లాలూకి టెన్షన్! నితీష్ అటెన్షన్!
posted on Jul 7, 2017 @ 5:18PM
బీహార్ రాజకీయం భీభత్సంగా తయారైంది. లాలూకి మోదీ మార్క్ ట్రీట్మెంట్ లభిస్తోంది. అదే సమయంలో నితీష్ చల్లగా పక్కకు తప్పుకునే ప్రయత్నంలో వున్నాడు. ఇక బీహార్ కాంగ్రెస్ పరిస్థితి ఎప్పటిలాగే అయోమయంగా కంటిన్యూ అవుతుంది. వీటన్నిటికి కారణం లాలూ ఇళ్లపై, వివిధ స్థావరాలపై జరుగుతోన్న ఐటీ దాడులే!
మోదీ 2014లో ప్రధాని అయ్యాక అమిత్ షా నేతృత్వంలోని కమలదళానికి తీవ్రమైన ఓటమి ఎదురైంది దిల్లీ, బీహార్ అసెంబ్లీలలోనే! అందుకే, ఒకవైపు యూపీ నుంచి గోవా దాకా చిన్న , పెద్దా రాష్ట్రాలు ఎన్ని తమ ఖాతాలో పడ్డా బీహార్ , దిల్లీల్ని మాత్రం ఓ కంట కనిపెడుతూనే వున్నారు బీజేపి పెద్దలు! ప్రస్తుతం అమిత్ షా సీరియస్ హ్యాండిల్ చేస్తోన్న రెండు, మూడు రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి! దిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే! అసలు ఏ ఒక్క రోజు కూడా మీడియాని ఖాళీగా వుండనీయని ఆప్ అధినేత గత మున్సిపల్ ఎన్నికల తరువాత గప్ చిప్ అయిపోయాడు. ఆయన వ్యూహాలు ఆయనకు వుండొచ్చు. కాని, బీజేపి ఒకవైపు ఎన్నికల విజయాలతో, మరో వైపు పార్టీలోని అంతర్గత విభేదాల్ని రెచ్చగొట్టడంతో … రెండు వైపుల నుంచి కేజ్రీవాల్ పై దాడి చేసింది. ఇప్పుడు చేసేది లేక ఆయన సైలెంట్ అయిపోయాడు! అసలు రాష్ట్రపతి ఎన్నిక లాంటి కీలక ఘట్టంలో కేజ్రీ ఎక్కడా కనిపించటమే లేదు!
అరవింద్ కేజ్రీవాల్ లాగే మోదీ, అమిత్ షా దృష్టి పెట్టిన మరో నాయకుడు లాలూ! నితీష్ ను బీజేపికి దూరం చేసిన ఆయన కాంగ్రెస్ తో కూడా జతకట్టించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాడు. అప్పట్లో లాలూ ములాయంని కూడా తమతో కలుపుకుని బీజేపి యూపీ ఆశల్ని కూడా ఆడియాసలు చేయాలనుకున్నాడు. కాని, అవేవీ కుదరలేదు. బీహార్ లో మహాఘట్ బంధన్ సక్సెస్ అయింది కాని యూపీలో బీజేపిదే హవా నడిచింది. ఇప్పుడిక మోదీ, అమిత్ షా తమ రివెంజ్ కి టైమొచ్చినట్టుగా భావిస్తున్నట్టే కనిపిస్తోంది! ఏక కాలంలో లాలూని పర్సనల్ గా,పొలిటికల్ గా దెబ్బ కొట్టే రాజకీయ క్రీడ నడుస్తోంది!
లాలూ ఆల్రెడీ కోర్టు తీర్పుతో రాజ్యసభ సీటు కోల్పోయిన నేత. అటువంటి అవినీతి ఆరోపణలున్న వ్యక్తిపై ఐటీ దాడులు చేయించటం కేంద్రానికి పెద్ద పనేం కాదు. అందుకే, దిల్లీ ప్రభుత్వం ఐటీని, ఈడీని ప్రయోగించి లాలూని, ఆయన కుటుంబ సభ్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే అదనుగా లాలూ చేతిలో చిక్కి సతమతం అవుతోన్న నితీష్ కూడా పావులు కదుపుతున్నాడు. అత్యవసర సమావేశాలు నిర్వహించి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ మద్దతు తీసుకోవాలా వద్దా అన్నట్టుగా ఆలోచనలు చేస్తున్నాడు. నితీష్ లాలూ మద్దతు వద్దంటే బీజేపి అండగా నిలవటానికి రెడీ వుంది!
నితీష్ ఒకప్పటి తన మిత్ర పక్షం అయిన బీజేపికి దగ్గరై లాలూని వద్దు పొమ్మంటే ఆర్జేడీతో పాటూ కాంగ్రెస్ నష్టమే! బీహార్లో నితీష్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగం. ఒకవేళ నితీష్ బీజేపి మద్దతుతో కొనసాగితే కాంగ్రెస్ బయటకు వచ్చేయటం తప్ప చేయగలిగింది ఏం లేదు! అందుకే, లాలూ పై ఐటీ, ఈదీ దాడుల ప్రబావం త్వరలోనే బీహార్ రాజకీయాలపై తీవ్రంగా వుండనుంది. ఇప్పటికే బీజేపి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు పలికిన నితీష్ కుమార్ పూర్తిగా ఎన్డీఏ గూటికి చేరితే అది ప్రతిపక్షాలకి పెద్ద దెబ్బే అవుతుంది! ఇప్పుడే కాదు… 2019లో కూడా!