అలల కల్లోలాల మధ్య

 అలల కల్లోలాల మధ్య                                                    డా. ఎ. రవీంద్రబాబు           నీ జ్ఞాపకాల పూలల్లోంచి ఒడ్డున పడక చాలా కాలమైంది. నీ కురుల ఆకాశంలో నక్షత్రాల వెలుగుల్ని ఆశ్వాదించక చాలా రోజులైంది. నీ నడకల హొయలలో నేను అనుభూతి చెందక చాలా క్షణాలు వెళ్లిపోయాయి. నీ లే నడుమొంపుల్లో సేదతీరక యుగాలు గడిచిన జ్ఞాపకం. ఇంతకీ ఎలా ఉన్నావు నా హృదయ జలపాతమా... నా అనుభవాల ఎడారి ఒయాసిస్సా. కాలం మారింది. మనుషులు మారారు. మానవత మారింది. సున్నితత్వం, శాశ్వతమైన ఆనందం కనుమరుగయ్యాయి. కనులు పొడుచుకున్నా ఒక్క లేత ప్రేమ కిరణం పొద్దుపొడవటం లేదు. ఆకాశ హర్మ్యాలలో కత్తుల మనసులు నాట్యాలు చేస్తున్నాయి. కోర్కెల ఆశల్లో మనిషి ధనం చుట్టూ ప్రహరా కాస్తూ ప్రేమని భ్రమించి చస్తున్నాడు            ఎన్ని చెప్పేది నా హృదయ నేత్రమా... నీకేం నీ యాత్ర ముగించుకొని ఆనందంగా వెళ్లి పోయావు. నీ పుటల్లో అక్షరాన్నైనేను నా ప్రేమ పాత్ర పట్టుకొని ఇక్కడ నీతి, నిజాయితి, విలువలు, స్వచ్ఛత కోసం భిక్షమెత్తుకుంటున్నాను. అయినా వాటిలో నాలుగు పరిమళపు మాటలు కూడా రాలడం లేదు. అసలు బతుక్కు అర్థం ఆనందం అని, అది మనస్పూర్తిగా ప్రేమించే మరో మనసులోనే దొరుకుతుందని ఈ వ్యాపార సామ్రాజ్య మనుషులకు తెలియడం లేదు. చెప్తే నన్నే ఓ పిచ్చి వాడిగా చూస్తున్నారు. నీ కోసం భిక్షమెత్తుతుంటానా..., అకారణంగా నయనాలు జలపాతాలవుతాయి. ఎక్కడన్నా నీ రుజువుల్లో లేతగుండెల్ని ప్రేమతో నింపాలని ఎదురు చేసే పరువపు పిల్లలు ఎదురవుతారా.. ఏముందిక ఏ కర్కశ హృదయమో వాటిని బలి చేసి ఉంటుంది. పాపం వాళ్లని చిరుపాపల్లా ఎత్తుకొని లాలించాలి, బుజ్జగించాలి, అనిపిస్తుంది. వారి హృదయాలు అంత పునీతమైనవి, చిగురాంకురమైనవి. బరించలేనంత ప్రేమ పుష్పాలతో వాళ్లని తడపాలనిపిస్తుంది. ఎందుకంటే నీవు ఇచ్చిన స్నేహంలో నేతడిసిన రేకుల వాసనలు నాలో చెరగని చిహ్నాలు కదా...       కాని నిజం చెప్పనా... అలాంటి వాళ్లకి, ఆ లోగిలి నాచు బావుల గుండెలు ఇష్టమంటారు. వాటిలోనే కొలువై ఉంటామంటారు. బయటకు రమ్మన్నామా... వారికి మనసు లేదుకాబట్టి. నా శరీరం కూడా అర్పించామని చెప్పేస్తారు. కానీ ప్రేమలేని శరీరం... ఆలోచనే భరించలేనని నీకు మాత్రమే తెలుసు కదూ... ఎంతమంది కుటుంబం, భర్త, పిల్లలు, తప్పు చేశాను, ఆస్తి, ధనం, సమాజపు విలువలు, దేవుడు, కోర్కెలు, మతం... ఎన్ని పేర్లో పెట్టుకొని ప్రేమలేని మనసుల్లోంచి శరీరానికి సుఖాన్ని ఇస్తున్నారో ఈ లోకంలో. బాధేస్తుంది. మళ్లీ దానికి ప్రేమని నీ స్వచ్ఛమైన పేరును పెట్టుకుంటారు. ఆ వలయాలు, కచ్చడాలు దాటాలంటే భయం.  ఒకవేళ దాటినా బయట ఉండలేరు. అసలు రాలేరు. సమాజాన్ని ఎదిరించే ధైర్యం నేటికీ చాలామందికి రాలేదు. మరి సమాజం అభివృద్ధి చెందింది అంటే నాకు నవ్వు వస్తుంది. మనసులు ఎదగకుండా సుఖాలను ధనంలో కొనుక్కుంటే అభివృద్దా... మన క్షణాలను, మన మనో భావాలను ధనంతో, అదిచ్చే సుఖంలో కొనుక్కుంటే సరిపోతుందా...                సుఖం వేరు, ఆనందం వేరు కదా... నువ్వే ఎన్ని సార్లు నీ చిరుకవితల జలతారులోంచి వినిపించావ్ నా మనసును. ఆ ఆనందంకై మనషులు ప్రయత్నించరు. ఒకవేళ ఎవరైనా పురుషుడు, స్త్రీ..., ఇద్దామన్నా, లక్షల అనుమానాలు. ఎందుకంటే వీళ్లకి కపట నాటకాలు, దొంగప్రేమలు అలవాటై పోయాయి. సరే... ఈ ప్రేమ గొడవెందుకు గానీ... నా అరుపుల అక్షరాలతో లోకం తీరు మారుతుందా... ఏ టీనేజ్ అమ్మాయన్నా... అబ్బాయన్నా... ఆలోచనల లోచనాలతో మనల్ని గమనిస్తాడా... ఈ ఆకృతుల్లో...               మారని లోకంలా మారని నేను ఎప్పటిలాగే ఓ సుధీర్ఘ నరకాన్ని అనుభవిస్తున్నాను. వంద ప్రతిబంధకాల మధ్య... రోజూ నల్లటి చీకటి వలయాల మధ్య ఉరులు తీసుకుంటూనే ఉన్నాను. ఆశలేదు, నిరాశ లేదు. నిశీథి విలయం లేదు, ప్రళయం లేదు. ఈ మధ్య అసలు బ్రతకడం ఎందుకు అనే ప్రశ్న బాగా వేదిస్తుంది. గుప్పెడు గుండెను తట్టే ప్రేమ కోసం బతకాలని... నీవు చెప్పిన జవాబు. ఎప్పటికీ వెలిగించని దీపంలా నాలో నిదురిస్తుంది. నాలోకి నేను ఇంకా పరకాయ ప్రవేశం చేయలేక పోతున్నాను. సమాజంలోని మనషులతో రాజీపడలేక నాలుగు ఆలోచనల రోడ్ల కూడలిలో సర్రియలిజాన్నై మూర్ఛనలు పోతున్నాను. పోతూనే ఉన్నాను... నా మనసుకు ఇక సూర్యోదయం లేదని తెలుస్తూనే ఉంది. బహుశా అదీ కష్టమేమో.. గుండె యవనికపై ఎవరి చిత్రమూ ముద్రించ లేదు. అందుకే నీ మాటను ఇంకా వాస్తవ చిత్రంగా గీయలేదు. క్షమించు.                                                             ఇప్పటి కింతే.                                                                   సె(లవ్)

దశరూపకం

  దశరూపకం (కథ)                                               - భమిటిపాటి కామేశ్వరరావు               సున్నితమైన హాస్యం, సంస్కారవంతమైన చమత్కారాలతో కథలు, నాటికలు రాశారు భమిడిపాటి కామేశ్వరరావు. ఇతర భాషల నుంచి తెలుగు చేసినా ఎక్కడా ఆ వాసనలు కనిపించకుండా తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించేలా రాయడం ఆయనగొప్పతనం. భాషను ప్రయోగించే రీతిలోనే హాస్యాన్ని సృష్టించేవారు. సమకాలీన సమస్యలను రచనలో వస్తువుగా ఎన్నుకున్నా హాస్యంగానే రాసేవారు. అందుకనే వీరిని పండితలోకం హాస్యబ్రహ్మగా కీర్తించింది. వీరు కథలు, నాటికలే కాదు, వ్యాసాలు... లాంటి ఎన్నో రచనలు చేశారు. వీరు రచించిన హాస్యపు కథల్లో దశరూపకం ఓ చక్కటి కథ.             ఈ కథ అరుదైన శిల్పంలో రాయబడింది. రచయిత భమిటిపాటి కామేశ్వరరావు కేవలం రెండు పాత్రలు రాసుకున్న లేఖల ద్వారా హాస్యాన్ని పండించారు. అంతేకాదు ఆ లేఖల్లో ఆయా పాత్రల మనస్తత్వాన్ని, సమాజంలో రచయితల మధ్య ఉన్న సంబంధాలను సమూలంగా వివరించారు, విమర్శించారు. దశరూపకం కథలో గోపీనాథం, రసరాట్ అనే రెండు పాత్రలు రాసిన లేఖలు మాత్రమే కథా వస్తువు. గోపీనాథ్ మందపిల్ల నుంచి, రసరాట్ పేరారం నుంచి లేఖలు రాసుకుంటూ ఉంటారు. ఈ లేఖలు కూడా 19.11.1938 న నుంచి 8.12.1938 వరకు జరిగిన సంభాషణకు సాక్ష్యాలు. ఈ ఉత్తారాలు గోపీనాథ్ తండ్రి తోటారం భూముల శిస్తుకోసం వెళ్లడం వల్ల  తండ్రి మాటప్రకారం ఓ పుస్తకంపై ప్రముఖ రచయిత రసరాట్ గారి అభిప్రాయం పంపమని గోపీనాథ్ మొదటి ఉత్తరం రాయడంతో దశరూపకం కథ మొదలవుతోంది.             ఆ పుస్తకాన్ని గోపీనాథ్ రాశాడని అపోహతో రసరాట్ సగం పొగుడుతూ, సగం తప్పులను ఎత్తిచూపుతూ ఇది ఉత్తమోత్తమం అని వ్రాయజాలం కానీ, దీన్ని నీచకావ్యం అని కొట్టిపారెయ్యడానికీ మనస్కరించకుండా ఉంది అన్న అభిప్రాయం రాస్తాడు. వెంటనే గోపీనాథ్ మీకు తండ్రిగారు పంపమన్న రచన అది కాదు, నా కోటు జేబులోనే ఉంది అని మళ్లీ రచనను పంపుతాడు. వెంటనే రసరాట్ స్పందిస్తూ... రచనలో ఉన్నతప్పులు కుర్రతప్పులు కనుక క్షమించవచ్చు, రచయితది మంచి అక్కరకొచ్చే చెయ్యి, సవ్యసాచి అని రాసి పంపుతాడు. అది అందుకున్న గోపీనాథ్ ఆ రచన నాది కాదు అని తిరుగు జవాబు ఇస్తాడు. అందుకు రసరాట్ అసలు ఎవరు ఆ రచన చేశారో చెప్తే బావుండేది అని, రచనలో భాషబాగుంది, కవికి హిందూస్తానీ కూడా వచ్చు అని అభిప్రాయం మార్చి రాసి పంపుతాడు. అది చదివిన గోపీనాథ్ ఈ మానాన్నగారే ఈ రచన పంపమన్నారు. మీరు వారికి బాకీ అన్న విషయం కూడా గుర్తు చేయమన్నారు అని రాస్తాడు. అంతే రసరాట్ కవిగారు  అప్పు ను జ్ఞప్తికి తెచ్చుకొని మనసు మార్చుకొని ఈ రచన నవీన విజ్ఞానం, మహోన్నత కవితాగిరి శిఖరాల్లో ఈ కవి వాక్కు విహరిస్తుంది అని పొగుడుతూ తన అభిప్రాయాన్ని రాస్తాడు.           కానీ ఇక్కడ మరో తిరకాసు ఉంది. వెంటనే గోపీనాథ్ మా నాన్నగారు కవిత్వం రాయరు. బహుశా అది ఆయనది కాకపోవచ్చు అని తిరుగు ఉత్తరం రాస్తాడు. దానికి రసరాట్ శైలి బాగాలేదు, అతనే అచ్చుకొట్టి ఉచితంగా పంచి ధన్యుడవ్వాలి అని తిడుతూ అభిప్రాయం రాస్తాడు. దానికి గోపీనాథ్ ఆ రచన ఓ కొత్తవానిది బి.ఎ. కూడా చదివాడట అని మా అమ్మ చెప్పింది అని రాయడంతో రసరాట్ తన అభిప్రాయాన్ని మార్చుకొని ఇంగ్లీషును మక్కికిమక్కి తెలుగులోకి పొట్టిగ్రాఫు దించేశాడు. భాష బాగాలేదు అని రాసిపంపుతాడు. గోపీనాథ్ రసరాట్ పంపిన అభిప్రాయం చదివి. ఆ రచన ఘంటారావుదట, మీ ఎన్నికల్లో ఎన్నికల్లో మీ తరపున పనిచేశాడట అని రాస్తాడు. అది చదివి రసరాట్ రచన ఉన్నత భావాలు కలిగి ఉంది, రసం సముద్రపు పోటులా ఉంది అని గొప్పగా రాస్తాడు. ఇలా ఇద్దరి మధ్య ఉత్తరాలు జరుగుతాయి. గోపీనాథ్ చెప్పేదాన్ని బట్టి రసరాట్ రచన గురించిన అభిప్రాయం మార్చుకుంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు.          కథ ముగింపుకు వచ్చే సరికి అసలు విషయం బయటపడుతుంది. గోపీనాథ్ తండ్రి ఊరినుంచి తిరిగి వస్తారు. ఆ రచన సంవంత్సర కాలం క్రితం రసరాట్ రాసిందేనని, నాన్నగారు మర్చిపోయి తన స్వహస్తాలతో రాసి కోటుజేబులో పెట్టుకున్నారని రసరాట్ కు రాస్తాడు. రసరాట్ అంతకు మించిన ట్విస్ట్ ఇస్తాడు. నేను ఊరెళ్లి ఉదయమే వచ్చాను. ఇంతకాలం మా అమ్మాయి ఉత్తరాలు రాసింది. ఆ ఉత్తరాల్లో కూడా మీరు పంపిన కాగితాల్లో ఉన్న విషయాలే రాసిందట, అసలు అది నారచన కాదు కుంభయ్య అనే వ్యక్తి చేతికి నిరుడు మీ నాన్నగారే ఇచ్చారట అని చివరి ఉత్తరం రాస్తాడు.         ఇలా దశావతారం కథంతా రచయితల్లోని, రచనల్లోని కల్లబొల్లి మాటలను, బహురూపాలను బయటపెడుతుంది. మలుపులు మీద మలుపులతో పాటకుడిలో ఉత్సుకతను పెంచుతుంది. ఒక్కోలేఖ ఒక్కో హాస్యపు గుళికలా మనకు నవ్వును తెప్పిస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు, చతురోక్తులు, కుటిలత్వం, కప్పిపుచ్చుకునే ధోరణితో రసరాట్ స్వరూపాన్ని చిత్రించారు భమిడిపాటి కామేశ్వరరావు. కథా శిల్పంలో అప్పటికే ఓ ప్రయోగంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇలా కథను నడపడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే భమిడిపాటి కామేశ్వరారవు హాస్యబ్రహ్మ అయినాడు.                                                           డా. ఎ.రవీంద్రబాబు

మరణం లేని మహాచిత్రకారుడు - బాపు

మరణం లేని మహాచిత్రకారుడు - బాపు   మరణం మనిషిని జయిస్తే.. మరణాన్ని జయిస్తాడు కళాకారుడు. ఆ కోవకు చెందిన వారే మన ‘బాపు’. ‘బాపు’ అన్నది ఆయన బొమ్మ పేరు. బొమ్మే ఆయనను మనకు పరిచయం చేసింది.., పలకరించి మనకు దగ్గర చేసింది..,మనసులో ‘ఆయన’ బొమ్మే నిలిచిపోయేలా చేసింది. అందుకే ఆయన అసలు పేరు ‘సత్తిరాజు లక్ష్మీనరాయణ’ అన్న సంగతి అందరూ మర్చిపోయారు.., మన అభిమాన ‘బాపు’గా మనందరి గుండెల్లో మిగిలిపోయారు. ఎప్పుడో ఎనభైయేళ్ల క్రితం పశ్చమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో వామనుడుగా జన్మించిన ‘బాపు’ తనదైన బొమ్మతో త్రివిక్రముడై, విశ్వవ్యాప్త కీర్తి సామ్రాజ్యానికి సార్వభౌములై..నేడు తిరిగిరాని ఊర్ధ్వలోకాలకు తరలిపోయారన్నది భరించలేని సత్యమే అయినా.., ఆయన మరణించారనుకోవడం మన భ్రమ. ‘తిని తొంగోటమే కాదు...మడిసన్నాక కాసింత కలాపోసనుండాల’ అని ‘సినిమాటిక్’గా చెప్పించినా...ఆయన మాత్రం జీవితాంతం కళాతపస్సు చేసిన ‘మౌనతపస్వి. - ఆయన ‘గీత’ చిత్రకారులకు ఓ ‘భగవద్గీత’ - ఆయన ‘రాత’ విద్యార్ధులకు ఓ ‘వర్ణాక్షరమాల’ - ఆయన ‘చిత్రం’ భావి దర్శకులకో ‘నిదర్శనం’ ‘భాపు’ మితభాషి...ఆయన బొమ్మ ‘బహువేషి’   ‘గయ్యాళిఅత్తైనా, పక్కింటి పిన్నిగారైనా, కొత్తకోడలు వయ్యారాలైనా, అల్లరి బుడుగు పుట్టినా, అష్టవిధనాయికలైనా, దశావతారాలైనా, నవరసాలు నర్తించినా, అష్టపదులైనా, కిన్నరసాని పాటలౌనా, కూనతమ్మ పదాలైనా,  శ్రీరామదాసు కీర్తనలైనా...‘బాపు’ గీత నుంచి జాలువారి రూపు దిద్దుకోవలసిందే, ప్రాణం పోసుకోవలసిందే. ఇక సినిమాల విషయానికొస్తే... - దర్శకుడిగా ‘సాక్షి’తో తొలి ‘సాక్షి సంతకం’ చేసినా, ఆ చిత్రం, సినిమాలు    స్టూడియోలలోనే కాదు.., ప్రకృతి ఒడిలో కూడా తీయచ్చు అనడానికి ప్రత్యక్ష ‘సాక్షి’. - ‘ముత్యాలముగ్గు’తో తెలుగు లోగిళ్ళ రంగవల్లులు తీర్చి దాద్దాడు. - ‘పెళ్లిపుస్తకం’తో తెలుగువారి పెళ్లి వేడుకలు మన కళ్ళ ముందుంచారు. - ‘భక్తకన్నప్ప’కు  తెలుగు ప్రేక్షకులచే నీరాజనాలు పట్టించారు. ఇలా చెబుతూపోతే.. ఆయన కళాసృష్టికి ఎల్లలే ఉండవు. అందుకే... - ‘తిరుమల తిరుపతి దేవస్థానము’వారు ‘ఆస్థాన విద్వాన్’(చిత్రకారులు)గా    సత్కరించింది. - ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం’వారు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి గౌరవించారు. - ‘శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం’వారు ‘గౌరవ డాక్టరేట్’ ఇచ్చి సత్కరించారు. - ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. - ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టుస్’ వారు ‘లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్’తో    సత్కరించారు. ఇలా ఎన్నో.., ఎన్నన్నో..., మరెన్నో.... ఆయన తీసిన ‘సీతాకల్యాణం’ చిత్రం ‘లండన్ మరియు ఛికాగో ‘ఫిలిం ఫెస్టివల్’కు ఎంపిక కావడమే కాకుండా.., ‘లండన్ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్’ విద్యార్ధులకు పాఠ్యాంశంగా బోధించడానికి ఎంపిక కావడం మన ‘తెలుగు చలన చిత్ర రంగానికే’ గర్వకారణం. ఇంతటి ఘనకీర్తిని అందించిన ‘బాపు’ మరణించారనుకోవడం పొరపాటు. చివరిగా ఓ మాట. ‘బాపు’ శ్రీరామభక్తుడు. ‘రామ’ నామం ఆయన ఉఛ్చ్వాస,నిశ్వాసాలు. ఆదికవి ‘వాల్మీకి’ రాతలో ‘రామాయణం’ కావ్యరూపం ధరిస్తే..., ‘బాపు’ గీతలో ‘శ్రీరాముడు’తో పాటు అన్ని పాత్రలు సజీవరూపాలు ధరించాయి. బ్రహ్మగారు.., వాల్మీకికి ఒక వరం ఇచ్చారు.                               ఏవ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే                    తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి లోకంలో పర్వతాలు నిలిచి ఉన్నంత కాలం, నదులు ప్రవహిస్తూ ఉన్నంత కాలం రామాయణం ముల్లోకాల్లో స్థిరంగా ఉంటుంది.  అలాగే.. రామాయణం కీర్తించబడినంతకాలం...‘బాపు’గా రు సజీవులుగానే ఉంటారు. ఆయన అమరులు... అమృత హృదయులు.. మరణం లేని మహాచిత్రకారులు.                                              - యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

ముళ్ళపూడి వారి మంతనాలు

ముళ్ళపూడి వారి మంతనాలు   స్వర్గంలో వున్న మన ముళ్ళపూడి వారి మంతనాలు ఫలించాయ్... మళ్ళీ మళ్ళీ రమణగారే గెల్చుకున్నారు బాపు గార్ని.... బాపు గారూ! ఇక సెలవ్... మీ నేస్తం ఎదురుచూపులకు కాలం చెల్లిందంటూ ఈపాటికి సంతోషంగా పరమపద సోపానం ఎక్కుతున్నట్టున్నారు... బాపూ! నువ్వు ‘కళామతల్లి’కి ఎంత ముద్దుబిడ్డవైనా ఎన్ని అవతరాలతో (ఆర్టిస్ట్, డైరెక్టర్) సేవలందించినా అక్కడ నీకు ‘పద్మా’ల మాలలే... ఇలా తారల్లోకి, నాదాకా వచ్చావా... ఇక ధ్రువతారవే అంటూ రవణగారు పిలుచుకున్నారు కామోసు..... ఇక్కడ బాపు గారు మనల్ని (శరీరాన్ని) వదిలివేశారో లేదో, అక్కడ స్వర్గంలో కోలాహలం మొదలైందిట... ఆప్తమిత్రుణ్ణి ఆలింగనం చేసుకోవడానికి రవణగారు రంగం సిద్ధం చేసుకుంటున్నారనుకుంటున్నారా! అదీ నిజమే... అయితే ఆ హడావిడి వెనక అసలు గమ్మత్తేంటంటే... రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు బాపు గార్కి మత్తెక్కించేందుకు వెల్‌కమ్ డ్రింక్‌తో రెడీ అయిపోతే ఇక తక్కిన అప్సరసలు అంతా ‘స్వాగతం దొరా!’ అంటూ డ్యాన్సు కట్టే పనిలో బిజీగా వున్నార్ట. అదంతా ఆ రంగుల రారాజుని ఆకర్షించడానికి స్వర్గంలోని ఆడాళ్ళంతా కల్సి వేసిన ప్లాన్ అని మనకి తెలీనిదా?! ...... More  

ముంగిస కథ

ముంగిస కథ                                                  - బలివాడ కాంతారావు                తెలుగు కథా రచయితల్లో తనదైన ముద్రతో కథలు రాసిన రచయిత బలివాడ కాంతారావు. పాత్ర చిత్రణలో, కథా శిల్పంలో సొంతమార్గాన్ని అనుకరించి సుమారు మూడు వందలకు పైగా కథలు రాశాడు బలివాడ కాంతారావు. వీరి కథలు మధ్యతరగతి వాళ్ల జీవితాల్లోని కష్టాలు, అనుబంధాలు, అపోహలు, చీకటి రహస్యాలు, వైవిధ్యాల చుట్టూ తిరుగుతాయి. అయితే కాంతారావు మనసుల్లోని సున్నితమైన భావాల్ని, సుకుమారమైన ఆలోచనల్ని విశేషంగా చెప్పిన రచయిత. వీరి కథల్లో ముంగిస కథ ఇలాంటిదే.          ఈ కథ, మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఇదే బలివాడ కాంతారావు గొప్పతనం. ఈ కథ వంశధార నది ఒడ్డున ఉన్న మడపాం గ్రామంలో జరిగినట్లు చెప్తారు రచయిత. వంశధార నది ఒడ్డున అమ్మాయామ్మ, అప్పారావు అనే భర్యాభర్తలు జీవిస్తూ ఉంటారు. అప్పారావు డాక్టరు. వారికి ఒక కూతురు కొడుకు. కొడుకు మిలటరీ ఆఫీసరు. కూతురు అత్తవారింట్లో ఎనిమిది మైళ్ల దూరంలో ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఏటి ఒడ్డున ఉన్న వారి ఇంట్లోకి చెట్లు, శవాలు, పాములు వచ్చేవి. అంతేకాదు అప్పారావు  వ్యవసాయం చేస్తూ భద్రంగా దాచుకున్న ధాన్యాలను ఎలుకలూ, పందికొక్కులూ తినేసేవి. బోను పెట్టినా, మందు పెట్టినా ఫలితం లేదు.          ఒకరోజు డాక్టరు దగ్గర వైద్యం చేసుంచుకున్న ఎరకలవాడు అరణం కింద ముంగిస పిల్లని తెచ్చి ఇస్తాడు. పైగా ఇది మీరు దీన్ని పెంచిపెద్ద చేసుకుంటే ఎలుకలు, పందికొక్కులు, పాముల బాధ ఉండదని చెప్తాడు. దాన్ని పెంచుకోడానికి తగిన సూచనలు కూడా ఇస్తాడు. దాని కాలికి మువ్వలు కడ్తే ఆ శభ్దానికి ముంగిస జాతి దానిని దగ్గరకు రానివ్వదని చెప్పి వెళ్లి పోతాడు. ఆరోజు నుంచి అమ్మాయమ్మ, అప్పారావు దాన్ని ప్రేమగా పెంచుతారు. పంచదార వేసి, రొట్టెముక్కలు, ఇడ్లీలు పెట్టి సాకుతారు. దాని చుంచుమూతి, చివర లే తెలుపు, ఊదారంగు శరీరం, చీపురుకట్ట తోక, మువ్వల సవ్వడి చూసి అమ్మాయమ్మ బయ్యన్న అని పేరు కూడా పెడుతుంది. జంతువులా కాకుండా బిడ్డలా దాన్ని చూసుకుంటూ ఉంటారు.            దాని దెబ్బకు ఎలుకలు, పందికొక్కుల జాడ కనపడదు. కానీ ఒకరోజు అప్పరావు అంటే గిట్టని ఎదురింటి భైరవయ్య వచ్చి మీ బయ్యన్న మా కోడి పిల్లలను చంపింది... అని గొడవ పెట్టుకుంటాడు. బయ్యన్న పీకలు కొరకడు అని అప్పారావు వాదిస్తాడు. గొడవ సద్దు మణిగినా భైరవయ్య మాత్రం ముంగిస బయ్యన్నను ఏదో ఒకటి చెయ్యాలని మనసులో పెట్టుకుంటాడు. ఒకరోజు అప్పారావు, అమ్మాయమ్మ కూతురు దగ్గరకు వెళ్తూ రొట్టె, పాలు బయ్యన్నకు ఆహారంగా పెట్టి, సాయంత్రం వస్తామని చెప్పి వెళ్లి పోతారు. బయ్యన్న కూడా వాళ్లని సాగనంపి వస్తుంది. అదే అదునుగా చూసుకున్న భైరవయ్య ఒడ్డున కలుగులో ఉన్న బయ్యన్నకు ఎండుచాపను ఆశచూపి, బైటకు పిలిచి కర్రతో కొట్టి చంపేస్తాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన అమ్మాయమ్మ ముంగిస బయ్యన్న కోసం చాలాచోట్ల వెతుకుతుంది. అప్పారావు కూడా కంగారుపడి అంతా గాలిస్తాడు. కానీ బయ్యన్న జాడ తెలియదు. ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న నమ్మకం పెట్టుకుంటుంది  అమాయకంగా అమ్మాయమ్మ.         ఒకనాడు ఉదయం భైరవయ్య కోళ్లు చింతచెట్టు కింద తిరుగుతుంటే ఒక ముంగిస (బయ్యన్న కన్నా పెద్దది) వచ్చి ఒకదాన్ని పట్టుకొని పోతుంది. దాంతో భైరవయ్య మంచం పడతాడు. అమాయకమైన బయ్యన్నను చంపినందుకు, ఆ దృశ్యమే కళ్లముందు కదలాడుతుంటే చెరపలేక నడుం జార్చేసుకుంటాడు.             ఇంత అద్భుతంగా కథ చెప్పడం, చదివిన పాఠకుడి మనసులో ఓ ఫీలింగ్ ను నింపడం బలివాడ కాంతారావు గొప్పతనం. ముంగిసపై ప్రేమ, ఆ దృశ్యాలు మన కళ్లముందు కదలాడుతాయి. కథాక్రమం వెంట మనల్ని పరుగులు పెట్టిస్తుంది. వర్ణనలు చేయడంలో కాంతారావు అందెవేసిన చెయ్యి... ఈ ఏటి ఒడ్డున వేసవిలో, నీలగిరిలా ఉంటుంది. చలికాలంలో చలి ఊళ్లో కంటే హెచ్చె. అంగట నిల్చొని  దక్షిణానికి పారే ఏరును చూస్తుంటే ఒళ్లు పులకరించే ప్రకృతి దృశ్యాలు అగుపిస్తాయి. దూరాన చరిత్ర ప్రసిద్ధికెక్కిన సాలిహుండా కొండ, ఎత్తయిన సరుగుడు చెట్లు, అరటి తోటలు, మబ్బులకు మనోహరమైన రంగులను ప్రసాదించే సూర్యాస్తమయం. ఫిబ్రవరి నెలలో చీకటి రాత్రి పడమటి ఆకాశంలో మెరిసిపోతున్న శుక్రగ్రహం పరుగు, మెల్లగా దిగువ జారుతున్న ఏటి గలగలల్లో చూస్తుంటే నాట్యానికి లయ కలిసినంత అందంగా ఉంటుంది.             వర్ణనలే కాదు- సన్నివేశాలు, సంఘటనలు కలిసి కథను రసవత్తరంగా నడిపారు బలివాడ కాంతారావు. ముంగిపు కొసమెరుపులో భైరవయ్య కోడిని ముంగిస పట్టుకెళ్లడం, భైరవయ్యను చేసిన పాపం వెంటాడటం... కథా శిల్పానికి గొప్ప ఉదాహరణలు. ప్రకృతికి, మనుషులకు, జంతువులకు మధ్య ఉండాల్సిన అవినాభావ సంబంధాన్ని తెలిపే ఈ కథ ఎప్పడు చదివినా మన మనస్సులో జాలి గుణాన్ని కల్పిస్తుంది.                                                                   డా. ఎ.రవీంద్రబాబు

అన్నపూర్ణ

అన్నపూర్ణ                                                - అక్కిరాజు ఉమాకాన్తమ్.            అక్కిరాజు ఉమాకాన్తమ్ మొదటితరం కథారచయిత. పండితుడు. విమర్శకుడు. చాలావరకు స్వయంకృషితో విద్యను అభ్యసించిన జ్ఞానవంతుడు. సంస్కృతంలో నిష్ణాతుడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా కూడా పనిచేశాడు. ఆరోజుల్లో వెలువడే త్రిలింగ పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ఎన్నో సాహిత్య రత్నాలను మనకు అందించాడు. పతంజలి మహాభాష్యానికి అనువాదం కూడా చేశాడు. వీరు రాసిన నేటికాలపు కవిత్వం ఆకాలంలో పెనుతుపాను సృష్టించింది. వీరి మొదటి కథ అన్నపూర్ణ. 1918లో వచ్చింది. వీరి అభ్యుదయ భావాలకు, సంఘసంస్కరణ దృష్టికి నిదర్శనం. ఆనాటి సాంఘిక దురాచారమైన బాల్యవివాహాలను ఖండిస్తూ చేసిన రచన ఇది.             అన్నపూర్ణ సుబ్బమ్మ, సూర్యనారాయణల కూతురు. చిన్నప్పుడే సుబ్రహ్మణ్యంతో పెళ్లవుతుంది. పుష్పావతి కాలేదని కాపురానికి పంపరు. కానీ సుబ్రహ్మణ్యం వాళ్లమ్మ రాజమ్మ పెద్దదై పోయిందని, కాపురానికి పంపమని సీతాపతి వచ్చి అన్నపూర్ణను కాపరానికి తీసుకెళ్తాడు. మీ అక్క కాపురానికి వెళ్తుంది రమ్మని అన్నపూర్ణ అన్న నరసింహానికి లేఖ రాస్తాడు తండ్రి సూర్యనారాణ... చిన్న వయసులోనే కాపురానికి పంపడం ఇష్టం లేని నరసింహం... అన్నపూర్ణ ప్రకాశమానమైన భవిష్యత్తును కాలమునకు వదలి అథఃప్రదేశమున బడిపోవుచుండగా చూచి సంతోషించుటకు రాను అని లేఖ రాస్తాడు. కానీ చివరకు తండ్రే రావడంతో కార్యానికి వస్తాడు.           సుబ్రహ్మణ్యం చేయి చూపించి జాతకం చెప్పించుకుంటే అతనికి రెండు పెళ్లిళ్లని, మొదటి భార్యకు సంతానం లేదని చెప్తారు. అది అతని మనసులో గాఢంగా ముద్రించబడుతుంది. అన్నపూర్ణ  చిన్నవయసులోనే గర్భవతి అవుతుంది. అతికష్టం మీద ఆడపిల్లని కంటుంది. కానీ పురిటిలోనే ఆ బిడ్డ చనిపోతుంది. తర్వాత మగపిల్లవాడు పుట్టినా ఫలితం ఉండదు. మూడో కానుపుకు పిల్లాడు పుడతాడు. కానీ పాలు ఇవ్వడానికి అన్నపూర్ణ దగ్గర ఉండవు. వేరే స్త్రీలచే పాలు ఇప్పిస్తారు. ఆ బిడ్డ ఆరోగ్యమూ సరీగా ఉండదు. కొన్ని రోజులుండి చనిపోతాడు. చిన్న వయసులోనే ముగ్గురు పిల్లల్ని కన్న అన్నపూర్ణ ఆరోగ్యమూ చెడిపోతుంది. పైగా ఒక్కబిడ్డ అయినా బతకనందున మనసులో బాధ. సోది చెప్పించడం, మంత్రగాడ్ని పిలిచి రక్షరేకు కట్టించడం లాంటి మూఢనమ్మకాలను నమ్మి వైద్యం చేయిస్తారు. దాంతో కాళ్లు పట్టుకొని పోయి లేవలేక పోతుంది.           సుబ్రహ్మణ్యానికి ఇంకో సంబంధం చూడ్డానికి రాజమ్మ, సీతాపతి ప్రయత్నాలు చేస్తారు. దాంతో అన్నపూర్ణ మనసు పరిపరి విధాలా పోతుంది. చివరకు కాళ్లకు వైద్యం చేయిస్తుండగా చనిపోతుంది. తండ్రి సూర్యనారాయణ కొడుకు రాసిన ఉత్తరం చూసుకొని బాధపడతాడు. మనో వ్యాధికి లోనవుతాడు. అమ్మాయి అమ్మాయి అని అరుస్తూ అతనూ మరణిస్తాడు. దాంతో సుబ్బమ్మ మనసు చెడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.         ఇలా కథ విషాదాంతంగా ముగుస్తుంది. బాల్యవివాహాల వల్ల ఎలాంటి దైన్య పరిస్థితులు ఏర్పడతున్నాయో కళ్లకు కడుతుంది అన్నపూర్ణ కథ. కథ గ్రాంథిక భాషలో రాసినా పాఠకుల మదికి ఇబ్బందిపెట్టే పదజాలం కనపడదు. అన్నపూర్ణను కాపురానికి తీసుకెళ్లే సన్నివేశంలో చర్చతో ప్రారంభమైన కథ, ఆమె తల్లి చావుతో ముగుస్తుంది. అందుకే కథ కార్య కారణ సంబంధంతో సాగిందని చెప్పాలి. మధ్యమధ్యలో సంభాషణలు నాటకంలో వలే కనిపిస్తాయి. వర్ణనలు గ్రాంథిక సొగసుతో కూడిన అలంకారాలు. ఆనాటి సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాలు, నాటు వైద్యాలు, ఛాందస ఆచారాలు అన్నిటిని విమర్శకు పెడుతుంది ఈ కథ. రచయత ఉమాకాన్తమ్ ఎక్కడా కథలో ప్రవేసించి సందేశాలు లాంటివి ఇవ్వడు. తను చెప్పే విషయాలను సన్నివేశాలు, సంఘటనలు, పాత్రల ద్వారా చెప్పడం ఈ కథలోని మరో విశేషం. ఒకప్పటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ కథ తప్పక చదవదగింది.                                                                     డా.ఎ. రవీంద్రబాబు.               

దేవుడు వస్తున్నాడు

దేవుడు వస్తున్నాడు                                                       - నోరి నరసింహశాస్త్రి            నోరి నరసింహశాస్త్రి చారిత్రక నవాలాకారుడు. పద్యకవి, నాటకకర్త, అనువాదకుడు. సమకాలీన సాంఘిక జీవనాన్ని యథార్థంగా చిత్రించిన రచయిత. అపూర్వమైన సాహితీ సంపద ఆయన సొత్తు. మనిషి సాంప్రదాయ వాదిగా కనిపించినా ఆయన రచనలు మాత్రం ఆధునికం. సమాజంలోని మూఢాచారాలను, ఛాందస భావాలను ఎండగడతాయి. ఆయన అభ్యుదయవాది. ఆయన రచనలు ప్రగతిశీలమైనవి. దేవుడు వస్తున్నాడు కథ సమాజంలోని భిన్న మనస్తత్వాలను, ఆచారాలను, నమ్మకాలలోని వైవిధ్యాన్ని, మనుషుల్లోని స్వార్థాన్ని మనకు అద్దంలా చూపుతుంది.          మహానగరంలో ఓ వార్త దావానలంలా కాకపోయినా పుకారులా వ్యాపిస్తుంది. అదే దేవుడు వస్తున్నాడు అని. వచ్చే మంగళవారం సరీగా మధ్యహ్నానికి దేవుడు వస్తున్నాడు అని. ఇక నగరంలో చిన్నా పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా, స్థలం ఏదైనా, కులం ఏదైనా, బీదవాళ్లైనా, ధనవంతులైనా అందరి మధ్య ఇదే చర్చ. దేవుడు వస్తున్నాడు అని. కానీ ఈ మాట చెప్పింది మాత్రం గోదావరి ఒడ్డున పేదరింకంలో నిత్యం భగవన్నామ స్మరణలో ఉండే ఓ అరవై ఏళ్ల వృద్ధుడు. ఈ వార్త ఆనోట ఈ నోట పడి నగరమంతా వ్యాపిస్తుంది. ఎవరి పాటికి వాళ్లు భగవంతుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి... ఎలాంటి సపర్యలు చేయాలి... ఎలా మెప్పించాలి... ఎలాంటి లాభాల్ని పొందాలి... అని ఆలోచన చేస్తుంటారు.          పత్రికలు కూడా పోటీపడి వారివారి దృష్టితో ఆ వార్తను ప్రచురిస్తాయి. సంపాదకీయాలు కూడా రాస్తాయి. నాస్తిక పత్రిక ఎర్ర అక్షరాలతో దేవుడు వస్తున్నాడు. మన నగరయోగి భేషజం - మన నగర గుత్తదారులకు భలే అవకాశం అని ప్రచురిస్తుంది. నగరంలోని మరో వృద్ధ పత్రిక భగవంతుడు భక్తులకు నిత్యమూ ప్రత్యక్షమే... ... ఏ రూపంలో వస్తాడో చెప్పలేము.... తరించడానికి మంచి అవకాశము లభించింది. ఉత్తిష్ఠత, జాగ్రత... అని ప్రచురిస్తుంది. గురువారం రోజు భగవంతుణ్ణి ఎలా ఎదుర్కోవాలి, ఎవరి ఇంట్లో విడిది చేయించాలి... ఇలాంటి విషయాలను చర్చించడానికి ఓ పెద్దసభేే జరుగుతుంది. పలు రకాలుగా చర్చలు జరుగుతాయి. చివరకు ఈ విషయం చెప్పిన యోగిని అడుగుదాము అనుకుంటారు. కానీ అతను ధీక్షలో ఉండటం చేత బలవంతంగా కూడా సభకు తీసుకురాలేక పోతారు. కొదంరు విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని, మరికొందరు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలని, మంచి మతాధిపతిని తీసుకురావాలని, దుర్గమ్మను తీసుకురావాలని మాట్లాడుకుంటారు. మాటలతో పోట్లాడు కుంటారు. రాజకీయ పార్టీలు రాజే నేడు మంత్రి కాబట్టి మంత్రిని తీసుకొచ్చి, మహానగరానికి మంచినీటి సౌకర్యాన్ని కలిగించాలని ఆలోచిస్తారు. ఈ వార్తలను కూడా ఆయా పత్రికలు పెద్ద ఎత్తున ప్రచురిస్తాయి.             మంగళవారం నాటికి విమానాలు, రైళ్లల్లో అందరూ మహానగరానికి విచ్చేస్తారు. హంగామా మొదలవుతుంది. హడావుడిగా నగరమంతా సందడిసందడిగా ఉంటుంది.  మంత్రిగారు మాత్రం కొంత ఆలస్యంగా వస్తాడు. కానీ పేదయోగి ఆరోజు కూడా పురుషోత్తమ ప్రాప్తి పారాయణ చేసే సరికి దండ కమండలాలు చేతులలో పూని కాషాయాంబర ధారి వాళ్ల ఇంటికి వస్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఆయనకు మనస్కరించి సకల మర్యాదలు చేస్తారు. పాద పూజ నుంచి, సుష్ఠుభోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. చివరకు ఆయన మేము విశ్వేశ్వరాలయంలో నిద్రించి ఉదయమే వెళ్తాం అని చెప్పి అదృశ్యుడవుతాడు.            ఇదంతా పసికట్టిన నాస్తిక పత్రిక శ్రామిక రూపంలో, ఎర్ర బట్టలతో భిక్షుకుని ఛాయాచిత్రాన్ని ముద్రిస్తుంది, వృద్ధ పత్రిక ఆర్ద్రశిఖవలె వెలిగే పరమహంస చిత్రాన్ని ముద్రిస్తుంది. దేవుడిని చూద్దామని వెళ్లిన నగర ప్రజలకు గుడిలో వెలిగే దీపజ్యోతి కనపడుతుంది. అందరూ నిరాశాదృక్కులతో వెనక్కు వెళ్లిపోతారు.             ఈ కథలో దేవుడికోసం చేసే పనులలో సమాజంలోని భిన్న మనస్తత్వాలను, భిన్న నమ్మకాలను, భిన్న ఆచారాలను, భిన్నఆర్థిక భేదాలను ఈ కథలో చెప్పాడు నోరి నరసింహశాస్త్రి. కథ ప్రారంభించినప్పటి నుంచి ఒకే ఉత్కంఠతో పరుగులు పెడుతుంది. పత్రికల నుంచి ప్రభుత్వం వరకు అన్నిటిలోని లోపాలను కరాఖండిగా చెప్పాడు రచయిత. ఎత్తుగడ, సంఘటనలు, వివరణ, శైలి మనల్ని కథలో లీనం చేస్తాయి.  అప్పటికీ గ్రాంథిక భాష ఉన్నా, నోరి వారు అందమైన వ్యవహారికాన్ని కథలో వాడారు. ఆస్తిక, నాస్తిక భావజాలల మధ్యగల స్వార్థచింతనను కూడా నోరివారు అద్బుతమైన రీతిలో చెప్పారు. కథలో వర్ణించిన పరిస్థితితులకు నేటి సమాజంలోని పరిస్థితులకు మార్పు లేదు. అందుకే ఈ కథ ఎప్పటికీ ఓ సమాజాకి ప్రతిబింబమే...                                                           డా.ఎ. రవీంద్రబాబు    

కాలువ మల్లయ్య

  కాలువ మల్లయ్య                                                                డా. ఎ.రవీంద్రబాబు            తెలుగు కథను తెలంగాణ మట్టిలో పండించాడు. ప్రజా ఉద్యమాలకు కథా రచనతో ప్రచారం కల్పించాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల పక్షం వహించి కథలు రాశాడు. స్థానికతలోని విభిన్నతను, వైవిధ్యాన్ని కథల ద్వారా వివరించాడు. ఎక్కడా వస్తువులో, శిల్పంలో సారూప్యత లేకుండా సుమారు ఎన్నో కథలు, నవలు రచించాడు. అంతేకాదు విమర్శకునిగా, కవిగా, వ్యాసకర్తగా బహు ముఖీనమైన ప్రజ్ఞాశాలి డా. కాలువ మల్లయ్య.        కాలువ మల్లయ్య తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జూపల్లి మండలం తేలుకుంట గ్రామంలో జనవరి 12, 1953లో జన్మించాడు. చిన్నప్పుడే కాలినడకన 7మైళ్లు నడిచి పదవతరగతి చదువుకున్నాడు. ఆపై బియస్సీ, బి.ఎడ్. పూర్తి చేసి ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. కానీ చదువుపై మక్కువతో ఎం.ఎ. తెలుగు చదవడమే కాకుండా తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కెమిస్ట్ గా పనిచేసి నిర్భంద పదవీ విమణ చేశాడు.           స్కూలు, కాలేజీ రోజుల్లోనే మల్లయ్య రచనలు చేయడం ప్రారంభించాడు. ప్రేమ్ చంద్, టాల్ స్టాయ్, మాక్సిమ్ గోర్కీ, శ్రీశ్రీ రచనల ప్రభావానికి లోనయ్యాడు. 1980లో వెెలి అనే తొలికథను సృజన పత్రికలో ప్రచురించాడు. రచనావ్యాసంగం ప్రారంభ రోజుల్లో కవితా సౌరభం, కవితాఝరి అనే కవితా సంపుటాలు కూడా  వెలువరించాడు. ఇప్పటి వరకు సుమారు 850 కథలు, 12 నవలలు, అనేక వ్యాసాలు రాశాడు.         కట్నం కథలు, ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడు, రాజు - కోడి, మా కథలు, అవ్వతోడు గిది తెలంగాణ, కాలువ మల్లయ్య కథలు, చెప్పుల తయారి...లాంటి ఎన్నో కథా సంపుటాలను ప్రచురించాడు. భూమి పుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం, ఎక్స్ (డబ్బు) - తృప్తి ఈజ్ ఈక్వల్టూ దుఃఖం, గువ్వల చెన్నా అనే నవలలు వీరికి మంచి పేరు తెచ్చాయి. అంతే కాదు వీరి కథలు కొన్నికన్నడ, హిందీ, తమిళ, మళయాళ భాషల్లోకి అనువదింపబడ్డాయి.       వీరి రచనల్లో భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు, రైతులు, దళితులు, కార్మికులు, ముఖ్యంగా స్త్రీల జీవితాలలోని కష్టాలు, కన్నీళ్లు, చైతన్యాలు కనిపిస్తాయి. విప్లవోద్యమం, మానవ జీవితాల్లోని వైవిధ్యం, మధ్యతరగతి ప్రజల్లోని ఆడంబరాలు, ప్రపంచీకరణ పరిణామాలు... ... ఇలా తెలంగాణ సమాజమంతా ఇతని కథలకు నేపథ్యమే. దొరసాని చీర కథ దొరల పశుత్వ లైంగిక దోపిడీకి నిదర్శనం, పంజరం కథ జంమిందారీ వ్యవస్థలోని స్త్రీల అణచివేతలకు ప్రతిబింబం. నేలతల్లి కథలో రైతు భూమికి దూరమైన వైనం, వెలి కథలో దొరల పెత్తనాన్ని సవాల్ చేసిిన కిందికులాల చైతన్యం... ఇలా అనేక సమస్యలను చూపెడతాయి కాలువ మల్లయ్య కథలు. ఎంగిలిచేత్తో కథ దుబ్బమ్మ అనే దళిత స్త్రీ కన్నీళ్లను చిత్రించింది. చావుకథలో సంప్రదాయాల వల్ల మనుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేస్తుంది. చేతులు కథ వివిధ వర్గాల్లోని విలువలను వివరింగా విశదీకరిస్తుంది.           ఏ కథకి ఆ కథ శిల్ప వైవిధ్యాన్ని చాటుతుంది. ప్రారంభాలు, ముగింపులు, సన్నివేశాలు... అన్నీ వస్తువును బట్టి ప్రత్యేకంగా ఉంటాయి. భాష విషయంలో తెలంగాణ భాషకు ఇవి పెట్టన కోటలు. కానీ వ్యవహారికభాషే ఎక్కువగా కనిపిస్తుంది. నాకు తెలిసింది మాండలిక భాష, నాచుట్టు ఉన్న వాళ్లు మాట్లాడేది మాండలిక భాష, నేను చిన్నతనంలోగానీ, ఆ తర్వాతగానీ మాట్లాడింది మాండలిక భాష. మాండలికం సజీవం. గలగల పారే సెలయేరు లాంటిది అని తన రచనల్లో భాష గురించి చెప్తారు కాలువ మల్లయ్య. సామెతలు, పలుకుబడులు, నానుడులు... ఎన్నో తెలంగాణ భాషలోని మాణిక్యాలు వీరి రచనల్లో దొరుకుతాయి.          వీరికి ఎనో బహుమతులు, అవార్డులు వచ్చాయి. రావిశాస్త్రి స్మారక బహుమతి, జాషువా సాహిత్య పురస్కారం, వీరి బతుకు పుస్తకానికి ఆమెరికా తెలుగు అసోసియేషన్ పురస్కారం (ఆటా) లభించాయి, వీరు పత్రికలలో రాసిన ఎన్నో కథలు పోటీలలో గెలుపొందాయి. అంతేకాదు కాలువ మల్లయ్య ఎన్నో ఉన్నతమైన పదువులు కూడా అలంకరించారు.       తెలుగు భాషమీద, సాహిత్యం మీద ఎంతో మక్కువ ఉన్న వీరి రచన తెలంగాణ మట్టివాసనను, తెలంగాణ ప్రజల స్నేహ పరిమళం, తెలంగాణ ప్రజా ధారబోస్తున్న రక్తరాగం చదువురలను మురిపిస్తాయి. ఉద్రేకపరుస్తాయి. ఉరికిస్తాయి. ఈ పని తన స్వతంత్రమార్గం ఏర్పరచుకున్న రచయితకు మాత్రమే సాధ్యం అన్నాడు ప్రముఖ సాహితీ వేత్త దాశరథి రంగాచార్య.          తెలంగాణ కాలువల్లోంచి సాహిత్య వ్యవసాయం చేసి తెలుగుకథా పువ్వులను పూయించిన సాహిత్య సేద్యకాడు కాలువ మల్లయ్య.  

దాసరి పాట

  దాసరి పాట                                                చింతాదీక్షితులు         తెలుగు కథా సాహిత్యానికి ప్రాణం పోసిన తొలితరం కథా రచయితల్లో చింతాదీక్షితులు ఒకరు. ఆయన 100కు పైగా వైవిధ్యమైన కథలు రాశారు. విభిన్న వృత్తుల వారి జీవితాలను ఇతివృత్తంగా తీసుకొని అనేక కథలు అల్లారు. ఆయా వృత్తులకు సంబంధించిన పదాలు వాడి తెలుగుభాషలోని భాషా వైవిధ్యాన్ని కూడా చూపాడు. ఆయన రాసిన కథల్లో దాసరి పాట కథ సంచార జీవనం చేస్తూ కథలు గానం చేసే వారి జీవితంలోని విషాదాన్ని, దైనందిన జీవితాన్ని కళ్లకుకడుతుంది.      కథ పూర్తిగా సంచారజీవనం చేస్తూ తెలుగువారి కథలను, పురాణాలను గానం చేసే ఓ కుటుంబానికి సంబంధించినది. కథలు గానం చేసే దాసరి వర్ణనతో ప్రారంభమవుతుంది. అతని కుటుంబమూ సంచారం చేస్తూ ఉంటుంది. అలా తెలుగు నేలంతా, ప్రతి గ్రామము అతనికి సుపరిచితమే. రాత్రైతే ఏ చెట్టుకిందో పడుకుంటారు. అతనికి ఆస్తి కూడా కేవలము తాంబ్రా, గుమిసి, రెండు అంజెలలు మాత్రమే. కానీ అతని దృష్టి అంతా పాడే పాటమీదే ఉంటుంది. ఇరవయ్యోయేట పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యకూడా అతనికి తగిన ఇ్లలాలే. భర్తే ఆమెకు సర్వము. భర్తతోనే ఆమె ప్రయాణము. వాళ్లది అన్యోన్య దాంపత్యము. వారిద్దరూ కలిసి పాటపాడితే నవరసభరితం. పదములోని వీరరసము భర్త వెలువరించేటప్పుడు ఆమె హృదయము వీరరసముతో ఉప్పొంగేది. కరుణ రసము తన పదమునకు భర్త ఒప్పించే టప్పుచేటప్పుడు ఆమె కళ్ల వెంబడి వచ్చిన కన్నీళ్లు గుమిసిని తడిపేవి... ... కొంటెతనముతో అతడు మీసము మీద చెయ్యివేసి నాయికానాయకుల శృంగారమును వర్ణించేటప్పుడు ఆమె తలవంచి గుమిసి తప్పు వాయించేది.            వారి ప్రేమకు గుర్తుగా కొడుకు పుడతాడు. వాడికి ఐదేళ్లు వచ్చేసరికి అయిదారు కథలు ఒక మోస్తరుగా పాడటమూ నేర్చుకున్నాడు. వాళ్లు బొబ్బిలికథ, తిమ్మరాజు కథ, సర్వాయిపాపడు కథ, కాకమ్మకథ, కాంభోజరాజు కథ, చెంచుకథ ఇలా అనేక కథలు రసభరితంగా చెప్పగల నేర్పులు.            కానీ ఒకరోజు గ్రామంలో కోడిపుంజులు కథ చెప్తుంటే అతనిలో ఉత్సాహం లేదు. పౌరుషములైన వాక్యాలు నీరసములై పోయాయి. అతని చూపులన్నీ పక్కన భార్య ఒడిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుపైనే ఉంటాయి. హృదయంలోని బాధతో అతను పాట సరిగా పాడలేక పోయాడు. ఇది అర్థం చేసుకోని ప్రజలు అనేక విధాలుగా ఆలోచనలు చేస్తారు. ఆ రోజు రాత్రి మూడు గంటలకు కథ పూర్తయ్యాక కొడుకు కాలిగాయానికి పసురు కట్టు కట్టి రాళ్లమీదే నిద్రపోతారు. కానీ మరునాడు పాటపాడందే వారికి పొట్టనిండదు. అందుచేత తర్వాత రోజు కొడుకును భుజం మీద పడుకో బెట్టుకొని బొబ్బిలి కథ చెప్పడం ప్రారంభిస్తాడు. మధ్యమధ్యలో కొడుకుపై చెయ్యి వేసి జ్వరాన్ని చూస్తూ ఉంటాడు. కొడుకు శరీరం చల్లగా అనిపించడంతో జ్వరం తగ్గిందని భావించి... ప్రజలకు ఉత్సాహం కలిగేలా కథ చెప్తాడు. బొబ్బిల కోట ముట్టడిని, విజరామరాజు క్రౌర్యాన్ని అద్భుతంగా పాడి వినిపిస్తాడు. కానీ తాండ్రపాపయ్య రౌద్ర రూపాన్ని అంతగా రక్తి కట్టించలేకపోతాడు. అప్పటికే అతనికి కొడుకు మరణించాడని తెలుస్తుంది. కథతో మమేకమై తనూ ఏడుస్తాడు.            కథలో తాండ్ర పాపయ్య బంధువుల మరణమునకై ఎన్నడూ ఎప్పుడూ విలపించనట్లు ఆరోజున విలపించేడు.... పాపయ్యతోపాటు దాసరితోపాటు ప్రజలు కూడా కన్నీళ్లు విడిచి విలపించారు. ఈ విధంగా కథ కరుణరసాత్మకంగా ముగుస్తుంది. దాసరివాళ్ల జీవితాన్ని హృదయవిదారకంగా మనకు చూపెడుతుంది.              కథాశిల్పం విషయానికి వస్తే- కథ ప్రారంభం దాసరి పాటను, అతని దైనందిన జీవితాన్ని చెప్పడంతో ప్రారంభమవుతోంది. ముగింపు దాసరి చెప్పే కథ, అతని జీవిత కథ కలిసిన బాధతో ముగుస్తుంది. వెరసి ఒక జీవితాన్ని తెలియజేస్తుంది. కథలోని భాషలో తాంబ్రా, గుమిసి అనే వాయిద్యాలు, అంజెలు అంటే వాళ్లు కథ చెప్పేటప్పుడు కిందవేసుకునే బట్టలు... మిగిలిన కథంతా వ్యవహారిక భాషలో రాశారు చింతాదీక్షితులు. 1927 నాటికి ఇది కథా సాహిత్యంలో విప్లవమే అని చెప్పాలి. కథ క్రమక్రమంగా వస్తువులోకి పాఠకుడ్ని లాక్కొనిపోతుంది. ఓ విషాద వాతావరణాన్ని మనలో నింపి వదిలేస్తుంది.           దేశసంచారం చేస్తూ, కథలు చెప్పే వారి గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని రచయిత వాస్తవంగా గొప్పగా చెప్పారు. వ్రాలు చేయలేని భట్రాజులు, దాసరులు, జంగములు.... మాటేమిటి. భారతభాగవతములను, మహావీరుల దేశీయ కథలను ఇతరులకు బోధించగల వీరు చేవ్రాలు చేయలేని వారనే కారణముచేత చదువురాని వారని త్రోసివేయవచ్చునా... ... లాంటి ప్రశ్నలు, భిక్షకులై దేశములోని అజ్ఞానమును ఒకవిధముగా పోగొట్టుచున్నారు.... ... వారికి భైక్ష్యవృత్తి నీచము కాదు. వారి దేవుడే ఒక భిక్షకుడు కాబట్టి... ... ఇలాంటి సత్యాలు మనలను ఆలోచింపజేస్తాయి.                                                              డా.ఎ. రవీంద్రబాబు

వట్టికోట ఆళ్వారుస్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి                                                       - డా.ఎ. రవీంద్రబాబు                   జీవితంలో అగాథాల లోతులను చవి చూశాడు. సాహిత్య సృష్టిలో అంతులేని పర్వతాలను అధిరోహించాడు. ఉద్యమాల బాటలో ప్రజల పక్షాన నిలబడి పోరాడారు. జైలుపాలై ఆ జీవితాన్నే కథలుగా అందించాడు. ఎక్కడా ఆయన జీవితం వడిదుడుకులు లేకుండా సాగలేదు. కానీ ఆయన మాత్రం నిక్కచ్చిగా సారస్వత జీవితాన్ని, ప్రజా జీవితాన్ని సాగించాడు. ఆయనే తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన వట్టికోట ఆళ్వారు స్వామి.               వట్టికోట ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ దగ్గరున్న చెరువు మాదారంలో 1915 నవంబర్ 1న జన్మించాడు. తల్లి సింహాద్రమ్మ, తండ్రి రామచంద్రాచార్యులు. కానీ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనేక బాధలు పడ్డాడు. సీతారామారావు అనే ఉఫాధ్యాయుడికి వంటావార్పు చేసి పెడుతూ చదువుకున్నాడు. సుమారు 13,14 ఏళ్ల వయసులో సూర్యాపేటలోని గ్రంధాలయంలోని పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని, ప్రపంచాన్ని తత్వాన్ని తెలుసుకున్నాడు. సొంతగా తెలుగు, ఆంగ్ల భాషలను, సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. సూర్యాపేట, నక్రేకల్, కందిబండల్లోని ఇళ్లల్లో వంటపనులు, విజయవాడ హోటల్లో సర్వర్... ఇలా బతుకు తెరువుకోసం అనేక పనులు చేశాడు. 1936-37 ప్రాంతాల్లో హైదరాబాదు చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా పనిచేశాడు. గ్రంధాలయోద్యమంలో పాల్గొన్నాడు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆంధ్రమహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. అభ్యుదయ రచయిత సంఘం, తెలంగాణ రచయితల సంఘం, పౌరహక్కుల ఉద్యమం, రిక్షాకార్మికుల సంఘం, రైల్వే కార్మికుల సంఘం, గుమస్తాల పోరాటాలలో పాల్గొని చైతన్యవంతమైన పాత్రను నిర్వహించారు.                 ఆళ్వారు స్వామిలోని మరో కోణం సాహితే వేత్త. కథకుడు, వ్యాసకర్త, విమర్శకుడు, నవలా రచయిత, కవి, పాత్రికేయుడు, ప్రచురణ కర్త... ఇలా ఆయన ప్రజాపోరాటాలతో పాడు అక్షరాన్ని వెంటేసుకుని తిరిగిన బాటసారి. 1938లో దేశోద్ధారక గ్రంధమాలను స్థాపించి అనేక పుస్తకాలను ముద్రించారు. వీరు ప్రచురించిన పుస్తకాలలో...         సురవరం ప్రతాపరెడ్డి - హైందవ ధర్మవీరులు         గ్రధాలయోద్యమం         జానపాటి సత్యనారాయణ - ప్రజలు ప్రభుత్వం         కాళోజి - నాగొడవ         దివాకర్ల వేంకటవాధాని - అనుమానం         పల్లాదుర్గయ్య - మాయరోగం... ఇలా ఎన్నో ఉన్నతమైనవి ఉన్నాయి.         పాత్రికేయనిగా వీణ, గుమస్తా పత్రికలకు సేవలందించారు. అభ్యుదయ రచయితల సంఘం పక్షాన 1944-46లో తెలుగుతల్లి పత్రికను నిర్వహించారు.         వీరు రాసిన రచనలు..         సుమారు మూడు ఏళ్లు జైలు శిక్షను అనుభవించి అక్కడి అనుభవాలను కథలుగా రాశారు. ఆ కథలే జైలు లోపల సంపుటిగా వచ్చియి. తెలంగాణ ప్రజల జీవితాలను కూలంకషంగా చిత్రించిన నవల ప్రజల మనిషి.  1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణ అంటే సాయుధ పోరాటాల పురిటి నెప్పులు గంగు నవల.1956-57లో మచలీపట్నం నుంచి వెలువడే విద్యార్థి మాసపత్రికలో రామప్ప రభస శీర్షికన వ్యాసాలు రాశారు. ఇవి అప్పటి రాజకీయాలను చర్చకు పెట్టాయి. సామాజిక సమస్యలపై వట్టికోట ఆళ్వారు స్వామి వ్యగ్యం రచన ఇది. ఇవన్నీ అప్పటి తెలంగాణ జీవితాలను, భాషను రికార్డు చేశాయి.           జైలు లోపల కథల్లో... ఆళ్వారు స్వామి ఐదు ప్రాంతాల్లో జైలు జీవితాన్ని గడిపాడు. అనేక మంది ఖైదీలతో ఆత్మాయంగా మెలిగాడు. అందుకే ఈ కథలు సామాజికంగా, జీవన పరంగా, ఆర్థిక రాజకీయ రంగాలలోని వైవిధ్యానికి నిదర్శనంగా కనిపిస్తాయి. మానవీయ విలువలను, సిద్ధాంతాల జీవితాలను ప్రజలకు అందజేస్తాయి. కాఫిర్లు కథ  హిందూ ముస్లీంల మధ్య గల మత వైషమ్యాల గురించి, మత మార్పిడుల గురించి వివరిస్తుంది. బదనిక కథ అధికారులు, వారి భార్యలు తమ కింద పనిచేసే వారిని ఎలా పీడిస్తారో తెలియజేస్తుంది. పరిసరాలు కథ తెలంగాణలో పోలీస్ యాక్షన్ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తెలుగును ప్రోత్సహిస్తూ, ఉర్దూ నేర్చుకున్న వారి ఉద్యోగాలను కొల్లగొట్టిన వైనాన్ని చెప్తుంది.  గిర్దార్ కథలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటాలను, ప్రజాభ్యున్నతికి చేపడుతున్న పనులను, రాజకీయ బాధితులను మనకు చూపెడుతుంది. వీరి కథల్లోని భాషకూడా ఒకప్పటి తెలంగాణలో ఉన్న ఉర్దు, తెలుగు భాషల సమ్మేళనం.            వీరి జీవితాన్ని, రచనా వ్యాసంగాన్ని విస్తృతంగా తెలిపే ప్రజల మనిషి వట్టికోట సాహిత్య జీవితం వ్యాససంకలనం నేడు అందుబాటులో ఉంది.           ఇలా ప్రజాజీవితంతో మమేకమై సాహిత్యాన్ని దానికి భూమిక చేసుకున్న వట్టికోట ఆళ్వారు స్వామి 1961, ఫిబ్రవరి 5న మరణించారు. ప్రముఖ కవి దాశరథి వారి కవితా సంపుటిని వీరికి అంకితం ఇస్తూ...           అసలు ఆళ్వార్లు పన్నెండు మందే           పదమూడో ఆళ్వార్ మా           వట్టికోట ఆళ్వార్ స్వామి           నిర్మళ హృదయానికి           నిజంగా అతడు ఆళ్వార్           దేవునిపై భక్తి లేకున్నా           జీవులపై భక్తి ఉన్న వాడు ... అని అన్నాడు.         దాశరథి రంగాచార్య జనపదం, అంతెందుకు పుస్తకాలను కూడా ఇతనికే అంకితం ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.           నిజంగా తెలంగాణ ప్రాంతం 20వ శతాబ్దం తొలి అర్ధభాగంలో ఆళ్వారు స్వామి వైతాళికుడు. జీవితం అన్నివిధాలా అస్తవ్యస్తంగా సాగినా తను మాత్రం ఎదిరించి పోరాడి ఎందరికో ఆదర్శమూర్తిగా నిలిచాడు. వీరి రచనలు అప్పటి తెలంగాణ చరిత్రకు అద్దం వంటివి.                 

వకీలు వెంకయ్య

వకీలు వెంకయ్య                                                  సురవరం ప్రతాపరెడ్డి           సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో తెలుగు కథకు మార్గదర్శకుడు. కథా సాహిత్యంలో తెలంగాణ నుడికి, పలుకుబడికి స్థానం కల్పించిన రచయిత. ఉర్దూ భాషా పదాల సోయగంతో తెలుగు కథకు కొత్త హంగులు అద్దిన కథా శిల్పి. నిజాం కాలం, ఆ తర్వాతి కాలం నాటి చరిత్రను తన కథల ద్వారా అందించిన దార్శనికుడు. అందుకే- వీరి కథలు చరిత్ర రచనకు ఆధారాలు. ముఖ్యంగా తెలుగు కథల్లో తెలంగాణ ఉనికిని చాటిన ప్రత్యేక సిరులు. అలాంటిదే వకీలు యెంకయ్య కథ.         వకీలు యెంకయ్య కథ ఒకప్పటి తెలంగాణ జీవితాన్ని, అక్కడి దొరల పాలనలోని దురాగతాలను మనకు తెలియజేస్తుంది. అప్పటి ఉర్దూభాషతో కలిసిన తెలుగును అందంగా పొదివి పట్టి మనకు అందిస్తుంది. కథ- వకీలు యెంకయ్య జీవితమే ఈ కథలో ప్రధాన వస్తువు. వకీలు యెంకయ్య అసలు పేరు వెంకటరెడ్డి. అతనిది పాలమూరు అంటే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని సింగారం. బళ్లో చిన్నప్పుడు భారతం, భాగవతం, చదవడం రాయడం, వడ్డీ లెక్కలు లాంటివి నేర్చుకున్నాడు. కానీ తండ్రి తిట్టడంతో ఊరు వదిలి హైదరాబాదుకు వెళ్తాడు. అక్కడ పేరున్న పెద్దలాయరు, తిమ్మినిబమ్మని చేయగల వకీలు ఖాజా కమాలుద్దీన్ దెహలవీ కాళ్లమీదపడి ఆయన శిష్యరికం చేస్తాడు. అతనికి అన్ని పనులు చేసిపెడ్తూ అంతోఇంతో నేర్చుకుంటాడు. 5-6 పెద్దపుస్తకాలు కొనుక్కొని మళ్లీ ఊరికి తిరిగి వెళ్తాడు. ఊరుఊరంతా అతని వాలకం చూసి వకీలు యెంకయ్య అని అని పిలుస్తారు. 23 ఏండ్లు వచ్చేసరికి అదిరించి, బెదిరించి వకీలు యెంకయ్య పటేలిగిరీ సంపాదిస్తాడు. కానీ ఆ ఊరి పట్వారీ, మాలీ పటేలుకు ఇతనంటే పడదు.           ఊరిలో ఓ ఖూనీ జరిగితే అమీన్ సాహెబ్ కు అన్ని మర్యాదలూ చేసి, ఆ హత్య మాలీ పటేలు చేసినట్లు వకీలు యెంకయ్య సాక్ష్యం సృష్టించి అతడిని జైలుకు పంపిస్తాడు. అతనితో పాటు మరో పది మందికి కూడా శిక్షపడుతుంది. అట్లానే వారికి ఇరవై వేలు ఖర్చూ అవుతుంది. దాంతో ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్లళ్లో కూడా వకీలు యెంకయ్య అంటే భయం కలుగుతుంది. కాలం గడిచి శిక్ష అనుభవించి మాలీ పటేలు ఊరికి తిరిగి వస్తాడు.           ఆ ఊర్లోనే ఉండే బోయవాడు బాలయ్య భార్య యెల్లి అందానికి వకీలు యెంకయ్య మనసు పారేసుకుంటాడు. పనికి ఇంటికి పిలిచి కోర్కె తీర్చమంటాడు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య తెలివిగా తన స్నేహితుడితో ఓ పన్నాగం పన్నుతాడు. యెల్లి వకీలు యెంకయ్యకు భర్త ఇంటిదగ్గర లేడని చెప్పి, రాత్రికి రమ్మంటుంది. వకీలు యెంకయ్య మురిసిపోయి యెల్లి ఇంటికి వెళ్తాడు. సరైన సమయానికి భర్త ఇంటి తలుపుకొట్టడంతో యెంకయ్యని గరిసెకొట్టడి (ధాన్యం నిలువ ఉంచేది) లో దాస్తుంది. భర్త బాలయ్య యెల్లికి ఓ డబ్బా ఇచ్చి దీనిలో పచ్చలు, రత్నాలు ఉన్నాయి, జాగ్రత్తగా దాచు అని చెప్తాడు. దాన్ని యెల్లి గరిసెకొట్టడిలో వేస్తుంది. వకీలు యెంకయ్య ఆశతో ఆ డబ్బాలో చేయ్యి పెడతాడు. దానిలో ఉన్న తేలు కుడుతుంది. పెద్దగా అరుస్తాడు. దాంతో బాలయ్య, అతని స్నేహితుడు వకీలు యెంకయ్యని కొట్టి బయటకు యీడుస్తారు.         ఆ అవమానంతో వకీలు యెంకయ్య మంచం పడతాడు. ఊరిలో సర్కారీ ఈతచెట్టు వకీలు యెంకయ్య వల్లె ఎవరో కొట్టేశారని మాలీ పటేలు అమీన్ కు రిపోర్టు చేస్తాడు. బాగా లంచం ఇచ్చి శిక్షపడేటట్లు కూడా చేస్తాడు. యెంకయ్యకు నాలుగు యేండ్లు శిక్ష పడుతుంది. దాంతో వకీలు యెంకయ్య ఎద్దులు, పొలము, ధాన్యము, స్థలము అన్నీ ఊరిలో వాళ్లు ఆక్రమించుకుంటారు. చివరకు శిక్షాకాలం పూర్తి చేసుకుని వచ్చిన వకీలు యెంకయ్య చిన్న పాతకొంపలో కాపురం చేస్తున్న తన కుటుంబాన్ని చూసి అరే వకాలతు ఎంత పనిచేసింది అని మూర్ఛపోతాడు.        కథంతా ఓ దారిలో నడిచినట్లు యెంకయ్య జీవితంలోని ఉద్దానపతనాలను తెలియచేస్తుంది. ఎటువంటి ముందు వెనుకలు లేకుండా పాఠకుడు కథలో లీనమవుతాడు. రచయిత చరిత్రను కథగా రాస్తున్నాను అని చెప్పడానికి కథలో మొదట సమారు 40 సంవత్సరాల క్రితం అని చెప్పడం, పాలమూరు జిల్లాలోని సింగారము అని కథా స్థలాన్ని చెప్పడం కనిపిస్తుంది. అదే విధంగా ఆనాటి పేర్లు పాలమూరు అంటే మహబూబ్ నగర్, జానంపేట అంటే నేటి హైదరాబాదులోని ఫర్రుఖ్ నగర్ అని చెప్పాడు. ప్రతాపరెడ్డి తెలంగాణలోని గ్రామీణ వ్యవస్థలో ఉన్న పటేలు, పట్వారీల దురాగతాలను కళ్లకు కట్టారు. లంచాలతో న్యాయాన్ని ఎలా తారుమారు చేసేవాళ్లో అమీన్ పాత్ర ద్వారా చూపారు. దొరల పాలనలో కింది కులాల స్త్రీల దైన్య పరిస్థితిని యెల్లి పాత్ర ద్వారా చూపారు. అందుకే ఈ కథ ఆనాటి సమాజపు వాస్తవచిత్రం. ఇక భాష విషయానికి వస్తే ఉర్దూభాషాపదాలతో కూడిన తెలుగు ఆనాటి ప్రజల భాషకు పట్టం కడుతుంది. వకాలతు, మౌల్వీసాబ్, పౌజ్దారీ, పెద్ద ఖానును, బేడీ హత్కడీ, డబ్బీ, బావర్చి (వంటమనిషి)... ఇలాంటివి ఎన్నో ఆనాటి ప్రజల వాడుకలో ఉన్న ఉర్దూ పదాలు కథలో కనిపిస్తాయి.        ఊళ్లల్లో ప్రచారం అయ్యే పుకార్లను చెప్తూ ప్రతాపరెడ్డి ఇలా రాస్తారు- వెంకటరెడ్డి మళ్ళీ వచ్చాడంటే వూరంతా తలక్రిందు అయ్యింది. కొందరు అతడు సన్యాసుల్లో కలిసినాడని, తాము రామేశ్వరము పొయ్యే బైరాగలలో అతన్ని చూచి బాగా గుర్తు పట్టినా మనిన్నీ, కొందరు అతడు పెద్ద జానంపేటలో తురకలతో కలిసినా డనిన్నీ, వక మాదిగదాన్ని పెండ్లి చేసుకున్నాడనిన్నీ, కొందరు అతడు కృష్ణలోపడి చచ్చినాడనిన్నీ-- యిట్లెన్నెన్నో పుకారులు పట్టించి వుండిరి. అదే విధంగా కథా కాలం నాటి సాంస్కృతిక జీవితాన్ని తెలుపుతూ యెల్లి ఆభరణాలను వర్ణిస్తాడు రచయిత. చేతికి వెండి కడియాలు, నడుములో వెండి డావు, ముక్కెర, ముత్యాల పోగులు, మెళ్ళో పగడాల దండ, మట్టెలు, గల్లు గల్లు మంటవి. వెండి కడియాలు కాళ్ళలో కాపురం....        అదే విధంగా ఆనాడు 30 యేండ్ల బాలయ్య, 15 యేండ్ల అమ్మాయిని పెళ్లి చేసుకునే అలవాటు ఉన్నదన్న విషయాన్ని చెప్పారు ప్రతాపరెడ్డి. ఈ కథ కొన్ని సంఘటనలు, సన్నివేశాల కలయికగా ప్రతాపరెడ్డి రాసినా ఎక్కడా కథా శిల్పం దెబ్బతినదు. ఇది రచయిత ప్రతిభకు నిదర్శనం. అందుకే ఈ కథ నాటి చరిత్రకు, నేటి కథా సాహిత్యానికి మూలం లాంటిదని చెప్పొచ్చు.                                                                                                                                                   డా. ఎ.రవీంద్రబాబు

అబ్బూరి ఛాయాదేవి

   అబ్బూరి ఛాయాదేవి                                                 డా. ఎ.రవీంద్రబాబు          తెలుగు కథలో ఆమెది ఓ విలక్షణ మార్గం. అమ్మలా లాలించినా, తప్పుచేస్తే ముద్దుగా దండించేలా ఉంటాయి ఆమె కథలు. స్త్రీ జీవితం చుట్టూ తిరుగుతూ వాళ్ల జీవితంలోని వివిధ పార్శ్వాలను ఆవిష్కరిస్తాయి. పురుషాధిక్య ప్రపంచాన్ని ధిక్కరిస్తూనే అందులోని తాత్విక దృక్కోణాన్ని విశధీకరించే దారులను చూపుతాయి. ఎక్కడా హడావుడి, ఆవేశం కనపడని చక్కనైన శిల్పంలా ఉంటాయి అబ్బూరి ఛాయాదేవి కథలు. తెలుగు కథా చరిత్రను రాస్తే ఆమెకు  కొన్ని పుటలు కేటాయించి అందులో ఆమె కథల గురించి తప్పక చెప్పాల్సిన అవసరం ఉంది. అబ్బూరి ఛాయాదేవి వ్యక్తిత్వమే ఆమె కథల్లో కనిపిస్తుంది.          అబ్బూరి ఛాయాదేవి 1933లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఎం.ఎ. చదివారు. కాలేజ్ లో చదివే రోజుల్లోనే ఆమె కాలేజ్ మ్యాగజైన్ కు అనుభూతి అనే కథను, పెంపకం అనే నాటికను రాశారు. ఇవే వారిలోని రచనకు బీజాలు వేశాయని చెప్పొచ్చు. 1953లో ప్రముఖ రచయిత అబ్బూరి వరదరాజేశ్వరరావును వివాహం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేశారు. ఉద్యోగరీత్యా 1976-77లో డాక్యుమెంటేషన్ కోసం ప్రాన్స్ లో ఉన్నారు. 1982లో స్వచ్ఛంద పదవీ విరమణచేసి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు.          అబ్బూరి ఛాయాదేవికి 1954లో ప్రచురించిన విమర్శకులు కథ ద్వారా తెలుగు సాహితీ లోకంలో విస్తృతమైన గుర్తింపు వచ్చింది. వీరి రచనలు-          అబ్బూరి ఛాయాదేవి కథలు, తనమార్గం లాంటి          కథా సంపుటాలు.          చైనాలో యాత్రా చిత్రాలు - యాత్రాకథనం          అనగనగా కథలు - వివిధ దేశాల జానపద కథలు          అపరిచిత లేఖ, మృత్యుంజయ (ఒకతండ్రి కథ),          ఇతర కథలు          వరదస్మృతి, వ్యాస చిత్రాలు బొమ్మలు చేయడం          స్త్రీల జీవితాలు, జిడ్డు కృష్ణమూర్తి,          మనజీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు          ఇలా ఎన్నో పుస్తకాలు ప్రకటించారు.          1954లోనే కవిత పత్రికకు సంపాదకత్వం వహించారు. వనిత పత్రికకు కూడా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1989-90లలో ఉదయం పత్రికలో మహిళా శీర్షికను నిర్వహించారు. ప్రముఖ స్త్రీ వాద పత్రిక భూమికలో కాలమిస్టుగా కూడా పనిచేశారు. వరదోక్తులు పేరిట వారి భర్త వరదరాజేశ్వరరావుగారి హాస్యోక్తులను కార్టూన్లతో సంకలనంగా తెచ్చారు. వీరి కథలు ఆంగ్లం, హింది, తమిళ, మరాఠి, కన్నడ భాషల్లోకి అనువాదాలయ్యాయి.           వీరి రచనలపై జిడ్డు కృష్ణమూర్తి తాత్విక ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాయాదేవి రచనల్లో ఎక్కువగా మధ్యతరగతి మహిళల జీవితాల్లోని అంశాలే కనిపిస్తాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న బాధలే ఉంటాయి. బోన్ సాయి బ్రతుకు, ప్రయాణం, సుఖాంతం, ఆఖరి ఐదు నక్షత్రాలు, ఉడ్ రోజ్ కథలు ముఖ్యమైనవి. బోన్ సాయి కథలో ఆడవాళ్ల జీవితాలు బోన్ సాయి చెట్లళ్లా ఎదగలేక పోతున్నాయి అని చెప్తారు. ఈ కథను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000ల సంవత్సరంలో పదోతరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం కథలో సంసార జీవింతంలో ఇరుక్కున్న స్త్రీ నిద్రకు కరువై, చివరకు మత్తుబిల్లలు మింగి ఆ మత్తులో శాశ్వత నిద్రలోకి జారుకున్న విధానాన్ని అద్భుతంగా వివరించారు. ఈ కథను 1972లో నేషనల్ బుక్ ట్రస్టువాళ్లు కథా భారతి సంకలనంలో చేర్చారు. స్పర్శ కథలో తండ్రి స్పర్శకోసం తపించే పిల్లల తపనను చెప్తారు. మృత్యుంజయ కథలాంటి నవల. ఇది ఛాయాదేవి తండ్రికి, ఆమెకు మధ్య జరిగిన ఉత్తరాల సంభాషణ. దీనికే 1996లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది. ఉపగ్రహం కథ స్త్రీకి ఎన్ని కోరికలు ఉన్నా, ఆశలు ఉన్నా, ఆమె ఎంత చదువుకున్నా... అవన్నీ భర్త అభిరుచులతో కలిసినప్పుడే నెరవేరుతాయని చెప్తుంది. ఆఖరి ఐదు నక్షత్రాలు కథ కార్పొరెట్ వైద్యరంగంలోనే దోపిడీని కళ్లకు కడుతుంది. కర్త, కర్మ, క్రియ కథలో పురుషాధిక్య ధోరణిని ఎదిరించే వనజ పాత్రను సృష్టించారు. అలానే ఎవర్ని చేసుకోను, నిర్ణయం, స్థానమహిమ కథలు స్త్రీలు భర్తను ఎన్నుకోవడంలోని వివిధ కోణాల్ని విశధీకరిస్తాయి.         అందుకే ఛాయాదేవి కథలు స్త్రీ గుండె అరల్లోని వెలుగు నీడల్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా మనకు చూపుతాయి. సమాజంలో స్త్రీ గృహిణిగా, ఉద్యోగిగా, తల్లిగా... ... అనే పలు చట్రాలలో ఎలా జీవితాన్ని కుదించుకుని నిరాశల మధ్య జీవిస్తుందో తెలుపుతాయి. అసలు స్త్రీ జీవితంలోని వివిధ దశలు పురుషల కనుసన్నలలోనే నడుస్తున్నాయన్నది వీరి కథల్లోని అంతర్లీన సత్యం. తెలుగు నేలపై స్త్రీవాదం అనే పదం వినపడక ముందే పరాధీనతకు గురైన స్త్రీల జీవితాలను కథలుగా అందించారు. తనమార్గం కథా సంపుటిలోని కథలు 1960ల నుంచి 2005 వరకు అంటే సుమారు నాలుగు శతాబ్దాల పాటు స్త్రీల జీవితాల్లో వచ్చిన అనేక మార్పులకు సాక్షీభూతం.          అబ్బూరి ఛాయాదేవికి కథా రచయిత్రిగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ పురస్కారం, 2000లో కళాసాగర్ అవార్డు, 2005లో తనమార్గం కథా సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. ఇంకా ఛాయాదేవికి నారాయణరెడ్డి, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డులు అందుకున్నారు. 2011లో అజోవిభో కందాళం ఫౌండేషన్ సంస్థ వీరికి జీవితకాల ప్రతిభామూర్తి పురస్కారం ఇచ్చి సత్కరించింది.         అబ్బూరి ఛాయాదేవి సాహిత్య సంప్రదాయాలతో పాటు, విజ్ఞత కలిగిన మనీషి. స్థిత ప్రజ్ఞత కలిగిన విదుషీమణి. అందుకే తన కథల గురించి చెప్తూ- నా కథలు తీవ్రంగానో, నిష్టూర పూర్వకంగానో కాక, ఆర్ద్రత కలిగించేటట్లూ హాస్యస్ఫూరకంగానూ, వ్యంగ్య పూర్వకంగానూ ఉంటాయి అన్నారు. ఇది నిజం అని తెలియాలంటే వారి కథల్ని తప్పక చదవాల్సిందే...

పోలయ్య

  పోలయ్య  (కథ)                                                       - కరుణకుమార                తెలుగు కథ పురుడు పోసుకున్న తర్వాత దాన్ని పసిపాపలా లాలించిన వాళ్లలో కరుణకుమార ఒకరు. అతని చేతిలో కథాబాల ఎన్నో ముద్దులొలికింది, మార్దవాన్ని, తొలి అడుగుల్ని, పలుకుల్ని నేర్చుకుంది. కాదు కాదు... తనవంతుగా కరుణకుమార నేర్పారు. ముఖ్యంగా ఆకాలం నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను అందంగా కథకు అలంకరించి సంతోషించారు. ఆయన రాసిన ఎన్నో కథలు నేటికీ కాంతులీనుతూనే ఉన్నాయి. అలాంటి కథలలో పోలయ్య కథ ముఖ్యమైంది. ఆనాటి వాస్తవ పరిస్థితులకు చుక్కాని వంటిది.             పోలయ్య కథ ఈ నాటి దళిత సమస్యను ఆనాటి సమాజంలో పంచములుగా  వాళ్ళు అనుభవించిన అంటరాని తనాన్ని చిత్రించింది. బ్రాహ్మణీయత, భూస్వామ్య స్వభావం వారిని ఎలా బాధించిందో తెలియజేస్తుంది. విఠలాపురానికి చెందిన వెంకటశాస్త్రి గొప్ప పండితుడు. కాశీలో వేదం చదువుకున్న సనాతన ధర్మపరుడు. పంచములంటే సుతారము ఇష్టం లేని వ్యక్తి. వారి గురించి కూలంకషంగా పరిశోధన చేసి వారికీ హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదని సిద్దాంతాన్ని లేవదీసిన ఘనుడు. కానీ- హరిజనులకు నూతన నామకరణం చేయాలని, దేవాలయ ప్రవేశం కలిగించాలని ఉద్యమాలు, ఉపన్యాసాలు బయల్దేరటాన్ని తట్టుకోలే పోతాడు. దాంతో సనాతన ధర్మాన్ని స్థాపించాలని ఉత్తరహిందూదేశ పర్యటనకు వెళ్తాడు. చివరకు పంచములు అన్యమతాల్లో కలుస్తున్నారని తెలుసుకుని పీడా విరగడైందని బ్రహ్మానందం పొందుతాడు.         ఇతను దేశాటనలో ఉండగా అతనికి మనమడు పుట్టాడని, ఆ సంవత్సరం మాఘశుద్ధ పంచమీ మంగళవారం బారసాలకు తప్పక రావాలని టెలీగ్రామలు అందుతాయి. దాంతో హడావుడిగా కాశీనుంచి బయల్దేరుతాడు. సోమవారం రాత్రి 11 గంటలకు నెల్లూరు సమీపంలోని పుంజూరులో ట్రైన్ దిగుతాడు. కానీ అక్కడ నుండి విఠలాపురం వెళ్లడానికి ఏ బండీ దొరకదు. చివరకు చీకట్లో ఓ ఎద్దుల బండివాడు కనిపిస్తే... బతిమాలి, అర్థరూపాయి ఎక్కువిస్తానని చెప్పి ఆతనిని ఒప్పించి బండిలో ఎక్కుతాడు. బండి సరీగా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడతాడు. కానీ మాటల మధ్యలో-           ఆ గ్రామాల మధ్య మోటారు బండ్లు వచ్చాయని, దాంతో బండ్లు నడిపే వారి జీవనో పాది దెబ్బతిన్నదని, ఎద్దుబండ్లపై ఆధారపడి జీవనం సాగించే వడ్రంగులు, మేదరోళ్లు, ఎద్దుకు గడ్డి అమ్మే మాలమాదిగల స్త్రీలు, బండికొయ్యలు అమ్మేవాళ్లు... ఇలా అందరి జీవితాలు నాశనం అయ్యాయని తెలుసుకుంటాడు. తిండి గడవక వీళ్లందరూ కలిసి మోటారు బండ్ల వ్యాపారం చేస్తున్న గంగపట్నం చెంచునాయుడి లోగిలిలోని గింజలు దోచుకున్నారని వింటాడు. పగపట్టిన చెంచునాయుడు వాళ్లందరినీ జైలులో పెట్టించాడని కూడా మాటల్లో తెలుసుకుంటాడు. అతని మాటల వల్ల అతను పేరు పోలయ్య అని, అతనిది మాల కులమని కూడా అర్థమౌతుంది. దాంతో వెంకటశాస్త్రికి కంపరం ఎత్తుకొస్తుంది. కాశీనుంచి తెచ్చిన గంగ, ఇన్నాళ్లు కాపాడుకొస్తున్న తన సదాచారం అన్నీ మట్టిగొట్టుక పోయాయని తెగ బాధపడతాడు. పైగా చెెంచునాయుడు, వెంకటశాస్త్రి బాల్యస్నేహితులు. ఇతనికి ఇల్లుకట్టించింది, నాలుగెకరాల పొలం ఇచ్చింది కూడా చెంచునాయుడే.          ఇంటికి  వెళ్లగానే శాస్త్రి చెంచునాయుడిని పిలిపిస్తాడు. అతనికి వీళ్లమీదున్న కోపాన్ని గుర్తుచేస్తాడు. పైగా పోలయ్య వర్ణాశ్రమ ధర్మాలు పాటించకుండా ఇంకోవృత్తి చేస్తున్నాడని, నే బ్రాహ్మణున్నని తెలిసి బండిలో ఎక్కించుకున్నాడని. నా శాస్త్రం మొత్తం మట్టిగొట్టుకు పోయింది అని చెప్తాడు. పాపం పోలయ్యకు మాత్రం తను చేసిన తప్పు ఏమిటో అర్థం కాక బాధపడుతుంటాడు. చివరకు పోలయ్యని కట్టేసి ఒళ్లు కాల్చాడానికి సిధ్దపడతారు. పోలయ్యకు ఏమీ చేయాలో పాలుపోదు. చివరకు ఓ నాటకం ఆడతాడు. తాను క్రైస్తవమతం తీసుకున్నానని, తన తాతకూడా క్రైస్తవుడని అబద్దం ఆడతాడు.  పేరు పౌలయ్య అని చెప్తే, మీరు పోలయ్యగా అర్థం చేసుకున్నారని నమ్మిస్తాడు. దాంతో వెంకటశాస్త్రి, చెంచునాయుడు వెనక్కు తగ్గుతారు. పాదరీలకు, సర్కారోళ్ల దోస్తీ ఉందని, రాజుమతమే, ప్రజల అభిమతమని పోలయ్యని విడిపించి, పైగా మూడు రూపాయలిచ్చి పంపుతారు.                ఇది 1932లో అప్పటి భారతి పత్రికలో ముద్రితమైంది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా, పంచములను హిందూమతంలోకి తేవడానికి గాంధీ లాంటి వాళ్లు చేసిన హరిజనోద్యమం... వంటి చారిత్రక పరిస్థితులకు ఈ కథ అద్దం పడుతుంది. అక్కడక్కడా నెల్లూరు జిల్లా మాండలికాలు తెలుగు భాషా నుడిని గుర్తుకు తెస్తాయి. ఇక కరుణకుమార కథను అందమైన శిల్పంలా చెక్కారు. ముగింపు వరకు కథ ఉత్కంఠరేపగా పోలయ్య ఆలోచనతో దానికి తెరదించి పాఠకుడిని ఆనందపరిచాడు కరుణకుమార. అందుకే హరిజనోద్ధరణను గ్రంథస్తం చేసిన ఈ కథ తొలినాటి దళిత సాహిత్యోద్యమానికి ఓ కొండ గుర్తు లాంటిది. చరిత్ర రచనకు ఓ ఆనవాలు వంటిది.                                                                                                డా. ఎ.రవీంద్రబాబు

చేరాకు అక్షరాంజలి

  చేరాకు అక్షరాంజలి                  చేరా... ఈ రెండు అక్షరాలు తెలుగు సాహితీ వేత్తలందరికీ సుపరిచితం. ఆ అక్షరాలే తెలుగు భాషకు ఆధునిక భాషాశాస్త్ర సూత్రాలను నేర్పింది. విమర్శకు సరికొత్త పద్ధతులను నేర్పి ఎందరో కవులను, కవయిత్రులను ప్రోత్సహించింది. పరిశోధకునిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా ప్రఖ్యాతి గాంచిన చేరా గురువారం (24-7-2014) రాత్రి ధ్యానం చేస్తూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఆయన లోటు తెలుగు సాహితీలోకానికి తీరనిది. 1934 అక్టోబరు1 ఖమ్మంజిల్లా ఇల్లెందపాడులో జన్మించిన చేరా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో పి.హెచ్ డీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర అధ్యాపకులుగా సేవలందించారు.  వీరు రాసిన తెలుగు వాక్యం, భాషాంతరంగాలు, చేరా పీఠికలు, మరోసారి గిడుగు, చేరాతలు లాంటి ఎన్నో గ్రంథాలు ప్రామాణికాలు. వీరి స్మృతికిణాంకం పుస్తకానికి 2002 లలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ సంతాపం ప్రకటించారు. తెలుగు కవులు, రచయితలు, విమర్శకులు వారి కుటుంబానికి సానుభుతిని తెలియజేశారు.                డా. ఎ.రవీంద్రబాబు

జూదం

జూదం                                           సింగమనేని నారాయణ           రాయలసీమ భాషకు, జీవితాలకు తెలుగు కథా సాహిత్యంలో పెద్దపీట వేసిన వారిలో సింగమేని నారాయణ ఒకరు. వారి కథల నిండా ఇంతవరకూ సాహిత్యంలోకి అడుగుపెట్టని పాత్రలు, వారి జీవితాలు కనిపిస్తాయి. సామాన్య ప్రజల కష్టనష్టాలను యదావిధిగా మనకళ్లకు కడతాయి ఆ కథలు. ఎక్కడా ఊహలు, అతిశయోక్తులు కనపడని సరళసుందరమైన కథలు వారివి. ప్రజల బ్రతుకుల్ని అక్షరాల్లో ముంచి వెన్నెల్లో ఆరేసి, మన గుండెల్లో నిక్షిప్తం చేస్తాడు. ఇలాంటిదే జూదం కథ. రాయలసీమలో వ్యవసాయం చేస్తున్న రైతుల దుస్తితిని, దైన్యాన్ని వివరిస్తుంది ఈ కథ. మన హృదయంలో కన్నీళ్లను పూయిస్తుంది.             జూదం కథ నారప్ప అనే రైతు చుట్టూ తిరుగుతుంది. అతని వ్యవసాయ జీవితాన్ని, సాదకబాధల్ని, వాటి లోతుపాతుల్ని మనకు చూపుతుంది. తండ్రి ఆస్తి భాగాలు పంచుకోగా నారప్పకు పది ఎకరాలు వస్తుంది. దాని సాగుచేసుకుంటూ ఉంటాడు. అనేక అప్పులు చేసి పండించిన పంట... రాగులు, జొన్నలు ఇంటికి వచ్చి ఉంటాయి. కానీ రేటు మరీ తక్కువుగా ఉండటంతో అప్పులకు కట్టడానికీ చాలవని అమ్మకుండా ఇంట్లోనే పెట్టి ఉంటాడు. బుద్ది వచ్చినప్పట్నుంచీ కష్టపడుతూనే వున్నాడు. పంటలు పండిస్తూనే వున్నాడు. అయినా యిదేం విచిత్రమో ఓమైన అప్పు పెరుగుతూనేవుంది. ఇదంతా తల్చుకొని ఏం సేద్యమో ఏం పాడో గడియ తీరిక లేదు, దమ్మడీ ఆదాయం లేదు అని బాధపడుతూ ఉంటాడు.  పొలానాకి బయల్దేరిన నారప్పకు బట్టల దుకాణం శేషయ్య ఎదురొచ్చి ఇవ్వాల్సిన అప్పు అడుగతాడు. తోటలో పుల్లలు ఏరుకోడానికొచ్చిన ఎల్లమ్మ చేసిన అప్పుకోసం తన కొడుకును  మున్నూటికే జీతగాడికి ఉంచాను అని నారప్పతో చెప్పి తన బాధను ఎల్లబోసుకుంటుంది. కూరగాయల పాదుకు నీళ్లు పెడదామని పోతే కరెంటు ఉండదు. దాంతో కరెంటు బిల్లు టంచెనుగా కట్టాలి. కరెంటు మాత్రం పల్లెలకు ఇవ్వరు అని విసుక్కుంటాడు. అంతలో బాంకువాళ్లకు కట్టాల్సిన అప్పుగుర్తుకొస్తుంది. దాంతో తను కట్టాల్సిన అప్పులు మొత్తం మనసులో లెక్కవేసుకుంటాడు. రామశేషయ్యకు ఎంతలేదన్నా యిన్నారు... గానుగచెక్క బాకీ నూరు... కిరాణా సరుకులు తెచ్చిన  ఎంగటేసులశెట్టి అంగిట్లో మున్నూరు... మూడునెల్లు కరెంటు బిల్లుకు శివయ్యతో తెచ్చింది నూటయైభే... యీ నెలకట్టే బిల్లు యూభై... ఇలా లెక్కించుకుంటూ మొత్తం ఒక్క వెయ్యీ నూరు అని తేల్చుకున్నాడు. ఇవి తక్షణం అవసరాలు. తీర్చకపోతే మర్యాద దక్కదు.          ఇలా ఆలోచనలో ఉండగానే తొమ్మదేళ్ల కొడుకు పరుగుపరుగున వచ్చి బ్యాంకువాళ్లు వచ్చారు అని చెప్తాడు. నారప్ప గాబరా గాబరాగా ఇంటికెళ్తాడు. వాళ్లకు ఎంత నచ్చజెప్పినా ఫలితం ఉండదు. చివరకు వాళ్లలో ఒకాయన మీలాంటి మర్యాదస్తుల యిండ్లకాడ జప్తుగిప్తు అంటే ఏమన్నా బాగుంటుందా అని చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాంతో నారప్ప చేసేది ఏమీలేక ఊర్లో గింజలు కొనే శివయ్యకు జొన్నలు, రాగులు అమ్మడానికి సిద్ధపడతాడు. కానీ శివయ్య అదే అదునుగా తక్కువరేటుకు కొంటాడు. పైగా నువ్వు గుయ్ గుయ్ అంటే బాగుండదు- మూటకు రెండున్నర బండి బాడుగా, రూపాయి వాణిజ్యం పన్నూ తీసివేసే ధర కడతా అని చెప్తాడు.            బ్యాంకు వాళ్ల అప్పుతీర్చగా నారప్పకు 750 రూపాయలు మిగులుతాయి. శివయ్య అవి కూడా మొత్తం ఒకసారి ఇవ్వకుండా ఐదునూర్లు ఇచ్చి మిగిలినవి రెండు మూడు రోజుల్లో ఇస్తానంటాడు. ముందు సంవత్సరం ధర ఉంటే 2000 అన్నా వచ్చేది అని బాధపడుతూనే ఊర్లో ఉన్న అప్పులు కొన్ని తీరుస్తూ పోగా చివరకు నలభైఐదు రూపాయలు మిగులుతాయి నారప్పకు. యూరియా, కరెండు బిల్లు, పండగకు కొత్తబట్టలు... అన్నీ మల్లా అప్పు చేయ్యాలా... అని ఆలోచనతో ఇంటికి వస్తూ ఉంటాడు. రాగనే ఇంటిదగ్గర కరెంటు బిల్లుకోసం అనంతపురం నుంచి వచ్చిన రామ్మూర్తి వెంటనే బాకీ ఇవ్వాలి అని అడుగుతాడు.                    కథలో రైతు జీవితాన్ని క్రమ పద్దతిలో చెప్పి అద్బుతమైన శిల్పాన్ని పో షించాడు సింగమనేని నారాయణ. కథ మొదట అప్పు... పంటచేతికొచ్చినా అప్పు తీరలేదని చివరలో మరో అప్పు ప్రస్థావన. ఇలా ప్రారంభ, ముగింపుల అనుసంధానం చేశారు రచయిత. మధ్యలో వ్యాపారి శేషయ్య, శివయ్యలు ఆర్థికంగా రైతు వల్ల ఎదుగుతున్నా రైతు జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదని చెప్పాడు. అదే విధంగా ఎల్లమ్మ పాత్ర ద్వారా కూలీల జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఈ కథ శిల్పంలో వదిగిపోయిన సీమ రైతు జీవితచిత్రం. ముగింపు కొసమెరుపులా ఉండాలన్న కథా నియమావళికి ... ఈ కథలో కరెండు బిల్లు రామ్మూర్తి రావడాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు.           ఇక భాష విషయానికి వస్తే రాయలసీమ భాషను నారాయణ అద్భుతంగా కథలో వాడారు. నీ బాకీ నిలపల్లని వుందా, కటినికట్టుగా అడుగుతున్నాను, పాతికో పరకో వాళ్ళ దగ్గరే చేబదుళ్లు, మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి, జమలు ఇవ్వాల్సిన డబ్బు ... ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి కథలో. శివయ్య ఇంటికి వెళ్లిన నారప్పకు గోడమీద వేలాడుతున్న వెంకటేశ్వర స్వామి ఫొటో సంవత్సరానికి సంవత్సరానికి పెద్దదవుతుందోమో అనే అనుమానం కలుగుతుంది. దీని ద్వారా అతను ఎలా సంపాదిస్తూన్నాడో పాఠకులకు అర్థం అయ్యేలా చేశాడు రచయిత. ఇక చివరిగా కథా శీర్షిక గురించి చెప్పుకుంటే- సింగమనేని నారాయణ వ్యవసాయం జూదంలా తయారైందని చెప్పడానికి ప్రతీకాత్మకంగా ఈ పేరు పెట్టి ఉంటాడు. ఇలా ఈ కథ వాస్తవ రైతు జీవన వరిస్థితులకు దర్పణం....                                                           డా. ఎ.రవీంద్రబాబు

కల కల్పన కళ

కల... కల్పన... కళ                                                                          - డా. ఎ.రవీంద్రబాబు           ఎద వాకిళ్లు తెరిచి వెన్నెలను దోసిటపట్టిన రోజుల్లో జ్ఞాపకానికి ఇంత పదును ఉంటుందని తెలియదు. ఎదను కోస్తూ... జీవితం కత్తి అంచుపై యమపాశంలా నర్తిస్తున్నదని తెలియదు. తెలియదు పాపం తెలియదు... ఎడబాటుకు మండుటెండకున్నంత పదును ఉంటుందని నిజంగా తెలియదు. ఊహలు, ఊసులు, ఆశలు, ఆశయాలు మాత్రమే యవ్వనపు పొరిమేర్లలో గమ్మత్తుగా సంచరిస్తుంటే నీ వేడి నిట్టూర్పుల మధ్య కాలాన్ని కౌగిళ్లగా కరిగించిన రోజులకు తెలియదు. పాపం తెలియదు. తెలియదు... తెలియదు. మరణం ముందు ఊగిసలాడే గుండెను ఒడిసిపట్టి కన్నీటిలో ముంచేస్తుందని ఆరోజు తెలియదు... ప్రియా తెలియదు. నిజంగా తెలియదు. అసలు ప్రేమ జగత్తులో మరో మాయా జగత్తు ఉందన్న సత్యం తెలియదు. తెలియకపోవడం కూడా తెలియదు ఈ పిచ్చి ప్రేమ మదికి.  నీ వక్షం మీద ఆన్చిన ఈ తలలో ఇన్ని కల్లోలాలు చెలరేగుతాయని తెలియదు. నిఝంగా తెలియదు.          వాడెవడో విరహం అంటా...నాతోనే నిత్యం జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ స్నేహితుడిలా ప్రాణం తీస్తున్నాడు. ఆది అంతంలేని ఈ చరాచర జగత్తుకు వాడే రాజ్యాధిపతి అట. దేవుడు, సైతాన్ రెండూ వాడేనట. నిన్ను నన్ను ఈ కాలగతిలో చక్రంలా తిప్పేది వాడేనట. ఆ రోజుల్లో హృదయం సినిమా చూసి ప్రేమదేవత ముందు మోకరిల్లిన ప్రేమికుడి గుండెనుండి వచ్చే శూలాల్లాంటి మాటలకు నే కార్చిన కన్నీరుకు లెక్కల్లేవు. ఇప్పటి నా వర్తమానానికి అది పునాది అన్న దృశ్యం తప్ప. సంతోషం అంటే ఏమిటి... ఎక్కడ దొరుకుతుంది... ఎసలు సంతోషం అనేది ఉందా... మనకు మనం కల్పించుకున్న భ్రమా... ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు. ఈ మర్రినీడల్లా సాగే జీవితానికి పరమార్థమే కాదు. అర్థం కూడా లేదేమో... సన్యాసులకూ తెలియక అలా తిరుగుతున్నారేమో... దేవుడిపై భారం వేసి మధ్యతరగతి మానవుడు ఆ ఆలోచనల నుంచి తప్పుకుంటున్నాడేమో... నిజాల్లేవు, అబద్దాల్లేవు... అంతా కల్పించుకున్న ఓ కుత్రిమ జీవిత చిత్రం. నిజమే కదా... అవును నిజం. నిప్పులాంటి దహించే నిజం.              అక్షరాలు గుండెనరాలును తెంచేస్తూ నీ గుర్తులను ధారగా కురిపిస్తున్నాయి. అవి చిదుగుల్లా పొడిపొడిగా రాలుతున్నాయి. అమావాస్యరోజు కురిసే చీకటి సవ్వడిలా... స్మశానం లాంటి నిశ్శబ్దాన్ని మోస్తూ... పదాలు, వాక్యాలు. అర్థం మాత్రం నీవు వదిలేసిన దేహం మత్రమే. దెయ్యాల్లా రాత్రులు శరీరం నిండా గాయాలు చేస్తున్నాయి నీ చేతి గుర్తులను జ్ఞప్తికితెస్తూ... అయినా ప్రేమను పంచుకోడానికే కాదు. కోపంలో కసురుకోడానికీ ఓ తోడు లేకపోతే...ఎంత హాయిగా ఉంటుంది. రోడ్డు మీద మన తలమీదే ఓ నాలుగు చక్రాల వాహనం ఎక్కినట్లు, ఓ ట్రైన్ హటాత్ గా మనలోకి దూరి వెళ్లినట్లు... అవును ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమలో తాము, తమతో తాము యుద్దం చేస్తున్న ఓ సైనికుడే... ఏకాంతాలు, ఒంటరితనాలు చలినెగళ్లులా కాగుతున్న రక్తకాషారాలే... అప్పుడు ఎవరికి వారే ఓ సునామీ, ఓ బద్దలవుతున్న అగ్ని పర్వతం...              ప్రపంచంలో అన్నిటికన్నా సుఖమైంది, సంతోషమైంది మరణం అట. కాఫ్కా కథలు చదువుతున్నా... జీవితం మరణం వైపు సాగే కళ అట. అవును కళ కల్పన, కల్పన కళ. కల ఓ వాస్తవానికి ప్రతీక. ఫ్రాయిడ్ ఎలా చెప్పాడో... కలల తీరాన్ని దాటే మనిషి అంతరంగాన్ని. ఆ కలల ఒడిలో మునిగిపోయే మనో తీరాన్ని. ఏడుపు గొప్ప కళ అట. ఆ కళ అందరికీ చేతకాదట. అవును నేను నిజంగా ఆకళలో నిరక్షరాస్యుడ్ని. ఎడుపు నా కళ్లనుండే కాదు, నా గుండె నుండి కూడా వెళ్ళిపోయింది. నిషేధం విధించింది నాపైన... మనస్ఫూర్తిగా ఏడిస్తే భారం తగ్గుతుందట. ఏడవకు అని మాట తీసుకొని వెళ్లి... ఏడుపునే నాకు దూరం చేశావు.               ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలులేవు. మబ్బుల్లేవు. మానవత్వం లేదు. మనో నేత్రం విప్పే మనుషులు లేరు. నేను ఇక్కడో వలస జీవిని. ఎదస్పర్శలన్నీ ధనంలోకి కుదించబడ్డాయి. ఐదుకు, పదికి ప్రేమలు దొరుకుతున్నాయి. వాటికి ప్రేమ అని పేరుపెట్టి శరీరాలను డబ్బుతో కొనుక్కుంటున్నారు. పెళ్లిళ్ల పేరుతో వ్యాపారం సజావుగానే సాగుతుంది. కట్నాలతో కూడా ప్రేమలు బాగానే దొరుకుతున్నాయి. ముసుగుల మధ్య జీవితాలు నాట్యాలు చేస్తు... నటిస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ నేనే.  నాలో నేను ఉప్పొంగే సముద్రం, వర్షించని నా ఎడారి కళ్లు తప్ప అంతా బాగనే ఉంది. చావుకు, బతుక్కు మధ్య గడియార లోలకంలా కొట్టుకుంటుంది నా ఎద లయ. వింటే మనసుంటే..., తట్టుకునే నీ లాంటి శక్తి ఉంటే...              కాలం ఎప్పుడూ ఇంతే అకారణంగా హత్యలు చేస్తుంది. నిన్ను, నన్ను, మరణాన్ని, మన ప్రేమను... ఎన్నని చెప్పను. తగలబడుతున్న నా ఎద సాక్షిగా... ఇంకో సారి చెప్తా విను. ఇక్కడ ప్రేమలు లేవు. అవసరాలు, అవకాశాలు, కోర్కెలు, డబ్బు, హోదాలు, కీర్తి... వాటికోసం నటన. మరి నేనెలా బ్రతకాలి... నీ పాటికి నీవు వసంతాన్ని వెంటేసుకుని, నీయాత్రను ముగించుకొని అలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయావు. నాకు ఇక్కడేం పని. నే చెయ్యాల్సిన పనులు ఏముంటాయి. ఈ రక్కసి మనసుల మధ్య, ఈ వస్తువినిమయ మనుషుల మధ్య... అందుకే అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఆరిపోయిన వెలుగుల మధ్య ఆరిపోయిన కొవ్వొత్తిని ఎవరూ వెలిగించడానికి ప్రయత్నించకండి. ఈ పేజీ చించేయబడింది. ఈ పుస్తకం శాశ్వతంగా మూసివేయబడింది. దయచేసి చివరి అట్టకూడా తెరవకండి. అటునుంచి చదవాలని పిస్తుంది. బై.... ఒక జీవితకాలం... కాలం... లయం... యం.    

పులికంటి కృష్ణారెడ్డి

   పులికంటి కృష్ణారెడ్డి                              పులికంటి కృష్ణారెడ్డి కథకడు, రంగస్థల నటులు, బుర్రకథ కళాకారుడు, కవి, పత్రికా సంపాదకుడు... ఇలా విభిన్నమైన రీతుల్లో సాహితీసేవ చేసిన ప్రజ్ఞావంతుడు. రాయలసీమ భాషను, అక్కడి ప్రజల దైనందిన జీవితాలను తొలినాళ్లలో గ్రంథస్తం చేసిన వారిలో కృష్ణారెడ్డి ఒకరు. రాయలసీమ భాషకు కావ్యగౌరవం కల్పించిన మహానుభావుడు అని అక్కడి కవులు, విమర్శకులు ప్రశంసిస్తారు. వచనాన్ని, పద్యాన్ని, జానపద కథారీతుల్ని అలవోకగా రాయగల సాహితీవేత్త పులికంటి కృష్ణారెడ్డి.               పులికంటి కృష్ణారెడ్డి జులై 30, 1931న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని జిక్కిదోన గ్రామంలో పుట్టారు. వీరిది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ కూడా పూర్తికాక ముందే భారతీయ రైల్వేలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. సుమారు 13 ఏళ్లపాటు రైల్వేలోనే ఉద్యోగాన్ని చేశాడు. కానీ నాటకాలపై మోజు, సాహిత్యం పై మక్కువతో ఉద్యోగాన్ని వదిలివేశాడు. తిరుపతిలో కాఫీపొడి వ్యాపారం చేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. నిత్యం రచనా వ్యాసంగంలో జీవించాడు. కామధేను పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగం చేశాడు.             వీరు సుమారు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు రాశారు. అంతేకాదు 100కు పైగా బుర్రకథలు, జానపద బాణీలో అమ్మి పదాలు, లలితగీతాలు, పద్య కావ్యాలు కూడా రాశారు. వీరి మొదటి కథ గూడుకోసం గువ్వలు కథను 1961లో వెలువడింది. అరచేతిలో గీత, తీయలేని కలుపు, మరుపురాని మా ఊరు లాంటి ఎన్నో గొప్ప కథలు అందించారు. కృష్ణారెడ్డి కథలు-           గూడుకోసం గువ్వలు           పులికంటి కథలు           పులికంటి దళితకథలు           పులికంటి కథావాహిని           కోటిగాడు స్వతంత్రుడు అనే సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.           వీటిలో 14 ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.           ఇవే కాకుండా మొక్కితే దేవుడు అనే ఛందోబద్ద పద్య కావ్యం, 1958లో రచించిన ఆదర్శం నాటకం వీరికి మంచి పేరుతెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం 100కుపైగా బుర్రకథలు రాశారు. వీటిలో వయోజన విద్య, సారాం, వనమహోత్సవాలు, కుటుంబనియంత్రన వంటి ఎన్నో సామాజికాంశలే మనకు కనిపిస్తాయి.          కృష్ణారెడ్డి బాశాలి పాత్ర ద్వారా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో భార్య పాత్ర ఎంతో ఉదాత్తంగా ఉంటుందో వివరించారు. దళితులు సామాన్య జీవన స్రవంతికి దూరంగా ఉన్నారని బాధపడేవారు. వారిని అక్కున చేర్చుకునే విధంగా, వారిమనోభావాలతో కథలు రశారు. కోటిగాడు స్వతంత్రుడు, పులికంటి కథలు ఇలాంటివే... రాయలసీమ భాషలో గోయిందా గోయిందా అనే పుస్తకాన్ని కూడా రచించారు.            కృష్ణారెడ్డి కథ రాసినా, గేయం రాసినా, బుర్రకథ రాసినా పులికంటి ముద్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈయన రచనల్లో ప్రధానంగా రాయలసీమ ప్రజల వ్యధా జీవితం ఉంటుంది. వారి జీవిద్భాష ఉంటుంది. వీరి అమ్మిపదాలు నండూరి ఎంకి పాటల వలె ప్రచారం పొందాయి. ఆంధ్రప్రభలో సంవత్సరం పాటు నాలుక్కాళ్ల మండపం కాలం నిర్వహించారు. ఇది తిరుపతి పరిసర ప్రాంతాల జీవితాలను కళ్లకుకడుతుంది. ముఖ్యంగా రైతుసమస్యలు, నీటి ఎద్దడి, ఓట్లు, రాజకీయాలు... ఇలా అన్ని సమస్యలు వీరి రచనల్లో కనిపిస్తాయి.  కృష్ణారెడ్డి తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి, వాటినే రచనల్లో చెప్పేవారు. అందుకే ఇవి తాత్విక చింతన, సామాజిక స్పృహ జమిలిగా కలిసిన చారిత్రక పురోగతులు. కృష్ణారెడ్డి రచనలు ఎక్కువభాగం ఆకాశవాణి, టీవీలలో ప్రసారం అయ్యాయి.           వీరు రచనలు చేయడమే కాకుండా కొన్ని ఉన్నత పదవులు కూడా నిర్వహించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్ కమిటీ సభ్యులుగా, సలహాదారుగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫెర్ ఫామింగ్ గా కూడా పనిచేశారు. వీరికి ఎన్నో పురస్కారాలు, బహుమతులు వచ్చాయి. అగ్గిపుల్ల నవలకు చక్రపాణి అవార్డు వచ్చింది. నటులుగా ఎన్నో సత్కారాలు పొందారు. ఈయన గొంతెత్తి పాడితే వినసొంపుగా ఉండేది. యువకళావాహిని వారి గోపీచంద్ అవార్డు, ఎస్వీయు గౌరవ డాక్టరేటు ఇచ్చాయి. ఇంకా జానపదకోకిల, ధర్మనిధి పురస్కారాలు వంటివి ఎన్నో వచ్చాయి. వీరి పేరుమీద పులికంటి సాహితీ సత్కృతిని స్థాపించి ఆయన పేరుమీద ప్రతి ఏడాది సాహిత్య, కళారంగాలలో కృషి చేసిన వారికి ప్రధానం చేస్తున్నారు.           రాయలసీమ చిన్నోణ్ణి           రాళ్లమద్దె బతికే వాణ్ణి           రాగాలే ఎరగక పోయినా           అనురాగానికి అందేవాణ్ణి                                          అని చాటిన సీమ సాహితీ రత్నం పులికంటి కృష్ణారెడ్డి.           ఇలా విశేషమైన సాహితీ కృషి చేసిన పులికంటి కృష్ణారెడ్డి నవంబర్ 19, 2007లో మరమణించారు. కానీ ఆయన జీవితం, రచనలు ఎందరికో మార్గదర్శకాలు.            చిత్తూరు నుంచి చికాగోదాకా సాహిత్య రసజ్ఞుల హృదయాలను కొల్లగొట్టారు, ఐదు దశాబ్దాలు మాండలిక పరిభాషలో జనజీవనాన్ని కళ్లకు కట్టారు. సీమ జీవితాల శిథిల ఘోషను తన సాహిత్యంలో ఏర్చి కూర్చారు. అందుకే పులికంటి కృష్ణారెడ్డి తెలుగువారి కథా రచయితల్లో మేటి.   - డా. ఎ.రవీంద్రబాబు                

డాక్టర్ సి. నారాయణరెడ్డి

  డాక్టర్ సి. నారాయణరెడ్డి                                                      - డా.ఎ.రవీంద్రబాబు      నేటి ఆధునిక, అత్యాధునిక సాహిత్య ప్రపంచాలకు వారధి ఆయన. ఎన్నో సాహితీ గవాక్షాలను తెరిచిన తేజోమూర్తి. అపూర్వమైన చిత్ర రాజాలను తన పాటలతో ఊరేగించిన పాటల వీరుడు. విద్యలో, వినయంలో, మాటలో, చేతలో, రాతలో, రూపులో అతనిదో ప్రత్యేకమైన శైలి. అతనే డాక్టర్ సి. నారాయణరెడ్డి. తెలుగు నేలపై సాహితీ వ్యవసాయం చేస్తున్న నిత్యకృషీవలుడు.         కరీనంగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జులై 29, 1931న జన్మించారు నారాయణరెడ్డి. ప్రాథమిక విద్యను గ్రామంలో, మాధ్యమిక విద్యను కరీనంగర్ లో పూర్తి చేశారు. ఆపై హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు - ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ ను పొందారు. అయిుతే ప్రాథమిక విద్య నుంచి బి.ఎ. వరకు ఉర్దూలో చదివినా తెలుగుపై ఉన్న అభిమానమే వారిని నడిపించింది. సాహితీ మూర్తిని చేసింది.          గ్రామంలోని జానపద బాణీలు, సాంస్కృతిక కళారూపాలతో ముడివేయబడిన బాల్యం నారాయణరెడ్డిది. స్వతహాగా భావకుడైన అతనికి వీటి ప్రభావంతో కవిత్వం రాయడం అలవోకగా అబ్బింది. వీరి తొలి కవిత జనశక్తి పత్రికలో అచ్చైంది. 1953లో తొలి నృత్యనాటిక నవ్వనిపువ్వు పాఠకలోకానికి అందించారు. అప్పటి నుంచి ఎన్నో అపూర్వమైన, అమూల్యమైన కవిత్వ ఫలాలాను అందిస్తూనే ఉన్నారు. పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, వచనకవితలు, యాత్రాకథనాలు, నృత్య రూపకాలు, గజళ్లు, విమర్శ, అనువాదం... ... ఇలా ఎన్నో కవితాప్రక్రియలు వారి కలం నుంచి జాలువారి తెలుగునేలను పుణీతం చేశాయి.             రామప్ప             కర్పూర వసంతరాయలు             విశ్వనాథనాయకుడు             నాగార్జున సాగరం             రెక్కల సంతకాలు             మట్టి మనిషీ ఆకాశం            మంటలు-మానవుడు             మధ్యతరగతి మందహాసం             ప్రపంచపదులు             మార్పు నాతీర్పు             మనిషీ - చిలుక             ఆరోహణ             కలం సాక్షిగా             ముఖాముఖి                వ్యక్తిత్వం                అన్నిటిని మించి జీవునని వేదనను ఆధ్యాత్మిక, చారిత్రక వాస్తవ దృక్కోణంలో వివరించే విశ్వంభర... ఇలా 70 గ్రంథాలు వీరి నుంచి వెలుగు చూశాయి. నేటికీ తన పుట్టిన రోజున ఒక పుస్తకాన్ని ప్రచురించడం నారాయణరెడ్డికి ఆనవాయితీ. ఈ పుస్తకాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి.            ఇక నారాయణరెడ్డిలోని మరో అంశం సినీగేయ రచయిత. 1962లో గులేభకావళి చిత్రానికి అన్ని పాటలు రాసి చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆతర్వాత ఆయన కలం వెనుతిరిగి చూడలేదు. ఆత్మబంధువు, కర్ణ, లక్షాధికారి, అమరశిల్పిజక్కన్న, రాముడు భీముడు, కోడలు దిద్దిన కాపురం... ఇలా రెండు దశాబ్దాలు వెండితెరను పాటల రచయితగా ఏలారు. ఏకవీర చిత్రానికి మాటలు కూడా అందించారు. స్వాతి ముత్యంలో లాలిలాలి వటపత్ర శాయికి వరహాల లాలి అని జోలపాట పాడారు, వరనకట్నం చిత్రంలో వరకట్నాన్ని వ్యతిరేకిస్తూ- ఇదేనా మన సంప్రదాయమిదేనా... అని ప్రశ్నించారు. అమరశిల్పి జక్కన్నలో ఈ నల్లనిరాళ్లలో ఏ కన్నులు దాగెనో అని రాళ్లకున్న మనసును వెలికితీశారు. రేపటి పౌరులు చిత్రంలో రేపటి పౌరులం రేపటి పౌరులం అని విద్యార్థుల భావి జీవితానికి మార్గాన్ని నిర్మించారు. ఒసే రాములమ్మలో ముత్యాలరెమ్మ... అంటూ తన కలంలో వాడివేడి తగ్గలేదని నిరూపించుకున్నారు. 2009లో అరుంధతిలో జేజేమ్మా పాట ఆ చిత్రవిజయానికి ముఖ్యభూమికైంది.  ప్రేమించు చిత్రంలోని కంటేనే అమ్మంటే ఎలా..., సీతయ్య చిత్రంలోని ఇదిగొ రాయలసీమగడ్డ పాటలకు నంది అవార్డులు సైతం వీరికి వచ్చాయి. వీరు రాసిన పాటల గురించి వీరే ఓ పత్రికలో పాటలో ఏముంది నామాటలో ఏముంది అనే శీర్షికను నిర్వహించారు. అది నేడు పుస్తకంగా కూడా లభ్యమవుతుంది.               ఇక సాహితీ, విద్యావేత్తగా వీరికొచ్చిన బహుమతులకు లెక్కే లేదు. 1997లో పద్మశ్రీ 1978లో కళాప్రపూర్ణ, 1988లో రామలక్ష్మీ, 1992లో పద్మభూషణ్... ఇలాంటివన్నీ నారాయణరెడ్డి ప్రతిభకు కొలమానాలు లాంటివి. 1989లో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీట్ వీరి విశ్వంభర కావ్యానికి వచ్చిది. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి. ప్రపంచంలోని ముఖ్యదేశాలు సందర్శించారు. ఇవన్నీ వారి కృషికి చిన్నపాటి సత్కారాలు మాత్రమే...              రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు             పోతూపోతూ రాస్తాను వపసు వాడే వరకు  అన్నసాహితీ జ్ఞిజ్ఞాస వారిది. తెలుగు జాతి, తెలుగుభాషే కాదు...యావత్ భావతదేశం గర్వించదగిన వ్యక్తి డాక్టర్ సి.నారాయణరెడ్డి.

పి. సత్యవతి

     పి. సత్యవతి                                                 - డా. ఎ. రవీంద్రబాబు                  తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమం ఓ ప్రధాన భూమిక. సమాజాన్ని, సాహిత్యాన్ని స్త్రీ కోణం నుంచి చూడటాన్ని అలవాటు చేసిన వాహిక. ఈ దృష్టితోనే ఎందరో రచయిత్రులు కథలు, కవితలు, విమర్శ, పరిశోధన రంగాలలో విశేష కృషి చేశారు. వీరిలో ప్రధానమైన రచయిత్రిగా చెప్పకోవాల్సిన వాళ్లలో పి. సత్యవతిగారు ఒకరు. స్త్రీని, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు సత్యవతి. ఆమె కథల్లో, నవలల్లో, వ్యాసాల్లో మారుతున్న సమాజంలో మానసిక వేదనలకు గురౌతూ ఎదుగుతున్న స్త్రీలే మనకు కనిపిస్తారు.            పి. సత్యవతి గుంటూరు జిల్లా కొలకలూరులో 1940 జులై 2న జన్మించారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో ఎం.ఎ. ఇంగ్లిషు పూర్తి చేశారు. విజయవాడలోని ఎస్.ఎ.ఎస్. కాలేజ్ లో అధ్యాపకులుగా పని చేసి పదవీవిరమణ పొందారు. ఆమెకు అపారమైన బోధానానుభవమే కాదు, తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై పూర్తి పట్టు ఉంది. అన్నిటికి మించి తెలుగు సమాజాన్ని క్షుణ్ణంగా దగ్గరనుంచి పరిశీలిస్తున్నారు. అందుకే నాలుగు దశాబ్దాల తెలుగు స్త్రీ, వారి రచనల్లో మనకు కనిపిస్తుంది. వీరి తొలి కథ 1964లో ఆదివారం కోసం రాశారు. దీనిలో ఆదివారమైనా స్త్రీకి సెలవు ఉండాలని, అది వ్యక్తిగతమైన పనులు చేసుకోడానికి అవసరమని వివరిస్తుంది. 1975లో మర్రినీడ కథా సంపుటి వీరిని రచయిత్రిగా పాఠకలోకానికి పరిచయం చేసింది. ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక ప్రచురించిన కథలలో పాఠకుల అభిప్రాయాల ద్వారా ఈ కథకు బహుమతి వచ్చింది. పి. సత్యవతి కేవలం కధా రచయిత్రే కాదు నవలలు, వ్యాసాలు, అనువాదాలు కూడా చేశారు.         వీరి కథా సంపుటాలు ప్రధానంగా- 1995లో వచ్చిన ఇల్లలకగానే 1998లో వచ్చిన సత్యవతి కథలు 2003లో వచ్చిన మంత్రనగరి.... ఇవన్నీ వివిధ కోణాలలో స్త్రీలు సమాజంలో అనుభవిస్తున్న బాధలను చిత్రించినవే... ఈ కథల్లో కొన్ని మధ్యతరగతి స్త్రీ, పురుషస్వామ్య చట్రంలో గురువతున్న మోసాలను తెలిజేస్తాయి. మరికొన్ని కథలు ఆ చట్రాన్ని బద్దలు కొట్టి స్వశక్తితో ఎదిగేలా సాగుతాయి. ఇంకొన్ని కథలు జెంటర్, చాపకింద నీరులా స్త్రీలను ఎలా నియంత్రిస్తుందో మ్యాజిక్ రియలిజం టెక్నిక్ లో వివరిస్తాయి. ఈ కథలను ఒకసారి చదివి మర్చిపోలేము అవి మనలో నిప్పును రాజేస్తూనే ఉంటాయి.           భూపాల రాగం కథ పేద, మధ్య, ధనిక వర్గ స్త్రీల వర్గవిభేదాలను, కష్టాలను చిత్రిస్తుంది. తాయిలం కథ పురుషుడి విజయం వెనుక ఉన్న స్త్రీ తనకు తానుగా ఏమి కోల్పోతుందో వివరిస్తుంది. గాంధారి రాగం, బదిరి, గణితం, పహరా, ముసుగు లాంటి కథలు పురుషుల ప్రతిభలో దాగి బైటకు రాని స్త్రీల అనుభవాలను చెప్తాయి. సూపర్ సిండ్రోమ్, తిమింగల స్వర్గం, మంత్రనగరి వంటి కథలు అమెరికా సామ్రాజ్య భావాలను ఎండగడతాయి.             సత్యవతి ఆరు నవలలు కూడా రాసింది. ఇవి కూడా ప్రధానంగా స్త్రీ వాదానికి చెందినవే. ఇవి 1973-1988ల మధ్య కాలంలో రాసింది. పద్మవ్యూహం నవలలోని సరస్వతి పాత్ర ఆర్థిక, కుటంబ పరిస్థితులు అనుకూలించక ప్రేమ రాహిత్యంతో బాధపడే స్త్రీ ఎటువంటి ప్రలోభాలకు లోనవుతుందో వివరిస్తుంది. పడుచుదనం రైలుబండి నవలలోని నాగమణి పాత్ర కూడా ఇలాంటిదే. గొడుగు, ఆ తప్పునీది కాదు నవలలు కూడా పూర్తిగా స్త్రీ చైతన్యానికి సంబంధించినవే. అన్నపూర్ణ నవవలో స్త్రీలు ఆత్మగౌరవంగా అభివృద్ధి చెందుతున్నా, సమాజంలో ఉన్న విలువలతో సమన్వయం సాధించలేక తత్తరపాటు పడటాన్ని చెప్తుంది.         సత్యవతి రాగం భూపాలం పేరిట భూమిక పత్రికలో స్త్రీల సమస్యలను వివరిస్తూ కాలం రాసింది. ఆహ్వానం పత్రికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీవాద సాహిత్యాన్ని పరిచయం చేసింది. దీని ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న స్త్రీల జీవితాలు ఆయా సాహిత్యాలలో ఎలా ప్రతిబింబించాయో తెలుగు పాఠకులకు తెలిసింది. వీరు వ్యాసరచన కూడా చేశారు. ఇవన్నీ స్త్రీ కోణం నుంచే సాగుతాయి. ఇవి సమాజంలో, కుటుంబంలో... ప్రతిచోటా స్త్రీ జీవితంలోని నియంత్రణ, హింసను బయటపెడతాయి. ఉదాహరణకు యాసిడ్ ప్ర్పూఫ్ ఫేస్ మార్క్ వ్యాసంలో సౌందర్య సాధనాలు సహజ అందాలను ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. అంతేకాదు సత్యవతి కొడవటిగంటి కుటుంబరావు, కేశవరెడ్డి... మొదలైన వాళ్ల రచనలపై వ్యాసాలు కూడా రాశారు. అనువాదకురాలిగా కూడా సత్యవతికి మంచి పేరు ఉంది. ఈమె చేసిన అనువాదాలలో సిమోన్ ది బోవా రాసిన సెకండ్ సెక్స్ ముఖ్యమైనది. జ్ఞాన దాతకే జ్ఞానదాత అనే వ్యాసంలో బౌద్ధమతం కూడా స్త్రీలను దూరంగా ఉంచిందన్న విషయాన్ని తెలియజేసింది.               సత్యవతి రచనలు పరిశీలిస్తే మూడు రకాలుగా మనుకు అర్థం అవుతాయి. 1. పితృస్వామ్య సమజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు. 2. నేటి సమాజంలో స్త్రీలు తమకు తాముగా కల్పించుకుంటున్న సమస్యలు. 3. నేటి సమాజం స్త్రీలపై బలవంతంగా రుద్దుతున్న అవమానాలు, పీడనలు.              వీరు అనేక బహుమతులు అందుకున్నారు. పురస్కారాలు పొందారు. ముఖ్యంగా 1997లో చాసో స్ఫూర్తి అవార్డు, 2002లో రంగవల్లి విశిష్ట వ్యక్తి పురస్కారం, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం వారి బహుమతి వీరికి లభించాయి. 2008లో యుగళ్ల ఫౌండేషన్ వారి అవార్డు, 12012లో సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, అదే ఏడాది మల్లెమాల, గుంటూరు వారి గురజాడ పురస్కారాలు వీరు అందుకున్నారు.              ఇన్ని రచనలు చేసి ప్రపంచంలోని స్త్రీలను, వారి జీవన వైవిధ్యాన్ని అధ్యయనం చేసి రచనల ద్వారా మనకు పంచింది పి. సత్యవతి. తెలుగులో స్త్రీ వాద ఉద్యమం ఇంకా బాల్యదశలోనే ఉందని, అదీ నగరాల్లో మాత్రమేనని సత్యవతి భావన. కానీ నేడు స్త్రీ బావజాలం గురించి కొంతైనా తెలుసుకోవాలంటే వీరి రచనలను తప్పక చదవాల్సిందే...    

కేతు విశ్వనాథరెడ్డి

  కేతు విశ్వనాథరెడ్డి                                                       డా. ఎ.రవీంద్రబాబు                   ఆయన విద్యావేత్త, సాహితీవేత్త, అపారమైన బోధనానుభవం కలిగిన అధ్యాపకులు. కథా రచనలో, విమర్శలో, సంపాదకత్వంలో పేరొందిన అనుభవశాలి. రాయలసీమ కథను మున్ముందుకు తీసుకెళ్లడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న రచయతే డా. కేతు విశ్వనాథరెడ్డి. రాయల సీమభాషను, అక్కడి ఇతివృత్తాన్ని, అక్కడి ప్రజల జీవన శైలుల్ని తన కథలతో మనకు అందించిన ప్రతిభావంతులు. ఎంతో మంది అనుంగు శిష్యగణాల ఆప్యాయతలను పొందిన స్నేహ స్వభావి.                 ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి జులై 10, కడపజిల్లా కమలాపురం దగ్గరున్న రంగశాయిపురంలో జన్మించారు. అనేక కష్టాల కోర్చి విద్యాభ్యాసాన్ని సాగించారు. తండ్రి డాక్టరు చేయాలని తపనడినా కడపజిల్లా గ్రామనామాల మీద పరిశోధన చేసి డాక్టరేటును పొందారు. వీరు ఎస్.ఎస్.ఎల్.సి చదివే సమయంలో పద్యాలు రాసినా,  ఇంటర్మీడియట్ లో వచన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. తొలి కథ అనాదివాళ్లు కథ 1963లో సవ్యసాచి పత్రికలో ప్రచురితమైంది. కొంతకాలం విశ్వనాథరెడ్డి పాత్రికేయునిగా కూడా పనిచేశారు. తర్వాత అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. డాక్టర్ బి.ఆర్. అబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అయినా రచనలు చేయడం మాత్రం కొనసాగిస్తూ తన సాహిత్యాభిలాషను మాత్రం కొనసాగిస్తున్నారు.   వీరి కథాసంపుటాలు జప్తు (1974), కేతు విశ్వనాథరెడ్డి కథలు (1991), ఇచ్ఛాగ్ని (1997), కేతువిశ్వనాథరెడ్డి కథలు 1998-2003 (2004) మొదలైనవి... వీరి నవలలు వేర్లు, బోధి మొదలైనవి...          వేర్లు మొదటి సారిగా రిజర్వేషన్లలోని క్రీమీలేయర్ మీద వెలువడిన నవల. విశ్వనాథరెడ్డి కథలు హిందీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, బెంగాళీ, మరాఠీ, రష్యన్ భాషల్లోకి అనువాదాలయ్యాయి. రాయలసీమ సామాజిక మూలాల్ని, సాంస్కతిక లక్షణాలను తన కథల్లో అత్యంత ప్రతిబావంతంగా చిత్రించారు. సీమలోని ముఠాకక్షలను, హింసా రాజకీయాలను, ఫ్యాక్షనిజం సృష్టిస్తున్న సంక్షోభాన్ని రెండు దశాబ్దాల కిందటే రచనల ద్వారా వివరించారు. ఫ్యాక్షన్ కు మూలకారణాలను ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల నుంచి ఆలోచించాలని గమనించిన కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి. వీరి  పీర్లచావిడి, దాపుడుకోక, నమ్ముకున్న నేల, కూలిన బురుజు, జప్తు వంటివి గొప్ప రచనలు. వానకురిస్తే కథ రాయలసీమలోని నీటి సమస్యను వివరిస్తుంది. గడ్డి కథ రైతుకు, భూమికి ఉన్న సంబంధాన్ని చిత్రించింది. కూలిన బురుజు కథ ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగింది. విశ్వనాథరెడ్డి కథల్లో పల్లె వాతావరణం ప్రతిబింబిస్తుంది. వాటికి అమ్మ సహకారం, ప్రోత్సాహం లబించిందని అంటారు. యాసలు ఎన్ని ఉన్నా తెలుగు భాష ఒక్కటే ముఖ్యం అని, ఆ విశాల దృష్టితోనే రచనలు చేస్తున్నారు.            వీరి అమ్మావారి చిరునవ్వు కథ ఎక్కువ విమర్శలకు, చర్చలకు, విశ్లేణలకు, వివాదాలకు గురైంది. విశ్వనాథరెడ్డి కథా శైలి నిరలంకారంగా, నిరాడంబరంగా, విపరీతమైన వర్ణనలు, అనవసరమైన నాటకీయత లేకుండా సాగుతుంది. అయినా మనిషిని ఆలోచింపజేస్తుంది. అందుకే వీరి కథల గురించి కాలీపట్నం రామారావు  ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాదు, పుట్టు కథలు రాసేవారనిపిస్తుంది అన్నారు. సింగమనేని నారాయణ వీరి కథల్లో కథుండదు. కథనం వుంటుంది. ఆవేశం వుండదు. ఆలోచన వుంటుంది. అలంకారాలు వుండవు. అనుభూతి వుంటుంది. కృత్రిమత్వం వుండదు. క్లుప్తత వుంటుంది అన్నారు.          కేతు విశ్వనాథరెడ్డి కేవలం కథలు, నవలలు మాత్రమే కాకుండా వ్యాసాలు, సంపాదకీయీలు, ముందుమాటలు కూడా రాశారు. అవన్నీ సంగమం ( వ్యాసాలు, ప్రసంగాలు), పాత్రికేయం (సంపాదకీయాలు), పరిచయం (ముందుమాటలు, సమీక్షలు) పేరిట వివిధ పుస్తకాలుగా వచ్చాయి. ఆధునిక కథా రచయితల్లో ముఖ్యుల గురించి దీపధారులు అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మనభూమి పత్రికకు సంపాదకులుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఈ భూమి పత్రికకు సంపాదకునిగా ఉన్నారు.             కేతువిశ్వనాథరెడ్డి ఎన్నో కరికులం కమిటీలలో ప్రధాన పాత్ర పోషించారు. పాఠ్యపుస్తకాలో ఆధునికత ఉండేందుకు కృషి చేశారు. పాఠ్యపుస్తకాల గురించి, అందులోని విషయాల గురించి వీరికి కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మంచి వచనం రాయడమనేది ఎప్పుడూ అవసరం. అది సైన్సు విద్యార్థి కావచ్చు, కామర్సు విద్యార్థి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. మేము తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యంగా స్త్రీలను అగౌరవ పరిచే పాఠాలు, దళితులను కించపరిచే పాఠాలు ఉండకూడదని నిబంధన విధించాము. పాఠాల మూలంగా విద్యార్థుల్లో మార్పు రావాలని, కొన్ని నిబంధనలు ఉండకూడదని నిర్దాక్షిణ్యంగా ఖండించాము అని చెప్తారు. అంతేకాదు వీరు జ్ఞానపీఠ్ అవార్డు ఎంపికల కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు. అనువాదాలు వస్తేనే తెలుగు రచనల గురించి ఇతర భాషీయులకు తెలుస్తుంది అంటారు.         విశాలాంధ్ర తెలుగు కథ 1910 - 2000 సంకలనానికి సంపాదక బాధ్యతలు వహించారు. అంతేకాదు కొడవటిగంటి కుటుంబరావు రచనలను 14 సంపుటాలుగా సమీకరించి సంపాదక బాధ్యతలు నిర్వహించారు. చలం, బుచ్చిబాబు, గురజాడ, రావిశాస్త్రి, కుటుంబరావు రచనలను ప్రేమిస్తారు. వీరు ఎన్నో ప్రశంసలు, సత్కారాలు అందుకున్నారు. 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు, 1996లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇంకా వీరికి కలకత్తా వారి భారతీయ భాషా పరిషత్తుల పురస్కారం, రావిశాస్త్రి అవార్డు, రితంబరీ అవార్డు, విశ్వవిద్యాలయం అధ్యాపకులుగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక పురస్కారం లభించాయి. 2009లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారి జీవిత కాలం పురస్కారం అందుకున్నారు.       కథా సాహిత్యంలో కేతు విశ్వనాథరెడ్డి నేటితరం రచయితలకు సూచనలు ఇస్తూ రచయితలకు వినయం, నిగ్రహం అవసరం అంటారు. జీవితాన్ని, సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి రచనలు చేయాలని సూచిస్తారు.