మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ
posted on Jan 15, 2012
మనసా! తెలుసా?
- వడ్డెపల్లి కృష్ణ
చీకు చింతలేని చిరుత వయసును దలువ
చిత్తమే పులకించు మనసా!
బ్రతుకులో బంగారు ప్రాయమ్ము బాల్యమ్ము
స్మృతులుగా పలికించు తెలుసా?
కన్న ప్రేమలు కడకు కన్నీళ్ళు సైతమ్ము
కల్తీల మయమాయె మనసా!
భ్రష్టలోకమ్ములో కల్తీల జగతిలో
బ్రతుకంటే దుర్లభం తెలుసా?
లక్షణముగా కన్యలున్ననూ మగజాతి
లక్షలను కోరేను మనసా!
వరుడు కట్నము పేర వధువు కమ్ముడు వోవు
వ్యాపార సరుకాయె తెలుసా?
బ్రాందీలు, విస్కీలు, సిగరెట్ల అలవాట్లు
కలవాడె మనిషియట మనసా!
ఎల్లవేళల వాటి బానిసై బ్రతికితే
ఇల్లు గుల్లయ్యేను తెలుసా?
నిప్పులాంటిది అప్పు, అందుకే అది ముప్పు
నిజమెరిగి మసలుకో మనసా!
అప్పులెన్నో చేసి గొప్పకు పోతె
చిప్పలే చివరిగతి తెలుసా?