కృష్ణాతరంగాలు - శారదా అశోకవర్ధన్
posted on Jan 13, 2012
కృష్ణాతరంగాలు
- శారదా అశోకవర్ధన్
పంచె గూడకట్టు,పైన అంగీ,
మెడపైన ఒకతుండు, ముచ్చటగనుండు
వెండితీగల జుట్టు గాలి కెగురుచునుండు
అతడే కృష్ణశాస్త్రి అమరకం!
పంచె ఖద్దరు అంచు ధగధగా మెరియ
పైన తెల్ల లాల్చి నిగనిగలాడ
మల్లెపువ్వుల్లాగా బోసినవ్వులు విరియు
అతడే కృష్ణశాస్త్రి అమరకం!
వామహస్తమున చిన్న పుస్తకము
దక్షిణమున నుండు నొక్క కలము
గళము లేదుగనుక ఆయుధాలీ రెండు
అతడే కృష్ణశాస్త్రి అమరకం!
గళమున్ననాడు గానమాతని సొత్తు
పలుకులకు పాటలకు అతడె మొనగాడు
పాడుజబ్బు వచ్చి గొంతు మూసిననేమి?
అతడే కృష్ణశాస్త్రి అమరకం!
పదములు చాలునని పట్టాభిరాముణ్ణి
శివుని పాదాల చెంత శిరసునుంచమని
పరమేశు ప్రార్ధించిన పరమభక్తుడు
అతడే కృష్ణశాస్త్రి అమరకం!
గీతాంజలి వ్రాశాడు - ప్రతి తెనుగు
గుండెలో గూడు కట్టుకున్నాడు
ఆంధ్ర టాగూరన్న ఆశ్చర్యమే లేదు
అతడె కృష్ణశాస్త్రి అమరకం!
మాట్లాడలేకున్నా, మనుషులు కావాలి
ముచ్చటగ అందరూ సభ తీర్చి ఉండాలి
అంతకంటె ముందు నతడు కోరడు ఎపుడు
అతడె కృష్ణశాస్త్రి అమరకం!
భోగిగా పుట్టాడు - భోగిగా పెరిగాడు
రాజలాంఛనాల రుచులు చూశాడు
అపర శ్రీనాధుడన్న అతిశయోక్తి కావు
అతడె కృష్ణశాస్త్రి అమరకం!
ముఖస్తుతి చెయ్యడు మెప్పుకోసం
ఎవ్వరినీ ప్రార్ధించడు ఏదో ఆశించి
మనిషైతే గౌరవించి ఆదరించడమే తెలుసు
అతడె కృష్ణశాస్త్రి అమరకం!
(1968లో కృష్ణశాస్త్రిగారి యింటికి వెళ్ళినప్పుడు తనమీద కవిత్వం చెప్పమంటే ఆయన సమక్షంలో రాసియిచ్చిన కంత)