ఇజ్రాయిల్‌లో ఇండియన్ పీఎం… టెన్షన్ లో పాకిస్తాన్ మీడియా!
posted on Jul 6, 2017 @ 2:45PM
నరేంద్ర మోదీ విదేశ పర్యటనలకు వెళ్లటం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. ఆయన పీఎం అయిన కొత్తలో విరివిగా ఫారిన్ టూర్ లకి వెళుతోంటే చాలా దుమారమే రేగింది. కాని, రాను రాను మ్యాటర్ అర్థమవటంతో అంతా సైలెంట్ అయిపోయారు. అదే రేంజ్లో మోదీ భక్తులు కూడా ఆయన ఏ దేశం వెళ్లినా తమ నేతకు లభిస్తోన్న ఘన స్వాగతాల గురించి సోషల్ మీడియాని ముంచెత్తారు. అమెరికాకు మొదటి సారి వెళితేనైతే భూమి, ఆకాశం ఏకం చేశారు! కాని, ఇప్పుడు ఇరువైపులా హడావిడి తగ్గింది. మోదీ విదేశీ పర్యటనల్ని విమర్శించే వారు కాస్త చల్లబడ్డారు. అదే స్థాయిలో మోదీని నెత్తికెత్తుకునే వర్గం కూడా ఆయన తాజా ఇజ్రాయిల్ పర్యటన మీద ఊహించినంత కోలాహలం చేయటం లేదు!
ప్రపంచ ముస్లిమ్ లు దాదాపు నూటికి నూరు శాతం తమ శత్రువుగా భావించే ఇజ్రాయిల్ ను ఇప్పటి వరకూ ఏ ఒక్క భారత ప్రధానీ సందర్శించలేదు. కాని, మోదీ ఆ పని చేశారు. అందుకే, ఇజ్రాయిల్ ప్రధానితో సహా యావత్ క్యాబినేట్ నమోకి ఎదురువచ్చి నమస్కారాలు చేసి స్వాగతం పలికింది! అంతటితో ఊరుకోకుండా ఆయన వెంట అనుక్షణం ప్రధాని, మంత్రులు వుంటూనే వచ్చారు. మోదీ అన్న పేరుని తమ దేశంలోని ఒక పువ్వుకు కూడా పెట్టుకున్నారంటే ఇజ్రాయిలీలు ఈ పర్యటనని ఎంత ముఖ్యంగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! అలాగే, మోదీ కూడా పాకిస్తాన్ నుంచి పని చేసే ఉగ్ర మూకలకి, అర్థం పర్థం లేకుండా అతివాద మైనార్టీ వర్గాలకి తలొగ్గే రాజకీయ నేతలకి బలమైన సంకేతాలు పంపించారు. భారతదేశానికి మేలు చేసే ఎక్కడికైనా తాను వెళతానని నిరూపించారు. అంతే కాదు, పాక్ ఉగ్రవాదుల చేతుల్లో ముంబై దాడుల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన యూదు అబ్బాయిని కూడా ఆయన కలిశారు! పదకొండేళ్ల ఆ బాబు ఐ లవ్ యూ మోదీ అన్నడాంటే… ఇజ్రాయిలీలు భారత ప్రధాని పట్ల ఎలాంటి భావాలతో వున్నారో అర్థం చేసుకోవచ్చు!
మోదీ ఇజ్రాయిల్ పర్యటించినంత మాత్రాన ఆ దేశం పాలస్తీనా మీద చేసే దాడుల్ని మనం సమర్థించినట్టు కాదు. కేవలం మనం ముస్లిమ్ సమాజానికి వ్యతిరేకం కాదని నిరూపించుకునేందుకు ఇంత కాలం ఎంతో బలమైన దేశమైన ఇజ్రాయిల్ ను దూరం పెడుతూ వచ్చాం. కాని, మోదీ ఆ దేశంలో కాలుమోపటంతో మనకి రక్షణ రంగంలో, వారికి వ్యాపార రంగంలో అనేక లాభాలు కలగనున్నాయి. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ కు పెద్ద బెంగాగ మారింది! మోదీ ఇజ్రాయిల్ యాత్ర గురించి మన పత్రికల కంటే అక్కడి పత్రికలే ఎక్కువ సంపాదకీయాలు రాసేస్తున్నాయి. ఆ ఎడిటోరియల్స్ అన్నిటి సారాంశం ఇండియా, ఇజ్రాయిల్ నూతన సంబంధాలు ముస్లిమ్ లను మరింత అణిచివేయటానికేనని! అటు నెతన్యాహు, ఇటు మోదీ ఇద్దరూ కరుడుగట్టిన ముస్లిమ్ వ్యతిరేకులని! ఇజ్రాయిల్ పాలస్తీనాను అణగదొక్కుతున్నట్టే , ఇండియా కాశ్మీర్ వేర్పాటువాదుల్ని అంతం చేస్తోందని!
మోదీ ఇజ్రాయిల్ పర్యటన గురించి పాకిస్తాన్ పత్రికలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటే ఏంటి అర్థం? టెల్ అవివ్, న్యూ దిల్లీ స్నేహం పాకిస్తాన్ కు బయటకు చెప్పుకోలేని నష్టం. అందుకే, నీతులు వల్లిస్తూ సంపాదకీయాలు రాసేస్తున్నాయి అక్కడి పత్రికలు! వాటిల్లో వ్యక్తం అవుతోన్న ఆందోళన చూస్తుంటే మోదీ ఇజ్రాయిల్ పర్యటన మంచి నిర్ణయమే అనుకోవాలి. కాకపోతే, ఇప్పటికే ఈ పని ఎవరైనా చేసి వుండాలి. చేయకపోవటం భారతదేశ దురదృష్టం…