ఇప్పుడే తెలిసింది - శారదా అశోకవర్ధన్
posted on Jan 16, 2012
ఇప్పుడే తెలిసింది
- శారదా అశోకవర్ధన్
అబలవూ ఆడపిల్లవూ అంటూ
అందరూ నిన్ను అలుసుగచూసేవాళ్ళే
పుట్టగానే పురిటి ఖర్చులూ
నీకు పెట్టె ప్రతీ పైసా
దండగని ఊహించుకుంటూ
నిన్ను కనడం ఖర్మంటూ
నీ తమ్ముడికోసం కలలు కంటూ
నిన్ను ఆరడిపెడుతూ వుంటే
నోరు విప్పని నన్ను చూస్తే
నాకే సిగ్గేస్తోంది
నవనాగరికత నన్ను చూసి నవ్వుతోంది!
చిట్టిపాపగా గంపెడు ఆశలు కళ్ళనిండా నింపుకుని
అమ్మ వెంట నీడలా తిరుగుతూ
వంటఇంటిలో సాయం చేస్తూ
మాడిన గిన్నెల్నీ మసిబారిన గిన్నెల్నీ
గరగరలాడే మట్టితో తోమి
తోమి రక్తం పేరుకు అరిచేతులు మండిపోతే
మండే చేత్తో మాడే కడుపుతో
అందరు తినగా మిగిలిన మెతుకులు గతికి
బండెడు చాకిరి ఒంటిగ చేస్తూ
అలుపు తెలియని అమాయకతతో
బాల్యమంతా గడిపే నిన్ను
ఆదుకోలేని నన్ను చూస్తే
ఒళ్ళుమండుతోంది నాకే
నా డిగ్రీలు నన్ను చూసి
విరగబడి నవ్వుతున్నాయి
పెళ్ళి పెళ్ళని ప్రేరేపించి
లేనిపోని ఆశలు రేపి
చదువు కాస్తా మాన్పించేసి
అంతా అతనికే ఇచ్చి
గుండె బరువు తీరిందంటూ
సంబరపడే నీవారిని చూస్తూ
'ఇక ఆ యిల్లే నీ స్వర్గం
అతడే నీ ప్రభువు' అంటూ
నీతులు చెబుతూ నిను పంపిస్తుంటే
కళ్లనీళ్లు దాచుకుంటూ
కన్నవారిని ఒదులుకుంటూ
బిక్కుబిక్కుమని నువు వెళుతూవుంటే
నీ వ్యక్తిత్వం నిలబెట్టు మాటలు
మచ్చుకైనా చెప్పని నన్ను చూసి
నా పేరు ప్రతిష్టలు పగలబడి నవ్వాయి
జాలిగా చూశాయి!
నాలో రగిలిన కోపం
జ్వాలై కళ్ళల్లో నిప్పులు చెరిగింది
కరిగిపోయిన మరిగిపోయిన కన్నీరు
చెంపలపై జారింది
పెదవులు విడిపడ్డాయి
పిడికిళ్ళు బిగుసుకున్నాయి
అప్పడే తెలుసుకున్నాను
నాలోని సబలత్వం సజీవంగానే నిలిచివుందని
నా వ్యక్తిత్వం నన్ను మనిషిగా నిలబెట్టిందని
అడుగు ముందుకు వేశాను!
నా అనుభూతిని అందరితో పంచుకోవాలని
ఆడది అబలకాదని అందరికీ చాటించాలని
అడుగు ముందుకువేశాను.