భారత్‌లో ఉగ్ర దాడులకి… పాక్‌తో పాటూ చైనా కూడా కారణమా?
posted on Jul 11, 2017 @ 12:00PM
జమ్మూ, కాశ్మీర్ రక్తమోడుతూనే వుంది. ఇన్ని నెలలు ఆర్మీ, పోలీస్ బలగాలు ఉన్మాదుల రక్త దాహానికి బలయ్యాయి. ఇప్పుడు సాధారణ భారతీయ పౌరులు, ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రాణ త్యాగాలు చేయాల్సి వస్తోంది. అంతా కేవలం ఉగ్ర మూకల ఉన్మాదం వల్ల. అమర్ నాథ్ యాత్రీకుల బస్సుపై దాడితో మరోసారి టెర్రరిస్టులు తమ శాడిజాన్ని చాటుకున్నారు. నిరాయుధులైన యాత్రీకుల్ని చంపి వాళ్లు ఏం సాధించదలుచుకున్నారో అందరికీ తెలిసిందే! పాక్ లోని టెర్రర్ బాసుల మెప్పుపొందటమే ఆ జిహాదీల లక్ష్యం…
అమర్ నాథ్ యాత్రీకులపై దాడి ఎప్పుడూ కాశ్మీర్లో జరిగే ఉగ్రవాదాడుల్లో భాగంగా చూడకూడదు. అసలు గతంలోనూ 2001, 2002లో అమర్ నాథ్ యాత్రీకులపై దాడులు జరిగాయి. అయితే, అప్పుడు యాత్రీకుల క్యాంపు దాడి జరిగింది. ఓ సారి 13మంది, మరోసారి 8మంది చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో మొత్తం 7గురు గుజరాతీలు ప్రాణాలు కోల్పోయారు. కాకపోతే, తాజా ఉగ్రదాడి మనం అనేక కోణాల్లో విళ్లేషించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే, నెలల తరబడి కాశ్మీర్లో హింసాకాండ చెలరేగుతోంది. రాళ్లు రువ్వే అరాచకుల వల్ల మొత్తం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇటు ఆర్మీ కూడా ఎందరో జవాన్లను కోల్పోవాల్సి వస్తోంది. అయినా మన వారు పట్టుదలగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నారు. అదే ఇప్పుడు పాక్ లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ ఒత్తిడిలోనే సైన్యాన్ని ఎదుర్కోలేక అమాయకులపై దాడికి దిగుతున్నారు…
తాజా దాడిని చైనా కోణం నుంచి కూడా చూడాలి. అమర్ నాథ్ యాత్రీకులపై దాడి చైనా చేయించి వుండకపోవచ్చు. కాని, చైనా కూడా సిక్కిం సెక్టార్ లో ఎప్పుడూ లేని ఎదురు దాడిని భారత్ నుంచి ఎదుర్కొంటలోంది. మన సైన్యం ఒక్క అడుగు ముందుకు వేయనీయకుండా చైనీస్ సోల్జర్స్ అడ్డుకుంటోంది. ఇది ఘోర అవమానంగా భావించిన చైనా ఉడికిపోతోంది. అవసరమైతే పాక్ కు మద్దతుగా మూడో దేశం కాశ్మోర్లో అడుగుపెడుతుందంటూ బెదిరించే మాటలు మాట్లాడుతోంది! సరిగ్గా ఆ సమయంలోనే అమర్ నాథ్ యాత్రకు అడ్డంకి కలిగిందంటే… పాక్, చైనా కలిసే భారత్ లో దాడులకు ప్లాన్ చేస్తున్నాయని అనుమానించవచ్చు! చైనా అమర్ నాథ్ యాత్రకే కాదు తన ఆధీనంలో వున్న మానస సరోవర్ క్షేత్రానికి కూడా ఈ సారి భారతీయుల్ని రాకుండా అడ్డుకుంటోంది.
మొత్తంగా అమర్ నాథ్ యాత్రీకులపై దాడి లోకల్ కాశ్మీరీ హింసోన్మాదులు మొదలు … సరిహద్దుకు ఆవల వున్న పాకిస్తాన్, చైనా కుట్రదారుల పనిగా మనం ఖచ్చితంగా భావించవచ్చు. అంతే కాదు, చైనీస్ దౌత్యవేత్త రహస్యంగా రాహుల్ గాంధీని కలవటం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. మోదీతో ప్రతిపక్షాలకి, ముఖ్యంగా కాంగ్రెస్ కి వున్న విభేదాల్ని చైనా తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది. కనీసం మోదీనీ, బీజేపిని ఆందోళన పరిచే విధంగానైనా సంకేతాలు ఇవ్వాలని చూస్తోంది. తెలిసో, తెలియకో రాహుల్ గాంధీ చైనా ట్రాప్ లో పడ్డాడు. అనవసర మచ్చ తన మీద వేసుకున్నాడు. కాని, ఇప్పుడిక బాల్ తిరిగి తిరిగి ప్రదాని కోర్టులోకే వచ్చింది…
ప్రపంచ ముస్లిమ్ లకు పరమ శత్రువైన ఇజ్రాయిల్ లో మోదీ పర్యటించారు, కాశ్మీర్ లో ఉగ్రవాదుల్ని మన సైన్యం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది, జీ20 సదస్సు సందర్భంగానూ చైనా ప్రెసిడెంట్ తో మోదీ సమవేశమవ్వలేదు, సిక్కింలో ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఇండియా సంకేతాలిచ్చింది… వీటన్నిటి నేపథ్యంలో సహజంగానే శత్రువులందరికీ యసిడిటీ తీవ్రస్థాయిలో వుంటుంది. వాళ్లు తిన్నది అరగక హింసకి పాల్పడటం సహజం. అందుకే, ముందు ముందు అమర్ నాథ్ యాత్రీకుల్లాంటి అమాయకుల్ని మనం కోల్పోకుండా వుండేలా వ్యూహాలు వుండాలి. అదే సమయంలో పాక్, చైనా ఒత్తిళ్లకు లొంగకుండా ముందుకు సాగాలి. ఈ కత్తి మీద సాము… మోదీ, అజిత్ ధోవల్ జోడీ సమర్థంగానే చేస్తుందని ఆశిద్దాం…