మరోసారి ‘స్వామి’ వారి ఆగ్రహానికి గురైన రజినీకాంత్!
posted on Jul 6, 2017 @ 3:28PM
రామేశ్వరం పోయినా అదేదో తప్పలేదంటారు! అలా తయారైంది రజినీకాంత్ పరిస్థితి. ఇంకా ఆయన రాజకీయాల్లోకి అధికారికంగా వచ్చిందీ లేదు. ఎన్నికల్లో పోటీ పడిందీ లేదు. కాని, ఆయన పేరున దుమారాలు మాత్రం రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా రజినీకాంత్ కు ఎవ్వరూ ఊహించని విధంగా సుబ్రమణియన్ స్వామీ నుంచీ తలనొప్పులు వస్తున్నాయి. నిజానికి రజినీ రాజీకీయాల్లోకి వస్తే ఇటు ఏఐఏడీఎంకే, అటు డీఎంకే పార్టీలకి నష్టం. సుబ్రమణియన్ స్వామీకిగాని, బీజేపికిగాని ఎలాంటి నష్టం లేదు. కాస్తో, కూస్తో లాభం కూడా! అయినా సుబ్బూ రజినీ మీద అవాకులు చెవాకులు పేలి రాజకీయ రంగం రుచి ఎలా వుంటుందో అప్పుడే తలైవాకి చూపించేస్తున్నాడు!
రజినీకాంత్ ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా షూటింగ్ కూడా ఆపేసి… అమెరికా వెళ్లాడు. అక్కడాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కాని, ఇంతలోనే సుపర్ మ్యాన్ సుబ్రమణియన్ స్వామీ తనదైన స్టైల్లో ట్విట్టర్ లో రెచ్చిపోయాడు. సూపర్ స్టార్ అమెరికాలోని ఓ క్యాసినోలో పందెం కాస్తోన్న ఫోటో ట్విట్ చేసి… ఇదేనా ట్రీట్మెంట్ అంటూ వెటకారం చేశాడు! అమెరికా వెళ్లి గ్యాంబ్లింగ్ చేస్తోన్న రజినీకాంత్ కి ఆ డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేశాడు!
నిజంగానే… వైద్యం కోసం అమెరికా వెళ్లిన రజినీ గ్యాంబ్లింగ్ గేమ్ లో ఎందుకు పాల్గొన్నట్టు? ఆయన క్యాసినోలో వున్నప్పటి ఫోటో సుబ్రమణియన్ స్వామికి ఎలా చిక్కింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వుండవు. కాకపోతే, ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న అంశం సుబ్రమణియన్ స్వామీకి రజినీకాంత్ ఎందుకు నచ్చటం లేదనేది! మరీ దారుణంగా రజినీ లాంటి సూపర్ స్టార్ ను ఆయన ట్విట్టర్ లో 420 అన్నాడు. ఇది ఇప్పుడు తలైవా అభిమానుల కోపం కట్టలు తెంచుకునే చేస్తోంది! మరో వైపు రజినీకాంత్ మాత్రం ఇంతదాకా సుబ్బూని ఒక్క మాట కూడా అనలేదు!
ఇంతకు ముందు కూడా స్వామీ, రజినీకాంత్ ఆర్దిక మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మానుకోకపోతే తాను అన్నీ బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇది నిజంగా విచారకరం. రజినీ తప్పు చేస్తే కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయోచ్చు కాని… ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రమే కోర్టుకీడుస్తానని అనటం … రౌడీయిజం అనిపించుకుంటుంది!
సుబ్రమణియన్ స్వామీ ఇలా రజినీకాంత్ మీద కామెంట్లు, ట్వీట్లు చేయటం బీజేపి పార్టీకి కూడా నష్టం తెచ్చే విషయమే. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కనీసం ఆయన్ని రజినీ వ్యతిరేక కామెంట్స్ చేయకుండా కూడా కట్టడి చేయకపోతే తలైవా అభిమానుల ముందు కమలదళం కూడా విలన్ అవుతుంది. కాబట్టి సుబ్రమణియన్ స్వామిని నియంత్రించే పని మోదీ, అమిత్ షా ఇప్పటికైనా చేయాలి. లేదంటే… తమ పార్టీలో చేరకుండా రజినీ స్వంత పార్టీ పెట్టడం… కమలదళం పెద్దలకి ఇష్టం లేక… ఇలా స్వామీ చేత బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని వినిపిస్తోన్న మరో టాక్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ లేకపోలేదు!