడా చైనా ముందుకు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ రెండు పోరాటాల్లో మొత్తం 80మంది భారతీయ జవాన్లు ప్రాణ త్యాగం చేశారు. కాని, అదే సమయంలో చైనా సోల్జర్స్ దాదాపు 4వందల మంది హతం అవ్వటంతో చేసేది లేక వెనక్కి తగ్గింది డ్రాగన్!   1986లో మరోసారి చైనా తన నక్క తెలివితేటలు చూపింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు ఉత్తరంగా టిబెట్ బార్డర్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ వెంటనే ప్రతిఘటన మొదలు పెట్టింది. అప్పుడు ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం కూడా లేకపోవటంతో హెలీకాప్టర్లలో అక్కడ ల్యాండైన ఇండియన్ సోల్జర్స్ చైనా మూకపై బుల్లెట్ల వర్షం కురిపించారు. వెంటనే ఫ్లాగ్ మీటింగ్స్ కు దిగొచ్చిన చైనీస్ ఆర్మీ వెనక్కి వెళ్లిపోక తప్పలేదు!   చైనాకు 1962 తరువాత మన దేశంతోనే కాదు మరే దేశంతోనూ చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. 1971లొ వియత్నాంతో యుద్ధం చేస్తే భారీ నష్టం మూటగట్టుకోవాల్సి వచ్చింది. 28వేల మంది వరకూ చైనా సైనికులు వియత్నాం యుద్ధంలో మరణించారు. కాని, చైనాతో 1962 ఓటమి తరువాత ఇండియా బంగ్లాదేశ్ ను విడదీస్తూ పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా మనదే పై చేయి అయింది. ఇలా చైనీస్ ఆర్మీ కంటే హిమాలయా ప్రాంతాల్లో మన ఆర్మీకే ఎక్కువ అనుభవం వుంది. ఇవేకాకుండా సిక్కింలో యుద్ధం చేసే చైనా సైనికులకి అవసరం అయినవి అన్నీ వేల కిలో మీటర్ల దూరం నుంచి రావాలి. కాని, మనకు సిక్కిం బెంగాల్ తో సహా ఈశాన్య రాష్ట్రాలు అన్నిటికి దగ్గరగా వుంటుంది. భూటాన్ కూడా మన ఆర్మీకి సాయం చేయటానికి సిద్దంగా వుంది.   ప్రస్తుతం చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం యుద్ధం వల్ల చైనాకు గెలిచినా, ఓడినా నష్టమే! అందుకే, పైపై బెదిరింపులే తప్ప చైనా నిజంగా యుద్దానికి దిగదని అంటున్నారు!

వైఎస్, చంద్రబాబులకి దక్కించింది..ఇప్పుడు జగన్‌కి దక్కిస్తుందా..?

  మాట్లాడితే ఆఫ్టర్ వన్ ఇయర్‌లో నేనే ముఖ్యమంత్రిని అని ఇప్పటి నుంచే అలా ఫీలవుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ మహా మొండివాడు..అహం చాలా ఎక్కువ..ఎవ్వరు చెప్పినా వినడు..తాను అనుకున్నదే చేస్తాడు..అని సొంతపార్టీ నేతలతోనే అనిపించుకున్నాడు..అలా ఇప్పటి వరకు తనకు తోచింది చేస్తూ వచ్చాడు..అయితే మళ్లీ ఏం భయం పట్టుకుందో..లేక తనకు స్కిల్స్ తక్కువయ్యాయేమో..అనుకున్నట్లున్నాడు..అందుకే రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే పేరు పొందిన ప్రశాంత్ కిశోర్‌ సూచనలను ఫాలో అవుతున్నారు జగన్. దీనిలో భాగంగా అధికారమే లక్ష్యంగా ఒక పవర్‌ఫుల్ అస్త్రాన్ని రంగంలోకి దించుతున్నాడు. అది అలాంటి..ఇలాంటి అస్త్రం కాదు..తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి..ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారాన్ని అందించిన పాశుపతాస్త్రం..అదే పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఓ అంచనాకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..ఎన్నికల్లో గెలవాలంటే సభలు, దీక్షలు మాత్రమే సరిపోవని..ప్రజలను నేరుగా కలుసుకునే మార్గాలు వెతకమని జగన్‌కు సూచించాడట ప్రశాంత్..దీనికి పాదయాత్రే సరైన మార్గమని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది..దీనిలో భాగంగా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించాలని..ఇందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ని రెడీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారట జగన్..మరి ఆయన పాదయాత్ర ఏపీ చరిత్రలో మరో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విశ్వ(నాథన్) చదరంగ ప్రేమికులకి ఇక ఆనందం మిస్?

  ప్రపంచానికి భారతదేశం ఎన్నో ఆవిష్కరణల్ని అందించింది. సున్నా మొదలు యోగా వరకూ  అన్నీ ఇండియాలోనే పుట్టాయి. అలా భారతదేశంలో ఉపిరి పోసుకున్న ఊపిరిబిగబట్టి కూర్చునేలా చేసే ఇంటలిజెంట్ గేమ్… చెస్! చదరంగం మన దేశంలోనే పుట్టిందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక తెలిసిన కొద్దీ మందికీ చెస్ పట్ల నిజమైన అవగాహన వుండకపోవచ్చు. మరిక అంతర్జాతీయంగా పెద్ద పెద్ద టోర్నమెంట్లు గెలిచే భారతీయ చెస్ క్రీడాకారులకి మన దగ్గర లభించే గుర్తింపు గురించి చెప్పేదేముంది? ఇంగ్లాండులో పుట్టిన క్రికెట్ ఆడే కిక్రెట్ ప్లేయర్లకి దొరికిన దాంట్లో వందో వంతు కూడా మన దేశంలో పుట్టిన చదరంగం ఆడే వారికి లభించదు!   మన దేశంలో ఇంతగా చెస్ పట్ల నిర్లక్ష్యం ఎదురవుతున్నా… ఒక్క పేరు మాత్రం ఎంతో పాప్యులర్ అయింది. అసలు ఆయన పేరే… చెస్ ఆటకు మారు పేరు! అదే విశ్వనాథన్ ఆనంద్! విశ్వనాథన్ ఆనంద్ ఎన్ని మ్యాచ్ లు గెలిచాడు, ఎన్ని టోర్నమెంట్లు నెగ్గాడు, ఎన్నిసార్లు, ఎన్నియేళ్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు… ఇలాంటివి తెలియకున్నా… అందరికీ తెలిసింది మాత్రం అతనో గ్రాండ్ మాస్టరని! కాని, ఇంతకాలం భారతదేశానికి చదరంగ రంగంలో మకుటం లేని మహారాజులా వెలిగిపోయిన ఆనంద్ ఇప్పుడిక రిటైర్ అవుతారట!   ఇంకా కన్ ఫర్మ్ గా విశ్వానాథన్ ఆనంద్ చెప్పనప్పటికీ గత కొన్నేళ్లుగా ఆయన వరస అపజయాలు చవిచూస్తున్నారు. 2014లో ఆయన చివరి ఘనవిజయం నమోదు చేశారు. తరువాత నుంచీ దాదాపు అన్ని మ్యాచుల్లో ఘోర వైఫల్యం చవిచూస్తున్నారు. రష్యా, అమెరికా దేశాల గ్రాండ్ మాస్టర్లకి చుక్కలు చూపించిన ఆయన ఇప్పుడిలా డీలా పడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది! అంతే కాదు, విశ్వనాథన్ ఆనంద్ ఈ మధ్య తన ఆటతీరు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మతిలేకుండా ఆడుతున్నానని, అర్థం పర్థం లేకుండా ఆడుతున్నానని అన్నారు. ఇలా ఆడటం కంటే ఆడకోవటం బెటర్ అన్నారు. దీన్ని బట్టే ఆయన చెస్ బోర్డ్ కి ఇక గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నాయి!   ఆరేళ్లప్పటి నుంచీ చదరంగం ఆడుతోన్న ఆనంద్ 1980ల నుంచీ దేశవ్యాప్తంగా చెస్ అభిమానుల దృష్టి ఆకర్షించారు. తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రపంచంలో ఇండియాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆయన రిటైర్ మెంట్ ప్రకటించటం అభిమానులకి బాధ కలిగించే విషయమే. అయితే, భారత్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం విశ్వనాథన్ ఆనంద్ సేవల్ని గుర్తించి సత్కరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆయన ద్వారా ఈ తరం చెస్ ఛాంపియన్స్ కి మార్గదర్శనం చేయించటం కూడా ఎంతో అవసరం!

మరోసారి ‘స్వామి’ వారి ఆగ్రహానికి గురైన రజినీకాంత్!

  రామేశ్వరం పోయినా అదేదో తప్పలేదంటారు! అలా తయారైంది రజినీకాంత్ పరిస్థితి. ఇంకా ఆయన రాజకీయాల్లోకి అధికారికంగా వచ్చిందీ లేదు. ఎన్నికల్లో పోటీ పడిందీ లేదు. కాని, ఆయన పేరున దుమారాలు మాత్రం రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా రజినీకాంత్ కు ఎవ్వరూ ఊహించని విధంగా సుబ్రమణియన్ స్వామీ నుంచీ తలనొప్పులు వస్తున్నాయి. నిజానికి రజినీ రాజీకీయాల్లోకి వస్తే ఇటు ఏఐఏడీఎంకే, అటు డీఎంకే పార్టీలకి నష్టం. సుబ్రమణియన్ స్వామీకిగాని, బీజేపికిగాని ఎలాంటి నష్టం లేదు. కాస్తో, కూస్తో లాభం కూడా! అయినా సుబ్బూ రజినీ మీద అవాకులు చెవాకులు పేలి రాజకీయ రంగం రుచి ఎలా వుంటుందో అప్పుడే తలైవాకి చూపించేస్తున్నాడు!   రజినీకాంత్ ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా షూటింగ్ కూడా ఆపేసి… అమెరికా వెళ్లాడు. అక్కడాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కాని, ఇంతలోనే సుపర్ మ్యాన్ సుబ్రమణియన్ స్వామీ తనదైన స్టైల్లో ట్విట్టర్ లో రెచ్చిపోయాడు.  సూపర్ స్టార్ అమెరికాలోని ఓ క్యాసినోలో పందెం కాస్తోన్న ఫోటో ట్విట్ చేసి… ఇదేనా ట్రీట్మెంట్ అంటూ వెటకారం చేశాడు! అమెరికా వెళ్లి గ్యాంబ్లింగ్ చేస్తోన్న రజినీకాంత్ కి ఆ డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేశాడు!   నిజంగానే… వైద్యం కోసం అమెరికా వెళ్లిన రజినీ గ్యాంబ్లింగ్ గేమ్ లో ఎందుకు పాల్గొన్నట్టు? ఆయన క్యాసినోలో వున్నప్పటి ఫోటో సుబ్రమణియన్ స్వామికి ఎలా చిక్కింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వుండవు. కాకపోతే, ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న అంశం సుబ్రమణియన్ స్వామీకి రజినీకాంత్ ఎందుకు నచ్చటం లేదనేది! మరీ దారుణంగా రజినీ లాంటి సూపర్ స్టార్ ను ఆయన ట్విట్టర్ లో 420 అన్నాడు. ఇది ఇప్పుడు తలైవా అభిమానుల కోపం కట్టలు తెంచుకునే చేస్తోంది! మరో వైపు రజినీకాంత్ మాత్రం ఇంతదాకా సుబ్బూని ఒక్క మాట కూడా అనలేదు!   ఇంతకు ముందు కూడా స్వామీ, రజినీకాంత్ ఆర్దిక మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మానుకోకపోతే తాను అన్నీ బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇది నిజంగా విచారకరం. రజినీ తప్పు చేస్తే కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయోచ్చు కాని… ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రమే కోర్టుకీడుస్తానని అనటం … రౌడీయిజం అనిపించుకుంటుంది!   సుబ్రమణియన్ స్వామీ ఇలా రజినీకాంత్ మీద కామెంట్లు, ట్వీట్లు చేయటం బీజేపి పార్టీకి కూడా నష్టం తెచ్చే విషయమే. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కనీసం ఆయన్ని రజినీ వ్యతిరేక కామెంట్స్ చేయకుండా కూడా కట్టడి చేయకపోతే తలైవా అభిమానుల ముందు కమలదళం కూడా విలన్ అవుతుంది. కాబట్టి సుబ్రమణియన్ స్వామిని నియంత్రించే పని మోదీ, అమిత్ షా ఇప్పటికైనా చేయాలి. లేదంటే… తమ పార్టీలో చేరకుండా రజినీ స్వంత పార్టీ పెట్టడం… కమలదళం పెద్దలకి ఇష్టం లేక… ఇలా స్వామీ చేత బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని వినిపిస్తోన్న మరో టాక్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ లేకపోలేదు!  

ఇజ్రాయిల్‌లో ఇండియన్ పీఎం… టెన్షన్ లో పాకిస్తాన్ మీడియా!

  నరేంద్ర మోదీ విదేశ పర్యటనలకు వెళ్లటం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. ఆయన పీఎం అయిన కొత్తలో  విరివిగా ఫారిన్ టూర్ లకి వెళుతోంటే చాలా దుమారమే రేగింది. కాని, రాను రాను మ్యాటర్ అర్థమవటంతో అంతా సైలెంట్ అయిపోయారు. అదే రేంజ్లో మోదీ భక్తులు కూడా ఆయన ఏ దేశం వెళ్లినా తమ నేతకు లభిస్తోన్న ఘన స్వాగతాల గురించి సోషల్ మీడియాని ముంచెత్తారు. అమెరికాకు మొదటి సారి వెళితేనైతే భూమి, ఆకాశం ఏకం చేశారు! కాని, ఇప్పుడు ఇరువైపులా హడావిడి తగ్గింది. మోదీ విదేశీ పర్యటనల్ని విమర్శించే వారు కాస్త చల్లబడ్డారు. అదే స్థాయిలో మోదీని నెత్తికెత్తుకునే వర్గం కూడా ఆయన తాజా ఇజ్రాయిల్ పర్యటన మీద ఊహించినంత కోలాహలం చేయటం లేదు!   ప్రపంచ ముస్లిమ్ లు దాదాపు నూటికి నూరు శాతం తమ శత్రువుగా భావించే ఇజ్రాయిల్ ను ఇప్పటి వరకూ ఏ ఒక్క భారత ప్రధానీ సందర్శించలేదు. కాని, మోదీ ఆ పని చేశారు. అందుకే, ఇజ్రాయిల్ ప్రధానితో సహా యావత్ క్యాబినేట్ నమోకి ఎదురువచ్చి నమస్కారాలు చేసి స్వాగతం పలికింది! అంతటితో ఊరుకోకుండా ఆయన వెంట అనుక్షణం ప్రధాని, మంత్రులు వుంటూనే వచ్చారు. మోదీ అన్న పేరుని తమ దేశంలోని ఒక పువ్వుకు కూడా పెట్టుకున్నారంటే ఇజ్రాయిలీలు ఈ పర్యటనని ఎంత ముఖ్యంగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! అలాగే, మోదీ కూడా పాకిస్తాన్ నుంచి పని చేసే ఉగ్ర మూకలకి, అర్థం పర్థం లేకుండా అతివాద మైనార్టీ వర్గాలకి తలొగ్గే రాజకీయ నేతలకి బలమైన సంకేతాలు పంపించారు. భారతదేశానికి మేలు చేసే ఎక్కడికైనా తాను వెళతానని నిరూపించారు. అంతే కాదు, పాక్ ఉగ్రవాదుల చేతుల్లో ముంబై దాడుల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన యూదు అబ్బాయిని కూడా ఆయన కలిశారు! పదకొండేళ్ల ఆ బాబు ఐ లవ్ యూ మోదీ అన్నడాంటే… ఇజ్రాయిలీలు భారత ప్రధాని పట్ల ఎలాంటి భావాలతో వున్నారో అర్థం చేసుకోవచ్చు!   మోదీ ఇజ్రాయిల్ పర్యటించినంత మాత్రాన ఆ దేశం పాలస్తీనా మీద చేసే దాడుల్ని మనం సమర్థించినట్టు కాదు. కేవలం మనం ముస్లిమ్ సమాజానికి వ్యతిరేకం కాదని నిరూపించుకునేందుకు ఇంత కాలం ఎంతో బలమైన దేశమైన ఇజ్రాయిల్ ను దూరం పెడుతూ వచ్చాం. కాని, మోదీ ఆ దేశంలో కాలుమోపటంతో మనకి రక్షణ రంగంలో, వారికి వ్యాపార రంగంలో అనేక లాభాలు కలగనున్నాయి. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ కు పెద్ద బెంగాగ మారింది! మోదీ ఇజ్రాయిల్ యాత్ర గురించి మన పత్రికల కంటే అక్కడి పత్రికలే ఎక్కువ సంపాదకీయాలు రాసేస్తున్నాయి. ఆ ఎడిటోరియల్స్ అన్నిటి సారాంశం ఇండియా, ఇజ్రాయిల్ నూతన సంబంధాలు ముస్లిమ్ లను మరింత అణిచివేయటానికేనని! అటు నెతన్యాహు, ఇటు మోదీ ఇద్దరూ కరుడుగట్టిన ముస్లిమ్ వ్యతిరేకులని! ఇజ్రాయిల్ పాలస్తీనాను అణగదొక్కుతున్నట్టే , ఇండియా కాశ్మీర్ వేర్పాటువాదుల్ని అంతం చేస్తోందని!   మోదీ ఇజ్రాయిల్ పర్యటన గురించి పాకిస్తాన్ పత్రికలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటే ఏంటి అర్థం? టెల్ అవివ్, న్యూ దిల్లీ స్నేహం పాకిస్తాన్ కు బయటకు చెప్పుకోలేని నష్టం. అందుకే, నీతులు వల్లిస్తూ సంపాదకీయాలు రాసేస్తున్నాయి అక్కడి పత్రికలు! వాటిల్లో వ్యక్తం అవుతోన్న ఆందోళన చూస్తుంటే మోదీ ఇజ్రాయిల్ పర్యటన మంచి నిర్ణయమే అనుకోవాలి. కాకపోతే, ఇప్పటికే ఈ పని ఎవరైనా చేసి వుండాలి. చేయకపోవటం భారతదేశ దురదృష్టం…

కేసీఆర్ పిచ్చి చంద్రబాబుకు అంటుకుందా..?

  జాతకాలు, ముహూర్తాలు, వాస్తుపై ఎవరి నమ్మకం వాళ్లది..కొందరికి ఇందులో మంచి జరిగి ఉండవచ్చు..మరి కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేయవచ్చు. అయితే సాధారణ జనానికి ఇందులో ఏం జరిగినా..జరక్కున్నా పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు..కానీ ప్రజా జీవితంలో ఉన్న నేతలకు అది కూడా పాలకులకు ఇలాంటి వాటిపై పిచ్చి ఉంటే అది చాలా మందికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో జాతకాలు, వాస్తుపై బాగా నమ్మకం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే చెబుతారు. ఆయన అడుగు తీసి అడుగు వేయాలంటే పండితుల సలహాలు తీసుకోకుండా చేయరని టాక్. చివరకు ఈ పిచ్చి ఎక్కడికి వెళ్లిందంటే వాస్తు బాగోలేదని ఏకంగా సచివాలయాన్నే కూల్చి కొత్తది కడతా అన్నంతగా..అయితే అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో గులాబీ బాస్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. బేగంపేట క్యాంపు ఆఫీసులో తనకు ముందు ఉన్న ముఖ్యమంత్రులకు కలిసిరాకపోవడానికి కారణం వాస్తు దోషమే అని భావించి..పక్కా వాస్తుతో, అత్యాధునిక సదుపాయాలతో ఏకంగా కొత్త క్యాంపు ఆఫీసు నిర్మించారు కేసీఆర్.. అలాంటి వాస్తు, జ్యోతిష్యాల పిచ్చి ఇప్పుడు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంటుకుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వ్యవహరించిన సమయంలో ఇలాంటి వాటికి ఆమడ దూరంలో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ పని చేయాలన్నా పండితులను సంప్రదిస్తున్నారు. వాస్తు అంటే చాలు అటెన్షన్ అయిపోతున్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని మూడు దశాబ్దాల పాటు ఉన్న ఇంటిని కూల్చడమే కాకుండా ..కోట్లు ఖర్చు చేసి కొత్త ఇంటిలో గృహప్రవేశం చేశారు. అంతేనా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు కూడా వాస్తు ప్రకారం మార్పులు చేయించారు. ఇప్పుడు తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పడంతో వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు ఏపీ సీఎం..సచివాలయం వద్ద ప్రస్తుతం నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి కొత్తగా మరో గేటు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న నాలుగు గేట్లకు అదనంగా మరో గేటు నిర్మిస్తున్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాస్తు పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో లెక్కే లేదు..ఎందుకంటే ఆ సొమ్మంతా వారు కష్టపడి సంపాదించింది కాదు కదా..? అంతా ప్రజాధనమే కదా అని కొందరు విమర్శిస్తున్నారు.

ఈ మంత్రిగారు అసెంబ్లీలోనే చంపి పాతరేస్తారట..?

  భారతదేశంలో చట్టసభలకు ఒక చరిత్ర ఉంది..ప్రజల సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రజాప్రతినిధులు ఒకచోట కూర్చొని చర్చించుకునేందుకు వీలుగా రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఎంతో మంది రాజకీయ ఉద్ధండులు ప్రజా సమస్యలపై తమ గళం వినిపించిన సందర్భాలు ఎన్నో..మరెన్నో..అలాంటి చట్టసభలు నేడు వ్యక్తిగత విమర్శలకు, ప్రజా ప్రతినిధుల బలాబలాలు తేల్చుకునేందుకు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ పరువు ప్రతిష్టలను మంటగలిపే ఘటన ఒకటి జరిగింది. వస్తు, సేవల పన్ను విషయంపై శాసనసభలో నిన్న చర్చ జరిగింది...ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్యల శాఖా మంత్రి ఇమ్రాన్ అన్సారీ, ప్రతీపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదరించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ..జమ్మూకశ్మీర్‌లో మాత్రం అమల్లోకి రాలేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ అందుకు ఆమోదించకపోవడమే దీనికి కారణం. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని..ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ భావించింది. ఇందులో భాగంగానే నిన్న జరిగిన సమావేశంలో జీఎస్టీని కశ్మీర్‌లోనూ అమలు చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా ప్రభుత్వాన్ని నిలదీశారు..తాను పన్నులు ఎగ్గొట్టలేదని..చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్షానికి బదులిచ్చారు..ఓ వైపు ఆయన మాట్లాడుతుండగానే..మంత్రి ఇమ్రాన్ అన్సారీ ఆగ్రహంతో..నేను తలచుకుంటే నిన్ను ఇక్కడే చంపి పాతరేయగలను..నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు..కశ్మీర్ మొత్తంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. నీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలియదా..అంటూ బెదిరింపులకు దిగారు..దీంతో అధికార విపక్ష సభ్యులు కుర్చీలపైకి ఎక్కి నిరసన తెలియజేశారు..మంత్రి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా సమాధానం చెప్పాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు డిమాండ్ చేశారు. ఇవి కాస్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.