కొలిమిలో కాలితేనే! - శారదా అశోకవర్ధన్
posted on Jan 12, 2012
కొలిమిలో కాలితేనే!
- శారదా అశోకవర్ధన్
వెన్నెల జలతారులను ఒంటినిండా కప్పుకుని
వేంచేసిన ఆకాశరాజు
వెండి దారాల కంబళ్ళు అల్లి
గుండె గుండెలో చలువ పందిళ్ళు వేసి కవ్వించినా
తనకీ తెలుసు తన క్షీణదశ మర్నాటి నుంచే ప్రారంభమని
అయినా వెన్నెల దీపాన్ని వెలిగించక మానడు నెలరేడు
ఎంత విశాల హృదయమతనిది?
క్షీణించినా సరే పిదప
ముందుగా రాణించాలానే తపన అది
మానవ జీవితాలలో క్షణమైనా తానే వెలుగై వ్యాపించి
తీయని గుర్తుగా మిగిలిపోవాలనే ఆరాటం అతనిది!
నిలిగగనంలో తెప్పల తేలిపోయే తెలిమబ్బులు
ఒక్కసారే నేలను స్పర్శించి
ఆమనీ అందాలను తిలకించి పులకించిపోవాలని
కాస్సేపయినా పుడమితల్లిని చల్లని తేమతో నింపెయ్యాలనే కోరిక
ధరణిని దర్శించగానే తన ఉనికే ఉండబోదన్న సత్యం
తెలిసిన సరే మబ్బులకెందుకో అంత ఉబలాటం
భువికి జలువారక మానవు
ఎంత ఉదార స్వభావం వాటికీ?
క్షణికమైన పృథ్వితో తమ మైత్రి నిలుపుకోవాలని ఆ పరుగుల పోరాటం!
మండు టెండలు మాడ్చేస్తున్నా
గ్రీష్మతాపం గొంతు తడినార్పేస్తున్నా
త్రాగడానికి గ్రుక్కెడు నీళ్లు లేక
గున్నమామిడి వాడి వదలిపోతున్నా
మేయడానికి మావిచిగురులు పసరులేక ఎండిపోతున్నా
కోయిలమ్మ వగరాకు ఎందుకే మురిసిపోతూ
గలసీమ దాటి గంధర్వలోకాలు మేలుకునేలా
రాగాలు వినిపించకమానదు
దానికెంత గొప్పబుద్ది?
మానవాళికి మనసారా తృప్తి పరచాలని!
మనిషి మాత్రం క్షణం క్షణం మారుతాడు
మాట తప్పుతాడు మమత చంపుకుంటాడు
తన స్వార్ధంకోసం మారణహోమానికైనా సిద్దపడతాడు
వెన్నెలకీ వసంతానికీ ఎంత తేడా!
త్యాగం వాటి లక్షణం
స్వార్ధం మానవుడి లక్షణం!
ఎన్ని మబ్బులు తొంగి చూసినా
ఎన్ని మబ్బులు వెండి బిళ్లల్లా భూమిపైకి దుమికినా
అన్ని రుచుల ఉగాది పచ్చడి
ఎంత వేదాంతాన్ని రంగరించి తినిపించినా
స్వార్ధాన్ని రుచి చూసి ధన పిపాసతో
దప్పిక తీర్చుకునే వ్యక్తికి
ఇవన్నీ శుష్కనినాదాలే!
మెట్ట వేదాంతాలే!!
ఎదురు దెబ్బలు తింటేనే ఎంత వారైనా మారేది
కొలిమిలో కాలితేనే ఇనుమైనా వంగేది