కాంగ్రెస్ మెడకు… నిజమో కాదో తెలియని రాహుల్ చైనీస్ మీటింగ్
posted on Jul 10, 2017 @ 4:55PM
రాహుల్ మరో వివాదంలో ఇరుక్కున్నారు! ఈసారి వయా చైనా మీదుగా రచ్చలో కాలేశారు! ఇంకేముంది, సోషల్ మీడియాలోని మోదీ భక్తులు చాకిరేవు పెడుతున్నారు. వారి ఏకపక్ష ఆరోపణల్ని సీరియస్ గా తీసుకోకున్నా… ఓ జాతీయ మీడియా ఛానల్ కూడా రాహుల్ ను తప్పుపడుతూ కథనం ప్రసారం చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది!
సిక్కిం ప్రాంతంలో ఇండియా, చైనా సైనికులు ఫేస్ టూ ఫేస్ పోరాటానికి దిగుతున్న సంగతి మనకు తెలిసిందే! ఆ కారణం చేతనే మోదీ, చైనీస్ ప్రెసిడెంట్ జిన్ పింగ్ జీ20 సమావేశాల సందర్భంగా కలిసే అవకాశమున్న కలవలేదు. ఊరికే కరచాలనంతోనే సరిపెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇండియన్ సోల్జర్స్ చైనాను అడ్డుకవటంతో జిన్ పింగ్ కూడా అంతర్జాతీయ వేదికపై టోను మార్చాడు. చుట్టు పక్కల దేశాలతో చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని నీతులు వల్లించాడు. కాని, నిజంగా మాత్రం చైనా నీతి అలా వుండటం లేదు…
సిక్కింలో భూటాన్, భారత భూభాగాల్లోకి చైనా చొచ్చుకొచ్చింది. కాని, తప్పంతా ఇండియాదే అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ విదేశాల నుంచి తన పర్సనల్ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చి రాగానే మోదీపై ఫైరైపోయారు. చైనా విషయంలో ఆయనేం చేయటం లేదంటూ విమర్శలు గుప్పించారు. కాని, అంతలోనే చైనా ఓ బాంబులాంటి ప్రెస్ నోట్ తన వెబ్ సైట్లో పోస్టు చేసింది. తరువాత ఠపీమని తొలగించేసింది! దాని సారాంశం ప్రకారం… రాహుల్ గాంధీ చైనా దూతను దిల్లీలో కలుసుకున్నారు. వారిద్దరి మధ్యా చర్చలు జరిగాయి!
సాక్షాత్తూ చైనీస్ ఎంబసీ తమ వెబ్ సైట్లో పోస్టు చేసిన రాహుల్ గాంధీ మీటింగ్ నిజం కాదని చెబుతున్నారు కాంగ్రెస్ వారు! అంతా మోదీ భక్తులు, బీజేపి అనుకూల మీడియా దుష్ప్రచారం అనేస్తున్నారు. కాని, చైనీస్ ఎంబసీ వెబ్ సైట్లో పెట్టి మళ్లీ తొలగించిన ప్రెస్ నోట్ గురించి మాత్రం మాట్లాడటం లేదు! అయితే, సోషల్ మీడియాలో ఇప్పటికే చైనా పెట్టి, తీసేసిన ప్రెస్ నోట్ ఇమేజ్ రూపంలో సర్క్యులేట్ అవుతోంది!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చైనా దూతతో మాట్లాడారా? లేదా? మాట్లాడితే ఏం మాట్లాడి వుంటారు? అసలు రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆయన ఏ హోదాలో మీటింగ్ లో పాల్గొన్నారు? ఇలా బోలెడు ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. అన్నిట్ని ఖండించి తమ నాయకుడి తప్పేం లేదంటున్నారు కాంగ్రెస్ వారు. మరో వైపు బీజేపి వారు, బీజేపి అభిమానులు … అమెరికా ప్రతినిధితో కూడా గతంలో నోరు జారి మాట్లాడిన రాహుల్ ఈసారీ అలాగే చేసుంటాడంటున్నారు! వికిలీక్స్ ప్రకారం… రాహుల్ ఇంతకు ముందు ఆరెస్సెస్ గురించి , హిందూ ఉగ్రవాదం గురించి అమెరికా అధికారితో ఇష్టానుసారం మాట్లాడాడు!
చైనా విషయంలో మోదీని టార్గెట్ చేద్దామనుకున్న కాంగ్రెస్ కు తమ రాహుల్ మీటింగ్ ఆత్మరక్షణలో పడేలా చేసింది! బీజేపి వారికి చాలా కాలంపాటూ విమర్శించటానికి చక్కటి కారణం దొరికింది!