డాక్ట‌ర్ సూరం శ్రీ‌నివాసులుకు సాహితీ సిరికోన పుర‌స్కార ప్ర‌దానం

డాక్ట‌ర్ సూరం శ్రీ‌నివాసులుకు సాహితీ సిరికోన పుర‌స్కార ప్ర‌దానం ఉత్తమ సాహిత్య సృజనకు, అధ్యయనానికి అంకితమై కేవలం వాట్సప్ వేదికగానే కాకుండా ఒక సామాజిక మాధ్యమ సాహిత్య అకాడెమీగా రూపుదిద్దుకున్న 'సాహితీ సిరికోన' ప్రతి ఏటా తమ అంతర్జాతీయ వేదికపై ఎంతోమంది రచయితలను ప్రోత్సహిస్తూ పురస్కారాలు అందజేస్తోంది. ప్రతీ ఏటా అత్యుత్తమ కవితకు పురస్కారాన్ని అందించడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ నేపథ్యంలో 2021కి గాను ఈ పుర‌స్కారం ప్రముఖ శతావధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. సూరం శ్రీనివాసులు రచించిన 'ఏటివాలు జ్ఞాపకం' కవితను వరించింది.  కాలిఫోర్నియా బే-ఏరియాలోని గూగుల్ సంస్థ సాంకేతిక నిపుణులు శ్రీ వేణు ఆసూరి గారు తమ మాతృశ్రీ స్మారకంగా ఏర్పాటు చేసిన శ్రీమతి ఆసూరి మరింగంటి సులోచనా రంగాచార్య స్మారక పురస్కారాన్ని, అలాగే 25 వేల నగదు మొత్తాన్ని డాక్ట‌ర్ సూరంకు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో కూడా విలువలు ఉన్న సాహిత్యం వస్తోందని, అలాంటి సాహిత్యాన్ని ప్రోత్సహించడం మంచి విషయమన్నారు. పురస్కార గ్రహీత డా. సూరం వంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని ఈ విధంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రచించిన 'ఏటివాలు జ్ఞాపకం' వస్తువులోనూ, రూపంలోనూ, అభివ్యక్తి నవ్యతలోనూ ఆధునిక  ఉత్తమ మానవీయ కావ్యంగా నిలిచిపోతుందన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆచార్య రాణీ సదాశివమూర్తి  కావ్యాన్ని ఆవిష్కరించి, సిరికోన పక్షాన పురస్కార విజేతను సత్కరించారు. ఇటువంటి ఆధునిక వచన కవితా కావ్యాన్ని ధారావాహికంగా రాయటం అభినందించాల్సిన విషయమన్నారు. తొలిసారిగానైనా, ఏడాది పొడవునా సిరికోనలో ఎన్నో అంశాలమీద అద్భుతమైన కవిత్వం రాసి, అందరి ప్రశంసలు పొందిన  శ్రీ దర్భముళ్ల చంద్రశేఖర్ కు  సిరికోన ప్రత్యేక బహుమతి లభించింది. ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ పూర్వ నిర్దేశకులు, ప్రముఖ నాటక కర్త, డా. దీర్ఘాసి విజయభాస్కర్ పురస్కార గ్రహీతకు రూ. 10 వేల   నగదును అందించి సత్కరించారు.  సంస్కృత విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు  శ్రీ పి.బి.ఎన్. సత్యనారాయణమూర్తి, సుప్రసిద్ధ అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ పురస్కార గ్రహీతలను ప్రశంసించారు. కేంద్ర సమాచార పూర్వ కమీషనర్, ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఆచార్య మాడభూషి శ్రీధర్ సోషల్ మీడియాలో వస్తున్న సాహిత్యాన్ని, దాని తీరుతెన్నుల్ని వివరించారు.  సిరికోన ప్రధాన సంచాలకులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రులు ఘంటశాల నిర్మల, స్వాతి శ్రీపాద  ప్రభృతులు విజేతలకు  అభినందనలు తెలిపారు. చివరగా డా. సూరం కృతజ్ఞతలు తెలుపుతూ, త‌న‌కు ఈ పురస్కారం లభించటం ఎంతో ఆనందంగా ఉందని హర్షానందాన్ని వెలిబుచ్చారు. ఉభయరాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, కెనడాలోని సాహిత్యాభిమానాలు జూమ్ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

త్యాగరాజు

త్యాగరాజు   తెలుగు వాగ్గేయ కారులలో ప్రముఖులు త్యాగరాజు గారు. ఈయన నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చునని నిరూపించిన మహానుభావుడు. ఈయన ప్రకాశం జిల్లా కంభం మండలం లోని కాకర్తలో  1767 వ సంవత్సరం మే 4 వ తేదీన జన్మించారు. కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మల మూడో సంతానం త్యాగరాజు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు వినిపించిన గీతాలే ఈయనను సంగీతం పట్ల ఆకర్షణీయుణ్ణి చేశాయి. వీరు కాకర్ల నుండి తమిళ నాడుకి వలస వెళ్ళారట. త్యాగరాజు తాతయ్యగారు గిరిరాజ కవిగారి దగ్గర త్యాగయ్య  సాహిత్య అధ్యయనం చేసేవారట. తర్వాత త్యాగయ్య గారిని సంగీతాభ్యసము కోసం శొంఠి వెంకటరమణయ్యగారి దగ్గర చేర్చారట. త్యాగయ్య గారి తండ్రిగారు అస్తమించినప్పుడు ఈయన భాగములు కులప్రతిమలైన శ్రీరామలక్ష్మణులు విగ్రహములు వచ్చాయట. ఆ ప్రతిమను అతి భక్తితో పూజిస్తూ...తన యిష్టదైవమైన శ్రీరాములపై క్రుతులు రచించేవారట. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామనామములుజపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందారు. ఈయనకు 18 సంవత్సరాల వయసులో పార్వతి అనే యువతితో వివాహం అయిందట.కానీ ఆమె ఆయన 23 వయస్సులో  ఉండగానే మరణించిందట. తర్వాత త్యాగరాజు గారు ఆమె సోదరి అయిన కమలాంబ అనే యువతిని వివాహం చేసుకున్నారట. వీరికి సీతామహలక్ష్మి అనే కూతురు కలిగిందిట.తమ ద్వారా త్యాగరాజుకి ఒక మనవడు కలిగాడట కానీ యవ్వనంలోకి అడుగు పెట్టకముందే మరణించాడట.  కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొన సాగుతూనేఉంది. చిరు ప్రాయము నుండే త్యాగరాజు నమో నమో రాఘవా...అనే కీర్తన పాడారట.. గురువు శొంఠి వేంకటరమణయ్య గారి ఇంటిలో చేసిన కచేరీ లో దరో మహానుభావులు కీర్తనను పాడారట. ఈ పాటకు వెంకట రమణయ్య గారు చాలా సంతోషించి త్యాగరాజు గారిలోని  బాల మేధావి గురించి తంజావూరు రాజుగారికి చెబితే రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారట. త్యాగరాజు నిధి కన్నా రాముని సన్నిధి సుఖమని ఆ కానుకలని తిరస్కరించారట.  అతని అన్నయ్య జపేవుడు ...త్యాగరాజు నిత్యం పూజించే విగ్రహాలను  కావేరీ నదిలో విసిరేసాడట. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారత యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను తీర్ధములను దర్శించి ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారట. చివరగా శ్రీరామున అను గ్రహంతో విగ్రహాలు పొందారట. వైకుంఠ ఏకాదశి నాడు  త్యాగరాజు శ్రీరామ సన్నిదిని చేరుకున్నాడు. త్యాగయ్య 24 వేల కీర్తనలు రచించారు. త్యాగయ్య ఏ దేవాలయానికి వెళితే అక్కడ దేవుడి మీద కీర్తనలు చెప్పేవారు. అలా చెప్పిన వాటిలో.. 1. జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా 2. సంగీత జానము భక్తి వినా సన్మార్గము గలదే... 3. ఎందరో మహానుభావులు... 4. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి 5. మరుగేలరా ఓ రాఘవా 6. మనసులోని మర్మమును దెలుసుకో... 7. సామజ వరగమనా... 8. ఎంతనేర్చిన ఎంత జూచినా  ఎంతవారలైనా... 9. శాంతము లేక సౌఖ్యము లేదు  లాంటి కీర్తనలు ఎన్నిటితోనో అందరినీ అలరించిన... మహానుభావుడు త్యాగరాజు గారు. 1847 జనవరి 6 వ తేదీన స్వర్గస్దులయ్యారు. అయినా ఆయన కీర్తనలు.... ఎన్నిజన్మలైనా  అలా భద్రంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు... అపారమైనది ఆయన దైవ భక్తి.... అదే ఇచ్చింది ఆయనకు శక్తి... ఆ మహనీయుడి కీర్తనలు విన్నప్పుడల్లా ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం...ధన్యవాదాలు చేసుకుందాం...

నన్నయ

నన్నయ   తెలుగు భాషలో ఆది కవి నన్నయ. ఈయన 11 వ శతాబ్దానికి చెందిన వారు. సంస్క్రుతాంధ్ర భాషలయందు విశేష పాండత్యం కలవారు. సంస్క్రుత మహాభారతాన్ని శ్రీ మదాంధ్రమహాభారతం అంటూ తెలుగు లో రచించిన కవిత్రయంలో మొదటి వారు నన్నయ గారు. ఆంధ్ర శబ్దచింతామణి కూడా రచించారు. ఆది కవిగానే కాకుండా శబ్దశాసనుడు వాగశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతులయ్యారు.  ఆది కవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్నపేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు. ఈయన వేగిదేశమేకి రాజైన విరాట్ కు ఆస్ధాన కవి. నన్నయ మహాభారతాన్ని తెలుగులో రాయటం మొదలు పెట్టి అందులో మొదటి రెండు ఆది, సభా పర్వాలనుపూర్తి చేసి తరువాతి అరణ్యపర్వాన్ని 141 పద్యం వరకూ  రాసి కీర్తి శేషుడయ్యారు. తెలుగు భాషకు అద్భుతమైన మార్గాన్ని నిర్దేశించారు.  తల్లి గోదారి ఒడ్డున కూర్చొని తన రాజయిన రాజరాజ నరేంద్ర మహారాజు గారికి చెప్పినదే ఈ మహాభారతం. దీంతో పాటు ఈయన చాముండికా విలాసం, ఇంద్రవిజయం ఆంధ్రశబ్దచింతామని అనేసంస్క్రుత వ్యాకరణ గ్రంధాన్ని కూడా రచించారని అంటారు.  పాణిని పద్ధతికి విరుద్ధంగా వ్యాకరణాన్ని ఐదు విభాగాలుగా నన్నయ విభజించారు.  ఆది కవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అనుపేర్లతో ఆయన ప్రఖ్యాతులయ్యారు. తెలుగులో ఇవాళ మనం భారతాన్ని చదువుకుంటున్నామన్నా అర్ధాలు తెలుసుకోవటానికి శబ్దచింతామణి చదువుకుంటున్నామన్నా అంతా నన్నయగారి కృషి ఫలితం...అందుకే ఆది కవి నన్నయ గారికి వందనాలు సమర్పిస్తూ... తెలుగు వారం అందరం మొక్కుకుందాం....  

యద్దనపూడి సులోచనారాణి స్పెషల్ ఆర్టికల్

  యద్దనపూడి సులోచనారాణి స్పెషల్ ఆర్టికల్     యుద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళా మణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాముచేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేసింది. ముఖ్యంగా 1970వ దశకంలో ఈమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనికి సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. అప్పటి ఆడపిల్లలకు వీరి నవలా నాయకుడు ఓ కలల రాకుమారుడు. యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, వారి ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు,  స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. వర్ణనల విషయానికి వస్తే వీరి నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. ఇవి ఎక్కువ ప్రచారం పొందడానికి కారణం- మెజారిటీ ప్రజల జీవన విధానాలను, అనుభూతులను పొందుపరచడమే. వీరి నవలా పాత్రలు విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాయి. కొద్ది సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. అందుకేనేమో బహుశా సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం - అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి, ఆశ -  నిరాశ... ఇలాంటి సహజాతాల మధ్య వీరు సృష్టించే పాత్రలు తలమునకలవు తుంటాయి. చదివే పాఠకులకు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుంటాయి.      యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది. సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. వీరి రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్లో వచ్చిన రాధ మధు సీరియల్ కథ వీరిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ వీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు.   - డా. ఎ. రవీంద్రబాబు  

తెలంగాణలో తెలుగుకి అండ.. సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణలో తెలుగుకి అండ - సురవరం ప్రతాపరెడ్డి   ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రచయితల గురించి లోకానికి చాటే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కానీ దాదాపు 70 ఏళ్ల క్రితమే తెలంగాణలో కవుల గురించి ఓ ప్రత్యేక సంచిక తీసుకువచ్చారు ఓ పెద్దాయన. న్యాయవాదిగా, రచయితగా, సంపాదకుడిగా, సంఘసంస్కర్తగా, ప్రజాప్రతినిథిగా, చరిత్రకారునిగా... అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేసి చూపించారు. ఆయనే సురవరం ప్రతాపరడ్డి. 1896లో మహబూబ్‌నగర్‌లోని ఇటిక్యాలపాడులో జన్మించారు సురవరం. చదువంటే ఉన్న ఆసక్తితో కర్నూలులోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకునేవారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌ భాషలతో పాటు సంస్కృతం, ఫారసీ భాషల మీద కూడా మంచి పట్టు సాధించారు. హైదరాబాదులోని నిజాం కాలేజీ, మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజిలలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. సురవరం మొదట హైదరాబాదులోని రెడ్డి హస్టలు నిర్వహణ బాధ్యతలు చూసేవారు. ఆ హాస్టలు ఇప్పటికీ నిలదొక్కుకుని ఉందంటే, అందుకు సురవరం తీసుకున్న చర్యలు కూడా కారణమే! సురవరానికి సాహిత్యం మీద మొదటి నుంచీ ఉన్న ఆసక్తి వల్ల 1926లో గోలకొండ పత్రికను స్థాపించారు. అప్పటిదాకా నిజాం రాజ్యంలో ఒక తెలుగు పత్రికే లేదంటే నమ్మగలమా! అలా ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషలు రాజ్యమేలుతున్న నిజాం రాజ్యంలో తెలుగు సాహిత్యం నిలదొక్కుకునేందుకు ‘గోలకొండ పత్రిక’ బీజం వేసింది. గోలకొండ పత్రికకి సురవరమే సర్వస్వంగా ఉండేవారు. సంపాదకుడి దగ్గర నుంచి ప్రూఫ్ రీడరు వరకూ అన్ని బాధ్యతలూ తనే నెత్తిన వేసుకుని పత్రికను నడిపించేవారు. ఆ సమయంలో ఎవరో ‘నిజాం రాజ్యంలో తెలుగు కవులు లేరంటూ’ ఓసారి సురవరాన్ని ఎగతాళి చేశారట. అందుకు జవాబుగా 354 మంది తెలంగాణ కవుల పరిచయాలతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ని విడుదల చేశారు సురవరం. సురవరం గోలకొండ పత్రికతో పాటు ప్రజావాణిలాంటి పత్రికలను స్థాపించారు. నిజాం రాజ్యంలో తెలుగు పత్రికని స్థాపించడమే ఓ సాహసం అనుకుంటే... నిజాంను తన పత్రికలలో ఏకిపారేస్తూ దూకుడుగా వ్యవహరించేవారు సురవరం. ఒక దశలో నిజాం రాజు గోలకొండ సంపాదకీయాలకి సైతం భయపడ్డారంటే... సురవరం కలం ఎంత పదునైనదో అర్థం చేసుకోవచ్చు. సంపాదకునిగానే కాదు, రచయితగానూ సురవరానిది తెలుగు సాహిత్యంలో ఓ అద్బుతమైన స్థానం. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో దాదాపు వెయ్యేళ్ల ఆంధ్రుల చరిత్రను నమోదు చేశారు. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని తెలుగులో మొదటిసారి సురవరం ప్రతాపరెడ్డికే అందించింది. తెలుగువారి చరిత్రకు సంబంధించి ఇప్పటికీ ఇది ఓ ప్రామాణిక గ్రంథం. దీంతోపాటుగా సురవరం రాసిన ‘హిందువుల పండుగలు’ పుస్తకం కూడా తెలుగువారి సంస్కృతికి అద్దం పడుతుంది. సురవరం గురించి చెప్పుకొనేటప్పుడు ఆంధ్రమహాసభ గురించి కూడా చెప్పుకోవాలి. ఒకప్పుడు హైదరాబాదులో ఉర్దూ, మరాఠీ భాషలు మాత్రమే వినిపించేవి. తెలుగు మాట్లాడేవారిని చాలా చులకనగా చూసేవారు. ఆ వివక్షను ఎదుర్కొనేందుకు మొదలైందే ‘ఆంధ్ర మహాసభ’ ఉద్యమం. 1930లో జరిగిన మొదటి ఆంధ్రమహాసభకు సురవరం అధ్యక్షునిగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు మళ్లీ తలెత్తుకుందంటే అందులో ఆంధ్రమహాసభ పాత్ర ఎంతో ఉంది. ఇలా ఏ రకంగా చూసినా కూడా తెలంగాణలో తెలుగు సాహిత్యం ఎక్కడా వెనక్కి తగ్గకుండా, తన ఉనికిని కాపాడుకునేందుకు సురవరం ప్రతాపరెడ్డి కృషి ఎంతో ఉందని తెలిసిపోతోంది. - నిర్జర.  

అక్షరంతో చరిత్రను మార్చిన... భాగ్యరెడ్డివర్మ

అక్షరంతో చరిత్రను మార్చిన - భాగ్యరెడ్డివర్మ   తెలంగాణలో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ప్రశంసలు, విమర్శలూ ఎలా ఉన్నా... ఈ సభల సందర్భంగా కొందరు పెద్దలను తల్చుకునే అవకాశం వచ్చిందన్నమాట మాత్రం వాస్తవం. వారిలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు భాగ్యరెడ్డి వర్మ. ఇప్పటి తరం ఆయనని పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. కానీ ఆయన చేసిన మేలుని మాత్రం తరతరాలూ అనుభవిస్తూనే వస్తున్నాయి. భాగ్యరెడ్డివర్మ 1888లో జన్మించారు. పెద్ద కుటుంబం, ఆపై తండ్రి కూడా చిన్నప్పుడే చనిపోవడంతో... ఆయన బాల్యం అంతా బీదరికంలోనే గడిచింది. అయినా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు. పనిచేసిన ప్రతిచోటా తానేమిటో నిరూపించుకున్నారు. భాగ్యరెడ్డి దళితుడు. దళితుల జీవితాలు మెరుగుపడాలంటే, సాహిత్యం చాలా ఉపయోగపడుతుందని నమ్మారు భాగ్యరెడ్డి. అందుకే 1911లో మన్యసంఘం అనే సంఘాన్ని స్థాపించారు. ఇప్పుడంటే టీవీలు, సినిమాలు ఉన్నాయి కానీ అప్పట్లో భజనలు, హరికథలే కాలక్షేపంగా ఉండేవి. మన్యసంఘం ఆధ్వర్యంలో ఉపన్యాసాలు, భజనలు, హరికథలు ఏర్పాటు చేయడం ద్వారా... ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు భాగ్యరెడ్డి. మరోవైపు ఎక్కడికక్క రీడింగ్‌ రూమ్స్ ఏర్పాటు చేసి, అందరికీ సాహిత్యాన్ని అందుబాటులో ఉంచేవారు. దేవదాసి, బాల్యవివాహాలు, మద్యపానం లాంటి దురాచారాల మీద కూడా మన్యసంఘం తీవ్రంగా పోరాడేది. ఆయన ఒత్తిడి కారణంగానే ఆనాటి నిజాం ప్రభుత్వం దేవదాసి ఆచారాన్ని నిషేధించింది. ఒకవైపు దురాచారాల మీద పోరాడుతూనే, మరోవైపు దళిత బాలికల కోసం పాఠశాలలు మొదలుపెట్టారు భాగ్యరెడ్డి. ఇప్పుడంటే ఈ విషయం అంత విచిత్రంగా తోచదు. కానీ 150 ఏళ్ల క్రితం దళితులకి, అందులోనూ అమ్మాయిలకి పాఠశాల ఏర్పాటు చేయడం అంటే గొప్ప సాహసమే! అలా ఒకటి కాదు రెండు కాదు... భాగ్యరెడ్డి నేతృత్వంలో 26 పాఠశాలలు నడిచేవట. వాటిలో రెండువేల మందికి పైగా అమ్మాయిలు చదువుకునేవారు. అప్పట్లో దళితులని పంచములుగా పేర్కొనేవారు. కానీ వారిని ‘ఆదిహిందువు’లుగా గుర్తించాలని భాగ్యరెడ్డి పోరాడారు. ఆదిఆంధ్ర మహాసభల పేరుతో 1917 నుంచి 20 ఏళ్ల పాటు మహాసభలను నిర్వహించారు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌లో కనిపించే ‘ఆదిహిందూ భవన్‌’ కూడా ఆయన నిర్మించినదే!  వెనుకబడినవారిని ముందుకు నడిపించేందుకు వారిలో చదువునీ, రచనలనీ ప్రోత్సహించడమే కాదు... తను కూడా రచనలు చేశారు భాగ్యరెడ్డి. ‘భాగ్యనగర్‌’ పత్రికను స్థాపించి అందులో ఓ నవలని కూడా రాశారు. భాగ్యరెడ్డి వర్మ కృషిని మెచ్చుకుంటూ ఆనాటి నిజాం ప్రభుత్వం సైతం ఆయనను సత్కరించింది. ఆర్యసమాజ్‌ ఈయనను ‘వర్మ’ అన్న బిరుదునిచ్చింది. అప్పటి నుంచి ఆయనను ‘భాగ్యరెడ్డివర్మ’గా పిలుస్తున్నారు. తెలంగాణలో దళితులు చదువుకునేందుకు, రచనలు చేసేందుకు తొలిమెట్టు వేసింది భాగ్యరెడ్డివర్మే అని చెబుతారు. అందుకే ఇక్కడ జరుగుతున్న ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా ప్రభుత్వం ఆయనను గుర్తుచేసే ప్రయత్నం చేస్తోంది. - నిర్జర.

‘అదిగో భద్రాద్రి’ కీర్తన రాసిన కవి

‘అదిగో భద్రాద్రి’ కీర్తన రాసిన కవి!   భక్త రామదాసు గురించీ, ఆయన కీర్తినల గురించీ తెలియని తెలుగువాడు ఉండడు. కంచర్ల గోపన్న అనే తహలీల్దారు కాస్తా భద్రాచలం గుడిని నిర్మించే ప్రయత్నంలో రామదాసుగా మారిన కథ మనకి కొత్త కాదు. కానీ అదే బాటలో సాగిన ‘తూము లక్ష్మీనరసింహదాసు’ జీవితాన్నీ, ఆయన కొనసాగించిన రామదాసు కార్యాన్నీ గురించి తెలిసినవారు చాలా అరుదు. భక్తరామదాసు 1680లో చనిపోయారని అంటారు. ఆయన చనిపోయిన దాదాపు 110 ఏళ్ల తర్వాత గుంటూరులో అచ్చయ మంత్రి, వెంకమ్మ అనే దంపతులకు తూము లక్ష్మీనరసింహదాసు జన్మించాడు. నరసింహదాసుది పండితవంశం. ఆయన తండ్రికి సంగీతం మీద మంచి అభిరుచి ఉంది. నిత్యం వారింట్లో ఏదో ఒక గోష్టి జరుగుతూనే ఉండేది. నరసింహదాసు ఏకసంథాగ్రాహి కావడంతో తాను వింటున్న ప్రతిమాటనీ ఆకళింపు చేసేసుకునేవాడు. యుక్తవయసుకి వచ్చేసరికే పండితునిగా మారిపోయాడు. నరసింహదాసుకి 19 ఏళ్లు వచ్చేసరికి వివాహం జరిగిపోయింది. ఆ మరుసటి ఏడాది ఆయన తండ్రి మరణించాడు. తమ్ముడు చూస్తే ఇంకా చేతికి అందలేదు. దాంతో గంపెడు సంసార బాధ్యత నరసింహుని మీదే పడింది. ఆ బాధ్యతను నడపించడానికి పేష్కర్‌ అనే రెవెన్యూ ఉద్యోగాన్ని చేపట్టాడు. కానీ అతని లౌకిక వృత్తికీ, ఆధ్మాత్మిక ప్రవృత్తికీ ఏమాత్రం పొంతన కుదరలేదు. ఎక్కువ రోజులు ఆ ఉద్యోగంలో నిలవలేకపోయాడు. ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటానని తెలిసినా... ఉద్యోగాన్ని వీడి భక్తి మార్గాన్ని ఎంచుకొన్నాడు. ఉద్యోగాన్ని వీడిన నరసింహ సకుటుంబంగా యాత్రలు చేయడం మొదలుపెట్టాడు. వైష్ణవ దీక్షను చేపట్టి నరసింహ కాస్తా నరసింహదాసుగా మారిపోయాడు. అలా దేశమంతా తీర్థయాత్రలు సాగిస్తున్న సమయంలో తన సమకాలికుడైన త్యాగరాజుని కూడా కలుసుకున్నాడట. బహుశా ఆయన ప్రభావంతోనే నరసింహదాసుకి కూడా కీర్తనలు రాయాలన్న అభిలాష మొదలై ఉంటుంది. నరసింహదాసు తన యాత్రలో భాగంగా భద్రాచలానికి చేరుకున్నాడు. అప్పటికి వందేళ్ల క్రితమే భక్త రామదాసు ఆ ఆలయాన్ని పునరుద్ధరించి ఉన్నాడు. కానీ కాలక్రమంలో అది తిరిగి జీర్ణవస్థకు చేరుకోవడాన్ని గమనించారు నరసింహదాసు. పూర్వపు పాలకులు ఆలయ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన శాసనాలని నాశనం చేసి, ఆలయ ఆస్తులను ఇతరులు అనుభవిస్తున్నారని తెలిసింది. దాంతో హుటాహుటిన హైదరాబాదుకి చేరుకుని ఆనాటి నవాబుని కలుసుకున్నారు. జరిగిన అన్యాయాన్ని తెలియచేసి, ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. నరసింహదాసు అభ్యర్థనని నవాబు మన్నించడంతో.... తిరిగి భద్రాచలానికి చేరుకున్నాడు. నరసింహదాసు తన శేష జీవితమంతా భద్రాచలంలోనే గడిపేశాడు. నిత్యం ఆ స్వామిని సేవిస్తూ, కీర్తిస్తూ తన జన్మని ధన్యం చేసుకున్నాడు. ఆయన రాసిన లెక్కలేనన్ని కీర్తనలలో కొన్ని ఇప్పటికీ సంగీతజ్ఞులకు పరిచయమే! ముఖ్యంగా ‘అదిగో భద్రాద్రి – గౌతమి యిదిగో చూడండి’ అంటూ సాగే కీర్తన వినని వారు ఎవరూ ఉండరేమో! ఒకపక్క రామదాసులాగా కీర్తనలు చేస్తూ, మరోపక్క ఆయనకు ఇష్టమైన భద్రాచల ఆలయాన్ని పునరుద్ధరించాడు కాబట్టి... ఆయన రామదాసు అవతారమే అని చాలామంది నమ్మకం. - నిర్జర.  

అన్నమయ్య కాదు... ఇతను యథావాక్కుల అన్నమయ్య!

అన్నమయ్య కాదు... ఇతను యథావాక్కుల అన్నమయ్య!     తెలుగు సాహిత్యంలో అన్నమయ్య పేరు వినపడగానే ఆ శ్రీనివాసుని తన కీర్తనలతో కొలిచిన తాళ్లపాక అన్నమయ్యే గుర్తుకువస్తాడు. కానీ అంతకు ఓ రెండు వందల సంవత్సరాలకు పూర్వం, అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి తెలుగునాట సుస్థిరమైన ఒక శతకాన్ని రాశారు. ఆ శతకం పేరు ‘సర్వేశ్వర శతకం’. దాన్ని రాసినవాడు ‘యథావాక్కుల అన్నమయ్య’.   శతకసాహిత్యం కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమైన ప్రక్రియ కాదు. కానీ కొన్ని నియమాలకు కట్టుబడి ఛందోబద్ధంగా సాగే శతకాలు మన దగ్గరే ఎక్కువగా కనిపిస్తాయి. కొబ్బరి చిప్ప దగ్గర నుంచి స్వాతంత్ర్య పోరాటం దాకా ఏ విషయం మీదైనా శతకం రాయగలగడం తెలుగు కవులకే సాధ్యం. అందుకే ఇప్పటివరకు తెలుగులో పదివేలకు పైగా శతకాలు వెలువడ్డాయని ఓ అంచనా!   తెలుగునాట వెలువడిన తొలి శతకాలలో సర్వేశ్వర శతకం ఒకటి. శివభక్తే ప్రధానంగా సాగే ఈ శతకం ‘సర్వేశ్వరా’ అనే మకుటంతో 142 పద్యాలతో కనిపిస్తుంది. ఒకవైపు శివుని మహిమను వర్ణిస్తూనే, శివభక్తులను కూడా అంతే గౌరవంగా చూసుకోవాలని సూచిస్తుంది. సర్వేశ్వర శతకంలో ఉన్న ఓ ప్రత్యేకత.. ఖచ్చితమైన కాలనిర్ణయం. తాను ఈ శతకాన్ని 1242లో రాశానని అన్నమయ్య తన శతకంలో పేర్కొన్నాడు. ఆకాలంలోని సాహిత్యంలో ఇలాంటి స్పష్టత చాలా అరుదుగా కనిపిస్తుంది.   సర్వేశ్వర శతకం మత్తేభ, శార్దూల వత్తాలలో రాయబడింది. మత్తేభం అంటే ఏనుగు, శార్దూలం అంటే పులి. శివుడు ఏనుగు చర్మాన్నీ, పులి చర్మాన్నీ ధరించే విరాగి. అందుకనే కవి ఆ వృత్తాలను ఎంచుకున్నాడనీ అంటారు. సర్వేశ్వర శతకం శివుని మీద రాసిందే అయినా... ఇందులో ప్రత్యేకించి ఒకే పుణ్యక్షేత్రం గురించి కానీ, ఒకే కథని కానీ ఆధారం చేసుకోకపోవడం మరో ప్రత్యేకత.   ఇంతకీ ఈ యథావాక్కుల అన్నమయ్య వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారమూ లేదు. ఈయన గోదావరి జిల్లావాడని కొందరంటే, కర్నూలు జిల్లావాడని మరికొందరి అభిప్రాయం. కానీ శ్రీశైల మల్లికార్జునుడి భక్తుడన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదు. యథావాక్కుల అన్నమయ్య తన శతకాన్ని రాయడం వెనుక ఓ సరదా కథ ఒకటి ప్రచారంలో ఉంది. దాని ప్రకారం-   యథావాక్కుల అన్నమయ్య తాను తాటాకు మీద రాసిన ప్రతి పద్యాన్నీ నీటిలోకి వదిలేవాడట. అది కనుక తిరిగి వస్తే, పరమేశ్వరుడు తన పద్యాన్ని అంగీకరించినట్లుగానూ... తిరిగి రాకపోతే తిరస్కరించినట్లుగానూ భావించాడట. ఒకవేళ అలా ఎప్పుడైనా ఓ పద్యం తిరిగిరాని పక్షంలో తన మెడను కత్తిరించుకుంటానని శపథం చేశాడట. అలా ఒకనాడు ఆయన నీటిలో విడిచిన పద్యం తిరిగిరాలేదు. దాంతో తన మెడను కత్తిరించుకునేందుకు సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ఓ పశువుల కాపరి సదరు పద్యం ఉన్న తాటాకుని తీసుకుని అన్నమయ్య దగ్గరకు వచ్చాడు. ఆ తాటాకు మీద అన్నమయ్య రాసిన పద్యంతో పాటుగా మరో పద్యం కూడా రాసి ఉండటం విశేషం. ఇదంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహమే అని భావించిన అన్నమయ్య తన శతకాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు.   సర్వేశ్వర శతకంలోని ఓ పద్యం మచ్చుకి... ఆనందంబును బొందునప్పుడును, సత్యాశ్చర్యకార్యార్థ భా వానీకంబులు దోచునప్పుడును, రోగాపాయ దుఃఖాతుర గ్లానింబొంది చరించునప్పుడును, సత్కార్యంబున న్నీవు నా ధ్యానంబందు దయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా !   ... ఆనందం, ఆశ్చర్యం, అనారోగ్యం, శ్రమ, దుఃఖం, కష్టం, సత్కార్యం... ఇలా సర్వావస్థల్లోనూ తన మదిలో నిలవమంటూ శివుని వేడుకొనడమే ఈ పద్యంలోని భావం.   - నిర్జర.    

ఈ రచయితలు ఉపాధ్యాయులు కూడా!

  మంచి ఉపాధ్యాయులు మంచి రచయితలు అవుతారని కొందరి నమ్మకం. అందుకు కారణం లేకపోలేదు. ఉపాధ్యాయుడైనా, రచయిత అయినా... తనకు తెలిసిన విషయాన్ని, తోచిన ఆలోచనని నలుగురికీ అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పగలిగినప్పుడే విజయం సాధిస్తాడు. అలా అటు టీచర్‌గానూ, ఇటు రైటర్‌గానూ విజయం సాధించిన కొందరి వివరాలు.... సల్మాన్ రష్దీ – ‘సాటానిక్‌ వర్సెస్’ పుస్తకంతో ముస్లింలతో తగువు పెట్టుకున్నా ‘మిడ్‌నైట్‌ చిల్డ్రన్’ అంటూ భారత విభజన గురించి నవల రాసినా సల్మాన్‌ రష్దీ ప్రతి పుస్తకమూ ఓ సంచలనమే! సల్మాన్‌ రష్దీ అమెరికాలోని ‘ఎమొరీ విశ్వవిద్యాలయం’లో ఏటా క్లాసులు చెబుతూ ఉండేవారు. ఇలా దశాబ్దకాలానికి పైగానే రష్దీ ఎమరీ విద్యార్థలకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఆంగ్ల సాహిత్యంతో పాటుగా చరిత్ర, రాజకీయాలు, మతం, సినిమారంగాల మీద కూడా తన అనుభవాలను పిల్లలతో పంచుకునేవారు. స్టీఫెన్ కింగ్‌ – హారర్‌ నవల అనగానే స్టీఫెన్ కింగ్ పేరే గుర్తుకువస్తుంది. ఆయన రాసిన నవలల ఆధారంగా 50కి పైగా సినిమాలు రూపొందాయంటే స్టీఫెన్ ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. ఆ సినిమాల్లో ‘The Shawshank Redemption’లాంటి బ్లాక్‌బస్టర్లు కూడా ఉన్నాయి. స్టీఫెన్ చదువు చెప్పడంలో డిప్లొమాను తీసుకున్నాడు. కానీ వెంటనే ఏ ఉద్యోగమూ దొరక్కపోవడంతో కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చినా... అటు కథలు రాస్తూ, ఇటు చదువు చెబుతూ తన వృత్తిని కొనసాగించాడు. జే.కే. రౌలింగ్‌ – హ్యారీ పోటర్ గురించి ఈ ప్రపంచానికి ఎంత తెలుసో... ఆ పుస్తకాల రచయిత రౌలింగ్ గురించి కూడా అంతే తెలుసు. నానాకష్టాలనూ ఎదుర్కొని పైకి వచ్చిన రౌలింగ్ అంటే అందరికీ ఆరాధనే! రౌలింగ్‌కు కష్టకాలంలో ఎవ్వరూ తోడు లేకపోయారు. కానీ ఆమె ఎంచుకున్న ఉపాధ్యాయ వృత్తి మాత్రమే కావల్సినంత విశ్వాసాన్ని రగిల్చింది. తన పోర్చుగల్‌ విద్యార్థులకు ఆమె ఇంగ్లిష్ బోధించేది. ఒకపక్క పిల్లలకు చదువు చెబుతూనే, రెస్టారెంట్లలో కూర్చుని హ్యారీ పాటర్‌ నవలను పూర్తిచేసింది. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే! డాన్‌ బ్రౌన్ – ‘ద డావిన్స్ కోడ్‌’ అన్న ఒకే ఒక్క పుస్తకంతో సాహిత్యంలో సంచలనం సృష్టించినవాడు డాన్‌ బ్రౌన్‌. ఈయన తండ్రి ఓ గొప్ప లెక్కల టీచరట. పిల్లలకు లెక్కల పుస్తకాలు కూడా రాశారట. ఆయన బాటలోనే బ్రౌన్‌ కూడా ఇంగ్లిష్‌, స్పానిష్ భాషలను నేర్పేవారు. క్రమంగా పుస్తకాలూ రాయడం మొదలుపెట్టారు. 1998లో ఆయన రాసిన ‘డిజిటల్‌ ఫోర్టెస్’కు మంచి పేరు రావడంతో ఇక పూర్తిగా రచనలకే అంకితమైపోయారు. వీళ్లే కాదు... ప్రపంచ సాహిత్యం మీద తనదైన ముద్ర వేసిన షేక్‌స్పియర్‌, తన కవితలతో నెహ్రూని ప్రభావితం చేసిన Robert Frost, అలిస్ ఇన్‌ వండర్‌లాండ్‌ రాసిన Lewis Carroll అంతా కూడా ఉపాధ్యాయులే! ఇక తెలుగు సాహిత్యానికి వస్తే.... విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, సినారే వంటి ఎందరో రచయితలు ఉపాధ్యాయులుగా ఉంటూ తమ కలాన్ని కదలించినవారే! - నిర్జర

దిల్లీని గెలుచుకున్న తెలుగు కవి – జగన్నాథ పండితరాయలు

దిల్లీని గెలుచుకున్న తెలుగు కవి – జగన్నాథ పండితరాయలు     పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఓ సామెత ఉంది. మన మధ్య తిరిగేవాడి ప్రతిభని ఎవరో గమనించి తలకెత్తుకున్నాక కానీ... అతని విలువని గ్రహించలేం. అలాంటి వ్యక్తులలో మొదటగా చెప్పుకోవాల్సినవాడు ‘జగన్నాథ పండితరాయలు’.   జగన్నాథుడు 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంస్కృత కవి. ఈయన తూర్పు గోదావరి జిల్లా ముంగొండ అగ్రహారంలో జన్మించారు. తండ్రి స్వతహాగా పండితుడు కావడంతో.... మొదట ఆయన దగ్గరే విద్యని అభ్యసించాడు. తర్వాత ఒకో గురువునీ ఎంచుకొంటూ న్యాయం, వైశేషికం వంటి షట్దర్శనాలన్నింటిలోనూ ఆరితేరిపోయారు. వేదవేదాంతాల మీదా పట్టు సాధించారు. కాశీకి వెళ్లి సకల శాస్త్రాలనీ ఔపోసన పట్టారు.   ఒక పక్క అపారమైన జ్ఞానం, మరో పక్క ఒక్కసారి వింటే దేన్నీ మర్చిపోలేని ఏకసంథాగ్రహత. అయినా కూడా జగన్నాథునికి తగిన గౌరవం కానీ భత్యం కానీ లభించలేదు. దాంతో ఆయన నేరుగా దిల్లీ సుల్తాను దగ్గరకే వెళ్లి తన పాండిత్యాన్ని నిరూపించుకోవాలని అనుకున్నాడు. అప్పట్లో కాశీకి వెళ్లడం అంటేనే కాటికి వెళ్లడంతో సమానం. ఇక దేశ రాజధానిలో పాగా వేయడం అంటే ఎంత దుస్సాహసమో!   దిల్లీకి చేరుకున్న జగన్నాథునికి, పాదుషా దర్శనం దక్కలేదు. ఆయన పిలుపు కోసం నిరీక్షస్తూ ఉండగా, ఓసారి తన ముందే ఇద్దరు హోరాహోరీగా వాదులాడుకోవడాన్ని గమనించాడు. వారు మాట్లాడుకున్న భాష ఏమిటో ఆయనకు తెలియదు. కానీ ఏకసంథాగ్రాహి కావడంతో వారి నోటి నుంచి వెలువడిన శబ్దాలను మాత్రం జ్ఞప్తికి ఉండిపోయాయి. తన దర్బారు బయట జరిగిన ఈ వాదులాట పాదుషాగా ఉన్న షాజహానుకి తెలసింది. వెంటనే ఆ గొడవపడినవారినీ, ఆ గొడవకి సాక్ష్యంగా ఉన్నవారినీ తన వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు.   షాజహాను ముందర తను విన్నదంగా పూసగుచ్చినట్లు అప్పచెప్పాడు జగన్నాథుడు. భాష తెలియకుండానే అంత స్పష్టంగా వాదనని విన్న జగన్నాథుని ప్రతిభకు పాదుషా ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఆస్థానంలోకి సాదరంగా ఆహ్వానించాడు. అనతికాలంలోనే జగన్నాథుని ప్రతిభకు పాదుషా ముగ్ధుడైపోయాడు. స్వతహాగా సున్నితమనస్కుడైన షాజహానుకీ, పండితుడైన జగన్నాథునికీ మంచి పొత్తు కుదిరింది. జగన్నాథుని పండిత్యానికి మెచ్చి పండితరాయులు అనే బిరుదుని అందించాడు షాజహాన్‌.   షాజహానుకి లవంగిక అనే కుమార్తె ఉండేదనీ, ఆమె జగన్నాథుని తన గురువుగా భావించేదనీ చెబుతారు. వీరిరువురి మధ్యా ఒక ప్రేమ కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం... ‘నిన్ను గౌరవించుకునేందుకు ఎంత గొప్ప కానుకని ఇచ్చినా తక్కువే! అందుకని నువ్వే ఏదో ఒక బహుమతిని కోరుకో!’ అంటూ ఓసారి షాజహాన్‌, జగన్నాథునితో అన్నాడట. ‘ప్రభూ నాకు మీ కుమార్తె లవంగికని ఇచ్చి వివాహం చేయండి’ అంటూ జగన్నాథుడు కోరాడట.   జగన్నాథుని మాటలకు షాజహాన్‌కు కోపం వచ్చింది. కానీ చాలాకాలం ఆలోచించిన తర్వాత అతని కోరికని మన్నించడం సబబే అని తోచింది. వెంటనే తన కుమార్తెతో జగన్నాథునికి వివాహం జరిపించాడు. వివాహం జరిగిందన్నమాటే కానీ అటు ముస్లింల దగ్గర నుంచీ, ఇటు హిందువుల దగ్గర నుంచీ జగన్నాథుడు తీవ్రమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందట.   దాంతో మనస్తాపం చెందిన ఆయన గంగలో లీనమైపోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన భార్యతో కలిసి కాశీకి చేరుకున్నాడు. అక్కడ గంగానది గట్టు మీద కూర్చుని ‘గంగాలహరి’ అనే కావ్యాన్ని ఆశువుగా చెప్పసాగాడు. అందులో ఒకో శ్లోకాన్ని చెబుతుండగా గంగ నీరు ఒకో మెట్టు దాటి పైకి రాసాగిందట. అలా 53 శ్లోకాలు చెప్పేసరికి గంగానది మట్టం పైకి చేరి, జగన్నాథుని తనలో ఐక్యం చేసుకుందట.   చాలామంది చరిత్రకారులు జగన్నాథుని ప్రేమకథను కొట్టిపారేస్తారు. అయితే షాజహాన్‌ ఆస్థానంలో జగన్నాథుడనే గొప్ప పండితుడు ఉన్నాడనీ, ఆయన తెలుగువాడనీ చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదు. జగన్నాథుడు గంగాలహరితో యమున (అమృత లహరి), సూర్యుడు (సుధాలహరి), కృష్ణుడు (కరుణా లహరి), లక్ష్మీదేవి (లక్ష్మీ లహరి) మీద కూడా కావ్యాలను రాశారు.   వీటితో పాటు భామినీ విలాసం, రసగంగాధరం లాంటి అద్భుతమైన రచనలెన్నో చేశారు. ఇక విమర్శన గ్రంథాలు, భాష్యాల సంగతి సరేసరి. ఆయన రాసిన రచనలు ఇప్పటికీ సంస్కృతంలోని అత్యుత్తమ కావ్యాల జాబితాలో నిలుస్తూ ఉంటాయి. విదేశీయులు చేత ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. ఇప్పుడు తెలుగువారంతా జగన్నాథ పండితరాయలు మన తెలుగువాడేనట! అని చెప్పుకొంటున్నారు. - నిర్జర.  

అతడు అడవిని జయించాడు

అతడు అడవిని జయించాడు!   తెలుగు భాషలోని సాహిత్యం గురించి చాలామందికి చాలా అపోహలే ఉన్నాయి. ప్రపంచస్థాయిలో రాయగల రచయితలు మన మధ్య లేరనీ, ఒకవేళ ఎవరన్నా అలాంటి రచన చేస్తే, దాన్ని ఆదరించేంత పరిణతి తెలుగు పాఠకులకు లేదని... ఇలాంటి సందేహాలు చాలానే వినిపిస్తుంటాయి. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా ఒకటే జవాబు వినిపిస్తుంది- ‘అతడు అడవిని జయించాడు’ రచనే ఆ సమాధానం.   ఎప్పుడో 1984లో ఓ చిన్నధారావాహిక రూపంలో వచ్చిన రచన ‘అతడు అడవిని జయించాడు’. ధారావాహికగా వస్తున్న సమయంలో చాలామంది ఈ రచనను అంతగా ఆమోదించలేదు. ఇందులో కనిపించే నేపథ్యం సంప్రదాయ పాఠకులకు చాలా చిత్రంగా తోచింది. కానీ తెలుగు సాహిత్యంలో ఈ రచన ఏదో కొత్తదనాన్ని తీసుకువస్తోందనే అశ మాత్రం చాలామందికి కలిగింది. ఇక దీన్ని ఒక నవలగా ముద్రించిన తర్వాత, దాని విజయానికి తిరుగులేకుండా పోయింది. 1988లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దీన్ని ఉత్తమ నవలగా ఎంపిక చేయడంతో, కావల్సినంత ప్రచారమూ దక్కింది. ఈ నవలను ఓ చలనచిత్రంగా రూపొందించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి.   అతడు అడవిని జయించాడులోని కథ చాలా సామాన్యమైంది. సంస్కారవంతులమని భావించేవారు ఇలాంటి నేపథ్యాన్ని గురించి ఆలోచించడానికే జంకుతారు. ఒక ముసలివాడు అడవిలో తప్పిపోయిన తన పందిని వెతుక్కుంటూ వెళ్లడమే ఈ కథలోని నేపథ్యం. ముసలివాడికి వయసు దాటిపోయింది, పైగా జ్వరంతో శరీరం బలహీనపడిపోయింది. కానీ తన పందులే అతని సర్వస్వం. వాటి క్షేమం కోసం అతను ఎలాంటి సాహసాన్నయినా చేసేందుకు సిద్ధం. అందుకే అడవిలో తప్పిపోయిన తన పందిని వెతుక్కుంటూ ‘అస్తమిస్తున్న సూర్యునిపై దండెత్తిన వానివలె’ అతను బయల్దేరతాడు.   అడవిలోకి చేరుకున్న తర్వాత ముసలివాడికి ఎదురయ్యే అనుభవాలతో పుస్తకం అంతా నిండిపోయి ఉంటుంది. సూర్యాస్తమయం వేళకి అడవికి ముసలివాడు అడవికి బయల్దేరడంతో మొదలయ్యే కథనం, సూర్యోదయం వేళకి అతని తిరిగి తన గుడిసెను చేరుకోవడంతో ముగుస్తుంది. అలాగని ఇందులో అద్భుతమైన సాహసాలు ఉంటాయని కాదు. ఒక మనిషి తనకు ఎదురైన పరిస్థితులను అంచనా వేస్తూ ఎలా ఆ రాత్రిని గడిపాడు అన్నదే ఇందులోని కథనంగా సాగుతుంది.   ముసలివాడు అడవిలో ఎలాగొలా తన పందిని కనుక్కొంటాడు. కానీ దాని దగ్గరకు అతను చేరలేడు. ఎందుకంటే అప్పుడే పిల్లల్ని ఈనిన ఆ జంతువు మహాక్రూరంగా ఉంటుంది. దానికి తనామనా బేధం ఉండదు. తన జోలికి ఎవరు వచ్చినా కూడా, చీల్చి చెండాడేందుకు సిద్ధంగా ఉంటుంది. ఎవరో దాకా ఎందుకు తను ఉంటున్న దాపు దగ్గరకి వచ్చిన ముసలివాడి మీదే అది తీవ్రంగా దాడి చేస్తుంది. చావు తప్పి కన్నులొట్టబోయిన ముసలివాడు దగ్గరలో ఉన్న చెట్టెక్కి తన ప్రాణాలు కాపాడుకుంటాడు. ఇహ అక్కడి నుంచి ముసలివాడిది మరో కష్టం. పందినీ, దాని పిల్లలనీ క్రూరమృగాల నుంచి కాపాడుకోవాలి... కానీ చెట్టు దిగడానికి వీల్లేదు.   అతడు అడవిని జయించాడులోని ఇతివృత్తం, పాత్రలు వినడానికి చాలా సాదాసీదాగానే కనిపిస్తాయి. కానీ ఒక అద్భుతమైన రచన చేయడానికి కావల్సినన్ని హంగులన్నీ ఇందులో ఉన్నాయి. కార్యోన్ముఖుతని నిరూపించునేందుకు ఓ సందర్భం, ఆ సందర్భంలో అనేక సందిగ్ధాలు. వీటన్నింటి నుంచి జనించే జీవితసత్యాలు... ఇవన్నీ ఈ రచనలో కనిపిస్తాయి. ఇంత జరిగిన తర్వాత ముసలివాడి ప్రయత్నం ఫలిస్తుందని అనుకుంటాం. కానీ అతను అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా రిక్తహస్తాలతో తిరిగిరావడం పాఠకుడికి మింగుడుపడదు. కానీ జీవితం అంటే అంతే కదా! మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. అది ప్రతిసారీ సఫలం కావాలని లేదు కదా.   అందుకే ముసలివాడు చివరిలో ‘నేనింతటి యుద్ధం జరిపింది ఈ జడత్వాన్ని పొందడానికేనా?’ అని తనని తాను ప్రశ్నించుకుంటాడు. అంతలోనే ‘నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది నా జీవితంలో చివరి రోజు కాదు... ఈ రోజు నేను విపరీతమైన దురదృష్టాలకు లోనయ్యాను. లెక్కలేనన్ని ఎదురుదెబ్బలు తిన్నాను. ఐనా ఇది నా చివరి రోజు కాదు’ అంటూ తనని తాను సముదాయించుకుంటాడు.   కేవలం ఈ నవలే కాదు, కేశవరెడ్డి రాసిన ప్రతి నవలా ఒక అద్భుతమే! మూగవాని పిల్లనగోవి, చివరి గుడిసె, మునెమ్మలాంటి ఎనిమిది నవలలూ తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన స్థానాన్ని సంతరించుకున్నాయి. వీటిలో చాలా పుస్తకాలు ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయ్యాయి. వృత్తి రీత్యా వైద్యుడు అయిన కేశవరెడ్డి, మనిషి శరీరం మీదే కాదు... అతని మనసు మీద కూడా అద్భుతమైన పరిజ్ఞానం ఉందని తోస్తుంది ఈ రచనలు చదివితే!   - నిర్జర.  

శతకం రాసిన రాజు – భద్రభూపాలుడు

  శతకం రాసిన రాజు – భద్రభూపాలుడు   తెలుగు సాహిత్యంలో శతకాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి లోకాన్ని తరచి చూసిన అనుభవాన్ని నాలుగంటే నాలుగు వాక్యాలలో పాఠకులకు అందించేదే శతక పద్యం. ఈ శతకాల గురించి ప్రస్తావన రాగానే ముందు వేమన శతకమే గుర్తుకువస్తుంది. కానీ వేమనకు ఓ మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రజలను ఉర్రూతలూగించిన శతకం సుమతీ శతకం! నిజానికి సుమతీ శతకం ఎవరు రాశారన్న విషయం మీద ఏకాభిప్రాయం లేదు. వేమన, గువ్వల చెన్నా లాంటి శతకాలలోలాగా ఎక్కడా కూడా శతకకారుని ప్రస్తావనే కనిపించదు. కానీ చాలామంది అభిప్రాయం మేరకు ‘భద్ర భూపాలుడు’ అనే వ్యక్తి ఈ పద్యాలను రాసి ఉంటాడు. ఈయననే బద్దెన అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని అనువదించిన తిక్కన మహాకవికి ఈయన శిష్యుడని ఓ నమ్మకం. బద్దెన 13 శతాబ్దంలో జీవించాడు. ఒకవేళ ఈయనే కనుక సుమతీ శతకాన్ని రాసి ఉంటే... తెలుగులో శతక సాహిత్యానికి నాంది పలికిన కవులలో ఈయన ఒకరై ఉంటారు. నలుగురికీ మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో బద్దెన ఈ శతకాన్ని రాసినట్లు అర్థమవుతుంది. అందుకే ఈ శతకంలోని ప్రతి పద్యంలోనూ ‘సుమతీ’ (మంచి బుద్ధి కలవాడా) అన్న మకుటం కనిపిస్తుంది. భద్రభూపాలుని కాలం అటు రుద్రమదేవి కాలంతోనూ, ఇటు తిక్కన కాలంతోనూ సరిపోతోంది. కాబట్టి ఆయన తిక్కన శిష్యుడనీ, రుద్రమకు సామంత రాజు అనీ వినిపించే వాదనలు నిజమే కావచ్చు. 700 సంవత్సరాలకు పూర్వం ఈ శతకాన్ని రాసినా... అందులోని భాష కఠినంగా కనిపించదు. పైగా అందులోని అభిప్రాయాలు చాలా నిష్కర్షగా వెల్లడించినట్లు తోస్తుంది. కాబట్టి ఇది ఎవరో పండితుడు కాకుండా లోకరీతి తెలిసిన నాయకుడే రాసినట్లు అర్థమవుతుంది. సుమతీ శతకం, వందల సంవత్సరాలుగా పిల్లలకు ఒక Moral Scienceలాగా ఉపయోగపడుతోంది. అసలు పద్యాలు అన్న ఊసే తెలియని వారికి కూడా తన కోపమె తన శత్రువు, ఉపకారికి నుపకారములాంటి పద్యాలు గుర్తుండే ఉంటాయి. ఇక అప్పిచ్చువాడు వైద్యుడు, కనకపు సింహాసనము లాంటి వాక్యాలైతే ఏకంగా జాతీయాలుగా మారిపోయాయి.  అలాగని సుమతీ శతకంలో లోపాలూ లేవని కాదు. కొన్ని పద్యాలలో ఆడవాళ్ల పట్ల చాలా దురుసైన మాటలు కనిపిస్తాయి, మరికొన్ని పద్యాలలో కొన్ని కులాల పట్ల చాలా చులకన భావం వ్యక్తమవుతుంది. ఇంకొన్ని పద్యాలు పిల్లలు చదవదగ్గవిగా ఉండవు. ఇలాంటివి పక్కన పెడితే... తరతరాల పాటు తెలుగువారికి చెరిగిపోని నిధిలా సుమతీ శతకం కనిపిస్తుంది. భద్రభూపాలుడు కత్తితో ఏలిన రాజ్యం కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. కానీ ఆయన కలంతో ఏలిన సాహిత్య సామ్రాజ్యం సుస్థిరంగా నిలిచే ఉంటుంది.   - నిర్జర.  

తెలుగుకి పెద్ద దిక్కు - చిన్నయసూరి

  తెలుగుకి పెద్ద దిక్కు - చిన్నయసూరి   పరవస్తు చిన్నయసూరి. ఈ పేరు వినగానే బాలవ్యాకరణం పుస్తకమే గుర్తుకువస్తుంది. ఈ పుస్తకాన్ని చదవని తెలుగు పండితులు ఉండరేమో! ఆ మాటకి వస్తే ఈ పుస్తకాన్ని చదవకుండా తెలుగుభాష మీద పూర్తిగా పట్టు సాదించడం అసాధ్యం. ఇంతకీ ఈ చిన్నయసూరి ఎవరు. ఆయన రాసిన ‘బాలవ్యాకరణం’ పుస్తకం ఎందుకంత ప్రత్యేకం... చిన్నయసూరి 1809లో తమిళనాడులోని శ్రీపెరంబూరులో జన్మించారు. పుట్టిపెరిగింది అంతా తమిళనాడులోనే అయినా.... వీరి పూర్వీకులు తెలుగువారే! చిన్నయసూరి తన 16వ ఏట వరకూ చదువుకోనేలేదని అంటారు. ఆ తర్వాత చదవడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన పాండిత్యానికి తిరుగే లేకుండా పోయింది. తెలుగులో ఉన్న ఆ పాండిత్యంతోనే భాషకి సంబంధించిన అనేక వృత్తులను చేపట్టారు. అనువాదకునిగా, అధ్యాపకునిగా జీవనం సాగించారు. కొన్నాళ్లు బ్రౌన్ దొర దగ్గర కూడా ఉద్యోగం చేసినట్లు కూడా తెలుస్తోంది.   తెలుగు భాషే ఆలంబనగా సాగిపోతున్న ఆయన జీవితం ఈస్ట్‌ ఇండియా కంపెనీలో కొలువుతో మలుపు తిరిగింది. మద్రాసులోని సెయింట్‌ జార్జ్‌ కోటలో ఆంగ్లేయ విద్యార్థులకు తెలుగు బోధించేందుకు ఆయనకు ఆ ఉద్యోగం లభించింది. ఆ సమయంలోనే ఆయనకు సూరి అనే బిరుదు లభించింది. చిన్నయ వైష్ణవారాధకుడు అయినా బ్రాహ్మణుడు కాడు. కానీ పాండిత్యంలో ఎవ్వరికీ తీసిపోనివాడు. అందుకని అతని పేరు చివర కూడా ‘శాస్త్రి’ తరహాలో ఏదో ఒక బిరుదుని తగిలించుకొమ్మని ఆంగ్లేయులు సూచించారు. దాంతో పండితుడు అన్న అర్థం వచ్చే ‘సూరి’ అన్న పేరుని జోడించి చిన్నయసూరిగా మారాడు. చిన్నయసూరి గొప్ప పండితుడే కాదు, అద్భుతమైన రచనాశక్తి కలిగినవాడు కూడా! ఆయన 20కి పైగా గ్రంథాలు రాసినట్లు తెలుస్తోంది. కానీ వాటిలో బాలవ్యాకరణం, నీతిచంద్రిక మాత్రం తల్చుకుని తీరాల్సిన పుస్తకాలు. పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రబేధం అనే విభాగాల అనువాదమే నీతిచంద్రిక పుస్తకం. ఇక బాలవ్యాకరణం సంగతి సరేసరి. పేరుకి పిల్లల కోసం రాసిన వ్యాకరణమే అయినా... ఇది తెలుగు వ్యాకరణం మీద పూర్తి అవగాహన కలిగించే గ్రంథం. బాలవ్యాకరణం ముందు తెలుగులో వ్యాకరణ గ్రంథాలు లేవని కావు. కానీ అవేవీ ప్రజాదరణ పొందలేదు. తెలుగులో ఫలానా గ్రంథం వ్యాకరణానికి దిక్సూచి అని చెప్పుకోవడానికే లేదు. పండితులు తాము చిన్నప్పుడు విన్న వ్యాకరణ సూత్రాల ఆధారంగానే పద్యాలు, కావ్యాలు రచించేవారు. సంస్కృతంలో పాణిని రాసిన అష్టాధ్యాయిలాగా తెలుగులో వ్యాకరణ గ్రంథం కరువైంది. ఇలాంటి పరిస్థితులలోనే ఆంగ్లేయుల పాలన ఉచ్ఛదశకు చేరుకుంది. తెలుగుదేశంలో నిదానంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలన్న వ్యూహాలు మొదలయ్యాయి. పండితులు కూడా తెలుగుని ఆశ్రయించాలా, సంస్కృతంలో రచనలు చేయాలా అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. అలాంటి కీలక దశలో వచ్చిన గ్రంథమే ‘బాలవ్యాకరణం’. తెలుగు వర్ణమాల దగ్గర నుంచి, సంధులుసమాసాల వరకూ ప్రాథమిక సూత్రాలు అన్నింటితోనూ చిన్నయసూరి ఈ గ్రంథరచన చేశారు. చిన్నయసూరి గ్రాంథిక భాషనే ఇష్టపడేవారు. అయినా ఆయన రాసిన వ్యాకరణ గ్రంథం, తెలుగు భాష ప్రజలకు మరింత చేరువ కావడానికి ఉపయోగపడింది. సామాన్యులు సైతం మహా కావ్యాలను ఆకళింపు చేసుకునేందుకు సాయపడింది. చిన్నయసూరి ప్రభావంతో బహుజనపల్లి సీతారామాచార్యులవారు ‘శబ్దరత్నాకరం’ పేరుతో ఒక నిఘంటువుని రూపొందించారు. ఇక కందుకూరి వీరేశలింగం పంతులు వంటి ప్రముఖుల మీద సైతం చిన్నయసూరి ప్రభావం కనిపిస్తుంది. వ్యక్తుల సంగతి అలా ఉంచితే... తెలుగుజాతి మీద, భాష మీద ఆయన ప్రభావం అసమాన్యం. - నిర్జర.

తెలుగుభాషకు కొత్త అడుగు - గిడుగు రామమూర్తి

తెలుగుభాషకు కొత్త అడుగు - గిడుగు రామమూర్తి     ఒక వంద సంవత్సరాల క్రితం ప్రచురించిన పుస్తకం ఏదన్నా తీసుకోండి. దాన్ని చదివేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాగొలా చదివినా... అందులోని చాలా పదాలకు మనకు అర్థమే స్ఫురించదు. మొత్తంగా ఆ పుస్తకాన్ని పూర్తిచేసిన తర్వాత, అందులో ఓ పదోశాతం మనకు బుర్రకు ఎక్కుతుందేమో! ఎందుకంటే అప్పట్లో పుస్తకం రాయాలంటే గ్రాంథిక భాషలోనే రాయాలి అనే అలిఖిత నిబంధన ఉండేది. ఆ నియమాన్ని మార్చి, తేట తెలుగుని నలుచెరగులా ప్రచారం చేసిన వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు. రామమూర్తిగారు 1863, ఆగస్టు 29న శ్రీకాకుళం దగ్గర ఉన్న ఓ చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో విజయనగరంలో ఉన్న మేనమామ దగ్గరకు చేరారు. అక్కడే మెట్రికులేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత పెద్ద దిక్కు లేని తన కుటుంబాన్ని పోషించే బాధ్యతను చేపట్టారు. ఒక పక్క తన కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధ్యాయ వృత్తిని సాగిస్తూనే, మరోపక్క ఉన్నత విద్యను పూర్తిచేసి లెక్చరర్గా పదోన్నతిని పొందారు.     గిడుగు గురించి వినగానే మనకు వ్యవహారిక భాషోద్యమం గుర్తుకువస్తుంది. అప్పట్లో పాఠ్యపుస్తకాలు, గ్రంథాలు అన్నీ కూడా గ్రాంథిక భాషలోనే ఉండేవి. అంటే రోజువారీ ప్రజలు మాట్లాడుకునే భాషలో కాకుండా, వందల ఏళ్లనాటి రాచరికపు భాషను తలపించేవన్నమాట. దీని వల్ల అటు పాఠ్యపుస్తకాలలో ఉండే విజ్ఞానం కానీ, గ్రంథాలలో ఉండే విషయ పరిజ్ఞానం కానీ సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు. ఈ పద్ధతిని మార్చాలనుకున్నాడు గిడుగు. మాట్లాడే భాష, రాసే భాష ఒకటి కావాలనుకున్నాడు. అందుకోసం వ్యవహారిక భాషోద్యమాన్ని ఆరంభించాడు. పత్రికలు నడుపుతూ, సమితులు ఏర్పాటు చేస్తూ, ప్రసంగాలు సాగిస్తూ... వ్యవహారిక భాష గురించి విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన సమకాలికులైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, తాపీధర్మారావు వంటి ప్రముఖులు కూడా గిడుగులు అండగా నిలబడటంతో, క్రమంగా ఆయన ఉద్యమం సత్ఫలితాలను ఇవ్వసాగింది.     వ్యవహారిక భాషోద్యమం ఏమంత తేలికగా సాగలేదు. ఆనాటి పండితులు చాలామంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా జయంతి రామయ్యపంతులు, వావిలికొలను సుబ్బారావు లాంటి పండితుల ఆధ్వర్యంలో ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ పేరుతో ఒక సంఘాన్నే నెలకొల్పారు. అయితే ఇలాంటి ప్రతిఘటనలకి వెరవకుండా దాదాపు నాలుగు దశాబ్దాలపాటు వ్యవహారిక భాష కోసం పోరాడారు గిడుగు. ఆ ఫలితం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. గిడుగు జీవించిన విజయనగరం జిల్లాలో సవర అనే ఒక భాష వినిపిస్తుంది. సవరులు అనే ఒక ప్రాచీన తెగ వారు ఈ భాషని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉత్తరాంధ్ర, ఒడిషాలలో నివసించే ఈ సవరులు తమ భాషను కాపాడుకోవడంలో నానాతంటాలు పడటాన్ని గిడుగు గమనించారు. సవర భాషకి ఎలాంటి లిపి లేదు. అంటే మాట్లాడుకోవడం తప్ప రాసుకోవడానికి వీల్లేదన్నమాట! దాంతో సవర భాషకి ఎలాంటి సాహిత్యమూ లేకుండా పోయింది. పైగా అటు ఒడిషా, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల మధ్య దాని ప్రాభవం క్షీణించిపోసాగింది. సవరులను గమనించిన గిడుగు రామమూర్తి పంతులుగారు, ఎలాగైనా వారి భాషను కాపాడాలనుకున్నారు. సవరభాష తెలిసినవారి సాయంతో స్వయంగా ఆ భాషని నేర్చుకున్నారు. పర్లాకిమిడి కొండల్లో తిరుగుతూ వారి సాహిత్యాన్ని సేకరించారు. సవరలో ఉండే పదాలను, జానపద గేయాలను పోగుచేశారు. వాటిని తెలుగు లిపిలో పుస్తకాలుగా ప్రచురించారు. అలా ప్రచురించిన A Manual of the Savara Language, Savara – English dictionary వంటి పుస్తకాలు ఇప్పటికీ ఆ భాష నిలిచి ఉండేందుకు సాయపడుతున్నాయి. సవరుల పదాలను, పాటలను సేకరించేందుకు గిడుగు పర్లాకిమిడి కొండలలో ఎండనకా, వాననకా తెగ తిరిగేవారు. ఆ సమయంలో తరచూ దోమకాట్ల బారినపడి మలేరియాకు గురయ్యేవారు. దానికి విరుగుడుగా క్వినైన్ అనే ఔషధాన్ని వాడుతూ ఉండాల్సి వచ్చేది. ఈ క్వినైన్తో ఆయన మలేరియా కుదురుకున్నా, గిడుగు వినికిడి మాత్రం శాశ్వతంగా దెబ్బతిన్నది. తన ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా ఇటు తెలుగుకీ, అటు సవర భాషకీ గిడుగు చేసిన కృషికిగాను ఆయనకు ‘రావు బహదూర్’ మొదలుకొని ‘కళాప్రపూర్ణ’ వరకు అనేక బిరుదులు లభించాయి. కానీ ప్రజల మనసులో ఆయనకి ఉన్న స్థానం... వేలాది బిరుదులను మించినది. గిడుగు పుట్టినరోజైన ఆగస్టు 29ని జనం ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకోవడమే ఇందుకు గొప్ప ఉదాహరణ! తెలుగు ఉన్నంతవరకూ, గిడుగు ఉంటాడని చెప్పే ఓ సూచన. - నిర్జర.    

హరికథకు గురువు - నారాయణదాసు

  హరికథకు గురువు - నారాయణదాసు ఏదైనా ఒక ప్రక్రియకు ఆద్యుడు అన్న పేరు సాధించడం తేలిక కాదు! చరిత్ర నిలిచినంతకాలం జనులు తల్చుకునే బిరుదు అది. అలా హరికథా పితామహునిగా వినుతికెక్కిన ఆదిభట్ల నారాయణదాసు గురించి స్మరించుకు తీరాల్సిందే! ఆదిభట్ల నారాయణదాసు 1864లో విజయనగరం జిల్లా బొబ్బిలికి సమీపంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఏకసంథాగ్రాహిగా పేరుతెచ్చుకున్నారు. చదువుకొనే స్తోమత లేకపోయినా, ఏ పద్యం విన్నా కూడా ఆ పద్యాన్ని కంఠతా పట్టేసేవారట. నారాయణదాసుగారి ప్రతిభను గమనించిన వారి తాతగారు అతన్ని తన దగ్గరే ఉంచుకుని సంగీత శిక్షణా, విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించారు. ఆ ఒక్క ఆసరాతో నారాయణదాసుగారి జీవితమే మారిపోయింది. నారాయణదాసు సాహిత్యంలో అపారమైన ప్రతిభను కనబరచడం మొదలుపెట్టారు. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ, సంస్కృతం... సహా తొమ్మిది భాషల మీద ఆయనకు పట్టు ఉండేదట. తెలుగులో అశువుగా కవిత్వం చెప్పడం, వెనువెంటనే ఆ కవిత్వాన్ని ఇంగ్లిష్‌లోకి కూడా అనువదించేయడం చేసేవారట. ఇటు సంస్కృతంలో కాళిదాసు రచనలనీ, అటు ఆంగ్లంలో షేక్సియర్‌ రచనలనీ దాసుగారు అరాయించేసుకున్నారు. ‘నవరస తరంగిణి’ పేరుతో ఆ ఇద్దరి రచనల మధ్యా ఉన్న సారూప్యతల గురించి ఏకంగా ఓ గ్రంథాన్నే రాసేశారు. కేవలం గ్రంథరచనే కాదు అనువాదాలలోనూ ఆయన ఆరితేరినవాడు. అనువాదంలో ఎలాంటి లోటూ రాకుండా ఉండేందుకు ఆయన మూల గ్రంథం మీదే ఆధారపడేవారు. ఉమర్‌ ఖయ్యాం రుబాయితులు, ఏసఫ్‌ రాసిన నీతికథలను తెలుగులోకి అనువదించి... తెలుగునాట అనువాద సాహిత్యానికి శ్రీకారం చుట్టారు. సాహిత్యమే కాదు, సంగీతంలో కూడా నారాయణదాసుగారు అపారమైన ప్రతిభను కనబరిచేవారు. సంగీత స్వరాలను ఆలపించడంలోనూ, వీణ వాయించడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకొనేవారు. రుగ్వేదంలోని రుక్కులను సైతం సంగీతరూపంలోకి మార్చిన ఘనుడాయన. కర్నాటక సంగీతంలో ఉన్న రాగాలు అన్నింటిలోనూ కృతులను రాసిన సంగీతజ్ఞాని. అందుకనే విజయనగర రాజులు ఆయనను ఆస్థానవిద్వాసునిగా ఎన్నుకొన్నారు. 1919లో విజయనగరరాజులు సంగీతకళాశాలను ఏర్పాటు చేసినప్పుడు, నారాయణదాసుగారినే తొలి ప్రధానోపాధ్యాయునిగా ఎన్నుకొన్నారు. నారాయణదాసు అసలు పేరు సూర్యనారాయణ. ఓసారి కన్నమనాయుడు అనే వ్యక్తి హరికథ చెప్పడం చూసి, తాను కూడా ఆ రంగంలో అడుగుపెట్టాలనుకున్నారు. క్రమంగా హరికథాగానంలో ఆరితేరడంతో ఆయనని నారాయణదాసుగా పిలవడం మొదలుపెట్టారు. నిజానికి హరికథలు తెలుగువారికి కొత్తేమీ కాదు! అయితే దానికి ఒక ఆకర్షణను తీసుకువచ్చిన వ్యక్తి మాత్రం నారాయణదాసే. సాదాసీదాగా సాగిపోయే కథకు, సంగీతం, ఆలాపన, నృత్యం అన్నింటినీ జోడించి జనాలను రంజింపచేసేవారు. ఒకో సందర్భంలో ఏకబిగిన ఆరేడుగంటల పాటు హరికథను ఆలపించేవారట. ఎలాంటి మైకులూ, ఆర్భాటాలూ లేని ఆ రోజుల్లో ఆజానుబాహుడైన నారాయణదాసు, తన రూపంతోనూ, కంఠంతోనూ, ఆలాపనతోనూ జనాన్ని ఉర్రూతలూగించేవారు. తన తర్వాత వచ్చిన గాయకులందరికీ ఒక మార్గదర్శిగా నిలిచారు. అందుకనే ఆయనను హరికథా పితామహుడు అని పిలుస్తారు. కవిత్వం, హరికథలు, శతకాలు, తాత్విక... ఇలా ఎన్నో రంగాల మీద నారాయణదాసుగారు వందకుపైగా గ్రంథాలను రాశారని చెబుతారు. వీటితో పాటుగా ‘నా ఎఱుక’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు. అందులో తన భావాలను, అనుభవాలను ఎలాంటి దాపరికమూ లేకుండా పంచుకున్నారు. నారాయణదాసుగారి గురించి విని ఆయనను ఆరాధించేవారికి, ఆయన ఆత్మకథ కాస్త కష్టం కలిగిస్తుంది. ‘నా ఎఱుక’లో తను నల్లమందు తినేవాడిననీ, మద్యపానం చేసేవాడిననీ, వేశ్యల వెంట తిరిగేవాడిననీ నారాయణదాసుగారు నిర్మొహమాటంగా చెప్పుకొన్నారు. డబ్బు కోసం, కీర్తి కోసం తాను జిమ్మిక్కులు చేసినట్లుగా కూడా ఇందులో స్పష్టం అవుతుంది. పైగా వితంతు వివాహాలు, స్త్రీ విద్య వంటి విషయాలలో నారాయణదాసుగారికి వ్యతిరేక భావనలు ఉన్నట్లు స్పష్టం అవుతుంది. నారాయణదాసుగారి వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెడితే, ఆయన పాండితీ ప్రకర్షను ఏమాత్రం తక్కువచేసి చూడలేం. అందుకే ఆయన చనిపోయి 60 ఏళ్లు దాటిపోతున్నా.... ఇప్పటికీ నారాయణదాసుగారిని తెలుగువారంతా తల్చుకుంటూనే ఉన్నారు. - నిర్జర  

సాటిలేని రచయిత – ఆరుద్ర!

సాటిలేని రచయిత – ఆరుద్ర! రచయిత అన్నాక అక్షరం మీద పట్టు ఉండటం సహజమే! అందుకే కొందరు రచయితలు సాహిత్యానికి సంబంధించిన చాలా ప్రక్రియలలో అడుగుపెడుతూ ఉంటారు. కొండొకచో విజయాన్నీ సాధిస్తుంటారు. కానీ సాహిత్యంలో సవ్యసాచిలా ఎడాపెడా తన ప్రాభవాన్ని చూపగలిగే ప్రతిభ అతికొద్దిమందికే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో అలాంటివారి గురించి చెప్పుకునే సందర్భం వస్తే బహుశా ఆరుద్రతోనే ఆరంభించాలేమో! ఆరుద్ర శ్రీశ్రీతో పోటీపడుతూ విప్లవకవితలు రాశాడు; ‘త్వమేవాహం’తో దాశరథికి దీటుగా నిజాం అకృత్యాలను ఎండగట్టాడు; తాపీ ధర్మారావుని తలపిస్తూ ‘గుడిలో సెక్స్‌?’ అనే హేతువాద రచన చేశాడు; ఆత్రేయకు పోటీగా మనసుని కరిగించే సినీగీతాలు రాశాడు. ఆరుద్ర ఏం రాశాడు అన్నదానికి ఓ చాంతాడంత జాబితా కనిపిస్తుంది- గేయాలు, నాటికలు, కథలు, కవితలు, నవలలు, సాహిత్య పరిశోధన, సినీగీతాలు, సంభాషణలు, డిటెక్టివ్‌ సాహిత్యం, అనువాదం, విమర్శ, సంపాదకత్వం... ఇలా సాహిత్యంలోని ప్రతి రంగం మీదా, తన కలంతో అరుదైన విన్యాసాలు చేశాడు. ఆరుద్ర 1925లో విశాఖపట్నంలో జన్మించారు. ‘భాగవతుల సదాశివశంకర శాస్త్రి’ అన్నది వీరి అసలు పేరు. కాకపోతే జన్మనక్షత్రమైన ఆరుద్ర అనే కలంపేరుతోనే ప్రసిద్ధులయ్యారు. ఆరుద్ర విద్యాభ్యాసం సాధారణంగానే సాగింది. క్విట్‌ ఇండియా ఉద్యమంతో అది అర్థంతరంగా ముగిసింది కూడా! కానీ చదువుకునే సమయంలో రోణంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజుల వంటి సాహితీమూర్తులు పరిచయం ఆయనను సాహిత్యం వైపుగా నడిపింది. 1947లో చెన్నైలోని ‘ఆనందవాణి’లో ఉపసంపాదకునిగా చేరడంతో ఆరుద్ర జీవితం పూర్తిగా సాహిత్యం దిశగా సాగింది. మొదట్లో ఆరుద్ర తన బతుకుబండిని లాగడం కోసం విస్తృతంగా రాసేవారు. ఒకానొక సందర్భంలో నెలకి ఒక డిటెక్టివ్‌ నవల రాసితీరుతాను అని ‘ఆరుద్ర శపథం’ పట్టారని చెబతారు. క్రమేపీ సినీరంగంలో అవకాశాలు దక్కడంతో ఆయన ప్రభకి తిరుగులేకుండా పోయింది. ఒక అంచనా ప్రకారం ఆరుద్ర నాలుగువేలకు పైగానే సినిమాపాటలు రాశారు. కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల), వేదంలా ప్రవహించే గోదావరి (ఆంధ్ర కేసరి), ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు), రాయినయినా కాకపోతిని (గోరంత దీపం), శ్రీరస్తు శుభమస్తు (పెళ్లి పుస్తకం) లాంటి పాటలు వింటే చాలు... ఆరుద్ర ప్రతిభ ఏపాటిదో అర్థమైపోతుంది. ఇప్పటి కుర్రకారు కూడా విని ఉద్రేకపడిపోయే ‘మసక మసక చీకటిలో’ పాట రాసింది ఆరుద్రే అంటే ఆశ్చర్యం కలగక మానదు. కేవలం పాటలే కాదు, ఆరుద్ర కథ అందించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు లాంటి సినిమాలు తెలుగు చిత్రచరిత్రలోనే అద్భుతాలుగా నిలిచాయి. ఆరుద్ర సినీగీతాల సంగతి అలా ఉంచితే ‘కూనలమ్మ పదాలు’ పేరుతో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ‘కూనలమ్మ పదాలు’తో నాలుగంటే నాలుగు వాక్యాలలో ఏ అంశం మీదైనా తనదైన స్పష్టతని ఇచ్చేవారు ఆరుద్ర. సగము కమ్యూనిస్ట్/ సగము కాపిటలిస్ట్/ ఎందుకొచ్చిన రొస్టు/ ఓ కూనలమ్మ ! అంటూ గోడమీద పిల్లులను వెక్కిరించినా,  కొంటెబొమ్మల బాపు/ కొన్ని తరముల సేపు/ గుండె ఊయలలూపు/ ఓ కూనలమ్మా! అంటూ తన సమకాలికుని ప్రతిభను మెచ్చుకొన్నా ఆరుద్ర కూనలమ్మ పదాలకే చెల్లింది. ఆరుద్ర విస్తృతంగా రాసి ఉండవచ్చు. కానీ సాదాసీదాగా మాత్రం రాసిపారేయలేదు. ఏ అంశం గురించి రాసినా దాని మీద ఒక సాధికారితతో రాసేవారు. ‘రాముడికి సీత ఏమవుతుంది?’ అన్న పుస్తకం చదివితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రామాయణాలని రచయిత చదివి రాసినట్లు స్పష్టం అవుతుంది. ‘కాటమరాజు కథ’ నాటకాన్ని చదివితే అందుకోసం అప్పటివరకూ కాటమరాజు ఇతివృత్తం మీద అప్పటివరకూ ప్రచారంలో ఉన్న గాథలన్నింటినీ క్రోడీకరించి రాసినట్లు తెలుస్తుంది. బహుశా ఆ పరిశీలనా శక్తితోనే ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్య’ రచనకి పూనుకొని ఉంటారు. ఆరుద్ర సాహిత్యమంతా ఒక ఎత్తయితే ఆయన వెలువరించిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ మరొక ఎత్తుగా భావిస్తూ ఉంటారు. ఏ అకాడెమీలో ప్రభుత్వాలో మాత్రమే పూనుకొని పదులకొద్దీ పండితుల చేత దశాబ్దాలపాటు పని చేయించి రాయించగలిగే పుస్తకాలు ఇవి. ఈ 12 సంపుటాలనీ ఆరుద్ర ఒక్కరే రాశారంటే నమ్మశక్యం కాదు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించినా, ఆర్థిక వనరులు మందగించినా వెనుకడుగు వేయనేలేదు. ఈ 12 సంపుటాలలోనూ ఆరుద్ర వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్న తెలుగు సాహితీ ప్రస్థానాన్ని నమోదు చేశారు. ఆయన కృషి అసమాన్యం కాబట్టే ఆ సంపుటాలు వెలువడి దాదాపు 50 ఏళ్లు కావస్తున్నా... ఇప్పటికీ తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి ప్రామాణికంగా ఉన్నాయి.   ఆరుద్ర గురించి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అభ్యుదయ రచయితల సంఘాన్ని (అరసం) స్థాపించడంలో ఆయన కృషి దగ్గర్నుంచీ శ్రీశ్రీతో చెలరేగిన వివాదాల వరకూ ఆరుద్ర జీవితంలో చాలా రసకందాయమైన ఘట్టాలున్నాయి. అవి ఎప్పుడైనా మరోసారి!!! - నిర్జర

ఆ డిటెక్టివ్ రచయిత జీవితమే ఓ మిస్టరీ!

  ఆ డిటెక్టివ్ రచయిత జీవితమే ఓ మిస్టరీ!       సాహిత్యం గురించి ఎంతో కొంత తెలిసిన వారికి ‘అగాథా క్రిస్టీ’ పేరు పరిచయమే! నరాలు తెగిపోయే ఉత్కంఠతతో మిస్టరీ నవలలు రాయడంలో ఆమెకి ఆమే సాటి. అందుకే బైబిల్, షేక్స్పియర్ పుస్తకాల తర్వాత అత్యధికంగా ఆమె పుస్తకాలే అమ్ముడుపోయాయి. అగాథా క్రిస్టీ రాసిన దాదాపు 80 పుస్తకాలు ఇప్పటివరకూ 400 కోట్ల ప్రతులు అమ్ముడుపోయాయంటే... ఆమె సత్తా ఏమిటో తెలిసిపోతుంది. అలాంటి అగాథా జీవితంలోని ఓ ఘట్టం ఇప్పటికీ వీడని చిక్కుముడిగానే మిగిలిపోయింది. అది 1926 సంవత్సరం. అగాథా వయసు అప్పటికి 36 ఏళ్లు. కానీ ఆపాటికే ఆమె పాపులర్ రచయిత్రి. తను రాసే ప్రతి వాక్యంతోనూ పాఠకులను వెర్రెత్తిస్తున్న శక్తి. కానీ అకస్మాత్తుగా ఓ రోజు ఆమె అదృశ్యం అయిపోయింది. తన కారుని నడుపుతూ వెళ్లిన ఆమె ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోయింది. అగాథా అదృశ్యం అయ్యిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. మర్నాడు పత్రికలలో పతాక శీర్షిక ఆమె అదృశ్యమే!   అగాథా తాను బయటకు వెళ్లేటప్పుడు ‘యార్క్షైర్’ అనే ప్రదేశానికి వెళ్తున్నట్లు తన సెక్రెటరీతో చెప్పి వెళ్లింది. కానీ మర్నాడు ఆమె కారు ఎక్కడో దూరంగా ఉన్న ‘న్యూలాండ్స్ కార్నర్’ అనే ప్రదేశంలో కనిపించింది. అందులో అగాథా దుస్తులు, లైసెన్స్ పోలీసులని వెక్కిరించాయి. ఇక దాంతో అగాథా ఏమై ఉంటుందన్న సందేహంతో ఇంగ్లండు వెర్రెత్తిపోయింది. అగాథాని వెతికించేందుకు స్వయంగా మంత్రులు రంగంలోకి దిగారు. వేయిమంది పోలీసు అధికారులను ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు నియమించారు. దేశంలోని అణువణువునీ గాలించేందుకు ఓ 15 వేలమంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అగాథా ఆచూకీ తెలిపినవారికి భారీ బహుమానం ఇస్తామంటూ వార్తాపత్రికలు స్వయంగా ప్రకటనలు ఇచ్చాయి. ఆఖరికి కొందరు మంత్రగాళ్లు కూడా రంగంలోకి దిగారు. కానీ రోజులు గడిచేకొద్దీ అగాథాకి సంబంధించిన చిన్నపాటి ఆచూకీని కూడా పొందలేకపోయారు.     1926 డిసెంబరు 14. అగాథా అప్పటికి తప్పిపోయి సరిగ్గా 11 రోజులు. ఆ రోజున అగాథా ‘Old Swan’ అనే ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆమె ఈ లోకంలో లేదు. తనెవరలో, తన పేరేమిటో కూడా గుర్తులేనంత అయోమయంలో ఉంది. దాంతో ఆమెని భద్రంగా వెనక్కి తీసుకువచ్చి వైద్యపరీక్షలు నిర్వహించారు. అగాథా తాత్కాలిక మతిమరపుతో (అమ్నీషియా)తో బాధపడుతున్నట్లు తేలింది. ఒక పక్క విపరీతమైన పని ఒత్తిడి, మరో పక్క ఆ మధ్యే చనిపోయిన తల్లి మరణంతో ఆమె డిప్రెషన్కు లోనై ఉంటుందనీ... దాంతో తాత్కాలికంగా ఆమె మతి భ్రమించిందనీ వైద్యులు తేల్చారు. ఆ తర్వాతకాలంలో తాను అదృశ్యమైన విషయం గురించి అగాథా ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ఆమె మారుపేరుతో రాసిన Unfinished portrait అనే నవలలో మాత్రం, ఆత్మహత్య చేసుకోబోయి మనసుమార్చుకున్న మనిషి గురించి ప్రస్తావించారు. తర్వాతకాలంలో అగాథా అదృశ్యం గురించి అనేక కథనాలు, విశ్లేషణలు, పుస్తకాలు వచ్చాయి. వాటిలో చాలామంది తేల్చిన కారణం ఏమిటంటే-   అగాథా భర్త ‘ఆర్చీ క్రిస్టీ’కి పరాయి స్త్రీతో సంబంధం ఏర్పడింది. అగాథాకి విడాకులు ఇచ్చి ఆమెని పెళ్లి చేసుకునేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు. భర్త తననుంచి దూరమవుతున్నాడన్న విషయాన్ని అగాథా తట్టుకోలేకపోయారు. దాంతో ఆమె తరచూ డిప్రెషన్లో కూరుకుపోయేవారు. ఆ సమయంలో ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు కూడా వచ్చేవి. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే డిటెక్టివ్ నవలలు రాసీ రాసీ ఆమె బుర్ర పదునెక్కిపోవడంతో... తన ఆత్మహత్యను కూడా ఒక ప్రతీకారం కిందకి మార్చుకోవాలని అనుకున్నారు.   అగాథా  ‘Old Swan’ హోటల్లో దిగినప్పుడు తన పేరు కాకుండా, తన భర్త ప్రియురాలి పేరు మీద రూం తీసుకున్నారు. అక్కడ తను ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రియురాలే అగాథాని చంపి ఉంటుందని లోకం నమ్ముతుంది కదా! ఒకవేళ ఎప్పటికో నిజం బయటపడినా... ఆ క్రమంలో ఆమె భర్తా, అతని ప్రియురాలూ అభాసుపాలు కావడం ఖాయం. అందుకే అగాథా అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయి ఉంటుందని విశ్లేషకుల అంచనా! అయితే ఏ కారణం చేతనో ఆమె మనసు మళ్లీ మారింది. తనని మోసం చేసిన భర్త కోసం తన ప్రాణం తీసుకోవడం ఏమిటి? అన్న ఆలోచన వచ్చి ఉండవచ్చు. కానీ ఈ పదిరోజులూ ఎందుకని ఇంటికి దూరంగా ఉన్నావు? అని ప్రపంచం అడిగితే ఏమని చెప్పేది! అందుకే మతిమరపు నాటకాన్ని ఆడింది.   అయితే పైన చెప్పుకొన్నదంతా విశ్లేషణ మాత్రమే! నిజంగా అగాథా మనసులో ఏముంది? ఆ 11 రోజులూ ఆమె ఏం చేసింది? ఆమె అదృశ్యం అవ్వడానికి వెనక ఉన్న కారణం ఏమిటి?... లాంటి ప్రశ్నలకు ఇంతవరకూ స్పష్టమైన జవాబు లేనేలేదు. ఆ జవాబు చెప్పగలిగిన అగాథా క్రిస్టీ కూడా ఇప్పుడు ప్రపంచంలోనే లేదు. కాబట్టి ఈ రహస్యం ఆమెతో సమాధి అయిపోయినట్లే! ఎన్నో డిటెక్టివ్ నవలలను అద్భుతమైన మలుపులు తిప్పి, అనూహ్యమైన ముగింపులు ఇచ్చిన ఆ మహారచయిత్రి... చివరికి తన జీవితాన్నే ఒక మిస్టరీగా మిగిల్చి వెళ్లింది. - నిర్జర.    

ఓ సంచలన రచయిత - శరత్ చంద్ర!

  ఓ సంచలన రచయిత - శరత్ చంద్ర!     ccc కానీ ఓ 30 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎవరిని కదిపినా కూడా శరత్ నవలల చిట్టా చదివేవారు. డిటెక్టివ్ నవలలకి పోటీగా శరత్ నవలలు అమ్ముడుపోయేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భారతదేశంలో అత్యంత పాపులర్ రచయిత శరత్చంద్రే! శరత్చంద్ర బెంగాల్లోని దేవానంద్పూర్ అనే గ్రామంలో 1876లో జన్మించారు. శరత్ తండ్రి బద్దకిష్టి. ఎప్పుడూ పగటి కలలలో తేలిపోతుండేవాడు. ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండేవాడు కాదు! దానికితోడు ఐదుగురు సంతానం. అంచేత పేదరికం ఎప్పుడూ వారికి తోడుగా ఉండేది. శరత్కు తండ్రి నుంచి ఆస్తులైతే రాలేదు కానీ, సాహిత్యం పట్ల అభిలాష మాత్రం వారసత్వంగా అందింది. 1903లో ఉద్యోగం కోసం బర్మాకు చేరుకున్న శరత్, అక్కడే తన సాహితీవ్యాసంగాన్ని ఆరంభించాడు. అదే ఏడాదిలో వచ్చిన ‘మందిర్’ అనే రచనను ఆయన తొలి ప్రచురణగా చెబుతారు. అప్పుడొకటీ అప్పుడొకటీ, కథ ఒకటీ నాటకం ఒకటీ రాస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్న శరత్ జీవితం... మళ్లీ బెంగాల్కు చేరుకోవడంతో వేగాన్ని అందుకొంది. 1916లో కోల్కతా సమీపంలోని హౌరాలో స్థిరపడిన శరత్ తన కలానికి పదునుపెట్టాడు. అదే సమయంలో సంస్కృత కావ్యాలని కూడా అధ్యయనం చేసే అవకాశం లభించడంతో, ఆయన రచనలు మరో స్థాయికి చేరుకున్నాయి. విప్రదాసు, చంద్రనాథ్, బడదీదీ, నయావిధాన్, శ్రీకాంత లాంటి 30కి పైగా నవలలు దేశాన్ని ఒక్క ఊపు ఊపేశాయి. శరత్ నవలలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే! 1926లో వచ్చిన ‘పతేర్బడీ’ స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో వచ్చిన నవల. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సామన్య జనాల్ని అది ప్రభావితం చేస్తోందన్న భయంతో ప్రభుత్వం ఆ నవలను నిషేధించాల్సి వచ్చింది. ఇక భగ్న ప్రేమికునికి మారుపేరుగా నిల్చిపోయే దేవదాసు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! బలమైన స్త్రీపాత్రలతో సాగే ‘పరిణీత’ వంటి నవలలూ ప్రజాదరణ పొందినవే! ఆనాటి ప్రజల జీవనవిధానాలనీ, సంప్రదాయలనీ చిత్రించే ‘పల్లీసమాజ్’ వంటి నవలలూ చిరకాలం గుర్తుంచుకోదగ్గవే!     శరత్ బెంగాల్ రచయిత మాత్రమే కావచ్చు. కానీ అనువాదాల పుణ్యమా అని దేశం యావత్తూ ఆయనను తన అభిమాన రచయితగా ఆరాధించింది. ఒకానొక సమయంలో శరత్ నవలలు చదివేందుకే బెంగాలీ నేర్చుకున్నవారు కూడా కనిపించేవారు. ఇక తెలుగువారి సంగతైతే చెప్పనే అవసరం లేదు. శరత్ తెలుగువాడేమో అన్నంతగా ఆయనను ఆదరించారు. విజయా సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన చక్రపాణి బెంగాల్ నేర్చుకుని మరీ శరత్ నవలలను తెలుగులోని అనువదించారు. తెలుగు చిత్రరంగం కూడా శరత్ పట్ల విపరీతమైన ఆభిమానం చూపింది. దేవదాస్ నవలల ఆధారంగా వాగ్దానం, తోడికోడళ్లు, బాటసారి, దేవదాసు, అర్ధాంగి వంటి చిత్రాలను నిర్మించింది. ఎన్టీఆర్ తొలిచిత్రమైన ‘మనదేశం’ కూడా ‘విపుర్దాస్’ అనే శరత్ నవల ఆధారంగానే రూపొందించారని చెబుతారు. శరత్ నవలలోని నాయకులందరూ సిగ్గరులే! కొండొకచో వ్యసనపరులే! శరత్ కూడా తన జీవితంలో అలాగే ఉండేవాడట. విపరీతంగా తాగడం, నల్లమందు తినడం చేసేవాడట. 1938లో లివర్ కేన్సర్తో చనిపోవడానికి ఆ తాగుడే కారణం కావచ్చునంటారు. శరత్ వ్యసనాలని పక్కనపెడితే ఆయన వ్యక్తిత్వం మాత్రం ఆయన సాహిత్యమంత ఉన్నతంగానే ఉండేదట. శరత్ ఆనాటి స్వతంత్ర్య సంగ్రామంలో పాల్గొని 15 ఏళ్లపాటు హౌరా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన జాతిబేధాలను పాటించేవారు కాదట! హౌరాలోని సంతేబర్ ప్రాంతంలో ఉండగా శరత్ కులమతాలను పాటించకపోవడం చూసి, అక్కడి ప్రజలు ఆయనను వెలివేశారు. దాంతో స్వయంగా ఒక ఇంటిని నిర్మించుకుని పదకొండేళ్లపాటు ఆ ఇంట్లోనే నివసించారు. ఆనాడు శరత్ నివసించిన ఇంటిని, బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికీ సంరక్షిస్తూ వస్తోంది. శరత్చంద్ర వాడిన వస్తువులనూ, నాటిన చెట్లనూ ఇప్పటికీ ఆ ఇంటి ప్రాంగణంలో చూడవచ్చు.       శరత్ తన జీవితకాలంలోనే గొప్ప రచయితగా పేరు పొందాడు. అయినా తాను అంతటివాడినన్న అభిజాత్యం కానీ, తన కీర్తికి తగిన గౌరవం దక్కాలన్న కక్కుర్తి కానీ ఆయనలో కనిపించేది కాదు. అందుకేనేమో టాగూర్ వంటి సమకాలికులు ఆయనను ఎంతగానో గౌరవించేవారు. ప్రస్తుతం శరత్ని అభిమానించడానికి ఆయన వ్యక్తిత్వం గురించి మనకి తెలియనవసరం లేదు. కానీ ఒక్కసారి ఆయన రాసిన పుస్తకం ఏదన్నా చేత పట్టుకుంటే చాలు... రచయితగా ఆయన సత్తా ఏమిటో మనకి తేలిపోతుంది. మంచో- చెడో, కాల్పనికమో- వాస్తవికమో, ప్రేమో- విషాదమో, వ్యసనమో- పవిత్రతో... ఇతివృత్తం ఏదైనా పాఠకుడిని తను సృష్టించిన ప్రపంచంలోకి లాక్కుపోయేలా రాయడం ఎలాగో తెలిసిపోతుంది. - నిర్జర.

మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి

  మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి     కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా కీర్తిని సాధిస్తారు. ఆ కీర్తితో పాటుగా వచ్చే సౌఖ్యాలనూ అనుభవిస్తారు. మరికొందరు ఉంటారు! వారి జీవితం సాహిత్యం కోసమే అన్నట్లుగా సాగుతుంది. ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు. కీర్తి వస్తోందా లేదా, డబ్బు అవసరమా పాడా... అన్న మీమాంసలేవీ వారిలో కనిపించవు. వారి నిర్లక్ష్యానికి తగినట్లుగానే పేదరికంతోనే సదరు జీవితం గడిచిపోవచ్చు. కానీ సాహిత్యం పట్ల నిబద్ధతతో వారు సృజించిన రచనలు తరతరాల వరకూ నిలిచే ఉంటాయి. అలాంటి రచయితలను ఉదాహరణగా చెప్పుకోవాలంటే ముందుగా ఆలూరి బైరాగే గుర్తుకువస్తాడు. బైరాగి కలంపేరు కాదు. అతను పుట్టీపుట్టగానే తల్లిదండ్రులకు తోచిన పేరు. 1925లో తెనాలికి సమీపంలోని ఓ చిన్న పల్లెటూరులో ఆలూరు బైరాగి జన్మించారు. ఆయన ఎక్కువకాలం బడికి వెళ్లింది లేదు. బహుశా ఆ రోజుల్లో చదువుకునే అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉండిఉంటాయి. అందుకనే రెండో తరగతి దాకా బడిబాట సాగించిన బైరాగి తర్వాత అందుబాటులో ఉన్న హిందీ పాఠశలలో చేరారు. ఆ హిందీలో ఒకో మెట్టూ ఎక్కుతూ ఉన్నతాభ్యాసం కోసం ఉత్తరాదికి వెళ్లారు. అక్కడివారితో పోటాపోటీగా హిందీ నేర్చుకోవడమే కాదు... హిందీ కవిసమ్మేళనాలలో పాల్గొనేంతగా అద్భుతమైన కవితలను సృష్టించారట!     1946లో హిందీ ఉపాధ్యాయుడిగా తెలుగునాట తన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు బైరాగి. ఒకపక్క వృత్తిలో సాగుతూనే అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కవితలు రాయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బైరాగి దగ్గర చుట్టమైన ఆలూరు వెంకట సుబ్బారావు (చక్రపాణి) కంటపడ్డారు. చక్రపాణి చందమామ పత్రిక వ్వవస్థాపకులలో ఒకరన్న విషయం తెలిసిందే కదా! హిందీలో వెలువడుతున్న చందమామకు సంపాదకత్వం వహించవలసిందిగా చక్రపాణి కోరడంతో, బైరాగి ఆ బాధ్యతలను స్వీకరించారు. కానీ స్వేచ్ఛపిపాసి అయిన బైరాగికి చందమామలోని వాతావరణం నచ్చలేదు. వినీలాకాశంలో కనిపించే చందమామే ఆయనకు ముద్దుగా తోచింది. దాంతో తిరిగి తెనాలికి చేరుకున్నారు. ఆ రోజుల్లో విప్లవ కవిత్వం అంటే శ్రీశ్రీ గుర్తుకువచ్చేవారు, భావగీతిక అంటే కృష్ణశాస్త్రి మెదిలేవారు. కానీ బైరాగి కవిత్వం ఈ రెండు కోవలకీ భిన్నంగా సాగేది. తనలో మెదులుతున్న ఘర్షణకు అక్షరరూపంగా ఆయన కవిత్వం తోచేది. సమాజంలోని కుళ్లుని చూసిన తర్వాత, కలిగే వేదనని వ్యక్తీకరించేందుకు కవిత్వాన్ని సాధనగా ఆయన ఉపయోగించారు. అందాన్ని వర్ణించేందుకో, విప్లవాన్ని వల్లించేందుకో కాకుండా... జీవితాన్ని నగ్నంగా చూపించేందుకు తన కవితను వినియోగించారు. బైరాగి తొలి కవితా సంపుటి ‘చీకటినీడలు’లో ‘మీ నిద్రాసుఖసమయంలో/ స్వాప్నిక ప్రశాంతి నిలయంలో/ మేం పీడకలలుగా వస్తాం/ రౌరవదృశ్యం చూపిస్తాం’ అనే వాక్యాలు చదివితే ఆయన ఉద్దేశం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.     చీకటినీడలు పుస్తకంతో పాటుగా నూతిలో గొంతుకలు, ఆగమగీతి అనే కవితా సంపుటిలను కూడా బైరాగి రాశారు. వీటిలో ఆగమగీతి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇవే కాకుండా దివ్యభవనం పేరుతో పదకొండు కథల సంపుటిని కూడా వెలువరించారు. బైరాగి చివరిరోజుల్లో క్షయవ్యాధికి లోనయ్యారు. కానీ ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా 53 ఏళ్ల చిన్న వయసులోనే చనిపోయారు. బైరాగి చనిపోయిన తర్వాత తెలుగు, హిందీ, ఆంగ్లాలలో అముద్రితంగా మిగిలిపోయిన సాహిత్యమెంతో ఆయన సామాన్లలో బయటపడింది. బైరాగి ఇంకొన్నాళ్లు బతికుంటే మరిన్ని అద్బుతమైన రచనలు వెలువడేవేమో! కానీ పరిపూర్ణమైన ప్రపంచం గురించి ఆలోచించినంతగా నిండైన జీవితం గురించి ఆయన తపించి ఉండడు. అందుకే ‘నే సృజించిన/ అనంత జీవన వసంతవనంలోన/ చావుకు తావులేదు నాకు చావు లేదు/ నేను మృత్యుంజయుణ్ని’ అంటూ పలవరించేవారు. ఆ పలవరింతలనే నేటి కవులు ప్రణవనాదాలు భావించి రాస్తే బైరాగిలా రాయాలి అని తపిస్తున్నారు. అలాంటి ప్రతి కవి తపనలోనూ బైరాగి జీవించే ఉంటాడు. - నిర్జర.    

మనసుని నవలగా మార్చినవాడు - బుచ్చిబాబు

  మనసుని నవలగా మార్చినవాడు - బుచ్చిబాబు     తెలుగు కాల్పనిక సాహిత్యంలో తాత్వికతని స్పృశించే రచనలు కానీ, మనిషి లోతుల్లోకి తొంగిచూసే ప్రయత్నాలు కానీ జరగలేదని ఓ విమర్శ ఉంది. అదృష్టవశాత్తూ ఆ వివర్శని దీటుగా ఎదుర్కొనేందుకు మనకి చివరకు మిగిలేది, అసమర్థుని జీవిత యాత్ర లాంటి రచనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, స్వీయవిమర్శకు సాధనగా ఉపయోగపడే ఇటువంటి రచనలు తర్వాత కాలంలో అరుదైపోయాయి. పాఠకుల హృదయాలని కాకుండా వారి నరాలను స్పందింపచేసే రచనలు ముంచెత్తాయి. ఇప్పటికీ తెలుగు సాహిత్యం గురించి చెప్పుకొనేటప్పుడు ఎన్నో రచనలను చెరగి ‘చివరకు మిగిలేది’ లాంటి పేర్లను తల్చుకుంటున్నామంటే.. ఆయా రచయితల్లో ఉన్న నిబద్ధతే కారణం. అలాంటి రచనలు చేసిన బుచ్చిబాబుని ఈసారి స్మరించుకుందాం. 1916 జూన్ 14న ఏలూరులోని ఒక సంప్రదాయ కుటుంబంలో బుచ్చిబాబు జన్మించారు. సంప్రదాయబద్ధమైన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, స్వాతంత్ర్య సంగ్రామంతో పాటుగా రగులుకుంటున్న ఆదర్శాలని వంట పట్టించుకున్నారు. అలాంటి ఆలోచనా దృక్పథం ఉన్నప్పుడు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడటం కూడా సహజమే కదా! అందుకే ఒకవైపు సాహిత్యమే ప్రధానాంశమైన చదువులు చదువుకుంటూనే, మరోవైపు స్వయంగా రచనలు చేయసాగారు. అలా బుచ్చిబాబు తాను బీ.ఏ చదివే రోజుల్లోనే ‘పశ్చాత్తాపం లేదు’ అనే కథని రాశారు. ఆ తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ పట్టాని సాధించి ఉపాధ్యాయ వృత్థిలో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆలిండియా రేడియోలో పనిచేశారు.     బుచ్చిబాబు వ్యక్తిగత జీవితం గురించి అలా ఉంచితే... తన సాహితీ జీవితంలో 80కి పైగా కథలు రాశారు. వాటిలో చాలా కథలు పాఠకుల మన్ననలు పొందినవే! అరకులోయలో కూలిన శిఖరం, మేడమెట్లు, నన్ను గురించి కథ వ్రాయవూ ? దేశం నాకిచ్చిన సందేశం... ఇలా బుచ్చిబాబు కథలలో చాలా కథలు ఇప్పటికీ సాహితీవేత్తలకు పరిచయమే! బుచ్చిబాబు మీద ఆంగ్ల రచయితలు ప్రభావం బాగా ఉంది. అటు చదువు కోసమూ, ఇటు అభిరుచి కోసమూ.... షేక్స్పియర్ దగ్గర నుంచీ ఓ.హెన్రీ వరకూ ఆంగ్ల రచయితల సాహిత్యాన్నంతా ఆకళింపు చేసుకున్నారు. సహజంగానే ఆయన రచనల మీద కూడా వారి ప్రభావం కనిపించక మానదు. బుచ్చిబాబు రచనలు చేసేనాటికి ప్రపంచమంతటా మానవతావాదాన్ని పలవరిస్తోంది. ప్రపంచయుద్ధాలు, స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించాల్సిన అవసరాన్ని గుర్తిస్తోంది. ఈ అగత్యం బుచ్చిబాబు రచనల్లో కూడా కనిపిస్తుంది. బుచ్చిబాబు రచనలనీ, రచయితగా ఆయన దృక్పథాన్నీ చెప్పుకోవాలంటే... చివరకు మిగిలేది చదివితే సరి! బుచ్చిబాబు ఈ ఒక్క నవలనే రాశారు. అయితే ఏం! వంద నవలలకు దీటుగా ఇది మన సాహిత్యంలో నిలిచిపోయింది. ఇందులో ప్రధాన పాత్ర ‘దయానిధి’ అనే యువకుడు. ఆ పేరుతోనే ఆ పాత్ర ద్వారా తానేం సాధించదల్చుకున్నానో చెప్పకనే చెబుతాడు రచయిత. ఏదో ఒక కమర్షియల్ విజయాన్ని సాధించడానికో, రచయితగా స్థిరపడిపోవడానికో ఈ నవల రాయలేదు బుచ్చిబాబు. తనలోని అంతర్మధనాన్ని పాఠకులతో పంచుకోవడానికీ, దానికి ఒక ముగింపుని ఇవ్వడానికీ నవలని సాగించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ‘సమాజాల మధ్య ఉన్న ద్వేషాలకీ, వ్యక్తులు ప్రేమించలేకపోవడానికీ ఏదో సంబంధం ఉండి ఉండాలని నా నమ్మకం. అదేమిటో, ఎల్లా ఉంటుందో కనుక్కుందామని ఈ నవలా రచన సాగిందనిపిస్తుంది,’ అంటారు బుచ్చిబాబు.     చివరకు మిగిలేది నవలలో దయానిధి తల్లి పాత్రది కీలకం. కానీ ఆ పాత్ర నవలలో ఎక్కడా కనిపించదు. ఆమె మీద పడిన నింద మాత్రం అతని జీవితాన్ని నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఆ నిందను మోస్తూ, ఆ నీడను తప్పించుకుంటూ.... తన అంతరంగాన్నీ, తనకు తారసపడిన ప్రతివ్యక్తి స్వభావాన్నీ విశ్లేషిస్తూ సాగే పాత్రగా దయానిధి కనిపిస్తాడు. అనంతపురంలో పనిచేసినప్పుడు రచయితకి రాయలసీమ ప్రాంతం గురించిన అవగాహన ఏర్పడటంతో, రచనలో కొంతభాగం రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. చివరకు మిగిలేది ‘గడ్డిపోచ విలువెంత?’ అన్న అధ్యాయంతో మొదలవుతుంది. ‘చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికర్థమేమై ఉంటుంది?’ అన్న ప్రశ్నలతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఆఖరున ‘చివరకు మిగిలేది’ అన్న అధ్యాయంతో నవల ముగుస్తుంది. ‘చివరకు మిగిలింది – దాని సమాధానం కాదు; సమాధానం తెల్సుకునేటందుకు తను చేసిన యత్నాల జ్ఞాపకాలు – తనతో తాను సమాధానపడటం – అది మిగిలింది.’ అంటూ తన ఆఖరు వాక్యాలతో మొదట వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పే యత్నం చేస్తారు. రచయిత మొదటి మాటలోనే పేర్కొన్నట్లు ‘నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం,’ అన్న సూత్రాన్ని నవలలో అడుగడుగునా బలపరిచే ప్రయత్నం కనిపిస్తుంది. బుచ్చిబాబు కేవలం కథకుడే కాదు. నాటక రచయిత కూడా! ఆయన మంచి చిత్రకారుడని కూడా చెబుతూ ఉంటారు. రంగం ఏదైతేనేం జీవతపు కాన్వాస్ మీద రచయితగా తనదైన ముద్రని వేయడంలో మాత్రం ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయని మాట మాత్రం వాస్తవం. అందుకే ఆయన అసలు పేరైన ‘శివరాజు వెంకట సుబ్బారావు’ అన్న పేరుని కూడా మర్చిపోయిన పాఠకులు బుచ్చిబాబు అన్న కలం పేరు వినిపిస్తే మాత్రం గౌరవంతో ఒక్క నిమిషం ఆయనని తల్చుకుంటారు. ఆయన చనిపోయి ఐదు దశాబ్దాలు గడిచిపోయినా... ఇప్పటికీ ఆయన కథలంటే కళ్లు ఇంతింత చేసుకుంటారు. - నిర్జర.