గ్రామీణ జీవితాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న వరలక్ష్మి

  గ్రామీణ జీవితాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న వరలక్ష్మి          తెలుగు కథా రచయిత్రుల్లో కె. వరలక్ష్మి స్థానం విశిష్ఠమైంది. కేవలం ఉన్నతవర్గాలు, కులాలకు చెందిన స్త్రీ జీవితాలనే కాకుండా బిసి, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన స్త్రీల జీవితాలను అత్యంత సహజంగా రాశారు. గ్రామీణ జీవితాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న వరలక్ష్మి తన రచనల్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం స్త్రీని స్త్రీ కోణం నుంచి కాకుండా సమాజం దృష్టితో చూడడం ఈమె రచనల్లోని ప్రత్యేకత. మారుతున్న సామాజిక పరిణామాల్లోని వ్యక్తుల, కౌటంబిక జీవనం, వృత్తులపై ఆధారపడిన వారి జీవన సరళిని సూక్ష్మ దృష్టితో పట్టుకొని రచనలో అందిస్తున్నారు వరలక్ష్మి. వ్యక్తి ఒంటరై పోతున్న నేటి తరుణంలో వారి జీవన సంవేదనల్ని, ఘర్షణల్ని వివరిస్తున్నారు కథల ద్వారా.      కె. వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 1946 అక్టోబరు 24న జన్మించారు. మొదటి కథను ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే రాశారు. రంగనాయకమ్మ వంటి స్త్రీవాద రచయిత్రుల రచనల్ని చదువుతూ తనదైన దృక్పధాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటి వరకు సుమారు వందకు పైగా కథలు రాశారు. నాలుగు నవలికలు రాశారు. కవితలు, వ్యాసాలు కూడా రాశారు. అంతేకాదు కొన్ని నాటికలు కూడా రచించారు. 1985 నుంచి కథలు రాస్తున్నారు. ముద్రితమైన వీరి మొదటి కథ "రిక్షా". ఈ కథ జ్యోతి మాసపత్రికలో ముద్రితమైంది. ఇంటర్య్వూ, ఆశాజీవులు, ఆనకట్ట, ఆగమనం, ఆకస్మికం, కుక్క కరిచింది, గండుచీమలు, క్షతగాత్ర, ఎవరి హోప్ లెస్ ఫెలో, ఏ గూటి చిలుక, చెవిలో పువ్వు, గమనం, గుప్తం, ఛిద్రం, స్పర్పపరిష్వంగం, సంధ్యాసమస్యలు, సమానత్వం వంటి ఎన్నో కథలు వీరి ఇతివృత్తాన్ని నేపథ్యాన్ని, శిల్ప చతురతను పట్టిస్తాయి.       వీరి కథలు జీవనరాగం, మట్టి - బంగారం, అతడు - నేను సంపుటాలుగా వచ్చాయి. వీటిలో మొత్తం 47 కథలు ఉన్నాయి. ఇంకా "ఆమె" పేరిట కవితా సంపుటిని కూడా వెలువరించింది. "విహంగం" అనే అంతర్జాల పత్రికలో "నా జీవనయానం" పేరుతో ఆత్మకథను రాశారు."అతుడు - నేను" కథలో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీని భర్త, అత్త ఎంతో వేధిస్తారు. కానీ భర్తకు పక్షవాతం, అత్తకు వయసు వచ్చి మంచాన పడ్డప్పుడు ఓపికతో ఆమె సేవలు చేస్తుంది. చేస్తూ స్నేహితురాలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ- జీవించడానికి ముఖ్య లక్షణం ప్రేమ, ఇతరులను జీవింపజేయడానికి కావల్సింది ముఖ్య లక్షణం మనుషుల మీద నమ్మకం, జాలి, దయ, ప్రేమ. ప్రపంచాన్ని, మనుషుల్ని ప్రేమించలేని స్థితి విషాదకరమైంది అని చెప్తుంది. ఇది కేవలం కథలోనే కాదు. ప్రతి మనిషి తెలుసుకోవలసిన జీవన సూత్రం. అలానే "పక్షులు" కథలో భార్యా భర్తలు విడిపోయేటప్పుడు కొడుకు తండ్రి దగ్గరే ఉంటాను అంటాడు. 15 ఏళ్లు పెంచిన తల్లిని కాదని తండ్రి దగ్గరకు వెళ్లడానికి గల కారణం అతని దగ్గర డబ్బు ఉండడమే. అప్పుడు ఆ తల్లి పడే వేదనను ఈ కథ సహజంగా వర్ణిస్తుంది. మరో కథ "గండుచీమలు". ఈ కథలో మధ్యతరగతి రైతు సొంత ఇంటిని కూడా అమ్మి కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తాడు. అతనికి పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత, ఊళ్లో ఇల్లు కట్టాలనుకొని తండ్రికి డబ్బు ఇచ్చి, ఆబాధ్యతను అప్పజెప్తాడు. తండ్రి చాలా ప్రేమగా, కష్టపడి ఇంటిని కట్టిస్తాడు. కానీ చివరకు ఆ ఇళ్లు గుత్తేదారుకు అద్దెకు ఇవ్వడానికి అని తెలుస్తుంది. ఇలా మానవ సంబంధాల్లో వచ్చిన ఆర్థిక మార్పును మానవీయ కోణంలో చెప్తాయి వీరి కథలు.        "మట్టి- బంగారం" కథలో గొల్లల అయోద్ది రాముడు గొర్రెల పెంచుతుంటాడు. కానీ ఆ గొర్రెలను అమ్మి పెంకులు తయారు చేసే మిల్లులో వాటా దారునిగా చేరతాడు. చివరకు దివాలా తీస్తాడు. కానీ ముసల్ది ముందే ఓ జీవన సత్యాన్ని చెప్తుంది- ఎవడన్నా పేణం ఉన్న జీవాలమ్ముకొని పేణం లేని మిల్లు కొనుక్కుంటాడ్రా.. అని. మొత్తంమీద వరలక్ష్మి కథలు సగటు స్త్రీ జీవన సంవేదనల్ని, కుటుంబ సామాజిక హింసల కలగాపులగాల మధ్య నలుగుతున్న స్త్రీల బాధల్ని వివరిస్తాయి. ఎరుకలు, చాకలి, గొల్ల, మేదర, తప్పెటగుళఅలు, భోగం, కోయ, గిరిజన కులాల స్త్రీల జీవితాల లోతులను పట్టిస్తాయి. తరచి చూపిస్తాయి. అసలు ఈమె కథలు పల్లె వాతావరణంలోని స్త్రీల ఆర్థిక, మానసిక స్థితుల నుంచే పుట్టాయి. తనకు తెలిసిన, చూసిన, అనుభవించిన సంఘటనలు, సన్నివేశాల నుంచే కథా వస్తువును ఎన్నుకుంటారు వరలక్ష్మి. స్త్రీల అణచివేత, దౌష్ట్రీకానికి బలవడం, ఎదురు తిరగలేని నిస్సహాయత వీరి కథల్లో బలంగా కనిపిస్తుంది.       కె. వరలక్ష్మి కథా శిల్పం విషయానికి వస్తే కథ రాసినట్లు కాకుండా చెప్తున్నట్లు ఉంటుంది. కథ ఎత్తుగడకు, ముగింపుకు సంబంధం ఉంటుంది. వీరి శైలి గోదావరి జిల్లాల్లోని బడుగల జీవన నిరలంకార సౌందర్యంతో ఉంటుంది. వీరికి ఎన్నో అవార్డులు వచ్చాయి. చాసో పురస్కారం, రంజనీ అవార్డు, ఆటా తానా పురస్కారాలు, అభో విజా, రంగవల్లి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, 2014లో సుశీలా నారాయణరెడ్డి అవార్డు వచ్చాయి. "పల్లెటూళ్లో చెరువుకెళ్లి చిన్నబిందెతో మంచి నీళ్లు తెచ్చుకునే ఒకమ్మాయి, ఈ లోకంలో కథా రచయితగా నిలదొక్కుకునేలా చేసిన సాహిత్యానికి నేనెప్పుడూ తలవంచి నమస్కరిస్తాను" అని వినమ్రంగా చెప్తారు కె.వరలక్ష్మి    .....డా. ఎ.రవీంద్రబాబు

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రాసుందరి దేవి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రాసుందరి దేవి రాసుందరి దేవి బెంగాల్లో కోల్కట్టా కి దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుడుతుంది. తండ్రి చిన్నప్పుడే చనిపోతే, తల్లి, బంధువులు ఆమెను పెంచుతారు. తన తండ్రి ఇంట్లో ఒక మిషనరీ స్త్రీ అబ్బాయిలకి మాత్రమే ఒక చిన్న స్కూల్ నడిపేదీ. రాసుందరీకి చదువు చాలా ఇష్టం కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోకూడదు. అందుకని దొంగతనంగా ఆ పక్కనా ఈ పక్కనా దాక్కుని వింటూండేదట. ఇది ఇలా జరుగుతుండగా పన్నెండేళ్ళ వయసులో ఆమెకి పెళ్ళి చేస్తారు. అప్పట్లో పెళ్ళీడు అదే. ఎందుకు వెళుతోందో, ఎక్కడికి వెళుతోందో కూడా తెలియకుండా కొత్త మనుషులందరితో కలిసి పడవలో పెళ్ళికూతురి బట్టల్లో భర్త ఉండే చోటకి వెళ్ళాల్సినపుడు ఏడుస్తుంటే, తల్లి దేముడెప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నువ్వెప్పుడూ ఒక్కదానివి కాదు చెబుతుంది. అది మొదలు దేముడిపై ఆమె విశ్వాశం చాలా పెరిగిపోతుంది. దేముడు ఎప్పుడూ తనతో ఉన్నాడన్న విశ్వాశం ఆమె తన రచనలో ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటుంది. అమర్ జీబన్ అనే ఆమె ఆత్మ కధ ఆమె చిన్నతనమ్నుంచి ఆమె కధని చివరి వరకూ రాసుకొస్తుంది. ఇది ఆమె చేసిన ఒకే ఒక్క రచన. ఈ ఒక్క రచన వల్ల ఆమె ఎందుకు ఇంత పేరు తెచ్చుకుంది అనేది, అది రాయటానికి ఆమె ఎంత కష్టపడిందీ, ఎన్ని అడ్డంకులు సమాజపరంగా ఎదుర్కొంది, అసలు ఆనాటి సమాజం ఏతీరులో ఉంది, అందులో ఆడవారి పర్తిస్తితి ఏంటి అనే విషయాల వల్ల కానీ మనకి అర్ధమవదు. అన్నిటి కన్నా గొప్ప విషయం ఏంటంటే ఇది రాసి ఆమె బెంగాలీలోనే కాకుండా, భారత దేశంలోనె మొట్ట మొదట ఆత్మ కధ రాసిన స్త్రీగా పేరు తెచ్చుకుంది. అంటే పురుషులెవరో ఆమెకన్నా ముందు రాశారని కాదు. ఆమెదే మొట్టమొదటి ఆత్మ కధ భారత దేశ సాహితీ చరిత్రలో. ఇక ఆమె రాయడానికి ఎంత కష్టపడిందో, అక్షరాలు ఎలా నేర్చుకుందో తెలుసుకుందాం. ఆరోజుల్లో ఆడవాళ్ళు చదువుకోకూడదు, అలా ఊరికే అంటే కుదరదు కదా వాళ్ళను భయపెట్టాలి బెదిరించాలి, చదువుకుంటాను అని అనకుండా. ఎలా అంటే, ఆడవాళ్ళు చదువుకుంటే మొగుడు చనిపోతాడు, ఆడది విధవ అవుతుంది, విధవ అయితే ఎంత కష్టం ఆడవాళ్ళకి తెలుసు కదా. సగం మంది ఆమాటకే జడిసి ఊరుకుంటారు, ఇంక మరి మొగుడుగారిని చంపిన పాపానికి శిక్ష కూడా ఉండాలిగా, అది వెలివేయటం తక్కువలో తక్కువ శిక్ష అయితే, ప్రాణం తియ్యడం పెద్ద శిక్ష. ఇంక ఎవరు ధైర్యం చేస్తారు చదవడానికి గాని చదివించడానికి గాని. ఆరోజుల్లో పెద్ద మనుషులైనా ఉన్నత వర్గాల తండ్రులైనా తమ ముద్దుల కూతుళ్ళకి చదువు రహస్యంగా చెప్పినా, అది వారు కూడా రహస్యంగా ఉంచే పక్షంలోనే. అది కూడా పెళ్ళితో కట్టు. ఇదీ బెంగాల్లోని గ్రామీణ వాతావరణం స్త్రీలకి సంబంధించినంత వరకూ. ఇక పెళ్ళితరవాత కట్టుబాట్లు, బాధ్యతలూ, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా స్త్రీలను నాలుగ్గోడల మధ్య బంధించేవే కానీ ఎటువంటి వెసులుబాటయితే లేదు కదా. ఇటువంటి సామాజిక వత్తిడి ఉన్నపుడు రాసుందరి దేవి రహస్యంగా తన కొడుకు పుస్తకంలోంచి కొన్ని పేజీలు, భర్త చదివే చైతన్య భాగవత్ అనే పుస్తకం లోని పేజీలు చింపి అక్షరాల్ని తను విన్న శబ్దాలని బట్టి మాచ్ చేసుకుంటూ తన 25 వ ఏట మొదలుపెట్టి 40 లు దాటాక రాయటం చదవటం నేర్చుకుంటుంది. ఇదంతా మొదట ఆమె చదవాలనుకున్న గ్రంధం ఆ చైతన్య భాగవత్ కోసమే చేస్తుంది. తరవాత చిన్నగా రోజులు తారీకులు గుర్తు పెట్టుకుంటూ తన కధ రాయటం మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే ఆడదైన కారణంగా ఇలా దొంగలాగా చదువుకోవాలా అని ప్రశ్నిస్తుంది. ఇంట్లో ఎవరూ చూడకుండా, తనకు దొరికే అతి కొద్ది తీరిక సమయాల్లో ఎవరూ చూడకుండా రాయటం ఎంత కష్టం. అయితే ఈమె చదవటం నేర్చుకోవడం కొన్నేళ్ళకి ఇంట్లో తెలుస్తుంది, కాని అదృఇష్ట వసాత్తూ ఎవరూ దాన్ని పట్టించుకోరు. కొడుకు రాయటానికి కావాల్సిన ఇంక్, పేపర్ అవీ తెచ్చిస్తాడు కానీ ఎవరూ ఆమెకు నేర్పరు. ఈమె సుమారు పధెనిమిదేళ్ళ వయసు నుండి 41 సంవత్సరాల్లో 13 సార్లు గర్భం దాల్చి అందులో 7 గురు పిల్లల్ని పోగుట్టుకుంటుంది. భర్త డబ్బున్న ఆసామే అయినా ఇంట్లో పనిమనుషులని పెట్టని కారణంగా ఇంటెడు చాకిరి, పిల్లలు, గర్భాలు, వంట పని, ఇంక ఇతర ఆచారాలు ఇంట్లో పశువుల పని అంతా కూడా ఎటువంటి సహాయం లేకుండా ఒంటరిగా, ఎవరి సానుభూతి లేకుండా చేసుకురావటం. ఆడదై పుట్టినందుకు ఇంత పని నిర్విరామంగా చెయ్యాల్సి రావటాన్ని నిరతం ప్రశ్నించుకుంటూ సాగుతుంది ఆమె రచన. ఇంత కష్టపడి, ఏ గురువూ లేకుండా నేర్చుకున్న విద్యతో వచనంలో సాగిన ఆమె రచనా శైలి అద్భుతం అని ఆమె రాసిన రెండవ ఎడిషన్కి ముందు మాట రాసిన జ్యోతిరింద్రనాత్ ఠాగోర్, రవీంద్రనాథ్ ఠాగోర్ అన్నగారు మెచ్చుకుంటాడు. జ్యోతిరింద్రనాత్ ఠాగోర్ ఒక ఎడిటర్, నాటక కర్త, పైంటర్, సంగీత విద్వాంసుడు. ఆమె ఆత్మకధ మొదటి ఎడిషన్ ఆమె భర్త చనిపోయిన తరవాత తన 60 వ ఏట ప్రచురిస్తుంది. రెండవది ఆమె 88వ ఏట 1897 లో ప్రచురిస్తుంది. ఇలా ఆమె సమాజం నుంచి నిందను, భర్తకేమైనా జరిగే పక్షంలో ఎదుర్కోడానికి అతన చనిపోయేవరకు ఆగుతుంది. భర్త చనిపోయాకా భార్యకి హిందూ మతం చేసే రిచ్యువల్స్ ని ఆమె బాధాకరంగా వర్ణించి నిరసిస్తుంది. నాలుగ్గోడలకి పరిమితమైన జీవితం, నిరంతర శ్రమనూ, ప్రేమకూ, సానుభూతికీ నోచుకోని, గుర్తింపు లేని జీవితాన్నీ ఆమె నిరసిస్తుంది. ఆమె కధనే ఆమె చెప్పినా ఇది ఒక రకంగా సమాజం స్త్రీల పట్ల చూపే వివక్షను, పితృస్వామ్యం లోని నిరంకుశత్వాన్నీ వర్ణిస్తూ చేసిన తిరుగుబాటు కొంచం వీక్ అయినా కూడా, ఆనాటి స్త్రీల జీవితాలెలా ఉన్నాయో తెలిపే అద్భుత ప్రయత్నం. ఒక జీవిత కాలమంతా ఒకే ఒక ఆశ, ఆశయంతో, తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ సమాజానికి ఎదురీదకుండా, రహస్యంగా తన Life's missionసాధించడం, అలా చేయడంలో ఒక record సృష్టించడం నిజంగా ఒక ఆదర్శనీయమైన అద్భుత ప్రయాణం ఏమో. ఆమె రాసిన ఆత్మ కధ అలాంటి ఎన్నో రచనలకి భవిష్యత్తులో పునాది లాంటిదనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో. రెండు వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు సంస్కృతులుల్లో, కాలాల్లో జరిగే కధల గురించి రాసినా, Alice Walker రాసిన The Colour Purple అనే పుస్తకంలో ప్రొటాగనిస్ట్ సిలీ జీవితంలో జరిగే విషయాలూ రాసుందరి జీవితమూ ఒకే రకంగా ఉంటాయి. ఇద్దరికీ దేముడిమీద అపారమైన నమ్మకం, దేముడితో జరిగే సంభాషణలూ, విన్నపాలూ, ప్రశ్నలూ ఆడవారి దుఖ భరిత జీవితం గురించి బాధ పడటం ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి.         - Sivapurapu Sharada

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రమొని లేక రామి

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? రమొని లేక రామి   రమొని లేక రామి (1440) బెంగాలి రచయిత్రి. ఈమె ఒక అనాధ చాకలి పిల్ల. పని కోసం ఊళ్ళు తిరుగుతూ తిరుగుతూ నానూర్ (Birbhum district in Bengal) అనే చోటకి వస్తుంది. అక్కడ భాషులి దేవి గుడిలో గుడి శుభ్రం చేసే పనికి కుదురుతుంది. చండీదాస్ అనే బ్రాహ్మణ కవి అక్కడ వంశ పారంపర్యంగా పూజారి. శ్రీక్రిష్ణ కీర్తన్ అనే కావ్యం రాసినవాడు. ఆ గుడిలో పని చేస్తూనే రామి భక్తి ప్రాధాన్యమైన రచనలు చేసింది. వ్యక్తిగతంగా ఆమె భక్తికి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఆమెది చక్కని గొంతు. శ్రావ్యంగా పాడేది. చండీదాస్ కవిత్వమంటే పడి చచ్చేది. మొదట వీరిద్దరిమధ్యా స్నేహం కుదురుతుంది. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే వీరి కులాలు వేరయిన కారణంగా వీరి ప్రేమ ప్రజలకి నచ్చదు. చండీదాసుని వెలివేస్తారు. రామి గుడిలో చేసే పనికి కూడ ఉద్వాసన చెప్తారు. అయితే చండీదాస్ కులం కన్నా మానవత్వం గొప్పదని నమ్మే వ్యక్తి. రామి పట్ల తన ప్రేమను బాహాటంగానే ప్రకటిస్తాడు. ఆమె కోసం తన వంశ పారంపర్యంగా వచ్చే పౌరోహిత్యాన్ని కూడా వదిలేసుకుని వెళ్ళిపోతాడు. వీరిద్దరి ప్రేమను చండీదాస్ తన రచనల్లో ఒక పవిత్రమైన ఆత్మ బంధం (platonic love) లాగా వర్ణిస్తే, రామి మాత్రం నిజాయితీగా తమ మధ్య ఉన్న భౌతికమైన ప్రేమను గురించి రాస్తుంది. చండీ దాస్ తన రచనల్లో ఆమె పాదాలు తాకాలన్న కోరికని express చెయ్యడం అప్పటి సమాజంలో అగ్ర వర్ణమయిన బ్రాహ్మణులు ఒప్పనిది, ఇంకా విప్లవాత్మకమైన తిరుగుబాటు కుల వ్యవస్థ మీద అని చెప్పొచ్చు . కనక చండీదాస్ ఆమె కులానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని కేవలం ఆమె ప్రేమని మాత్రమే ఆశించాడాన్న విషయాన్ని రుజువు చేస్తుంది. ఇంత జరిగాకా ఇక్కడ వీరి కధ ఒక అనూహ్యమైన మలుపుతీస్కుంటుంది. గౌర్ నవాబ్ చండీదాసుని తన కోటలో పాడటానికి ఆహ్వానిస్తాడు. చండీదాసు పాట విని ముగ్ధురాలైన నవాబు భార్య చండీదాసు ప్రేమలో పడిపోతుంది. ఆమె ఆశ్చర్యంగా తన ప్రేమను రహస్యంగా ఉంచుకోదు. చండీదాసు కూడ రామీని మరచి ఆమె ప్రేమలో పడిపోతాడు. ఊహించని ఈ పరిణామానికి, చండీదాస్ తనకు చేసిన అన్యాయానికి, రామి చాల బాధ పడుతుంది ఇంకో పక్క నవాబుకి తన భార్య వ్యవహారం నచ్చదు. అధికారం ఉన్నవాడు కాబట్టి చండీదాస్ కి మరణ శిక్ష అది కూడా చాలా కౄరమైన పద్ధతిలో ఏనుగ వీపుకి కట్టి కొరడాతో కొట్టి కొట్టి చంపమంటాడు. ఒక పక్క చండీదాసు తనను మోసం చేసాడన్న బాధ, కోపం ఉన్నా నవాబు కోటకి పరిగెత్తి, తన ప్రియుడిని వదిలేయమని ప్రాధేయ పడుతుంది. తన భార్య తనని కాదని బాహాటంగా చండీదాసు వెంట పడటం భరించలేని నవాబు ఈమె ప్రార్ధనని ఎలా ఒప్పుకుంటాడు. ఒక పక్క నవాబు భార్య కూడా అతన్ని చంపద్దని వేడుకుంటుoది. అయితే నవాబు ఎవ్వరి మాటా వినకుండా చండీ దాసుని హింసిస్తాడు చనిపోయే వరకు. పాపం నవాబు భార్య ఈ ఘోరం చూడలేక్ గుండె బద్దలయ్యి ప్రాణాలు వదిలేస్తుంది. ఈ విషయం తెలిసిన రామి మాత్రం తన నుంచి తన ప్రియిడిని లాగేసుకుందని కోపం కూడా మరచి ఆమె చావుకు కూడా దుఖిస్తుంది. ఇది స్త్రీ లోని ప్రేమ తత్వానికి ఒక గొప్ప నిదర్శనమేమో. అయితే చనిపోయిన తర్వాత కూడా రామి చండీదాసుని క్షమించలేదు. అతని మీద మాత్రం ఆమె కోపం తగ్గలేదు. ఆమె తరవాతి రచనలు కూడా చండీదాసు తనకు చేసిన అన్యాయాన్ని, లోకం తన పట్ల చూపే ఏవగింపుకి, తన వెంట పడే మగవారినుంచి కాపాడుకోవడానికి తను పడే బాధల్ని గురించి ఆమె రచనల్లో రాస్తుంది. అయితే వీరి కధ మాత్రం అత్యంత ప్రజాదరణ పొందిన నాటకీయాంశం అయింది. అయితే ఈమె రచనలన్నీ బయట పడింది చండీదస్ చనిపోయిన తరవాత అతని రచనల కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని manuscriptsకనిపించాయట. అప్పుడు తెలిసింది ప్రపంచానికి ఇవి రాసినది రామి అని. ఇప్పటివరకూ మనం తెలుసుకున్న రచయిత్రుల్లో, అక్కమహాదేవి కానీ , కన్ హోపాత్రా కాని, జానాబాయి కాని, ముక్తాబాయి కాని, చంద్రబతి కాని అందరూ స్త్రీత్వం వల్ల కష్టాలు పడ్డవారే. వారందరి రచనల్లోనూ, భక్తి తో పాటుగా ఆడదైన కారణంగా పడ్డ కష్టాల గురించి, ఇంట్లో గృహిణిగా వుంటే ఉండే రక్షణ లేక పోవడంవల్ల, బయటి సమాజంలోకి వచ్చి, మగవారివల్ల వాళ్ళు పడ్డ కష్టాలను అనుభవిస్తూ వాటిని కూడా తమ రచనల్లో చూపెట్టిన వారే. వారే కనక ఆ కష్టాలను గురించి రాయకపోతే, అప్పటి సమాజం గురించి మనకు ఇంత వివరంగా తెలిసేది కాదేమో. ఒంటరి ఆడది అప్పటికీ, ఇప్పటికీ కూడా లోకువే. అందరికీ అందుబాటులో ఉండే అంగడి సరుకులాంటిదైపోతుంది. ఆమె మీద ప్రతి మగాడికీ హక్కున్నట్టే భావిస్తాడు. రామి రాసిన ఈ రెందు పోయంస్ చూద్దాము. ఆమె కధనంతా ఈ కవితలోనే చెప్తుంది. Where have you gone? Where have you, my Chandidas, my friend, Birds thirst without water, despair without rain. What have you done, O heart less Lord of Gaur? Not knowing what it means to love, you slay my cherished one. Lord of my heart, my Chandidas, why did you break, The vows you made and sing in Court? Now evil men and beasts come swarming round; heavens turn to hell. Betrayed by you, I stand in shame; you have crushed my honour in your hands. Once heedless, untouched by Vasuli's threat, You told the court, with pride you would leave a brahmin home, you said to love a washergirl. Now, lashed to an elephant's back, you reach me with your eyes. Why should this jealous king heed a washerwoman's cries? Soul of my soul, how cruelly on your fainting limbs the heavy whip strikes and falls. Cleave through my heart, and let me die with Chandidas, my love. And then the queen fell on her knees “Please stop Lord”, she cried, “His singing pierced me to the heart, No more of this, I plead, Why must you thus destroy limbs made for love alone? Free him, I beg of you, my Lord, don't make love your toy. O Godless king, ho could you know what love can mean?” So spoke the queem and then, her heart still fixed on Chandidas, she died. Rami trembled, hearing her, and hastened tothe place. She threw herself at those queenly feet and wept the tears of death. నీవెక్కడి కెళ్ళావు? నీ వెక్కడికెళ్ళావు? చండీదాస్, నా స్నేహితుడా; దాహంతో, వానలేక, నైరాశ్యంలో పక్షులు అలమటిస్తున్నాయి. ఏం చేసావు నువు? ఓ గౌర్ నవాబూ? ప్రేమించడమంటే తెలియక, నా ప్రియుణ్ణి వధించావు. నువు చేసిన బాసలన్నీ మరిచిన నా హృదయనాధా! ఓ చండీదాస్, నీవెందుకు దివాణంలో పాడావు? ఇప్పుడు మగ మృగాలన్నీ నా చుట్టూ మూగుతున్నాయి, ఇక్కడ స్వర్గం ఇపుడు నరకమైంది నీచే వంచించబడి, నా గౌరవాన్ని నీ చేతుల్తో నలిపేస్తే, అవమాన భారంతో నిలిచాను. ఒకసారి, ఏమాత్రం ఆలోచించకుండా, భాసులీ దేవి భయం లేకుండా ఒక చాకలి వనిత కోసం నువు బ్రాహ్మణీకాన్ని ఒదిలేసావు. ఇప్పుడు నిన్ను కట్టేసిన ఏనుగు మీంచి నీ చూపుల్తోనే నన్ను చేరతావు, ఈర్ష్యలో కాలుతున్న నవాబు ఒక చాకలమ్మాయి రోదనలెందుకు వింటాడు? నా ఆత్మలో ఆత్మవైన నీవు ; ఎంత కౄరంగా పడుతున్నాయి కొరడా దెబ్బలు నీ వంటి మీద నా గుండెను చీరుకుని నన్ను కూడా నేతోనే మరణించనీ చండీదాస్ ఓ నా ప్రేమికుడా. ఇక రాణీ కూడా మోకరిల్లి "ఆపండి రాజా అని ఏడ్చింది, అతని పాట నా గుండెను కోసింది ఇక చాలు అని అర్ధిస్తున్నా, ప్రేమకోసం మాత్రం చాచే చేతుల్ని నాశనం చేయొద్దు, అతన్ని వదిలెయ్యండి ఓ రాజా, ప్రేమను మీ ఆటబొమ్మను చేయకండి, ఓ దైవత్వం లేని రాజా, ప్రేమ ఏంటో నీకెలా తెలుస్తుంది?" అంటూ వాపోయిన రాణి, చండీదాసుపై పెట్టుకున్న హృదయం బద్దలై చనిపోయింది ఇది విన్న రామి చలించి పోయింది, పరిగెత్తి వెళ్ళి తాను రాణి పాదాలపై వాలి వలవల విలపించింది. xxxxx What can I say, friend? I don't have enough words! Even as I weep when I tell you this story, My accursed face breaks into laughter Can you imagine the cheek of the sinister men? They have stopped worshipping the Devi And have started tarnishing my reputation Let the thunderbolt crash on the heads of those Who from thier housetops shout abuses at good people I wouldn't stay any longer in this land of injustice, I will go to a place where there are no hellhounds. నాదగ్గర పదాలు లేవు. నా ఈ వ్యధాభరిత కధను చెప్పడానికి. ఏడుస్తూ నేను నా కధను చెప్తున్నపుడు, నా శాపగ్రస్త మొహంలో నవ్వు కనిపిస్తుంది. దుర్మార్గులైన మగవాళ్ళెలా నవ్వుతారో అసలు నీకు తెలుసా? వాళ్ళంతా దేవిని కొలవటం మాని నామీద, నాగౌరవం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇళ్ళపై నుంచి బిగ్గరగా అరుస్తూ మంచివాళ్ళని దుర్భాషలాడే వీళ్ళ తలలపై పిడుగులు పడనీ. ఇటువంటి ప్రపంచంలో, న్యాయం లేని ప్రపంచంలో నేనుండను. ఇలాంటి కుక్కల నరకంలేని చోటకెళ్ళిపోతాను. ఒక స్త్రీకి స్త్రీత్వం ఎంత సహజమో పురుషాధిక్య సమాజంలో వివక్షకి, వంచనకి, ద్రోహానికి, అణిచివేతకి గురవడం కూడ అంతే సహజమై పోయింది. ఎన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళి చూసినా స్త్రీల జీవితంలో ఇదొక అనివార్యమైన అంశంలాగా ఉంది. అదే ఆడది లేకపోతే క్షణం గడవని మగాడు, ఆడదాన్ని ఈ రకంగా physical and psychologicalగా హింసించే అనాచారం గురించి ఎందుకు ఆలోచించట్లేదో అర్ధం కాదు. భార్యా భర్తలిద్దరి మధ్యా ప్రేమా, గౌరవం, పరస్పర నమ్మకం ఉండి సజావుగా సంసారాలు సాగితే అక్కడ పిల్లలు ఎంత మానసిక ఆరోగ్యంతో పెరుగుతారు. ఇదెప్పటికీ ఒక తీరని కలగా మిగలాల్సిందేనా, ఎదో కొందరిని తప్పించి అని బాధ కల్గుతుంది. ఒక ఆడదాని పోరాటం తన ఇంట్లోంచే మొదొలెట్టాల్సిన అవసరం ఇంకెన్నాళ్ళో.           - Sivapurapu Sharada

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గుల్ బదన్ బేగం

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గుల్ బదన్ బేగం   బాబర్ చక్రవర్తి కుమార్తె, పెర్షియన్, తుర్క్ యువరాణి, హుమాయూన్ కి సవతి సోదరి. తన సోదరుడు, చక్రవర్తి హుమాయూన్ జీవిత చరిత్ర హుమాయూన్ నామా రాసిన రచయిత్రిగా పేరు. మేనల్లుడు జలాలుద్దీన్ అక్బర్ కి చాలా ప్రియమైన అత్త. అక్బర్ మహారాణి రుకయ్యా బేగం కి కూడా తండ్రి తరపు అత్త. ఆమె పేరు గుల్ బదన్ అంటే గులాబీ వంటి మేను, అంతే కాదు గులాబీ వంటి మనసుకూడా ఆమెది. అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామా నిండా ఈమె గురించిన ప్రస్తావనలుంటాయట. పంథొమ్మిది ఏళ్ళు కాబూల్ని పరిపాలించాకా బాబర్ కన్ను ఇండియా మీద పడింది. మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీ ని ఓడించి బాబర్ మొట్టమొదటి సారిగా ఇండియాలో జెండా ఎగరేసాడు మొగల్ సామ్రాజ్యానిది. అలా ఆరేళ్ళ వయసులో గుల్బదన్ బేగం ఇండియా వచ్చింది. పదిహేడేళ్ళకు పెళ్ళయింది. సొంత సోదరులు, సోదరిలు ఉన్నా గుల్ బదన్ తన సవతి సోదరుడు హుమాయూన్ని కూడా సమానంగానే ప్రేమించింది. గుల్ బదన్ అసలు అన్న తన భర్తతో చేరి హుమాయూన్ మీద కుట్ర చెయ్యడానికి ప్రయత్నిస్తే వారిస్తుంది. అసలు అన్నకు కూడా ఆమె సహకరించదు. కానీ చివరికి అన్న, భర్త కుట్ర చేసి, భర్త,కొడుకు బహిష్కరించబడినా చివరి దాకా ఆమె హుమాయూన్కి తరవాత అతని కొడుకు అక్బర్ కి విశ్వాశపాత్రురాలిగా ఉంటుంది. చివిరికి ఆమె భర్త ఆమె సమాధి పక్కన సమాధి చెయ్య బడటానికి కూడా నోచుకోక ఒక మూలగా సమాధి చేయ బడతాడు. తన కొడుకునీ భర్తనీ కూడా తను నమ్మిన, ఇష్ట పడిన వారి కోసం వదిలేసింది. హుమాయూన్ 1531 లో రాజ్యానికి వచ్చి 1536 లో పోగుట్టుకుని అజ్ఞాతవాసం చేసి సుమారు 15 ఏళ్ళ తరవాత షేర్షాసూరి ని ఓడించి తిరిగి మొగల్ సామ్రజ్యాన్ని నిలబెడతాడు. ఈ మధ్య కాలంలో కాబూల్ లో ఉండి పోయిన గుల్ బదన్ తరవాత రెండేళ్ళకు అక్బరు బలవంతం మీద కొంతమంది ఆడవాళ్ళతో కలిసి ఆగ్రా వస్తుంది. అక్బర్ ఆమెను హుమాయూన్ జీవిత చరిత్ర రాయమని అంటాడు. మొదట సందేహపడినా తన తండ్రి బాబరు రాసిన బాబర్ నామాలో లాగానే తేలికైన తుర్కిష్ భాషలో ఎటువంటి అలంకారాలు, ఆర్భాటాలు లేకుండా రాస్తుంది. ఆమెకు ఎనిమిదేళ్ళ వయసులో బాబరు చనిపోతాడు కాబట్టి తండ్రి గురించి ఆమెకు జ్ఞాపకమున్నంతవరకూ ఇంకా విన్న విషయాలు మాత్రం రాస్తుంది. ఈమె రాసిన ఈ గ్రంధం స్త్రీల రచనల ప్రత్యేకతలన్నీ సంతరించుకుని ఉంటుంది. మగవాళ్ళు యుద్ధాలని ఏళ్ళ కేళ్ళు బయటికి వెళ్ళినపుడు ఈ మహల్స్ లోని ఆడవాళ్ళ జీవితం ఎంత అందోళనతో, భయంతో కూడుకున్నదో, గర్భవతులైన ఆడవాళ్ళు, పిల్లలతో వారు పడే వేదన ఎంత దుర్భరంగా ఉంటుందో ఆమె రాస్తుంది. అందమైన రాజమహళ్ళలో విలాసాలే కాకుండా ఎటువంటి హఠాత్పరిమాణానికైనా సిద్ధంగా ఉండటం ఎన్నో కష్టాలకోర్చి అడవుల్లో పర్వతాల్లో, పిల్లలతో, కొద్దిమంది స్నేహితులు, అనుయాయులతో రోజులు సంవత్సరాలు ఎలా గడిపేవారో, ప్రాణభయంతో పారిపోయే పరిస్తితుల గురించి కూడా ఆమె రాస్తుంది. అధికారం, రాజరికం, విలాసం, అలాగే అధికారం కోల్పోయినప్పుడుండే దుర్భర దారిద్ర్యం, స్వంత వారినుంచే అధికారం కోసం ప్రాణఘాత దాడులు, ఇవన్నీ కూడా సహజమే కదా. అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామాకి గుల్ బదన్ రాసిన హుమాయూన్ నామాకి తేడా ఇక్కడే ఉంటుంది. రాజుల చరిత్రలన్నీ వారి పోరాటాల గురించి, రాజ్య సరిహద్దులూ వాటి విస్తరణ, వారి గొప్ప తనాలు, పరిపాలనా వ్యవహారాల గురించి రాసే రొటీన్ చరిత్రలే. కానీ ఈమెది అలా కాదు. హుమాయూన్ నామా వారి వ్యక్తిగత జీవితాల్లోని మామాలు మనుషుల అంతరంగాల్నీ అవేదనలనీ ఒక కుటుంబంలో మామూలుగా ఉండే ప్రేమల్లాగే, మామూలు కుటుంబాల్లో ఉండే గొడవలూ, అన్నదమ్ముల మధ్య జరిగే పోట్లాటలూ, రాజ కుటుంబాల్లోనూ ఉంటాయని చెబుతుంది. రాజకుటుంబీకుల్ని గొప్పగా చూపెట్టే ప్రయత్నం చెయ్యదు. అయితే ఈ గ్రంధం అసంపూర్తిగా మిగిలిపోయింది ఎందుకనో. ఒకచోట వాక్యం పూర్తవకుండానే ఉండిపోయిందట. కారణాలు తెలియవు. Annette S.Beveridge హుమాయూన్ నామా అనువాదం చేసింది. అయితే ఈ మేన్యుస్క్రిప్ట్ G.W.Hamilton అనే Colonel personal collection నుంచి అతని తరవాత అతని భార్య బ్రిటిష్ మ్యూసియం కి అమ్మేసింది. చరిత్ర కారులు మామూలుగా రాయని విషయాలని ఆమె రాసింది. ఒకసారి ఇరవై రెండేళ్ళ హుమాయూన్ అనారోగ్యంతో మంచంపడితే, బాబరు చూళ్ళేక తన కొడుకు బదులు తనను తీస్కెళ్ళమని ప్రతి రోజూ హుమాయూన్ మంచం వద్ద అల్లాకి ప్రార్ధన చేసే వాడట. చిత్రంగా హుమాయూన్ కోలుకుని 47 ఏళ్ళ వయసులో బాబరు అకాలమృతు వాత పడ్డాడట. అలాగే బాబరు చేసిన ఒక చిత్రమైన పనిని ఆమె రాస్తుంది. ఏంటంటే బాబర్ ఒక బంగారు మొహరు కొన్ని కిలోలది ముద్రించి అదే పనిగా కాబూలు పంపించి అక్కడే ఉండిపోయిన ఆసస్ అనే ఒక కోర్ట్ జోకర్ మెళ్ళో కళ్ళకు గంతలు కట్టి వేయిస్తాడు. అంత బరువుకలది మెడలో ఎంటో అని మొదట భయపడి తరవాత బంగారు మొహరు చూసి ఆనందంతో గెంతులేస్తాడట. మధ్యవయస్కుడైన హుమాయూన్ ఒక సారి పదమూడేళ్ళ హమిదా బానుని చూసి ప్రేమలో పడతాడు. మొదట హమిదా వయసు కారణంగా తిరస్కరిస్తుంది. నేను చెయ్యెత్తితే అతని భుజం తగలాలి గాని అతని షేర్వాని అంచు కాదు అంటూ. తిరిగి ఎన్నిమార్లు చక్రవర్తి కబురు పెట్టినా చూడటానికి రాదు. ఆమెకు కోరినంత ఆస్తిని మనోవర్తిని ఇవ్వటానికి సిద్ధ పడితే హమిదా తల్లి ఆమెను చక్రవర్తి కన్న మంచి మొగుడు ఎలా వస్తాడు అని ఆమెను బలవంతంగా ఒప్పిస్తుంది. ఆమెకు పుట్టిన కొడుకే అక్బరు చక్రవర్తి. ఇలా చరిత్రకారులు, రాజుల చరితలు రాసే వారు రాయని విషయాలు ఎన్నో ఆమె హుమాయూన్ నామా లో కనిపిస్తాయి. గుల్ బదన్ పొయెట్రీ కూడా రాసిందట కాని, రికార్డ్ లేదు. 1603 లో గుల్ బదన్ చనిపోయింది. కొడుకు దగ్గర లేనందున అక్బరే దగ్గరుండి అన్నీ జరిపించాడు ఆమె శవాన్ని మొయ్యడం నుంచి. 1605 లో అక్బర్ కూడా చనిపోయాడు. అయితే అప్పటి వరకూ కూడా అక్బరు తన ప్రియమైన అత్తను గుర్తు చేసుకుని బాధ పడుతూనే ఉండేవాడట. పోయెట్రీ తో పాటు అతి విలక్షణంగా హుమాయూన్ నామా రాసిన గుల్ బదన్ బేగం గురించి చెప్పుకోపోతే ఆమెకు అన్యాయం చేసినట్టే అనిపించింది.         - Sivapurapu Sharada

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? చంద్రబతి - బెంగాలి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? చంద్రబతి - బెంగాలి కొన్ని శతాబ్దాల వెనకటి రచయిత్రుల కోసం నేను వెతుకుతుంటే చంద్రబతి అనే అద్భుత రచయిత్రి గురించి నాకు తెలిసింది. ఆమె 16 వ శతాబ్దపు మొట్ట మొదటి బెంగాలి రచయిత్రి. ఆమె జీవితమూ రచనలూ రెండూ కూడా తెలుసుకోవటానికి చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి. చంద్రబతి రాసింది అషామాషీ రచన కాదు 'రామాయణం'. చాలా కొద్ది మందికి ఈ విషయం తెలుసు ఎందుకంటే, ఈమె రాసిన రామాయణాన్ని విశ్లేషకులు అసలు రామాయణం కిందే పరిగణించలేదు. ఎందుకంటే అది రామాయణం కాదుట, నిజమే సీతాయణం అనొచ్చేమో. ఈమె రామాయణం కేవలం సీత బాల్యంతో మొదలయి, యుద్ధ కాండను విస్మరించి, ఉత్తరకాండతో ముగుస్తుంది. మొత్తం రామాయణంలో సీత పుట్టినప్పట్నుంచి పడ్డ కష్టాలతో మొదలయి చివరికి ఆమె ఆత్మాహుతి చేసుకునేవరకు నడుస్తుంది. ఈమె రామాయణంలో రాముడు హీరో కాదు, దేముడూ కాదు, తన తల్లులకీ, రాజ్య క్షేమానికీ, ప్రజల మాటలకు మాత్రమే విలువిచ్చి, అర్ధాంగి పట్ల తన బాధ్యతలను విస్మరించిన బలహీన మనస్తత్వం కలవాడు. రాముడు దేముడనీ, సాక్షాత్తూ విష్ణు మూర్తి అవతారమని నమ్మించి రాముడి పితృవాక్య పరిపాలనని, రావణ సం హారం ద్వారా ధర్మ సంస్థాపననీ, వీరత్వాన్నీ, ఏకపత్నీవ్రతాన్నీ ఆదర్శవంతంగా చూపెట్టి ప్రజల్ని నమ్మించి అప్పటి సామాజిక నీతుల్ని, సమాజంపై రుద్ది పురుషస్వామ్యాన్ని బలపరుచుకోడానికి వాడుకున్న సప్పోర్ట్ సిస్టం సీత. అందుకే సీత ఓర్పు గల తల్లి, త్యాగశీలి, ఎప్పుడూ ఏడ్వటం తప్పించి దేన్నీ ఎదురు తిరిగి ప్రశ్నించదు. గర్భవతిగా ఉన్న సీతని రెండోసారి అడవుల్లోకి పంపినప్పుడైనా సీతను పుట్టింటివారు తీస్కెళ్ళరు. అంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టింట్లో కాదుకదా, సంఘంలోనే ఎక్కడా ఇంత తలదాచుకునే చోటు ఎవరూ ఇవ్వరు. అందులోనూ సీత మహా రాణి పేరుకే అనుకోండి, ఇక ఎవరు సాహసం చేస్తారు? లెస్లీ ఉడ్విన్ తీసిన డాక్యుమెంటరీ లో న్యాయవాదులు చేసిన అన్యాయమైన ఉద్ఘాటనలు " భారతీయ సంస్కృతి చాలా గొప్పది, అందులో స్త్రీలకి చోటు లేదు" వినడానికి బాగోలేకపోయినా నూటికి నూరు శాతం నిజం. మన Epics లో స్త్రీలకి ఎటువంటి స్థానం లేదు. అన్యాయాలకి, మానభంగాలకి, అపహరణలకి, వస్త్రాపహరణలకీ గురవటం, వాళ్ళ ప్రమేయం, ప్రస్తావన ఉన్న చోటల్లా ఏడవటం, శృంగారం కోసం, శృంగార సన్నివేశ వర్ణనల కోసం ఉపయుక్తంగా ఉండటం తప్పించి. అందుకే దేనికీ ఎదురు తిరగని సీత పురుష ధృక్కోణంతో రాసిన రామాయణాల్లో మహా సాధ్వి ఆయింది, దేవత అయ్యింది, పూజింపబడింది. మరి సీత కష్టాలని ఎత్తి చూపుతూ ఆమె ధృక్పధంతో రామయణం రాస్తే సగం జనాభా అయిన స్త్రీలు తిరగబడితే, పురుషాధిక్య సమాజపు పునాదులు కదలే అవకాశం ఉంది.? అన్నీ భరించిన సీతని సాధ్విగా చూపక పోతే స్త్రీలంతా ఒదిగి ఒదిగి ఎలా ఉంటారు? అసలు సీత కూడా ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించింది? మూడు కారణాలు కనిపిస్తాయి. ఒకటి బంగారు జింక మీద ఆశ పడటం, అది రాక్షస మాయ అని రాముడు చెప్పినా వినకపోవటం. రెండు కాపలా పెట్టిన లక్ష్మణుడిని అనుమానించి రాముని ఆజ్ఞకి వ్యతిరేకంగా అతన్ని వెతకటం కోసం పంపడం. మూడు లక్ష్మణ రేఖ దాటడం. ఇన్ని తప్పులు చేసాకా సీతకి కష్టాలు ఎలా తప్పుతాయి. ఇంత విన్నాకా మగవాడి నోటినుంచి, ఏ ఆడదయినా ఇంక నోరెందుకు ఎత్తుతుంది? ఈ ప్రశ్నలన్నీ చంద్రబతి రామాయణం లేవెనెత్తుతుంది పాఠకుల మదిలో అందుకే చంద్రబతి రామాయణాన్ని బయటికి రానివ్వలేదు అప్పటి పండిత పురుషులు. అదసలు రామాయణమే కాదన్నారు. అదొక అసంబద్ధమైన, అసంపూర్ణమైన వ్యర్ధ ప్రయత్నం అన్నారు. భారతంలో ద్రౌపది కూడా పతివ్రతే, కానీ చాలా సందర్భాలలో ద్రౌపది ఎదురు తిరుగుతుంది. ధర్మరాజు తనను జూదంలో ఓడిపోతే, "తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా"? ముందు ఆ విషయం చెప్తే కాని నేను సభకి రాను అని తిరగబడుతుంది. ధర్మరాజుకి తన మీద ఉన్న హక్కుని ప్రశ్నిస్తుంది. వస్త్రాపహరణం తరవాత తన పతుల వీరత్వాన్ని ఈసడించి, దుర్యోధనుడి మీద తన పగ తీర్చే వరకు జుట్టు ముడి వేయనంటుంది. ఆరోజుల్లో జుట్టు అల్ల కుండా వదిలేయటం తప్పు మరి. మయసభలో దుర్యోధనుడు కాలు జారి పడితే ఫక్కుమని నవ్వుతుంది. చివరగా యుద్ధంలో తన భర్తలు గెలిచినా తన అయిదుగురు కొడుకుల్నీ పోగొట్టుకుంటుంది. ఇది ద్రౌపది తిరబడినందుకు శిక్ష అంతే కాదు. ద్రౌపది ఆ కాలం నుంచి, ఈ కాలం వరకూ ఆడవారికి ఎప్పుడూ ఆదర్శమయిన దాఖలాలు లేవు. కానీ సీత జీవితం కష్టాలనీ, దుఖాన్ని భరించడానికి ఒక గౌరవాన్ని, ఆదర్శాన్ని ఆపాదిస్తుంది. అంతులేని సహనాన్నీ, ఓర్పునీ ప్రదర్శించండం ఒక కావ్య నాయిక లక్షణంగా ఎత్తి చూపుతుంది. తెలుగులో రామాయణాన్ని మొల్ల రాసింది. ఈమె కుండలు చేసే ఒక కుమ్మరి కూతురు, అపురూప సౌందర్యవతి క్రిష్నదేవరాయలకి ఉంపుడు కత్తెగా ఉందని ఒకచోట రాసారు. రాయల ఆస్థానంలోని కవులతో సవాలు చేసి ఈమె రామాయణాన్ని కేవలం అయిదంటే ఐదు రోజుల్లో సంస్కృతం వచ్చి కూడా, తెలుగులో రాసిందట. అయితే ఈమె రామాయణం ఒక అద్భుత రచన అన్న విషయం కాదనలేక కవులంతా ఏకమై ఈమె స్త్రీ , ఇంకా శూద్రురాలు, అందువలన ఈమెకి సభలో ప్రవేశం లేదు, సభలో ఆమె రాసిన రామాయణం చదవటానికీ వీలు లేదని పట్టుబట్టీ నెగ్గారట. మొల్ల రామాయణంలో, సీత పట్ల ఎటువంటి సానుభూతీ లేదు. రాముడు దేముడు, వీరుడు. ఆమె తన రచనను రాముడికి "మహా గుణశాలి, దయావాన్, ప్రీతి కలిగించిన వారందరిని రక్షించువాడు, శ్రీరామచంద్రుదడికి" అంకితం చేస్తున్నట్టు రాసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొల్ల, చంద్రబతి ఇద్దరూ కూడా శివ భక్తులు. అయితే మనకాలంలో కూడా రామాయణాన్ని రాసిన ప్రముఖ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ గారు. ఈమె రామాయణాన్ని మార్క్సిస్ట్ ధృక్పధంతో విశ్లేషించారు. ఇందులోనూ రాముడు హీరో కాదు, పైగా ఎంత బలహీనమైన వ్యక్తో, తన అవసరాలకు కూడ లక్ష్మణుడిమీదా, యుద్ధం చేసి సీతను తిరిగి తెచ్చుకోవడానికి వానరుల మీదా ఎలా ఆధారపడతాడో, అసలు రామ రాజ్యంలో ప్రజలకి జరిగే మంచి ఎంటో వివరించారు. అసలు "రామాయణ విషవృక్షం" అని పుస్తకం పేరు చెప్పటానికి, అనడానికి కూడా భయపడాల్సిన పరిస్తితి కొన్ని ఇళ్ళల్లో. ఇది రాసి రంగనాయకమ్మ గారు ఎంత విమర్శ ఎదుర్కొన్నారో తెలిసిన విషయమే. ఇంతకీ తేలిన విషయం ఏంటంటే, రామాయణం రాసిన స్త్రీలెవరికీ కూడా, స్త్రీలైన కారణంగా వారి కృషికి గుర్తింపు ఇవ్వకుండా, వేరు వేరు కారణాలు, సాకులూ చెప్పి నిరాదరణకి గురి చేసారన్నది రూఢి అయింది అని. చంద్రబతి రామాయణాన్ని పండితులూ, కవులూ గుర్తించకపోయినా, ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, విశేషంగా ఆదరించి, వారి కష్టాలన్నిటినీ సీత కష్టాలుగా అభివర్ణించుకుని, పొలంలో నాట్లు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, కోతల సమయంలో, ధాన్యం దంచుకుంటూ పాడూకునే వారట. అప్పుడే కాదు ఇప్పటికీ కొన్ని చోట్ల అంటే బెంగాలులో, బంగ్లాదేష్లో, ఉత్తరప్రదేష్ లో, బిహార్లో, మహారాష్త్ర, ఆంధ్ర ప్రదేష్ లలో పాడుకుంటారు. బెంగాలు, బంగ్లాదేశ్ లలో అయితే రాముడిని "పాషండ, పాపిష్టి, నీకు హృదయం చచ్చిపోయిందా" అని ప్రశ్నిస్తూ పాడతారట. చంద్రబతి ప్రాముఖ్యం ఇచ్చినదంతా సీత పుట్టినప్పట్నుంచి పడ్డ కష్టాలకే. జనకుడికి, భూమి దున్నుతుంటే దొరికిందని తెచ్చిస్తారు రైతులు. అసలు ఆడపిల్ల పుట్టగానే పాతిపెట్టేసే ఆచారం అప్పుడే మొదలయ్యిందేమో. తల్లి తండ్రులెవరో తెలియదు, బాల్య వివాహం, అత్తవారింట ఒక్కరు కాదు ముగ్గురు అత్తగార్లు, అరణ్యవాసం, అపహరణం, అవమానం, వియోగం, ఒంటరితనం, అగ్నిప్రవేశం, గర్భంతోటుండగా మళ్ళీ అరణ్యవాసం , అష్ట కష్టాలు, ఆఖరిగా ఆత్మాహుతి. అసలు సీత జీవితంలో సుఖపడిన దాఖలా ఎక్కడా లేదు. ఒక మహారాణి అయిన సీత ఇంత అసాధారణమైన కష్టాలు పడితే, సాధారణ స్త్రీల పరిస్తితి ఏంటో ఆరోజుల్లో ఊహించుకోవచ్చు. ఇలా సీత జీవితంలో ప్రతి స్టేజ్ లో పడ్డ కష్టాలను వర్ణిస్తూ రాసిన ఆమె పద్యాలను స్త్రీలు తమ జీవితంలోని కష్టాలను ఒకరికొకరు చెప్పటానికి వాడుకుంటూ పాడుకునే వారట. ఒక మహా సాధ్వి, దేవత అయిన సీత జీవితంలోని కష్టాల్ని, ఆ రోజుల్లో సాధారణ స్త్రీల జీవితంలోని కష్టాలతో అనుసంధానించి, ఒక సారూప్యత నిర్మించి, స్త్రీల జీవితాలకి దర్పణంగా తన రామాయణాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది కాబట్టే, మగవారంతా తృణీకరించినా, ఆమె రచన స్త్రీల రోజువారీ జీవితంలో భాగమయ్యింది, వారి పాటల్లోని ప్రాణమయ్యింది. దేముడయిన రాముడిని బలహీనమైన వ్యక్తి లా చిత్రీకరించడమే , చెప్పాలంటే ఒక రకంగా తిరుగుబాటు. ఐతే ఇంతచేసినా ఇది ఆడవాళ్ళు తమ తమ కష్టాలని పంచుకోవడానికి ఉపయోగపడిందే కాని, కష్టాలకి కారణమయిన వారిమీద తిరగబడటానికి ఉపయోగపడలేదు. చంద్రబతి రాసిన ఇతర రెండు రచనలు చాలా అద్భుతమైన కావ్యాలని ,మాణిక్యాలవంటివని పేరు పొందాయి. ఇవి " సుందరి మోల్వా ఇంకా, దాస్య కేనరం". వీటిని బెంగాల్, బంగ్లాదేశ్ లలో పాఠ్యాంశాలుగా ఇప్పటికీ చెప్తారట. అయితే అన్నిటికన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమెకు ఆమె రచనల కన్నా కూడా, ఆమె ప్రేమ కధకే ఎక్కువ గుర్తింపు వచ్చిందని. అదేంటో, ఎందుకో తెలుసుకుందాం. చంద్రబతి అపురూప సౌందర్యవతి. ఆమె జయానందుడనే యువకుడితో ప్రేమలో పడుతుంది. ఇద్దరికి పెళ్ళికూడా నిశ్చయమవుతుంది. అయితే పెళ్ళిరోజున చంద్రబతికి, జయానందుడు, ముస్లిం మతం పుచ్చుకుని కాజీ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడని తెలుస్తుంది. విరక్తితో ఆమె తన తండ్రిని ఇక తన పెళ్ళి తలపెట్టవద్దని కోరి, ఒక గుడి కట్టుకుని అందులో శివ ధ్యానంలో మునిగిపోతుంది. అయితే తండ్రి ఆమె కోరికను కాదనక, ఆమెను రామాయణం రాయమని ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహ ఫలితమే ఆమె రాసిన రామాయణం ఇంకా ఇతర రచనలూనూ. అయితే, తన తప్పు తెలుసుకున్న జయానందుడు తిరిగి ఆమెను కలవడానికి వస్తాడు. కాని ఆమె తన గుడిలో తలుపు వేసుకుని ధ్యానంలో ఉంటుంది. అదే సమయంలో బయట, తుఫాను, గాలి వాన. పిలిచి పిలిచి వేసారిన జయానంద, ఆ గుడి తలుపు మీద 'చివరి సారి నీకు వీడ్కోలు చెప్పటానికి వచ్చాను' అని రాసి వెళ్ళిపోయి పక్కనే పారుతున్న నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. మరుసటిరోజు తలుపు తెరిచిన చంద్రబతి, తలుపు మీద రాతలు చూసి నది వేపు పరిగెడుతుంది. అయితే అక్కడ ఆమెకు, కొట్టుకువచ్చిన తన ప్రియిడి శవం కనపడుతుంది. మరొక్కసారి విధి చేత భంగపడిన చంద్రబతి తాను కూడా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఎంత రొమాంటిక్ గా, సినిమాటిక్ గా ఉంది ఈ స్టోరీ! అందుకే ఆమె రచనల కన్నా ఆమె వ్యక్తిగత జీవితం మీద ఎక్కువ జాలి, ఆదరణ ప్రజలకు.         - Sivapurapu Sharada

ఫౌల్... ఫౌల్ (కథ)

  ఫౌల్... ఫౌల్ (కథ) - జంపన పెద్దిరాజు               కాలం అప్పుడప్పుడు కుట్రలు చేస్తుంది. ఒక బాలగంగాధర తిలక్, ఒక శారద (నటరాజన్), ఒక త్రిపురనేని శ్రీనివాస్ ఇలా తెలుగు సాహిత్యంలో గొప్పవాళ్లగా ఎదిగే వాళ్లను కబళిస్తుంది. అలా మరణం తన దగ్గరకు తీసుకున్న వారిలో జంపన పెద్దిరాజు ఒకరు. 24 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అప్పటికి అతను రాసింది మూడు కథలే మంచం, దేవత, ఫౌల్... ఫౌల్. ఈ కథ విద్యార్థి కథల సంపుటిలో ముద్రితమైంది. ఒక సినిమా పాట కూడా రాశారు. కాలం పురోగమిస్తున్నా, అంతా సుఖంగా ఉంది అంటే నేను నమ్మను, బతికున్న మనిషిని నాకొక్కడిని చూపించు... అని తన కవిత ద్వారా అభివృద్ధికే సవాల్ విసిరిన కథా రచయిత, కవి జంపన పెద్దిరాజు. వీరు రాసిన ఫౌల్... ఫౌల్ కథ ఓ క్రీడాకారిని మనసు సంఘర్షణకు అద్దం పడుతుంది. మనుషుల్లోని లోపాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది.          కథలోకి వెళ్తే- లా కాలేజ్ గ్రౌండ్ లో టెన్నిస్ పోటీలు జరుగుతుంటాయి. ఆ యూనివర్శిటీ ప్లేయర్ మిస్ టానియా ఆడుతుంటుంది. ఆ ఆడ టెన్నిస్ చూడడానికి వందలు వేలు జనం వస్తారు. కార్లు, స్కూటర్లు, సైకిళ్లు, పెద్దలు, ముసలాళ్లు అంతా టెన్నిస్ చూడ్డానికి వస్తారు. అలా మూడు రోజుల నుంచి టెన్నిస్ తార టానియా పేరు మారు మోగుతుంటుంది. టెన్నిస్ కోర్టులోని ఆమె ప్రతి కదలికను మింగుతూ ఉఁటాయి కొన్ని వేల కళ్లు, కొన్ని వందల కళ్లజోళ్లు. అలా టానియా హిప్ హిప్, టానియా జిందాబాద్ ల మధ్య మద్రాసు పై రెండుసెట్లు వరసగా తీసుకొని ఫైనల్స్ కు వస్తుంది టానియా. గెలవగానే జనం చప్పట్లు, అంపైర్ ఆంజనేయుడిలా ఉబ్బిపోతాడు. వాలంటీర్ల హడావుడి. టానియా చేతిని గుళ్లో గంటలా, పూజారి తీర్థంలో అభిమానులు ముట్టుకొని పోతుంటారు. ఖరీదైన మూడు నల్లకొట్లు తొడుక్కున్న వాళ్లు టానియాను రాత్రికి డిన్నర్ కు ఆహ్వానించారు. టానియా రెండు డిన్నర్లకు వెళ్తుంది. ఒక డిన్నర్ లో తిని, రెండో డిన్నర్ లో తప్పదన్నట్లు యాపిల్స్, సలాడ్ మాత్రమే తీసుకొని తన రూమ్ కు వచ్చి పడుకుంటుంది.           పడుకున్న టానియాకు పదకొండు అయినా నిద్రపట్టదు. కడుపులో ఏదో వికారంగా అనిపిస్తుంది. నైట్ గౌను వేసుకొని మిస్ టానియా తన రూమ్ నుంచి బైటకు వస్తుంది. అన్నిటిని దాటుకుంటూ టెన్నిస్ కోర్టుకు వెళ్తుంది. కోర్టులో విరిగిపోయిన కుర్చీలు మధ్యతరగతి జీవితాల్లా ఉంటాయి. ప్యూడల్ వ్యవస్థకు ప్రతిబింబాల్లా గొప్పవాళ్లకోసం ప్రత్యేకించబడ్డ సోఫాలు, కుర్చీలు మంచుతాగి నిద్రపోతుంటాయి. వ్యభిచారి వేసుకున్న లిప్ స్టిక్ లా స్కోరు బోర్డు తగిలించుకొన్న విల్స్ అడ్వర్ టైజ్ మెంట్ కనిపిస్తాయి. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. టానియాకు మనసు చికాగ్గా అనిపిస్తుంది. దూరంగా మూడు ఆకారాలు మాట్లాడుకున్నట్లు అనిపించి అక్కడకు వెళ్తుంది. వాళ్లు కోర్టులో మట్టిని సరిచేస్తూ... తట్టలతో మట్టి ఎత్తి పోస్తుంటారు. వాళ్లలో ఒక ఆమె దగ్గితే రక్తం పడుతుంది. మంచినీళ్లు లేవా అని మరొకామెను అడుగుతుంది. టానియా మట్టి గడ్డకట్టిన రక్తాన్ని చూస్తుంది. వాళ్ల బట్టలు, వాళ్ల శ్రమ, వాళ్ల శరీరాల్ని చూసి చలించిపోతుంది. అందరూ నిద్రపోతుంటే వాళ్లెందుకు పనిచేయాలని ప్రశ్నించుకుంటుంది. రక్తం కక్కిన తిరుపతి తట్ట ఎత్తలేకపోతే తను పైకి లేపబోతుంది. కానీ టానియా ఆ తట్టను మోయలేక పోతుంది. ఈ పనులు చదువుకునే వాళ్లు చేసేవి కాదు అని చెప్తారు వాళ్లు. దాంతో టానియా మనసు వివిధ రకాలుగా ఆలోచిస్తుంది. కొంత టెక్నిక్ తో టెన్నిస్ ఆడితేనే తనకు అంత గుర్తింపు వచ్చింది. మరి బరువులు మోయడంలో వీళ్లకు గొప్ప ప్రావీణ్యం ఉంది, నిద్రలేకుండా, రక్తం కక్కుతున్నా బరువులు మోయడం సామాన్య విషయం కాదని అనుకుంటుంది. అంతలో మట్టి తట్టఎత్తుకున్న తిరుపతి కిందపడిపోతుంది. తల పగిలి రక్తం వచ్చేస్తుంది. అక్కడి కక్కడే టానియా ఆడే టెన్నిస్ రాకెట్ ఖరీదు కూడా చేయని తిరుపతి చచ్చిపోతుంది. టానియా రూమ్ కు వచ్చి సముద్ర కెరటంలా, ఆకు కదలని చెట్టులా, మనసులేని మనిషిలా... జీవంలేని శవంలా పడుకుంటుంది.           మరసటి రోజు ఇదేమీ పట్టనట్లు, తిరుపతి చచ్చిపోయినా తెలియనట్లు ఆర్గనైజర్స్ హడావుడితో టెన్నిస్ ఫైనల్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ కావడంతో స్కూళ్లకు, కాలేజ్ లకు, ఆఫీసులకు పండగ. ముందురోజుల్లానే కార్లు, సైకిళ్లు, కోట్లు, చీరలు, బ్లౌజులు... జనం జనం జనం టానియాను చూస్తుంటాయి. టానియా ఆటను చూస్తుంటాయి. టానియా శరీరం మాత్రం టెన్నిస్ ఆడుతుంటుంది. కానీ ఆమె హృదయం మాత్రం సైగల్ గొంతులోని విషాద ఘోషలా ఉంటుంది. మొదటి సెట్టు ఎదుటి అమ్మాయి గెలుస్తుంది. దాంతో జనాల్లోంచి అరుపులు- టానియా కొట్టు, టానియా బీకేర్ ఫుల్, టానియా డోన్ట్ వర్రీ... కానీ టానియా మాత్రం ఆడలేక పోతుంది. తిరుపతమ్మ కక్కిన రక్తం గడ్డకట్టిన మట్టి కళ్ల ముందు కనిపిస్తుంది. ఆమె చావు టానియా మనసులో గిర్రున తిరుగుతుంటుంది. టానియాకు ఈ రోజు ఆట ఆపేయాలని పిస్తుంది. తిరుపతమ్మకు సంతాపం ప్రకటించాలని ఉంటుంది. గట్టిగా మైక్ దగ్గరకు వెళ్లి అరవాలనిపిస్తుంది. కానీ నిశ్శబ్దం. ఏమీ చేయలేదు. అతి కష్టం మీద రెండో సెట్టు నెగ్గుతుంది. మూడో సెట్టు మళ్లీ అవతలి అమ్మాయి గెలుస్తుంది. అంతలో టానియా చూపు తిరుపతమ్మ రక్తం కక్కిన చోట పడుతుంది. అంతే టానియాకు ఆట మానేసి ఎటన్నా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. సర్వీస్ ఫౌల్ అవుతుంది. అంపైర్ ఫౌల్ అని అరుస్తాడు... కానీ టానియాకు మాత్రం నేను కొట్టిన బాల్ కాదు, ఈ లోకం ఫౌల్, ఈ జనం ఫౌల్, వీళ్ల తెలివి ఫౌల్, వీళ్ల కార్లు ఫౌల్, వీళ్లంతా ఫౌల్ అని అరవాలనిపిస్తుంది. ఒక్క బాల్ టానియా నుదుటి మీద తగులుతుంది. నిద్రలేక పోవడంతో, కళ్లు తిరిగి కిందపడుతుంది. జనాలంతా టానియాను పైకి లేపి ఫేకల్టీ క్లబ్ కు తీసుకెళ్తారు.. ఏమైంది... ఏమైంది... అని అభిమానాన్ని కురిపిస్తారు. నాకు ఏమి కాలేదని టానియా చెప్పినా వినరు. ఆదుర్దా పడతారు. కానీ  టానియా మాత్రం చచ్చిపోయిన తిరుపతికి, ఆమె పిల్లలకు దిక్కులేదు. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. వీళ్ల అభిమాన ప్రవాహం మట్టి తట్టల వైపు ప్రవహించడం మానేసి, ఈ టానియాలాంటి నగరాలపై పడడం నిజంగా అసలైన ఫౌల్ ఫౌల్ ఫౌల్ అని లోలోపల అరుస్తుంది. ఇవన్నీ పట్టించుకోని గడియారం తాఫీగా నడుస్తుంది.       ఇలా కథంతా అద్బుతమైన సరికొత్త వర్ణనలతో నడుస్తుంది. రచయిత కవి కావడం వల్ల సరికొత్త అభివ్యక్తులను ప్రయోగించారు. కథ చదివిన అనుభూతి కంటే, కవిత్వం చదువుతున్న అనుభూతి కలుగుతుంది. పాఠకులు ఏ ఒక్క వాక్యాన్ని మిస్ కాలేరు. ఒక ప్రవాహంలా కథ మనల్ని చుట్టుముట్టి చంపేస్తుంది. అయి పోగానే ఓ భావం మనలో నిబిఢీకృతం అయిపోతుంది. ఇతివృత్తం మొత్తం టెన్నిస్ చుట్టూ తిరిగినా, కథలో అంతర్లీనంగా శ్రమ గొప్పదనం, శ్రామికుల జీవితం కనిపిస్తుంది. అదే కథకు ప్రాణం. శిల్పం దృష్ట్యా కూడా ఇదో అరుదైన కథ అని చెప్పాలి. ........డా. ఎ.రవీంద్రబాబు

సాహిత్య లోకానికి తేజోమయంశారద (నటరాజన్)

  సాహిత్య లోకానికి తేజోమయం శారద (నటరాజన్)        పుట్టుకతో తమిళియన్. కానీ ఎక్కువ జీవితాన్ని గడిపింది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో. అనుభవించింది కటిక దారిద్ర్యం. చేసింది హోటల్లో సర్వర్ ఉద్యోగం. పిడికెడు మెతుకులకోసం ఎన్నో కష్టాలు. కానీ తెలుగు సాహిత్య లోకానికి తేజోవంతమైన రచనలు చేశాడు. అపూర్వమైన వచన రచనలు అందించాడు. పేదరికంలోంచి, జీవనపరిస్థితుల్లోంచి కడగండ్లనే అక్షరాలుగా మనకు అందించిన రచయిత శారద. అసలు పేరు నటరాజన్. అతి తక్కువకాలంలోనే శాశ్వతంగా నిలిచే కథలు, నవలలు రాశాడు.      నటరాజన్ జన్మస్థలం తమిళనాడులోని పుదుక్కోట. తల్లి బాగీరథి, తండ్రి సుబ్రహ్మణ్యయ్యరు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు నటరాజన్. ఇద్దరు అక్కలు తెనాలిలో ఉండడం వల్ల పన్నెండేళ్ల వయసులో తండ్రిని తీసుకొని తెనాలి వచ్చాడు. జోలెపట్టి దేవాలయాల చుట్టూ తిరిగాడు, వారాలు చేసుకున్నాడు. చివరకు తండ్రి పోషణార్థం హోటల్లో సర్వర్ గా చేరాడు. అయినా నిత్య దారిద్ర్యం. దాంతోపాటు నటరాజన్ ను మూర్ఛరోగం వేధించేది. ఇదాంతా ఒక ఎత్తైతే నటరాజన్ చిన్నప్పటి నుంచి సాహిత్యాభిమాని. తెనాలి వచ్చేనాటికే తమిళంలో అనేక పుస్తకాలు చదివారు. తెనాలి వచ్చాక సొంతగా తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. పురాణాలు, ప్రబంధాలు, ఆధునిక సాహిత్య పుస్తకాలు చదువుకున్నాడు. చలం నుంచి కొడవటిగంటి కుటుంబరావు వరకు, విశ్వనాథ నుంచి త్రిపురనేని రామస్వామి వరకు, గోరా నుంచి శ్రీశ్రీ వరకు అందరి పుస్తకాలను ఇష్టపడ్డాడు. పైగా ఆరోజుల్లో వచ్చిన అ.ర.సం. (అభ్యుదయ రచయితల సంఘం)తో సంబంధాలు కొనసాగించాడు. తెనాలిలోని లైబ్రరీనే అతనికి ఆరాధ్యదేవతయ్యింది.     నటరాజన్ పేదరికంలో మగ్గుతున్నా సాహిత్య అభిలాషను మాత్రం వదులుకోలేదు. ప్రజావాణి అనే రాతపత్రికను నడిపారు. కొంతకాలం చంద్రిక పత్రికనూ కొనసాగించారు. అలానే నవలలు, కథలు రాశారు. వీరి మొదటి కథ ప్రపంచానికి జబ్బుచేసింది 1946లో ప్రజాశక్తిలో ముద్రితమయ్యింది. అప్పటి నుంచి శారద రచనలు తెలుగు స్వతంత్ర, జ్యోతి, విశాలాంధ్ర, యువ, రేరేణి వంటి పత్రికల్లో వచ్చాయి. 1950లలో వీరి నవల ఏది సత్యం వచ్చిన నెలలోనే ప్రతులన్నీ అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. వీరి రచనలు వస్తు, శిల్పరీతుల్లో చాలా గొప్పవి. నటరాజన్ 1948 నుంచి 1955 వరకు అంటే ఏడేళ్ల కాలంలోనే తెలుగు సాహిత్యంలో నిలిచే రచనలు చేశాడు. పదిపన్నెండు నవలలు, వందకు పైగా కథలు రాశారు. మన దురుద్రుష్టం ఏమిటంటే- వాటిలో ఇప్పుడు కొన్ని దొరకడం లేదు.రక్తస్పర్శ కథా సంపుటి, శారద నవలలు, శారద రచనలు అనే మూడు పుస్తకాల రూపంలో వీరివి కొన్ని రచనలు దొరుకుతున్నాయి. కథా వస్తువులో, సంవిధానంలో పరిణతి చెందిన రచయిత శారద. కథను చెప్పినట్లు కాకుండా చూసినట్లు చెప్పేవాడు. అందుకే శిల్పప్రజ్ఞ, సునిశిత దృష్టితో కనిపిస్తాయి వీరి కథలు.                శవం విలువ కథలో సున్నిత మనస్కుడు అయిన అర్జునరావు, శవంతో ఏడుస్తున్న ఇద్దరు మహిళలను చూసి చాలా స్పందిస్తాడు. పైగా పోలీసుకు ఈ విషయాన్ని చెప్తాడు. పోలీసు మాత్రం బతికున్నప్పుడు చెయ్యాలి సాయం కానీ, చనిపోయాక కాదు అని పట్టించుకోడు. రాత్రికి వచ్చిన అర్జునరావుకు అది శవం కాదని, వాళ్లిద్దరు స్త్రీలు నాటకం ఆడారని తెలిసి ఆశ్చర్యపోతాడు. అలానే మరలోచక్రం కథలో ఓ స్త్రీ ఆదర్శాలు వల్లించే భర్త, అన్న, తండ్రి నుంచి దూరంగా హోటలు అతనితో వెళ్లిపోతుంది. నాకు ఆదర్శాలు అక్కర్లేదు, అతనికి నేను అవసరం, ఆదర్శాలు అక్కర్లేదు, సాధ్యమయినంత వరకు నన్ను బాగా చూసుకుంటున్నాడు అని సమాధానం ఇస్తుంది. స్వాతంత్ర్య స్వరూపం కథలో ఓ శిల్పి అందరి అధికారుల, రాజకీయ నాయకుల అభిప్రాయాలతో తయారు చేసిన స్వాతంత్ర్య విగ్రహాన్ని ఆయుధాలతో కూడిన దెయ్యంలా వర్ణిస్తాడు శారద. సంస్కరణ కథలో హరిజనుల దేవాలయ ప్రవేశాన్ని, స్త్రీ స్వాతంత్ర్యాన్ని చర్చిస్తూ- అణగారిన వాళ్లకు అన్నం పెట్టించాలి. చదువులు చెప్పించాలి. గానీ దేవాలయ ప్రవేశం ఎందుకు... ఉన్న మతి పోవడానికా... అని ప్రశ్నిస్తాడు. సంస్కరణల్లో ఉన్న లోపాలను నిజాయితీగా ఎత్తిచూపుతాడు. ఇలా వీరి కథలన్నీ సమాజాన్ని నగ్నంగా, కుహనా విలువలను విమర్శిస్తాయి. అసలు సమస్య, గొప్పవాడి భార్య, కోరికలే గుర్రాలయితే, అసలు సమస్య, రక్తస్పర్శ, వింత ప్రకృతి, స్వార్థపరుడు, క్షణంలో సగం, దేశమును ప్రేమించుమన్న, కొత్తవార్త, వింతలోకం, ఎగిరే పళ్ళెం, లోహపు బిళ్లలు ఇలా ప్రతి కథా ఓ ఆకలి లాంటిదే. ఆత్రుతగా చదవ మంటుంది. ఆక్రోషాన్ని, ఆవేశాన్ని, నిజాన్ని చెప్తుంది. ఏది సత్యం, అపస్వరాలు, మంచీ చెడు వంటి నవలలు అప్పటికీ ఇప్పటికీ సమాజంలోని చీకటి కోణాలను, వ్యక్తుల మధ్య తిరగాడే ఆలోచనల పరంపరను వివరిస్తాయి. ఏది సత్యం నవలలో పార్వతి భర్త సాంబశివరావుకు రైస్ మిల్లులో కాలు విరిగితే కుటుంబ బాధ్యతను తనే నెత్తికి ఎత్తుకుంటుంది పార్వతి. కానీ భర్త క్రమక్రమంగా అవమానిస్తాడు, అనుమానిస్తాడు. అతనికి శరీరమే కాదు మనసు అవిటిదని శారద చెప్పకనే చెప్తాడు నవలలో. మంచీ చెడు నవలలో యాభై ఏళ్ల భద్రయ్య ఇరవై ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొడుకు ఏమీ మాట్లాడడు. అలానే భద్రయ్య స్నేహితుడు సుదర్శనం భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆమె మొదటి భార్య కూతురిని నానా కష్టాలు పెడుతుంది. ముఖం కూడా కాలుస్తుంది. ఇలా ఆ రెండు కుటుంబాల మధ్య జరిగే అనేక సన్నివేశాలను, సంఘటనలను శారద అద్భుతంగా రాస్తారు. మొత్తంగా వీరి నవలల్లో కూడా మనుషులు, ధనం, మానవీయ విలువలు, అప్పుడే ప్రవేశించిన పెట్టుబడీదారి సమాజంలోని స్థితిగతులు...స్వభావం ఉంటుంది.       మొత్తంగా శారద రచనలు అన్నీ ఆనాటి సమాజానికే కాదు, ఈనాటి సమాజానికి ఎంతో అవసరం. మనిషి తనను తాను అంచనా వేసుకోడానికి, నిర్దేశించుకోడాని, రుజుమార్గంలో నడవడానికి అవసరం.                                                      ........డా. ఎ.రవీంద్రబాబు

వివిన మూర్తి

వివిన మూర్తి తెలుగు కథా సాహిత్యాన్ని కాలీపట్నం రామారావు, కొడవటిగంటి, రావి శాస్త్రి వంటి వారు సుసంపన్నం చేస్తున్న కాలంలోనే వారి ప్రభావంతో ఎందరో రచయితలు కలం పట్టారు. వారి దృక్కోణం నుంచి, వారి ప్రభావంతో కథలు రాశారు. సమాజానికి, సాహిత్యం ఎలా తోడ్పాటు అందిస్తుందో తమ కథలు ద్వారా నిరూపించారు. అలాంటి కథా రచయితల్లో గుర్తుంచుకోవాల్సిన రచయిత వివిన మూర్తి. మారుతున్న సమాజ స్థితిని, ఆర్థిక మూలాల్లో వచ్చిన సూక్ష్మ, స్థూల పరిణామాల్ని పట్టుకొని కథల రూపంలో అందించారు వివిన మూర్తి. 1970ల నుంచి విరివిగా కథా రచన చేశారు. తెలుగు కథను పునరుద్ధరించాలి అని సదస్సులు, సమావేశాలు జరుగుతున్న కాలంలో కథను పీఠం ఎక్కించడానికి తన వంతు కృషి చేశారు వివిన మూర్తి. వివిన మూర్తి తూర్పు గోదావరి జిల్లాలోని రామాపురంలో పుట్టారు. పాలిటెక్నిక్ పూర్తిచేశారు. కొంతకాలం చిన్నాచితక ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత బెంగళూరులో భారతీయ నౌకాదళానికి చెందిన క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేశారు. ఇందువల్ల గ్రామ వాతావరణాన్ని, నగర జీవితాన్ని అత్యంత సమీపంగా పరిశీలించే అవకాశం కలిగింది వివిన మూర్తికి. అందుకే వారి కథలు భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడీదారి సమాజాన్ని, అలానే ప్రపంచీకరణ దుస్థితిని సమగ్రంగా ఆకలింపుచేసుకున్నట్లు కనిపిస్తాయి. అలానే ఆ ఇతివృత్తాలకు తగిన శిల్పాలను ఎన్నుకోవడం వివిన మూర్తి ప్రత్యేకత. అసలు సాహిత్యంలోకి చాలా ఆలశ్యంగా వచ్చారు వివిన మూర్తి అని విమర్శకులు ప్రశంసిస్తారు. అంటే వివిన మూర్తి మొదట పద్యాలు రాసేవారు. ఓ కావ్యాన్ని కూడా వెలువరించారు. సాహిత్య అక్షరాల మహాత్మ్యం కార్యహీన మాన్యతముల పౌ రోహిత్యం సత్యధైర్య రాహిత్యం కీర్తికి సుఖరాజపథంలే.. ఇలా పద్యాలు రాసే వివిన మూర్తి కాలక్రమంలో అద్బుతమైన కథలు, నవలలు రాశారు. భాషలో, భావంలో, వస్తు ఎంపికలో అన్నింటిలో సమూలంగా మార్పు చెందారు. దీనికి కారణం వారి దృక్పథంలో వచ్చిన మార్పే అంటారు అభిమానులు. వీరి మొదటి కథ "రొట్టెముక్క" 1976లో ప్రచురితం అయింది. వీరి నవలలు కూడా గొప్పవే. మొదటి నవల "వ్యాపార బంధాలు" 1986లో వచ్చింది. రెండో నవల "విమానం వచ్చింది". అద్బుతమైన శైలితో ఉంటుంది. ఇది 1989లో వచ్చింది. "హంసగీతి" అనే మరో నవల చారిత్రాత్మకమైన ఇతివృత్తంతో కూడుకున్నది. అత్యంత ప్రతిభతో ఆకాలం నాటి సమాజాన్ని చిత్రించారు ఇక కథా రచియితగా వివిన మూర్తి సుమారు నూటయాభై పైనే రాశారని అంచనా. అయితే ఇవి పూర్తి సంపుటాలుగా రాలేదు. కేవరలం 24 కథలు మాత్రమే "ప్రవాహం", "దిశ" అనే సంపుటాలుగా వచ్చాయి. వీటిపై పరిశోధనలు కూడా జరగలేదన్నది తెలుస్తున్న సత్యం. మొత్తంగా వీరి కథల్లో మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలు ప్రభావితం చేస్తాయి అన్న భావన ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినా దోపిడీలో మార్పు రాలేదన్నది వీటిలో కనిపించే తత్త్వం. అందుకే సామాజిక బాధ్యత ఎరిగి కథలు రాసిన వ్యక్తిగా వివిన మూర్తిని గుర్తించాలి. వంకర చూపులు, ముంజలు, కృష్ణస్వప్నం, పయనం పలాయనం, పాడుకాలం, మాయ - మహామాయ, ప్రవాహం, దళిత సత్యం, చేటపెయ్య, స్పృహ, ప్రపంచమొక పద్మవ్యూహం... వంటి కథలు ఎన్నో వీరిలోని కథా రచయితను, శిల్ఫసౌందర్యాన్ని మనకు పట్టి చూపిస్తాయి. ముఖ్యంగా 1970 నుంచి 1990 వరకు సమాజం మారిని విధానాన్ని ప్రతిఫలిస్తాయి. ఉదాహరణకు "వంకర చూపులు" కథలో ఓ ఇల్లాలు పాత గుడ్డలతో బొంత కుడుతుంది. ఆ బొంతను ఆ ఇంట్లో వారు దక్కించుకోవడంలో ఎవరి శ్రమ ఎంత అనేదే ఈ కథ ఇతివృత్తం. అత్త ఆ చీరల పెట్టుబడి నాది అంటుంది. ఆడపడచు శ్రమ చేయకుండా నాకు కావాలి అంటుంది. చివరకు కోడలు ఆ బొంతను పొందడంతో శ్రమించే వారికే ఫలితం దక్కాలి అని రచయిత చెప్తాడు. అలానే "ముంజెలు" కథలో పొలంలో ఉన్న తాటిచెట్ల ముంజెలు కూడా వ్యాపారం కావడంతో వాటిని అమ్ముకొని బతికే కూలి సత్తెయ్య కష్టాలుపడాల్సి వస్తోంది. ఇక ప్రపంచీకణ స్వభావాన్ని చిత్రించిన కథ "కృష్ణస్వప్నం". అమెరికా అధ్యక్షునికి కృష్ణుడు కలలో కనిపించి నాగరిక సమాజాన్ని నిర్మించాలంటే ఆయుధాలు అవసరం, అప్పుడు మేము కూడా ఖాండవ వనాన్ని దహనం చేసి, నాగులను ఊచకోత కోసం అని చెప్తాడు. నీవు నాకు వారసునివి అని బోధ చేస్తాడు. తర్వాత హృదయం లేని పెద్దభూతం అమెరికా అధ్యక్షుని ఎదుట ప్రత్యక్షమై చిన్న బిల్లాగా మారి అతని పొట్టలోకి పోతుంది. ఇలా కథను ఊహాత్మక శిల్పంతో రాయటం వివిన మూర్తి ప్రతిభకు నిదర్శనం. కొత్తగా ప్రవేశించిన ప్రైవేటీకరణను, ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని కూడా తన కథల్లో చెప్పాడు వివిన మూర్తి. రావి శాస్త్రి లాగే "ఋక్కులు" పేరుతో కథలు రాశారు. వీరు రాసిన స్వేచ్ఛను గురించి "ఆద్వైతం", వాంఛను గురించి "యయాతి", భద్రత గురించి "స్పర్శ" వంటి కథలు ఉత్తమమైనవనే చెప్పాలి. గోదావరి నదిని గోదారిగాడుగా తన కథలో పాత్రచేసి అంతరార్థ కథానాన్ని, పురాణ పాత్రైన హరిశ్చంద్రుని పాత్ర చేసి పురా కథల కథనాన్ని, చనిపోయిన దూడ చర్మంలో గడ్డి కుక్కే పనిని ప్రతీకగా తీసుకొని ప్రతీకాత్మక కథల్ని రాశారు వివిన మూర్తి. ఇలా తెలుగు భాషలో సంక్లిష్టమైన సమాజాన్ని, అంతకంటే సంక్లిష్టమైన కథనాలతో పాఠకుల మదికి చేరేలా కథలు రాసిన వ్యక్తి వివిన మూర్తి. నేటికీ జీవితం పట్ల, సమాజం పట్ల నిబద్ధతతో కథలు రాస్తున్న అతి తక్కువ మందితో వివిన మూర్తి ఒకరు. కథానిలయం నిర్వాహకులలో ఒకరుగా ఉన్నారు. ఇటీవలే "దిద్దుబాటు" కన్నాముందే 92 కథలు ఉన్నాయని వాటిని వెలుగులోకి తేవడానికి వెదుకులాడారు వివిన మూర్తి. కథలు రాయడమే కాదు, కథా సేవ చేస్తున్న కథాభిలాషి వివిన మూర్తి. - డా.ఎ.రవీంద్రబాబు

వర్షం

  వర్షం     రావిశాస్త్రి చిరునామా అక్కరలేని రచయిత. వృత్తి లాయరైనా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. తెలుగు నవలా సాహిత్యానికి అల్పజీవి లాంటి మనో విశ్లేషణాత్మక నవలను అందించారు. ఉత్తరాంధ్ర మాండలిక భాషను సొగసుగా రచనల్లో వాడారు. కథను ఎలా రాయాలో తెలుసుకోడానికి గొప్ప ఉదాహరణలు రావి శాస్త్రి కథలు. అసలు కథను ఎక్కడ ప్రారంభించాలో, ఎలా మలుపు తిప్పి మెరుపులాంటి ముగింపు ఎలా ఇవ్వాలో రావి శాస్త్రికి బాగా తెలుసు. అతను రాసిన కథల్లో ప్రతి ఒక్కటీ ఓ పాఠం లాంటిదే. అలాంటిదే వర్షం కథ. సంకల్పం అనేది మనిషికి ఎంత అవసరమో ఓ పిల్లాడి చేత చెప్పిస్తాడు ఈ కథలో.       క్లుప్తంగా కథా విషయానికి వస్తే- వర్షం దబాయించి కొడుతుంది. కలకత్తా వెళ్లాల్సిన సిటీబాబు అడివిపాలెం నుంచి వచ్చి వర్షం వల్ల కమ్మలపాక టీ దుకాణంలో చిక్కుకు పోతాడు. ఆ టీ దుకాణాన్ని ఒక తాత నడుపుతుంటాడు. అక్కడి నుంచి సిటీబాబు స్టేషన్ కు వెళ్లాలంటే రెండు కోసుల దూరం నడవాలి. లేదా బస్సు, లేదా బండి. వర్షం వల్ల అవేవి రావు. వర్షం మాత్రం మబ్బులు పట్టి, జోరుగా కురుస్తుంది. ఆ సిటీబాబు పేరు పురుషోత్తం. తాత వర్షంలో వెళ్లలేవని చెప్తాడు. పైగా- కత్తుల్లా మెరుపులు, కొండలు బద్దలు కొట్టినట్లు ఉరుములు, శివాలెత్తినట్లు గాలి, పగబట్టినట్లు వర్షం.. దాంతో పురుషోత్తంకు ఎటూ పాలుపోక అక్కడే నిలబడి ఆలోచనల్లో మునిగిపోతాడు.           కలకత్తా వెళ్లాల్సిన పురుషోత్తం మామ మాట విని అడవిపాలెంలో మున్సబు కూతురుని చూడడానికి వెళ్తాడు. కలకత్తా అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా మేనమామ మాట కాదనలేక పెళ్లికూతుర్ని చూడడానికి అడివిపాలెం వెళ్తాడు. మున్సబుగారిది పాతకాలం నాటి పెంకుటిల్లు. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, తులసి మొక్క. దండెం మీద ఆరేసిన తెల్లచీర, దీపపు వెలుగులో దేవతలా పెళ్లికూతురు కనిపిస్తుంది. తనను నిదానంగా బరువైన రెప్పల్లోంచి చూస్తుంది. పెళ్లి కూతురుని, తల్లి కావాలని మాట్లాడిస్తుంది. పెళ్లికూతురి తటాకాల్లాంటి కళ్లు వెలిగే చుక్కల్ని, మెరిసే చంద్రుడ్నే కాదు మండేసూర్యుడ్ని కూడా స్పష్టంగా చూడగలవు. అలా ఆలశ్యం అయిపోయి మర్నాడు ఉదయం బంధువులింట్లో భోజనం చేసి ఎండ్లబండిమీద బయల్దేరతాడు పురుషోత్తం. మున్సబు గారి ఇంటి దగ్గరకు వచ్చే సరికి పెళ్లి కూతురు గడపలో నిలబడి వారగా చూస్తుంది. ఆ చూపు పురుషోత్తంని వెంబడిస్తుంది. ఎడ్లబండి సాగుతూ ఉంటే, అతనికి నర్సు జ్ఞాపకం వస్తుంది. ఆసుపత్రికి వెళ్లినప్పుడు పురుషోత్తం బరువును మెషిన్ మీద చూస్తుంది నర్సు. తర్వాత భయం వద్దు, జబ్బు నయం అవుతుంది అని భరోసా ఇస్తుంది. అప్పుడు పురుషోత్తం కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక కంటతడి పెడతాడు. చుట్టూ అందమైన ప్రకృతిని చూస్తూ, ఎండ్లబండిపై వస్తుంటే వర్షం ప్రారంభమవుతుంది. ఎలా కమ్మపాక టీ దుకాణంలోకి వచ్చేసరికి వర్షం బాగా ఎక్కువ అవుతుంది.                టీ దుకాణం అంతా స్తబ్దతగా ఉంటుంది. తాత ముక్కాలిపీట మీద కూర్చొని చుట్ట తాగుతాడు. నీటిబొట్లు పాకపైనుంచి పాముల్లా జారుతూ ఉంటాయి. వర్షం మాత్రం ఆగదు. తాతా వర్షంలో బొగ్గులకోసం పంపిన తన మనవడికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ వర్షంలో ఎలా వస్తాడో... ఎదురుపోవాలంటే వర్షం పెద్దగా ఉంది అని కంగారు పడుతుంటాడు. నిప్పు ముట్టిద్దామని పురుషోత్తమును అగ్గి అడుగుతాడు. లేదని తెలుసుకొని ఇంకా నిరుత్సాహపడతాడు. ఇనుప ఊసల్లా వర్షం పడుతుంటే పురుషోత్తం ఆలోచనల్లోకి వెళ్తాడు. తన గురించి తను ఆలోచిస్తాడు. కలకత్తా వెళ్లి వచ్చాక పెళ్లి చూపులకు వెళ్లాల్సింది. కానీ... ఎప్పుడూ అంతే... చదువుకోకపోతే చెడిపోతావు అన్నారు. చదువుకున్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవు అన్నారు. బుద్ధిగా ఉన్నాడు. ఈత రాకుండా నీళ్లల్లో దిగకూడదు అన్నారు. దాన్నీ పాటించాడు. రాజమార్గాలు ఉండగా, సందులెమ్మట తిరగకు అన్నారు. సందులెమ్మట తిరగలేదు. అన్యాయం, అధర్మం, నీకేల అటువైపు... నీ పని నువ్వు చేసుకో అన్నారు. అలానే ఉన్నాడు. ఇలా ఆలోచిస్తున్న పురుషోత్తంకు వర్షంలో తడుస్తూ, బొగ్గులమూట భుజాన వేసుకుని ధారల్ని చీల్చుకుని వస్తున్న తాత మనవడు కనిపిస్తాడు.       లోపలకు వచ్చి, బొగ్గుల మూటను పాకలో ఓ వైపు విసిరేసి, బట్టలు పిండుకొని గంతులేస్తాడు. ఎలా వచ్చావు అని తాత అడిగితే ఒరసాన్ని సంపిడిసి పెడతాడీపోతురాజు అని సమాధానం ఇస్తాడు పిల్లోడు. ఆ మాట పురుషోత్తంలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అతనిలో నిస్తేజంగా ఉన్న శక్తిని బద్దలు కొట్టి పైకి తెస్తుంది. అంతే... తాతకు కూడా చెప్పకుండా ఒకటిన్నర గంటలో రెండుకోసుల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ చేరాలని ఆ పెద్ద వర్షంలో బయలుదేరుతాడు. మసక చీకట్లో తిన్నగా, సూటిగా ఈదురుగాలి కెదురుగా, వర్షాన్ని సరుకు చేయకుండా, తెర్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెళ్తున్నాడు పురుషోత్తం... అతడ్ని తాత మెచ్చుకున్నాడు. అని కథ ముగిస్తాడు రావిశాస్త్రి.          పాత్రల సంభాషణల్లో, కథ చెప్పడంలో అక్కడక్కడా అద్భుతంగా ఉత్తరాంధ్ర పలుకుబడులు వాడారు రావిశాస్త్రి. అలానే కథంతా అద్బుతమైన వర్ణనలు రాశారు. కథ వర్షంతో మొదలై, వర్షంతో ముగుస్తుంది. ఆ వర్షంలో ఒక వ్యక్తి పొందిన జీవన మార్గదర్శకాన్ని చెప్పారు. సందర్భాను సారంగా ప్రతీకలు వాడారు. మనిషి సంకల్పం కంటే సమస్య చిన్నదని ఓ పన్నెండేళ్ల పిల్లాడితో చెప్పించారు రావిశాస్త్రి. వీరి అన్ని కథలు గొప్పవైనా ఈ కథ ప్రత్యేకమైంది అని చెప్పొచ్చు.                                                           - డా.ఎ.రవీంద్రబాబు

చొక్కాపు వెంకట రమణ

  చొక్కాపు వెంకట రమణ                                                                                                  తెలుగులో బాలసాహిత్యానికి అతనొక చిరునామా... పిల్లలే నా ప్రపంచం అని ప్రకటించుకున్న బాలసాహితీ వేత్త. చిన్నారుల ఊహల్ని, కలల్ని తన రచనల్లో ప్రస్తావిస్తూ, వారిలో విజ్ఞానం, వినోదం, ఆశావాద దృక్పథం, నీతి, మానవీయత వంటి లక్షణాలను పెంపొందిస్తున్న బాలబంధువు చొక్కాపు వెంకట రమణ. బాలల వికాసమే తన మార్గంగా, పిల్లల ప్రపంచమే తన ప్రపంచంగా జీవిస్తున్న రచయిత ఆయన. కేవలం పిల్లల కోసమే సాంస్కృతికి కార్యక్రమాలు, సదస్సులు, రచయితల సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఆయనను బాలసాహితీ విభూషణ అని పిలుస్తారు.       చొక్కాపు వెంకటరమణ హైదరాబాదులో ఎప్రిల్ 1, 1948న జన్మించారు. తెలుగు సాహిత్యంలో బి. ఎ. చదువుకున్నారు. తొలినాళ్లలో జయశ్రీ, జనత వంటి పత్రికల్లో పనిచేశారు, తర్వాత ఈనాడు సంస్థవారి విపుల, చతుర పత్రికల్లో సహసంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమి ప్రచురణల విభాగానికి ప్రొడక్షన్ ఎడిటర్ గా 18 ఏళ్లు విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే పిల్లలకోసం సుమారు వంద పుస్తకాలను ముద్రించారు. అంతేకాదు బాలల రచయితల సంఘం కార్యదర్శిగా, తెలుగులో తొలి బాలల వ్యక్తిత్వ వికాస మాసపత్రిక ఊయలకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. అప్పుడు చిన్నారులకోసం కథారచన శిక్షణ శిబిరాలు, బాలసాహిత్య రచయితల సదస్సులు నిర్వహించారు. తెలుగు నర్సరీ రైమ్స్ వర్క్ షాపులో పనిచేసి పిల్లలకోసం ఎన్నో గేయాలు రాశారు.       ఎప్పుడు బాల సాహిత్య రచనలోనే మునిగి ఉండే చొక్కాపు వెంకట రమణ సుమారు ఆరవైకి పైగా బాలసాహిత్య గ్రంథాలను ప్రకటించారు. అల్లరి సూర్యం, చెట్టుమీద పిట్ట, కొతి చదువు, సింహం - గాడిద, బాతు - బంగారుగుడ్డు, గాడిద తెలివి, తేలు చేసిిన మేలు, ఏడు చేపలు, పిల్లలు పాడుకునే చిట్టిపొట్టి పాటలు, ఏది బరువు, మంచికోసం, నెలలు వాటి కతథలు, అక్షరాలతో ఆటలు, పిల్లలకోసం ఇంద్రజాలం, గోరింక గొప్ప... ఇలా ఎన్నో పుస్తకాలు వారికి కీర్తిని తెచ్చిపెట్టాయి. బాల సాహిత్యంలో మంచి పుస్తకాలుగా నిలిచిపోయాయి. జర్నలిస్టుగా కూడా వెంకటరమణకు మంచిపేరు ఉంది. బాల చంద్రిక పిల్లల మాసపత్రికకు సంపాదకుడిగా, బాల చెలిమి, చెకుముకి మాసపత్రికలకు గౌరవ సలహాదారునిగా వ్యవహరించారు. వీరు వివిధ దిన, వార, మాస పత్రికల్లో శీర్షికలూ నిర్వహించారు. సుమారు 500లకు పైగా వ్యాసాలు, కథలు, గేయాలు, శీర్షికలు  రాశారు. ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలో బాలభూమి వంటి ప్రత్యేక కాలమ్స్ నిర్వహించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో వీరు నిర్వహించిన ఊయలకు మంచిపేరు వచ్చింది. వీరి చెట్టుమీద పిట్ట కథా సంపుటి పర్యావరణం గురించి చిన్నారుల్లో చైతన్యాన్ని నింపుతుంది. దీనికి పలు అవార్డులు కూడా వచ్చాయి.          చొక్కాపు వెంకటరమణ కేవలం రచయితే కాదు. మెజీషియన్  కూడా. వేలాదిగా ప్రదర్శనలు ఇస్తూ భారతదేశం అంతా తిరిగారు. మేజిక్ చాప్లిన్ గా పేరు తెచ్చుకున్నారు. బాలసాహిత్యం, విద్యా విషయక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక పదవులు, హోదాలలో పనిచేశారు. బాలసాహిత్యానికి సంబంధించి అనేక సభలలో ప్రసంగాలు చేశారు. వీటితోపాటు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. వికలాంగులకు ప్రోత్సాహాన్నిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. కృత్రిమ కాళ్ల పంపిణీ, అనాథలకు మానసిక సంతోషాన్నిచ్చే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లాంటివి స్వచ్ఛందంగా చేస్తున్నారు.          వీరి కృషికి గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎన్నో సత్కారాలు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, చైతన్య ఆర్ట్ థియేటర్స్ వారి సేవాభూషణ సత్కారం, లిమ్కాబుక్ రికార్డులు... ఇలా ఎన్నో... ఇటీవలే కేంద్రసాహిత్య అకాడమి బాలసాహిత్యవేత్తగా వీరిని గుర్తించి పురస్కారాన్ని ప్రకటించింది. ఇది తెలుగు వారందరూ గర్వించాల్సిన విషయం. అందుకే చొక్కాపు వెంకటరమణ బాలసాహిత్యంలో ఇంకా కృషి చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.   - డా. ఎ.రవీంద్రబాబు

దాశరథి కృష్ణమాచార్య

  దాశరథి కృష్ణమాచార్య          తెలంగాణ మాగాణుల్లో ఉద్యమాలకు తన కవితల ద్వారా ఊపిరులు ఊదాడు. స్వయంగా ఉద్యమంలో పాల్గొని జైలు గోడల మీద అక్షరమై మెరిశాడు. నిజాం నిరంకుశ పాలనను తన కవితలతో చీల్చి చండాడాడు. ఆవేశంలో, ఆలోచనలో ఆయన కవితలు కత్తి అంచుపై కదం తొక్కాయి. అభ్యుదయ భావాలతో, సమాజంలోని అనేక సమస్యసలపై అలుపెరుగని పోరాటం చేశాడు. జీవితంలో, పోరాటంలో, కవిత్వంలో ఎక్కడా రాజీ పడకుండా జీవించాడు. నిజాం పాలన అంతమయ్యాక సినీ కవిగా అందరి అభిమానాలు చూరగొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణను కీర్తించాడు దాశరథి కృష్ణమాచార్య.        దాశరథి కృష్ణాచార్య వరంగల్ జిల్లాలోని చినగూడూరు గ్రామంలో జన్మించాడు. జూలై 22, 1925న పుట్టిన దాశరథి వారిది శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబం. తండ్రి దగ్గర  సంస్కృతం నేర్చుకున్నాడు. పాఠశాలలో ఉర్దూ  మాధ్యమం ఆ రోజుల్లో నిర్బంధ విద్య కావడం వల్ల ఉర్దూ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటున్న దాశరథి ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే గాలీబ్ కవిత్వంలోని సౌందర్యాన్ని, ఇక్బాల్ కవిత్వంలోని విప్లవ భావాల్ని అవగతం చేసుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొన్నాడు. వీరిపై  శ్రీశ్రీ ప్రభావం బాగా ఉండేది. స్టేట్ కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకొని హైదరాబాదు రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపాలని ఊరూరా తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చాడు. దాంతో అతనిని ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. జైలు గోడలపై-                        ఓ నిజాము పిచాచమా, కానరాడు                        నిన్ను బోలిన రాజు మాకెన్నడేని    లాంటి కవితలు రాశారు.జైలు నుంచి తప్పించుకున్నాడు. సైనికులు గుర్రాలపై వెంటపడ్డా తప్పించుకున్నాడు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించాక ఆగిపోయిన చదువను కొనసాగించాడు. బి.ఎ. పట్టా తీసుకున్నాడు. గ్రామ పంచాయితీ తనిఖీ అధికారిగా ఉద్యోగం చేశారు. హైదరాబాదు, మద్రాసు ఆకాశవాణి కేంద్రాలలో ఉద్యోగాలు చేశారు.         దాశరథి కవిత్వం అభ్యుదయ భావాలతో, ప్రజలను చైతన్య వంతం చేసేదిగా ఉంటుంది. వీరు సుమారు 30కి పైగా కవితా సంపుటాలను వెలువరిచారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, కవితాపుష్పకం. తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు వంటి గొప్ప రచనలు చేశారు. వీటితోపాటు గాలీబ్ గీతాలను ఉర్దూనుంచి అనువదించారు. యాత్రాస్మృతి వంటి రచనలూ చేశారు. పద్యం, గేయం, పాట, వచనం ఇలా అన్ని ప్రక్రియలలో రచనలు చేశాడు.దాశరధి కృష్ణమాచార్య కేవలం సాహిత్యానికి సంబంధించిన రచనలే చేయలేదు. చలనచిత్రాలకు అమూల్యమైన పాటలు ఎన్నో రాశారు. వాటిలో భక్తి, శృంగారం, అనుబందం గీతాలు ఎన్నో ఉన్నాయి. సుమారు 600లకు పైగా సినిమాలకు పాటలు రాశారు. పేరుకోసం ప్రయత్నించని కవి కావడం చేత వీరికి సినీ పరిశ్రమలో రావల్సినంత పేరు రాలేదని విమర్శకులు చెప్తారు.          రంగుల రాట్నం చిత్రంలో నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగివచ్చునో... అని భక్తుని ఆర్తిని దేవునితో విన్నివించాడు. బుద్ధిమంతుడు చిత్రంలో ననుపాలింపగ నడిచి వచ్చితివా అంటూ భక్తుడితో, దేవుణ్ని ఆరాధింప జేశాడు. ఇక శృంగారానికి సంబంధించిన పాటల విషయానికి వస్తే- ఆత్మీయులు చిత్రంలో చిలిపి నవ్వుల నినుచూడగానే, గూడుపుఠాణి చిత్రంలో తనివి తీరలేదే నా మనసు నిండలేదే అని ప్రేమలోని ఆనందాన్ని ప్రేమికుల ద్వారా వ్యక్తం చేశాడు. దాశరథికి ఉర్దూ భాషపై పట్టు ఉండడం వల్ల ఆ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషా పదాలను పాటల్లో అద్భుతంగా ప్రయోగించేవారు. పునర్జన్మ చిత్రంలో దీపాలు వెలిగె పరదాలు తొలిగె, నవరాత్రి చిత్రంలో నిషాలేని నాడు హుషారేమిలేదు, ఖుషీ లేనినాడు మజా ఏమీలేదు... లాంటి పాటల్లో వారి ఉర్దూ ప్రతిభ కనిపిస్తుంది. ముఖ్యంగా పండండటి కాపురం చిత్రంలో బాబు వినరా అన్నాతమ్ముల కథ ఒకటి పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లాంటిదే. అలానే ఆత్మీయులు చిత్రంలో మదిలో వీణలు మ్రోగె, ఆశలెన్నో చెలరేగె, అంతా మన మించికే చిత్రంలో నేనే రాధనోయి గోపాల పాటు వీణ పాటలుగా ప్రసిద్ధిపొందాయి. ఇప్పటికీ వీరు రాసిన తోటరాముడు చిత్రంలోని ఓ బంగరు రంగుల చిలకా పలుకవే పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అలానే కన్నె వయసు చిత్రంలో ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట అమ్మాయి అందాన్ని వర్ణించే విధానానికి ఓ మూలవిరాట్ లా మిగిలే ఉంటుంది. ఇక మూగ మనసులు చిత్రంలో పల్లెటూరి యువతి మనసును చెప్తూ- గోదారి గట్టుంది గట్టుమీద సెట్టుంది... అంటూ చివరకు అంతదొరకని నిండుగుండెలో ఎంత తోడితే అంతుంది అని ముగిస్తాడు పాటని ముగిస్తాడు దాశరథి. ఇంత గొప్పగా స్త్రీ హృదయాన్ని చెప్పడం అంత సామాన్య మైన విషయం కాదు.                   వీరికి అనేక గౌరవాలు, పురస్కారాలు దక్కాయి. ముఖ్యంగా దాశరథికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది. ఆగ్రా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డిలిట్ లను ఇచ్చాయి. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించింది.  ఇతనే చివరి ఆస్థాన కవి. దాశరథి రంగాచార్యకు స్వయంగా అన్న దాశరథి కృష్ణమాచార్యులు. అలాంటి దాశరథి అనారోగ్యంతో 1987న ఏ దివికో పారిజాతం కోసం ఈ భువిని విడిచి వెళ్లిపోయారు.                                              - డా. ఎ.రవీంద్రబాబు

పాలగుమ్మి పద్మరాజు

  పాలగుమ్మి పద్మరాజు ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా మనిషికి కొన్ని స్వాభావిక లక్షణాలు ఉంటాయని చెప్పిన కథకుడు పాలగుమ్మి పద్మరాజు. వాస్తవికతకు, మనిషి సహజత్వాన్ని అద్ది రచనులు చేశారు. మనసుకున్న సహజమైన నైజంలో పేద, గొప్ప అనే భేదం ఉండదని తన కథల్లో నిరూపించారు. అంతేకాదు తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన కథకుడు పాలగుమ్మి పద్మరాజు. కట్టుబాట్లు, సమాజం విధించిన నియమాల కొన్ని పరిస్థితుల్లో మనిషిని కట్టిపడేయలేవంటూ తను చిత్రీకరించిన పాత్రల ద్వారా వివరించారు. పద్మరాజు కథా రచయితే కాదు కవి కూడా. నాటకాలు, రేడియో నాటికలు, నవలలు, వ్యాసాలు, వ్యాసాలు, చలన చిత్రాలకు మాటలు, పాటలు కూడా రాశారు.            పద్మరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి మండలం, తిరుపతి పురంలో జూన్ 24, 1915లో జన్మించారు. ఎమ్.ఎస్సీ చదివారు. తర్వాత కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వం కళాశాలలో 1939 నుండి 1952 వరకు సైన్స్ అధ్యాపకులుగా పనిచేశారు. సత్యానందాన్ని వివాహం చేసుకున్నారు. ఎమ్.ఎన్, రాయ్ సిద్ధాంతలపై మక్కువతో వాటిని ప్రచారం చేశారు. హేతువాదిగా జీవించారు. 23 ఏళ్ల వయసులో తొలి కథ సుబ్బి నిప్రచురించారు. తర్వాత ఎన్నో విలువైన రచనలను తెలుగు ప్రజలకు అందించారు. మొత్తంగా 60 కథలు, 8 నవలలు, 30 కవితలు రాశారు.                పద్మరాజు 1951లో రచించిన గాలివాన కథకు 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారి ప్రపంచ కథల పోటీలో రెండో బహుమతి వచ్చింది. ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువాదం పొందింది. ఈ కథలో ప్రధాన పాత్ర రావుగారు. నిక్కచ్చిమనిషి. సొంతవైన అభిప్రాయాలు ఉంటాయి. ఆస్తికసమాజం వారు పిలవడంతో ప్రసంగించడానికి వేరే ఊరకి రైళ్లో బయలుదేరుతాడు. రైల్లో ఎక్కిన ముష్టి ఆమెను ఛీదరించుకుంటాడు. తుఫాను రావడంతో చివరకు ఆమె ఆసరానే పొందుతాడు. ఆయనకు ఆమె స్పర్శలో అప్పటివరకు ఆయన విధించుకున్న భావాలు, నియమాలు అన్నీ చెల్లాచెదురై పోతాయి. ఈ కథకు  1948లో వచ్చిన తుఫానులో పద్మరాజు నిజజీవితంలో ఎదుర్కొన్న సంఘటనే స్ఫూర్తి... అని చెప్పుకున్నాడు. మూడుగంటలు భార్య కూలిన ఇంట్లో నిస్సహాయరాలిగా పడిపోతే ఆయన అనుభవించిన మానసిక ఆందోళనే ఈ కథకు నేపథ్యం అని చెప్పారు. వీరు రాసిన మరో కథ పడవ ప్రయాణం. ఈ కథలో రంగి తనను కొట్టి, తగలెయ్యబోయిన వాడు వేరే ఆమెను ఉంచుకుంటే, ఆమెకు డబ్బులు అందించడానికి పోలీసుల చేతిలో తిట్లు, దెబ్బులు తింటుంది. అందుకే పద్మరాజుగారు- అణగారిన సమాజంలో జీవించే మనుషుల్లో మంచితనం ఉంటుంది, చెడ్డతనమూ ఉంటుంది. అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్న వారిలో కూడా ఈ రెండు స్వభావాలు ఉంటాయి అంటారు. సహజంగా మనిషి, మనిషే అనేది వీరి కథల్లో కనిపిస్తుంది. వీరి వాసనలేని పువ్వు, హెడ్ మాస్టారు, కొలవరానిదూరం ఇలాంటి తప్పక చదవాల్సిన కథలు.          ఇక నవలల విషయానికి వస్తే, పద్మరాజు బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన వంటి ఎనిమిది నవలలు రాశారు. వీరి రచనలు ప్రకృతి, సమాజంపై పూర్తి అవగహన కలిగిస్తాయి. జీవితాల మధ్య ఉన్న సంఘర్షణ తాలూకూ వాస్తవాలను విశధీకరిస్తాయి. మనిషి మనసులో ఉండే హృద్యమైన చప్పుడు అందరికీ ఒక్కటే అంటారు పద్మరాజు. ఏ స్థాయిలోలో ఉన్నా మనిషి బతుకులో, ఆలోచనల్లో వెలుగు నీడలు సహజమే అంటారు. ఇంకా అన్ని కళలు నశించిపోయినా, జీవితం మిగలాలని చెప్తారు. ఆదర్శాలకన్నా, జీవితపు విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు. అందుకే పద్మరాజు రచనలు ఆర్థిక సూత్రాల్లో, సామాజిక సిద్ధాంతాల త్రాసులో తూచడం కష్టం. మొత్తంగా చూసినప్పుడు వీరి కథలు వాస్తవికతతో, అలౌకికమైన అద్వైతంలోని మానవీయకోణాన్ని ఆవిష్కరించే విధంగా కనిపిస్తాయి. పద్మరాజు కవితలు పురిపాట్లు, చీకటి, ఓ భావి సంపుటాలుగా వచ్చాయి. వీరి కవితలు, గేయాలు లలితమైన పదాలతో, సౌందర్యవంతంగా సాగుతాయి.             పైరు గాలికి నాట్యమాడే             పైట రాపిడి తగిలి చిటుకున             పండిపోయిన దానిమ్మొకటి             పగిలి విచ్చింది             పండుదొండకు సాటివచ్చే             పడతి పెదవులలోన దాగిన             పండ్లముత్తెపు తళుకులన్నీ             పక్కుమన్నాయి...             అప్పుడు నేననుకున్నాను             అందానికి అర్థం ఇదేనని                              ఇలా హృద్యంగా, సొగసుగా, ప్రకృతిని వర్ణించేలా ఉంటాయి.         పాలగుమ్మి పద్మరాజు 1954లో వాహిని ప్రొడక్షన్ వారి బంగారుపాప సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాకు మాటలు రాశారు. సమారు 3 దశాబ్దాల పాటు చలనచిత్రరంగంలో కథ, మాటలు, పాటలు రాస్తూ పేరు తెచ్చుకున్నారు. నల్లరేగటి నవల మనవూరి కథ పేరుతో  సినిమాగా వచ్చింది. పడవ ప్రయాణం కథ స్త్రీ పేరుతో చిత్రీకరణ జరిగినా విడుదల కాలేదు. వీరు ముఖ్యంగా బంగారుపాప, భక్తశబరి, బంగారు పంజరం, రంగులరాట్నం, శ్రీరాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలకు పనిచేశారు. కృష్ణశాస్త్రికి మంచి మిత్రుడు, అలానే దాసరి నారాయణ దగ్గర ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు. పేరు లేకపోయినా పద్మరాజు  చాలా చిత్రాలకు రచనా సహకారం అందించారని వినికిడి. బికారి రాముడు చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.            కథకుడిగా, నవలాకారుడిగా, నాటక రచయితగా పేరు తెచ్చుకున్న పాలగుమ్మి పద్మరాజు ఫిబ్రవరి17, 1983న మరణించారు. ఆయన రచనల్లోని గొప్పతనాన్ని నేటితరానికి, తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి సాహితీ ప్రముఖుల మీద ఉంది.  - డా. ఎ.రవీంద్రబాబు

అన్యోన్యం

  అన్యోన్యం  - వాకాటి పాండురంగారావు మద్రాసులో జన్మించి, మద్రాసులోనే విద్యాభ్యాసం సాగించిన వాకాటి పాండురంగారావు ఎన్నో అద్భుతమైన కథలు రాశారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు.  ప్రజాపత్రిక, ఆనందవాణి పత్రికలలో ఉప సంపాదకులు,  సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అపరాజిత, ద్వాదశి, సృష్టిలో తీయనిది, శివాన్విత వంటి కథా సంపుటాలు ప్రకటించారు. వీరి రచనలు ఇతర భాషల్లోకి అనువాదాలయ్యాయి. ఆకాశవాణికై నాటికలు, ప్రసంగాలు రాశారు. వీరి కథలు మానవ సంబంధాల్లోని సున్నితమైన పొరలను తార్కికంగా వివరిస్తాయి. ఘాటుగా మనసులోతుల్ని విమర్శకు పెడతాయి. అలాంటిదే వీరి అన్యోన్యం కథ.            ఈ కథను రచయిత ఉత్తమ పురుష దృష్టికోణంలో రాశారు. వారిది మద్రాసుకు దూరంలో ఉన్న ఓ పల్లెటూరు. వాళ్ల బాబాయి మద్రాసులోని జార్జిటౌనులో ఉంటారు. పని మీద నగరానికి వచ్చిన రచయిత రెండు వారాలు వాళ్ల బాబాయి ఇంట్లో ఉంటాడు. అక్కడ అతనికి ఎదురైన మనుషులు, వారి జీవన పరిస్థితులు, ప్రవర్తన, వారు నివాసముండే ఇళ్లు... అన్నిటిని కథలో చెప్పారు వాకాటి పాండురంగారావ్.             వాళ్ల బాబాయి స్కూలు మేస్టారు. వారికి నలుగురు పిల్లలు. వారుండేది ఒక హాలు, చిన్న వంటగది కలిసున్న ఇల్లు. వారితో పాటు ఆ లోగిలిలో ఇంకా ఆరు వాటాలు ఉంటాయి. అందరికీ కలిపి బాత్ రూములు, పాయిఖానాలు రెండే. మిగిలిన వాటాల్లో టాక్సీడ్రైవరు, ఘటం వాయించే అయ్యర్, ఇడ్లీలు అమ్ముకునే ఆవిడ, పత్రికాఫీసులో పనిచేసే కుర్రాడు. గుడి పూజారి, వంటలు చేసే నటరాజన్ కుటుంబం ఉంటుంది. ఆ వాటాల మధ్య సన్నగా పొడుగ్గా పది, పదిహేను గజాల నడవా ఉంటుంది. నడవా పొడుగునా అరుగు ఉంటుంది. ఆ అరుగే  ఆ ఏడు వాటాల వారికి ఆటస్థలం, రంగస్థలం, పడకగది, కబుర్లు చెప్పుకునే స్థలం, కూరలవాళ్లు, పాలవాళ్లు బరువులు దించే స్థలం, ఆడవాళ్లు బయటచేేరితే ఉండేది కూడా ఆ అరుగుమీదే.           నటరాజన్ భార్య పేరు లక్ష్మి, వారికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు.  పెద్దబ్బాయి జులాయిగా తిరుగుతూ ఇంటికి తగాదాలు తెస్తూ ఉంటాడు. చిన్నకుర్రోడు ఒకటో తరగతి. పదహారేళ్ల కూతరు ఎనిమిదో తరగతి చదువుతుంటుంది. నటరాజన్ మాత్రం పెళ్లిళ్లకు, పార్టీలకు వంటలు చేయడానికి వెళ్తుంటాడు. నెలకు ఒకటి రెండు రోజులు మాత్రమే అతనికి పని ఉంటుంది. ఆ సంపాదన అతని ఇంటి అద్దెకు, అతను వేసుకునే తాంబూలానికే చాలదు. భార్య అతనిలా నల్లగా ఉండదు. తెల్లగా ఉంటుంది. లక్ష్మిఅమ్మాళ్ అనే సేఠ్ ఇంట్లో రెండు పూటలా భోజనం వండే పని ఆమెది. మధ్యాహ్నం కూడా అమె అక్కడే బోజనం తింటుంది. రాత్రిళ్లు ఇంటికి వచ్చేటప్పుడు గారో, కూరముక్కో, అరటి పండో తెస్తుంది. పిల్లలతో పాటు నటరాజన్ కూడా అవి తినేందుకు ముందుంటాడు.            లక్ష్మికి రెండు రోజులు సేఠ్ ఇంట్లో పండగ పని ఉండడం వల్ల ఇంటికి రాదు. సాయంకాలం ఇంటికి వచ్చిన రచయితకు నటరాజన్ భార్యను- బజారుముండ, దీనికి ఇల్లెందుకు, సెఠ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది... ... అని బూతులు తిడుతూ కనిపిస్తాడు. రాత్రి భోజనం తింటున్నా, బయటకు వచ్చి పడుకున్నా రచయితకు అవే ఆలోచనలు. అయితే నిద్రలో ఉన్న రచయితకు అస్పష్టంగా కొన్ని మాటలు వినిపిస్తాయి. మనసు పెట్టి వింటే అది నటరాజన్, లక్ష్మిల గొంతులు. సేఠ్ పెళ్లానికి పక్షవాతం రావడంతో, నిన్ను మరిగాడు అని నటరాజన్ అంటుంటే... లక్ష్మి మాత్రం ఎవరన్నా వింటారు, నోటికి వచ్చినట్లు కారు కూతలు కూయకు అని అనుబంధం, ఆవేదన, ఆగ్రహంతో కూడుకున్న గొంతుతో సమాధానం చెప్తుంది.  మళ్లీ కొంత సేపటికి నటరాజన్ లక్ష్మిని ఇంట్లోకి పిలుస్తున్న మాటలు వినిపిస్తాయి. ఆమెను బలవంత పెడుతూ- ఆ సేఠ్ తోనే సరిపోయిందా... అని అంటుంటాడు. నోరు మూసుకోండి అంటూ చివరకు లక్ష్మి, నటరాజన్ తో కలిసి ఇంట్లోకి వెళ్తుంది.         ఇదంతా జరిగిన ఇరవై ఏళ్లకు రచయిత ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆదివారం వాళ్ల ఇంటిముందు వీధిలో అందరూ మంచాల మీద కూర్చొని సేదతీరుతూ ఉంటారు. అక్కడకు ఓ నల్లకుక్క చపాతీ పట్టుకొని వస్తుంది. దాని వెనుక ఓ చారల కుక్క వస్తుంది. కలియబడి ఆ చపాతీని చారలకుక్క లాక్కుని తింటుంది. తినడం పూర్తవగానే, నల్లకుక్క దగ్గరకొచ్చి చారలకుక్క దాని మూతిని, ఒళ్లును నాకుతుంది. నల్లకుక్క సిగ్గుతో, సంతోషంతో దాన్ని ఏడిపిస్తుంది. తర్వాత రెండూ కలిసి ఒకదాని వెంట మరొకటి వెళ్లిపోతాయి.          ఈ సన్నివేశాన్ని చూసిన రచయితకు, ఇరకవై ఏళ్ల కింద జరిగిన నటరాజన్, అతని భార్య లక్ష్మి గుర్తుకొస్తారు.      ఈ "అన్యోన్యం" కథ మనిషిలో బయటపడని అవ్యక్త ఆలోచనా పరంపరలను రచయిత ఘాటుగా చెప్పాడు. మనిషి చిత్తప్రవృత్తిని కథలో ఆవిష్కరించాడు. అలానే పై ముసుగులు తొలిగిస్తే మనిషులు, జంతువులు ఒకటే అన్న భావాన్ని స్పష్టం చేశాడు. పైగా కథలో చేసిన కొన్ని వర్ణనలు అద్భుతం. లక్ష్మి భర్తకు సమాధానం చెప్తున్నప్పుడు- లక్ష్మి గొంతులో పలికిన రసాలు ఎన్నో చెప్పడానికి లక్షణగ్రంథాలు లేవు. అందులో అనుబంధం వుంది. ఆగ్రహం వుంది. ఆవేదన వుంది. అడియాస వుంది. ఆప్యాయత వుంది. అంటాడు రచయిత. అలానే ఆ ఏడువాటాలలో నివాసముంటున్న మనుషుల మధ్య ఉన్న సందడిని వర్ణిస్తూ- జేమ్స్ జాయ్స్ రాసిన యులిసెస్ నవలలోలా వుంది వాతావరణం అంటాడు. అక్కడి వారు పడుకునే వాతావరణాన్ని చెప్తూ- చిన్నా - పెద్దా, ఆడా - మగా అంతా కలిపి పాతిక మందిదాకా... వారివారి ఆశలు, నిరాశలు, దురాశలు మరిచి నిద్రపోయేవారు. నూనె మరకలు అట్టలు కట్టిన తలదిండ్లు, చిరుగులకు అతుకులు వేసిన దుప్పట్లు, దిండ్లకు బదులు చెక్కపీటలు, మూటలు, దుప్పట్లకు బదులు పాత చీరలు... ఆ పడక గదుల మధ్య గురకలు, కలవరింతలు, నిద్రరాక నిటారుగా పిశాచాల్లాలేచి చీకట్లో కూర్చుని వున్న ఒకరిద్దరు మూసలి వాళ్లు - ఇది ఆ బహిరంగ నిద్రాస్థలం యొక్క సమవాకారం అంటారు రచయిత. వంటచేసి పిండి మరకలతో వస్తున్న లక్ష్మిని పాండురంగారావు యుద్ధం నుంచి రక్తం మరకలతో వస్తున్న ఝాన్సీలక్ష్మితో పోలుస్తాడు.       ఇలా వాకాటి పాండురంగారావు రాసిన ఈ కథ మనో జగత్తుకు, వాస్తవ పరిస్థితులకు మధ్య వంతెన లాంటిది అని చెప్పవచ్చు.  - డా. ఎ.రవీంద్రబాబు

మాలతీచందూర్

  మాలతీచందూర్ మాలతీ చెందూర్ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు. ఎన్నో ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా పనిచేశారు. తెలుగు, తమిళం, ఇంగ్లిషు భాషల్లో కథలు, నవలలు, విజ్ఞాన పుస్తకాలు రాశారు. గుర్తింపు పొందిన ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థల్లో సభ్యులుగా, వివిధహోదాలలో పనిచేశారు. నిత్యం పుస్తకాలు చదువుతూ, ఎంతోమంది సమస్యలకు సమాధానాలు, సలహాలు ఇస్తూ జీవించారు. చెన్నైలో స్థిరపడినా తెలుగు వారికి మాలతీ చెందూర్ రచనల ద్వారా దగ్గరే ఉన్నట్లు అనిపించేది.            మాలతీచందూర్ 1930లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. ప్రాథమిక విద్యాభ్యాసం నూజివీడు, ఏలూరులో అభ్యసించారు. ఎనిమిదో తరగతిలో ఉండగానే మేనమామ ఎన్.ఆర్. చందూర్ తో వివాహం జరిగింది. 1947లో భర్తతో కలిసి చెన్నై నగరానికి వెళ్లారు. కళాశాలకు వెళ్లి చదువుకోకున్నా నిత్యం పుస్తకాలు చదువేవారు. ప్రైవేటుగా ఎం.ఎ. పట్టా పుచ్చుకున్నారు. వీరికి శ్రీశ్రీ, ఆరుద్ర, నారాయణరెడ్డి వంటి కవులతో పరిచయాలు ఉండేవి. వీరిల్లు కూడా సాహితీ ప్రముఖులతో కళకళలాడుతుండేది.            మాలతీచందూర్ 1950ల నుంచి రచనలు చేయడం ప్రారంభించారు. వీరి మొదటి కథ రవ్వల దుద్దులు. ఇది ఆనందం వారపత్రికలో వచ్చింది. ఆ తర్వాత భారతి లాంటి ప్రముఖ పత్రికల్లో ఎన్నో కథలు ముద్రితమయ్యాయి. సుమారు వందకు పైగా కథలు రాశారు. ఈ కథలలో ఆకాలం నాటి స్త్రీల దయనీయ స్థితి, సామాజిక కట్టుబాట్ల మధ్య నలుగుతున్న స్త్రీల మనస్థితి, వారి నిస్సహాయత ఎక్కువగా కనిపిస్తుంది. వీరి మొదటి నవల 1955లో వచ్చింది... చంపకం - చదపురుగులు. నవలలు కూడా 40 వరకు రాశారు. శిశిరవసంతం నవలలో- మనిషిలోని మంచితనమే భగవంతుడు అని చెప్తుంది. ఆ అంతర్నిగూఢ శక్తే మనిషిని మహోన్నతుడ్ని చేస్తుంది అనే సందేశం ఇస్తుంది. ఏమిటీ జీవితాలు నవల మనోవిశ్లేషణాత్మక ధోరణిలో సాగుతుంది. హృదయనేత్రి నవల- స్వాతంత్ర్య పోరాట కాలంలో జరిగిన చీరాల - పేరాల నేపథ్యంలో సాగుతుంది. ఇంకా వీరి రచనల్లో శతాబ్ది సూరీడు, కాంచనమృగం, మనసులో మనసు, మధుర స్మృతులు, ఆలోచించు, భూమిపుత్రి, ఏమిటీ జీవితాలు, క్షణికం, సద్యోగం, కృష్ణవేణి, వైశాఖి, కలల వెలలు, ఏది గమ్యం ఏది మార్గం,  రాగం అనురాగం, రెక్కల చుక్కలు, బ్రతక నేర్చిన జాణ, రేణుకాదేవి ఆత్మకథ లాంటివి ముఖ్యమైనవి.        మొదటి స్త్రీ కాలమిస్టుగా పేరు తెచ్చుకున్నమాలతీచందూర్ ఎన్నో పత్రికల్లో కాలమ్స్ నిర్వహించారు. ఆంధ్రప్రభ పత్రికలో ప్రమదావనం పేరిట వీరు నిర్వహించిన కాలమ్ వీరికి మంచి గుర్తింపు తెచ్చింది. మొత్తం మీద పది లక్షలమంది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాలు ఇవ్వడం కోసం ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఆమెకు ఓపిక ఎక్కువ, సమాధానాలు సూచించే విషయంలో రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తించేవారు. జగతి అనే మాస పత్రికకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు.  స్వాతి వార పత్రికలో మాలతీ చందూర్ నిర్వహించిన నన్ను అడగండి శీర్షిక చాలా కాలం కొనసాగింది. పాతకెరటాలు అనే శీర్షికలో సుమారు 300లకు పైగా ఆంగ్ల నవలలను పరిచయం చేసిన ఘనత వీరిది. మహిళలకోసం ప్రత్యేకంగా అందాలు - అలంకారాలు, మధుర జీవనం, వంటలు - పిండివంటలు కాలమ్స్ కూడా నిర్వహించారు. ఒక్క ఈ తరం పిండివంటలు పుస్తకరూపంలో వచ్చి 33 సార్లు ముద్రణ పొందింది.            మాలతీ చందూర్ స్త్రీవాదం అంటే- స్త్రీ తనకిష్టమైన పనులు చేయగలిగే మానసిక స్వేచ్ఛ కలిగి ఉండడమే అంటారు. స్త్రీ హృదయం సున్నితం, సౌకుమార్యం అలానే దృఢత్యం, స్థిరత్వం కలిగిందని చెప్తారు. చాలామంది ఈమె కాలమ్స్ చదివి స్ఫూర్తి పొంది ఆమెను చూడడానికి వెళ్లేవారు. వారిని చిరునవ్వుతో ఆహ్వానించి, ఆతిధ్యం ఇచ్చేవారు మాలతీచందూర్. వీరి రచనలు ఇతివృత్తంలోను, కథాకథనంలోను ప్రత్యేకంగా ఉంటాయి. మాలతీ చందుర్ కు లౌకికజ్ఞానం ఎక్కువ. మానవ సంబంధాల గొప్పతనం తెలుసు. జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపేవారు. ఎంతమందికో తన పరిష్కారాల ద్వారా  జీవితాలను చక్కదిద్దేవారు. స్త్రీ పరిపూర్ణంగా ఎదగాలి. సామాజిక స్పృహ కలిగి ఉండాలి అనుకునే మాలతీచందూర్ స్త్రీల సమస్యలను భిన్న కోణాలలో ఆలోచించి రచనల్లో ఆవిష్కరించారు. ఊహల్లో కాల్పనిక జగత్తులో, పదహారేళ్ల కన్నెపిల్లల కలల్లా వీరి రచనలు ఉండవు. నిత్యం జీవితంలో తారసపడే మనుషులు, వారి సమస్యలు, కష్టాలు, ఆలోచనలు, ధైర్యాలు... వీరి రచనల్లో కనిపిస్తాయి.                 మాలతీచందూర్ మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకోడానికి పుస్తకపఠనమే మార్గం అంటారు. పుస్తక పఠనం వల్ల ఆర్ద్రత, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోగల స్పందన, అన్నిటిని మించి ఒక ఉన్నత ప్రపంచంలోకి అడుగుపెట్టగల అవకాశం లభించింది అని చెప్తారు. అంతేకాదు వీరి రనచలు గత శతాబ్దకాలంలో స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులకు ప్రతిరూపాలు, ముఖ్యంగా శతాబ్ది సూరీడు నవలను 100 సంవత్సరాలలో బ్రాహ్మణ స్త్రీల జీవితాల్లోని పరిణామాలకు ఆధారమని చెప్పవచ్చు.              కాలమిస్టుగా, రచయితగా పేరు తెచ్చుకున్న మాలతీ చందూర్12 సంవత్సరాలు సినిమా సెన్సార్ బోర్డు మెంబరుగా, వినియోగదారుల ఫోరమ్ మెంబరుగా, సామాజిక సంస్థల్లో సభ్యులుగా, ఆంధ్ర మహిళాసభ మహిళా హాస్టల్ ఛైర్ పర్సన్ గా... పలు హోదాలలో పనిచేశారు. రామలక్ష్మి ఫౌండేషన్ లాంటి ఉన్నతమైన అవార్డును, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 84 ఏళ్ల వయసువరకు సుదీర్ఘ సాహితీ వ్యవసాయం చేసిన మాలతీచందూర్ చివరకు కాన్సర్ వ్యాధితో చనిపోయారు.                  -  డా. ఎ.రవీంద్రబాబు  

నవ్వు

  నవ్వు - బాలగంగాధర తిలక్ దేవరకొండ బాలగంగాధర తిలక్- మానవతావాద కవిగా ప్రఖ్యాతి గాంచారు. వీరి అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందింది. రచనల్లో జీవితంలోని సౌందర్య దృష్టిని, మానవీయకోణాలను, బాధా తప్త హృదయాలను అద్భుతంగా పట్టి చూపించారు. తిలక్ కవిత్వంతో పాటు మంచి కథలు కూడా రాశారు. వీరి కథలు చదువుతుంటే మనుషుల్లోని విభిన్నమైన కోణాలు తెలుస్తాయి. జీవితరహస్యాల్ని సరికొత్తగా మనముందు నిలుపుతాయి. నిత్యం మనకు ఎదురయ్యే బిచ్చగాళ్లు, అనాథలు, మానసిక ప్రశాంతతలేని మనుషులు... ఇలా ఎంతమంది వీరి కథల్లో మనకు కనిపిస్తారు. వీరి ఊరి చివరి ఇల్లు కథ సినిమాగా వచ్చింది. వీరు రాసిన కథ నవ్వు. మనిషి లోపల హృదయం పగిలే విషాదాన్ని నింపుకొని, పైకి నవ్వుతూ ఎలా ఉండగలడో తెలియజేస్తుంది ఈ కథ.             రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందర్నీ నవ్వుతూ పలకరిస్తాడు. ముఖంలో ఏ క్షణానా విషాదరేఖలు కనిపించవు. మూర్తికి అతను పక్కనుంటే వొళ్లంతా తేలిక పడినట్లు ఉంటుంది. మూర్తికి చాలా సమస్యలు ఉన్నా రామచంద్రరావు పక్కన ఉంటే అవన్నీ మంచువిడిపోయినట్లు విడిపోతాయి. కానీ మూర్తికి ఎప్పుడూ అనుమానమే- రామచంద్రరావుకు బాధ కలగదా, సమస్యలు లేవా, అతని జీవిత రహస్యం ఏమిటి, న్వవుతూ ఎలా ఉండగలుగుతున్నాడు- అని. రామచంద్రరావుది చిన్న ఉద్యోగం, మూడు గదుల ఇల్లు. ఉదయాన్నే వంట చేసుకొని ఆఫీసుకు క్యారేజీ తీసుకొని వెళ్తాడు. ఇంటి దగ్గర, ఆఫీసులో అందర్నీ నవ్వుతూ పలకరిస్తాడు.           నా అనేవాళ్లు ఎవ్వరూ లేని రామచంద్రరావుకు ఏలూరు నుంచి బస్సులో వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. అ విషయం తెలిసి మూర్తి ఏలూరు హాస్పెటల్ కు వెళ్తాడు. స్పృహలో లేని రామచంద్రరావును చూసి కన్నీళ్లు వస్తాయి. అతనికి స్పృహ వచ్చిన తర్వాత ఎలా ఓదార్చాలా అని బాధ పడ్తాడు. కానీ స్పృహ రాగానే రామచంద్రరావు నవ్వుతూ కళ్లు తెరుస్తాడు. మూర్తి మాత్రం ఆశ్చర్యపోతాడు. "పెళ్లి చేసుకో... ఇలా ఎంతకాలం ఒంటరిగా" అని సలహా ఇస్తాడు. రామచంద్రరావు అందుకు కూడా నవ్వుతాడు. ఆ నవ్వుకు మాత్రం ఓ కారణం ఉంది.       రామమచంద్రరావు చదువుకునేటప్పుడు సరళ అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది. సరళ వాళ్లు ఆర్థికంగా ఉన్న వాళ్లు. రామచంద్రరావుకు ఉద్యోగం వచ్చాక సరళకు ప్రేమిస్తున్న విషయం చెప్తాడు. కానీ- "నీకు డబ్బులేదు, భూమి లేదు, నీ జీతం కేవలం నూట ఇరవై రూపాయలు... నా అవసరాలు, కనీసపు కోర్కెలు కూడా నీవు తీర్చలేవ"ని చెప్పి తిరస్కరిస్తుంది. వేరే పెళ్లి చేసుకుంటుంది. రామచంద్రరావు పెళ్లికి వెళ్లి "నువ్వు సుఖంగా ఉండాలి" అని దీవించి వస్తాడు. కానీ ఏడాది తిరగక ముందే సరళ భర్త చనిపోతాడు. ఆమె బాధతో పుట్టింటికి వస్తే రామచంద్రరావు పోయి ధైర్యం చెప్పి, ఓదార్చి వస్తుంటాడు. సరళ కోలుకున్న తర్వాత సరళ వాళ్ల నాన్న "నువ్వు మాఇంటికి రావడం వల్ల పదిమంది పలురకాలుగా అనుకుంటారు. ఇక రావద్దు" అని చెప్తాడు. రామచంద్రరావు వెళ్లడం మానుకుంటాడు.           రామచంద్రాన్ని దురదృష్టం వెంటాడుతుంది. పైవాళ్లు అతని ఉద్యోగం తీసేస్తారు. మూర్తి చాలా బాధపడ్తాడు. కానీ రామచంద్రరావు మాత్రం నవ్వుతూనే- ఇంటికి వెళ్లి తన కున్న మూడు గదుల పెంకుటిల్లు అమ్మి మూడువేలు తీసుకొని వస్తాడు. తను ఉన్న మూడు గదుల ఇంటిని ఖాళీ చేసి, ఒక్క గది ఉన్న ఇల్లు తీసుకుంటాడు. టైపు మిషన్ కొని, ఇక్కడ టైపు చేయబడును అని బోర్డు పెడ్తాడు. కానీ అతని చిరునవ్వు మాత్రం చెరిగిపోదు. అతను స్వగ్రామం వెళ్లినప్పుడు సరళ తండ్రి చనిపోతే, తిరిగి వచ్చాక సరళకు ధైర్యం చెప్పి వస్తాడు. అలా ఆరునెలల గడిచాక రామచంద్రానికి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది. మూర్తి సరళ దగ్గరకు వెళ్లి "మీరు అతని బాధ్యతలు తీసుకోవాలి" అని గట్టిగా చెప్తాడు. సరళ, మూర్తి పట్నం నుంచి డాక్టరును తెచ్చి చూపిస్తారు. అతడ్ని సరళ తన ఇంటికి తీసుకెళ్తుంది. దగ్గరుండి సపర్యలు చేస్తుంది. రామచంద్రరావు కోలుకున్నాక "నేను వెళ్తాను" అంటే- "మరి బార్య, భర్తను వదిలి ఉంటుందా..." అని అంటుంది సరళ. మూర్తి సిగ్గుపడతాడు. ఇద్దరి వివాహం నిరాడంబరంగా జరుగుతుంది.               మొదటిరాత్రి సరళ అడుగుతుంది- "మీ నవ్వు రహస్యం ఏమని". రామచంద్రరావు చెప్తాడు - "నేను చిన్నప్పడు నలతగా ఉండేవాడిని, ఎప్పుడు పోతానో అని అమ్మా, నాన్న భయపడుతూ ఉండేవాళ్లు. నా పదహారో ఏట నా అనారోగ్యం పోవాలని  తమ్ముడూ, చెల్లెలు, అమ్మానాన్న అందరం భద్రాచలం వెళ్తున్నాం. పడవ బోల్తా పడింది. నేను ఒక్కడ్నే బతికాను. చనిపోతాననుకున్న నేను బతికాను. ఆరోగ్యంతో ఉండే మిగిలిన అందరూ చనిపోయారు. నేను చనిపోవాలనుకున్నాను. ఈ సృష్టి, ఈ జీవితం అంతా ఒక హాస్యం. ఇదో పెద్ద నవ్వులాట... అని పద్ధతి అంటూ లేదు. ఎవరో తెరవెనుక ఉండి ఆడిస్తున్నారు. కష్టాలకి, భయాలకి, బాధలకి ఆందోళన చెందడం తెలివితక్కువతనం" అని ముగిస్తాడు. గుండెలో అంత విషాదాన్ని, నవ్వులో వెతుక్కుంటున్న రామచంద్రమూర్తి మాటలకు సరళ చలించిపోయి దగ్గరకు తీసుకొని "నేను నిన్ను వదలను" అని చెప్తుంది. కానీ మూర్తికి మాత్రం ఈ నవ్వు వెనక రహస్యం ఎప్పటికీ తెలియదు.             ఇలా ఓ పాత్ర మనసులో దాగిన విషాదాన్ని అద్భుతంగా చిత్రంచాడు తిలక్. నవ్వు వెనక ఉన్న బాధను చివరి వరకు చెప్పకుండా ఆసక్తి కలిగిస్తూ చివరి ముగింపులో చెప్పడం గొప్ప కథా టెక్నిక్. ఇక సరళమైన భాష. ఆకట్టుకునే శైలి తిలక్ కథల సొత్తు. మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగినప్పుడే ఆనందం సొంతం అవుతుందని ఈ కథ రుజువు చేస్తుంది. ఒక్క కష్టానికే కుంగిపోయి, ఆత్మహత్యలు చేసుకునే నేటి తరానికి, మానసిక వ్యాధులతో సంతమతమవుతున్న ప్రస్తుత తరానికి ఈ కథ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. - డా. ఎ. రవీంద్రబాబు

సాంఘిక విలువ

  సాంఘిక విలువ - రావూరి భరద్వాజ వచనాన్ని అందంగా రాయగల రచయిత. కన్నెపిల్ల సిగ్గులా కథనశైలిని నడపగలరు. కథలు, నవలలు, స్మృతి సాహిత్యాన్ని అపారంగా రాశారు. ఆవేదన నుంచి, ఆకలి బాధల నుంచి, ఆర్థిక లేమి నుంచి, కష్టాల సుడి గుండాల నుంచి సాహిత్యాన్ని సృష్టించారు. ఎక్కడా పర్వతాలు ఎక్కి పాఠకుడ్ని లోయల్లో పడేయరు. వాస్తవాన్ని నేస్తంగా, న్యాయనిర్ణేతగా చెప్తారు. అతనే రావూరి భరద్వాజ. విశ్వనాథ సత్యనారాయణ, డా. సి. నారాయణ రెడ్డి తర్వాత తెలుగువారికి జ్ఞానపీఠ్ ను తెచ్చిన పాకుడురాళ్ల నవలా రచయిత డా. రావూరి భరద్వాజ. వీరు రాసిన ఎన్నో కథలు సామాజిక జీవితంలోని ఎగుడు దిగుడులను నగ్నంగా చూపిస్తాయి. అలాంటిదే సాంఘిక విలువ కథ.           ఏభై ఏళ్ల కిందట కూనూరు వాళ్లు అంటే ఆ చుట్టుపక్కల మంచి పేరు. కేవలం రెండు వందల ఎకరాల పొలం ఉన్నా దాన ధర్మాలు చేయడంలో, వచ్చిన వారికి లేదనకుండా పెట్టడంలో వారిది పేరున్న ఇల్లు. అసలు డబ్బును పరోపకారార్థం ఉపయోగించాలి అని వారి ఉద్దేశం. అందువల్లే వారికి అంత పేరు వచ్చింది. ఎప్పుడు ఇంటి నిండా బంధువులు,  పశువులు... అలా వైభవంగా జరిగేది. చలమయ్య అంటే చేతికి ఎముకలేని వారు అని గొప్పగా చెప్పుకునే వారు. ఆవుపెయ్య తిండి తినకపోతే ఎనిమిది ఆమడల దూరంలో ఉన్న నాలుగు తరాల బంధువు కుటంబంతో సహా వచ్చి నెల రోజులు ఉండి, ఆ ఆవు గడ్డి మేసిందాకా.. ఉన్నాడు. చివరకు చలమయ్య చనిపోతూ కూడా బంధువు పెళ్లికి నూటపదాహార్లు ఇవ్వమని సైగచేసి మరీ చనిపోతాడు.           చలమయ్య కొడుకు బసవయ్య. తండ్రి అంత ఉదారవాది కాకపోయినా, తండ్రి పేరు నిలబెట్టడానికే ప్రయత్నం చేశాడు. తండ్రి చేసిన దానాలతో ఉన్న ఆస్తులు కరిగిపోయాయి. కొంత మంది ఇతని స్వభావాన్ని చూసి, తండ్రి అప్పులు చేసినట్లు కాగితాలు సృష్టిస్తారు. బంధువు ఒకతను దొంగ సంతకంతో కాగితాలు తయారు చేసుకొని మీ తండ్రి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అంటాడు. పదిహేను వేలు ఇస్తాను అన్నా కాదని పదిహేను ఎకరాల పొలం రాయించుకుంటాడు. మిగిలిన ఆస్తి కూడా తాకట్టులోకి పోతుంది. కానీ బసవయ్య తండ్రి అంత కాకపోయినా తండ్రికి తగ్గ కొడుకే అని మాత్రం పేరుతెచ్చుకుంటాడు. చివరకు పేదరికంలోకి నెట్టివేయబడతాడు. చివరకు ఒక్కగానొక్క కొడుకు శేషగిరికి బారసాలను చాలా హీనస్థితిలో జరుపుతాడు.          శేషగిరి చదువు ఆరో తరగతితో ఆగిపోతుంది. తాత, తండ్రి చేసిన దానాల వల్ల శేషగిరి జీవితం పూర్తిగా పేదరికంలోకి వెళ్లిపోతుంది. తాతను, తండ్రిని పొగిడిన వాళ్లు, వాళ్ల సహాయంతో ఎదిగిన వాళ్లు- పేరు ప్రతిష్టల కోసం, డబ్బును దుర్వినియోగం చేసుకున్నారు అని దెప్పిపొడుస్తారు. శేషగిరికి కూడా ఏ పని చేతకాదు. తను దౌర్భాగ్యుడని తెలిసినా యశోదను పెళ్లి చేసుకుంటాడు. కానీ చిల్లగవ్వ లేని ఇంట్లో యశోద కష్టాలు పడాల్సి వస్తుంది. చేతగాని వాడివి పెళ్లెందుకు చేసుకున్నావు... మా వాళ్లు నా గొంతు కోోశారు... అని తిడుతుంది, కోప్పడుతుంది. కానీ ఫలితం శూన్యం. ఒక్కోసారి శేషగిరి ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. అయితే ఒకరోజు యశోద ఆకలిని తట్టుకోలేక దూరంగా అరటిపళ్లు అమ్మే బల్ల దగ్గరకు వెళ్తుంది. అక్కడ అరటికాయలు తినే వ్యక్తి యశోద మాటలను గమనిస్తాడు. యశోద చూపుల ఆయన బరువైన జేబును చూస్తాయి. అలా యశోద అక్కడ తప్పు చేస్తుంది. పదిరూపాయలతో ఇంటికి వచ్చి రేగిన జుట్టును పగిలిన అద్దంలో చూసుకొని భర్త ఇంటికొచ్చే సమయానికి రెండు కూరలతో భోజనం చేసి పెడుతుంది. అప్పు తెచ్చాననిని అబద్దం చెప్తుంది. ఒకరోజు మధ్యహ్నం ఇంటికి వచ్చిన శేషగిరికి తలుపులు వేసి ఉండడం కనిపిస్తాయి. కానీ ఇంట్లోనుంచి నవ్వులు వినిపిస్తాయి. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి కొత్త చీరతో, మల్లెపూలతో భార్య కనిపిస్తుంది. మీకు కొత్త ధోవతీ తెచ్చానని చెప్తుంది. ఇరుగుపొరుగువాళ్లు, తోటి వాళ్లు వీరి గురించి అనేక రకాలుగా చెప్పుకుంటుంటారు. శేషగిరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. కానీ పెద్దపెద్ద వాళ్లు రాత్రులు కూడా యశోద దగ్గరకు వచ్చి కావాల్సిన పనుల గురించి ఏకరవు పెట్టి చేయించుకుంటూ ఉంటారు.         కొంత కాలానికి శేషగిరికి కొడుకు పుడతాడు. వాడు సీతారామయ్య పోలికలతో ఉంటాడు. అప్పటికే భార్య సలహా ప్రకారం శేషగిరి సీతారామయ్యతో కలిసి వ్యాపారం ప్రారంభించి లాభాలు గడిస్తుంటాడు. పదెకరాల పొలం కొంటాడు. ఊళ్లో వాళ్లు మాత్రం కోటి వీరయ్యగారు యశోదకు కొనిపెట్టారు అని చెప్పుకుంటారు. క్రమంగా శేషగిరి ధనవంతుడవుతాడు. ఇల్లు బాగుచేయిస్తాడు. మనిషి పచ్చబడతాడు. తాత, తండ్రుళ్లా దాన ధర్మాలు చేయడం మొదలుపెడ్తాడు. బీదవిద్యార్థుల కోసం ఆడే నాటకానికి వంద రూపాయలు విరాళం ఇస్తాడు. ఊళ్లో హైస్కూలు కట్టడానికి అందరి కంటే ఎక్కువ దానం చేస్తాడు. లైబ్రరీ పునరుద్ధరణలో ముందుంటాడు. ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్లు పొగడడం ప్రారంభిస్తారు. బంధువులు మళ్లీ రావడం మొదలు పెడ్తారు. శేషగిరి మాత్రం ఒక సత్యం నేర్చుకున్నాడు- డబ్బుకావాలి. అది పాపిష్టిదే కావచ్చు. సంఘంలో గౌరవంగా బతకడానికి ఆ దిక్కుమాలింది అవసరం. మనకు హెచ్చుతగ్గులుగా గౌరవాన్ని ముట్టచెప్తుంది. అది సంపాదించిన విధానం కంటే, సంపాదించిన పరిమాణం మీద సంఘదృష్టి వుంటుంది.... ..... మనిషికి కావల్సింది విజ్ఞానం కాదు, డబ్బు. పాపిష్టిది దిక్కుమాలింది అయిన డబ్బు. అని రచయిత కథను మముగిస్తారు.           ఈ సాంఘిక విలువ కథలో డబ్బుకు సమాజంలో ఉన్న గౌరవం, విలువలే కాకుండా, మనిషికి నీతి నిజాయితి లేకపోయినా డబ్బు ఉంటే చాలు అని లోకం తీరును చెప్పాడు భరద్వాజ. మూడు తరాల చరిత్రను చిన్న కథలో చెప్పడం సామాన్యమైన విషయం కాదు. అది వీరి శిల్పానికి నిదర్శనం. కథను ఎక్కడ ప్రారంభించారో అక్కడే ముగించారు. తాత బసవయ్య దానాల గురించి కథను మొదలు పెట్టి, మనమడు శేషగిరి చేసే దానాలతో ముగించారు. మధ్యలో వారి జీవితంలోని ఎగుడుదిగుడలను,  ఆకలి బాధ తట్టుకోలేక యశోద లైంగికంగా చేసిన తప్పను. ఆ తప్పులతోనే మరలా పూర్వ వైభవాన్ని పొందిన విధానాన్ని అద్భుతంగా చెప్పారు. అలానే లోకం తీరును చెప్తూ- డబ్బు లేనప్పుడు దూరమైన వాళ్లు, తప్పు చేస్తున్నప్పుడు హేళన చేసిన వాళ్లు, ధనం రాగానే పొగడ్తలతో, గౌరవంతో చూడడాన్ని రచయిత వాస్తవిక దృక్పథంతో చెప్పారు.       కథలో అక్కడక్కడా సూక్తులు కనిపిస్తాయి. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. వానలో తడిసిన తర్వాతగాని గొడుగు విలువ తెలియదు. దరిద్రం కుష్ఠువ్యాధి లాంటిది. అది రాకుండానే ఉండాలి గానీ, వచ్చిన తర్వాత ఆ వంశం యావత్తూ దాన్ని భరించక తప్పదు. ఇలానే యశోద తప్పు చేసినప్పుడు ఆమెను వర్ణిస్తూ- పగిలి పోయిన అద్దం చెక్కలో రేగిన జుట్టు సరిచేసుకుంది. పమిటతో కళ్లు, బుగ్గలు తుడుచుకుంది. ఎందుకో కళ్లలో నీళ్లు తిరిగినై, దగ్గర్లో వున్న పదిరూపాయల నోటు గాలికి రెపరెపలాడింది. అన్నారు. ఇవి ఆమె మానసిక, శారీరక స్థితిని తెలియజేస్తాయి.             ఇలా సాంఘిక విలువ కథను ఆద్యంతం అప్రతిహతంగా రచించి, చదివిన పాఠకులకు కన్నీటిని, వాస్తవాన్ని అద్దంలో చూపారు భరద్వాజ.  - డా. ఎ.రవీంద్రబాబు

నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా

  గుర్రం జాషువా కులానికి, కలానికి ఉన్న సంబంధాన్ని తెంచి, స్వయంగా కవిగా ఎదిగిన విశిష్ట కవి జాషువా. అవమానాలను, అవహేళనలను ఎదుర్కొని లోకం తనవైపు తలెత్తి చూసేలా కవిత్వాన్ని రచించిన కవి జాషువా. ఆనాటి భావకవుల్లా కాకుండా జీవితంలోంచి కవిత్వాన్ని సమాజంపై కుమ్మరించిన వ్యక్తి జాషువా. తనలోని అగ్రహజ్వాలలను అక్షరాలుగా వెలిగించి సంస్కరణోద్యామానికి సాహిత్యాన్ని బాసటగా నిలిపిన కవి జాషువా. ఎక్కడా ఊహా ప్రేయసులు, మితిమీరిన స్త్రీ వర్ణనలు, స్వహపోక కల్పనలు లేకుండా వాస్తవాన్ని వినూత్నంగా చెక్కిన కవి జాషువా. గబ్బిలం నుంచి ఫిరదౌసిి వరకు, స్వప్నకథ నుంచి అందరూ మెచ్చే శ్మశానవాటిక వరకు ఆయన కవిత్వం విశిష్టమైంది. విలక్షణమైంది.        గుంటారు జిల్లా వినుకొండలో 1895, సెప్టెంబరు 28న జన్మించారు జాషువా. తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబ. చిన్ననాటి నుంచే అంటరాని తనానికి, అవహేళనలకు గురయ్యారు. కులం రిత్యా పాఠశాలలో, చుట్టూ ఉన్న సమాజంలో... స్వతహాగా అబ్బిన కవితా రచనకు తగిన గుర్తింపును కూడా పొందలేక పొయ్యారు. చివరకు ప్రాధమికోపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించారు. మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కందుకూరి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, తిరుపతి వెంకటకవుల సాన్నిహిత్యంతో, ప్రోత్సాహం లభించింది. ఆకాశవాణిలో కూడా పనిచేశారు. తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలనే నేపథ్యంగా గ్రహించి అనేక కావ్యాలు రాశారు. అయితే జాషువా పద్య రచననే తన వాహికగా ఎన్నుకున్నారు. అయినా కొన్ని నియమాలను ఛేధన చేశారు.           అనాథ, స్వప్నకథ, గబ్బిలం, కాందిశీకుడు, ముసాఫరులు, ఫిరదౌసీ, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, శిశువు వంటి  ఖండకావ్యాలు రాశారు. వీటితోపాటు నేతాజీ, బాపూజీ పేరిట జాతీయ నాయకులు జీవితాలను పద్యకావ్యాలుగా రచించారు. రాష్ట్రపూజ, కొత్తలోకం, నాగార్జునసాగర్ కావ్యాలూ రాశారు. నాకథ అనే పేరుతో స్వీయచరిత్రను పద్యరూపంలో రాసుకున్నారు. వీరి క్రీస్తుచరిత్ర కావ్యానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వీరి కావ్యాలలోని కొన్ని వాక్యాలు నేటితరం కవులకు కరాతలామలకం అయ్యాయి. పత్రికల వాళ్లకు శీర్షికలుగా ఉపయోగపడ్డాయి. దళితవాదం వచ్చాక వీరి కీర్తి ప్రతిష్టలను గుర్తించడం ఎక్కువగా జరిగిందని చెప్పాలి.             వీరు రాసిన ఫిరదౌసి కావ్యంలోని-         రాజు మరణించె నొక తార రాలిపోయె         కవియు మరణించె నొకతార గగనమెక్కె         రాజు జీవించె రాతి విగ్రహములందు        సుకవి జీవించె ప్రజల నాలుకల యందు        ఈ పద్యం నేటి రాజకీయ నాయకులకు, కవులకు మధ్య ఉన్న సంబంధాన్ని, మరణించిన తర్వాత వారి భవితవ్యాన్ని తెలియజేస్తుంది.         జాషువా రచించిన మరో అద్భుతమైన కావ్యం గబ్బిలం. దీనిలో ఓ అంటరాని కులంలో పుట్టిన ఓ పథికుడు తన బాధను శివాలయంలో ఉన్న గబ్బిలంతో విన్నవించుకుంటాడు. ఈ విన్నవించుకునే క్రమంలో జాషువా... కుల వ్యవస్థ, సమజంలోని హెచ్చుతగ్గులు, వర్ణ వ్యవస్థను నిరసిస్తూ ఎన్నో అద్భుతమైన పద్యాలు రాశారు. ఈ కావ్యంలో           ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి          యునుప గజ్జెలతల్లి జీవనము సేయు          గసరి బుసకొట్టు నాతని గాలిసోక          నాల్గుపడగల హైందవ నాగరాజు... అని కుల వ్యవస్థపై ధ్వజమెత్తారు.           జాషువా విగ్రహారాధనను నిరసించాడు. పేదల్ని కాదని విగ్రహాలకు పెళ్లిళ్లు చేయడానికి అనవసరమైన ఖర్చులు చేస్తున్నారని ఆనాడే విమర్శించారు.                     ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః          ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్          మెతుకు విదల్పరీ భరత మేదిని, ముప్పది మూడుకోట్ల దే          వత లెదబడ్డ దేశమున భాగ్యవిహీను లక్షుత్తులాఱనే... అని అన్నారు.          ఇలా సమాజంలోని చీకటి కోణాలని దర్శించారు.           ఇక వీరు రాసిన శ్మశానవాటికలోని పద్యాలు సత్యహరిశ్చంద్ర నాటకంలో భాగాలయ్యాయి. ఎందరికో ఇష్టమై ప్రజల నోళ్లలో నానుతున్నాయి. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో గఱగిపోయే... లాంటివి... జీవన తాత్వికతను, మానవ జీవితంలోని సత్యాన్ని ఆవిష్కరిస్తాయి.          జాషువాకు కవికోకిల, కవితా విశారద, నవయుగ కవిచక్రవర్తి, కళాప్రపూర్ణ, పద్మభూషణ లాంటి బిరుదులు వచ్చాయి. రాష్ట్ర శాసనమండలిలో సభ్యులుగా కూడా ఉన్నారు. చివరకు 1971, జులై 24 న ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిత్వం, వ్యధ, కావ్యాల రూపంలో మాత్రం మన మధ్య ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. - డా. ఎ.రవీంద్రబాబు

కె. రామలక్ష్మి

  కె. రామలక్ష్మి   ఆమె తొలితరం కథారచయిత్రుల్లో అగ్రగామి. ఆ రోజుల్లో ఓ ప్రముఖ పత్రికలో ఉపసంపాదకురాలిగా పనిచేశారు. కవి, పరిశోధకులు, పాటల రచయిత అయిన ఆరుద్రను వివాహం చేసుకున్నారు. తెలుగు వారు గర్వించదగ్గ పార్వతి, కృష్ణమూర్తుల పాత్రలను సృష్టించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్నే కాదు, ప్రాచీన సాహిత్యాన్ని, ఆంగ్లసాహిత్యాన్ని క్షణ్ణంగా చదువుకున్నారు. ఎన్నో అనువాదాలు చేశారు. ఆమె కె. రామలక్ష్మి. ఆరుద్ర రామలక్ష్మి పేరుతో కూడా రచనలు చేశారు.         కె. రామలక్ష్మి డిసెంబరు 31, 1930లో కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. పట్టా అందుకున్నారు. స్త్రీ సంక్షేమ సంస్థలో పనిచేశారు. అలానే స్వతంత్ర పత్రికలో చాలా కాలం ఉపసంపాదకులుగా పనిచేశారు. 1951 నుంచి రచనలు చేయడం ప్రారంభించారు. 1954లో మొదటి సారిగా విడదీసే రైలుబళ్లు అనే పేరుతో తొలి కథాసంపుటిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో కథలు, నవలలు తెలుగు వారికి అందించారు.       స్వాతంత్ర్యానంతరం వచ్చిన రచయిత్రుల్లో ముఖ్యపాత్ర పోషించిన రామలక్ష్మి రచనల్లో హాస్యం, అభిప్రాయాల్లో సూటితనం, నిర్మొహమాటం... కనిపిస్తాయి. ఆంధ్రపత్రికలో  ప్రశ్నలు - జవాబులు, ఉదయం వార పత్రికలో నారీ దృక్పథం శీర్షికలను నిర్వహించారు. 1950వ దశకంలో వీరి పార్వతి కృష్ణమూర్తి కథలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కథల గురించి రామలక్ష్మీగారే చెప్తూ- మల్లాదివారి ప్రోత్సాహంతో పార్వతి కృష్ణమూర్తుల పాత్రలను సృష్టించాను. అందుకోసం ఈతరం చదువుకున్న పిల్లల మనస్తత్వాలు, సరదాలు, కోపతాపాలు, ప్రేమలు, ప్రణయకలహాలు, పెళ్లి, అసూయలు, పిల్లల పెంపకం... ఇవి ఇద్దరి బాధ్యతలు... ఆ విషయాన్నే చిన్న కథలుగా, స్కెచ్ స్ గా రాశాను అన్నారు. కుర్ర పఠితుల మనసును తాకుతారని మల్లాదివారు కూడా ఆశీర్వదించారు. పార్వతి పాత్రలో ఆవేశం, ఆవేదన, అనురాగం, ఆనందం... అన్నీ ఎక్కువ. వీరి కథల్లో కరుణ కథ, కొత్తపొద్దు, ప్రేమించు ప్రేమకై, నన్ను వెళ్లిపోనీరా, రావుడు, ఆశకు సంకెళ్లు, కోరిక తీరిన వేళ... లాంటివి గొప్ప కథలని విమర్శకులు చెప్తారు. 1961లో తొణికిన స్వప్నం అనే మరో కథాసంపుటని రచించారు. 2007లో రామలక్ష్మి గారి  70 కథలు రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. పెళ్లి అనే నవల కూడా రాశారు.         చీలిన దారులు కథలో- ప్రేమించుకున్న యువతీ యువకులు పెళ్లి చేసుకోకుండా జీవించడం వల్లే ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయాని, పెళ్లి చేసుకుంటే సాన్నిహిత్యం పెరిగి, ప్రేమ తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదెక్కడ కథలో- ఓ స్త్రీ భర్త, కొడుకు, కోడలు, మనవల మధ్య జీతం లేని సేవకురాలిగా, ప్రేమ పొందలేని  నిస్సహాయరాలుగా జీవితాన్ని నడపలేక, సొంతగా బతకడానికి తనలాంటి వాళ్లున్న స్థలానికి వెళ్లిపోతుంది.అక్కడ స్వతంత్రంగా బతికే వాళ్లతో కలిసి జీవిస్తుంది. అద్దం కధలో- లక్ష్మికి ఎప్పుడూ అద్దంలో తన ముఖం కనిపించదు. అంటే ఆమెకు ఉనికి లేదని రచయిత్రి భావన. ఒకరోజు అద్దం పగిలిపోవడంతో ఆ ముక్కల్లో ఆమె ముఖం కనిపిస్తుంది. అంటే ఆమె చనిపోయిందని అర్థం. కొడుకు ఆమెకు వచ్చే పెన్షన్ కోసం చూస్తాడు తప్ప, ఆమెను పట్టించుకోడు.               పార్వతి కృష్ణమూర్తి కథలు కూడా వైవిధ్యంతో కూడుకున్నవే. భార్యను ప్రేమించే భర్తల గురించి కాకుండా, భార్య పంచే ప్రేమాభిమానాలు, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపటం, పిల్లలతో స్నేహంగా ఉండటం.. ఇలా సంసారంలో స్త్రీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి మారు పేరుగా పార్వతి పాత్రను తీర్చిదిద్దారు. అలానే వీరి కథల్లో ఎక్కువగా నేటి యువతులు, యువకులు, వారి మధ్య ప్రేమలు, స్నేహాలు, తల్లిదండ్రులతో సంబంధాలు... కనిపిస్తాయి. ఇంకా స్త్రీలు అనుభవిస్తున్న పరాధీనత, స్వతంత్ర వ్యక్తిత్వంతో ఇంటినుంచి, కట్టుబాట్ల నుంచి వెళ్లిపోయే స్త్రీలు జీవితాలు... వీరి రచనల్లో కనిపిస్తారు.            రామలక్ష్మి గారికి ఆరుద్రతో పరిచయం, వివాహం చాలా విచిత్రంగా జరిగింది. ఆమె స్వతంత్ర పత్రికలో పనిచేసేటప్పుడు కృష్ణశాస్తి, శ్రీశ్రీ లాంటి ప్రముఖులతో పరిచయం ఉండేది. ఆరుద్ర రాసిన కవితలు ఆ పత్రికలో వచ్చేవి. వాటిని చూసిన రామలక్ష్మి, తన మొదటి కథా సంపుటికి ముందుమాట రాయమని అడిగింది. కానీ ఆరుద్ర ఆర్నెళ్ల పాటు అడిగించుకొని రాశారు. అలా విడదీసిన రైలుబళ్లు కథా సంపుటి ముందుమాట వారిద్దర్ని కలిపింది. రామలక్ష్మి గారు ఆరుద్ర సినీగీతాలను సంకలనం చేశారు. వీరికి గృహలక్ష్మి స్వర్ణకంకణం అవార్డు వచ్చింది.             ముఖ్యంగా వీరి రచనలు నేటి యువతీ యువకులు చదవాల్సిన అవసరం ఉంది. మరుగున పడుతున్న మానవ సంబంధాల్లోని విలువలను ఇవి పట్టి చూపిస్తాయి. స్త్రీలు సొంత వ్యక్తిత్వాలతో ఎలా పెరగాలో, కట్టు బాట్లను ఎలా అధిగమించి ముందుకు సాగాలో నేర్పిస్తాయి.     - డా. ఎ.రవీంద్రబాబు

కె. ఎన్. వై. పతంజలి

 కె. ఎన్. వై. పతంజలి                                                              అతనిదో విలక్షణమైన శైలి. భాషలో, వస్తువులో తొణికిసలాడే వ్యంగ్యం. సమాజాన్ని, మనుషులను తలకిందులు చేసి చూడాలనే తత్వం. మనుషుల్లోని వైవిధ్యాన్ని, విలక్షణతని తనదైన ప్రత్యేక కెమరాతో చూసే చూపు. తనకోసం మాత్రమే రచనలు చేస్తాను అని నిక్కచ్చిగా చెప్పగల ధైర్యం. అపారమైన పాండిత్యం, ఆ పాండిత్యాన్ని మాండలిక భాషలో సొగసుగా వ్యక్తం చేయగల ప్రతిభ. అతనే కె.ఎన్.వై. పతంజలి. ఏ కొద్ది సాహిత్యాభిమానం ఉన్నవారికైనా పతంజలి గురించి తప్పక తెలిసే ఉంటుంది. మనుషుల వ్యక్తిత్వాల్లోని వైరుధ్యాన్ని అన్ని కోణాల నుంచి చిత్రించిన రచయత ఆయన. పతంజలి అంటే జర్నలిస్టు, కథ, నవలా రచయిత. కాలమిస్టు. వ్యాస రచయిత. వైద్యుడు. వ్యంగ్యానికి పెట్టింది పేరు.          పతంజలి అసలుపేరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. విజయనగరం జిల్లాలోని అలమండలో మార్చి 29, 1952న జన్మించారు. చిన్ననాడే తండ్రి వద్ద ఆయుర్వేద శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. 11వ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు. 1975 నుంచి 84 వరకు ఈనాడులో, 1984 నుంచి 90 వరకు ఉదయం పత్రికల్లో పాత్రికేయ వృత్తిలో పనిచేశారు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలలో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. టి.వి - 9లో, సాక్షి పత్రిక ఆవిర్భావంలో ఎడిటర్ గా విధులు నిర్వహించారు. సింధూరం సినిమాకు మాటలు రాశారు. అందుకు వీరికి నంది పురస్కారం కూడా లభించింది. వీరు నవలలు, కథలతో పాటు కొన్ని ప్రత్యేకమైన రచనలు కూడా చేశారు. నవలలు- పెంపుడు జంతువులు, ఖాకీవనం, పిలక తిరుగుడు పువ్వు, గోపాత్రుడు, వీర బొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ, అప్పన్న సర్దార్, మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు.. కథలు- వేట కథలు, జ్ఞాపక కథలు, శభాషో మోపాసా.. వంటి సంపుటాలు. ఇతర రచనలు - పతంజలి భాష్యం, గెలుపు సరే బతకడం ఎలా...         వీరు మరణించిన తర్వాత స్నేహితులు, అభిమానులు, సహోద్యుగులు కలిసి వారి అనుభూతుల్ని, అభిప్రాయాలను, వీరి రచనల్లోని గొప్పతనాన్ని వ్యాసాల రూపంలో పుస్తకంగా తెచ్చారు. అదే పతంజలి తలపులు.          పతంజలి రచనలను అర్థం చేసుకోవాలంటే 1970 ల నుంచి సమాజాన్ని అవగతం చేసుకోవాలి. తెలుగునేలపై వచ్చిన సాంస్కృతిక, రాజకీయ మార్పులను, ఉద్యమాలను తెలుసుకోవాలి. 1975లోని ఎమర్జన్సీ నుంచి అన్నమాట.  బాల్యంలో భూస్వాముల ఇళ్లల్లోని గొప్పలు, యవ్వనంలో విశాఖతీరంలోని అనుభవాలు, ఉత్తరాంధ్రలోని ఉద్యమాల ప్రభావం అన్నీ వీరి రచనల్లో అంతర్గతంగా కనిపిస్తాయి. ఇంకా శ్రీశ్రీ, పురిపండ అప్పల స్వామి, కారా మేస్టారు, రావి శాస్త్రి, చెకోవ్, మొపాసా, గురజాడ, చాసో, ఆస్కార్ వైల్డ్, వేమన, సెర్వాంటిజ్ ల ప్రభావం కూడా ఉంది. అందుకే చమత్కారం, వ్యంగ్యం, విలక్షణమైన వచనశైలి వీరి సొంతం. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, సంభాషణలు... సరికొత్తగా తటిల్లతల్లా మెరుస్తుంటాయి. ప్రతి రచనలో అంతుచక్కని లోతు, అర్థం చేసుకున్నంత విస్తృతి కనిపిస్తుంది.            ఖాకీవనంలో ప్రభుత్వం తరపున ప్రజలపై ధౌర్జన్యం చేసే వాళ్లే అధికార వర్గాన్ని నిలదీయడం చూడొచ్చు. వీరబొబ్బిలిలో రాజుల లోగిళ్లలో పుట్టి పెరిగి వారి మాటలతో పాటు, మర్యాదలు, పెంకితనాన్ని నేర్చుకున్న గ్రామసింహం (కుక్క) తీరును వ్యంగ్యంగా అర్థం చేసుకోవచ్చు. నావల్ల ఈ దివాణానికి కళ, కాంతి అని విర్రవీగే కుక్క అది. చూపున్న పాట కథలో గుడ్డివాడు తన ప్లూటులో విప్లవాన్ని ఉద్దేశించే పాట పాడితే... అది పోలీసును ఎలా భయపెడుతుందే వివరించాడు. అడల్డ్ స్టోరీలో- పువ్వును ముద్దు పెట్టుకుంటే పుప్పొడి, పెళ్ళాన్ని ముందు పెట్టుకుంటే కుంకుమ పెదాలకు అంటుకుంటాయి అన్నాడు. నువ్వే కాదు నవలికలో డబ్బు మనుషుల్ని ఎలాంటి దైన్యానికి దిగజారుస్తుందో తెలియజేశాడు. న్యాయం, మీడియా అన్నీ వ్యవస్థలూ అవినీతి మయం అయ్యాయని రుజువు చేశాడు. అసలు పతంజలి సృష్టించిన పాత్రలు వెక్కిరిస్తాయి, చమత్కారంగా సంభాషిస్తాయి, పాఠకుల గుండెలను బరువెక్కిస్తాయి, తర్కంతో మెప్పిస్తాయి. మానవ స్వభావం, ఆశలు, నిరాశలు, అన్నీ వ్యవస్థీకృతం అని చెప్పకనే చెప్తాయి. మనల్ని మేడిపండు వొలిచినట్లు వొలిచి మనలోని లోపాల్ని పురుగుల్లా బైటకు చూపెడతాయి.       తన రచనల గురించి పతంజలి స్వయంగా చెప్తూ- నేను వ్యంగ్యాన్ని ప్రత్యేకంగా రాయను, మనుషుల్లో ఉన్నదే రాస్తాను అంటారు. చెడును. దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. వ్యంగ్యంలో నా బాధ, క్రోధం ఉంటాయి. రాయకుండా ఉండలేను కాబట్టే రాస్తున్నాను అని చెప్పుకున్నారు. పతంజలి రచనలు చదవడానికి ధైర్యం కావాలి. లోకం మీద కసితో కురిసే వారి వాక్యాల కత్తుల బోనులోకి ప్రవేశించాలి అంటే ఆ పదును తట్టుకోగలగాలి.  వీరికి రావిశాస్త్రి పురస్కారం, చాసో పురస్కారం లభించాయి. వీరి రచనల మొత్తాన్ని మనసు ఫౌండేషన్ రెండు సంపుటాలుగా తెచ్చింది. వీరి నవలికలను నాటకాలుగా మలచి ప్రదర్శించారు.          ఇలా మనిషిలోని హిపోక్రసీని, సమాజంలోని అంతర్గత విలువల పతనాన్ని రచనల్లో చెప్పిన పతంజలి క్యాన్సర్ తో 2009లో మరణించారు. ఆయన గురించి ఆయన ఆప్తులు, తోటి రచయితలు ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు.           "మిత్రులందరికీ ఆయన స్మృతి ఒక దవనం. అది పరమళిస్తూ ఉంటూ నెమరు వేసుకునే కొలది బాధగానూ, రుచిగానూ, శక్తి నింపేట్టుగానూ, నిలబెట్టేట్టుగానూ ఉంటుంది" అన్నారు ప్రముఖ కవి శివారెడ్డి. "ఏదో ఒక పేజి చదివాక, మన రక్తంలోకి జొరబడాతడు" అని ఆయన రచనల్లోని గొప్పతనాన్ని చెప్పారు అరసవిల్లి కృష్ణ.                 చివరిగా పతంజలి 1984లో జరిగిన ఎన్నికల సందర్భంగా రాసిన వాక్యాలను గుర్తుచేసుకుందాం. ఎందుకంటే అవి ఇప్పటికీ వాస్తవాలు కనుక-             "మనమీద మనకు కొంత అసహ్యం వేస్తుంది.             మన మీద మనకు కొొంత రోత పుడుతుంది.             మన బుద్ది గడ్డి తింటున్నదని తెలిసి సిగ్గేస్తుంది.             ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత తుపాకి ఇంకా మనకే గురిపెట్టి ఉందని తెలుస్తోంది.             మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది            ఈ మొహం మరో అయిదేళ్ల వరకూ ఎవరికీ చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది. - డా. ఎ. రవీంద్రబాబు

శీలా వీర్రాజు

శీలా వీర్రాజు   ఒక వ్యక్తిలో అనేక కళలు ఉండడం అరుదు. కానీ ఆ కళలన్నింటిలోనూ గొప్పవారు కావడం ఇంకా అరుదు. చిత్రకళ, సాహిత్య కళలో సమానంగా మెప్పించిన సృజనకారులు శీలా వీర్రాజు. సాహిత్యంలో కథ, కవిత్వం, నవలలను రాసి వినుతికెక్కారు. అసలు రెండు దశాబ్దాల కాలం ఏ రచయిత పుస్తకమైనా శీలా వీర్రాజు ముఖచిత్రంతో రావాల్సిందే. అంటే చిత్రకళను, సాహిత్య కళను సవ్యసాచిలా తెలుగు సమాజంపై ప్రయోగించి, మెప్పు పొందిన కళాకారులు శీలా వీర్రాజు గారు.      శీలా వీర్రాజు ఏప్రిల్ 22, 1939న రాజమండ్రిలో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే సాగింది.  తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఎ. వరకు చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి- కథలు, నవలలు, కవిత్వం రాసేవారు. 1961 నుండి సుమారు మూడు సంవత్సరాలు పాటు హైదరాబాదులోని కృష్ణాపత్రికలో చిత్రకారునిగా, రచనాకారునిగా పనిచేశారు. 1963లో సమాచార పౌర సంబంధాల శాఖలో ఉద్యోగంలో చేరారు. దామెర్ల రామారావు, వరద వెంకటరత్నం దగ్గర చిత్రకళను నేర్చుకున్నారు.         వీరి రచనలు ఎక్కువ మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరుగుతుంటాయి. కథ రాసినా, కవిత్వం రాసినా, నవల అల్లినా అన్నింటిలో సౌందర్యంతో పాటు, సామాజిక అంశం కూడా మిళితమై ఉంటుంది. నవలలు - వెలుగురేఖలు, కాంతిపూలు, మైనా, కరుణించని దేవత. కవిత్వం - కొడగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్లీ వెలుగు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, శీలా వీర్రాజు కవిత్వం (6 కవితా సంపుటాల గ్రంథం) కథలు - వీరి కథలు పలు సంపుటాలుగా వచ్చాయి. సమాధి, మబ్బు, శీలా వీర్రాజు కథలు, బండి చక్రం, రంగుటద్దాలు, పగా మైనస్ ద్వేషం, మనసులోని కుంచె, వాళ్ల మధ్య వంతెన, ఊరు వీడ్కోలు చెప్పింది, శీలా వీర్రాజు కథలు (మరో సంపుటం)... లాంటివి. ఇతర రచనలు - కలానికి అటు ఇటూ (వ్యాససంపుటి), శిల్పరేఖ (రేఖాచిత్రాలు), శీలా వీర్రాజు చిత్రకారీయం (వర్ణచిత్రాల ఆల్బమ్) వీటితో పాటు కొన్ని అనువాదాలు కూడా వీర్రాజు చేశారు. చాలా పత్రికల్లో వీరి రచనలు ధారావాహికలుగా వచ్చాయి.          శీలా వీర్రాజు కథలు ఏకబిగిన చదివిస్తాయి. మనసుకు అనుభూతినిస్తాయి. సంస్కారవంతమైన జీవితాన్ని పాఠకులు అలవర్చుకొనేలా చేస్తాయి. వీరి కవిత్వం రమణీయతతో కూడిన భావుకతతో ఉంటుంది. మొత్తంగా వీర్రాజు రచనలు ప్రకృతిని, మనుషుల్ని సమపాళ్ళలో ప్రేమించడం నేర్పిస్తాయి. జీవితాన్ని, తోటి మనుషుల్ని నిస్వార్థంగా ఇష్టపడమని చెప్తాయి. వీరికి సత్యమే వస్తువు. దాన్ని చెప్పే పద్ధతే సుందరం అంటే శిల్పం. సాహిత్య ప్రయోజనమే అంతిమం. అంటే శివం. ఇలా సమాజానికి తాత్వికమైన అర్థాన్ని ఇస్తాయి శీలా వీర్రాజు రచనలు.           నిజాయితీ లేనివాళ్లం కవితలో-           మాట మాటకీ మనమే గర్తొస్తుంటాం           ప్రజలు గుర్తురారు, సమూహాలు గుర్తురావు           మనం వొట్టి స్వార్థపరులం           మనకు కావల్సింది ప్రజలు కాదు, మనమే           మన కీర్తి ప్రతిష్టలు, మన సుఖ సంతోషాలు,           మన హోదాలు              ఆ తర్వాతే మనకు ప్రజలు....          అంతస్సూత్రంగా వీరి రచనల్లో ఇదే కనిపిస్తుంది.         శీలా వీర్రాజు వ్యక్తిత్వం సాత్వికం. కోపతాపాలకు అతీతం. కొత్త రచయితలకు ప్రోత్సాహం. ఇతరుల పుస్తకాలను సైతం అందమైన ముఖచిత్రాలతో గుండెలకు చంటిపాపలా హత్తుకునే తత్త్వం. కవుల్ని, రచయితల్ని ప్రోత్సహిస్తారు.           చిత్ర కారునిగా కూడా శీలా వీర్రాజుది ప్రత్యేకమైన శైలి. వీరి చిత్రాలు మోడ్రన్ ఆర్టుకు దూరంగా మన గ్రామ సీమల్ని గుర్తుకు తెస్తాయి. ఊళ్లల్లో కనిపించే జీవితాలు, వృత్తులు, పనిపాటలు, పండగలు, శ్రమజీవుల కష్టాలు... ఇలా వీరి బొమ్మలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి. ఇప్పటి వరకు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. మనదేశంలోనే కాకుండా పశ్చిమ జర్మనీ గోటింజన్ నగరంలో కూడా వీరి చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. పడుగు పేకల మధ్య జీవితం అని తన ఆత్మకథను కవితా రూపంలో రాసుకున్నారు. ఇది ఆయన జీవితమే అయినా అందరి జీవితాల్లా కనిపిస్తుంది.         వీరికి 1967లో కొడగట్టిన సూరీడు కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ వారి మొదటి అవార్డు వచ్చింది. 1969లో మైనా నవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవలగా గుర్తించబడింది. 1991లో వీరి కథల సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ బహుమతిని వచ్చింది. 2014లో బోయి భీమన్న కవితా పురస్కారం శీలా వీర్రాజును వరించింది.          ఇలా అటు కథలు, కవిత్వం, నవలలు...  ఇటు చిత్రకళను తనదైన ప్రత్యేకమార్గంలో సృజించిన ప్రతిభ శీలావీర్రాజుగారిది. అందుకే నేటితరం రచయితలకు. కవులకు, చిత్రకళాకారులకు ఓ పుస్తకం లాంటి వారు శీలా వీర్రాజుగారు. - డా. ఎ. రవీద్రబాబు