నిశితో యుద్ధం

  చీకటికీ, నాకుా యుద్ధమై అలకపానుపునాశ్రయించినపుడు నా వీపుకు పిల్లతెమ్మెరలా తగులుతుందో జ్ఞాపకం గుండెలు పిండేస్తుా లావాలా కనులలోయల్లోంచి ఉబికివస్తున్న కన్నీటి మంటలను దిండు ఆర్పుతుా నాలుగు గోడల నడుమ ముాడో కన్ను చుాడకుండా మది బాధను తేలికపరచిన ఆ నిశిరాత్రికి మనసు మార్చుకొని ధన్యవాదాలు తెలిపేలోపే నా నుంచి విడిపోయి ఉషోదయపు వెలుతురులో కలిసి దొంగలా పారిపోయి నల్లటి ముసుగుతో సాయంత్రం నన్ను ఓదార్చాలని తిరిగి నా చెంత చేరిన నిశితో ఆ రాత్రి మళ్ళీ నాకు యుద్ధమే ... కన్నీరొలికించే ఆ చేదు నిజాలను తలుచుకొని మది బరువు దింపుకోవటానికి ఆ నిశితో ప్రతీరాత్రి పోరాటం చేయటం తప్ప జీవితపు డైరీలో పేజీలు వెనక్కి తిప్పి ఆ విషాదాన్ని చెరిపివేసే అవకాశం లేదట మరి.... --- సరిత భుాపతి

చిన్న చిన్న మాటలే....

  చిన్న చిన్న మాటలే....   ఎన్నో మాటలు చెప్పలనుకుంటాను చాలాసార్లు కానీ ఏమీ చెప్పలేకపోతాను. కూర మాడి, రుచిపోయిందని నువు మొహం మాడ్చుకున్నపుడు అరగంట స్టవ్ దగ్గరే ఎందుకు నిలబడలేకపోయానో, కూర కన్నా ఎక్కువ మాడిన నీ మొహం చూసాకా, చెప్పలేక పోతాను. నాతో కలుపుకొని, అత్త మామలతో సహా ఇంట్లో ఎవరు మంచం పట్టినా సెలవుపెట్టాకా, పిల్లవాడికి జ్వరం వస్తే, ఈసారి రెండ్రోజులు నువు సెలవు పెడతావా అని నేనడిగేలోపే, వెంటనే బాస్ కి ఫొన్ చేసి నాల్గు రోజులు రానని చెప్పేయని నువు తిరుగులేని ఆర్డర్ వేసినప్పుడూ ఏదో చెప్పాలనుకుంటాను. నాతో షాపింగ్ కి వచ్చినపుడు నేనేరుకున్న చీరల్లో, నాకేది నప్పుతుందో చెప్తావని నీకోసం చూస్తుంటే నువు దూరంగా ఫోన్ మాట్లాడుకుంటూ, ఇంకెంత సేపు చేస్తావని చిరాకుగా చూసినప్పుడు నీతో ఏమీ చెప్పలేకపోతాను. ఒంట్లో నలతగా ఉండి రాత్రంతా నిద్రపట్టక లేటుగా లేచాకా, సమయం చాలక నిన్ను సహాయం అడిగేలోపు, 'నీకు బద్ధకం పెరుగుతోందీమధ్య....' అన్న నీ మాటలు, చురకల్లా తగిలినప్పుడు మౌనంగానే ఉండిపోతాను. అనుకోకుండా వచ్చిన సెలవురోజున కంప్లీట్ గా రిలాక్స్ అవుదామనుకున్నాకా అనెక్స్పెక్టెడ్ గా వచ్చిన గెస్ట్స్ ని నువు భోజనానికి ఉండమని బతిమాలుతున్నపుడు, నా మౌనంలోని నిస్సహాయత నీక్కనపడనప్పుడూ నేనేమీ చెప్పలేక పోతాను. బాధ్యత గల ఉద్యోగినిగా, "లేడీస్ జాబ్" అనే చులకన టాగ్ ని తట్టుకోలేని నేను, నన్ను ప్రూవ్ చేస్కోడానికి ఇద్దరి ముగ్గురి పని చేస్తే అందులో కనపడని ఔచిత్యం, పనితనం రకరకాల కుంటిసాకులతో పనెగ్గొట్టడంలో నేర్పరులైన ఆడవాళ్ళలో నీక్కనిపించి వాళ్ళని పొగుడుతున్నపుడూ నే చెప్పాలనుకున్నది నీకు చెప్పలేను. ఆఫీస్ లో నా పనిని బాస్ పదిమందిలో మెచ్చుకుంటే ఆ సంతోషం నీతో పంచుకోవాలనుకున్నపుడు నువు నీ లేడీ కొలీగ్స్ చీరల సెలక్షన్నో ఆఫీస్ లో అందరికోసం వండి పట్టుకొచ్చిన వాళ్ళ ఓపికల్నో మెచ్చుకుంటున్నపుడు కూడా ఎంతో చెప్పాలనుకుంటాను. అలసిన శరీరంతో, తిండి కన్నా కూడా నిద్రకోసం తపిస్తూ మంచమ్మీద వాలినప్పుడు, నా శరీరం మీద పాకే నీ స్పర్శ లోని కాంక్ష బలాన్ని గ్రహించినా, నా మనసు మొరాయిస్తుంటే, రొమాన్సంటే బై డీఫాల్ట్ పక్క ఎక్కగానే జరిగే రొటీన్ ఏక్షన్ కాదని చెప్పాలనిపించినా చెప్పలేకపోతాను. కొన్ని మాటలకెప్పుడూ ఇంటెండెడ్ మీనింగ్స్ వేరే ఉంటాయి ఎటువంటి మాటలూ, అర్ధాలూ దూరని జఢపదార్ధాలూ ఉంటాయి చెప్పుకున్న మాటల్లో ఆడవారికి అర్ధం అయిన విషయాల వల్లనో, ఆడవాళ్ళు చెప్పని మాటల అర్ధాలు, అపార్ధాలూ లేక పోవడం వల్లనో, సంసారాలు సాఫీగానే నడుస్తూన్నట్లు ఉంటాయేమో..... వివాహబంధమనే ఈ ఇంట్లో మూసుకున్న ద్వారం తప్ప కిటికీలుండవు...... అందుకే ఏది ఎలా ఉన్నా, ఇక్కడ ఎక్కడకక్కడ ఫుల్ స్టాప్ లే ఉంటాయి. ............ శారద శివపురపు

జీవితం విలువ

    ఏకాకిలా వచ్చాను.. లక్ష కుసుమార్చన కోసం పూలు ఏరుతున్నట్టు త్వరత్వరగా కొన్ని ఆనందాల్ని ఏరి మూటగట్టుకోవాలనుకుంటాను ఆ తొందరలో కొన్ని పూలు నలిగిపోయినట్టు అన్ని ఆనందాల్నేగాక కొన్ని దు:ఖాల్ని కూడా మూటగట్టుకుంటాను గమ్యం కోసం పయనిస్తూ ఉంటాను... ఎదురుపడిన కొందరు ఆత్మీయులను చీమల బారులా నాతో పాటు కలుపుకుంటాను.. నా త్రోవలో నాతో పాటే నడిచే బంధాలు కొన్ని ... మధ్యలో వేరే చీమల బారులో కలిసిపోయే బంధాలు కొన్ని.. చెట్టులా కొన్ని భాద్యతలు నెత్తిన వేసుకుంటాను... పూలు విరబూసి గమ్యం చేరుకునే విజయాలు కొన్ని... నేను మోయలేక ఎండి రాలిపోయే పుష్పాలు (భాద్యతలు) కొన్ని ... నేను సాయం చేస్తే నీరు పోసి పెంచిన మొక్కలా తిరిగి ఆక్సిజన్ ఇచ్చి ఋణం తీర్చుకునేలా ఉండే బంధాలు కొన్ని... యూస్ అండ్ త్రో వస్తువులా వాడి విదిలించుకునే బంధాలు కొన్ని ... కానీ నేనేమీ ఉపయోగపడనని తెలిసినపుడు చివరగా కాయాన్ని మోయాలని ఉబలాటపడే ఆ నలుగురే ఇన్ని ఏళ్ళు నేను ఎంత కీర్తిని సంపాదించాను అనే దానికి నిదర్శనం .... పుట్టినపుడు ఏకాకినే పోయేటపుడు ఏకాకినే మద్యలో నేను అల్లుకున్న పూల పొదరిల్లు ఎంతగా పరిమళిస్తుందో ఎదుటి వారి హృదయాలను దోచుకుంటుందో అదే నేను సద్వినియోగపరచుకున్న నా జీవితపు విలువ ....... - సరిత భూపతి

కొన్ని జీవితాలు

  రోడ్లపై రోజంతా పచార్లు చేస్తూ నేను స్వేఛ్చాజీవినని చెప్పుకుంటూ అందని ఆకాశానికి అర్రులు చాపుతుంటాం... అరుగు మీద పడుకొని మరునాడు పొద్దులో కలిసిపోయే పండు వెన్నెలను చూస్తూ తెగ సంబరపడిపోతుంటాం... నూతిలో కప్పలా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటుంటాం పై నుంచి పడే రాయిని గుర్తించం... చేతగానితనాన్నే కంఫర్ట్ జోన్ అనుకునే పిచ్చి నమ్మకాల్లో చితికిపోతూ ... నిండు సముద్రంలో మునిగిపోతూ ఆఖరి సెకను వరకు ఎవరైనా కాపాడకపోతారా అని ఎదురుచూస్తుంటాం... అర్థంలేని ఆశావాదం లో కొట్టుకుపోతూ.... అనవసర భావాలకు రూపాన్నిస్తూ ఆత్మవంచన చేసుకుంటుంటాం.. నేనింతే అని గొప్పగా చెప్పుకుంటుంటాం.. దానికి మెటీరియలిసమ్ అని గుర్తింపు కుడా ఇస్తాం... ఇంకెన్ని ఆశలను నమ్ముకుంటే.. ఇంకెంత ఆత్మలను అమ్ముకుంటే ... మనం అనుకుంటున్న మెటీరియలిస్టిక్ లైఫ్ కి సార్థకత వస్తుందో... ప్చ్   ..... సరిత భుాపతి

పరిష్కారం

కొల్లూర్ గ్రామం, గుంటూర్ జిల్లానుంచి ఇద్దరు ప్రేమికులు పెళ్ళి చేసుకుందామన్న ఉద్దేశ్యంతో వేమూరు వచ్చారు. అయితే అక్కడ ఆ యువతి సామూహిక అత్యాచారానికి గురయ్యింది మొన్న శనివారం. కానీ ఆమెను ప్రేమించిన యువకుడు రాజేశ్ మాత్రం ఆమెను మరుసటి రోజే పెద్దలందరి అనుమతి, ఒప్పుదలతో ఆమెను వివాహమాడాడు. ఈ వార్త చదివిన తరవాత చాలా సంతోషం వేసింది. ప్రేమించినవాడు పారిపోయి, మానభంగం చేసిన వాడికే కట్టబెట్టి సమస్య పరిష్కరించామని చేతులు దులుపుకునే సమాజానికి, మానభంగం చేసి మగతనపు కుతి తీర్చుకునే దుశ్శాశనులకీ చెంపదెబ్బ, చెప్పుదెబ్బ లాంటి గుణపాఠం. ఈరోజు పేపర్లోని ఈ వార్తకి స్పందనగా రాసిన కవిత. వారిద్దరి ప్రేమా చివరివరకూ నిలవాలని ఆశిస్తూ. పరిష్కారం అంగ స్తంభనలే కానీ అంతరంగ శోధన లేని క్షణిక కామోద్రేకాలే కానీ శాశ్వత ప్రేమోద్దేశ్యాలు లేని మర్మావయాల మోజులే కాని జన్మస్థానాల జ్ఞాపకాలు లేని సకిలింపుల ఇకిలింపులే కానీ ప్రేమ ప్రకటనల చిర్నవ్వులెరుగని గార్దభాల స్వైరవిహారంలో అసలు మగతనమంటే సిసలు మృగతనమనే మగాళ్ళ వల్ల మృదుభాషిణుల మార్దవాలు నలిగితే గుండె కుండాల్సిన గుణానికీ, గుప్తాంగాల శోషణకీ, కన్నెరికపు పవిత్రతకూ, కామోన్మాది ధూర్తత్వానికీ, లంకె వేసి, శీలమన్న పేరుతో బ్రతుకు హరించి జాలి నటించే సంఘానికీ, అన్యాయాన్ని అక్కున చేర్చుకుని, న్యాయాన్ని క్యూలో నిల్చోపెట్టే రక్షణ వ్యవస్థ నిర్వీర్యానికీ, వారధి కడుతూ నువు చెప్పిన తీర్పు సామూహిక మానభంగమయిన మరురోజే ప్రియురాలికి పరిణయమనే పరిష్కారం..... శిధిలమైపోబోయే చిరు బ్రతుకుని, శిలువ వేసిన యవ్వనాన్ని, ఆరిపోబోయే చిన్ని దీపాన్ని, ఆర్తిగా రెండు చేతులడ్డుపెట్టి, తిరిగి వెలిగించిన నీవు, నిలువునా దహించబడిన చిన్ని మొక్కకు ప్రేమనే నీరు పంచి మూడుముళ్ళ బంధంతో నిలబెట్టిన నీవు, శీలమన్నది హృదయానికి చెందినదని శరీరానికది అందనిదని నిరూపించిన నీవు నిజమైన మగాడివయ్యా నీవు రాజువయ్యా, రాజేశువయ్యా. - శారద శివపురపు

మావ...!

మావ...! మొన్న పొద్దున్న సంతకెల్లి  ... ఎర్రగాజులు తెచ్చి మావ మెత్తగ సేతులకేసినాడు ... మత్తుగ చూసుకుంట...మావ.. నిన్న మద్యాన్నం ... గండమ్మ దుకాన్ల జూకాలు , ముక్కుపుడక కొనిపెట్టి ... చంద్ర బింబమల్లె ఉన్నవన్నాడు...మావ... సంజెకాడ... కాలిపట్టీలు పట్టుకొచ్చి .. పాదాలట్టుకు పలికినాడు మావ .. మనువాడతాను ఒట్టని... రేయి గడిచి పాయె... ఊరు నిదుర లేచె... నిశిలోన... గుసగుసల ముచ్చట్లు.. మసకబారి ఎదబరువాయె..మావ.. ఏటిలోని పారుతున్న నీటిలాగ .. నీ మాటలు జారిపోయె.. తడియారుతున్న బట్టలబిగువులు ... గుబులు నింపి గుండె కోతకోస్తుండే..మావ.. మావా..! ఎన్ని జన్మలెత్తినా .. ఎదురు చూపుల ...ఈ ఎంకి నీదే... విరహించినా ..వలపించినా... నాయుడు బావ .. ఎప్పటికి ఎంకి కోసమే.. కదా..మావ..! +++++++++++++++                                                                                                      సుజాత తిమ్మన...