మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మమతా సాగర్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మమతా సాగర్ మమతా సాగర్ కన్నడ రచయిత్రి. ఆమె కవిత్వం, వ్యాసాలు, నాటకాలు, గద్యం, విమర్శ, ఆర్ట్ రైటింగ్, కాలం రైటింగ్ ఇలా అనేక ప్రక్రియల్లో రాస్తుంది. కన్నడ నుంచి ఇంగ్లీష్ లోకి ఇంగ్లీష్ నుంచి కన్నడ లోకి అనువాదాలు కూడా చేసింది. ఎన్నో పొయెట్రీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. ఆమె కవిత్వం భారతీయ భాషల్లోకే కాకుండా దాదాపు పధ్నాలుగు విదేశీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆమె రెండు కవితా సంకలనాలు పబ్లిష్ చేసింది. ఆమె ఆర్టికల్స్ ఇంగ్లీష్ పేపర్స్లో చదివాను. ఇంగ్లీష్లోకి అనువదించిన ఆమె ఈ కవిత ఆమె బెస్ట్ కవితల్లో ఒకటి. పంచభూతాలనేవి ఈ సృష్టికి మూలం. ఇంత అద్భుతమైన వైవిధ్యానికి కేవలం ఆ అయిదు మూలకాలే ఆధారం అంటే అలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వివిధ రకాలైన వృక్ష జాతులు, పూల జాతులు, రంగులు పరిమళాలు, రుచులు, ఆకృతులు, ప్రాణికోటి లోని వైవిధ్యం గురించి చెప్పనే అక్కరలేదు, ఇంకా మనిషికి తెలియని ప్రాణులు ఎన్నున్నాయో. ఒక్క భూగోళం మీదే ఇంత వైవిధ్యానికి అయితే ఇంకెక్కడన్న ప్రాణం ఉంటే మరి అవి ఎలా ఉంటాయో. సృష్టి అనేది నిరంతర ప్రక్రియ, సృష్టి అవుతున్నది మాత్రం మార్పు చెందుతూనే వస్తోంది. మార్పు లేకుండా జరుగుతున్నది సృష్టి. కేవలం పంచభూతాలనుంచే జరుగుతున్న ఈ సృష్టి అంతా ఒక నిర్ణీత జీవిత కాలం తరవాత నశించి మళ్ళీ అవే పంచభూతాల్లో కలిసి పోతుంది. అంటే ప్రాణం ఉన్నా లేకున్నా ప్రతి జీవి ఉనికి పంచభూతాల్లో ఉంది. ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత పరిస్తుతుల కలయిక ప్రభావాల వల్ల పంచభూతాల్లో ఉన్న ఉనికి ఒక నిర్దేశిత ఆకృతిని పొంది ప్రాణం పోసుకుంటుంది. ఉనికిలోకి వచ్చిన ఆ ప్రాణిలోనూ కనపడకుండా అవే పంచభూతాలు ఉంటాయి. అయినా అవి విడిగా బయటా ఉంటాయి. ప్రాణం ఉన్న జీవి, మెదడు కూడా అభివృద్ధి చెందిన జీవి మానవుడు ఇప్పుడు పంచభూతాలను తన చేతిలో పెట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇది మానవుడి పురోగతికి పంచభూతాలపై అతని విజయానికే దారి తీస్తుందో, సర్వ ప్రాణికోటి వినాశనానికే దారితీస్తుందో చెప్పలేము. ప్రాణంలో, ఉనికిలో పంచభూతాలు ఎలా ఉన్నాయో, బయట ఉన్నవే లోపల, లోపల ఉన్నవే బయటా ఎలా ఉన్నాయో, ఈ చిన్న కవితలో అందంగా చెప్తుంది మమతా సాగర్. కవిత చిన్నదే అయినా అది రేపే ఆలోచనల దుమారం మాత్రం పెద్దదే.   నది నా చేతుల దోసిలిలో నది ఉంది ఇక నది లోపల ఉన్నాయి ఆకాశం, మేఘాలు, సూర్యుడు. నా చేతులు విదిలించేస్తే నది చుక్కలుగా ఒలికిపోతుంది ఆకాశం, మేఘాలు, సూర్యుడు నాపైనంతా పడతాయి. అదే చేతుల దోసిలి గిన్నెతో నదిని నే తాగితే అప్పుడు నాలోనే ఉన్నాయి ఆకాశం, మేఘాలూ, సూర్యుడు. నాకు చెప్పండిప్పుడు ఎవరు ఎవరిలో ఉన్నారో. సృష్టిలో ప్రతిజీవి ప్రాణం పోసుకున్నాక దాని జీవితం ఒక ప్రవాహంలా సాగుతుంది. ప్రాణం ఉన్నంతవరకూ గతం నుంచి వర్తమానం ఆతరవాత భవిష్యత్తు అన్నీ ఒక ప్రవాహంలా సాగుతూనే ఉంటాయి. గతానికి వర్తమానానికీ భవిష్యత్తుకీ తెగని లంకె ఉండటాన్ని ఈ ప్రవాహం సూచిస్తుంది. ఒక రకంగా కాలం అనేదే ఈ ప్రవాహం. జీవితం అనేది ప్రవాహంలాగా వెనక్కి వెళ్ళినపుడూ అంటే గతంలోనూ ఉంటుంది, వర్తమానంలోనూ ఉంటుంది భవిష్యత్తులోనూ ఉంటుంది. అయితే ఈ ప్రవాహంలో పడి కొట్టుకు పోవడం అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవించడమే. కాకపోతే నిజానికి ఎవరి జీవితంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఆకు విడిపోయి రాలిపోయి ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన సంగతి గాలికి గానీ, చెట్టుకి గానీ, నీటికి గానీ చేపకి గానీ దేనికీ తెలియదు. ఎవరి లోకం వారిది, ఎవరి మైకం వారిది. అదే జీవితమనుకుంటా. పైకి కనిపించకపోయినా, ఎంతో భావగర్భితమైన కవిత, ఎంతో తాత్వికత నిండిన కవిత అని నాకనిపించింది. దీనికి వేరేమైనా అర్ధం కూడా ఉండచ్చునేమో, కవి హృదయం ఏంటో ఒకొక్కరికీ ఒక్కోలా అర్ధం కావచ్చనుకుంటా. అది కూడా కవిత గొప్పదనమేమో. దాగుడుమూతలు ఓ గాలిపటంలా గాలిని లాలిస్తూ చెట్టు నుంచి ఒక ఆకు రాలుతోంది తేలుతూ ఊగుతూ ఇప్పుడొక పడవైంది నది నీటిలో రంగు రంగుల చేపలతో పాటుగా ప్రకాశించే బంగరు రంగు నీటిపై పచ్చని మెరుపులా త్వరత్వరగా ప్రయాణిస్తూ ప్రవాహంతో కొట్టుకుపోయింది నీటికి తెలియదు గాలికి తెలియదు చెట్టుకి తెలియదు చేపకి తెలియదు ఈ దాగుడుమూతలాట   - Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా తంపి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా తంపి అనితా తంపి మలయాల కవయిత్రి. అలతి అలతి పదాల్లో ఆమె కవితలు మన కళ్ళ ముందొక దృశ్యాన్ని నిలబెడతాయి. చదువుతూ చదువుతూ మెల్లిగా అడుగులేసుకుంటూ మనం ఆ దృశ్యంలోకి, ఓ చిక్కని పనస చెట్టు చల్లని నీడ లోకో, పచ్చని పొలాల్లో వీచే పైరగాలికి రేగి పోయే వెంట్రుకలు సర్దుకుంటూనో, ఆ గాలి చల్లగా తాకుతున్న హాయిలో మైమరచిపోయి ఆ అందమైన సాయంకాలంలో తనువుని మరచి గాలిలో సుగంధం కలిసిపోయినట్టుగా తన్మయిత్వం పొందుతాము. సైన్సు, ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైన అనిత పాఠకుణ్ణి తను వర్ణించే దృశ్యంలోకి తీసుకెళ్ళే ప్రతిభకి కారణం తన చదువే అంటుంది. కవిత్వం చేసే నేర్పుంటే జీవితంలోని ఎంత చిన్న ఘటన అయినా అనుభవమైనా కవితయి కూర్చుంటుందనటానికి Writing అనే ఈ కవిత ఉదాహరణ. Writing అకస్మాత్తుగా నీటి ప్రవాహం ఆగింది స్నానం చేస్తూండగా. తుప్పు పట్టిన కొళాయీ ఆగింది ఈల వేస్తూ. నగ్నంగా ఉన్న శరీరం వణికింది జలదరిస్తూ. వణికించే గాలి కిటికీ లోంచి దాని వేళ్ళు చాచింది. చల్లగా ఉండాలనిపించింది ఓ క్షణం నాకు. తడితనపు వలువ దూరంగా ఎగిరిపోయింది సిగ్గు నే మరచాను కావరపు వేసవిని కప్పుకుని. వర్షిస్తూ వృక్షంలా జుట్టు పాయలు. శరీరంపై రాస్తాయి స్మృతిపధంలోంచి నీటితో కేవలం ఒకటో లేక రెండు లైన్లు. మలయాలీ ఆడవారికి ప్రతిరోజూ తలంటుకునే అలవాటు ఎంత పెద్ద జుట్టున్నా, చలికాలమైనా. ఇంట్లో అయితే పరవాలేదు, ఆఫీసుకైనా వారు జుట్టు ఆరబెట్టుకోకుండా, నీళ్ళు కారే జుట్టుకి ఒక రబ్బరు బేండ్ తగిలించి వచ్చేస్తారు. ఆ జుట్టు నీరు కారుతూ వెనక బట్టలు తడిచినా వారు అలానే పనిచేయడం నా అనుభవం. కాకపోతే చెట్టు నీరు కారుస్తున్నట్టు నీటితో జడపాయలు ఒకట్రెండు లైన్లు స్మృతిపధంలోంచి రాస్తాయనడం కొసమెరుపు. Fruit As It Is, Sweeping The FronT Yard అనే కవితల్లో మొదటిది ఒక స్త్రీ శరీరాన్ని అసభ్యత లేకుండా పనస పండు తో పోలుస్తుంది. చదువుతుంటే బాగా మగ్గిన పనస తొన వాసన రావాల్సిందే. అలాగే రెండవ కవిత చదువుతుంటే తెల్లవారకుండానే చీపుళ్ళతో వాకిలి శుభ్రం చేసే చప్పుడు వినపడాల్సిందే. ఎక్కడికక్కడ ఫ్లాట్స్ కల్చర్ వచ్చి ఇప్పుడు ఆ శబ్దాలు అపురూపం అయిపోయాయనుకోండి. వాకిలి శుభ్రం చేసే అతి సామాన్యమైన పనిలో ఎవరూ గమనించని విషయాన్ని ఆమె ప్రస్తావిస్తుంది. రాత్రంతా వానపాము నిద్రపోకుండా మట్టిని తొలిచి చిన్న చిన్న ఇళ్ళు కడుతుందట తెల్లారేటప్పటికి చీపురు పుల్లల బారిన పడి కొట్టుకు పోతాయని తెలియక. పని పిల్ల గానీ, ఇల్లు గానీ, తెల్లారాకా తలుపుని తాకే పేపర్, కాఫీ తాగుతూ చదెవే వారు గానీ ఎవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకోరు. అలా మనుషులతో పాటు వస్తువులన్నిటికీ ఆమె ప్రాణం పోస్తుంది. ఈ ఒక్క ప్రస్తావన వల్ల ఆ కవితలో ముఖ్యంగా పైకి కనిపించేదానికన్నా ఎక్కువే ఆమె చెప్తుందనిపిస్తుంది. ఒకరికి రొటీన్ పని వేరొకరికి ప్రాణ సంకటం. మొన్నటి కొల్కత్తా బ్రిడ్జ్ కూలిన సంఘటన గురించి కంపెని అధికారులు వ్యాఖ్యానిస్తూ ఇలాగే అన్నారు. ఇప్పటికి 27 ఏళ్ళుగా మేమిదే చేస్తున్నాము, 59 పిల్లర్లు కూడా ఇలాగే కట్టాము, 60 వ పిల్లరు కూలిందంటే, ఎలా కూలిందో మాకు మాత్రం ఏంతెలుసు అని. ఈ రోజుల్లో ఏదీ స్వఛ్చంగా లేదు. గాలి, నీరు, నేల, శబ్దం, నిశ్శబ్దం, పరిసరాలు ఏదీ కూడా. ఇక ఇప్పుడు ఏ నదీ తీరానికో, సముద్ర తీరానికో పారిపోయినా స్వఛ్చత దొరకదు. మనిషి వెళ్ళిన ప్రతి చోట తన మలినాల్ని గుర్తులుగా వదిలి వస్తాడు. నదులూ చెరువులూ కలుషితమై నీరు నల్లగా డ్రైనేజ్ వాటర్ లాగే కనపడుతుంది. దానికి కోల్పోయిన పవిత్రతని ఇవ్వడం పోయి రకరకాలుగా కలుషితం చేస్తూనే ఉన్నాం మనం. ఎటు వెళ్ళినా వెక్కిరిస్తూ గాలికి ఎగిరే ప్లాస్టిక్ కవర్లూ, దుమ్ము పొగతో నల్లబడి పోయిన గోడలూ, ఆఖరికి వానపడితే తప్ప చెట్లు కూడా గ్రీన్ గా కనపడవు. ఎప్పుడైనా ఒక గంట కరెంటు పోతే మనం ఏంచేస్తాం. కొంచం సేపు ఏం చెయ్యాలో తెలియదు, విసుక్కుటాం, తిట్టుకుంటాం, ఆ తరవాత ఏం చెయ్యొచ్చని ఆలోచిస్తాము. అప్పుడు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడటం, లేదా ఏదైనా పుస్తకం చదవడం, ఇల్లు సర్దుకోవటం, ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడటం, పాత విషయాలు, లేదా గతించిన పెద్దల్ని గుర్తు చేసుకోవటం, రాత్రనుకోండి అలా చల్ల గాలికి బయటికి వెళ్ళి, నక్షత్రాలు కొలువుతీరిన ఆకాశం చూసి, చందమామ కూడా ఉంటే ఇంకొంచం బోనస్ అనుకోండి, ఇంత ప్రశాంతతని, మనసు విప్పి మాట్లాడుకోవడంలోని ఆనందాన్ని, కరెంటుండటంవల్ల కోల్పోతున్నామా అని ఆశ్చర్య పడక మానం. In The Palm వేళ్ళ పక్కల నుంచి పోతూ మనుషులు చెమటలు కక్కుతూ, రొప్పుతూ మురుగుకాల్వల ఒంపుల్లో ఉద్యానవనాలు కాలేని పచ్చదనం కాల్చబడుతుంది వీటిపైన నిటారుగా నిలబడి ఎండలో మెరుస్తున్న సైన్ బోర్డులు అన్ని దిక్కులా పరిగులెత్తుతూ వాహనాలు రొదపెడుతూ జనం కళ్ళనుండి దాచేసిన ఆకాశపు తునకలు, వేలిగోర్ల దగ్గర నల్లని నెలవంకలు ధమనుల చిత్రపటంలో గిలగిలలాడుతూనే సరిహద్దులు అకస్మాత్తుగా చేయి చేయి కలిసిన ఓ మెరుపు కదలిక వస్తువులపై కోపంతో వస్తువులతో నిండిన భవనాలు కుప్పకూలాయి. కరెంటు, శబ్దాలు, దృశ్యాల బరువుతో అలిసిన ప్రకటనలు వాకౌట్ చేసాయి. జ్ఞానమంతా వదిలిపెట్టి తీగలన్నీ చిక్కుబడిపోయాయి ఒక్క క్షణంలో చిన్నపిల్లల బొమ్మల్లోలా కొండలు, మధ్యన సూర్యుడు కనపడ్డాయి ఇక వచ్చాయి నదులు, వరిపొలాలూ మేఘాలూ, చెట్లూ, నల్లని మనుషులు, పశువులూ, గోమయ పోషణతో, పచ్చని గడ్డిదారులు ఒకే ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది విత్తటం, పంట కొయ్యటం కోత కోసిన వరిపొలంలో ఎండిన వరికంకుల్ని పొడుస్తూ పక్షులు తిరుగాడుతున్నాయి చేయి చేయి గట్టిగా కలిసింది అన్వేషణ మొదలయింది సంకేతాల మూలాల కోసం ఎక్కడ రక్తం మొలకెత్తుతుందని. విద్యుత్తూ, కంప్యూటర్లూ, ఇంటర్నెట్లూ తెచ్చిన విప్లవాత్మక మార్పులు మార్కెటింగూ, కస్యూమరిస్మ్. దేన్నైనా అమ్మతగిన వస్తువుగా మార్చేసే గ్లోబల్ మార్కెట్ వ్యవస్థ ఇనుప గొలుసుల్లో చిక్కుకుపోయి మనిషి ఇప్పుడు గిల గిలా కొట్టుకుంటున్నాడు. ఈ పరిస్తితి నుంచి ఒక్కసారిగా, ఒక్క క్షణంలో తిరిగి పాత స్వఛ్చ్మైన పరిసరాల్లోకి వెళ్ళిపోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇదే కోరికని అనిత ఈ పోయెంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్తితి కలగా తప్ప రావడం సులభమా? అలా అని ఆమేమీ అనుకోవట్లేదని ఆఖరి రెండు లైన్లూ చెబ్తాయి. ఈ పరిస్తితులు తిరగబడాలంటే పోరాటం చెయ్యాలి అందుకే రక్తం మొలకెత్తే మూలాల్ని అన్వేషిచాలి అంటుంది. 2004 లో పబ్లిష్ అయిన సంకలనం Sweeping the Courtyard ని ప్రముఖ మలయాల పత్రిక కేరళలో The Best Poetry Book of the Year గా ఎంపిక చేసింది. ఆమె రచనలు ఇంగ్లీష్, స్వీడిష్, ఫ్రెంచ్, జెర్మన్ భాషల్లోనికీ ఇంక ఇతర భారతీయ భాషల్లోకీ అనువదింపబడ్డాయి. ప్రతి కవితా ఒక సంపూర్ణ భావ చిత్రం. రాజకీయ అవగాహనతో రాసిన ఈ పోయెం చూడండి. Emblem The sickle Joined The crescent in the sky The star Returned To the eyes of children The hammer Alone - pained by its unromantic origins - Started pounding On the nail-heads That were yet to hang History As pictures. ఈ పోయెంలో రెండవ భాగం హైలైట్. సుత్తి తన unromantic image వల్ల బాధపడి ఇంకా చరిత్ర చిత్రాలని వేలాడగట్టుకోవాల్సిన మేకులన్నిటి నెత్తి మీదా బాదుతోందట. అద్భుతమైన సటైరు కమ్యూనిస్ట్ పార్టీ emblem మీద. - Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? శశి దేశ్పాండే

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? శశి దేశ్పాండే శశి దేశ్పాండే కర్ణాటకలోని ధర్వాడ్ లో శ్రీరంగ అనే ప్రఖ్యాత కళాకారుడు, రచయితకు పుట్టింది. ఆమె ఆర్ధిక న్యాయ శాస్త్రాలే కాకుండా జర్నలిజంలో కూడా పట్టభద్రురాలై ఆన్ లుకర్ మేగజిన్లో కొన్నాళ్ళు జర్నలిస్ట్ గా చేసింది. ఆ తరవాత ఆమె రచనలు చెయ్యడం ప్రారంభించింది. ఆమె మొదటి కధల సంకలనం 1978 లో వెలువడింది. 1980 లో ఆమె తన మొదటి నవల The Dark Holds no Terrors రాసింది. 1990 లో రాసిన That Long Silence అనే నవలకి సాహిత్య ఎకాడమీ ఎవార్డు వచ్చింది. 2009 లో ఆమెకు పద్మశ్రీ ఎవార్డు ఇచ్చింది ప్రభుత్వం. 2014 లో ఆమె రాసిన 2014 లో The Shadow Play అనే నవల The Hindu Literary Prize కి నామినేట్ అయింది. శశి దేశ్పాండే భారత దేశంలోని ఇంగ్లీషులో రాసే ఆరుగురు అత్యంత ప్రతిభాశాలులైన రచయిత్రులలో ఒకరు. ఆమె ఇంగ్లీష్లో రాస్తుంది కానీ వెస్ట్ కోసం ఇండియాని అద్భుతంగా చిత్రించే పని చేయదు. కేవలం ఆ పాఠకులను తృప్తి పరచడం కోసం రాయదు. ఆమె స్త్రీ పాత్రలు ఒక శూన్యమైన సెల్ఫ్ ఇమేజ్ నుంచి సెల్ఫ్ రియలైజేషన్ వరకూ ప్రయాణం చేస్తాయి. ఇది అత్యవసరం స్త్రీ విద్యావంతురాలైనా కాకపోయినా, ఆర్ధికంగా స్వతంత్రురాలైనా కాకపోయినా. నేను ఫెమినిస్ట్ నే కానీ నేను ఎటువంటి ఇజం ని ప్రతిపాదించను సమర్ధించను అంటుందామె. శశి 4 చిన్న పిల్లల కధల పుస్తకాలు, 9 నవలలు, ఎన్నో వ్యాసాలు, ఇప్పుడు ఇవి ఒక సంకలనంగా Writing from the Margin and Other Essays లభ్యమవుతున్నాయి. ఆమె ఇప్పటికీ ఇంగ్లీష్ పత్రికల్లో ఎన్నో సామాజిక, సమకాలిక అంశాలపై వ్యాసాలు రాస్తూనే ఉంది. కలబుర్గి హత్యపై స్పందిస్తూ ఆమె తన ఎవార్డులను తిరిగి ఇచ్చివేసింది. ఎకాడమీ మౌనం వహించడాన్ని నిరసిస్తూ, సాహిత్య ఎకాడమీ జెనెరల్ కౌన్సిల్లో తన హోదాకి కూడా ఆమె స్వస్తి చెప్పింది . ఆ సందర్భంగా ఆమె రాసిన వ్యాసాన్ని ఒకదాన్ని నేను తెలుగులోకి అనువదించాను, దాన్ని Face Book లో షేర్ చేసుకున్నాను కూడా. ఒక స్త్రీ చదువుకుంటే తన కుటుంబమంతటికీ ఆమె విద్య ఉపయోగపడుతుందనీ, ఆమె పెంపకంలో పిల్లలపై ఆమె విద్య ప్రభావం సమాజాన్ని పురోగమనం వైపుకి నడిపిస్తుందని అంటారు. కానీ అది కేవలం విద్య నభ్యసించి, జ్ఞాన సముపార్జనవరకే, అంటే కుటుంబాన్నినడిపించడంలో తన బాధ్యతను ఇంకొంచం తెలివిగా చురుకుగా నిర్వర్తించడానికే. అంతకంటే ఏ స్త్రీ అయినా ఎక్కువ ఆశిస్తే ఆమెకు ఎదురయ్యేది సాధారణంగా భంగపాటే.. ఈ భంగపాటునీ, చదువుకుని, ఉద్యోగస్తులైన స్త్రీల సమస్యలనీ శశి తన The Dark holds no Terrors అనే నవలలో ఎంతో చక్కగా చిత్రిస్తుంది. సరిత ఆకా సరు తన చిన్నప్పట్నుంచి తన తల్లి నుండే విపరీతమైన వివక్ష ఎదుర్కొంటూంటుంది. ఇదేంటి అని ఆశ్చర్యపడక్కరలేదు. స్త్రీలకి పురుషుల వల్ల మాత్రమే కాదు సాటి స్త్రీల వల్ల కూడా చాలా కష్టాలొస్తాయి చాలా సందర్భాలలో. కొడుకునొకలాగా కూతుర్నొకలాగా చూడటానికి తల్లులు కూడా ఎలా indoctrinate అవుతారో వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరు తమ్ముడు ఏడేళ్ళపుడు నీళ్ళల్లో మునిగిపోయి చనిపోతాడు అదీ సరూ చూస్తూండగానే. కేవలం మూడేళ్ళు పెద్ద అయిన సరు తమ్ముడ్ని రక్షించుకోలేక పోతుంది. ఇదే కారణంగా ఆమెను అప్పట్నుంచీ తమ్ముడిని చంపిన అక్క గానే చిత్రించి సూటీ పోటీ మాటలతో తల్లి హింసిస్తూంటుంది. వాడు పోయాకా నువ్వు మాత్రం బ్రతికుండటం ఎందుకు? నువ్వూ పోతే ఒక ఏడుపు ఏడ్చి ఊర్కుంటాను లాంటి మాటలతో ఆమెను ఒక శత్రువుగానే చూస్తుంది తప్ప కూతురిలా ఎప్పుడూ చూడదు. కొడుకూ కూతురూ సమానం కారు, కొడుకు పోయాకా, అతని చావుకి కారణమని అనుకునే కూతురుకి విలువ ఏముంటుంది? ఆమెకు కూతురిగా దక్కాల్సిన ప్రేమ ఎలా దక్కుతుంది? ఈ రకమైన వాతావరణంలో ఇంటరు వరకూ చదువు అయ్యాకా, మెడిసిన్ చెయ్యాలని అనుకుంటుంది సరు. తల్లి ఇందుకు ఒప్పుకోదు, డిగ్రీ చేసిన తర్వాత పెళ్ళి చేసి పంపాలని ఆమె ఉద్దేశ్యం. కానీ సరు పట్టు పడుతుంది. తల్లిని ఎదిరిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తండ్రి ఆశ్చర్యకరంగా సమర్ధిస్తాడు. అలా ఆమె మెడిసిన్ చేస్తుంది. తల్లీ కూతుళ్ళ మధ్య ద్వేషం గొడవల వల్ల సరు తన తల్లిని కొడుకుతో పాటు కూతురిని కూడా పోగొట్టుకున్న ఫైల్యూర్ లాగా ట్రీట్ చేస్తుంది. తల్లి ఇంట్లోంచి ఒకసారి బయటికెళితే మళ్ళీ తిరిగి రాకూడదని అనుకుంటుంది. కానీ చిత్రంగా అనుకోని పరిస్తితుల్లో ఆమె తన తల్లి చనిపోయిందని తెలిసిన తరవాత తండ్రిని చూసే నెపంతో 15 ఏళ్ళ తరవాత పుట్టింటికి రావడంతో కధ మొదలవుతుంది. మెడిసిన్ చేస్తూనే సరు మనోహర్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తల్లి తండ్రులకిష్టంలేకపోయినా ఎదిరించి పెళ్ళి చేసుకుంటుంది. కొన్నేళ్ళ పాటు అంతా బాగానే ఉంటుంది. సరూ ఒక మంచి డాక్టరుగా ఎదిగి సమాజంలో గౌరవింపబడుతుంటే మనోహర్ ఒక మామూలు కాలేజీ లో లెక్చరర్గా పనిచేస్తూ భార్య కున్నంత గుర్తింపు గౌరవం పొందలేక పోతాడు. ఒక పేరున్న డాక్టరుగా ఆమె సంపాదనా హోదా అనుభవిస్తూనే, ఒక లేడీ డాక్టరు భర్తగా చెలామణి అవడాన్ని ద్వేషిస్తూ ఆమెపై కసి ఒకలాంటి పగా పెంచుకుంటాడు. ఇది అతను బయటికి వ్యక్తం చెయ్యకపోయినా ప్రతి రాత్రి ఆమెను సెక్స్ పేరిట బలవంతంగా హింసిస్తూ తన పురుషాధిక్యతను చూపిస్తుంటాడు. పగలు ఒక మంచి డాక్టరుగా పనిచేస్తూ రాత్రుళ్ళు మాత్రం భర్త పశుత్వానికి బలవుతుంటూ రెండు రకాల జీవితం మధ్య చెప్పలేని మానసిక సంఘర్షణ అనుభవిస్తుంది. ఒకప్పుడు ఆమె తన భర్త తనకిచ్చే భౌతిక సుఖాన్ని తన తల్లితండ్రుల వద్ద నుంచి పొందలేని ప్రేమతో ఈక్వేట్ చేసుకుని ఆనంద పడేది. కానీ ఇప్పుడు అదే ప్రేమలో ఏదో లోటు కనిపిస్తుంది. భర్త చెప్పక పోయినా అతను ఎందుకు అలా మారాడో ఆమెకు తెలుస్తూనే ఉంటుంది. కానీ సరూ ఉద్యోగం విడిచిపెట్టి ఇంట్లోనె ఉంటానంటే అందుకు ఒప్పుకోలేక ఆమెను తన తియ్యటి మాటలతో బులిపిస్తాడు. తన పిల్లలకు ప్రేమలో ఎటువంటి లోటూ రాకూడదని వారిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. కానీ తన పరిస్తితి ఆమెకు అగమ్య గోచరంగా ఉంటుంది. తండ్రి ఇంట ఆమెకు ఎటువంటి స్నేహ పూరిత ఆతిధ్యమూ దొరకదు. ఇష్టం లేని అతిధిని విధిలేక ఇంట నుండనిచ్చినట్టుంటుంది తండ్రి వ్యవహారం. అయితే అక్కడ ఆమె తన తమ్ముడు, తల్లి, తండ్రి, భర్తలతోటి తన సంబంధాలని రెవ్యూ చేసుకునే అవకాశం లభిస్తుంది. తన భర్తతో సంబంధం తెంచుకున్నా తనకు తండ్రి సమర్ధనా, ఆదరణా లభిస్తాయన్న నమ్మకం ఉందదు. తన జీవితంలోని మనుషులతో తన సంబంధంలోని ప్రేమనీ, ప్రేమ రాహిత్యాన్నీ, దానికి కారణాలనూ అర్ధం చేసుకున్నాకా ఆమెకు తన జీవితంలోని అనిశ్చిత పరిస్తితిపై భయం పోతుంది. ఏమైనా సరే, ఎలాగైనా సరే, అదే జీవితంలోకి పూర్తి ధైర్యంతో understanding తో ఆమె తిరిగి వెళ్తుంది. స్త్రీ వ్యక్తిగత ప్రగతి తన కుటుంబ ప్రగతి, కుటుంబ లక్ష్యాలతో ముడిపడి ఆ పరిమితుల్లోనే ఉన్నంత కాలం ఎవరికీ అభ్యంతరం ఉండదు. అంతకంటే పెద్ద కోణంలోంచి ఆమె తనను తాను ఆవిష్కరించుకోదల్చుకుంటే మాత్రం ఎక్కడో అసాధారణమైన సందర్భాలలో తప్ప సామాన్యంగా సాధ్యపడదు. స్త్రీ ప్రగతికి వ్యక్తిత్వ వికాసానికి ఆత్మానందం పొందడానికీ ఉన్న పరిమితులు, అవరోధాలూ పురుషుడికి లేవు, రావు కుటుంబం నుంచి గాని బయటి సమాజం నుంచి గానీ. ధనిక కుటుంబాల్లోని స్త్రీలకు ఈ పరిమితులు వర్తించక పోవచ్చు కొంతవరకూ కానీ లేవనుకోవడానికి లేదు. సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చిన నవల That Long Silence కూడా తప్పక చదవాల్సినది. అందులో ఆమె పాత్ర 'జయ' ఒక ఆదర్శ గృహిణిగా పేరు తెచ్చుకుని టైప్ కాస్ట్ అయ్యే ప్రయత్నంలో ఎంతో సంఘర్షణననుభవిస్తూ చివరికి తన గొంతు విప్పి తను చెప్పదల్చుకున్నది చెప్పి, చెయ్యదల్చుకున్నది చేసే దశకి ఎదుగుతుంది. ఆమె ప్రయాణం నిశ్శబ్దం నుంచి శబ్దంలోకి, అంతులేని సహనం చూపే పాతివృత్యపు ముసుగు తీసేసి, తన అసహనాన్ని చూపగలిగే మానసిక ధైర్యాన్ని పొందే స్తితికి వస్తుంది. ఆమె భర్త అభిప్రాయంలో శబ్దం చెయ్యడం, కోపాన్ని ప్రదర్శించటం స్త్రీత్వం కాదు. తన ఆయుధంగా ఆమె రచనని ఎన్నుకుంటుంది. ఏ మగ పాత్రని సృష్టించినా ఆమె భర్తకి అందులో తనే కనిపిస్తాడు. తన గురించే తన భార్య రాస్తే తాము తెలిసినవాళ్ళంతా ఏమనుకుంటారని అతను గొణుగుతుంటాడు. అలాగే ఏ స్త్రీ పాత్రని సృష్టించినా అందులో అతనికి తన అమ్మో చెల్లో కనిపిస్తారు. స్వానుభవంలోంచి కొంత చుట్టూ ఉన్న వారి అనుభవాలనుంచి కొంతా, కొంత కల్పనా కలిసి కధలవుతాయి సహజంగానే. ఈ విచిత్ర పరిస్తితి ఏ రచయితకైనా, రచయిత్రికైనా తప్పదేమో. సాహిత్య ఎకాడమీ ఎవార్డు తెచ్చిన ఈ నవల చలా ఆసక్తికరంగా సాగుతుంది. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ రచయిత్రులందరూ మనకి గర్వకారణం. -Sharada Sivapurapu  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా దేశాయ్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా దేశాయ్ అనితా దేశాయ్ Massachusetts Institute of Technology లో Humanities Professor గా పనిచేసింది. ఆమె ముస్సోరీలో జెర్మన్ తల్లికి బెంగాలీ తండ్రికి పుట్టింది. చిన్నప్పట్నుంచే ఇంగ్లీష్, జెర్మన్, బెంగాలీ, హింది, ఉర్ద్దు భాషలు నేర్చుకుంటూ పెరిగింది. ఏడేళ్ళ పసి ప్రాయం నుంచి రాయడం మొదలుపెట్టి, తొమ్మిదేళ్ళకే ఇంగ్లీష్లో రాసిన తన మొదటి కధ అచ్చు వేయించుకుంది. చదువంతా ఢిల్లీలో సాగింది. అశ్విన్ దేశాయ్ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ డైరక్టర్ని పెళ్ళి చేసుకుంది. ఆయనా రచయితే. Between Eternities : Ideas on Life and The Cosmos అనే పుస్తకాన్ని రాశాడు. వీరికి నలుగురు పిల్లలు. ఇద్దరూ రచయితలవడం వల్లేమో, కూతురు కిరన్ దేశాయ్ కూడా Man Booker Prize ఎవార్డ్ గ్రహీత. ఆమె నవల In Custody సినిమాగా తీసారు, శషి కపూర్, షబానా ఆజ్మి, ఓం పూరి లతో. దీనికి President of India, award for best picture వచ్చింది. ఇదే నవల బుకర్ ప్రైజ్ కి నామినేట్ కూడా అయింది. ఇది కాకుండా ఇంకో రెండు నవలలు Clear Light of the Day, Fasting, Feasting అనే నవలలు కూడా బుకర్ ప్రైజ్ కి షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇవి కాకుండా కింద ఇచ్చిన లిస్ట్ అఫ్ ఎవార్డ్స్ కూడా ఆవిడకి వచ్చాయి. Winifred Holtby Memorial Prize – Fire on the Mountain 1978 సాహిత్య ఎకాడమీ ఎవార్ద్ – Fire on the Mountain 1983 Guardian Childreen's Fiction Prize – The village by the Sea 1993 Neil Gunn Prize 2000 Alberto Moravia Prize for Literature (Italy) 2003 Benson Medal of Royal Society of Literature 2007 Sahitya Akademi fellowship 2014 Padma Bhushan Royal Society of Arts, The American Academy of Arts and Letters, and Girton College, Cambridge ల్లో ఆమె ఫెల్లో. Newyork book Reviews కి కూడా రాస్తుంది. ఆమె నవలల్లో ఒక స్త్రీవాద రచయిత్రిగా ఆమె స్త్రీ పై పురుషుడి ఆధిపత్యం పైనా, స్త్రీలపైనా, వారి భౌతిక, మానసిక సమస్యలపైనా సానుభూతితో చేసిన చిత్రీకరణలు మన దేశంలో స్త్రీల జీవితాలపై ఆమెకున్న అవగాహనని తెలియ చేస్తాయి. అలాగే తమ స్వంత ప్రాంతాలు వదిలి పరాయి దేశాల్లో, ప్రాంతాల్లో స్థిరపడిన వారిలో ఉండే అస్తిత్వ రాహిత్యాన్నీ వివరించే పాత్రలూ కూడా ప్రశంశనీయమైనవి. ఎందుకంటే, ఆమె చిన్నతనంలో, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జెర్మనీలో యుద్ధ వాతావరణం, దాని పర్యవసానాల గురించి ఆందోళన చెందే తల్లి, జెర్మనీ వెళ్ళలేక పడే బాధని ఆమె స్వయంగా చూసింది. అలాగే ఢిల్లీ కల్కత్తా, ముంబాయి నగరాల్లోని జీవితమూ, అక్కడి సమస్యలూ కూడా ఆమెకు సుపరిచితమే. 26 ఏళ్ళకే ఆమె రాసిన మొదటి నవల Cry, the Peacock అనే నవల ఆమెను అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీషులో రాసే ఒక ప్రతిభాశాలియైన భారత రచయిత్రిగా నిలబెట్టింది. ఆమె శైలి, భాషా ఇతివృత్తం అన్నీ ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి. Cry the Peacock అనే ఈ నవలలో ప్రొటాగనిస్ట్ సున్నిత మనస్కురాలైన మాయ తల్లి లేని పిల్ల, అన్న అమెరికాలో చదువుకోవటానికి వెళ్ళిపోతాడు. తండ్రి లాయరు, డబ్బున్నవాడు. తల్లి లేదని ఎంతో గారాబం చేస్తాడు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతుంది తండ్రి దగ్గర జీవితం. ఆమె వివాహం గౌతమ తో జరుగుతుంది, ఇతనూ లాయరే. పేరుకు తగ్గట్టు మాయ మనసు చంచలం, జీవితం అంటే బొల్డు ప్రేమ. ప్రపంచం అంటే ఆమె కిష్టమైన రంగులేసిన బొమ్మ, తను చెప్పినట్టల్లా ఆడే బొమ్మ అని అనుకునే తత్వం. దీనికి విరుద్ధంగా, గౌతమ పేరుకు తగ్గట్టే గౌతమ బుద్దుడిలాగా జీవితం మీద అనాసక్తతో, నిర్లిప్తతో, లేక ఒక వేదాంత ధోరణితోనో ఉంటాడు. అతని ప్రకారం మాయని వాళ్ళ నాన్న అతిగా గారాబం చేసి చెడగొట్టాడు. పైగా ఆమె కోరికలని, ఆమె కోరుకునే ప్రేమనీ, అట్టెన్షన్నీ అతనివ్వలేకపోతాడు. మాయ చిన్నతనంలో ఒక జ్యొతిష్కుడు పెళ్ళయిన నాలుగేళ్ళలో, మాయా కాని ఆమె భర్త కాని చనిపోవచ్చని జోస్యం చెప్తాడు. పెళ్ళయి నాలుగేళ్ళయినప్పట్నుంచి ఆమె ఆ జోస్యం నిజమవుతుందని భయపడుతూంటుంది. తను చనిపోతుందేమోనని భయపడుతుంటుంది. ఇవేమీ గౌతమ పట్టించుకోడు. తన పనిలో ఎప్పుడూ మునిగి పోయి ఉంటాడు. ఆమె భయాలకి తోడు, భరించలేని ఒంటరితనం ఆమెని వేధిస్తూంటుంది. కొన్నాళ్ళు గౌతమ తల్లి చెల్లెలు వచ్చి ఉన్నపుడు ఆమెకు బాగుంటుంది. కాని వాళ్ళు వెళ్ళిపోయాకా మళ్ళా అదే సమస్య ఒంటరితనం. క్లబ్స్ కీ, పార్టీలకీ, స్నేహితురాలితోనూ సమయం గడిపి చూస్తుంది. కాని ఇంటికి తిరిగి రాగానే మళ్ళీ ఆమె ఆలోచనలు, భయాలూ వెంటాడుతుంటాయి. మెల్లి మెల్లిగా ఆమె తన మానసిక సంతులనం కోల్పోతుంటుంది. బ్రతకాలన్న ఆశ, చావంటే భయం ఆమెని చావు తనకు బదులు, జీవితం అంటే ప్రేమలేని తన భర్త కొస్తే బాగుండుననుకునేట్టు చేస్తుంది. ఒక వేళ అలా కాకుండా చనిపోవడం తన వంతయితే అన్న ఆలోచన ఆమెని గౌతమని తనే చంపేస్తే అన్న విపరీత అలోచనా ధోరణి వైపుకి నెట్టుతుంది. ఒక్కోసారి ఆమె పూర్తిగా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఆ పిచ్చిలో ఆమెకు ఎలకలు, బల్లులూ పాములూ పాకుతున్నట్టు భ్రమలు కలుగుతుంటాయి. ఇదే పిచ్చిలో ఒకరోజు గౌతమని మేడమీద చల్లగాలిలో నడు ద్దాం రమ్మని పిలుస్తుంది. అక్కడ అందమైన చందమామ, వెన్నెల చూస్తూ ఆమె తనని తాను మరచిపోతుంది. అటూ ఇటూ నడుస్తూ చందమామకి తనకి అడ్డొచ్చిన గౌతమని పిచ్చి కోపంతో ఒక్కసారిగా పారపెట్ వాల్ మీంచి నెట్టేస్తుంది. కింద పడి గౌతమ చనిపోతాడు. ఆమె అత్తగారు, ఆడపడుచూ మాయని తండ్రి ఇంట్లో దిగబెడతారు. ఇదొక విషాదమైన ముగింపు. రెండు భిన్న మనస్తత్వాలకి చెందిన వ్యక్తులు వివాహ బంధంలో ఎలా ఇమడలేరో, దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పే కధ. తమ బిడ్డలకి జీవిత భాగస్వాములని వెదికే తల్లితండ్రులు ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. స్త్రీలపై ఆధిపత్యం, అణిచివేత ఆమె నవలల్లో ప్రధానాంశాలు. ఆమె ప్రతి నవలా ఒక మాస్టర్ పీస్. ఆమె నవలని చదవాలంటే చాలా టైం తీస్కుని చదవాలి, కష్టమని కాదు, నవలలోని ప్రతి కారక్టరూ జీవితంలో తారసపడే వ్యక్తుల్లా, సంఘటనల్లా, అలోచింపచేస్తూ, పాఠకుల అనుభవాల్నీ, అనుభూతుల్నీ మమేకం చేసుకుంటూ సాగేవే. ఆమె పాత్రలు గ్లోరిఫైడ్ మనుషులు కారు. మామూలు మనుషులు. అతి సాధారణ మనస్తత్వాలతో, సాధారణ జీవితాలు గడిపే, భాధలు కష్టాలు పడుతూ, అప్పుడప్పుడూ తమ తమ కకూన్లలోంచి బయటికి చూసే మామూలు మనుషులు. ఒక రచయిత్రికి పాఠకుల తరపునుంచి ఇంత కంటే గొప్ప ప్రశంశ ఏముంటుంది. కొన్ని నవలల్లో పాత్రల స్వభావాల్నీ, కధనాన్నీ కూడా విస్మరిస్తూ వర్ణనలుంటాయని, దాని వల్ల ఒక్కోసారి కధ అర్ధం కాకపోవడం, తప్పుదారి పట్టినట్టనిపించడం జరుగుతుంటుందని కొందరి విమర్శ అయితే అదే కారణంగా ఆమె రచనల్ని ఇష్టపడే వారు కొందరు. ఆమె రచయిత్రి బదులు చిత్రకారిణి అయితే బాగుంటుందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. ఏమైతేనేం, ఆమె మాత్రం తప్పక చదవాల్సిన రచయిత్రి. -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మీనా అలెక్సాండర్

  మీనా అలెక్సాండర్     మీనా ఒక అంతర్జాతీయంగా పేరు మోసిన రచయిత్రి. కేరళ నుంచి వచ్చిన ఒక కుటుంబంలో అలహాబాద్ లో పుట్టింది మీనా. తండ్రి ఉద్యోగరీత్యా మీనాకి 5 ఏళ్ళ వయసులో సూడాన్ లో స్థిరపడ్డారు. అక్కడ యూనివర్సిటీలో చదువుకుని, ఇంగ్లీష్లో పీ ఎహ్ డీ ఇంగ్లాండ్లో చేసింది. ఆతరవాత ఇండియాకి వచ్చింది. మీనా ఒక పది పొయెట్రీ సంకలనాలు రాసింది. Fault Lines అనే ఆత్మ కధ, Nampally Road and Manhattan Music అనే రెండు నవలలు రాసింది. ప్రస్తుతం న్యూ యార్క్ సిటీ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. ఎన్నో సాహిత్య విమర్శా వ్యాసాలు రాసింది. ఏకారణంగానైనా దేశం వదిలి బయటకెళ్ళినవాళ్ళు సాధారణంగా తమ దేశం అంటే ఎంతో ఉన్నతమైన అభిప్రాయాలతో ఉంటారు. దేశం అంటే వారికున్న జ్ఞాపకాలని మరువలేక, వారున్న దేశాన్ని స్వంతమని అనుకోలేక తమ అసలు అస్తిత్వంపై అనుమానంతో ఉంటారు. తన దేశమంటే ఉన్న అదే అభిప్రాయంతో, ఎంతో ఉన్నత ఆదర్శాలతో, వివాహం చెయ్యాలన్న తల్లి ఆలోచనల్ని కాదని ఏదో సాధించాలని ఇండియా వస్తుంది. ధిల్లీ ఇంకా హైదరాబాదు యూనివర్సిటీల్లో ఇంగ్లీష్ ప్రొఫెస్సర్గా పనిచేస్తుంది. స్వతంత్రం వచ్చిన నాల్గేళ్ళ తరవాత పుట్టి, అయిదేళ్ళ వయసులో దేశం వదిలేసిన ఆమె తన మూలాల్ని వెతుక్కుంటూ తిరిగి దేశానికి వస్తే ఇక్కడి సామాజిక రాజకీయ వాతావరణం, పరిస్తితులు ఆమెను నిరాశ పరుస్తాయి. బ్రిటిషు పాలన తరవాత స్వయం పరిపాలన ఎంతో గొప్పగా ఉంటుందని ఆశించి తన భావి జీవితాన్ని దేశంలో గడపాలని, గత జీవితాన్నీ వర్తమానంతోటీ భావితోటీ ముడివేసుకోవాలన్న ఆమె ఆశ నిరాశ అవుతుంది. ఆమె కవిత్వంలో ముఖ్యంగా ఈ రకంగా మైగ్రేట్ అవడంవల్ల కలిగే అస్తిత్వ రాహిత్యం గురించి రాసినవే. ఆమెకు మంచి పేరు తెచ్చిన Nampally Road నవల కూడా ఇదే రకమైన థీంతో నడుస్తుంది. 1978 లో రమీజాబీ మానభంగం కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. రమీజాబీ ఆమె భర్త అహ్మద్ హుస్సేన్ యమగోల రాత్రి రెండో ఆట సినిమా చూసి వస్తూ నల్లకుంట పొలీస్ స్టేషన్లో నల్గురు తప్ప తాగిన పోలీసుల సామూహిక మానభంగానికి బలైపోయింది. భర్త పోలీసుల దెబ్బలకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రజల ఆగ్రహానికి గురైన పోలీసులు రమీజాబీ వేశ్య అనీ విటులని అసభ్యంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నామని, వెంట ఉన్నది భర్త కాదని మొదట వాదిస్తారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా రమీజాబీపై ఎటివంటి మానభంగం జరగలేదని, భర్త దెబ్బల వల్ల కాక గుండెపోటుతో మరణించాడని ఇప్పించి తప్పు దారి పట్టించే ప్రయత్నం చేసారు.. అయితే ఈ కేసులో నిజానిజాలు బయటపెట్టింది ముక్తదర్ కమిషన్. అంతే కాదు ఫోరెన్సిక్ డాక్టర్ని తీవ్రంగా తప్పుబట్టింది, తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చినందుకు. ఎప్పటిలాగే అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాలు ఈ కేసును ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వాడుకుంటున్నాయని అరోపించింది. ఈ కేసును తన నవలతో కలుపుతూ తన జీవితాన్నీ, తనలోని సంశయాల్నీ తన నవలలోని ముఖ్య పాత్ర ద్వారా వ్యక్తం చేస్తూ సాగుతుంది. చివరికి తన జీవితంలోని confusions, మిగిలిన స్త్రీ పాత్రల జీవితాలనుంచి నేర్చుకున్న గమనించిన విషయాల ద్వారా క్లియర్ చేసుకున్నట్లు చూపిస్తుంది. నవలలోని ముఖ్యపాత్ర మీరా కన్నడికల్ ఇంగ్లాండ్లో చదువు ముగించి ముక్కలుగా మోస్తున్న తన ఆత్మను తిరిగి ఒకటిగా కుట్టుకోవాలన్న ఆశతో , తన అసలు మూలాల్ని వెతుక్కుంటూ తన జీవితానికో అర్ధం, తను ఊహించుకున్న భారత దేశంలో a sense of belongingness కోసం హైదరాబాద్ యూనివర్సిటీ లో ఇంగ్లీష్ చెప్పడానికి వస్తుంది. హైదరాబాదులో ముఖ్యమంత్రి లింకా గౌడా 60 వ పుట్టిన రోజు ఉత్సవాలు అట్టహాసంగా, అర్భాటంగా బోల్డు ప్రజా ధనం ఖర్చు చేస్తూ జరుగుతుంటాయి. ప్రశాంతంగా ఉండే నాంపల్లీ రోడ్ లో ఇలా చాలానే హడావిడి జరుగుతుంటుంది. పళ్ళు కూరలూ, ఇతర చిల్లర సామాను అమ్ముకునే వ్యాపారులు పన్నుల భారం తగ్గించమని ఆందోళన చేస్తుంటారు. పేదరికం ఇంకా పెనుభూతమై బాధిస్తోందని కనిపిస్తూంటుంది. మీరాకి ఒకప్పుడు తను ఎంతో అభిమానించి చదివిన కవిత్వం, తను రాసుకున్న కవిత్వం, తనకు జీవితం మీదున్న అవగాహన ఇవన్నీ అర్ధంలేనివిగా కనిపిస్తాయి. తన ఫేకల్టీ రూం పక్కనే ఉన్న జైలు లోంచి ఖైదీలను కొడుతుంటే బాధతో వాళ్ళరిచే అరుపులు వినిపిస్తుంటాయి. ఇండియాలో విద్యార్ధులు వోర్డ్స్ వర్త్ ని చదవటం ఎందుకో ఆమెకర్ధం కాదు. ఇలాంటి పరిస్తితుల్లో ఆమె కవిత్వం ఎవరు చదువుతారు, ఎవరికి ఉపయోగపడుతుంది, దానివల్ల జరిగే మేలు, మార్పు ఏంటని ఆమె నిరాశ చెందుతుంది. ఇలా ఉన్నపుడే ఆమెకొక స్నేహితురాలి రూపంలో తన చిన్నప్పట్నుంచి ఉచితంగా వైద్యసేవలందించే డాక్టరు దుర్గాబాయి అనే పెద్దవిడ దొరుకుతుంది. రాము అనే ఆమె ప్రేమికుడు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమస్యలపైకి ఆమె దృష్టి మళ్ళిస్తాడు. సరిగ్గా అప్పుడే రమీజాబీ మానభంగం సంఘటన కలకలం రేపుతుంది. రాము ప్రతిఘటనల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు. మీరా దుర్గాబాయి ఇద్దరూ రమీజాబీకి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నవలలో ప్రజలు పోలీస్ స్టేషన్ని తగలబెడతారు. సిటీ అంతా అల్లర్లు చెలరేగుతాయి. లింకా గౌడా ప్రజల ప్రతిఘటనల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాడు. ఈసంఘటనలు, పాలన ఆమెను కలవరపరుస్తాయి. ఆమె రాసిన కవిత ఒకటి పత్రికకు అచ్చేయడానికి పంపితే అందులో అన్నీ బ్లాంక్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెన్సార్షిప్ ని సూచిస్తూ. చివరికి మీరా రమీజాబీకి ఎడ్వొకేట్ అవుతుంది ఆమెకు న్యాయం కోసం జరిగే పోరాటంలో భాగం పంచుకోవటానికి. తన చుట్టూ మనుషులని అర్ధం చేసుకుంటూ, చుట్టూ ఉన్న జీవితంలో తన జీవితాన్నీ చూస్తూ ఆమె ప్రజలతో కలిసిపోతుంది. సామాజిక స్పృహ లేని రచనలు, ప్రజల సమస్యలు, జీవితాల్తో సంబంధం లేని కవిత్వం వృధా అని ఆమె తన నవల రూపకంగా చెప్తుంది. సామాజిక స్పృహ లేని రచనలు, ప్రజల సమస్యలు, జీవితాల్తో సంబంధం లేని కవిత్వం వృధా అని ఆమె తన నవల రూపకంగా చెప్తుంది. ఈ కింద ఇచ్చినది Migrant Memory అనే పొయెం లోని మొదటి పార్ట్ వలస వెళ్ళిన వారి మనస్తితిని వివరిస్తూ. తమ దేశం, సంస్కృతి, సంప్రదాయాలకీ, విలువలకీ వారు నివసిస్తున్న చోట్ల ఉన్న విలువలకీ మధ్య ఉన్న అంతరాల వల్ల అనుక్షణం సంఘర్షణకి లోనవుతూ కొంత మార్తూ కొంత మారలేక వారు పడే అవస్థని చక్కగా వర్ణిస్తుంది ఆమె కవిత్వంలో. అందరూ ఇలాగే బాధపడతారని కాదు, కానీ ఎంతో కొంత అంతఃసంఘర్షణ అయితే తప్పదు. Migrant Memory I try to remember a desert town, Mirages at noon, at dusk a dusty lawn Bottles of gin and scotch, a mathematician To whom I spoke of reading Proust all summer long. His mistress stood on tiptoe wiping his brow with her pent up silk, Her sari, hot green rivaling the neem leaves. Watching her, amma whispered in the wind– Be real. Take a husband of good stock. As for love, it’s blind. Appa’s voice low – No dowry. You’re all you need, Your own precious self.   -Sharada Sivapurapu  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఇందిరా గోస్వామీ అస్సామీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఇందిరా గోస్వామీ అస్సామీ ఇందిరా గోస్వామీ పేరు మోసిన అస్సామీ రచయిత్రి, జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత, సాహిత్య ఎకాడమీ ఎవార్డు గ్రహీత, ఇంకా Principal Prince Clause Laureate (Prince Clause of the Netherlands, given in the name of Prince Clause) గా గౌరవింపబడింది. రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా. ULFA అనే అస్సాంలోని ఉగ్రవాద సంస్థకీ, ప్రభుత్వానికీ మధ్యవర్తిత్వం నడిపింది. ఆమె పాత్ర People's Consultative Committee ని ఏర్పాటు చేయడానికి దోహదపడింది. Words from the Mist అనే సినిమాను ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసారు. ఆమె రాసిన నవల అడజ్య అనే సినిమాగా తీస్తే దానికి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలొచ్చాయి. ఎనిమిదో క్లాసు చదువుతున్నపుడే ఆమె రాసిన కధ అచ్చయ్యింది. ఇరవై ఏళ్ళకే ఆమె తన మొదటి కధా సంకలనన్ని అచ్చేసింది. పువ్వు పుట్టగానే పరిమళించటం అంటే ఇదేనేమో. అయితే ఆమె జీవితంలో చాలానే విషాదం ఉంది. ఎప్పుడూ ఆమె Chronic Depressionతో బాధ పడేది. ఎన్నో సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసిందట. పెళ్ళయిన రెండేళ్ళ లోపు ఆమె భర్త చనిపోయాడు ఆమెకు జీవితానికంతా సరిపడా దుఖాన్నీ కష్టాల్నీ ఇచ్చి వెళ్ళాడు. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమెను అస్సాం లోని గోపాల్పురాకి తీసుకొచ్చారు, అక్కడ ఆమె సైనిక్ స్కూల్లో టీచర్ గా చేరింది. అప్పటినుంచి తిరిగి రాయటం మొదలుపెట్టింది. కేవలం బ్రతికుండటం కోసమే తను రాసానని లేకపోతే ఎప్పుడో చనిపోయుండేదాననని చెప్పేదట. అప్పుడే ఆమెను మనశ్శాంతి కోసం బృందావనం లోని విధవాశ్రమానికి వెళ్ళి ఉండమని సలహా ఇస్తారు ఆమె గురువు. అక్కడ ఆమె వారి జీవితాలపై, వారు జీవిస్తున్న దుర్భర పరిస్తితులపై పరిశోధన చేసి, తన జీవితానుభవాల్నీ తను చూసిన దానిని ఇంగ్లీష్ లోకి అనువదించబడిన " The Blue necked God (1976)” అనే నవలలో వివరిస్తుంది. సాధారణంగా ఆమె నవలల్లో ప్రొటాగనిస్ట్ ఆమే. కల్పన వాస్తవికత కలగలిపి ఆత్మకధలా సాగే ఈ నవల అనాధలయిన విధవలు మతం విధించిన జీవన విధానం పేరిట ఎలా దోపిడీకి గురవుతారో, ఆదుకునేవారు, ఆదరించేవారు లేక ఒంటరి జీవితాల్లో ఏరకమైన రక్షణ లేక దారిద్ర్యంలో ఎలా బతుకుతున్నారో వివరిస్తుంది. కృష్ణుడు పెరిగిన బృందావనంలో ఉండే గుళ్ళలో భజనలూ, కీర్తనలూ పాడి, ఒక్కోపూట కడుపు కట్టుకుని దాచుకున్న డబ్బు, దేనికో కాదు, చనిపోయిన తరవాత శవ సంస్కారం లేకుండా వీధిన పారెయ్యకుండా ఎంతో కొంత సంస్కారం జరగాలనే ఆశతో దళారులకి ఇవ్వడం కోసమని తెలిసినప్పుడు హృదయం ద్రవిస్తుంది. ఇదంతా అయిన వాళ్ళుండీ వీరిని కేవలం భర్త చనిపోయిన కారణంగా వారి ఖర్మకి వారిని వదిలేస్తే బ్రతకాలనే ఆశ చావక ఇలాంటి దుర్భరమైన బ్రతుకీడ్చడం మన మతం కల్పించిన పరిధుల్లోనే ఉన్న సాంప్రదాయాలకు అనుగుణంగా ఇదంతా జరగడం నిజానికి విచారకరం. ఇంత అవస్త పడ్డా వారాశించిన విధంగా వారికి దహన సంస్కారాలు జరగవు, ఆ డబ్బు మాత్రం పుచ్చుకుని ఆ దళారులు ఉడాయించడం సర్వ సాధారణం. గాలి వెలుతురు లేని చీకటి గుహల్లో ఉండటానికి డబ్బిచ్చుకుని, అది ఇవ్వలేనప్పుడు తమ బట్టలమూటతో రోడ్డు పక్కన పడుకున్న స్త్రీలు సర్వ సాధారణ దృశ్యం. మంచి ఉద్దేశ్యాలతో, సానుభూతితో నడిపే విధవాశ్రమాలు కూడా అక్కడ లేకపోలేదు. అయితే అలాంటివి కొన్నే కదా ఉంటాయి, అవి అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి సరిపోవు. ఇక ఆమె అతి ముఖ్యమైన రచన ఇంకొకటి తప్పక చదవాల్సింది ఉంది. అది ఆమె ఈ బృందావనం నుంచి ఢిల్లి యూనివర్సిటీలో లెక్చరర్గా చేరిన తరవాత రాసింది. “Pages Stained with Blood” అనే ఈ నవల ఇందిరా గాంధి హత్య తరవాత సిక్కులపై జరిగిన ఊచకోత గురించి రాసినది. ఇందులో ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ఆమె చూసినది, అల్లర్లు ఇంకా జరుగుతుండగానే ఆమె ఆ ప్రాంతాలకి వెళ్ళి బాధితులతో మాట్లాడి రాసిన నవల. ఇది కూడా ఒక ఆత్మకధలాగే సాగుతుంది. ఈ నవల లోని ప్రొటాగనిస్ట్ కి ఒక రిక్షావాడిపైన, కలిగిన భౌతికాకర్షణ గురించి రాయడం అస్సామీ ప్రజల ఆగ్రహానికి గురి చేసింది. అల్లర్లు జరుగుతున్నపుడు, కర్ఫ్యూ అమలులో ఉన్నపుడు ధైర్యంచేసి ఆమెను తీసుకెళ్ళిన ఒకే ఒక్క రిక్షా అతనిపై కలిగిని ఆకర్షణ గురించి ఆమె నిజాయితీగా, నిర్భయంగా రాయడం నిజాయితీగా అదికూడా ఆ పాత్ర చాలావరకూ ఆమెనే తలపిస్తున్నపుడు. తరవాత ఇచ్చిన ముఖముఖీల్లో ఈనవలలో వాస్తవికతకీ, కల్పనకీ మధ్య చాలా కనపడీ కనపడని రేఖ మాత్రమే ఉంది అని ఆమె స్వయంగా చెప్పింది. The Moth Eaten Howdah of a Tusker అనే నవలలో అస్సాంలోని సత్రాలలో విధవల దుర్భర పరిస్తితుల గురించి రాస్తుంది. The Masterpieces of Indian Literature అనే anthology లో చేర్చారు. ఈనవలని టీ వీ లో సీరియల్గా కూడా వేసారు. The Man from Chinnamasta అనే నవలలో అస్సాంలోని శక్తి టెంపుల్స్లో వేల ఏళ్ళుగా సాగుతున్న జంతుబలి గురించి రాస్తే అది చాలా వివాదాస్పదమై, ఆమెకు ప్రాణం మీదకి వచ్చింది. ఈ నవల సీరియల్గా అచ్చయినప్పుడు చాలానే గొడవలు జరిగాయి. నవలగా అచ్చేస్తానన్న ప్రచురణకర్త వెనక్కితగ్గి ఈ నవల బదులు వేరే ఏదైనా అచ్చేస్తానన్నడట. జంతుబలి శాస్త్రాల్లో చెప్పిన పూజా విధానం కాదని నిరూపించడానికి ఆమె ఎన్నో పురాణ గ్రంధాల్లోని విషయాలని కోట్ చేస్తుంది. చివరకి ఈ నవల అమ్మకాల్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. The Journey అనే నవల అస్సాంలోని బార్డర్ ఏరియాల్లో స్వతంత్రం వచ్చినప్పట్నుంచి ఉన్న మిలిటెన్సీ, వేర్పాటు వాదాల గురించి రాసింది. ఆమె నవలలు చాలా భాషల్లోకి అనువాదం అయ్యాయి. పాఠ్యాంశాలుగా కూడా ఎంపిక చేయబడ్డాయి. ఈమె ఢిల్లీలో ఉన్నపుడు ఆమె తన ముఖ్యమైన రచనలన్నీ చేసింది. ఆమె ఫోకస్ అంతా స్త్రీవాదం, పితృస్వామ్యం, అస్సాం సమాజం యొక్క సాంస్కృతిక, రాజకీయ స్వరూపం, నిర్మాణం. దాదాపుగా ఒక ఇరవై నవలలు రాసింది. ఎన్నో కధలూ, కవితలు, అన్నిటికన్న ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నపుడు తులసీదాస్ రామాయణన్ని, 14వ శతాబ్దంలో మాధవ కండలి రాసిన అస్సామీ రామాయణాన్ని పోలుస్తూ రాసిన పరిశోధనా గ్రంధం Raamaayanaa from Gangaa to Brahmaputra. ఆమెకు జ్ఞానపీఠ, సాహిత్య ఎకాడమీ ఎవార్డులతోపాటు ఒక ఇరవైదాకా అత్యున్నత పురస్కారాలు లభించాయి. పద్మశ్రీ ఆమె తిరస్కరించింది. -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? టెమ్సుల ఎ ఒ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? టెమ్సుల ఎ ఒ ఉన్నత విద్యార్హతలతో ఇంగ్లీషు ప్రొఫెసర్గా పనిచేసిన టెమ్సులా తన రచనల్లో నాగా జాతుల జన జీవితాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది. ఆమెకు పద్మశ్రీ ఎవార్డ్ 2007 లోనూ, Governor's Gold Medal 2009 లోనూ సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ 2013 లోనూ వచ్చాయి. రాత పూర్వకంగా లేని నాగా జాతుల చరిత్రనీ, సంస్కృతినీ, జీవన విధానాల్నీ, ఆమె పుస్తక రూపంలో పెట్టింది. ఆమె రాసిన పుస్తకం మాత్రమే నాగా జాతుల గురించిన విషయాలు బయటి ప్రపంచానికి తెలుసుకునే మార్గం. నార్తీస్ట్ నుండి ఇంగ్లీషులో వినిపించిన అతి కొద్దిమందిలోని ఒక కవి గళం. ఆమె రచనలు, జెర్మన్, ఫ్రెంచ్, హిందీ, బంగాలీ, అస్సామీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆమె 5 కవితా సంకలనాలూ, 2 కధా సనకలనాలూ, The Ao-Naga Oral Tradition అనే నాగా జాతుల చరిత్ర గురించిన పుస్తకాన్నీ రాసింది. ఆమె కవితలూ, వ్యాసాలూ ఎన్నో పత్రికల్లో అచ్చయ్యాయి. నాగాలాండ్ ఒక పదహారు భిన్న సంస్కృతుల, భాషల, తెగల ప్రజలు జీవించేపర్వతప్రాంత భూమి. ఈ జాతులు తెగలు తమలో తాము ఘర్షణ పడటమే కాకుండా, ఇటు అస్సాం తోనూ, మణిపూరి ప్రజలతోనూ అటు బర్మా లోని రాజ్యాలతోనూ నిరంతరం యుద్ధాలతోనే గడుపుతూ వచ్చాయి కొన్ని శతాబ్దాలుగా. బ్రిటిషువారినుంచి కూడా వీరు స్వతంత్ర ప్రతిపత్తినే కోరుకున్నారు. అలాగే బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తరవాత స్వతంత్ర భారతంలోకి రావడానికీ వారికి ఇష్టం లేకపోయింది. అయితే వారికి వీలయినంత స్వతంత్రాన్నీ, స్వేఛ్చనీ ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలాగానే నెహ్రూ ప్రభుత్వం కూడా చేసుకుని వీరిని ఒప్పించి భారత దేశంలో అంతర్భాగమైన రాష్త్రంగా వీరిని చేర్చుకుంది. చాలానే తెగలు దీనికి సుముఖంగా ఉండి హింసనీ ప్రతిఘటననీ మానుకున్నా, కొన్ని నాగా తెగలు మాత్రం ప్రభుత్వాలకి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి స్వతంత్రం వచ్చిన ఒక ఏభై ఏళ్ళ వరకూ కూడా. అత్యధికంగా క్రిష్టియన్లు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నాగాలాండ్ కూడా ఒకటి. ఈ జాతుల భాషలూ జీవన విధానాలు ఎంత భిన్నమంటే ఒకరి భాష ఇంకొక తెగకి అర్ధం కానంతగా. నాగా జాతుల వేర్పాటు వాదుల గెరిల్లా యుద్ధాల్నీ అణిచివేసేందుకు జరిగిన సైనిక చర్యల్లో జరిగిన హింస ప్రతిహింసల్లో జనజీవితం గానుగలో నువ్వుగింజల్లా నలిగిపోయింది. హింస జీవన విధానంగా ఎన్నుకున్న నాగా వేర్పాటు వాదులు, వారిని అణిచేసే ప్రయత్నంలో సైనికులు, ప్రశాంత జీవితాన్ని కోరుకున్న వారినెవరినీ కంటి నిండా నిద్రపోనియ్యలేదు. వీరివరకూ అందరూ శత్రువులే. ప్రగతిలేదు, శాంతిలేదు, ప్రాణాలకు భరోసాలేదు, రెక్కలు విరిగిన పక్షుల్లా అల్లాడి పోయారు అర శతాబ్దానికి పైగా. తరతరాలుగా, తమ ఆస్థులు, భూములూ, బ్రతుకు తెరువులూ పోగొట్టుకుని, కుటుంబాలు కుటుంబాలు ప్రాణ మానాలు కోల్పోయి, ప్రతిరోజూ దోపిడీకి, హింసకి గురౌతూ, గడిపిన దుర్భర జీవితాలు. గత పదేళ్ళలో కొంత ప్రశాంతత సీస్ ఫయర్ వల్ల నెలకొన్నా, గత జ్ఞాపకాలు ఇంకా వారి హృదయాలని కాలుస్తూ వేధిస్తూనే వున్నాయి. These Hills called Home అనే సంకలనం కానీ, Stories from the War Zone అనే కధా సంకలనం కానీ ఇటువంటి నాగా ప్రజల జీవిత కధలని వెలికితెచ్చే ప్రత్నమే. సైనికులు వీరిపై జరిపిన అరాజకాలూ, అమానవీయ అత్యాచారాలూ చదువుతుంటే హృదయం ద్రవించాల్సిందే. ఆమె సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. రూపురేఖలు, వేషధారణ, భాషా, సంస్కృతులు మిగతా దేశవాసుల 'కన్నా భిన్నమైనంత మాత్రాన ఇంత వివక్షకి వారు గురవవల్సిందేనా. భిన్నత్వాన్నీ గౌరవించే సంస్కృతి, బాధ్యత ఈ మారుమూల రాష్ట్రాలు కలిసుండాలన్నపుడు, దేశవాసులకి లేదా అని. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పవలిసిన బాధ్యత దేశవాసులందరిపైనా, కేంద్ర ప్రభుత్వం పైనా ఉంది. కర్ణాటకలోను, దేశ రాజధానిలోనూ జరిగిన హింసాత్మక ఘటనలు, వీరంటే ఇతర రాష్ట్రాల వారికున్న చిన్నచూపును చెప్పక చెప్తున్నాయి. ఇంచుమించు ఇవే పరిస్తితుల్లో ప్రజలు కాశ్మీరయినా, శ్రీలంకయినా, సిరియా అయినా అఫ్గనిస్తానయినా కదా. ప్రజలూ, ప్రాణాలూ, మానాలూ, కష్టాలూ అందరూ ఒక్కటే కదా. ఇలాంటి కధలే కదా అందరివీ. రాజకీయంగానో, మతాన్ని ఆధారంగా చేసుకునో మనకు పట్టనట్టుండటం అమానవీయమే. Stories from A War Zone సంకలనంలో కదిలించే ఒక కధ The Last Song . అపెన్యోకి సంగీతం అంటే చిన్నప్పట్నుంచి విపరీతమైన పిచ్చి. చిన్నపిల్లగానే తన సొంత మాటలతో, సంగీతంతో పాటలు పాడుకుంటూ ఉండేది. చంటిపిల్లపుడే తండ్రి చనిపోతే ఇంకో పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకుని ఎన్నో కష్టాలు పడి అపెన్యోని పెంచుతుంటుంది తల్లి. ఈ సంగీతం పిచ్చి ఆమెని ఇబ్బంది పెట్టినా, తండ్రి పోలిక అని సరిపెట్టుకుంటుంది. అపెన్యో పెరిగి పెద్దవుతుంది. ఊళ్ళోని చర్చి కోయిర్లో లీడ్ సింగర్గా ఎంపికవుతుంది. ఆరోజు తల్లి కూతుళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. తన కష్టం ఫలించిందని ఎంతో తృప్తి పడుతుంది తల్లి లిబెని. ఇలా ఉండగా ఊళ్ళో కొత్త చర్చి బిల్డింగ్ కడతారు. దాని ప్రారంభోత్సవానికి అపెన్యో పాడాలి. అయితే సైనికులు కూడా ఈ ప్రారంబోత్సవం రోజే ఊరిమీద దాడి చెయ్యాలని నిశ్చయించుకుంటారు. ఊరి వాళ్ళు అండర్గ్రౌండ్ ఉగ్రవాదులకి పన్ను కడుతున్నారని ఆరోపణ. అపెన్యో తన కోయిర్తో పాడుతుండగానే సైనికులు కొత్త చర్చి బిల్డింగ్ లో విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలు పెడతారు. అపెన్యో మాత్రం తన పాట ఆపదు. కెప్టైన్ దృష్టి అందమైన అపెన్యో మీద పడుతుంది. అంతే ఆమెను జుట్టు పట్టి పాత చర్చి బిల్డింగ్లోకి ఈడ్చుకెళతాడు. అపెన్యో మాత్రం పాట ఆపదు. అపెన్యోని రక్షించడానికి తల్లి లిబెని విశ్వ ప్రయత్నం చేస్తూంటుంది. చివరకి అపెన్యోని, లిబెనినీ సైనికులు సామూహిక మానభంగం చేస్తారు. మానభంగం చేయబడుతున్నా, చనిపోతున్నా అపెన్యో మాత్రం పాట ఆపదు. ఆతరవాత చాలామంది ఆ పరిసరాల్లో అపెన్యో పాటని వింటూ ఉండేవారట. ఈ కధని అమ్మమ్మలూ , తాతాయ్యలూ తమ మనవలకి చెప్పే వారట. ఇదే కధని చెప్తూ ఒక ఆమె ఈ కాలం యువత చాలా మొద్దుబారిపోయారు. ఈ మట్టి, గాలి వినిపించే అపెన్యో పాటని వినలేకపోతున్నారని బాధపడుతుంది. అప్పుడు ఆ యువకులు కధ మాత్రమే వింటున్నందుకు సిగ్గుపడి జాగ్రత్తగా విన్నపుడు వారికీ అపెన్యో పాట వినిపిస్తుంది. ఇన్ఫార్మర్స్గా పనిచేస్తున్నారనో, వేర్పాటువాదులకి ఇతరత్రా సహాయం చేస్తున్నారనో ప్రజలు సైనికుల ఆగ్రహానికో, ఇవే కారణాలతో ఉగ్రవాదుల ఆగ్రహానికో గురవుతూ ఇరువురి మధ్యా నలుగుతూ ప్రశాంత జీవనం కోల్పోయ్యారు. అమాయకమైన ఆడపిల్లలు వీరి ప్రేమలో పడి మోసపోవడం, మాన ప్రాణాలు కోల్పోవడం, కుటుంబాల్లో చిన్నపిల్లలూ, ముసలివాళ్ళూ ఆడవాళ్ళూ తప్ప, మగవారు మిగలని నిస్సహాయ జీవితాలూ నాగాలాండ్ లో కొన్ని దశాబ్దాల పాటు సాగింది. టెమ్సులా రచనలు ప్రపంచం ముందు నాగాలాండ్ లోని ప్రజల పరిస్తితులకు అద్దం పట్టి చూపించాయంటే అతిశయోక్తి కాదు. ఆమె కధలు ఇన్ని భాషల్లోకి తర్జుమా అవడమే ఇందుకు నిదర్శనం.   -Sharada Sivapurapu  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మీరా నందా

అసలు మతమంటే ఏంటి, కొందరు కలిసి అలోచించి నిర్వచించిన, ప్రవర్తనా నియమావళి, వేషధారణ, వస్త్రధారణ, నిర్వర్తించాల్సిన కొన్ని వ్యక్తిగత, సామూహిక/సామాజిక క్రతువుల సారాంశమా? ఆ రకంగా జీవించే వారంతా ఆ మతానికి చెందినట్టేనా? మతం ద్వారా సత్యాన్ని శోధించడం సాధ్యమా? అసలు మతంలో సత్యం లేకపోతే ఇక సత్యశోధన ఏంటి. మనుషుల్ని హిందువులుగా, ముస్లింస్గా, క్రిష్టియన్స్గా విడదీసి ఒకరినొకరు చంపుకునే స్తితికి మనుషుల్ని తెచ్చిన మతంలో నిజంగా సత్యం ఉందా? ఒక మత సమూహం పెరగడం కోసం, తమని తాము ఇతరుల దాడినుంచి రక్షించుకోవటం కోసం, ఆధిపత్యం నెరపడం కోసం మతం పుట్టినప్పట్నుండీ ఉపయోగపడుతోంది. చరిత్ర మైదానం నిండా మతం చిందించిన రక్త బిందువులే గడ్డి పరకలై మొలిచి పచ్చగా ఈనాటికీ కళకళ లాడుతున్నాయంటే అతిశయోక్తి ఏమైనా ఉందా. సంఘర్షణ మతాల మధ్యనే కాదు, మతాలన్నిటిలోను ఉంది. సహజంగా మనుషులకి ఉన్న మానసిక దౌర్బల్యం, అభద్రతా భావం, దేనికోదానికి చెందాలన్న గుర్తింపు సంబంధిత కారణాల వల్లా ప్రపంచంలో 84% మంది క్రిష్టియన్, ఇస్లాం, హిందూ, బౌద్ధం ఇంకా అనేక ఇతర మతాలకీ చెందినవారే. స్థూలంగా చెప్పాలంటే వ్యక్తుల జీవితాల్లో క్రమశిక్షణ, నీతీ నియమాలూ, నైతికతా, దైవ భక్తి, పాపభీతి ఉండాల్సిన, పుణ్య కర్మలు చెయ్యాల్సిన అవసరాన్ని, ఇవన్నీ ఉన్న జీవన విధానం తెలియపర్చాల్సిన మతం నిజంగా ఇవన్నీ చెయ్యగల్గిందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి మతమూ తమను తాము బలపరుచుకోడానికి, హేతువాదుల నుండీ, సంస్కర్తలనుండీ రక్షించుకోవడానికి చాలానే తప్పుదారులూ తొక్కింది, దుర్మార్గాలూ చేసింది, చేస్తోంది. మనిషి నుండి మనిషిని, మనిషి నుండి మనసునీ కూడా వేరు చేసేది మతమైంది ఈరోజు, ఎంత గొప్ప ఆశయాలు, ఉద్దేశ్యాలు తమవిగా మతాలు చెప్పుకున్నా కూడా. మత ధర్మాలూ, సూత్రాలూ పురుషులు ఏర్పరచడం వల్ల ఏమతమూ స్త్రీలకు సమాన దర్జా నివ్వలేకపోయింది. మతం పుట్టు పూర్వోత్తరాలమీదా, మనుషులపై దాని ప్రభావం మీదా రిసెర్చ్ చేసిన మీరా నందా గురించిన వివరాలు ఇవి. మీరా నందా చదివింది Science and Philosophy, PhD in Biotechnology from IIT, Delhi and a PhD in Sceince Studies form Renseller Polytechnic Institute, John Templeton Fellow in Religion and Science , Fellow in Jawaharlal Nehru Institute of Advanced Study in Jawaharlal Nehru Univrsity for research in Science, Post Modernism and Culture. చేసింది. ప్రస్తుతం visiting faculty in history and philosophy of science, Indian Institute of Science Educaion and Research, Mohali లో పని చేస్తోంది. స్థిర పడింది US లో. ఆమె చేసిన రచనల వివరాలకొస్తే, Ayurveda Today: A Critical Look, Post Modernism and and Religious Fundamentalism: A Scientific Rebuttal to Hindu Science, Breaking the Spell of Dharma and other Essays, A collective of three essays, Prophets Facing Backward: Postmodern Critiques of Science and the Hindu Nationalism in India, Wrongs of the Religious Right: Reflections on secularism, science and Hindutva, The God Market ఆయుర్వేదం గురించిన రచనలో ఆమె రామదేవ్ బాబాని తీవ్రంగా విమర్శిస్తుంది. ఉచితంగా యోగాసనాలు నేర్పి, జనానికొచ్చిన రోగాలకి వారాల్లో తగ్గిపోయే అద్భుతమైన మూలికౌషధాలతో తను తయారుచేసిన మందుల్ని వారికమ్మి వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్న రామ్దేవ్ బాబా ఇప్పుడు తన వ్యాపారాల్ని ఎలా విస్తరిస్తున్నాడో మనందరికీ తెలుసు. అక్కడ తయారయ్యే మందుల్లో జంతువుల, మనుషుల పుర్రెల, ఎముకల పౌడరుందని తేలినా వ్యతిరేకించిన వారిని పాశ్చాత్య సంస్కృతిని సమర్ధిస్తూ, హిందూ సంస్కృతిని నీచంగా చూపించే తొత్తులుగా చిత్రిస్తూ, అందుకు పూర్తి మద్దతును ప్రభుత్వం తరపునిండీ పొందుతున్నాడు. తమని తాము దైవ దూతలుగా కాకుండా, దేవుళ్ళుగానే చలామణీ చేసుకుంటూ, ప్రజల నమ్మకాల్ని సొమ్ము చేసుకుంటూ, విద్యా సంస్థల్నీ, కళాశాలల్నీ నడుపుతూ ప్రభుత్వం నుంచీ అనేక రాయితీలు, పన్ను రాయితీలూ పొందుతూ, ప్రజల వద్ద నుంచి మాత్రం అధిక మొత్తంలోనే డబ్బు రాబట్టుకునే గాడ్ మెన్లు ఇప్పుడు కోకొల్లలు. సాయి బాబాలు, ఆశారాం బాబాలూ, రామ్రహీంలూ, వీరి కొమ్ము కాసే మంత్రులూ ఇతర ప్రభుత్వ అధికారులూ. ఇవే నమ్మకాల్ని ప్రోత్సహిస్తూ, పారిశ్రామికవేత్తలు కట్టే అతి ఖరీదైన గుళ్ళూ. అసలు చూస్తే లోకికవాదాన్ని రాజ్య విధానంగా రాజ్యాంగంలో రాసుకుని, మతాన్నీ భక్తినీ పౌరుల వ్యక్తిగత విషయంగా పరిగణించాల్సిన మన ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ప్రభుత్వమే ఒక మతం, మతమే ఒక ప్రభుత్వ విధానంగా మారుతోంది. ఇతర ఇస్లామిక్ దేశాల్లాగానే, అమెరికా, ఇండియాల్లో కూడా మతమే రాజకీయాన్ని శాసిస్తోంది. ఇవన్నీ ఆమె చర్చించిన విషయాలు. The God Market అనే వ్యాసంలో ఆమె కొన్ని ఆసక్తి కరమైన వివరాలిస్తుంది. భారత దేశంలో 2.5 మిల్లియన్ పూజా స్థలాలుంటే 1.5 మిల్లియన్ పాఠశాలలు, కేవలం 75 వేల్ ఆసుపత్రిలు మాత్రమే ఉన్నాయట. మరుగుదొడ్డి కన్నా మొబైలు ముఖ్యమైనపుడు, ఆసుపత్రికన్నా, పాఠశాల కన్నా పూజా స్థలానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండటంలో ఆశ్చర్యం లేదు కదా. ఇప్పుడున్నది రెలిజియస్ టూరిజం . Hindustan Times and CNN-IBN సమ్యుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తేల్చింది, ముప్పై శాతం ప్రజలు గత ఐదేళ్ళలో తాము చాలా రెలిజియస్ అయ్యారని. చెప్పారని. ఇప్పుడు ప్రభుత్వాలే, యగ్న యాగాదుల పేరుతో కోట్లు కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక రక రకాల వ్రతాలు, మత సంబంధిత కార్యాలు చేసే పండితుల సప్లై కన్నా కూడా డిమాండ్ ఎక్కువై, వారికి ప్రతి చిన్న పూజకి వేలల్లోనే సమర్పించాల్సి వస్తోంది. అయినా ఎవరూ ఆలోచించట్లేదు. వాస్తు పేరిట ప్రభుత్వాలు పచ్చని పొలాల్ని, తోటల్నీ కాంక్రీట్ మయం చేస్తుంటే, మరి ప్రజలకి కూడా షార్ట్ కట్లంటే మక్కువ పెరుగుతుంది. Art of Living నేర్పే రవి శంకర్ ఆశ్రమానికి కర్ణాటక ప్రభుత్వమే స్థలాల్ని ఉచితంగా కేటాయించింది. ఆయన నేర్పే ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంకి కూడా వెళ్ళాలంటే భారీ మొత్తాలే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ సంపన్నులకి మాత్రమే కావాల్సినవి. ఇంకొక విషయం ఇలా వసూలు చేస్తున్న మొత్తాల్ని కేవలం దాన ధర్మాలకీ పుణ్య కార్యాలకే వాడతారా, పేద ప్రజలకి ఎంత మేలు జరుగుతోంది అన్నది ఎవరూ పట్టించుకోరు, ముఖ్యంగా పట్టించుకోవల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లు ఊర్కుంటారు. బహిరంగంగా వారి కాళ్ళకు మొక్కే ఈ నేతలు ఆ పని ఎంత వరకూ చేస్తారో మనం ఊహించచ్చు. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంవల్ల సాధ్య పడిన ప్రతీదీ ఎప్పుడో రాసిన మన వేదాల్లో ఉన్నదే అని శాస్త్ర పరిశోధననీ, విజ్ఞానాన్నీ హేళన చేసే చాందస వాదులు, సైన్సు కాలానుగుణంగా తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందన్న విషయాన్నీ, మత గ్రంధాల్లో ప్రతిపాదించిన ఎటువంటి శాస్త్రీయమైన విషయాలకీ ఎటువంటి దిద్దుబాట్లనీ మత చాందసవాదులు ఒప్పుకోరనే విషయాన్ని వారు విస్మరిస్తారనీ ఆమె అంటుంది. మనిషికి ఏనుగు తలని అమర్చిన హిందువులు సైన్సు పరంగా ఎంతో అభివృద్ధి చెందారని గొప్పగా చెప్పి ప్రధాని విమర్శకి గురవడం ఈ రకమైన చాందసవాదానికి ప్రతీక. ఒక్క హిందూ మతాన్నే మీరు ఎందుకు విమర్శిస్తారన్న ప్రశ్నకి ఆమె జవాబిస్తూ, తను పుట్టిన మతం, తనకు తెలిసిన మతం కాబట్టి దాని లోపాలను ఎత్తి చూపానని అయితే చాలా సందర్భాలలో, నా విమర్శలు ఇస్లాం, క్రైస్తవ మతాలకి కూడా వర్తిస్తాయని ఆమె అంటుంది. ఆమె ప్రతిపాదనలు చాలా వరకు అంబేద్కరిసం ని సమర్ధిస్తున్నట్లు కనపడినా, రాడికల్ బుద్ధిసమ్ని ఆమె ఒక సమాధానంగా ప్రతిపాదించనందుకు, దళిత మేధావులు కొంచం బాధ పడ్డారు. ప్రశ్నలకీ, తర్కానికీ, మార్పులకీ తావియ్యనివే అన్ని మతాలూనూ. ధనం, మతం, రాజకీయం అధికారం ఎలా ఒక దానితో ఒకటి పెనవేసుకుపోతున్నాయో ఆమె చాలా లోతుగా విశ్లేషిస్తుంది. నేను చెప్పగలిగింది చాలా స్థూలంగా మాత్రమే. నిజంగా ఆమెను డీప్ గా అర్ధంచేసుకోవాలంటే, ఆమె వ్యాసాలు చదవ వల్సిందే. కుటుంబం, అతి చిన్ని సరిహద్దులో ఇమిడిపోయే సమాజంలో జరిగే విషయాల చుట్టూ కధలూ కల్పనలు అల్లుతూ చేసే రచనలు కాకుండా వాటి పరిధి దాటి విస్తృత పరిశోధనలు చేసి, దేశాల రాజకీయాలు మొదటినుంచి మతంతో ఎలా ముడి పడ్డాయో, ప్రజలని మత మౌఢ్యంలో ఎలా పెట్టాయో తన రచనల ద్వారా చెప్పిన ఆమె స్త్రీలు గర్వించదగ్గ రచయిత్రి. ఇలాంటి విషయాల్ని స్త్రీలు ధైర్యంగా చర్చిస్తే విమర్శ కూడా ఎంత ఘాటుగా ఉంటుందో మనకు తెలుసుకదా. ఈమె రచనలూ అందుకు అతీతం ఏమీ కాదు.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మోనికా కుమార్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మోనికా కుమార్     ఇంగ్లీష్లో ప్రొఫెస్సర్ అయిన మోనికా కుమార్ మాతృభాష పంజాబీ. ఆమె పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లోనూ కవిత్వం రాస్తుంది. మోనికా కుమార్ పురుషులు ఏలుతున్న హిందీ సాహిత్య ప్రపంచానికి తన కవిత్వంతో ఒక సవాలు విసిరింది. ప్రతి రోజూ జరిగే లెక్కలేని చిన్న చిన్న సంఘటనలకి భూతద్దం పట్టినంత తేలికగా ఎటువంటి అలంకారిక భేషజం లేకుండా ఉంటాయామె కవితలు. మన చుట్టూ గమనిస్తే ఎన్ని చిన్న చిన్న ప్రపంచాలో. పదమూడేళ్ళ వయసులో ఒక వ్యాస రచన పోటీలో మొదటి బహుమతికి ఆమె పేరు ప్రకటించినపుడు ఆమె చాలా ఇబ్బంది పడి పోయిందట. ఇబ్బంది అందరి దృష్టి తనమీద పడినప్పుడు. ఆ ఇబ్బంది ఆమెను చాలా ఏళ్ళు వెంటాడింది. ఆ తరవాత అది ఇంకా ప్రస్పుస్టంగా ఆమె వ్యక్త పరిచింది ఆమె కవిత్వంలో. ఈ ఇబ్బంది ఆమెని చాలా కాలం వెంటాడింది. అకస్మాత్తుగా బయటి ప్రపంచానికి ఒక రచయిత్రిగా పరిచయం అవడం అంటే అంత సులభం ఏమీ కాదు. ఎందుకంటే ఇక అప్పట్నుంచి అందరి దృష్టి ఆమె మీద ఉంటుంది. ఆమె ప్రతి పదమూ డిసెక్ట్ చెయ్యబడుతుంది. ఆ దృష్టికి కొన్ని లక్షణాలుంటాయి, వాటిలో, వెటకారం, మోహం, ఆకర్షణ, కామం అన్నీ ఉంటాయి. వీటిని తట్టుకోడం నేర్చుకోవాల్సొచ్చిందంటుందామె. ఇటువంటి ఇబ్బందే కెమేరా ముందు నిలబడటం. మన కనుపాపలాగే ఉండే ఆ కెమేరా కన్ను మన మొహంలోని అందాన్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. ఇక మనం మన అగ్లినెస్ దాచటానికి విశ్వప్రయత్నం చేస్తాము. కానీ అదెక్కడికి పోతుంది. దాన్ని దాచలేని మన ఇబ్బందికి కాళ్ళు వణుకుతాయి. కానీ అదేదో పరిక్ష ఫలితంలాగా వెతుక్కుంటాం మనల్ని మనం ఫొటోలో. చివరికి తెలిసేదేంటంటే ఆ కెమేరా ఫైల్ అయ్యిందని. అదే ఆ ఫొటొలో మన కాళ్ళు వణకడం కనపడదు. Before the Camera అనే ఓ కవిత లోని ఈ చివరిలైన్స్ బాగుంటాయి. 'll look at this picture as desperately as one looks at exam results And see! There is a lot missing It hasn't captured my trembling legs! ** పాస్పోర్ట్ అనే ఈ కవిత చూడండి మచ్చుకి. Pass Port When we meet even before smiling I do the checklist your eyes, still two your ears, intact your back, erect in your passport photograph your heartbeat has stopped though I want to forget this photograph forever sorry but the official stamp on your chest does not look like a medal I talk my heart to squirrels since I know they have the least interest in what I say they are interested only in the breadcrumbs the school children drop out of their lunchboxes they hop around all day and wait they have no urge for a leisurely talk all they really care about is their tails as they climb a tree The passport is already here visa on its way so please don’t promise to write me letters As soon as you are gone, I will draft an appeal: if ever, we meet again you be me and I, a squirrel Passport మనం కలిసినప్పుడు చిరునవ్వులు రువ్వేముందే నేను కొన్ని సరి చూస్తాను నీ కళ్ళు, ఇంకా రెండు నీ చెవులు, సరిగానే ఉన్నాయి నీ నడుము, ఇంకా నిటారుగానే ఉంది కానీ నీ పాస్పోర్ట్లోని ఫొటోలో నీ గుండె కొట్టుకోవడం ఆగింది నాకీఫొటోని ఎప్పటికీ మరిచిపోవాలనుంటుంది సారీ, నీ గుండెలమీద పడిన అధికారిక ముద్ర పతకం లాగా ఏమీ కనిపించదు ఉడతలతో నా గుండె విప్పి మాట్లాడుతాను ఎందుకంటే నాకు తెలుసు నే చెప్పేదాంట్లో వాటికెటువంటి ఆసక్తి లేదని స్కూలు పిల్లల టిఫిను బాక్సుల్లోంచి వేసే బ్రెడ్ ముక్కలమీదే వాటి ఆసక్తి అంతా రోజంతా గెంతుతూ వేచి ఉంటాయి తీరికగా మాట్లాడే కోరిక వాటికి లేదు అవి నిజంగా పట్టించుకునేది చెట్లెక్కేటపుడు వాటి తోకలని మాత్రమే పాస్పోర్ట్ వచ్చేసింది వీసా కూడా వస్తుంది నువ్వుత్తరాలు రాస్తానని ప్రమాణాలు చెయ్యకు నువ్వెళ్ళిన వెంటనే నేనొక ఫిర్యాదు రాస్తాను మళ్ళీ మనమెప్పుడైనా కలిసినప్పుడు నువ్వు నేనవ్వాలని నేను, ఒక ఉడత అవ్వాలని. ప్రేమికుడు దేశం వదిలి వెళ్ళిపోతాడంటే ప్రేయసి పడే బాధని ఎంతో సున్నితంగా చెప్తుంది ఈ కవిత. ప్రియుడు వెళ్ళిపోతే ఆమెకు తోచదు, పాస్పోర్ట్ రావడం, వీసా కూడా ప్రోసెస్ అవుతుండడం ఆమెని కలవరపెడతాయి. ఫొటోలో అన్నీ సరిగానే ఉన్నా గుండె కొట్టుకోదు. తన బాధని లెక్క చెయ్యకుండా వెళ్ళిపోయే ప్రియుడికి అసలు గుండె లేదని ఆమె అభియోగం, ఒకవేళ ఉన్నా అది కొట్టుకోవట్లేదంటుంది ఫొటోలోలాగే. పైగా ఆ ఫొటోపైన పడిన స్టాంపు పతకంలా ఏమీ కనిపించటంలేదని వెక్కిరిస్తుంది. ఉత్తరాలు రాస్తానని అతను చేసే ప్రమాణాలూ ఆమెని సంతృప్తి పరచవు. ఆమె గోడంతా ఆ ఉడతలతో అవి వినవని తెలిసినా చెప్పుకుంటుంది. ప్రియుడు లేకపోతే ఆమెకు చేసేదేమీ ఉండదు, సమయం గడవదు. కానీ అది ప్రియుడికి అర్ధంకాదు, అతను వెళ్ళిపోవడమెలాగూ ఖాయం. ఆ బాధ, నిస్సహాయత అతని మీద కోపంగా మారతాయి. అందుకే మళ్ళీ కలిసినపుడు అతను ఆమెవ్వాలని, ఆమె మాత్రం ఆ ఉడతలాగే అతని గోడు వినిపించుకోకుండా బిసీగా పట్టించుకోనట్లు ఉండాలనుందని ఆమె అంటుంది. ప్రేయసి పడే వియోగాన్ని వర్ణించడం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకో పరిచయంతో వచ్చే వారం.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సునీతీ నామ్ జోషీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సునీతీ నామ్ జోషీ     ముంబయిలో 1941 పుట్టిన సునీతి తన పన్నెండవ ఏటనే పైలట్ అయిన తండ్రిని విమాన దుర్ఘటనలో పోగొట్టుకుంది. హిమాలయాస్ దగ్గర ఉన్న అమెరికన్ మిషన్ స్కూల్లోనూ ఆ తరవాత మదనపల్లి లోని ఋషివేలీ స్కూల్లోనూ చదువుకుంది. ఏడదికోసారి రెండునెలల పాటు స్కూలు పిల్లలతో గడిపే జిడ్డు క్రిష్ణమూర్తిగారి ప్రభావం ఆమెపై ఉంది. 1964 లో IAS కి సెలెక్ట్ అయ్యింది కాని 1972 నుంచి 1987 వరకు యూనివర్సిటి ఒఫ్ టొరొంటో లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పని చేసింది. ఆమె కవిత్వం ముఖ్యంగా gay sex and lesbianism గురించి రాసినది కొంత విమర్శకి గురయ్యింది. పితృస్వామ్యంలోని లింగ వివక్షకి అధికారం, ఆధిపత్యం మగవాడి చేతుల్లోనే ఉండటం, స్త్రీ పురుష సంబందాలెప్పుడూ అధికార రాజకీయాలతో ముడిపడి ఉండటం గమనించి ఆ పరిస్తితి నుంచి తనని తాను రక్షించుకోడానికి ఆమె స్వలింగ సంపర్కం వేపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. ఇవే భావాలు ఆమె కవితల్లో కనిపిస్తాయి. స్వదేశాన్ని వదిలి విదేశాల్లో పర్యటించి, London లో స్థిరపడ్డ ఆమె తన దేశం మీద ప్రేమ వ్యక్తం చేస్తూ కూడా కవిత్వం రాసింది. ఎన్నో కవితా సంకలనాలు, నాటకాలు చిన్నపిల్లల పుస్తకాలు, కధా సంకలనాలు రాసింది. ఆమె రచనలు ఎన్నో ఫారిన్ భాషల్లోకి అనువదించబడ్డాయి. Bedside Book of Nightmares అనే ఒక కవితా సంకలనం, నిజానికి గుర్తు చేసుకోవడానికి కూడా బాధపడే సంఘటనలు, అనుభవాల గురించి రాసినది. ఇందులో నిరాకరణ, నిరాదరణ, ప్రేమ పొందాలన్న, ప్రేమించబడాలన్న కాంక్ష, తన అస్తిత్వాన్ని గురించిన ఆందోళన గురించిని కవతలు ఉన్నాయి. ఈ కవితలు రాయడమే ఎంతో బాధ పెట్టిన విషయం ఆమెకు. మచ్చుకు వెంటాడే వేదన ఉన్న ఒక చిన్న భాగాన్ని ఇక్కడ ఇస్తాను మేకోసం. ‘Biped’ But I am that dog. It was I who howled, I who was hurt. I felt the pain. And it is I Who despised myself. మన దేశంలో ఎవర్నేనా బాగున్నారా అని పలకరిస్తే ఒక కధ వినాలి, మన దేశం కధల దేశం అందుకనే నేను కధలను ఎంచుకున్నాను అని ఆమె ఒక సారి అన్నది. అతి విలక్షణమైన ఈ రచయిత్రి కధలు కూడా అలాగే ఉంటాయి. ఫెమినిస్ట్ ఫేబుల్స్ అనే ఒక వంద కధల సంకలనంలో ఆమె పురాణాల్లోని కధల్ని, పంచతంత్ర కధల్ని, ఆఫ్రికా, గ్రీక్, యూరోప్, అరేబియా, ఏసోప్ (క్రిస్టియనిటీ) కధల్నీ వాడుకుని ఆడవారికి జరిగే అన్యాయాల్నీ, పితృస్వామ్య ఆధిపత్యాన్నీ, సంఘంలో ఆడవారి స్థానాన్నీ వివరంగా చూపిస్తుంది. అన్ని వర్గాల స్త్రీల జీవితాల్లోని వివక్షనూ ఆమె ఎండగడుతుంది. ఈ కధలన్నీ కూడా ఒకటి రెండు పేజీల్లోనే ఉంటాయి, తమ సందేశాన్ని పాఠకుడికి చాకచక్యంగా చేరవేస్తాయి. ఈ కధలు చదువుతూ, ఆమె మేధస్సును మెచ్చుకోకుండా ఉండటం కష్టం. ఈ ఫెమినిస్ట్ ఫేబుల్స్ లోని కొన్ని ఆసక్తికరమైన కధల్ని మీకు చెప్తాను. ఒక పేద బ్రాహ్మణుడు, తనకొక కొడుకు కావాలని తపస్సు చేస్తే, శ్రీమహా విష్ణువు ప్రత్యక్షమై వరమిస్తాడు కానీ పొరపాటున కొడుకు బదులు కూతురిని ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ ప్రత్యక్షమైన విష్ణువు నీకు వచ్చే జన్మలో కొడుకు పుడతాడని చెప్తాడు. ఆ వచ్చే జన్మలో, ఈ బ్రాహ్మణుడు ఒక స్త్రీగా పుట్టి ఎనిమిది మంది కొడుకులను కంటుంది. కానీ ఆ బ్రాహ్మణ స్త్రీ మళ్ళీ తపస్సు చేసి ఈసారి నాకు మనిషి స్టేటస్ ఇవ్వమని ప్రార్ధిస్తుంది . కానీ ఏమీ చేయలేని విష్ణువు ఒక కమిటీని వేస్తాడు ఏంచెయ్యాలని. సో అదండీ ఒక స్త్రీకి మనిషిగా బ్రతికే పరిస్తితి కల్పించాలంటే సాక్షత్తూ శ్రీమహావిష్ణువు కూడా ఏమీ చెయ్యలేడు. చిన్న పిల్లలకి కధలు చెప్పినట్టు ఆమె కధల్లో, బాతులు, పాములు, కోతులు, మొసళ్ళు, బల్లులు, గాడిదలు, గుర్రాలు అన్నీ ఉంటాయి. కొన్ని సార్లు అవి మనుషులకి పాఠాలు కూడా చెప్తాయి. ఆమె పాత్రల వేషాలు వేస్తాయి. ఆడవాళ్ళపై మగవారి ఆధిపత్యం, తిరగబడే ఆడవాళ్ళు, ఆ తిరుగుబాటుల పర్యవసానాలు అన్నీ ఉంటాయి. ఇలా కధలెందుకు రాస్తావని నన్నడుగుతారు, సమాధానాలివ్వడానికి నేను ప్రయత్నిస్తాను కానీ అవి నా దగ్గర లేవని నాకు తెలుసు అంటుందామె. The Princess అనే story లో ఒక సుకుమారమైన స్త్రీకి ఒక అద్భుతమైన మంచం ఒక బఠాణీ గింజ ఇవ్వబడతాయి. అయితే ఆమె అతి సుకుమారి కాబట్టి ఏడు పరుపుల కింద ఉన్న ఆ బఠాణీ గింజ వల్ల నిద్ర పోలేదు. తన చుట్టూ ఎవరికి అన్యాయం జరిగినా ఆమె బాధ పడి రోజుల తరబడి మంచంపట్టేది. ఇంత సున్నితమైన మనసూ శరీరమూ ఉన్న ఆమె చివరికి ఈ చెడ్డ ప్రపంచంలో బ్రతకలేక, జలుబు చేసి అది తగ్గక చనిపోతుంది. ఆమెని కాపాడటానికి ఆమె తల్లితండ్రులు శతవిధాల ప్రయత్నించిన ఏమీ చెయ్యలేకపోతారు. మనకు తెలిసిన ఈ కధని ఆమె ఎంత అద్భుతంగా అన్వయించిందో చూడండి. Next Time Around అనే కధలో ఒక స్త్రీ వెయ్యేళ్ళు నిద్ర పోతుంది. ఆమె అసలు పురుషుడి ఆధిక్యతతో విసిగిపోతుంది. వెయ్యేళ్ళలో అయినా స్త్రీలలో సామాజిక, రాజకీయ చైతన్యం వస్తుందని ఆశించి నిద్ర పోతుంది. ఆమె ఆవలిస్తూ లేవంగానే డాక్టర్స్ పరిగెట్టుకుంటూ వచ్చి నీ పేరేంటి, వయసెంత, పెళ్ళయిందా, స్టేటస్ ఏంటి అని అడుగుతారు. సమాజం ఏం మారలేదా అలాగే ఉందా, అంటే లేదు చాలా అభివృద్ధి చెందింది, మనిషి స్పేస్ లోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రతి పెళ్ళి కాని అబ్బాయికి ఒక ఇల్లు, ఉద్యోగం ఉన్నాయి కాని స్త్రీకి మాత్రం చోటు లేదు అని చెప్తారు. ఇక్కడ మగాడే ముఖ్యం, స్త్రీకి చదువూ, సంపాదనా, ఆస్తి లేదు, ఆధారపడాలి కాబట్టి ఆమె ముఖ్యం కాదు పురుషుడికున్న స్వేఛ్చ లేదు, బానిసే అని చెప్తారు. ఆమె ఉద్దేశ్యంలో వెయ్యేళ్ళలో కూడ స్త్రీల జీవితాల్లో ఎటువంటి మార్పూ లేదు. ఒక కధలో ఒక కోతి పిల్లకి నదిలో ఉండే రెండు మొసళ్ళు స్నేహితులు. ఈ కోతికి ఆ నది మొదలు వరకూ వెళ్ళి చుడాలనిపించి వీరిని కూడా తోడు రమ్మంటుంది. కాని ఆ మొసళ్ళు అందుకు ఒప్పుకోక నువు కూడా వెళ్ళకు, పొడుగ్గా లావుగా పెద్ద పెద్ద కోరలతో ఉండే జంతువులు నీళ్ళలో ఉంటాయి, వెళ్ళొద్దు అంటాయి. అయినా కోతి పిల్ల వినకుండా ఒక్కతీ వెళ్ళి కొన్నాళ్ళ తరవాత తిరిగొస్తుంది. తిరిగొచ్చిన కోతికి తోక పోతుంది, ఒక కన్ను పోతుంది, కాలు విరిగి ఒంటినిండా దెబ్బలతో తిరిగొస్తుంది. అప్పుడు ఈ రెండు మొసళ్ళు అడుగుతాయీ, మేము చెప్పిన జంతువులు నీకు కనిపించాయా అని. అవును కనిపించాయి అవి కూడా మీలాగే ఉంటాయని మీకు ముందే తెలుసుకదా అంటుంది. అవునని చెప్పి కోతికళ్ళలోకి చూడలేక తల తిప్పుకుంటాయా మొసళ్ళు. ఇంట్లో ఉండే రక్షణ ఆడదానికి బయటలేదు. బయటకెళితే వెళ్ళిన పరిస్తితిలోనే తిరిగి రావటం కుదరదు. బయట ఉండే దుష్టులకి ఇంట్లోని వాళ్ళకీ రూపంలో తేడా లేదు. కాబట్టి అప్పుడప్పుడు హాని వీరివల్ల కూడా జరగొచ్చు. Bird Woman అనే కధలో, ఒక పాప రెక్కలతో పుడుతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా భయపడి వెంటనే ఆ రెక్కలు కట్ చెయ్యమని సలహా ఇస్తారు, చాలా pressure కూడా పెడతారు. కానీ తల్లి తండ్రులు మాత్రము లొంగక ఈ పాప వింతగా ఉన్నా సరే, రెక్కలున్నాయి కాబట్టి ఎగరడం నేర్పిద్దామనుకుంటున్నామంటారు. ఆడపిల్లలు వాళ్ళకెన్ని టేలంట్స్ ఉన్నా ఎదగడం కష్టం, ఎంతో వ్యతిరేకత, చిన్న చూపు, అణిచివేతని ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సొస్తుంది. అదే సాంప్రదాయ రీతుల్లో, ఒదిగి ఉంటూ స్వేఛ్చగా స్వతంత్రంగా అలోచించకపోతే చాలా ఆదరణ ఉంటుంది. ఒక టీనేజ్ అమ్మాయి హేతువాద సాహిత్యం చదవడం కన్నా, ఏ కాలక్షేపం చేస్తూఅయినా సమయం గడపడం తల్లి తండ్రులకి ఇష్టంగా ఉంటుంది. The Blue Donkey Fables అనే సంకలనంలోని “The Blue Donkey” అనే కధలో, ఒక బ్లు కలర్ ఉన్న గాడిద ఒకటి రెడ్ బ్రిడ్జ్ అనే చోట ఉంటుంది. ఇదేంటి, గాడిదలన్నీ బూడిద రంగులోనో, తెల్లగానో ఉండాలి తప్ప ఈ నీలం రంగు ఏంటీ అని అక్కడున్న కౌన్సిలర్స్ అందరూ కలిసి నువు రంగు మార్చుకుంటే తప్ప ఇక్కడ ఉండటానికి వీలు లేదంటారు. కానీ ఆ గాడిద నిరాకరిస్తుంది. ఈ విషయమై అక్కడ అందరూ రెండు గ్రూపులుగా విడిపోయి వాదించుకుంటుంటారు. అయితే ఆ ఆడ గాడిద తెచ్చుకున్న ఆ నీలం రంగుతో తన స్వేఛ్చని ప్రకటించడానికి వాడుకునే ప్రయత్నం చేసింది, అందుకే ఆ రంగు మాత్రమే అభ్యంతరం సమాజానికి. అలాగే Lesbianగా, Feminist గా తనను తాను నిస్సంకోచంగా ప్రకటించుకున్న సునీతి పురుషాధిక్య సమాజానికి ఇచ్చే ఒక సంకేతంగా భావించవచ్చు. లింగ వివక్ష, అధికార రాజకీయాలు ఎలా కలిసి పోయి ఉంటాయో The Bride అనే ఈ కధలో చెప్తుంది. ఒక రాజు తన అందగాడైన, అన్నివిధాలా వీరుడు, యోగ్యుడైన తన కొడుకు కోసం ఒక చక్కటి భార్య కోసం వెతుకుతుంటాడు. అందుకోసం అతను ఒక పోటీ నిర్వహిస్తాడు, బాగా చదువుకుని, అందంగా ఉండి, విలువిద్య, సంగీతం లాంటి అనేక కళల్లో ప్రావీణ్యం ఉన్న వారి మధ్య. ఈ పోటీలో నెగ్గినవారిని చూసి తనకు నచ్చిన అమ్మాయిని ఎన్నుకోమంటాడు. అయితే యువరాజు వారందరినీ పరీక్షించిన మీదట వారిలో కొందరు తనకన్నా చురుకైన వారని గ్రహించి, తన పురుషాహంకారం దెబ్బతిని, తండ్రికి ఇలా చెప్తాడు. వారంతా బాగున్నారు కాని వాళ్ళల్లో స్త్రీత్వం లేదు అని. అయితే పోటీల్లో నెగ్గని వారిలోంచి ఎన్నుకోమంటాడు తండ్రి. పితృస్వామ్యంలో పురుషుడి కన్నా చురుకైన వారికి ముఖ్యమైన పదవులు ,బాధ్యతలు ఇవ్వబడవు. వారినెప్పుడూ, అధికారానికి దూరంగానే పెడతారు. ఇలా ఎన్నో అద్భుతమైన కధలు. ఎన్నిటినో ఇక్కడ ఉటంకించవచ్చు. సునితీ జోషీ రచనల్లు చదవాలనిపించడానికి ఇవి చాలేమో.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మీనా కందస్వామి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?  మీనా కందస్వామి - తమిళ్, ఇంగ్లీష్   భక్తి తత్వంతో తిరుగుబాటు చేసిన స్త్రీలు తమ కష్టాలన్నీ దేవుడికి వెళ్ళబోసుకున్నారు తమదైన కవిత్వ శైలిలో. తరవాత స్త్రీ వాద కవిత్వం మగవారే రాసారు స్త్రీల కష్టాలు వారికర్ధమైన విధంగా. అలాగే దళితుల తరపున వారి కష్టాలను చూసి అర్ధం చేసుకున్న కొందరు వారి తరపునా రాసారు. కానీ ఈ రెండు కవిత్వాలూ విమర్శకు గురయ్యాయి. ఎందుకంటే ఎవరి కష్టాలను, అనుభూతులను వారు కవిత్వీకరిస్తేనే అది మరింత శక్తిమంతంగా ఉంటుందని. మెల్లి మెల్లిగా స్త్రీలనుంచి స్త్రీవాద కవిత్వమూ సాహిత్యమూ వచ్చాయి. అలాగే దళితులని నుంచి కూడా కొందరు చదువుకున్న వారు వారి కధలను జీవితాలనూ, వివిధ సాహిత్య ప్రక్రియల్లో ప్రజలు ముందుకు తెచ్చారు. అడిగితేనే కానీ అమ్మయినా అన్నం పెట్టదని, వారి కష్టాలూ, సమాజంలో వారనుభవించే దుర్భర జీవితాల్నీ, హేయమైన పరిస్తితిల్లో గడుస్తున్న జీవితాల్నీ చూస్తూ కూడా వారు గొంతు విప్పి చెప్పకపోతే వారు సుఖంగానే ఉన్నారన్నట్టు సమాజం నటిస్తుంది. ఇటాలొ కెల్వినో, Italian కవీ, జర్నలిస్ట్ మాటల్లో, “Literature is necessary to politics above all when it gives a voice to whatever is without voice, when it gives a name to whatever is without name, to what as yet has no name, especially to what the language of politics excludes or attempts to exclude ---- literature is like an ear which can hear things beyond colour spectrum provided by politics”. ఒక దళిత మహిళ ఒక పెద్ద రాష్ట్రానికి సీ ఎం అయిన దేశంలో, స్వాతంత్రం తరవాత రిసర్వేషన్ అమలు వల్ల ఎంతో కొంత మేలు జరిగినా ఇంకా వారి స్తితిగతుల్లో ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది. వర్ణాశ్రమ ధర్మం, వృత్తిని బట్టి మనుషుల్ని విభజించినా అన్ని వృత్తుల వారికీ సమాన గౌరవాన్నీ, ఆర్ధిక సమానతనీ ఇవ్వ లేక పోయింది. అసలు ఆ విభజన లోనే అగ్రవర్ణాల అవకాశవాదం, స్వార్ధం ఉండి, ఒకరి కష్టంతో ఇంకొకరు సుఖపడటం జరిగింది. వేల ఏళ్ళ సంవత్సరాలుగా అలాగే జరుగుతూ వస్తోంది. దళితులు కూడా వేల ఏళ్ళ వెనుకబాటుతనంలోనే ఇప్పటికీ జీవిస్తున్నారు. కారంచెడు, చుండురు సంఘటనలు, దళిత స్త్రీలపై మానభంగాలు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంత ముందుకెళ్తున్నా అందులో భాగస్వామ్యం మాత్రం వీరికి లేదనిపిస్తుంది. 1984 లో పుట్టిన ఇలవేనిల్ కందస్వామీ మీనా అనే కలంపేరుతో రాసింది. కవిత్వం ఇంగ్లీష్లో రాసిన మొదటి దళిత రచయిత్రి. పదిహేడేళ్ళనుంచే రాయటం మొదలు పెట్టింది. ఇంగ్లీష్లో ఆమె మొదటి కవితా సంకలనం " టచ్" 2006 లో కమలా దాస్ గారి ముందు మాటతో అచ్చయ్యింది. ఎన్నో ఏళ్ళ తరవాత నిజాయితీ గల కవిత్వాన్ని చదివే అవకాశం కలిగిందని చెప్పింది. ఈ పుస్తకం అచ్చవగానే అయిదు భాషల్లోకి అనువాదం అయ్యింది. అయితే ప్రముఖ తమిళ రచయితల రచనలు చాలానే ఆమె ఇంగ్లీష్ లోకి అనువదించింది. ఆమె మొదటి సంకలనం "Touch” వస్తు పరంగా చాలా విలక్షణంగా, బలంగా ఉన్నా భాషా పరంగా చాలా బలహీనంగా, తప్పులు తడకలతో, ఒక్కోసారి ఆమె ఏంచెప్పదలుచుకుందో తెలియనంత ఘోరంగా ఉందని విమర్శ. అయితే 2007 లో అచ్చయిన ఆమె రెండో సంకలనం మిస్ మిలిటెన్సీ చాలా వరకూ భాషాపరంగా మెరుగ్గా ఉన్నా వస్తు పరంగా, కంటెంట్ పరంగా బలహీనంగా ఉండి మళ్ళీ విమర్శకి లోనయ్యింది. ఇక ఆమె కవితలు Mascara, My Lover Speaks of Rapeఅనేవి International Poetry Competition లో మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఆమె International Writing Program at the University of Iowa in 2009 లో పాల్గోటానికి మన దేశతరపున ఆహ్వానిచబడిన యువ రచయిత్రి. రెండేళ్ళ తరవాత Charles Wallace India Trust Fellow at the University of Kent లో ఫెల్లోగా నియమించబడింది. ఎన్నో అంతర్జాతీయ కవి సమ్మేళనాల్లో ఆమె పాల్గొంది. ఆమెను దక్షిణ ఆసియాలోని 40 ఏళ్ళ లోపు 21 మంది కధా రచయితల్లో ఒకరిగా ఎన్నుకుని ఆమె రచన జుబాన్, ధిల్లీ (మన దేశపు మొదటి స్త్రీవాద బుక్ పబ్లిషింద్ హౌస్) వారు అచ్చేసిన సంకలనంలో వేసారు. ఆమె 2014 లో Kilvenmani Massacre గురించి ఒక నవల "Gypsy Goddess” అనే పేరుతో పబ్లిష్ చేసింది. దళిత రచయిత్రిగా తన సామాజిక బాధ్యతని నిర్వర్తించే దిశగా మీనా తనకు తెలిసిన దళిత జీవితాన్ని తన రచనల్లో ప్రతిబింబిస్తూ, వారిపై జరుగుతున్న అన్యాయాలని ప్రతిఘటిస్తూ గొంతు విప్పలేని ఆ నిస్సహాయుల గొంతుకగానే కాక వారి తరపున వరిపై అత్యాచారాలు చేస్తున్న అగ్ర కులాల పట్ల సిమ్హ గర్జనగా మారింది. తన కలాన్ని ఒక పెన్నులా కాకుండా ఒక గన్నులా వాడింది. ఒక్క మాటలో సినిమా స్టైల్లో చెప్పాలంటే ఆమె ధైర్యం విసిరిన రాకెట్టు. దేశంలో దళితులపై జరుగుతున్న అణిచివేత సంఘటనల్లో అక్రమార్కుల పేర్లు ఆమె రాసే వ్యాసాల్లో బయట పెట్టడానికి ఆమెకు పిసరంత కూడా భయం ఉన్నట్టు కనపడదు. వాళ్ళ నేర చరిత్రలు, వాటి లింకులు అన్నీ ఇచ్చి మరీ ప్రతిఘటించే ఆమె సాహసం చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. టచ్ సంకలనంలో అదే శీర్షిక గల పోయెంలో ఇలా అంటుంది. “You will have known almost Every knowledgeable thing about The charms and the temptations That touch could hold. But, you will never haven known That ---touch ---- the taboo To your transcendence, When crystalized in caste Was a paraphernalia of Undeserving hate.” నిజమే స్పర్శకి మానవ సంబంధాల్లో ఉన్న అనేక కోణాలు అందరికీ ముఖ్యంగా మీనా ప్రకారం అగ్రవర్ణాలవారికి తెలుసు కాని ఎంతమందికి అదే స్పర్శ దళితులకేంటో ఎలా అర్ధమవుతుంది. ఏకలవ్యుడి కధని తీసుకొని ఇప్పటి ఏకలవ్యుడైతే గురుదక్షిణ కోరికకు ఎలా ప్రతిస్పందించాలో చెబుతుంది. “You can do a lot of things With your left hand, Besides, fascist Dronacharyas warrant Left handed treatment, Also, You don't need your right thumb, To pull a trigger or hurl a bomb”. ఇంకొక కవితలో, బ్రహ్మ సరస్వతులమీద సటైర్ వేస్తూ ఇలా అంటుంది. పురాణాల్లో చదువుకున్న దేముళ్ళే ఇలాంటి సంస్కారంతో ఉన్నపుడు, మీరింక మంచి సంస్కారంతో ఎలా ప్రవర్తిస్తారు అని భావన/వాదన. We understand Why upper caste Gods And their “good girl” much married, father fucked, Virgin, Vegetarian oh-so-pure Goddesses, Borne in thier golden chariots Don't come to our streets”. దళిత బాలిక పై అత్యాచారం అనే వార్తను మనం చాలా కామన్ గా పేపర్లో చదువుతుంటాము. కానీ ఆ వార్త వెనుక ఆ బాలిక అనుభవించే బాధ అందరికీ అర్ధం కానిది. ఆ బాధని ఆమె ఈ పోయెం లో పాఠకుడి అనుభవంలోకి తెస్తుంది. ఇంకా బాధించే విషయం ఏంటంటే నేరం చేసిన వాడు తప్పించుకుని సంఘంలో గౌరవంగా బ్రతికేస్తుంటే, బలయిన బాలిక మాత్రం అవమానభారంతో సిగ్గు పడుతూ జీవశ్చవంలా బ్రతుకుతుంది, “Dalit girl raped” Is much too commonplace, Humiliation gnaws, The sixteen year old, Gory scars on a wrecked body, Serve as constant reminders Of disgrace, helplessness. అందుకే ఈ అత్యాచారాలన్నీ ప్రతిఘటించడానికి ఏం చెయ్యడానికైనా ఆమె సిద్ధమే. బలైపోయే స్త్రీలందరూ ఎలా ప్రతిఘటించాలో కూడా ఆమె చెప్తుంది ఈ కవితలో. “I fancy myself being a witch Broomstick borne and black as pitch, Thin, stark-naked with fire for eyes Killing men whom I despise ---- Haunting oppressors to shave their heads Cutting all their holy threads Experiencing joy as they bleed”. వర్ణాశ్రమాన్ని వెనకేసుకుని వచ్చినందుకు గాంధీని కూడా విమర్శించడానికి ఆమె వెనుకాడదు. ఒక్క అంటరానితనం తప్ప గాంధీకి హిందూ మతంలో అంతా సవ్యంగానే కనిపించింది. అంటరానితనమొక మచ్చ హిందూ మతానికి అని బాపూ అభిప్రాయపడ్డాడు. తన కవితలో ఎలా దుయ్యబడుతుందో చూడండి. కుల వ్యవస్థని నిర్మూలించగలిగి ఉండి కూడా గాంధీ ఆ దిశగా ఏమీ చెయ్యలేదని ఆమె అభిప్రాయం. అంటరానితనం వద్దన్నాడే కానీ వర్ణాశ్రమాన్నీ, కులాల్నీ కుల వృత్తిల్నీ వాటి ఆధారంగా జరుగుతున్న అన్యాయాన్నీ ఆయన ఖండించలేక పోయాడు. “bapu; bapu, you big fraud, we hate you,” “That trash is long overdue You need a thorough review, Your tax free salt stimulated our woulds, We gonna sue you, the Cogress shoe. You knew, you bloody well knew, Caste won't go, they wouldn't let it go It haunts us now, the way you do with a spooky stick, an eerie laugh or two”. కుల రహిత సమాజాన్నీ, అన్ని వర్గాల ప్రజలకీ సమాన అవకాశాల్నీ, సమాన గౌరవాన్నీ ఇచ్చే, ఆర్ధిక అసమానతలు లేని సమాజం ఆమె కల. అదినిజం కావాలంటే నిమ్న కులాలుగా గుర్తింపబడుతూ, అణిచివేతని సహిస్తూ వస్తున్న వాళ్ళందరూ వారి కనీస మానవ హక్కుల కోసం సంఘటితపడి పోరాడితేనే తప్ప సాకారమవని కల. అది చాలా కష్టమని నిజానికి అంత తేలికగా సాధ్యమయ్యేది కాదనీ అమెకూ తెలుసు. ఇదే విషయన్ని ఆమె ఇచ్చిన అనేక పత్రికా ముఖాముఖీల్లో ఆమె చెప్పినదే. కులవ్యవస్థకి స్త్రీలు ముఖ ద్వారాల్లాంటివారని అంబేద్కర్ అన్నారట. ఎందుకంటే సంస్కృతయినా, సాంప్రదాయమైనా పాటించాల్సింది, నిలబెట్టాల్సింది స్త్రీలే. అలాగే పురుష/కుల ఆధిపత్యానికి ఆయుధాలుగా మారేది కూడా వారే, వారి శరీరాలే. Downtrodden of the downtrodden, దళితుల్లో దళితులు స్త్రీలు. ఏ కారణంగానైనా మగవాడిలోని పశువాంఛకి బలయ్యేది ఇరువర్గాల్లోని స్త్రీలే. అందుకే ఆమె స్త్రీల పక్షం. స్త్రీవాదమే ఆమె ఎజెండా, వారి బాధలే ఆమె వస్తువులు, వారి బాగు ఆమె తపన, వారి ధైర్యం ఆమె పరిశ్రమ. ఆమె కవిత్వంలో ఆగ్రహం, దుఖం, తిరుగుబాటు, స్త్రీలపై హింస లేని ఒక నూతన సమాజంపై కాంక్ష ఇవన్నీ కనిపిస్తాయి. ఆమె కవిత్వం గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది. ఇంత రాసినా ఇంకా రాయాల్సిన కవితలు చాలా ఉన్నాయనిపిస్తోంది. సహిస్తూ పోతే దుర్మార్గాలు చేస్తూనే ఉంటారు, తిరగబడు, తిరగబడటం ఒక్కటే మార్గం, అంటూ తనకు చేతనైన, చెయ్యగల్గిన తిరుగుబాటు తను చేస్తున్నానని చెప్పుకుంది. హైదరాబాదు బీఫ్ ఫెస్టివల్లో పాల్గొని ఈమధ్య న్యూస్లోకి వచ్చిన ఈమెకు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ, సామాజిక కార్యకర్త కూడా అయిన ఆమె వల్ల ఆమె రచనల వల్ల స్త్రీల, ముఖ్యంగా బడుగు వర్గాల స్త్రీల పరిస్తితుల మెరుగవుతాయని ఆశిద్దాం.    -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? పద్మా సచ్ దేవ్ - డోంగ్రి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? పద్మా సచ్ దేవ్ - డోంగ్రి     జమ్మూలో పుట్టిన పద్మా డోంగ్రీ భాషలో ఆధునిక కవిత్వం రాసిన మొదటి రచయిత్రి. తండ్రి సంస్కృత అధ్యాపకుడు. మొదట వేద్ పాల్ దీప్ అనే కవిని పెళ్ళి చేసుకుంది. కాని తరవాత ఆమె జమ్ము రేడియోలో పనిచేసినప్పుడు పరిచయమయిన సురీందర్ సింగ్ అనే గాయకుడిని రెండవ వివాహం చేసుకుంది. ఈమెకు మేరి కవితా, మేరీ గీత్ అనే కవితా సంకలనానికి సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. భారత ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. కబీర్ సమ్మాన్ ఎవార్డ్ ఆమె కవిత్వానికి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది 2007-08 లో. ఆమె డోంగ్రీలోనే కాకుండా హిందీలో కూడా రాసింది. అంతే కాకుండా ఉర్దూ, మరాఠీ, ఒరియా, కొరియన్ భాషల్లోంచి అనువాదాలు కూడా చేసింది. డోంగ్రీ భాషాభివృద్ధికెంతో కృషి చేసింది. మచ్చుకి ఆమె కవితల్లో ఒకటైన The Raja's Palaces కవితలో దోపిడీకి, అణిచివేతకి, పాలకుల నిర్లక్ష్యానికి గురయిన ఒక చూపు మందగించిన వయసు మళ్ళిన స్త్రీ బాధని ఈ విధంగా ప్రకటిస్తుంది. ఈ రాజసౌధాలు మీవేనా? నిలువ గూడు లేక తిరుగుతున్నా.... ఎన్నో ఏళ్ళ క్రితమే నా కంటి వెలుగు పోయింది వాళ్ళు వచ్చారు, దోచుకున్నారు, నిశ్చేష్టనై నే నిలిచాను నా తోటలో ఇంకా విరియని చిన్ని మొక్కను కూడా పెరికారు నా మనిషి ఇంకా ఎంతో దూరం వెళ్ళకముందే వణికిపోతున్న కొమ్మల్ని నరికి వేరు చేసారు ఈ మానభంగాలు, ఈ రంపాలు, గొడ్డళ్ళు మేవేనా? ఈ రాజసౌధాలు మేవేనా? నా పెదవులకంటుకున్న మెతుకునూ లాక్కున్నారు, నా నాళాల్లో ప్రవహించే రక్తాన్నీ పీల్చారు నా దుఖం కన్నీళ్ళూ, బాధలూ అన్నీ కూడా అనవసరమైన విషయాలు మా ప్రభువులకు వణుకుతున్న చేతులపై కొరడా ఝళిపించారు మా కళ్ళముందే మా ఇంట్లోని చివరి ఇత్తడి ముక్కనూ లాక్కున్నారు అన్ని డబ్బాలూ, పెట్టెలూ ఖాళీ చేసారు ఈ బరువులు మోసే గుర్రాలు మేవేనా? ఈ రాజ సౌధాలు మేవేనా? ఆకాశాన్ని ముద్దాడే ఎత్తైన గోడలు లోపల దాచిన గొప్ప నిధులు, చక్కని ఎర్రని పరదాల అందాలు మా రక్తాన్నీ, దరిద్రాన్నీ గుర్తు చేస్తాయి మా భుజాలు మోసిన బండరాళ్ళు మా చెమట తడిపిన ఈ నేల మా శ్రమ వల్ల పైకి లేచిన గోడలు ఈ ఎత్తైన కట్టడాలిప్పుడు మీవేనా? ఈ రాజ సౌధాలు మీవేనా? ఈ రోజు నా వినలేని చెవులు విన్నాయి ఫిరంగి ప్రేలిన శబ్దం బలవంతపు ప్రసవపు ఘడియలు ముగిసాయి ఇది సమయం నా ప్రేమికుడు తిరిగి రావడానికి కానీ దారిలో ఎటువంటి చప్పుడు లేదు నా కాళ్ళు పరుగులు పెట్టడం లేదు ఎదురువెళ్ళి పలకరించడానికి అతని గొంతు ఇంకా నా చెవుల్లో మారు మ్రోగుతూనేఉంది అతన్ని దారిలోనే కట్టి పడేసిన నా బాధలు, భయాలు - ఈ సంకెళ్ళు మేవేనా? ఈ రాజ సౌధాలు మేవేనా? మండే మా నెత్తురు మీ దీపాల్లో చమురు అమావాస్య రాత్రుల్ని వెన్నెల రాత్రులు చేస్తుంది ఈ వెలిగే రాత్రులు దూరమ్నుంచే మమ్మల్ని వెక్కిరిస్తాయి ఇది దీపావళి రాత్రి మీ టపాసులు ఆకాశంలో ప్రేలతాయి మా గుండెలు ముక్కలై చిన్ని చిన్ని తారలవుతాయి మా పిల్లలు ఆశ్చర్యంగా ఆకాశంకేసి చూస్తుంటారు ఈ అందమైన దీపావళి రాత్రులు మీవేనా? ఈ రాజ సౌధాలు మేవేనా? నేలంతా తవ్వి, ఎరువు వేసింది మురికి నీరు తాగైనా మాడ్చేసే ఎండల్లో విత్తనాలు తడిపింది మేము మొక్క మొలిచినపడు మాకు సంతోషం పూతకొచ్చినపుడు మాకు దీపాల పండగ కానీ దుర్భుద్ధితో మీరు చూసినపుడు మేమడిగామూ ఈ పంట మీదేనా? ఈ రాజ సౌధాలు మేవేనా? xx ఆమె కధల్లో కాశ్మీరు ప్రజల జీవనం ప్రతిబింబిస్తుంది. వాటిలో కలిసి మెలిసి సహజీవనం చేసే హిందువులు, ముస్లిములూ ఉంటారు. ఎంతో ఇష్టంగా, ఎంతో అమాయకంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ బ్రతికేసే సామాన్యులు ఉంటారు. తమ బ్రతుకుల్లో ఇంత హింస, దౌర్జన్యం, ఎప్పుడు ఎలా ప్రవేసించిందో తెలియక, తాము ప్రేమించే తమ పిల్లలు ఇంత హింసాత్మకంగా ఎప్పుడు ఎలా తయారయ్యారో తెలియక సతమతమవుతుంటారు. ఆమె కధలన్నీ కూడా రెండు దేశాల సైన్యాల మధ్యా, రాజకీయాలమధ్యా మత రాజకీయాల మధ్యా టెర్రరిస్టుల ప్రతీకార హింసల మధ్య ఎలా నలిగిపోతున్నాయో చూపిస్తుంది. కశ్మీరు ప్రజలు ప్రేమించిన, గర్వపడిన అందమైన స్వఛ్చమైన ప్రకృతి అందాలు అక్కడ జరుగుతున్న హింస వల్ల ఎలా రక్త వర్ణాన్ని పూసుకుని వికారంగా కనిపిస్తున్నాయోనని బాధ పడుతుంది. ఆమె రాసిన కధలు చాలానే ఇంగ్లీషులోకి అనువాదం అయ్యాయి. అందువల్ల కశ్మీరు జన జీవితం బాహ్య ప్రపంచానికి తెలిసే వీలు కలిగింది. Where is My Gulla Gone అనె కధ ఆమె ఒక భయంకరమైన కల కనడంతో మొదలవుతుంది. తెల్లని పసుపు పచ్చని తామరలు పూసే దాల్ సరస్సు తెల్లని గాజు ముక్కలా గడ్డ కట్టి ఉన్నపుడు, దానిపై రక్తపు మరకలు ఉన్నట్లు, నగ్నంగా ఉన్న ఒక చిన్న పిల్ల ఎర్రని తామరలు, నీరు బదులు రక్త కారుతూన్న వాటిని కొనమని అడుగుతున్నట్లు. ఆ కలలోని భయంకర దృశ్యాలు చూడలేక బలవంతంగా కళ్ళు తెరిచి ఆమె గుల్లా గుల్లా అని కలవరిస్తుంది, కానీ గుల్లా ఎక్కడా కనపడడు, పలకడు. అప్పుడు ఆమెకు ముప్పైముప్పైఐదేళ్ళ క్రితం తనకు తెలిసిన గుల్లా గుర్తుకొస్తాడు. కశ్మీరులోని ముస్లింస్లో చాలా మందికి గులాం మొహమ్మద్ అనే పేరు ఉంటుంది. అందరూ పెరిగి పెళ్ళి చేసుకునే వరకు గుల్లాలే. ఆమె ఒకసారి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నపుడు, అక్కడ పనిచేసే ఒకతను గుల్లా. తనకంటే రెండుమూడేళ్ళు చిన్నదే అయినా ఆమెను మాజి అనే సంబోధిస్తాడు. మాజి అని అంటాడు కాబట్టి అదే గౌరవాన్నీ, ఆప్యాయతనీ పంచిస్తాడు. అదే ఆసుపత్రిలో ఇంకొక చిన్న గుల్లా, అయిదేళ్ళ అబ్బాయి. ఈ చిన్న గుల్లా అతి అమాయకంగా నువు బిస్కట్లిస్తే నీతో స్నేహం చేస్తా అంటూ రోజూ ఈమె దగ్గరకు వచ్చి బోలెడు కబుర్లు చెబుతుంటాడు. ఈ చిన్న గుల్లాకు చికెన్ తినటం ఇష్టం అయినా దాన్ని చంపడం చూడలేడు, అందుకని కోడిని చంపే సమయానికి పారిపోతాడు. ఇక పెద్ద గుల్లా కూడా అంతే అమాయకుడు. అందరికీ ఎప్పుడూ ఆనందాన్ని మాత్రమే పంచేవాడు, ఎటువంటి భేదం లేకుండా సేవ చేసే వాడు. ఆవు మీకు అమ్మ లాంటిదా మాజి అని అమాయకంగా అడుగుతాడు. దానికి ఈమె అంతకన్నా అమాయకంగా, అవును అమ్మ లాగే పాలిస్తుంది కదా అంటుంది, పాలిచ్చే వేరే జంతువులు చాలానే ఉన్నా. ఈ ముగ్గురి మధ్యా జరిగే చిన్న చిన్న సంఘటనలని ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తుంది కధ. చివరికి పేపర్లో పెద్ద గడ్డంతో నల్లటి మాస్కులతో, ఏ కే 47 గన్నులతో వచ్చేది ఏ గుల్లా ఫొటో అని ఆమె ఆశ్చర్య పోతుంది. తనకు తెలిసిన ఏ గుల్లాకీ అంత ధైర్యం లేదే, ఈ రక్తం అంటే భయపడని గుల్లా ఎవరా అని నిస్పృహతో పేపర్ విసిరేస్తుంది. ఇంకొక కధలో, ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ మీద ఉన్న బావి. అందులోని నీళ్ళు రెండువైపుల నించీ ఆడవాళ్ళు తోడుకునే వారు. వారితో బాటుగా వచ్చే వారి పిల్లలు అక్కడే ఆడుకునే వారు. అక్కడే ఉన్న ఒక రేగిపళ్ళ చెట్టు కాపుకొస్తే ఇస్టంగా తినే రెండువైపుల పిల్లలూ. అలాగే బావి పక్కనే గుబురుగా పెరిగిన గోరింటాకు చెట్టు ఇరు దేశాల ఆడవారి చేతులూ ఎర్రగా పండించేది. అక్కడే కలిసి కలబోసుకునే ఆడవారి కష్టాలు, జీవితాలు. ఇంత సందడిగా ఉండే ఆ బావిని రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణల వల్లా, రాజకీయాల వల్ల మూసేయాల్సొస్తుంది. చుట్టు పక్కల నుంచి బాంబుల మోతలు వినిపిస్తాయి. అవి ఏ పక్షం సైనికులవో ఈ బావి దగ్గరకొచ్చే వారికి అనవసరం, పట్టదు. వారి బాధల్లా ఆ బావి మూసేసారనే. ఇలా రెండు పక్షాల సైనిక ఘర్షణల్లో చనిపోయే వారు, కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అందరినీ పోగొట్టుకుని కేంప్స్ లో ఉంటూ, మాన భంగాలకి గురయ్యే ఆడవారి కధలూ, సైనికులకు ఆకర్షణీయంగా కనపడకుండా ఉండటం కోసం మొహాలకు మసి పూసుకుని పాట్లు పడటం, తప్పించుకోగల్గితే దొరికిన వాళ్ళని పెళ్ళిచేసుకుని తిరిగి ఒక కుటుంబాన్నీ, జీవితానికొక లక్ష్యాన్ని పొందే వారి కధలూ ; ఇరు దేశాల రాజకీయ ఉద్దేశ్యాలతో సంబంధం లేకుండా, ప్రశాంతంగా కుటుంబ జీవనం సాగించాలనుకునే సామాన్యుల కధలు ఆమె రాసినవన్నీ. అనువాదాలు లభ్యమయితే, దేశ సరిహద్దుల్లో స్థిరపడిన కారణంగా అక్కడి ప్రజలు పోగొట్టుకున్నదేంటో, ఎంత దుర్భర పరిస్తితుల్లో వారి జీవనం సాగుతోందో తెలుసుకోడానికి తప్పనిసరిగా చదవ వలసినవి ఆమె కధలు.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సుగాధా కుమారి మలయాళం

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సుగాధా కుమారి మలయాళం   సుగాధా కుమారి 1934 లో బోధేస్వరన్, కార్తియాని అనే దంపతులకి పుట్టింది. తండ్రి కవి, స్వాతంత్ర సమర యోధుడు. తల్లి ఆమె రోజుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొద్దిమంది మొదటి మహిళల్లో ఒకరు. సంస్కృత అధ్యాపకురాలిగా పనిచేసింది. తన సాహిత్యాభిలాషని తీర్చుకోవడానికి ఇంట్లో చక్కని వాతావరణం, స్వేఛ్చా ఆమెకు ఉంది. ఆమె ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది. భర్త రచయిత విద్యావేత్త, మేధావి ఎన్నో రచనలు చేసిన ఘనత ఉన్నవాడు. ఇక ఆమె సహోదరి, హృదయ కుమారి సాహిత్య విమర్శకురాలు, విద్యావేత్త, కేరళ సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ గ్రహీత. ఇలా ఆమెకు చుట్టూతా ఒక అద్భుతమైన వాతావరణం, అది చాలు ఆమె పని, ఆశయాలు ఎటువంటి ఆటంకాలూ లేకుండా సాగడానికి. ఆమెకొచ్చిన ఎవార్డ్స్ లిస్ట్ రాస్తే గిన్నీస్ రికార్డ్ కి ఎక్కేంత పెద్దగా ఉంది 2006 లో ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ కాకుండా.     1968: Kerala Sahitya Akademi Award for Poetry for Pathirappookkal     1978: Kendra Sahitya Akademi Award for Rathrimazha     1982: Odakkuzhal Award for Ambalamani     1984: Vayalar Award for Ambalamani     1991: Asan Prize     2001: Lalithambika Sahitya Award     2003: Vallathol Award     2004: Kerala Sahithya Akademi Fellowship     2004: Balamaniamma Award     2004: Bahrain Keraleeya Samajam Sahitya Award     2004 Mahakavi Pandalam Keralavarma Poetry Award     2007: P. Kunhiraman Nair Award for Manalezhuthu     2008: Award for Lifetime Contribution to Children's Literature     2009: Ezhuthachan Award     2009: Basheer Award     2013: Saraswati Samman for Manalezhuthu     2013: Kadamanitta Award     2013: PKV Award for Literature     2013: Pandit Karuppan Award     2014: VT Literary Award     2014: Mathrubhumi Literary Award     2014: Thoppil Bhasi Award Other awards     1986: Indira Priyadarshini Vriksha Mitra Award     2006: Panampilly Prathibha Puraskaram     2007: Streesakti Award     2007: K. Kunhirama Kurup Award     2009: M.T.Chandrasenan Award మొదట కవిత్వానికే పరిమితమైనా తరవాత కాలంలో ఆమె పర్యావరోణోద్యమాల్లో చురుకుగా పాల్గొంది. దేశవ్యాప్తంగా జరిగిన పర్యావరణోద్యమాలకి ఆమె నాయకత్వం వహించింది. కేరళలోని సైలెంట్ వేలీ అనే సహజారణ్యాన్ని ఒక జల విద్యుత్ ప్రాజక్ట్ వల్ల ముంపుకి గురవకుండా కాపాడింది. చెట్టు గురించి ఆమె రాసిన ఒక కవిత “Ode To A Tree" ఆమె కేరళలో పాల్గొన్న అన్ని ఉద్యమాలకీ పాటయ్యింది. ఒక స్త్రీ తన అసలు అస్తిత్వం గురించి చేసే నిరంతర అన్వేషణ ఆమె తన జీవితమ్నుంచి, తన రచనల్లోకి ఒంపినట్టుంటాయట ఆమె స్త్రీ పాత్రలు. స్త్రీ పురుష సంబంధాలలోని అతి సున్నితమైన అంశాలని ఆమె స్పృశించేది ఆమె రచనల్లో. ప్రకృతి సమ్రక్షణ సమితి అనే సంస్థ ఆమె స్థాపించి నడిపింది పర్యావరణ సమ్రక్షణ కోసం. అభయా గ్రామం అనే సంస్థని మానసిక రోగులైన స్త్రీల కోసం స్థాపించి ఆశ్రయం ఇచ్చింది. ఇది ఎందుకంటే ఒకసారి ఆమె ఒక ప్రభుత్వ మానసిక అరోగ్య కేంద్రానికి వెళ్ళి అక్కడ చూసిన రోగుల స్తితిగతులు ఆమెని కలిచివేసి, వారికి సాయపడాలన్న ఉద్దేస్యంతో చేసిందట. ఆ మానసిక రోగులని పోలీసు కేంప్స్ లోని మగవారు లైంగికంగా అత్యాచారాలు చెయ్యటం అతి దుర్భరమైన పరిసరాల్లో వాళ్ళు జీవశ్చవాల్లా ఉండటం ఆమె చూడలేక పోయింది. ఈ విధంగా స్వఛ్చంద సంస్థలు కలగజేసుకోవడం కొంతమంది అధికారులు వ్యతిరేకించి బెదిరించినా ఆమె లెక్క చెయ్యలేదు. అప్పట్నుంచి ఆమె రచనల్లో కూడా మార్పు వచ్చింది. సమాజంలోని అవకతవకలకీ, అన్యాయాలకి వ్యతిరేకంగా స్త్రీవాద ప్రతిస్పందనలుగా ఆమె రచనలు సాగాయి. కేరళ స్తేట్ వుమన్స్ కమిషన్ చైర్ పర్సన్ గా ఉంటూ ఆమె ఎన్నో స్త్రీల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంది. ఎంతో సున్నితమైన కవిత్వంతో అదే సమయంలో ఒక గొప్ప వేదాంతంతో మలయాలంలో భావకవిత్వానికి ఆమె కొత్త ఊపిరి పోసిందని ప్రసంశలందుకుంది .అమ్మ అనే కవిత 1989 దేవకి కధని స్త్రీ కోణమ్నుంచి సొంత అన్న అయిన కంసుడి నుంచి సహించిన హింసను గురించి చెప్తుంది. గల్ చైల్డ్ ఇన్ 1990స్ అనే పోయెం బాలికల మీద జరిగే అణిచివేత దోపిడీల గురించి రాసింది. అత్తపది అనే చోటి గిరిజనులకు ఆమె అమ్మ. అంతరించిపోయిన అరణ్యాన్ని తిరిగి పెంచి వారికి అండగా నిలబడింది ఆమె. వారి బోగోగులకి, పక్కా ఇళ్ళ నిర్మాణానికి ఎంతో కృషి చేసింది, కాని అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం ఆమెని బాధించేవి. ఆమె మొదటి కవితే వేరే కలం పేరుతో అచ్చేసింది ఒక సంచలనమే సృష్టించింది. ఆమె రాసిన పదమూడు పధ్నాలుగు సంకలనాల్లో చాలా వాటికి ఎంతో అరుదైన పురస్కారాలొచ్చాయి. దురదృష్ట వశాత్తూ, అనువాదాలు లభించక చదివే భాగ్యం కలగలేదు. కేంద్ర సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చిన కవితా సంకలంలో టైటిల్ పోయెం నైట్ రైన్ కి తెలుగు అనువాదం. తన పాత్ర దుఖంతోనో, తన పాఠకురాలి దుఖంతోనో మమేకమయ్యితనదిగా చేసుకుని రాసినదే ఈ కవిత. రాత్రి వర్షం ఒక మతిలేని యువతిలా ఏడుస్తూ, నవ్వుతూ, వెక్కిళ్ళు పడుతూ, అకారణంగా ఆపకుండా గొణుగుతూ, నీ జాలి, నీ అణుచుకున్న ఆగ్రహం నీ రాత్రిళ్ళు రావడం ఒంటరిగా పట్టలేని దుఖంతో రోదించడం; తెల్లవారుతూనే, బలవంతపు నవ్వుని కడుక్కున్న మొహంపై అతికించుకుని ఏదో ఒక పనిలో నువ్ పడే తొందర; ఇదంతా నాకెలా తెలుసు? నా నేస్తమా, నేనూ నీలాగే నీలాగే, రాత్రి కురిసే వర్షాన్ని. తను రాసే కవితలే తన నిజ జీవితంలో, సమాజంలో తను వేస్తున్న అడుగులుగా, తను రాసే దానికి చేసే దానికి తేడా లేని ఆమె జీవితం కవులూ, కవయిత్రులందరికీ ఆదర్శం కావాలి. వచ్చే వారం ఇంకొక అద్భుత రచయిత్రి పరిచయంతో కలుద్దాం.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ప్రతిభ రే - ఒరియా

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ప్రతిభ రే - ఒరియా   ప్రతిభ 1943 లో కట్టక్ డిస్ట్రిక్ట్ లోని చిన్న గ్రామంలో పుట్టింది. పేరెరగని ఆ చిన్న ఊర్లోంచి, ఒడిస్సా లోని ప్రతి ఇంట్లోని పాఠకుడి మనస్సులోనూ, అనువాదాల ద్వారా ఇతర భాషా పాఠకుల మనస్సుల్లోనూ సుస్థిరమైన స్థానానికి ఆమె ప్రస్థానం ఒక అద్భుత పయనం. చిన్నప్పట్నుంచి ఆమెకాదర్శం ఆమె తండ్రి పరసురాం దాస్. స్వతంత్ర పోరాట యోధుడూ, గాంధేయవాదీ అయిన ఆయన టిస్కొ కంపెనీ లోని మంచి ఉద్యోగం ఒదులుకుని, పిల్లలను చదువుకోనివ్వని ఒక జమిందార్ల గ్రామంలో స్కూల్ నడిపి దాన్ని ప్రాధమిక పాఠశాలనుండి ఉన్నత పాఠశాల స్థాయికి తెచ్చాడట. సహజంగానే ఆయన తన కూతురికే కాదు అప్పటి యువతకి కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి ఆదర్శమయ్యాడు. ఆయన కూడా కవే, తన పాటలు, కవితలతో యువతనుత్సాహపరిచేవాడట. ప్రతిభ కూడా తన 9 వ ఏటనే ఒక అద్భుతమైన కవిత రాసి అప్పటి ప్రముఖ దినపత్రికకు పంపిందట రహస్యంగా. మరునాడే అది అచ్చయ్యితే తండ్రి స్నేహితులు చదివి ఆయనకు చెప్తే ఆయన సంతోషానికి అవధులు లేవట. కుంతలా కుమారి సబత్, ( ఈమె గురించి మనం ఈ Colomn లో చదివాం) లాగా ఒక డాక్టరయి కవయిత్రి కూడా అవుతుందని ఆశించాడు, కానీ వైద్య విద్య అంటే అంతగా ఆసక్తి లేని ప్రతిభ వైద్య కళాశాలలో చేరాకా తండ్రికి చెప్పకుండా మానేసి సైన్సు చదువుకుందట. పెళ్ళి తరవాత కూడా ఆమె తన రచనలు ఆటంకం లేకుండా కొనసాగించింది ముగ్గురు పిల్లల తల్లయి కూడా. వాళ్ళు స్కూల్ కెళ్ళాకా చదువుకుంటూ ఆమె ఎడ్యుకేషన్ లో మాస్టర్స్, పీ హెచ్ డీ ఎడ్యుకేషనల్ సైకొలొజీ లో చేసిందట. బోండా ట్రైబ్ ఒడిస్సా లోని అతి పురాతనమైన్ ట్రైబ్. నాగరిక సమాజానికి అతి దూరంగా వీరి జీవనం ఇప్పటికీ కూడా. ఆమె రిసెర్చ్ పేపర్ “Tribalism and Criminology of Bonda Highlander” మీద చేసింది. దీనికోసం ఆమె ఎంతో ధైర్యంగా, మగవారుకూడా సాహసించని విధంగా వారితో నెలల తరబడి సహజీవనం చేసేదట. ఆమె మొట్టమొదటి నవలే ఒడిస్సాలో బెస్ట్ సెల్లర్. ఆమె 20 నవలలు, 24 కధా సంకలనాలూ, 10 ట్రావెలాగ్స్, ఇంకా లెక్క లేనన్ని వ్యాసాలూ రాసింది. ఇండియాలో, ప్రపంచమంతా, కూడా ఆమె విస్తృతంగా పర్యటించింది. ఆ అనుభవాలే ఆమె ట్రావెలాగ్స్గా రాసింది. ఆమె ఎందరివో రిసెర్చ్ పేపర్స్కి గైడుగా వ్యవహరించింది, వృత్తి రీత్యా ప్రొఫెసర్ కాబట్టి. ఇక ఆమె కొచ్చిన పురస్కారాలకొస్తే, ఆమె 47 వ జ్ఞానపీఠ (2011) ఎవార్డ్ గ్రహీత, ఒడిస్సాని తీస్కొంటే మొట్టమొదటి రచయిత్రి ఇంతటి అత్యున్నత పురస్కార గౌరవానికి.     1985 – 'Odisha Sahitya Academi Award' for her novel 'Sheelapadma'     1990 – 'Sarala Award' for her novel 'Yajnaseni'     1991 – 'Moortidevi Award' for her Novel 'Yajnaseni'     2000 – 'Sahitya Akademi Award' for her Short-Story Collection 'Ullaghna'     2006 – 'Amrita Keerti Puraskar'[10]     2007 – 'Padma Shri Award' in Literature and Education by the Government of India.     2011 – 'Jnanpith Award'     2013 – Odisha Living Legend Award (Literature)   మొదటినుంచీ కులమత రహిత, వర్గ రహిత సమ సమాజం ఆమె ఆశయం. ఏరకమైన వివక్షనీ ఆమె సహించలేదు. పూరి జగన్నధాలయంలో జరిగే అక్రమాలకి వ్యతిరేకంగా ఆమె ఒక వ్యాసం "The Colour of Religion is Black" రాసి, కోర్ట్ కేసులో పదేళ్ళు ఇరుక్కుంది. అయినా ఆమె దేనికీ వెరవలేదు. వైష్ణవ భక్తురాలై ఉండీ, గుళ్ళలో జరిగే అన్యాయాలనూ, దేవుని పేర జరిగే అక్రమాలనూ, జాతి, మత, రంగు వివక్షలనూ, భేదాలనూ ఖండించడానికీ, నిరసించడానికీ వెనుకడుగు వేయలేదు. ఆమెను విమర్శించిన వారు ఆమెను కమ్యూనిస్టుగానూ, ఫెమినిస్టుగానూ ముద్ర వేస్తే వ్యతిరేకిస్తూ ఆమె, నేను మానవతావాదిని అని చెప్పుకుంది. ఆమె ఉద్దేశ్యంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే, అయితే వేరు వేరు బాద్యతల్ని నిర్వర్తించడానికి అనుకూలంగా ఉన్నారు ఈ సృష్టి క్రమంలో ; ఈ స్త్రీ పురుష సహజత్వాన్ని గౌరవించి కాపాడుకోవాలి కాని ఒకరినొకరు చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయం. యజ్ఞసేని అనే నవలకి అరుదైన మూర్తీ దేవి ఎవార్డ్, సరళా ఎవార్డూ వచ్చాయి. అయోనిజ అయిన ద్రౌపది గురించి, ద్రౌపది కోణం నుంచే రాసిన నవల. సహజంగానే ఇందులో యుద్ధ పర్వం ఉండదు. చిన్నప్పటినుంచి చనిపోయేవరకూ ద్రౌపది జీవితంలో జరిగిన సంఘటనల ప్రభావం ఆమె మీద ఎలాఉంది, ఒక సున్నిత హృదయం గల స్త్రీగా ద్రౌపది స్పందన ఎలాంటిది అన్న విషయాన్ని అద్భుతంగా చిత్రించింది. అయితే దీనిమీద విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ప్రారంభంలో నవల సాగదీసే సంభషణలతో, ఇమోషనల్ మెలోడ్రామా కొంచం ఎక్కువైందని. ద్రౌపదిని చిత్రించిన విధానం ఐదుగురి భర్తలకి సేవ చేస్తూ, ప్రేమించింది అర్జునుడినైనా కుంతీదేవి మాట నిలబెట్టడం కోసం ఇష్టంలేకపోయినా మిగిలిన నలుగురినీ పెళ్ళిచేసుకుని, తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆమె పాతివృత్యాన్ని నిరంతరం హేళన చేస్తుంటే సహిస్తూ, ఎక్కువకాలం అరణ్యవాసాల్లోనూ, అజ్ఞాతవాసాల్లోనూ అష్టకష్టాలూ పడుతూ, వస్త్రాపహరణానికి గురయి, తనని కాపాడలేని భర్తల మీద ఏహ్యత వ్యక్తపరుస్తూనే, వారిని గౌరవిస్తూ ఆమె నరక యాతన పడితే, చివరికి కురుక్షేత్ర యుద్ధానికి కారకురాలిగా, తనదైన శైలిలో అప్పుడప్పుడూ సహనం కోల్పోయి తిరుగుబాటు చేసిన స్త్రీగా మిగిలింది. యుద్ధంలో తన పుత్రులని కోల్పోయి ఆమె ఏం మిగుల్చుకుంది? పతివ్రత అయ్యుండీ, పంచ భర్తృక అయినందువల్ల పాతివృత్యానికి ప్రతీకగా ఎన్నడూ కొనియాడబడలేదు. చివరకు చనిపోయేముందు కాలుజారిపడిన ఆమెను నిస్సహాయంగా వదిలి భర్తలందరూ స్వర్గానికి వెళ్తూ, తిరిగికూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఐదుగురు భర్తలతో జీవించగల్గటం ఏమైనా ఆమెకు సంతోషం స్వేఛ్చనిచ్చాయా అంటే అదీ లేదు. ఐదుగురు భార్యలున్న పురుషుడికి లేనటువంటి ఆంక్షలన్నీ ఆమెకు విధించబడ్డాయి. అయినప్పటికీ తను ప్రేమించిన అర్జునుడి గురించి ఇతర భర్తల వద్ద ఉన్నపుడు అలోచించకుండా ఉండలేకపోతున్నానవి వాపోతుంది. ఇదీ ఆమె కోరుకున్నది కాదు. ఆమె అంతగా ప్రేమించిన అర్జునుడి మిగతా భార్యలతో సర్దుకోవటం మళ్ళీ తప్పలేదు. అయితే ఇందులో ప్రతిభా రే మీద విమర్శ ఏంటంటే వీటిని వేటినీ ఖండించకుండా, ఇన్ని కష్టాలు పడ్డా ద్రౌపది భర్తల పట్ల నెరపిన పాతివృత్యాన్ని మాత్రం ఉటంకిస్తూ, ఆమె పాత్రని glorify చేసి, సరిగా అర్ధం చేసుకుని జాలిపడమని మాత్రమే రచయిత్రి అభిప్రాయం అని. ఏమైనా ఈ నవలకి రెండు ప్రతిస్ఠాత్మక పురస్కారాలొచ్చాయి. ఇంగ్లీష్, తమిల్, మలయాలం, అస్సామీ, మరాఠీ, పంజాబీ, హంగేరీ భాషల్లోకి అనువదించబడింది. మానవతా విలువల్ని అతిక్రమించే ఏ సంప్రదాయమైనా మారాల్సిందే. లేకపోతే అది మనిషి మెడలో వేలాడే విషసర్పంలాంటిదని ఆమె అభిప్రాయం. స్త్రీల హక్కుల కోసం పోరాడటం ఆమె తండ్రివద్దనుంచే నేర్చుకుంది. అలాగే తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి శ్రమించడం కూడా. ఆమె మీద విమర్శ ఎలా ఉన్నా ఆమె నిబద్ధతని అనుమానించే ప్రసక్తి లేని విధంగానే ఆమె మొదటినుంచీ పనిచేస్తూ వచ్చింది. ఒక రచయిత్రికి ఇంతకంటే ఉండాల్సిన అవలంబించాల్సిన గొప్ప జీవన విధానం ఏముంటుంది?   -Sharada Sivapurapu  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నళినీబాలాదేవి అస్సామీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?  నళినీబాలాదేవి అస్సామీ   ఇంతవరకూ రాసిన రచయిత్రులను గురించిన వ్యాసాలు తిరగేస్తుంటే అనిపించింది, అస్సాంకి చెందిన ఒక్క రచయిత్రిని కూడా పరిచయం చెయ్యలేదేంటా అని. వెంటనే వెతికితే కనిపించింది, నళిని బాలా దేవి. బ్రిటిష్ వారు వచ్చే వరకూ అస్సాం లో స్త్రీలు రాసిన దాఖలాలు లేవు. ఎందుకంటే వారికి చదువుకునే యోగ్యత లేదు. అంటే వేరే చోట్ల అవకాశం ఉందని కాదు. ఒక్క మన దేశంలోనే కాకుండా, ప్రపంచం అంతటా అదే పరిస్తితి. అస్సాంలో మరింత వెనుకబాటుతనం స్త్రీలకి. బ్రిటిష్ వారు వస్తూ వస్తూ వారి మత ప్రచారం కోసం ప్రింటింగ్ ప్రెస్స్ తెచ్చారు. అయితే ఆ మత ప్రచారం అస్సామీ భాషలోనే చేస్తే సులువుగా ప్రజలకి చేరుతుందని భావించి అరుణోదయ్ అనే దిన పత్రిక ప్రారంభించారు. మొదట ఆ పత్రికలో క్రిష్టియన్ మతం పుచ్చుకున్న స్త్రీలు ఒకరిద్దరు మత సంబంధ సాహిత్య రచనలు చేసారు. అస్సామీ భాషని అధికార భాషగా కార్యాలయాల్లోనూ, కోర్టుల్లోనూ ప్రవేశ పెట్టారు. స్కూల్స్ తెరిచి అస్సామీ భాషలో బోధించారు. ఈ మార్పులు ప్రజలకి సాహిత్యానికి దగ్గరవడానికెంతో ఉపయోగపడ్డాయి. మెల్లి మెల్లిగా సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. భావ కవిత్వం మొదల యింది. 1850 లు దాటాకా స్త్రీలు కూడా కొద్దిమందైనా చదువుకుని రచనలు చెయ్యడం మొదలుపెట్టారు. గువాహాటి లో పుట్టిన నలినీ బాలా దేవి తండ్రి నబిన్ చంద్ర బార్డోలోయ్ కూడా ఒక పేరు మోసిన రచయిత స్వతంత్ర పోరాట యోధుడు. స్వతంత్ర పోరాటంలో పాల్గోటమే కాకుండా స్త్రీ హక్కుల గురించి కూడా పోరాటం చేసిన జ్ఞాని తండ్రి. నళినీబాలాదేవి పదేళ్ళవయసులో "పిత" అనే కవిత రాసింది. నళినీబాలా దేవి కవయిత్రి మాత్రమే కాదు, మంచి పైంటర్ కూడా. ఆమెకు ప్రేమా, సేవా తత్పరతా కూడా ఎక్కువే. రోగులకు శ్రద్ధగా సేవ చెయ్యడం అంటే ఇష్టముండి ఆమె హొమియో వైద్యం నేర్చుకుందిట. పన్నెండేళ్ళ వయసుకే పెళ్ళయ్యింది. ఆమెకిరవై ఏళ్ళు వచ్చేసరికే భర్త చనిపోయాడు. అయిదుగురు పిల్లలతో తండ్రి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె దుఖాన్ని తగ్గించటం కోసం తండ్రి ఆమెకు భగవద్గీత, ఉపనిషత్తులు ఇచ్చి చదవమన్నాడు. అలా చిన్నప్పటునుంచే ఆమెకు జీవితాన్ని తాత్విక కోణంలోంచి చూడటం అలవాటు చేసుకుంది. తండ్రి స్వతంత్రం కోసం జైలుకెళ్ళినపుడు ఆమె ఒక కొడుకు మంటల్లో కాలి చనిపోయాడు. ఆ దుఖమ్నించి బయట పడకుండానే తండ్రిని, తన ఇంకొక కొడుకునీ కూడా ఆమె పోగొట్టుకుంది. రచయిత్రిగా ఎదగడానికి ఆమె దుఖభరిత జీవితం అడ్డురాలేదు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ దుఖాన్ని తట్టుకునేందుకు కావల్సిన తాత్వికత, వేదాంతం ఆమెకు ఉపనిషత్తులలోని వేదాంతం రూపంలో లభించింది. ఒక మహత్తర శక్తి ఎదో ఆమెనెప్పుడూ నిలబడేట్టు చేసిందని ఆమె నమ్మకం. అదే వేదాంతం, తాత్వికత ఆమె రచనల్లో ప్రతిబింబించేది. రబింద్రనాత్ ఠాగోర్ రచనలు ఆమెకెంతో ఇష్టం. ఆయన ప్రభావం, ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే బ్రతికున్నంత వరకూ తండ్రి ఇచ్చిన ధైర్యం, అండగా నిలబడటం ఆమెను ప్రతి దుఖం నుంచి బయటపడి జీవితాన్ని ఆశావహ ధృక్పధంతోనే చూసే అలవాటు చేసాయి. వ్యక్తిగత జీవితంలోని కష్టాలు కొందరిని నిర్వీర్యుల్ని చేస్తే కొందరిని కార్యోన్ముఖుల్ని చేస్తాయేమో. నళినీ బాలా దేవి కూడా తన జీవితంలోని దుఖాన్ని మర్చిపోవడానికి, తనలోని కవయిత్రిని వాడుకుంది. నిజానికి అదే ఆమెకు జీవనాధారమైంది తండ్రి చనిపోయాకా. ఈ క్రింది నాల్గు లైన్లు చాలేమో జీవితమంటే ఆమెకున్న పాసిటివ్ ఔట్లుక్ తెలియడానికి. “Eyes that wander for unbound beauties of earth, Heart that pines for sweet pleasures of senses, These are not trivial, meaningless in our momentary life; They are steps upwards, For realisation of the self and the Absolute. ఆమె కవిత్వం ఎప్పుడూ రెండు అంశాలని ప్రస్తావించేది. దేశభక్తి, వేదాంతం లేదా తాత్వికత. దేశభక్తి అంటే ఆమెకు మనుషులూ మానవత్వం. ప్రాంతీయ తత్వం లేని దేశభక్తి. రాష్ట్రం, దేశం అనే రాజకీయం లేని దేశభక్తి. జన్మభూమి అనే కవిత ఆమె దేశ ప్రేమకి మచ్చుతునక అని చెప్తారు. ఇంకొంచం విశాల ధృక్పధంతో చెప్పాలంటే ఆమె తాత్విక ధోరణి వల్ల ప్రపంచమంతా ఆమెకు ఒకటే, జగదైక కుటుంబం. ఆమె వేదాంత ధోరణి మత సంబంధమైనది కాదు, విజ్ఞత, జ్ఞానం, అనుభవాల వల్ల వచ్చినది. అలకానంద అనే కవితా సంకలనానికి సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. పల్టన్ బజార్, గువాహాటి లో ఆమె విగ్రహం ప్రతిస్టించారు. కాటన్ కాలేజీ హాస్టల్కి "పద్మశ్రీ నళినీబాలాదేవి గర్ల్స్ హాస్టెల్" అని పేరు పెట్టారు. All India Sanskrit Sanjeevni Sabha ఆమెకు "కాబ్యభారతి" అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆమె ఎన్నో కవితా సంకలనాలు, వ్యాసాలు, రాసింది. ఎందరో ప్రముఖ స్త్రీల జీవితకధలు, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జీవిత చరిత్ర, The Days Passed అనే తన ఆత్మకధ రాసింది. ఆమె రచనల అనువాదాలు ఏమీ లభ్యమవలేదు చదవడానికి, కాకపోతే అస్సామీ భాషలో కూడా ఒక గొప్ప రచయిత్రి గురించి తెలుసుకున్నామన్న సంతోషం మాత్రం ఉంది.     -Sharada Sivapurapu  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కె సరస్వతి అమ్మ

సరస్వతి అమ్మ మొదటి కధ 1938 లో అచ్చయ్యింది. అదే ఆమె ప్రస్థానానికి ప్రారంభం అత్యంత శక్తివంతమైన మొదటి మలయాల స్త్రీవాద రచయిత్రిగా. ఆమె తన కధల ద్వారా పురుషులు ఎలాంటివారో స్త్రీలకి చెప్పే ప్రయత్నం చేసింది. వారితో సమానమైన హక్కులు, జీవితం కావాలంటే స్త్రీలు పురుషులపై ఆధారపడి జీవితాన్ని గడుపుతూ అందులోనే సౌఖ్యం వెతుక్కునే తత్వాన్ని మానుకోవాలనీ, తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే ఇంతకుముందుకన్నా ఎంతో కష్టపడాలనీ చెప్పింది. ముఖ్యంగా ప్రేమ విషయంలో మగవాళ్ళంటే ఆడవారికుండే భ్రమలని తొలగించే ప్రయత్నం చేస్తూ, పితృస్వామ్యం, సాంప్రదాయం మీద దాడి చేసింది. అందుకు ఆమెను పురుష ద్వేషిగా నిందిస్తూ, అప్పటి సమాజం పూర్తిగా ఆమెను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేసింది. అలా ఆమె ఎంత శక్తివంతంగా స్త్రీవాద రచనలు చేసినా ఆమెకు రావలిసిన గుర్తింపు రాలేదు. వ్యక్తిగతంగా తాను పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకుని పట్టభద్రురాలై, గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా చివరివరకూ రచనా వ్యాసంగంతోనే తన జీవితంలోని ఖాళీలను పూరించుకుంది. ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ఆమె కధలని ఎన్నో అమెరికన్ పుస్తకాల్లో ఇష్టంగా చదువుకుంటారంటే చూడండి ఆమెను బయటివారు గుర్తించినా తన రాష్ట్రంలో, దేశంలో ఆమె పేరు మరుగునే ఉండిపోయింది. ఆమె కధలు "Stories from a forgotten feminist” అన్న పేరుతో ఇంగ్లీష్ లోకి అనువదించబడ్డాయి. ఆమె రాసినవి 12 కధా సంకలనాలు, ఒక నవల ఒక వ్యాస సంకలనం (A world in which there are no Men) అచ్చయ్యాయి. సరస్వతి అమ్మ వ్యక్తిగత జీవితానికొస్తే, ఉన్నత నాయిర్ కుటుంబానికి చెందినా, కుటుంబ కలహాలు ఆమెను ఎక్కువగా బాధించేవి. తండ్రి ప్రేమతో చెప్పే కధలు మాత్రమే ఆమె చిన్నతనపు తీపి జ్ఞాపకాలు. ఇవన్నీ చిన్నపుడే ఆమెను సన్యాసినిగా జీవితం గడపటానికి ప్రేరేపించాయి. ఇలాంటి బాధలోనే ఆమె తన గురువుగా భావించే రబింద్రనాత్ ఠాగోర్కి ఉత్తరాలు రాసేదట. ప్రేమ లేని జీవితాల్లో, మనుషుల మధ్య బంధాలు, బాంధవ్యాలు కేవలం ఒక నిరాసక్త ఋణానుబంధమే తప్ప వేరేమీ ఆమెకు కనిపించక ఒంటరి బ్రతుకు వేపు వెళ్ళింది. తన అక్క కొడుకునే ఆమె తన కొడుకులా పెంచుకుంది. కానీ ఆ బంధంతో కూడా కొన్ని సమస్యలు వచ్చి ఆ అబ్బాయి ఆమెను విడిచి వెళ్ళినపుడు, అతని తల్లి కూడా తనని అనుమానించినపుడు, సరస్వతి అమ్మ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయి, తన రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించలేక ఆపేసింది. ఏ సమస్యలైతే ఆమెలోని రచయిత్రిని నిద్రలేపాయో, అలాంటి పరిస్తితులే ఆమె లోని సృజనా శక్తిని చంపేసాయి. 56 ఏళ్ళ వయసులో ఆమె మరణం ఎవరికీ వార్త కాలేదు. కానీ, పురుషులు ఆక్రమించిన డయాస్ పైకెక్కి నేనూ రచయిత్రిని, నేనూ కొన్ని కధలు రాసాను అని ధైర్యంగా నిలబడగల సత్తా ఉంది ఆమెకు. స్త్రీని శీలవతిగా, సావిత్రిగా, ఆమె చుట్టూ ఒక పాతివ్రత్యపు ఆరా (aura) సృష్టించడమో, లేకపోతే పురుషుడి జీవితాన్ని నాశనం చేసే మోహినిగానో స్త్రీని చిత్రించటం తప్ప పురుష రచయితలు చేసిందేంటని ఆమె ప్రశ్నించింది. అయితే ఆమె కోపం, పోరాటం పురుషుడిమీద కాదు, పురుషాధిక్య సమాజం మీద. సమానత్వం, గౌరవం, ప్రేమా ఉన్న స్త్రీ పురుష బంధాలని ఆమె ఆశించింది. అందమైన పురుషుడి ప్రేమ కోసం పరితపించే స్త్రీలను కూడా ఆమె విమర్శించింది. ఒక స్త్రీ సమానత్వాన్నీ, స్వేఛ్చనీ కోరుకుంటే పెళ్ళి అనే బంధంలో పడకూడదని ఆమె భావించింది. ప్రేమికుడుగా ఉన్న పురుషుడు, భర్త కాగానే ఎలా మారతాడో ఆమె తన పాత్రల్లో చూపెట్టింది. స్వతంత్ర పోరాటంలో స్త్రీల పాత్ర ఎంతైనా ఉందని గుర్తించిన ఆ రోజుల్లో, సమాజ పునర్నిర్మాణంలో స్త్రీలు భాగస్వాములవ్వాలంటే, విద్య అతి ముఖ్యమైన అంశమని ఆమె భావించింది. నిజానికి విద్యావంతులైన స్త్రీలకి ఆ రోజుల్లో కనిపించింది, స్త్రీల అణిచివేత, మతం, సాంప్రదాయం పేరిట పురుషాధిక్యత, కుటుంబ జీవనంలో స్త్రీలు ముఖ్య పాత్ర పోషిస్తూ కూడా, ఎందుకూ పనకిరానివాడైనట్లున్న పురుషుడి సేవలో నిరంతరం జీవనం గడుపుతూ కూడా, అత్యంత బలహీనులుగా చిత్రింపబడుతూ మగ్గుతున్న స్త్రీలే కనిపించారు. రచయిత్రులందరూ, స్త్రీవాద రచనలు చేయడానికి ఇదొక ముఖ్య కారణం. ఎన్నో యుగాలుగా సమాజం ఎంతో గౌరవిస్తున్న విలువల్ని ఆమె నిర్భయంగా ఖండించింది. భర్తని అనుక్షణం కనిపెట్టుకుని ఉందాల్సిన, సేవ చెయ్యాల్సిన బాధ్యతని స్త్రీకప్పగించిన సమాజ నీతిని ఆమె ప్రశ్నించింది. దీనికి ప్రతిగా ఆమె రచనలపైనే కాదు వ్యక్తిగతంగా కూడా ఆమెపై విమర్శకులు దాడి చేసారు. పురుషాధిక్యతనెట్లా ఆమె ప్రశ్నించిందో పెళ్ళితోనే తమ జీవితాలకు సార్ధకత అనుకునే స్త్రీల బలహీనతను కూడా ఆమె అంతే నిరసించింది. అసలు స్త్రీవాదం ఇదేనేమో. నిష్పక్షపాతంగా ఆలోచిస్తే, మగవారు మారాల్సిన అవసరం ఎలా ఉందో, ఆడవారు మారాల్సిన అవసరం కూడా అంతే ఉంది. ఇద్దరిలోనూ మార్పు వచ్చినపుడే అది అసలైన స్త్రీ పురుష సమానత్వానికి దారి వేస్తుంది. ఆమె కధల్లో భావోద్వేగాలకి సంబంధించిన అంశాలకన్నా మేధస్సుకి సంబంధించిన అంశాలే ఎక్కువని విమర్శకుల వాదన. ఆమె పురుష ద్వేషి కాదు, అందుకు భిన్నంగా స్త్రీలు యుగ యుగాలుగా తమ ఆత్మలకు వేసుకుంటున్న బానిసత్వపు సంకెళ్ళను తెంచే ప్రయత్నం చేసింది. ఆమె కధల్లోని స్త్రీ పాత్రలు తమ జీవితాల్లో స్వేఛ్చని కోరుకుంటాయి, జీవన సాఫల్యతనీ, సార్ధకతనీ కోరుకుంటాయి. అయితే ఇలాంటి పాత్రలు కేవలం ఊహాజనితమే, వివాహ వ్యవస్థకి బలయిన స్త్రీలే కాని, అప్పుడున్న సమాజంలో అలాంటి స్త్రీలు ఆమెకు కనపడలేదు. అందుకే ఒక స్త్రీ తనను మగాడు అర్ధం చేసుకోవాలని ఆశించటంకన్నా తనను తాను అర్ధంచేసుకునే ప్రయత్నం చెయ్యాలంది. మలయాల సాహిత్య ప్రపంచంలో, తరవాత మాధవికుట్టీ లాంటి రచయిత్రులకి దారి చూపిన ఈమె స్త్రీ వాదానికి కొత్తర్ధం చెప్పినట్టనిపిస్తుంది. Marriages are Made in Heaven అనే కధలో, మాధవి తల్లి తండ్రులు తమ కూతుళ్ళకు కట్నమిచ్చి అల్లుళ్ళను కొనుక్కోకూడదని నిశ్చయించుకుంటారు. ఇదేదొ ఆశయం కోసం కాదు, అంత డబ్బు తేలేక. నేను కట్నం తీసుకోలేదు అలాగే నా కూతుళ్ళకూ ఇవ్వను అని, నిజంగా అందరికీ కట్నమిచ్చి పెళ్ళి చేసే పక్షంలో అడుక్కుతినవల్సి వస్తుందని అనుకుంటారు. పెళ్ళి అయ్యే సమయం వస్తే వరుడు వెతుక్కుంటూ వస్తాడని నమ్ముకుంటారు. కాని నలుగురు ఆడపిల్లలూ 15 ఏళ్ళ వయసు దాటి పెరిగినా వరుడు రాడు. ఎదిగిన ఆడపిల్లలున్న ఇళ్ళు తేలిగ్గా నిప్పంటుకుంటాయని సామెతట. అయితే నిప్పు ఇంటికి కాదు తల్లి తండ్రుల గుండెలకు మాత్రం ఖచ్చితంగా అంటుకుంటుంది. ఈ పరిస్తితిలో చేసేది లేక పెద్ద పిల్లయిన 23 ఏళ్ళ మాధవికి కట్నం 200 రూపాయలనుంచీ బేరమాడి చివరకు 500 రూపాయలకు కుదుర్చుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మధ్యవర్తి ద్వారా బేరసారాలన్నీ కుదిరాకే పెళ్ళి చూపులకు వస్తారు. వివాహం చేస్తారు. అప్పట్నుంచి మాధవికి అత్తగారు, ఆమె మాట దాటని భర్త నుంచి కష్టాలు మొదలవుతాయి. వివాహం జరిగిన కొద్ది రోజులకి మాధవి తండ్రి వచ్చి, మాధవి వేస్కున్న నగలు తీసి ఇవ్వమంటాడు. వీరి మాటలు విన్న అత్తగారు నగలతో బాటు మాధవిని కూడా తీస్కెళ్ళిపోమంటుంది. ఏమీ చెయ్యలేక తండ్రి వెనక్కి వెళ్ళి భార్యకి విషయం చెప్తాడు. ఆమె ఉపాయంతో, కొత్త (గిల్టు) నగలు చేయించి, మాధవి అత్తగారి ముందే ఆమెకు వేసి, పాత నగలు తీస్కెల్తారు. అయితే కొద్ది రోజుల తరవాత మాధవిని భర్త మామగారింట దిగబెట్టి వెళ్తాడు, మర్నాడు తీసుకువెళ్తానని చెప్పి. కాని నెలలు గడిచిన ఆ మరునాడు రాదు సరికదా, అతను వేరే అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. అంతే కాకుండా పెళ్ళిచూపుల్లో మాధవిని కాకుండా ఇంకో అందమైన అమ్మయిని చూపి వాళ్ళని మోసం చేసారని నింద వేస్తారు. మాధవి తల్లి తండ్రులు ఈ విషయం కోర్టులో తేల్చుకోవాలని అనుకుంటుండగా, గ్రామ పెద్దలు పంచయితీ పెడతారు. తేల్చాల్సిన విషయం పెళ్ళి చూపుల్లో వారు చూసింది మాధవినా కాదా అని. మాధవి తల్లి దేముళ్ళకు మొక్కుకుంటూ ఉంటుంది, కేసు గెలవాలనీ, ఓడిపోతే తాము చేయించిన నకిలీ నగల విషయం అందరికీ తెలుస్తుందేమోనని భయపడుతుంటుంది. విచారణలో మాధవి పెళ్ళిచూపులకు వచ్చిన వారు ఏ రంగు బట్టలు వేస్కున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఏమేం మాట్లాడారు, ఏమేం పిండివంటలు ఎవరు ఎన్ని సార్లు వేయించుకున్నారు లాంటి విషయాలతో సహా చెప్పేసరికి కాదనలేక నిజం ఒప్పుకుంటారు. చివరగా గ్రామ పెద్ద అంటాడూ, ఇంత తెలివైన పిల్లకి పెళ్ళి చేసే బదులు చదువు చెప్పిస్తే బాగుండేది కదా అని. ఉన్నతమైన ఆశయాలున్న మనుషులు కూడా సమాజంలో ఉన్న పరిస్తితులకి ఎలా లొంగిపోవాల్సొస్తుందో, ఎలా దిగజారాల్సొస్తుందో ఆమె చూపిస్తుంది. స్వర్గంలోనే నిర్ణయింపబడతాయనే పెళ్ళిళ్ళు, ఎంత వ్యాపారం, బేర సారాలు జరుగుతాయో, ఇంటికొచ్చే కోడలికి పెట్టే తిండి కూడా అనవసరపు ఖర్చు కింద జమకట్టే అత్తగారిళ్ళు, ప్రేమ లేని వివాహాలూ దాంపత్యాలూ అన్నిటినీ ఆమె తన కధల్లో ఎండగడుతుంది. ఢెబ్బైల్లోగాని పుంజుకోని స్త్రీవాద సాహిత్యానికి, బలమైన పునాదులు ఆమె వేసినా, అనామకంగానే, ఎవరి మద్దతూ, సహకారం లేకుండా, వ్యకిగత జీవితంలోనూ, సాహిత్య ప్రపంచంలోనూ కూడా ఒంటరి ప్రయాణం చేసి నిష్క్రమించిన సరస్వతి అమ్మను ఈవిధంగా గుర్తు చేసుకోవడం నాకు సంతోషంగా ఉంది. -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కమలా దాస్ మలయాలం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కమలా దాస్ మలయాలం   కమలా దాస్ గురించి చెప్పాలంటే ఆమె ఒక పద్మభూషణ్ ఎవార్డ్ గ్రహీత అయిన తల్లి నాలపట్ బాలామణియమ్మ అనే రచయిత్రికి వారసురాలిగా పుట్టింది. జననం కేరళ లోని త్రిసూర్ డిస్ట్రిక్ట్ లో. మేనమామ నారాయణ మీనన్ ప్రఖ్యాత మలయాల కవి. కనుక కవిత్వం ఆమె రక్తంలోనే ఉంది. తల్లిని ఆమె రచనలనీ అమితంగా ప్రేమించి, సహకరించే తండ్రి. ఇంట్లో అద్భుతమైన వాతావరణం అయినా దురదృష్టం ఆమెని బాల్య వివాహం రూపంలో వెన్నాడింది. 15 ఏళ్ళకి ఒక బేంక్ ఆఫీసర్ని పెళ్ళి చేసుకొంది. అయితే ఇతను మొదట్లో కమల రచనలు చెయ్యడానికి బాగానే ప్రోత్సహించాడు. 15 ఏళ్ళప్పట్నుంచే కమల ఇంగ్లీష్లో పోయెంస్, మలయాలంలో కధలూ రాయడం మొదలు పెట్టింది. 1984 లో నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ కి నామినేట్ అయి షార్ట్ లిస్ట్ అయ్యింది. కేరళ సాహిత్య ఎకాడమీకి, కేరళ ఫోరెస్ట్రీ బోర్డ్కీ చైర్ పెర్సన్ గా ఉంది. చిల్డ్రెన్స్ ఫిల్మ్ సొసైటీకి ప్రెసిడెంట్ గా, ఎడిటర్ పొయెట్రీ మేగజిన్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పొయెట్రీ ఎడిటర్ గా కూడా పని చేసింది. ఆమెని మదర్ ఒఫ్ మోడర్న్ ఇంగ్లీష్ పొయెట్రీ అని కూడా అంటారు. కమలా దాస్ డిగ్రీ కూడా పూర్తిచెయ్యని ఇంగ్లీష్ రచయిత్రిగానే ఉండిపోయారు. తరవాత poetry అధ్యయనం చెయ్యడానికి చాలా దేశాలు, పేరుపడ్డ Universities తిరిగారు అది వేరే సంగతి. కమలా దాస్ syndicated colouminst కూడా. ఇంకా ఎన్నో Awards including Sahitya Acadamy Award 1985 ( Her maiden volume “The Summer in Calutta) కి, Kerala Sahitya Academy Award గెలుచుకున్నారు. ఇతర Awards వివరాలు. Asian Poetry Prize-1998 Kent Award for English Writing from Asian Countries-1999 Asian World Prize-2000 Ezhuthachan Award-2009 Sahitya Academy Award-2003 Vayalar Award2001 Kerala Sahitya Academy Award-2005 Muttathu Varkey Award కేరళ రాయల్ ఫామిలీకి చెందిన ఈమె 65 ఏళ్ళ వయసులో 38 ఏళ్ళ ముస్లిం యువకుడిని పెళ్ళి చేసుకోవడానికి మతం మార్చుకుని కమలా దాస్ సురయ్యా గా పేరు మార్చుకుంది. పైగా మతం ఇచ్చే ప్రొటెక్టివ్ ఫీలింగ్ కోసం తను మతం మార్చుకుని బురఖా వేస్కున్నాననడం అదీ 65 ఏళ్ళ వయసులో మొదటినుంచీ కూడా ఉన్న చపల చిత్తాన్ని సూచిస్తుందేమో. మతం మార్చుకుని చాలా విమర్శకీ, నిందలకీ గురయ్యింది. వివాహ బంధంలో దొరకని పరిపూర్ణమైన ప్రేమనీ, అనుభూతినీ వెతుక్కుంటూ సాగిన ఆమె వివాహేతర సంబంధాలనీ, దేన్నీ ఆమె ప్రపంచం నుంచి దాచలేదు. ఈ కారణంగా ఆమెకూ ఆమె రచనలకూ తీవ్రమైన ఏవగింపుతో కూడిన స్పందనా అదే సమయంలో ఆమె నిజాయితీని, నిర్భీతినీ కొనియాడే విమర్శకులనూ, పాఠకులనూ ఆమె పొందింది. ఈమె గురించి చదువుతుంటే నాకు చలం గారు గుర్తుకు వస్తారు. వారి వారి వ్యక్తిగత జీవితాలు వదిలేస్తే, వారి రచనల వల్ల అణిచిపెట్టిన స్త్రీ లైంగికత, స్వేఛ్చ లేని జీవితాల్లో మగ్గుతున్న స్త్రీలు తాము కోల్పోతున్న దేంటో తెలుసుకునేందుకు నిశ్చయంగా సహాయపడ్డాయనయితే చెప్పొచ్చు. అయితే ఒక ఫెమినిస్ట్ గా ఆమెను ఆమె ఎప్పుడూ అభివర్ణించుకోలేదు. కమలా దాస్ గారి extremely, self analysing and daring expression of her sexualityకి ఎంతమంది admirers ఉన్నారో అంత మంది critics కూడా ఉన్నారు. మొదంట్నుంచి చివరవరకూ కమలా దాస్ రాసిన poetry అంతా direct గానో అంతర్గతం గానో sex, love, erotism and its associated guilt గురించి ప్రస్తావిస్తూ ఉంటాయి. My Grandmother's House అనే పొయెం లో ఆవిడ అడుగుతుంది ...... “you cannot believe, darling, Can you, that I lived in such a house and Was proud, and loved…. I who have lost My way and beg now at strangers' doors to Receive love, at least in small change? “ అని. భార్య తన sexual preferences ని భ ర్తతో కూడా పంచుకోలేని timesలో ఆవిడ పొయెంస్ కొన్ని (The Maggots, The looking Glass) bold attemptsఅని చెప్పొచ్చు. Sexపరంగా స్త్రీ స్వేచ్చని మగవాడు శాసించే పితృ స్వామ్య సమాజం మీద ఆవిడ ధ్వజమెత్తుతుంది. The maggots అనే పొయెం లో రాధ తిరస్కృత మనోగతాన్ని ఆవిష్కరించడం ద్వారా దేవతా మూ ర్తులకీ అలాంటి భావాలున్నపుడు సాధారణ స్త్రీలందరికీ అలాంటి భావనలు కలగడం చాలా సహజం, అభ్యంతరకర మైనది కాదు అన్న విషయాన్ని ఆవిడ చాలా strong గా ప్రతిపాదించుతుంది. అయితే sexuality ఒకటే స్త్రీల సమస్యా? వారికి ఇతర సమస్యలు లేవా అన్నది Critics వాదన. ఒక మలయాల పత్రికలో సీరియల్గా వచ్చిన ఆమె అత్మ కధ "ఎంటె కధా" మొదలయిన 15 రోజుల్లోనే ఆ పత్రిక సర్కులేషన్ని 50,000 కాపీలు పెంచేసి పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. చాలా ఆసక్తి కిలిగించే సబ్ హెడింగ్స్తో రాసేదట. అయితే అందులోని నిజాలు తట్టుకోలేక ఆమె దగ్గర బంధువులు ఆ ప్రచురణ ఆపెయ్యాలని విపరీతంగా ప్రయత్నించారట కానీ కమల ధైర్యంగా నిలబడి రచన కొనసాగించిందట. మై స్టోరీ అని ఇంగ్లీషులో రాసినది మలయాలంలోకి ఆమే అనువదించింది. అయితే ఆమె తన కధలో చాలా కల్పన కూడా ఉందని తరవాత అంగీకరించింది. ఆమె మలయాలంలో ఎన్నో నవలలు, కధా సంకలనాలు, వ్యాసాలూ రాసింది. ఆమె వ్యాసాలు రాజకీయాల్నుంచి, కరెంట్ ఎఫ్ఫైర్స్, మలయాలీ ఆడవారికి బ్యూటీ టిప్స్ వరకూ ఇదీ అదీ అని లేకుండా దేని మీదైనా రాసేదట. ముఖ్యంగా ఆమె రచనలన్నీ కవిత్వం, కధలూ నవలలూ, ఇంకా మెమోయిర్స్ అనే మూడు ప్రక్రియల్లోనూ ఉంటూ ఎంతో ఎఫ్ఫెక్టివ్ గా ఉండేవట. ఇంగ్లీషులో ఎన్నో కవితా సంకలనాలూ, ఆమె ఆటో బయొగ్రఫీ రాసింది. ఆమె కధల్లోని స్త్రీ పాత్రలు, పురుష సమాజం వేసిన ముగ్గులో అలంకార ప్రాయంగా కూర్చునే గొబ్బెమ్మలు కారు. ప్రేమలోనైనా, భక్తిలోనైనా, పరాకాష్టకి చేరడానికి, జీవన సాఫల్యం కోసం పితృస్వామ్య సమాజం స్త్రీకి గీసిన లక్ష్మణ రేఖల్ని దాటుకుని, తమని బంధించిన వంట గృహాల పొగచూరిన పఠిష్టమైన గోడల్ని చేదించుకుని తాము కోరుకున్న జీవన శైలినవలంభించగల ధైర్యం గలవి. అందుకే మగాడెటూ తిరుగుబోతు, ఆడది కూడా తిరుగుబోతయితే, ప్రస్తుత పురుషాధిక్య సమాజంకి మూలస్థంభమైన కుటుంబ వ్యవస్థ ఏమైపోవాలని సంప్రదాయవాదులంతా ఆమెని దుమ్మెత్తి పోసారు. సాండల్ ట్రీస్ అని ఇంగ్లిష్లో నెట్లో లభ్యమవుతున్న కధ ముఖ్యంగా ఇద్దరు స్త్రీ పాత్రమధ్య నడుస్తుంది. సంతోషం లేకపోయినా దాంపత్య జీవితంలో చివరి వరకూ భర్తతో కలిసే ఉన్న ఒక స్త్రీ, పోటీకి వెళ్తే ఆదర్శ దంపతులుగా సమాజం భావించి గెలిపించే దంపతులు ; వర్సెస్ ఆమె స్నేహితురాలుగా చిన్నప్పటినుంచి ఉంటూ ఈమె పట్ల శారీరిక ఆకర్షణ కూడా ఉండి జీవితాంతం కలిసి గడపాలనుకునే ఆ స్నేహితురాలు ; చివరకు ఆ స్నేహితురాలె ఆమె తండ్రికి ఇంకొక స్త్రీ ద్వారా పుట్టినది అనీ, తన భర్త కూడా ఆమెను ప్రేమ బిక్ష పెట్టమని కోరాడని తెలిసాకా, అంతవరకూ జీవితంలో సంతోషం లేకపోయినా, దాంపత్యం వల్ల పిల్లలు లేకపోయినా, తనకంటే 21 ఏళ్ళు పెద్దయిన భర్తని ఎప్పుడూ భర్తలా అంగీకరించలేక అతనంటే ఏవగింపూ, అసహ్యం ఉన్న ఆమెకు, తన స్నేహితురాలికంటే తను మెరుగ్గా ఉందని అనుకుంటూ వచ్చిన ఆమె, అందగాడైన, ప్రేమించే భర్త నుంచి విడాకులు తీసుకుని, ఇంకొక డబ్బున్న ఫారినర్ని పెళ్ళి చేసుకుని అతను చనిపోయాకా మళ్ళా ఇండియా వచ్చి ఇంకొ పెళ్ళి చేసుకుని పిల్లలతో ఉన్న మాజీ భర్తను మళ్ళీ కలవాలనుకున్న, ఒకప్పుడు తన మీద ఆర్ధికంగా ఆధరపడిన స్నేహితురాలు ఇప్పుడు బాగా డబ్బున్న విడొవర్ అయికూడా తన కన్నా అందంగా, చిన్నదానిలా కనిపిస్తుంటే, తను జీవితంలో పొందిందేంటొ తెలియక బాధపడుతుంది. చాలా విలక్షణమైన థీం, కధ నడిచే విధానం ఎంతో కొత్తగా, ఆడవారి జీవితంలో ఉండే రొటీన్ కష్టాలు కాకుండా, కధా, కధలోని పాత్రలూ ఎక్కడా అనుచితంగా, అసహజంగా ప్రవర్తిస్తున్నట్లు లేకుండా, ఏకబిగిని చదివించింది. అందుకే ఆమె వ్యక్తిగత జీవితంపై ఎంత విమర్శ ఉన్నా ఒక రచయిత్రిగా ఆమె ప్రతిభని మెచ్చుకోకుండా ఉండడం కష్టమయ్యింది పాఠకులకి.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? త్రివేణి కన్నడ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?  త్రివేణి కన్నడ   కన్నడ సాహిత్యంలో ఆధునిక నవలా ప్రక్రియలో రాసిన రచయిత్రుల గురించి చెప్పుకోవాలంటే త్రివేణి పేరుతో మొదలెట్టకపోతే అది సంపూర్తి కాదు. స్త్రీల సమస్యలను, వారి మానసికతను మొదటిసారిగా ఆవిష్కరించిన రచయిత్రి. ఆమె 35 ఏళ్ళ చిన్ని జీవితంలో చేసిన రచనలతోటే ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె రాసిన నవలలు ఎన్నో కన్నడలో సినిమాలుగా తీసారు. వాటికి ఉత్తమ చిత్ర పురస్కారాలు కూడా వచ్చాయి. 1928 లో మైసూరు రాజ్యలోని మాండ్యలో పుట్టింది. గోల్డ్ మెడల్తో బీ ఏ పట్టా పుచ్చుకుంది. ఎస్ ఎన్ శంకర్ అనే ఇంగ్లీష్ ప్రొఫెస్సర్ని వివాహం చేసుకుంది. ఆమె అసలు పేరు అనసూయ. త్రివేణి అనేది కలం పేరు. ఆ పేరు కూడా, తమాషాగా వచ్చి, అలా స్థిరపడిపోయింది. ఆమెకెప్పుడూ రెండు జడలు వేస్కునే అలవాటట. కాకపోతే రెండుకాదు మూడు జడలు వేస్కునేంత జుట్టు ఉంది నీకు అని అంటే ఆమె అప్పట్నుంచి త్రివేణి అనే పేరుతో రాయటం మొదలుపెట్టిందట. ఆమె ఒక ఇరవై నవలలు, మూడు కధా సంకలనాలు రాసింది. నవలల్లోని స్త్రీ పాత్రలు అన్నిటిలోనూ వాటి మానసిక సంఘర్షణల్నీ, విభిన్న పరిస్తితులు వాటిపై ఎటువంటి మానసిక ప్రభావాన్ని చూపిస్తాయి, మానసిక సంతులనం కోల్పోయిన స్త్రీలపట్ల వారి చుట్టూ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న అంశాలని ఆమె స్పృశించే తీరు అత్యంత ఆకట్టుకునే విషయమే కాకుండా అది ఆమె ప్రత్యేకత కూడా. బెల్లి మోడ అనే నవలలోని హీరో మోహన్ కు ఇందిర అనే అమ్మాయికి పెళ్ళి కుదురుతుంది. ఇందిర తన తండ్రి ఎస్టేటు బెల్లి మోడకు వారసురాలు. మోహన్ ఫారిన్లో చదువుతుంటాడు. ఇందిరను పెళ్ళిచేసుకుంటే, ఆమె తండ్రి తరవాత తనే వారుసుడినవుతానని అతనికి ఆశ. కానీ అతను చదువు ముగించుకుని వచ్చే సరికి ఇక్కడ పరిస్తితి తారుమారవుతుంది. ఇందిర తల్లి ఒక మగ బిడ్డని ప్రసవించి చనిపోతుంది. ఇక ఆస్తి తనకు రాదు కాబట్టి, మోహన్ ఇందిరను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. అయితే ఆతరవాత మోహన్ కి ఏక్సిడెంట్ అవుతుంది, అప్పుడు ఇందిరే అతనికి సేవ చేస్తుంది. అప్పుడు అతనికి ఇందిరపై నిజమైన ప్రేమ కలుగుతుంది. వివాహం చేసుకుంటానని అడుగుతాడు. కానీ ఇందిర నిరాకరిస్తుంది, అతని ప్రేమ తన డబ్బు మీద కానీ తన మీద కాదని. ఈ రకమైన ముగింపు కధకి, అందులోని స్త్రీ పాత్ర ఔదార్యాన్నీ, విచక్షణనీ ఎంతో చక్కగా ఎత్తి చూపుతుంది. మంచాన పడ్డ అతనికి సేవ చెయ్యడం మానవతా దృక్పధమైతే, వివాహాన్ని నిరాకరించడం తన స్వేఛ్చనీ, స్వతంత్రాన్నీ వదులుకోకుండా, వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని తీస్కునే నిర్ణయం, ఇందిరకున్న మానసిక పరిపక్వతని సూచిస్తుంది. కల్ల బొల్లి కబుర్లు చెప్పే మగవాడిని నమ్మి మోసపోయి దుర్భరమైన జీవితాన్ని గడిపే స్త్రీ పాత్ర అమాయకత్వాన్నీ చదివి చదివి ఉన్న పాఠకులకి ఇదొక గొప్ప ఊరడింపు. శరపంజర అనే నవలలో కావేరి, సతీష్ అనే హీరో హీరొయిన్లు ప్రేమించి తల్లితండ్రుల అనుమతితో పెళ్ళి చెసుకుంటారు. డబ్బు, అందం చదువు, ప్రేమా ఉన్న ఈ దాంపత్యం కావేరి రెండోసారి గర్భవతి అయ్యేవరకు బాగానే సాగుతుంది. బలహీనంగా ఉన్న కావేరికి ఈ కానుపు కష్టం కావచ్చని, జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టరు చెబుతుంది. కావేరికి తనను పెళ్ళికి ముందు బలవంతంగా అనుభవించిన విషయం ఒకటి గుర్తుకొచ్చి మానసికంగా వ్యధచెందుతుంటుంది. చివరికి కొంత మానసిక సంతులత కోల్పోయిన కావేరిని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు. ఆస్తితిలోనే ఆమె తన భర్తకి తనకిష్టం లేకుండా, జరిగిన ఆ సంఘటన గూర్చి చెప్తుంది. చివరికి పిచ్చి కుదిరి ఇంటికి తిరిగి వచ్చినా, భర్త ఆమె చెప్పిన విషయాన్ని మర్చిపోలేక ఆమెకు దూరమవుతాడు. పిచ్చాసుపత్రినించి ఇంటికి వచ్చాకా, చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లోని పనివాళ్ళు కూడా ఆమె పట్ల చిన్నచూపు చూపిస్తుంటారు. ఇంతే కాకుండా భర్త వెంటపడితే గతంలో చీకొట్టిన ఒక అమ్మాయితోనే భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం కావేరిని బాధిస్తుంది. ఈ మానసిక సంఘర్షణ తట్టుకోలేక ఆమెకు మళ్ళీ పిచ్చెక్కి అదే ఆసుపత్రిలో చేరుతుంది. ఈపాటికి అందరికీ అర్ధమయ్యే ఉంటుంది ఇదే మన తెలుగులో వాణిస్రీ నటించిన కృష్ణవేణి సినిమా అని. కన్నడలో ఈ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేషనల్ ఎవార్డ్ వచ్చింది. ఇంకా ఎన్నో ఇతర ఎవార్డ్స్ కూడా వచ్చాయి. భార్య శీలవతి అయుండాలని కోరుకునే భర్త తను మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా అక్రమ సంబంధం పెట్టుకోవడం, కావేరి మానసిక సంఘర్షణ చిత్రించే తీరు అద్భుతం. ఈ సినిమా కన్నడలో కొన్ని థేటర్లలో సంవత్సరం పాటు ఆడిందట. ఈమెవి ఒక ఆరు నవలలు సినిమాలుగా తీసారు. ఇంకొక రచయిత్రి పరిచయంతో మళ్ళీ వచ్చే వారం.   -Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కృష్ణ సోబ్తీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కృష్ణ సోబ్తీ హింది   ద గ్రాండ్ డేం అఫ్ హిందీ లిటరేచర్ గా పేరు పొందిన రచయిత్రి కృష్ణ సోబ్తీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో పుట్టింది. హష్మత్ అనే కలం పేరుతో కూడా రాసేది. ఆమె రాసిన ప్రతి కధా, నవలా సాహిత్య ప్రపంచంలో ఓ ముఖ్య సంఘటన అయిపోయేదిట. ఈరోజుల్లోలాగా ఇంత పబ్లిసిటీ స్టంట్లు అప్పుడు లేవు గానీ ఆమె కోరుకోపోయినా, కావాలని చేయకపోయినా ఆమె సృష్టించిన ప్రతి స్త్రీ పాత్రా ఒక స్వేఛ్చ కోరుకునే వ్యక్తిగా తనకు నచ్చిన జీవితాన్ని కావాల్సినట్టుగా మలుచుకోగల పాత్రలు. మరి సహజంగానే అలాంటి పాత్రలు వివాదాస్పదమవుతాయి. పార్టీషన్లో భూములన్నీ పాక్ లోని పంజాబ్లోకెళ్ళిపోతే కృష్ణ గవర్నెస్ గా చేరింది అప్పటి మౌంట్ ఆబూ మహరాజా అయిన తేజ్ సింగ్ కి. రెండేళ్ళ తరవాత ఢిల్లి అడల్ట్ లిట్రసీ ఎడ్మినిస్టేషన్లో ఎడిటర్గా చేరింది. ఇరవయ్యొవ శతాబ్దం స్త్రీ రచయిత్రులకి చెందింది. పురుషాధిక్యతని, కుటుంబ పరిధుల్ని, సామాజిక ఆంక్షల్ని దాటుకుని తమ బాధల గాధల్ని, స్త్రీల పట్ల పురుష సమాజ దాస్టీకాల్ని, సంస్కృతి సంప్రదాయాల పేరిట జరిగే అన్యాయాల్నీ వారిదైన శైలిలో, ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నంలో మొత్తం ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకోవడంలో స్త్రీ రచయిత్రులు విజయం సాధించిన శతాబ్దమిది. ఇది ఒక్క భారత దేశానికి సంబంధించిన విషయమే కాకుండా ప్రపంచం మొత్తంలో స్త్రీ రచయితలికి సంబంధించిన విజయం. వారి వారి భాషల్లో అద్భుతమైన రచనలు చేసిన ఆషాపుర్ణా దేవి, మహాస్వేతా దేవి, కమలా దాస్, అమృతా ప్రీతం, అనితా దేశాయ్,కుర్రతుల్ ఐన్ హైదర్, ఇస్మత్ చుగ్తయ్, శివాని, శోభా డే లాంటి లింగ వివక్షని ఛేదించి తమకంటూ ఒక పేరు ఏర్పరుచుకున్న రచయిత్రుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రచనలు భావితరాల రచయిత్రులకి స్పూర్తిదాయకం అయ్యాయంటే అందులో అతిశయోక్తి లేదు. హింది అత్యంత ఎక్కువమంది పాఠకులున్న భాష. ఆమె రచనలలో, అత్యంత ఆసక్తి కరంగా ఇండియా పాకిస్తాన్ విభజన ముందు పంజాబు గ్రామీణ వాతావరణంలో రైతుల జీవితాలను ఆవిష్కరించిన రచయిత్రి. సామాన్యుల జీవితాల్లో కొట్టుకున్న అప్పటి కాలం నాడిని ఒడుపుగా పట్టుకుని పాఠకుల ముందుంచడల్లోనూ, వారి కధలను చెప్పడంలో తను సృష్టించిన పాత్రల పట్ల సానుభూతిని చూపిస్తూనే రచయిత్రిగా తన వ్యక్తిత్వాన్ని విడిగా చక్కగా కాపాడుకోగల నేర్పూ ఆమె రచనల్లో కనపడుతుంది. 1958 లో ఆమె మొదటి నవల అచ్చయ్యేటప్పటికే క్రిష్ణ మంచి షార్ట్ స్టోరీ రైటర్ గా పేరు తెచ్చుకుంది. ఇతర రచయితలు రాయడానికి వెరచిన అంశాలన్నిటిమీదా ఆమె చాలా బలంగా రాసింది. స్త్రీవాదం పరిధిలో మనకు తెలిసిన అర్ధంలో ఆమెను స్త్రీవాద రచయిత్రిగా ముద్ర వెయ్యడానికిలేదు. స్త్రీవాదం ఇంకా బలం పుంజుకోని అరవైల్లోపలే ఆమె ఒక బలమైన గొంతుకగా స్థిరపడింది. ఆమె సృష్తించిన పాత్రలన్నీ చాలా విలక్షణమైనవె. మిత్రొ మరజానీ అనే నవలలో మిత్రొ ఒక తండ్రి లేని పిల్ల. తల్లి పెంపకంలో ఏవిషయమైనా నిస్సంకోచంగా తన ఆభిప్రాయాలని వ్యక్తపరచడానికి అలవాటుపడుతుంది. ఆ అమ్మాయి, పెళ్ళి తరవాత ఒక మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో ఉన్నా కూడా, తన తోటికోడలు ఎంతో గుణవంతురాలిగా ఉన్న నేపధ్యంలో కూడా తన లైంగికపరమైన కోరికలు తీర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించని ఒక స్త్రీ పాత్ర. ఈనవల ఆరోజుల్లోనే కాదు ఇప్పటికీ చర్చించబడుతూనే ఉంటుందట. డార్ సే బిచూరి అనే కధలో పాషొ అనే అమ్మాయి తన వాళ్ళనుంచి బలవంతంగా వేరుచేయబడి, మానభంగం చేయబడి, ఆ తరవాత పశువులా పోరాటాల్లో నలుగుతున్న ఆఫ్ఘనిస్తాన్లో అమ్మబడినా చివరకు బ్రతుకుతుంది తను కన్న బిడ్డను సాకడానికి. ఇది దేశం, మత సరిహద్దుల్ని దాటి, మన దేశ విభజన తరవాత కేవలం ఒక మతానికి చెందడం వల్ల స్త్రీలు ఎన్ని అత్యాచారాలకు గురయ్యారో, ఇలాంటి ఘర్షణలు స్త్రీల జీవితాల్ని ఎంత నరక ప్రాయం చేసాయో చెప్పే కధ. తల్లీ కూతుళ్ళ మధ్య సంభాషణలా సాగే ఒక కధలో, కూతురికి తల్లి చేసినవన్నీ తప్పుల్లానే కనిపిస్తాయి. అలాంటి తప్పుల్ని తను తన జీవితంలో మాత్రం చెయ్యననుకుంటుంది. కానీ చిత్రంగా ఆమె తన జీవితంలో తల్లి ఇరుక్కున్నలాంటి పరిస్తితిలోనే తానూ ఇరుక్కుంటుంటుంది. ఆమె చూపెట్టిందెపుడూ, ఉత్సాహంతో, ధైర్యంతో, స్వేఛ్చగా జీవించాలనుకునే స్త్రీని, సమాజం స్త్రీకి గీసిన సరిహద్దుల్ని లెక్కచేయని, భర్త కోపాన్నీ, అత్తగారి ఆరళ్ళని పట్టించుకోని స్త్రీని, పెళ్ళి పిల్లల్ని కనడం ఇవన్నీ కూడా తనకున్న నిర్ణయాధికారాలని నమ్మి, తన ఇష్టప్రకారం చెయ్యాలనుకునే ఒక స్త్రీని. ఇలా చెప్పాలంటే ఆమె ప్రతి నవల, కధా ఇతివృత్తాలు అతి విలక్షణంగా శక్తివంతంగా, అతి మితమైన భాషలో చెప్పబడి నిజ జీవితానికి అతి దగ్గరగా ఉంటాయట. ఆమె రచనలు చాలా ఇంగ్లీష్ లోనూ లభ్యమవుతున్నాయి. చదవచ్చు. ఆమె కధలూ, నవలలూ ఎన్నో ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబు భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆమె మాటల్లో చెప్పాలంటే " I have always been my own person. It is easier to exaggerate or simplify the difference between people. My biological history says I am a woman. History and individuals cannot ignore each other. I believe that your individuality embraces our innermost uniqueness. And this individuality could be qualitatively different from person to person, not necessarily from male to female. I am a writer who happens to be a liberal, middle class woman. I need to have my freedom for the smooth flow of my creativity. I see in myself a creative writer who has total commitment to her creativity and art." అందుకనే ఆమెను ఫెమినిస్ట్ అనే చట్రంలో బంధించలేము. జిందగీనామా అనే నవలకి, సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. 1996 లో సాహిత్య ఎకాడమీ ఫెల్లోషిప్ వచ్చింది. శిరోమణి ఎవార్డ్ 1981 లో, హిందీ ఎకాడమీ ఎవార్డ్ 1982 లో, షలాకా ఎవార్డ్ హింది ఎకాడమీ, ఢిల్లీ వారిది 2008 లో, ఆమె నవల సమయ్ సర్గం కి వ్యాస సమాన్, కె కె బిర్ల ఫౌండేషన్ వారిచ్చినది వచ్చాయి. ఆమెకు మొట్టమొదటి కధా చూడామణి ఎవార్డ్ 1999 లో వచ్చింది ఆమె చేసి సాహితీ సేవకు గుర్తింపుగా. ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఉంది క్రిష్ణ సోబ్తీ గురించి చెప్పడానికి. కవులూ కళాకారులూ సాహిత్య ఎకాడమీ ఎవార్డులనీ ఇతర పురస్కారాలనీ మత అసహనానికీ, వివక్షకీ నిరసనగా తిరిగిచ్చేస్తున్నారు ఇప్పుడు. తిరిగిస్తే ఇచ్చారనీ, అసలెలా వచ్చినవనీ, ఎందుకు పుచ్చుకున్నారనీ, ఇవ్వకపోతే ఇవ్వలేదనీ విర్శలకు గురవుతున్నారు. కానీ క్రిష్ణ సోబ్తీ 2010 లోనే పద్మభూషణ్ ఎవార్డుని తీస్కోవడానికి నిరాకరించింది. పైగా సాహిత్య ఎకాడమీ ఫెల్లోషిప్ ద్వారా తన ప్రతిభకు వచ్చిన గుర్తింపు చాలనీ, తను అలాంటి ఉచ్చుల్లో ఇరుక్కోదల్చుకోలేదనీ నిర్ద్వందంగా చెప్పేసింది.   -Sharada Sivapurapu  

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఇస్మత్ చుగ్తాయ్ - ఉర్దు

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఇస్మత్ చుగ్తాయ్ -ఉర్దు     ఇస్మత్ చుగ్తాయ్ ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి బదయూన్, ఉత్తర ప్రదేశ్ లో పదిమంది పిల్లల్లో తొమ్మిదవ సంతానంగా పుట్టింది. అక్కలందరికీ పెళ్ళిళ్ళయిపోవడంవల్ల ఆమె తన అన్నలతోనే బాల్యాన్ని గడిపింది. ఆమె ధైర్యంగా రాయడానికి కూడా ఆమె పేర్కొనే కారణం అదే. ఆమె అన్న మిర్జా అజీం బైగ్ చుగ్తాయ్ అప్పటికే పేరు తెచ్చుకున్న రచయిత. ఈమెను ప్రోత్సహించి రచయిత్రిగా తీర్చిదిద్దటంలో అతని పాత్ర చాలా ఉంది. ఆమె బి యే ఆతరవాత బి యీ డీ చేసింది. ఆకాలంలో ఆమే మొదటి ముస్లిం స్త్రీ రెండు డిగ్రీలు చదివినది. ఆతరగతులు హాజరవడానికి ఈమె ఈమెతోబాటు ఇంకొద్ది మంది అమ్మాయిలూ, క్లాసులో వెనకాల ఒక పరదా వెనక కూర్చుని పాఠాలు వినేవారట. కేవలం చదువుకోవాలనే ఆశ తీర్చుకోవడం కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళం అని చెప్తుంది. మతసామరస్యం రచనల్లో చెప్పడమే కాదు, తన కూతురిని హిందూ అబ్బాయికిచ్చి పెళ్ళి చేసింది. మా బంధువుల్లో, హిందువులు, క్రిస్టియన్లూ ముస్లింలూ అందరూ ఉన్నారని చెప్పేదట. ఇదంతా ఆమె సంపన్న, విద్యావంతులైన కుటుంబంలో పుట్టడంవల్ల సాధ్యపడుండచ్చు.   తన కాలేజీ రోజుల్నుంచే రహస్యంగా రాయటం మొదలు పెట్టింది. ఎందుకంటే ఆమె చాందసవాద బంధువులందరికీ ఆమె చదువుకోవటమే ఇష్టంలేదు. సమకాలీనులైన కొర్రతులైన్ హైదర్, హిజాద్ ఇంతియాజ్ అలీ, డాక్టర్ రషీద్ జెహాన్లు ఆమెనెంతో ప్రభావితం చేసారు ఆమె చిన్నతనంలో. సమకాలీన సమాజం, ఇంగ్లీష్ పరిపాలన వారి ప్రభావం, హిందూ ముస్లిం సంస్కృతులమీదా, సభ్యతా సంస్కారాలమీదా, ఆమె పెరిగిన వాతావరణం ఇవన్నీ ఆమె రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి.   ఆమె రచనలన్నీ కధలూ, నవలా రూపంలోనే సాగాయి. 1941 లో స్క్రీన్ రైటర్, డైరక్టర్ అయిన షహీద్ లతీఫ్ ని వివాహం చేసుకొంది. ఈయన జిద్దీ, ఆర్జూ లాంటి సినిమాలు తీసాడు. పెళ్ళి తరవాత ఆమె భర్తతో కలిసి సినిమా స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేసింది. జునూన్, ఆర్జూ, జిద్దీ, గరం హవా సినిమాలకు మాటలూ, కధా రాసింది. మై డ్రీంస్ (డాక్యుమెంటరీ), ఫరేబ్, జవాబ్ ఆయేగా సినిమాలకు డైరక్షన్ వహించింది. ఇవన్నీ ఆమె కొచ్చిన ఎవార్డ్స్.       1974: Ghalib Award (Urdu Drama): Terhi Lakeer     1975: Filmfare best Story Award Garam Hawa (with Kaifi Azmi)     1982: Soviet Land Nehru Award     1990 Iqbal Samman (Iqbal Award) from Rajasthan Urdu Akademi for the year 1989   ఆమె రాసిన కధల్లో చాలా కధలు బాన్ అయ్యాయి. ఎందుకంటే జనానా లోని స్త్రీల గురించిన నిజాలు వాళ్ళ లాగానే మరుగున ఉండాలి గానీ జనాలలోకి రాకూడదు. నిజాన్ని శక్తివంతంగా కప్పెట్టి ఆ మురుగులో ఏమీ ఎరగనట్లు, ఏమీ జరగనట్లు నటించే సభ్య సమాజానికి నిజాలు నిక్కచ్చిగా చెప్తే తట్టుకునే శక్తి ఉండదు. ముప్పై ఏళ్ళ వయసులో ఆమె రాసిన లిహాఫ్ ( English: The Quilt) అనే కధ అచ్చయిన వెంటనే ఆ పత్రిక ఎడిటర్కి చాలా ఉత్తరాలు విమర్శిస్తూ వచ్చాయి, అలాంటి కధని అచ్చు వెయ్యడానికి ఎలా ఒప్పుకున్నారని. ఆ తరవాత ఆ కధలో అశ్లీలత ఉందని కేస్ వేసారు. చాలా గొడవ జరిగింది ఇస్మత్ క్షమార్పణ అడగాలని, కధను వెనక్కి తీసుకోవాలని. అయితే ఇస్మత్ ఇందుకు భిన్నంగా కోర్టులో పోరాడడానికే నిశ్చయించుకుని, కేసు గెలిచింది. ఈ కధ ఒకటే కాదు బాన్ అయ్యింది చాలానే ఉన్నాయి. అంగారే అనే కధలో కూడా, ముస్లిం ఆడవాళ్ళు నిఖాబ్ (ముసుగు) వేస్కోవటం పురుషాధిక్యతకీ, పెత్తందారీ సంస్కృతికి చిహ్నమని, అది ఆడవారికి అవమానమనీ రాసినందుకు బాన్ అయ్యింది. ఈ లిహాఫ్ అనేది చిన్న కధ. దీన్ని షార్ట్ ఫిల్మ్ గా కూడా తీసారు. చాలా చక్కని కధ. రచయిత్రి ఒక ఎనిమిదేళ్ళ పాప ద్వారా వుమన్ సెక్సుయాలిటీ గురించి చెప్పే కధ. ఎనిమిదేళ్ళ అమీరణ్ ని వాళ్ల అమ్మ ఒక నవాబ్ భార్య అయిన తన సవతి చెల్లెలు దగ్గర వదిలిపెడుతుంది, తను ఊరెళ్ళినపుడు ఇంట్లో ఉంటే మగపిల్లలతో చేరి అల్లరిగా తిరుగుతుందని. కానీ ఇక్కడ పరిస్తితి చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ఎనిమిదేళ్ళ అమీరణ్ కు. నవాబు తన అందమైన భార్య కేసి కన్నెత్తి కూడా చూడకుండా చుట్టుపక్కల పేద మగపిల్లల చదువు చెప్పించి వారి బాగోగులు చూసే కార్యక్రమంలో మునిగి ఉంటాడు. అయితే అతనికి సమయం దొరకక కాదు గానీ భార్య అంటే ఎటువంటి ఆసక్తి లేక అలా ఉంటాడు. ఇక ఈమెకు అన్ని భోగాలూ ఉన్నా భర్తతో సుఖంలేక అల్లాడుతుంటుంది. ఆమె లెస్బియన్ ఏమీ కాదు గానీ కేవలం మనిషి స్పర్శ కోసం ఆత్ర పడుతుంటుంది. అందుకని ఆమెకు శరీరం మీద ఎప్పుడూ విపరీతమైన దురద, టీలు తాగి తాగి తలనొప్పి ఉంటాయి. చివరికి ఆమెను చూడటానికి వచ్చిన డాక్టర్ కూడా ఆమెను ఆదృష్టితో తాకలేదని బాధ పడుతుంది. అయితే ఆమెకున్న ఒక పనిమనిషి ఈమె ఈ అవసరం తీరుస్తుంటుంది. వీరిద్దరి మధ్య రాత్రి జరిగే వ్యవహారం ఈ పాపకి భయం కలిగిస్తుంది. ఎవరో దొంగలున్నారని భయపడుతుంది. ఇలా ఉండగా ఆ పనిమనిషి ఊరెళుతుంది. ఈమె దురదా అధికమవుతుంది. విషయం తెలియని అమీరణ్ నేను గోకుతానంటూ ముందుకొస్తుంది. అప్పుడు నవాబు భార్య ప్రవర్తించిన తీరు అమీరణ్ కి భయం, కోపం , అసహ్యం, దుఖం పుట్టిస్తాయి. తన తల్లి తనకి ఎంత శిక్ష వేసిందోనని బాధ పడుతుంది. అంతే రాత్రికి రాత్రి తన బట్టలు సర్దుకుని ఒక్కతీ చీకట్లొ వెళ్ళిపోతుంది. కధ మొత్తం విన్నాకా కోర్టుకి కూడా ఇందులో అశ్లీలత లేదని ఒప్పుకోక తప్పలేదు. లిహాఫ్ లాంటి కధలు ఇప్పుడైతే చాలానే చదువుతున్నాము కానీ 1940 ల ప్రాంతాల్లో వచ్చిన కధ. ఇటువంటి విషయాలు మాట్లాడటమే తప్పుగా, ఇబ్బందిగా భావించే రోజుల్లో మరి ఇలాంటి కధ రాయటానికి చాలానే గట్స్ కావాలి ఏ రచయితకైనా. అది ఒక ముస్లిం రచయిత్రి చెయ్యటం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం. ఇంకొక కధలో పెళ్ళి నిశ్చయమయిన ఒక ముస్లిం అమ్మాయి సరిగ్గా పెళ్ళికి ముందు తన హిందు ప్రియుడితో పారిపోతుంది. వారిద్దరూ సివిల్ మేరేజ్ చేసుకుంటారు. తప్పక అబ్బాయి తల్లితండ్రులు వీరిద్దరినీ చేరదీస్తారు. అక్కడ వాళ్ళలో ఒకరుగా కలిసిపోతుంది అంటే మతపరంగా. కొన్నాళ్ళ తరవాత అమ్మాయి తండ్రి వీరింటికి వస్తాడు. జరిగిందేదో జరిగింది ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు భార్యా భర్తలిద్దరినీ. వారి వివాహాన్ని తనిప్పుడు సమర్ధిస్తున్నానని చెప్తాడు. దానికందరూ సంతోషించి వీరిద్దరినీ పంపడానికి ఒప్పుకుంటారు. అయితే తరవాత కూతురికి తెలుస్తుంది తండ్రి తనకి ఘర్ వాప్సీ, భర్తకి మతం మార్పిడీ ప్లాన్ చేసాడనీ ఆ తరవాత ముస్లిం పద్ధతిలో వివాహమూ అని. మనసులో ఇంత ద్వేషం పెట్టుకుని తన తండ్రి పైకి ఎంత మంచివాడుగా నటించాడో తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. అంతే ఇద్దరు తల్లితండ్రులకొక ఉత్తరం రాసి ఎక్కడికి వెల్తున్నారో చెప్పకుండా వెళ్ళిపోతారు. తల్లితండ్రులు తమ పంతం నెగ్గించుకోవడం కోసం పిల్లల దగ్గర కూడా ఎన్ని నాటకాలాడటానికైనా, ఎన్ని అబద్ధాలు చెప్పటానికైనా, తమ మతాన్నీ సంస్కృతినీ కాపాడుకోవటం కోసం అని అనుకుంటూ ఏమైనా చేస్తారని చెప్తుంది. ఆమె అంటుంది కవులందరూ అబద్ధాలు రాస్తారు. అయితే అబద్ధాలని నిజంలాగా ఎంత చాకచక్యంగా రాయగలరనేది వారి ప్రతిభని బట్టీ ఉంటుంది. నిజ జీవితంలోని సంఘటన్లలోంచి సృష్టించే పాత్రలు వారి స్వభావాలు నిజానికి ఎంత దగ్గరగా ఉంటే బాగుంటుందో ఆమెకు తెలుసు. అందుకే ఆమె సృష్టించిన పాత్రలు ఎప్పుడూ కల్పిత పాత్రల్లా ఉండవు. అచ్చంగా మనం చూసే, వినే మనుషుల్లాగానే ప్రవర్తిస్తాయి. నిర్భయంగా మాట్లాడుతాయి. సమాజాన్ని ప్రశ్నిస్తాయి. భుజాలు తడుముకునేట్టు చేస్తాయి. సిగ్గుపడేట్టు చేస్తాయి. అటువంటి సమాజ పోషకుల్ని వారి స్వార్ధాన్నీ తోలు వలిచి నగ్నంగా ప్రపంచం ముందు నిలబెట్టి బెంబేలెత్తేట్టు చేస్తాయి. అందుకే ఆమె రాయటం మొదలు పెట్టినప్పట్నుంచి ఆమెపై ఆమె రచనలపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎంతో కువిమర్శని వెలివేతనీ ఆమె ఎదుర్కొంది. ఆమె మత సామరస్యం గురించి రాయటమే కాదు, జీవించి చూపించింది. ఆమెకు ఖురాన్ ఎంత పవిత్రమో గీత బైబిలు కూడా అంతే పవిత్రమని చెప్పింది.   -Sharada Sivapurapu