ఎదురు చూపులు చూడకు! - శారదా అశోకవర్ధన్
posted on Jan 13, 2012
ఎదురు చూపులు చూడకు!
- శారదా అశోకవర్ధన్
నీ కన్నీటికి ఎదుటి వారి మనసు
కరిగిపోతుందనుకోకు
నీ కష్టాలను చూసి వాళ్ళ గుండె
బద్దలయిపోతుందని అపోహపడకు
నువ్వు చస్తే ఈ ప్రపంచం ఆగిపోతుందనుకోకు
నీ కష్టం నీదే
నీ బాధ నీదే
నీ బతుకు నీదే!
కన్నీటిలో మునిగి జాలి పాట పాడకు
ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించాలని
ఎదురు చూపులు చూడకు
దగాపడిన దిగులు చెందకు
దీనంగా బతకకు
ఉత్తేజం నీవై ఉద్వేగం నీవై
ఉరిమే మేఘం నీవై మెరిసే మెరుపువు నీవై
నీ వ్యక్తిత్వానికి నువ్వే నాయకురాలివై
నీ శక్తికి నీవే మహారాణివై
స్వేచ్చ ఏ ఒక్కరి సొంతం కాదని
బతికే హక్కు అందరికీ వుందని
సబలవు నీవై సర్వము నీవై వ్యాపించు!
ప్రపంచానికి చాటించు!