చందమామ రావే (కవిత)

  // చందమామ రావే // ఏం చెప్పను? ఏమీలేదు అనటం వెనక ఎంతుందో అంతుంది నీ గురించి చెప్పటానికి అమ్మ అబద్ధం కూడా ఎంత తీయగా ఉంటుందో గోరుముద్దల లాలిత్యానికి మురుస్తున్నపుడు నాపై జెలసీతో ఆ అబద్ధం నిజం చేద్దామన్నట్టుగా అమ్మ కళ్ళలో మెరిసిన నీ వెన్నెలను చూడటం ఆనాడు ఒక అద్భుతమే నాకు. కొండెక్కి రావే గోగుపూలు తేవే పాటల్లో నిజంగానే కొండలన్నీ ఎక్కినట్టు వచ్చే మిత్రుని కోసం చూస్తూ గోగుపూలంటి నక్షత్రాల్లో పరవశిస్తూ మేఘాల్లో దాగుడుమూతలాడుతుంటే నీతోపాటు పరిగెత్తటం ఎంత అందమైన జ్ఞాపకమో. అమావాస్య తరువాత నువ్వు కనిపించినపుడు "అన్నం తినకపోతే నిన్ను బూచాడు పట్టుకెళ్ళాడు చూసావా?" అని నీతో మాట్లాడిన ఆ అమాయకత్వపు గర్వం మాటలు నిన్ను చూసినప్పుడల్లా చెవిలో మారుమ్రోగుతుంటే అమ్మ జోలపాట విన్నంత హాయి వెన్నెల అంటేనే ఓ అందమైన అనుభూతి ఎన్నెన్ని మధురస్మృతులో నీతో ఈ యాంత్రిక జీవనంలో నిన్ను చూడకుండా ఎన్నిరాత్రులు గడుస్తున్నాయో తెలుస్తూనే ఉంది అందుకే ఓసారి గత జ్ఞాపకాల్లోకి వెళ్దాం చందమామ రావే ! జాబిల్లి రావే !!   ....... సరిత భూపతి

నెహ్రు గారి వీలునామా

  నెహ్రు గారి  వీలునామా (చాచా నెహ్రు జన్మ దిన సందర్భంగా) (నెహ్రు తానూ చని పోతూ గూడా తాను వ్రాసిన విల్లులో తన దేశ భక్తిని చాటు కోవటం ఎంత విశేషం )    అహో ! మిత్రులారా ! నా భరత పుత్రులారా ! ఎన్నలేను మీ దేశ సేవలను ఎంతని కొనియాడుడును ? మీ దేశ భక్తి  మీఈ అనురక్తి మేలిమియైనది అమూల్యమైనది ఎంత ఘనమైనదో వివరింపగ విరించి తరమా ? నేనెంత వాడను !....అహో..   రే బవలును నా వెనుక నిలిచితిరే ! కలతల బడ నా మనసు నెరిగితిరే ఆపదలందున ఆదుకొంటిరే! మీ బాసటదే నా కూపిరులై జీవించితినీ సేవించితిని మీ రందిచిన  ప్రేమామృతమును పరవశించి నే త్రాగితిని ఎంత ఘనమైనదో వివరింపగ నా తరమా ? నా మది కనుభవము!..అహో..   బ్రతుకుండు వరకు  భరతమాతకే అంకిత మౌననె నా బ్రతుకు నే బ్రతికినను మీ సేవలకే నే చితికినను మీకొరకే నోయి ! బ్రతుకు బండలై పోయిననాడు చితినే చేర్చగ రారండోయి! చితి ఆరిన మరునాటి కర్మలే చేయవలదోయి ! క్షమింపుడోయి ! చితి మిగిలిన నా చితా భస్మమును ఒక పిడికెడు గంగను కలపండోయి! గంగానది  అది పుణ్య మహానది రంగైనది భారత జీవనది నాటినుండి నేటి వరకు నున్నది! కాలమంత ప్రవాహించుచుండు నది కాల గమనమూ యీ కలి గమనము ఆపలేనిది పుణ్య ప్రవాహము !...అహో..   ఇకను మిగిలిన చితాభస్మమును నింగి నుండి వేద జల్లండోయి! రైతులు హలాల పొలాల దున్నగ బ్రతుకు పంటలెటపండేనోయి ! భూమాత యొడిని యొదుగు ధూళిగా భారతమ్మ నొడి నొదిగి పోదునోయి! బ్రతుకు పంట పండించిన మన్నిది భారత భూమిని నిదుర పోదునోయి! కలిసి పోదునోయి !...అహో... నెహ్రు గారి విల్లు ఆధారంగా వ్రాసినది . రచన: నల్లన్ చక్రవర్తుల వేంకటరంగనాథ్ .

ఒక దీపం వెలిగించు (దీపావళి స్పెషల్)

  ఒక దీపం వెలిగించు    దీపం వెలిగించు –ఒక దీపం వెలిగించు! ఎదనే ప్రమిదగ చేసీ మమతల తైలము  పోసీ  శాంతి అహింసల వత్తుల వేసీ  దీపం వెలిగించు – ఒక దీపం వెలిగించు !   నాదం పలికించు- ఒక నాదం పలికించు ! తనువును మురళిగ చేసీ శ్వాసను ఊపిరి పోసీ జీవన ప్రణవము పూరించీ నాదం పలికించు-ఒక నాదం పలికి కించు!   భావం పలికించు-ఒక భావం పాలికించు ! చిరు యెదనే కదలించీ భావ కడలుల మధించీ సమతల మమతల నిలలో పెంచీ భావం పలికించు-ఒక భావం పలికించు !   యోగం సాధించు –ఒక యోగం సాధించు! మనసును కోవెల చేసీ పలుకుల తేనెల జిలికీ చేతల నితరుల సాంత్వన పరచే యోగం సాధించు –ఒక యోగం సాధించు !   శ్వేదం ఒలికించు – నీ శ్వేదం ఒలికించు! పరులను యోచన మానీ ఇతరుల యెదను రవళించే విశ్వ మానవ  సౌభ్రాతృ  భావనను మురళి రవళి మ్రోగించు –మధు మురళి రవళి మ్రోగించు –నీ శ్వేదాన్నే ఒలికించు !   రచన :- నల్లాన్ చక్రవర్తుల  వేంకట రంగనాథ్

గుప్పెడు మనసు (కవిత)

గుప్పెడు మనసు   చినుకు రాలితే చిగురించిన ఆకుల్లా మనసు తడికి హృదయమెుకటి కొత్తగా మెులుస్తుంటుంది ఆవేదనొచ్చినపుడల్లా అత్తిపత్తిలా ముడుచుకుపోతుంటుంది మౌనంతోనే అనుక్షణం సంగమిస్తూ నిరంతరం తలపులతో పురుడు పోసుకుంటూనే ఉంటుంది పేరుకు గుప్పెడు మాంసపు ముద్దైనా అంతులేని కలలు .. కల్లలైన ఆ కలల కోసం కళ్ళలో జలపాతాలు .. కొన్నిసార్లు ఎగిసి ఎగిసిపడుతున్న ఆశల కెరటాలను మోస్తూ తీరం చేరని అలల ఆశయాల కోసం ఆ గుప్పెడే సాగరమంతవుతుంటుంది కొన్ని ఆటుపోట్లు కుదించివేస్తుంటే కొన్ని మౌనాలు కలిచివేస్తుంటే నాకు నేనే అంతుపట్టనంత శూన్యమవుతుంటుంది       ---- సరిత భూపతి

స్వప్నలోకం! (కవిత)

స్వప్నలోకం!   కనురెప్పలు భారంగా మూసుకున్నాయి, పెనుచీకటిలో భాగంగా కలిసిపోయాను. కనుపాపలు కాసేపు కలతగా కదలాడి, కలల లోకానికింక పయనమయ్యాయి.   కలలంటే అవి కలలు కావు… ప్రతి కలా ఓ ప్రతీకే! కష్టమేదో వీడినట్టు, కోరీకేదో తీరినట్టు, భయాన్ని జయిచినట్టు, అభయమేదో పొందినట్టు… తలపులన్నీ అలా తనువు దాల్చాయి. గుర్తుండాలే కానీ ప్రతి కలా ఓ కావ్యమే! ప్రతి ఒక్కరం కాళిదాసంతటి వారమే!   కల-కాలం మధురమైన కలలా సాగాలని, అనుకుంటూ ఉండగానే మెలకువ వచ్చేసింది. కళ్లు నులుముకుని చూస్తే ఎదురుగ ఉందేమిటి? వీడని కష్టాలు, తీరని కోరికలు, వెంటాడే భయాలు, దక్కని అభయాలు, నా తనువులో భాగమైన కఠిన వాస్తవాలు! తల్చుకుంటేనే చాలు… కలలు చూపిన కళ్ల నుంచే కన్నీరు రాలు. - నిర్జర.

అలుపెరుగని పిచ్చి మనసు (కవిత)

  అలుపెరుగని పిచ్చి మనసు రాత్రి వెన్నెలల నవ్వుల్లోకి చూస్తూ మౌనంగా చీకటితోపాటు కరిగిపోతూ నేను.. నిశిరాకాసి నిశ్శబ్ధంలో చేస్తున్న భయంకర శబ్ధాన్ని పట్టనట్టు కర్టెన్ సందుల్లోంచి వచ్చే గాలిని జోలపాటగా ఆస్వాదించి నిదరోతూ నువ్వు.. ఆ రాత్రంటే నీకు కళ్ళు మూసి తెరచేంతలో జరిగిన ఒక ఆరేడు గంటల సుషుప్తావస్థేనేమో.. కానీ నాకు కన్నీటిని కావ్యాలుగా ఒంపుకున్న మౌనాల్లో నిండిన అనిర్వచిత క్షణాలు.. ఆ రాత్రంటే ఎప్పటికీ తడి ఆరని గాథలను గుండె దండంపై విఫలయత్నంగా ఆరేస్తూ పొద్దునకల్లా పచ్చివాసనేసే భావాలను కళ్ళల్లోనే కుక్కుకొని మరిన్ని కొత్త ఆశలను, దిగుళ్ళనూ నింపుకుంటూ మరో రాత్రి కోసం సిద్ధపడే ఓ అలుపెరుగని పిచ్చి మనసు         ...సరిత భూపతి

బీ యూ (కవిత)

  బీ యూ   తెల్లకాగితం మీద ఇంకుచుక్కలా పరిపూర్ణత కోసం పరితపిస్తూ ఎన్నో ఆశల్ని లిఖిస్తూ పెన్నులో ఆఖరి చుక్కలా విలవిల్లాడినా వెంటవచ్చే ఆనందాలేమీ ఉండవు ఒక 'నా' అనుకునే వారి గుండెల్లో గురుతులై మిగిలిపోతాయేమో కాపుచినో నురగల్లా ఊదేంత వరకే వేడి సెగల అందం కానీ నువ్వు ఆ కప్పు కాఫీని ఎంతగా ఆస్వాదిస్తే ఆ రుచి అంతగా మనసులో చెరిగిపోని ముద్రవుతుంది జీవితముా అంతే.. ఏదీ ఆస్వాదించలేకపోతే ఊదిబత్తి ఊదేస్తే పొగ గాలిలో కలిసినట్టు నిస్సత్తువగా నిర్జీవి అయిపోవటం తప్ప నీకంటూ చెప్పుకోవటానికి ఏమీ మిగలవు చీర చెరగులో దాచిన కన్నీటిమంటలు నిన్నే దహించివేస్తాయేమో ఆ వేదనకు కారణమైన వారి కోసం ఓసారి హనుమంతుని తోకవవ్వు నువ్వు పాలల్లో కలిసిపోవటానికి పంచధారవైనా, ఉప్పైనా, పెరుగువైనా నీ అస్థిత్వం కోల్పోయానని బాధపడక నీకంటూ ఓ ప్రత్యేకత ఉందని గమనించు బతకాలంటే నటించాలేమో కానీ ఆనందంగా బతకాలంటే ?? నువ్వు నువ్వుగా బతకాలి         ...సరిత భూపతి