గ్రంథాల గందరగోళం @ ఏపీ రాజకీయం!
posted on Jul 8, 2017 @ 4:54PM
రాజకీయాలు అనేక రకాలు! అసెంబ్లీ లోపల జరిగేవి, బయట జరిగేవి, ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో జరిగేవి, ఎలక్షన్ బూతుల్లో జరిగేవి, ఇప్పుడు కొత్తగా టీవీ స్టూడియోల్లో, సోషల్ మీడియా జరిగే రాజకీయకాలు కూడా తోడయ్యాయి! కాకపోతే, అసెంబ్లీలో అల్లరి చేసినా, రోడ్డుపై రాస్తారోకో చేసినా… అన్నిటి పరమార్థం ఒక్కటే! అధికార పక్షాన్ని కార్నర్ చేయటం. అలాగే, అధికారంలో వున్న వారు ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయటం! అయితే, ఇప్పుడు ఏపీలో కొత్తగా పుస్తకాల రాజకీయం మొదలైంది!
అమరావతి ప్రాంతంలో అట్టహాసంగా జరుగుతోంది వైసీపీ ప్లీనరీ! మరిక ప్రతిపక్ష పార్టీ సభ అంటే ఆశించేది ఏముంటుంది? టీడీపీ పై నిప్పులు చెరిగారు జగన్. అలాగే, తండ్రి వైఎస్ఆర్ ను తీవ్రంగా తలుచుకున్నారు. ఇదంతా కొత్తదేం కాదు. కాని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఓ బుక్ రిలీజ్ చేయటమే వైసీపీ ప్లీనరీలో కొంచెం రొటీన్ కి భిన్నంగా కనిపించింది!
టీడీపీ అధినేత అవినీతి చక్రవర్తి అంటూ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకం విడుదల చేసింది వైసీపీ! ఇందులో ఏముంటుందో అందరికీ తెలిసిందే! రోజా లాంటి జగన్ శిబిరం లీడర్లు రోజువారీగా చేసే ప్రెస్ మీట్ ఆరోపణలు ఓ బుక్ లాగా మన ముందుకు తీసుకొచ్చారు. అందులో చంద్రబాబు అవినీతిపరుడని నిరూపించేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. అంతే కాదు, ఈ గ్రంథాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్లాలని జగన్ పిలుపు కూడా ఇచ్చారు!
తమ నాయకుడి మీద అవినీతి బురదజల్లే ప్రయత్నం చేసిన వైసీపీని టీడీపీ వదిలిపెడుతుందా? వెంటనే ఇటు వైపు నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. టీడీపీ సీనియర్ నేత యనమల… నేరాల చక్రవర్తి అంటూ తామూ ఓ పుస్తకం ఓటర్లకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు! అందులో జగన్ చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ వుంటాయని తెలిపారు! వైసీపికి ఎంపరర్ ఆఫ్ కరప్షన్ కి ధీటుగా ఈ ఎంపరర్ ఆఫ్ క్రైమ్స్ వుంటుందట!
అధికార, ప్రతిపక్షాలు ఇలా మాస్ మసాలా గ్రంథాలు విడుదల చేయటం కొత్తేం కాదు. వైఎస్ఆర్, చంద్రబాబు పరస్పర రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఇంతకు ముందు కూడా బుక్కులు అచ్చేసి మార్కెట్లోకి వదిలారు! వాటి వల్ల వచ్చిన స్పష్టమైన ప్రయోజనం మాత్రం ఏం తేలలేదు! కాకపోతే, ఇప్పుడు మరోసారి తమ ప్లీనరీ సందర్భంగా జగన్ తమ కార్యకర్తలకి ఉత్సాహం కలిగేలా చంద్రబాబు మీద బుక్ విడుదల చేశారు! దాన్ని జనం సీరియస్ గా తీసుకుంటారంటే మాత్రం డౌటే!