నానీడవే అయినా - శారదా అశోకవర్ధన్
posted on Jan 13, 2012
నానీడవే అయినా
- శారదా అశోకవర్ధన్
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు
కనుమూసి కలనైన తేలిపోనివ్వు....
ఉరుకు పరుగుల బతుకుబాటన అలసిపోయిన నన్ను
అలుపు తీరేదాకా హాయిగా కాస్సేపు నిదుర పోనివ్వు...
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు....
కనుముండు జరిగేటి కటిక ఘోరాలెన్నో కనలేని నా కళ్ళు
నిదుర వాకిట్లో నిండు చీకట్లో మైమరచి క్షణమైన మరచిపోనివ్వు
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు....
ఎదనిండా బెంగలు ఎండిపోయిన ఆశలు
దండగ బతుకని బెంబేలు పడువేళ
ఒడలు తెలియని నిదురలో బెడదలేని హాయిలో
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు...
నా నీడమైనా నీకు నమస్కరిస్తాను
నీ పాదాల మీద పడి నీకు మొక్కుతాను!
స్వేచ్ఛాగీతం పాడుకోనివ్వు మనసంతా వసంతాన్ని నింపుకోనివ్వు
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు....
గతకాలపు జ్ఞాపకాలను నెమరువేసుకునే వేళ
వడలిపోయిన చైత్రశోభల దివ్యకాంతులు వెతుక్కునే వేళ
ఊహకం దని భవిష్యత్తుని గమ్మత్తుగా ఊహించుకోనివ్వు
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు....
నా నీడవైనా నీకు నమస్కరిస్తాను
నీ పాదాల మీద పడి నీకు మొక్కుతాను!