హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే....

  హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.... హాయ్...సారీ ఇవాళ లేట్ అయ్యింది..అందరికి హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే ....నాకైతే రోజు ఫ్రెండ్ షిప్ డేనే....ఇంకా స్పెషల్ గా ఎం చేస్కుంటాం చెప్పండి..ఇవాళ ౯ కి లేచాను...ఫ్రెండ్ కాల్ తో..ఫ్రెండ్ అంటే నేను వాడ్ని బావ అంటాను,త్వరగా బ్రష్ చేసుకొని..వెళ్లి వాడ్ని కలిసి..అలా హెయిర్ కట్ కి వెళ్ళాం....అలా హెయిర్ కట్ కి కూర్చోగానే అనుకోకుండా ఒక వాయిస్ వినపడింది..ఎక్కడో విన్న వాయిస్ లా ఉందే అని అలా అద్దంలో చూసాను..నా వెనక..ఒకతను కాల్ లో మాట్లాడుతున్నాడు..ఎక్కడో విన్న వాయిస్ పేస్ కూడా చూసినట్టుంది..అనుకుంటూ ఆలోచిస్తున్న....హా అప్పుడు గుర్తోచింది..అతను సినీ యాక్టర్ నరేష్ అని..(అల్లరి నరేష్ కాదండి...చిత్రం భళారే విచిత్రం నరేష్)..అలా నా చిన్నపాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయా ..చిత్రం భళారే విచిత్రం సినిమాకి నా ఫ్రెండ్ ఫ్యామిలీ తో వెళ్లాను ...హాల్ ఫుల్ రష్..extra చైర్లు వేసారు..నేను పెద్దగ సినిమాలకి వెల్లెవాడ్ని కాదులెండి...ఇప్పటికి తెలుగు సినిమాలంటే చూడటానికి చాల ఓపిక కావాలని వెళ్ళను..మనకంత ఓపిక లేదులెండి.         ఆ మరుసటి రోజునుండి స్టార్ట్ ఇయ్యింది స్కూల్ లో ఒక కొత్త ట్రెండ్...ఎవడినన్న తిట్టాలి అంటే "నీ ఎంకమ్మ నీ పచడి మొహానికి తాలింపు పెట్ట"...ఇలా మేము ఫ్రెండ్స్ మీ అంకుని బాగా నవ్వుకునేవాలము. ఈ ట్రెండ్ ఎలా ఉండేదంటే ఆకరికి అప్పుడప్పుడే మాటలు వస్తున్నా మా చిన్న అత్త కొడుకు..అదే డైలాగు వాడే వాడు..హిహిహి బలే నవ్వుకునే వాలము వాడి మాటలు విని..          చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో భలే అల్లరి చేసేవాడ్ని..ఒకడు ఉండేవాడు బాలాజీ అని నా ఫ్రెండ్..వాడు నాకో తోక లాగానే...నేను ఏదో డబ్బా కొట్టేవాడ్ని దానికి వాడు సపోర్ట్...ఏదన్న చెప్పి కదరా బాలాజీ అంటే వాడు అవును అవును అంటాడు..చిన్నప్పుడు వచ్చే సిరియల్స్ మోగ్లి,మహాభారతం,జేయేంట్ రోబోట్ ఇలా....బాగా డబ్బా కొట్టుకునేవాలము ఫ్రెండ్స్ దగ్గర.మోగ్లి ఎఫెక్ట్ బాగా ఉండేది..అది చూసి నేను ఫ్రెండ్స్ కి చెప్పేవాడ్ని..అటు కొండలుంటాయి..దాని పక్కనే అడవి అందులో జంతువులన్నీ నా ఫ్రెండ్స్ ..అలా...అప్పుడు బాలాజీ వైపు చూసి కదరా బాలాజీ అంటే..వాడు అవును అనే వాడు...అంత బాగా ఫ్రెండ్స్ మేము..ఇప్పుడు ఇక్కడ లేదులెండి (వాళ అమ్మగారు చనిపోయాక..వల అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ఇయర్ కి ఒకసారి కలుస్తుంటాడు)...స్కూల్ లో కూడా బాగా అల్లరి చేసేవాలము..నా పక్కన చందు అని ఉండేవాడు...వాడు ఎప్పుడూ ఒకే టైపు లో దొరికేవాడు నాకు..ఎప్పుడూ బట్టి బట్టి బట్టి...వాడు మా స్కూల్ కి వచ్చిన కొత్తలలో పరిచయం అయ్యి నా పక్కనే కూర్చునేవాడు వాడు టీచర్ అడిగిన questionకి లేచినప్పుడల్లా...వాడి కింద పెన్సిల్ పెట్టేవాడని..అర్ధం చేస్కొండి ఆ తర్వాత ఏమయ్యేదో....       రాత్రి బాగా లేట్ అయ్యింది నా ఆఫీసు లో...సో కొంచం సేపు రెస్ట్ తీస్కుంటాను..మల్లి వస్తాను...మిగతా పార్ట్ మళ్లి వచినప్పుడు చెప్పుకుందాము..ఓకే నా ...కలుద్దాం....టాటా Courtesy... kittutalkz.blogspot.in

సృజనప్రియ మాసపత్రిక కవితల పోటీ ఫలితాలు

సృజనప్రియ మాసపత్రిక కవితల పోటీ  ఫలితాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రచురింపబడుతూ బహుళ పాఠకాదరణ పొందుతున్న సృజనప్రియ మాస పత్రిక రజతోత్సవ సందర్భంగా నిర్వహించిన కవితల పోటీకి శతాధికంగా కవితలు పంపి పోటీని ఫలప్రదం చేసిన కవులకు, కవయిత్రులకు ధన్యవాదాలు. మాకు అందిన కవితలను మా ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులు అనేక వడపోతల తరువాత న్యాయ నిర్ణేతలకు పంపడమైనది. మా అభ్యర్ధనను మన్నించి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు, డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు, ఎం. నారాయణ శర్మగారలు ఇచ్చిన ఫలితాలు ఎడిటోరియల్  బోర్డ్ యధాతధంగా ఆమోదించింది. వారు ఇచ్చిన ఫలితాలను క్రోడీకరించి, వారి నిర్ణయం మేరకు ఈ క్రింద తెలియజేసిన కవితలకు బహుమతులు ప్రకటించడమైనది. మొదటి బహుమతి: రూ.3000/- 'చీకటి ముఖం'-శ్రీ సాంబమూర్తి లండ, ఒంకులూరు రెండవ బహుమతి: రూ.2000/- 'వలస దుఃఖం'- శ్రీ కలమట దాసుబాబు, శ్రీకాకుళం మూడవ బహుమతి: రూ.1000/- 'ఉల్లిపువ్వు-ఊరునవ్వు' -శ్రీ వేముగంటి మురళి,హైదరాబాద్ ప్రత్యేక బహుమతులు: (5) ఒక్కొక్కటి రూ.500/- : 'నువ్వు లేవు'-శ్రీ చొక్కాపు లక్ష్ము నాయుడు, విజయనగరం,'యుద్ధం ఇంకా ఒడువలేదు'- శ్రీ రవీంద్రసూరి నామాల, హైదరాబాద్, 'శేష వస్త్రం'- శ్రీ దేశరాజు, హైదరాబాద్, 'జన్మించడమే కవిత్వం'- శ్రీమతి శైలజామిత్ర, హైదరాబాద్, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితలు 'నా బట్టమేక బతికి బట్టకట్టాల్సిందే'- టి. హెచ్. నటరాజారావు, 'అన్నీ తెలిసినట్టే ఉంటాయి:- చొక్కర తాతా రావు, 'తుషార యవనిక'- టి.హెచ్.నటరాజారావు, 'దేవుడా'..మల్లాప్రగడ రామారావు, 'చేతులు కావాలి'- పల్లిపట్టు నాగరాజు 'చివరి పేజీ'-డా.మల్లిపూడి రవిచంద్ర 'ఓ కొత్తదేవుడి కథ'- శ్రీనివాస వాసుదేవ్ 'వేదికొకటి కావాలి'- ఆవాల శారద 'సమయమిదే:- శ్రీమతి కళా గోపాల్ 'అడవి కాలిపోయింది'- యాములపల్లి నరసిరెడ్డి, 'మారణహోమం'- శాంతి,  'ప్రయివేటు టీచర్'- రాజేశ్వర రావు లేదాళ్ల, 'ధన్యమైన తనువులు'- వైరాగ్యం ప్రభాకర్, 'రేపటికోసం'- వడ్డాది రవికాంత్ శర్మ, 'పేగుబంధం'- ఆయాచితం ప్రమీల, 'వలస జీవులం'- స్వాతి శ్రీపాద, 'తుది మెరుగులు'- పి.చంద్ర శేఖర ఆజాద్ 'తలలొంచరు' - అవ్వారు శ్రీధర్ బాబు 'ఘోష'- సి.ఎస్. రాంబాబు త్వరలో హైదరాబాద్ లో జరగబోయే రజతోత్సవ వేడుకలలో బహుమతులు గెలుచుకున్న కవులకు/కవయిత్రులకు నగదు బహుమతితో పాటు ప్రముఖుల సమక్షంలో కవి సత్కారం ఉంటుంది. వేడుకల తేదీ,సమయం,వేదిక మొదలైన వివరాలు కవులకు వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వబడును.ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి కవితలను అనేక పర్యాయాలు చదివి తమ నిర్ణయం తెలియజేసిన న్యాయ నిర్ణేతలకు, తమ కవితలను పంపి కవిత్వ పోటీలను జయప్రదం చేసిన కవులకు కృతజ్ఞతలు. శుభాకాంక్షలు. ఎంతో శ్రమకోర్చి ఈ పోటీలను తన స్వంత బాధ్యతగా స్వీకరించి చాలా సమర్ధవంతంగా నిర్వహించి మా సంస్థకు మంచి పేరు తెస్తున్న సృజననేడు దినపత్రిక సాహిత్య పేజీ నిర్వాహకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలు. నీలం దయానందరాజు సంపాదకులు, సృజనప్రియ మాస పత్రిక, సృజననేడు దినపత్రిక

భారతవర్ష.. పూలబాల విరచిత అద్భుత రచన..

బహుభాషాకోవిదుడు పూలబాల రచించిన 1265 పేజీల భారతవర్ష 21 వ శతాబ్దపు అతిపెద్ద తెలుగు ప్రబంధ కావ్యం.  యూజిసి జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొని ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో ప్రసంగించిన పూలబాల  ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్రెంచ్ లో నవల రచించిన తొలి తెలుగు రచయిత.   ప్రపంచ సాహిత్యంలో భారతవర్ష వైశిష్టత: ప్రపంచ సాహిత్య చరిత్రలో  వేయి పేజీలు దాటిన గ్రంధాల రచనకు కనీసం 10 సంవత్సరాల సమయం  తీసుకున్నారు.  గాన్ విత్ ద విండ్ 10 సంవత్సరాలు, జురాసిక్ పార్క్ 10 సంవత్సరాలు,  లె మిజరబుల్స్ 12 సంవత్సరాలు కాగా  1265 పేజీల భారతవర్ష  రచనా  సమయం 8 నెలలు.  ఆ రచయితలంతా వాడుక భాష లో రాసారు . కానీ భారతవర్ష  రచయిత పూలబాల  ప్రాచీన భాష లో (గ్రాంధికం లో)  చందోబద్ద పద్యాలతో కావ్య రచన చేశారు. తెలుగు భాషకు బంగారు పల్లకి:  భారతవర్ష ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  ప్రేమ, శృంగారాలను   పాండిత్యం తో రంగరించి  సాహిత్య సరదాలు అద్ది, ఆధ్యాత్మిక, వైద్య, వైమానిక, సాంకేతిక రంగాల్లో అబ్బురపరుచు అరుదైన   విషయజ్ఞానాన్ని హృద్యమైన భాష తో మేళవించిన బహు విషయ జ్ఞాన భండారం భారతవర్ష.   పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని  సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి  తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధకావ్యం భారతవర్ష.   స్నేహధర్మానికి, ప్రేమబంధాలకి పెద్ద పీటవేసి మానవసంబంధాలకు బ్రహ్మ రథం పడుతుంది ఈ  ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  భారతవర్ష ఇతివృత్తము: గ్రాంధిక తెలుగున రచించిబడిన ఈ ఆధునిక శృంగార ప్రబంధ కావ్యమందు ప్రౌఢమైన, హృద్యమైన గద్యముతో పాటు తరళ, శార్దూల, మత్తేభ ఉత్పలమాల, చంపకమాల పద్యాలు చదువరులను అలరించు విధముగా ఉంటాయి. మంచిభాషమంచిజీవితానికినాంది. మంచిసాహిత్యం మంచి సమాజానికి నాంది. భారతవర్ష ఇతివృత్తము భారతీయసంస్కృతికి పెద్దపీట వేసి క్రోధము, కామము క్షణికావేశములు. ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనము, అటువంటి ధర్మమునకు మూలము సంస్కృతి అని , ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజేస్తుంది. అన్నిరకముల  భాషాభూషణాలు  శబ్ద అర్థాలంకారాలు  గల భారతవర్షలో  వేయికి పైగా ఉపమానాలు వాడబడ్డాయి. సర్వాలంకార భూషిత కావ్య కన్య భారతవర్ష త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.   

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవం-సాదర ఆహ్వానం

గౌ. భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవం - మీకు మా సాదర ఆహ్వానం (అక్టోబర్ 24, 2021, ఆదివారం సాయంత్రం 6:00pm) …అంతర్జాలం లో.... మిత్రులారా, తెలుగు భాషా సాహిత్యాలకి మాత్రమే పెద్ద పీట వేస్తూ 1994 లో అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్ష లేని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ అమెరికా దేశంలో తెలుగు తెలుగు పుస్తక ప్రచురణలు 1995 లో మొదలుపెట్టింది. అప్పుడు ప్రచురించిన మా మొదటి గ్రంధం “అమెరికా తెలుగు కథానిక -మొదటి సంకలనం”. అప్పటి నుంచీ క్రమబద్ధంగా సాగుతున్న మా తెలుగు పుస్తక ప్రచురణల ప్రస్థానం లో ఇప్పుడు మా 100వ ప్రచురణ “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” (Proceedings of the 7th World Telugu Literary Symposium) విడుదలకి సిధ్ధంగా ఉంది. గత 27 సంవత్సరాలగా ప్రపంచవ్యాప్తంగా వందలాది తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడమే కాక భారత దేశం ఎల్లలు దాటి, విదేశాలలో అత్యధిక సంఖ్యలో తెలుగు సాహిత్య ప్రచురణలు చేసిన వంగూరి ఫౌండేషన్ వారి నిరంతర సాహిత్య కృషిని గుర్తిస్తూ, ఈ 100వ ప్రచురణని  ఒక మైలు రాయిగా భావించి గౌ. భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ గ్రంధాన్ని ఆవిష్కరించడానికి ఉత్సాహంగా అంగీకరించారు. ఈ  100వ గ్రంధావిష్కరణ మహోత్సవం అంతర్జాలంలో ఈ వారాంతం..అనగా ఆదివారం (అక్టోబర్ 24, 2021) భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 pm కి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించి, ఆనందించి, స్పందించమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరు వీక్షించే You Tube & Face Book links ఈ క్రింద ఇచ్చాం. 100వ గ్రంధావిష్కరణ మహోత్సవం October 24, 2021 6:00 PM (India Time) Singapore: 8:30 pm; Melborurne, Australia: 11:30 pm; London, UK: 1:30 pm; Houston, TX, USA: 7:30 AM CST You Tube Links https://youtube.com/channel/UCX9tl92zikUSpHp0MuNTiLQ https://youtube.com/c/SriSamskruthikaKalasaradhi https://youtube.com/channel/UCT3B1RMkhHjAjfpTJxDJY9w Face Book Live Links https://m.facebook.com/వంగూరి-ఫౌండేషన్-ఆఫ్-అమెరికా-100332915167722/ https://www.facebook.com/SriSamskrutikaKalasaradhi/ https://www.facebook.com/Telugumalli/     అంతే కాదు....ఆ తర్వాత మరో రెండు గంటలు.... వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100 వ ప్రచురణగా ఇది ఒక ఎత్తు అయితే..ఈ గ్రంధం సరిగ్గా ఏడాది క్రితం ..అక్టోబర్ 10-11, 2020 తేదీలలో జరిగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” (Proceedings of the 7th World Telugu Literary Symposium”)  కావడం మరొక ఎత్తు. అంతర్జాలంలో జరిగిన ఆనాటి 7వ ప్రపంచ సాహితీ సదస్సు మా సంస్థ, శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్). తెలుగు మల్లి (మెల్ బర్న్, ఆస్త్ఱేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య (యునైటెడ్ కి౦గ్డమ్), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్) మొదలైన సంస్థల సహకారంతో, సుమారు 250 మంది సాహితీ వేత్తలు 36 గంటలు నిర్విరామంగా వినిపించిన తమ సాహీత్య ప్రసంగాలని అన్నింటినీ ఈ సభా విశేష సంచికలో సుమారు 520 పేజీలలొ ఎంతో ఆకర్షణీయంగా పౌందు పరచ బడిన ఈ అపురూపమైన గ్రంధం. అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా గత ఏడాది జరిగిన 7వ ప్రపంచ సాహితీ సదస్సులో పాల్గొన్న వక్తలు, వేదిక నిర్వాహకులూ, సాంకేతిక నిపుణులూ అందరూ మళ్ళీ ఈ అంతర్జాల వేదిక మీద కలుసుకుని ఆ నాటి తమ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. మా బృందం అందరి తరఫునా ఈ సరదా సమావేశాన్ని వీక్షించమని ఆహ్వానిస్తున్నాం. ఈ ఆత్మీయ సమావేశం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 24, 2021, సాయంత్రం 6:30 – 8:30 దాకా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా పై లింక్స్ వర్తిస్తాయి.   జతపరిచిన మా సాదర ఆహ్వానాన్ని మన్నించి, భారత ఉపరాష్ట్రపతి మాన్యులు శ్ర్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతున్న మా 100వ పుస్తక ఆవిష్కరణ మహోత్సవాన్నీ, తర్వాత జరిగే 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆత్మీయ సమావేశాన్నీ తప్పకుఁడా చూసి ఆనందిస్తారు కదూ!                                                             భవదీయుడు.                                                             వంగూరి చిట్టెన్ రాజు, Houston, TX.                                                             వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్)                                                             E-mail: vangurifoundation@gmail.com                                                             Phone (USA): 832 594 9054  

ఆమె అక్షర వనమాలి

  ఆమె అక్షర వనమాలి రచన అంటే ఏమిటి? రచయితలు ఎవరు? ఫలానా వారే రాయాలి అని నియమం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలు కొంతమంది యువ రచయితల మనసుల్ని తొలిచేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పటివరకూ ఉపాధ్యాయ, పాత్రికేయ రంగాలలో పనిచేసేవారే ఎక్కువగా రచనలు చేస్తున్నారు. అందువలన రచన అంటే ప్రత్యేకించి ఆ రంగాల వారికే పరిమితం అనే భావన తీసుకొచ్చారు. దీనివలన సహజంగా రచనా పటిమ ఉండి తెర వెనుక మిగిలిపోయిన ఇతర రంగాలలో పని చేసే కవితా సూర్యులు, కథా యోధులు, నవలా నాయకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి కొత్త రచయితలకు మార్గనిర్దేశం చేసి సాహితీ ప్రపంచానికి పరిచయం చేయాలనే గొప్ప ఆలోచన చేశారు అనూ రేవళ్ళ. కిరణ్ విభావరిగా అందరికీ పరిచయస్తురాలు. ఆమె మనో సంకల్పం నుండి పుట్టిందే అంతర్జాల వేదిక " తపన రచయితల కర్మాగారం" ఫేస్బుక్ గ్రూప్. మిత్రులు రవీంద్ర రావెళ్ళ, శ్రావణి గుమ్మరాజు గారితో కలిసి మొదలు పెట్టిన ఏడాది కాలంలోనే తపన గ్రూప్ సభ్యుల సంఖ్య ఆరు వేలమందికి చేరింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రస్తుతం అనిల సందీప్ మరియు నిష్కల సతివాడ గారితో కిరణ్ విభావరి గారు ఈ గ్రూపుకు సారథ్యం వహిస్తున్నారు.  ఈమధ్య కాలంలో రచన పట్ల ఎక్కువమంది ఔత్సాహికులు ఆశక్తి చూపిస్తున్నారు. తద్వారా పుస్తకాలు చదివే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది శుభపరిణామం. అయితే వారికి సరైన దిశా నిర్దేశం చేయడానికి ఖచ్చితమైన అంతర్జాల వేదిక ఏదీ లేదు. కానీ ప్రస్తుతము అలాంటి కొత్త రచయితలకు తపన వేదిక  ఒక గురుకుల పాఠశాలలా పని చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు.  * కిరణ్ విభావరి  కిరణ్ విభావరి తపన గ్రూప్ ప్రారంభించక ముందు సాహిత్యం పై ఆశక్తి ఉండి రాయాలనే తపన ఉన్న ఒక విద్యార్థిని. రాయాలి అనే తృష్ణ ఆమెను కుదురుగా ఉండనీయలేదు. అలా అని తొందరపడి అర్థంలేని రచనలకు పోలేదు. ముందుగా  తెలుగు సాహిత్యాన్ని, పెద్దవాళ్ల రచనల్ని బాగా విస్తృతంగా అధ్యయనం చేశారు. వందలాది పుస్తకాలు, కథలు చదివారు. తర్వాత రచనా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. గురుమంచి రాజేంద్ర శర్మ గారి కథ చదివి అందులోని విభావరి పాత్ర నచ్చి, తన పేరుకి చివర విభావరి అని చేర్చుకున్నారు.నిజానికి తన పేరు వినూత్నంగా వైవిధ్యంగా ఉండడానికి విభావరి అనే ఈ కలం పేరే దోహదం చేసిందని చెప్తుంటారు. కవిత్వం రాసింది తక్కువ. కానీ చాలా తక్కువ సమయంలోనే NATA, NATS, జాషువా పురస్కారాలను ఒకే కాలంలో అందుకున్నారు.మరెన్నో కథల పోటీలో విజేతగా నిలిచారు. తను రాసిన "కాఫీ పెట్టవు" కథకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె సున్నితమైన రచనా శైలికి చక్కని ఉదాహరణ "కాఫీ పెట్టవు" కథ. ఈ ప్రయాణంలో, ఎన్నో ఏళ్ల నుండి సాగుతున్న చాదస్తపు సమూహాలకు ఎడంగా జరిగి కొత్త రచయితలు, యువ కలాలు,గళాలతో తనకు పరిచయం జరిగింది. ఎంతో చక్కని రచనా సృజన ఉండి గుర్తింపు లేని ఎంతోమంది యువ రచయితలు ఉన్నారని గ్రహించారు. రాసిన కవితను, కథను లేదా ఇంకేదైన రచనల్ని ఎలా పాఠకులకు చేర్చాలి, పత్రికలకు ఎలా పంపాలి, పోటీల వివరాలు తెలీక చాలామంది తమ రచనల్ని అటకెక్కిస్తున్న వైనం చూశారు. అయితే ఈ సమస్యలన్నింటికి పరిస్కారంగా మనమే ఒక సొంత వేదిక ఏర్పాటు చేసుకుందాము అని తలచి స్నేహితుల సమాలోచనలోంచి తపన రచయితల కర్మాగారానికి శ్రీకారం చుట్టారు. అక్షరాల పూల తోటకు వనామాలిగా అవిశ్రాంత సాహిత్య సేవ చేస్తున్నారు. నూతన చేతన యువ కలాలకు మార్గదర్శి అయ్యారు.   *తపన రచయితల కర్మాగారం సేవలు  ఈ గ్రూపు మొదలుపెట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు దాదాపు 6 వేల మంది ఔత్సాహిక యువ రచయితలతో పాటు లబ్ద ప్రతిష్ట రచయితలూ ఉన్నారు. పిల్లల పెద్దల మేలుకలయికతో వారి అనుభవాలు సూచనలు సలహాలతో గ్రూపు నుండి ఎందరో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. సాహిత్యం గురించి తెలుసుకునే పరంలో తాను ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో  అది మరొకరు అనుభవించకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ గ్రూపును ఏర్పాటు చేయడం జరిగింది. అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గ్రూప్. ఎటువంటి సాహిత్యపరమైన సందేహం అడిగినా చిటికెలో సమాధానం దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? కొత్తగా రాయాలి అనుకున్నవారు, రాస్తున్నవారు ఎవరైనా సరే, సీనియర్ రచయితల భిన్న అనుభవాల నుండి ఎంతో కొంత తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చు. ఇబ్బడిముబ్బడిగా ఉన్న రచయితల్లో రచన సామర్థ్యం కొరతగా ఉంది. వారిలో  కొత్త కొత్త ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వడంలో కాస్త తడబడుతున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చే విధంగా ప్రతి వారం, కొన్ని కొత్త పాఠాల్ని చెబుతూ గ్రూప్ లో కొందరు మార్గదర్శకులు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పత్రికల ఇమెయిల్స్ ని , ప్రముఖ పోటీల వివరాలను గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతే కాకుండా గతంలో ఎలాంటి కథలకు నిర్వాహకులు ప్రాధాన్యత ఇచ్చారు అని కూడా వీలుని బట్టి చర్చిస్తారు. ఇంత యంత్రాంగాన్ని వెనుకుండి నడిపిస్తున్న కిరణ్ విభావరి ఎంతోమంది యువతకు ఆదర్శం.     ఆమె మాటల్లో...! "ఏ రచయిత కూడా మొదటిసారి కలాన్ని కదిలించగానే గొప్పసాహితీకారుల జాబితాలో చేరిపోలేదు. సాధన మాత్రమే  సవ్యసాచిలా నిలబెట్టగలదు. కానీ ఒక్క మాట సాహిత్యాన్ని చదువుతూ,రాస్తూ,విశ్లేషించుకుంటూ సాగాలని అనుకుంటున్న మేము తప్పక సాహిత్యంలో మంచి స్థాయికి వెళతామనే నమ్మకం ఉంది. అలాగే మేమొక్కరమే ఎదగాలనే అత్యాశ మాకు లేదు ఎందుకంటే ఎవరి మేధస్సు వారిది. పరులు దొంగిలించలేనిది మన మేధస్సును మాత్రమే అనే పెద్దలు చెప్పిన విషయం అందరికి ఎరుకే. మేము మొదలు పెడుతున్న ఈ తపన ద్వారా సాహిత్యంలో అభివృద్ధి చెంది మీరు గొప్పగా నిలిస్తే ఈ తపనను రూపకల్పన చేసినందుకు మాకు ఎంతో తృప్తి, అదే మాకు పదివేలు". "ఒంటరి ప్రయాణం కంటే అందరూ కలిసి వేసే అడుగు గొప్పలక్ష్యం వైపు సులభంగా చేరడానికి దోహద పడుతుంది.. అందుకే మేము మా ప్రయాణం మొదలు పెట్టాం,మాతో మిమ్మల్ని నడవమంటున్నాం. ఒకరి అనుభవాలు, సాహితీ సుమాలను పంచుకుంటూ మన తెలుగు సాహిత్యాన్ని  ప్రపంచస్థాయి లో నిలబెట్టడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ప్రపంచస్థాయి నా అని సందేహ పడకండి. If you think you can, you can." అంటారు ఆమె. ◆ వెంకటేష్ పువ్వాడ  

అసాధ్యుడు (పివి మొగ్గలు)

అసాధ్యుడు (పివి మొగ్గలు) జీవితంలో తొలి ఉద్యమప్రస్థానానికి శ్రీకారం చుట్టి వందేమాతర ఉద్యమంతో వేకువకిరణమై వెలిగిండు పివి పోరాటానికి పాదులువేసింది వందేమాతరోద్యమం  నిజాం నియంత పాలన విముక్తికోసం కంకణబద్ధుడై వారి ఆకృత్యాలపై అలుపెరుగని పోరాటం చేసిండు ఉవ్వెత్తున ఎగిసిపడిన విప్లవ ఉద్యమ కెరటం పివి అతిపెద్ద భూస్వామ్యకుటుంబంలో తాను పుట్టినప్పటికీ పేదల బతుకులను మార్చాలని తపనపడ్డ ఉద్యమశీలి పేదలకు భూములను పంచిపెట్టిన ఉదారస్వభావి పివి స్వామి రామానంద తీర్థ అనునూయుడిగా అరుదెంచి సోషలిస్టు నాయకుడిగా అవతరించిన అభ్యుదయవాది గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమపథగామి పివి పూవు పుట్టగానే సహస్రదళాలతో పరిమళించినట్లుగా బాల్యంలోనే అసమాన పాండిత్యాన్ని ప్రదర్శించిన దిట్ట సామాజికతను ఒంటబట్టించుకున్న అపారదేశభక్తుడు పివి మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని సంకల్పించి తెలుగు అకాడమిని స్థాపించిన అసలైన భాషాభిమాని అధికారిక మాతృభాష విద్యావిధాయక రూపకర్త పివి నిరుపేదలవారికి విద్య అందించాలనే సదాశయంతో గురుకుల పాఠశాలలను నెలకొల్పిన విద్యాజ్యోతి విద్యారంగ వ్యవస్థలోనే పెనువిప్లవం గురుకులాలు ఒకపక్క విద్యార్జనలో నిమగ్నమై చదువుకుంటూనే మరోవైపు సమాజసేవనే దేశసేవగా తరించిన ప్రాజ్ఞుడు నాటి ఉద్యమదీప్తులే పివి రాజకీయబాటకు పునాదులు దేశంలోనే తొలిసారిగా ఇంటర్ విద్యను ప్రవేశపెట్టి పేదధనిక వర్గాలకు విద్యను పంచిన మహితాత్ముడు గుణాత్మకమైన ఇంటర్ విద్యకు పితామహుడు పివి సరళీకృత ఆర్థిక విధానాలకు అంకురార్పణ చేసి బలోపేతమైన వ్యవస్థాకృతికి పాదులు వేసినవాడు భారతదేశ ఆర్థిక ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత పివి హింసాత్మక సంఘటనలకు ఆలవాలమైన పంజాబులో సమయస్ఫూర్తితో ప్రశాంతత చేకూర్చిన రాజనీతిజ్ఞుడు దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పింది పివి దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలనే చెట్లను నాటి భవిష్యత్తుకు సరళీకరణ ఫలాలను అందించిన ఘనుడు భారతదేశ నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పివి సమున్నత సంపాదక ప్రతిభతో సంచికలను రూపొందించి విశేష సంచికలకు ప్రాణం పోసిన సంపాదక సంపన్నుడు అశేషమైన ప్రత్యేక సంచికల సంపాదక రూపశిల్పి పివి ఆర్థిక సంస్కరణల ముళ్ళబాటను పూలరథంలా మార్చి దేశాన్ని అభ్యుదయపథంలోకి నడిపించిన పురోగామి నాటి సంస్కరణల ఫలం నేటి కళ్ళముందున్న నవభారతం మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళ నాయకత్వంతో దేశానికి సుస్థిరపాలన అందించిన పరిపాలనాదక్షుడు అపార పరిజ్ఞానం గల దక్షిణభారత తొలిప్రధాని పివి రాజకీయజీవితంలో ఆటుపోట్లనెన్నింటినో ఎదుర్కొని తలపండిన మేధావిగా ప్రకాశించిన అసామాన్యుడు సమయస్ఫూర్తితో నెగ్గుకొచ్చిన సహనశీలి మన పివి తాను నమ్మిన సిద్ధాంతాలకు నిబద్ధ జీవుడవుతూనే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడిన పాలనాబద్ధుడు రాజకీయంలో ప్రజాస్వామ్యాన్ని వెలిగించినవాడు పివి రాజకీయాల్లో ఎన్నోసార్లు మౌనవ్రతం పాటిస్తూనే  ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నాడు నిర్ణయం తీసుకోకపోవడం ఒక నిర్ణయమన్నవాడు పివి అంతర్జాతీయ వ్యవహారాలలో నెహ్రూ బాటలో నడిచి భారతదేశ ఆర్థికపరిస్థితిని చక్కదిద్దిన ఆర్థికనిపుణుడు దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి పివి విద్యాశాఖను మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్చి విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చిన అభ్యుదయవాది విద్యాశాఖను బలోపేతం చేసిన సంస్కరణలశీలి పివి నిరంతర సంస్కరణ నిచ్చెనమెట్లతో తాను ఎదుగుతూ అందరికీ అభివృద్ధిఫలాలను అందించిన అభ్యుదయవాది సంస్కరణలకు చిరునామాగా నిలిచిన పథగామి పివి కలసిరాని కాలంలో సమస్యలతో నిత్యపోరాటం చేసి  దేశ విజయపతాకను ఎగురవేసిన అపరచాణక్యుడు ప్రజాస్వామ్య చరితకు అసలైన చిరునామా పివి పటిష్ట భూసంస్కరణ చట్టాలతో భూపంపకాలను చేపట్టి స్వయంగా తనభూములను ధారాదత్తం చేసిన విప్లవవాది భూ సమస్యలను పరిష్కరించిన అపరమేధావి పివి అత్యున్నతమైన దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ రాజకీయ దురంధరుడు తెలంగాణ ముద్దుబిడ్డగా చరిత్ర సృష్టించిన ఘనుడు పివి   విశ్వనాథ  సత్యనారాయణ "వేయిపడగలు" నవలను హిందీలోకి "సహస్రఫణ్" గా అనువదించిన పండితుడు అపురూపమైన అనుసృజనకు అసలైన భాష్యం పివి హిందీ నవలాసాహిత్యంలో అగ్రశ్రేణి రచనగా ఖ్యాతిపొంది యావత్భారతంలో సాహితీ అభిమానులను అలరించినది హిందీలో విజయకేతనం ఎగురవేసిన నవల "సహస్రఫణ్" బహుభాషా గ్రంథాలను సృజనాత్మకంగా అనువదించి  తెలుగు భాషానువాద నైపుణ్యానికి నిదర్శనమై నిలిచాడు మరాఠి భాషాప్రావీణ్యానికి నిదర్శనం పివి అబల జీవితం ఉన్నతమైన రాజకీయ పదవులలో ఒదిగి ఎదుగుతూనే పాలనాపరమైన చైతన్యాన్ని రగిలించిన కార్యాదక్షుడు అలంకరించిన పదవులకే వన్నెతెచ్చిన రాజనీతిజ్ఞుడు పివి సరళమైన శైలిలో తెలంగాణ పదబంధాలను వాడుతూ సందర్భోచిత సంభాషణలకు ప్రాణంపోసిన మరాఠి నవల పివి సాహిత్యంలోనే విశిష్టమైనది అబల జీవితం నవల హాస్య వ్యంగ్య అధిక్షేప రచనలను తన నవలల్లో చిత్రించి సమకాలీన రాజకీయ ఎత్తుగడలను తూర్పూరపట్టాడు రాజకీయ పరిణతతో నవలలు రాసిన సాహసి మన పివి అకుంఠితదీక్షతో బహుభాషలను పట్టుదలగా నేర్చుకుని భారతీయాత్మకు మారుపేరుగా నిలిచిన భాషాధురీణుడు బహుభాషావేత్తగా రాణించిన రాజకీయదురంధరుడు పివి సామాజిక సమస్యలపట్ల లోతైన అవగాహన కలిగి ఉండి అభివృద్ధికి కారకమైన సంస్కరణలను ప్రవేశపెట్టిన ధీశాలి నిత్యసంస్కరణలకు నాందిపలికిన మేధోసంపన్నుడు పివి ప్రపంచ ఆర్థిక వాణిజ్య సంబంధాలను పటిష్టపరచడంలో దేశాధినేతల మన్ననలను పొందిన ప్రజాయుత సంస్కర్త భారతదేశ ఆర్థికరంగాన్ని మలుపు తిప్పిన ఘనుడు పివి వివిధ దేశాల అధ్యక్షులు పివి ప్రతిభను కీర్తించడమే గాక గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రశంసలందుకున్న సమర్థుడు అంతర్జాతీయ యవనికపై దేశజండాను నిలిపినవాడు పివి నమ్ముకన్న సిద్ధాంతాలనే తాను ఆభరణాలుగా ధరించి ఆత్మవిశ్వాసంతో అడుగులువేసి విజయం సాధించిన దిట్ట రాజకీయతేజస్సుతో రాణించి విశ్వంలో వినుతికెక్కిన పివి   విదేశాంగమంత్రిగా గొప్ప దౌత్యసంబంధాలను నెలకొల్పి భారతదేశ అభివృద్ధికి రాచబాటలు వేసిన రాజనీతిజ్ఞుడు శత్రుదేశాలను మిత్రదేశాలుగా మలిచిన దౌత్యవేత్త పివి ప్రతికూల ప్రభావాలను అనుకూలంగా నిర్దేశించుకుని స్వపక్షీయులను సైతం అబ్బురపరిచిన అజేయుడు రాజకీయ రణరంగాన్ని ఏలిన విలక్షణ రాజనీతిజ్ఞుడు పివి స్వతంత్ర భారతదేశ పన్నెండవ ప్రధాని పదవిని అధిష్ఠించి భారతదేశ రూపురేఖలను మార్చేసిన ఆధునిక నిర్మాత ప్రధానమంత్రిగా రాణించిన అద్వితీయ ప్రజ్ఞావంతుడు పివి దేశంలో అణుబాంబు తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సాహసోపేతమైన చర్యలకు నాందిపలికిన సాహసవీరుడు పోఖ్రాన్ అణుపరీక్ష విజయానికి కారణమైన సాహసి పివి వాక్కులు రసగంగాప్రవాహంతో ఛలోక్తులతో శోభింపజేసి రసజ్ఞులను ఆనందపరవశులను చేసిన హాస్యచతురుడు ఆహుతులను ఆనందడోలికల్లో అలరించినచమత్కారిపివి కోట్లాదిమంది భారతీయుల జీవనగతులను మార్చివేసి వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేసిన అపరమేధావి మహోన్నత నేతగా మహిలో వెలిసిన మహితాత్ముడు పివి నాడు దూరదృష్టితో నాటిన విదేశాంగ విధానాల పాదులు నేటికీ అంతర్జాతీయ బంధాలను సుసంపన్నం చేస్తున్నాయి ఆధునికవాణిజ్యానికి తెరలేపిన నవీన మార్గదర్శకుడుపివి రాజకీయంలో ఎప్పుడూ మౌనభాషియై ఒప్పారుతూనే అనేకవిమర్శలకు మౌనంతోనే సమాధానమిచ్చిన ఘనుడు మౌనాన్ని అలంకారప్రాయంగా ధరించిన జ్ఞానశిఖరం పివి భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానంగా అనువదించి ఆంగ్లచట్టాలను తెలుగులోకి మార్చమన్న భాషాభిమాని తెలుగు భాషకు గండపెండేరం తొడిగిన ఠీవి మన పివి కలుషితమయిన రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసి ఐదు సంవత్సరాలు పరిపాలించిన నాటి మేటి ప్రధాని చాణక్యనీతితో నీతివంతమైన పాలన అందించింది పివి తనదైన రాజకీయ చాతుర్యంతో ఒక్కొక్కమెట్టు ఎక్కి అతిరథ మహారథులను అధిగమించిన అగ్రభూమిక అధిష్టించిన పదవులకు అలంకారప్రాయ ఆకారం పివి అగ్రరాజ్యాలతో సమానంగా అణుపరీక్షలకు నాందిపలికి భారతదేశ అణుశక్తిని ప్రపంచానికి చాటిన దార్శనికుడు ప్రపంచ దేశాలన్నింటికీ దేశ ఉనికిని చాటింది పివి ఘనత దేశప్రగతికి ఉజ్వలమైన పటిష్టమైన దారులను నిర్మించి దేశాభివృద్ధికి పట్టం కట్టిన రాజకీయ మేరునగధీరుడు అసాధారణమైన మహోన్నత దార్శనికుడు మన పివి మానవజాతి శ్రేయస్సుకై గాంధీజీ సిద్ధాంతాలను ఆరాధించి ఆయన అడుగుజాడలలో నడిచిన చైతన్య జీవధార గాంధీజీ స్ఫూర్తితో ప్రజాసేవకు అంకితమైనసేనాని పివి భారతదేశ అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి విదేశీ సంబంధాలను సుసంపన్నంగా పటిష్టం చేసినవాడు శత్రుదేశాలను సైతం మిత్రదేశాలుగా మలిచిన నేర్పరి పివి భూసంస్కరణల చట్టం చేసి శాసనసభలో ప్రవేశపెట్టి గాంధీజీ కలైన గ్రామస్వరాజ్యానికి అంకురార్పణ చేసిండు సురాజ్యం కోసం నడుంబిగించిన నవయుగ ధృవతార పివి తెలంగాణ సాయుధ పోరాటాన్ని సజీవంగా నిలుపుతూ "గొల్ల రామవ్వ" అనే అత్యద్భుతమైన కథను రచించిండు తెలంగాణ మాండలిక పదాలతో కథలు రాసినవాడు పివి విదేశాల్లో నలభైఏడు టన్నుల బంగారాన్ని కుదువబెట్టినా సంస్కరణల ఆయుధాలతో దేశానికి రప్పించిన మేధావి ఆర్థిక సరళీకరణ సంస్కరణల పితామహుడు మన పివి అనర్గళమైన అద్భుత ప్రసంగాలతో అలరించే వాగ్ధాటియై ఉపదేశాలతో సభికులను ఉత్సాహపరిచే ఉపన్యాసకేసరి ప్రవచించే సారాంశంలో విశేష అభినివేశం పివి సొంతం సంస్కరణలతో భారతదేశ జెండాను విదేశాల్లో ఎగురవేసి ప్రపంచాన్ని సరళీకరణంచేసి ఏకతాస్వరాన్ని వినిపించిండు ప్రపంచానికి సరికొత్త దేశాన్ని పరిచయం చేసినవాడు పివి భారతదేశ రాజకీయాల్లో అపర బృహస్పతిగా రాణించి అందరికీ ఆత్మబంధువుగా నిలిచిన అనంతమైన మేధోశక్తి రాజకీయ బంధువులందరికీ తలలోని నాలుక మన పివి ప్రజాశ్రేయస్సుకై పరితపిస్తూ సామ్యవాదబాటలోనే నడిచి సమతావాదాన్ని బలంగా చాటిన అసలైన సామ్యవాది సగటు భారతీయుడి ప్రయోజనమే పివి సంస్కరణాభిలాషి అమెరికా చైనా జర్మనీ దేశాలతో సత్సంబంధాలను నెరపి బలమైన విదేశీ విధానాలను కొనసాగించేటట్లు చేసిండు భారతదేశ ప్రయోజనాలకు పరాకాష్ట పివి విదేశీ విధానాలు రాజకీయంలో ఆటుపోట్లనెన్నింటినో తట్టుకుంటూ నిలబడి సహనశీలసంపదత్వంతో రాజకీయదరిని చేరిన నావికుడు సమయస్ఫూర్తితోనే దేశాన్ని ఏలిన మహా మౌనఋషి పివి నాయకత్వపటిమతో రాజనీతిజ్ఞతతో విధేయుడిగా నిలిచి ఇందిరాగాంధీ అంతరంగికులలో ఒకడిగా నిలిచిన మేధావి రాజకీయాల్లో నమ్మకంతో మెలిగినందుకే ప్రధానయిన పివి ప్రాచీన విద్యాబోధనకు ప్రతిరూపంగా గురుకులాలను ప్రయోజనాత్మకంగా దేశమంతటా ప్రవేశపెట్టిన క్రాంతదర్శి మహోన్నతమైన సంస్కరణలకు మారుపేరు మన పివి *జయచంద్రా ! హైందవ ధ్వంసకా !* అంటూ రాసి ఛందోబద్ధ కవిత్వాన్ని చిన్ననాటనే ఆవిష్కరించిండు ఆశుకవితా సరళిలో సాగిన ఖండకావ్య సృష్టికర్త పివి ప్రతిపక్ష సభ్యుడైన వాజపేయిని ఐరాసకు పంపించి రాజకీయ నాయకులందరినీ విస్మయపరిచిన చాణక్యుడు రాజకీయాల్లో చతురతను చాటిన అసామాన్యుడు పివి తెలుగు భాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెడుతూ తెలుగు అకాడమిని స్థాపించిన తెలుగుభాషా ప్రేమికుడు తెలుగుభాషకు పట్టాభిషేకం చేసిన తెలంగాణ దిట్ట పివి రాజకీయం సాహిత్యం రెండింటినీ సమపాళ్లలో రంగరించి ప్రజలగుండెల్లో నిలిచి కొలువుదీరిన సాహితీదురంధరుడు రాతల్లో చేతల్లో ఆరితేరిన నవయుగ అభిమన్యుడు పివి విదేశీ దౌత్యసంబంధాల సముద్ధరణకు విశేషంగా కృషిచేసి బలమైన సంబంధాలను నెరపడంలో విజయుడయ్యాడు విదేశీ సంబంధాలను పాదుకొల్పడంలో సవ్యసాచి పివి విదేశీ పర్యటనలో వారి భాషల్లోనే అనర్గళంగా ప్రసంగించి అసమాన పాండిత్యంతో సభికులను అలరించిన శేముషి దౌత్యవేత్తల ప్రశంసలను అందుకున్న ప్రాసంగికుడు పివి కటకటాలకే పరిమితమై చీకటిగదుల్లోనే మగ్గే ఖైదీలను సంస్కరించేందుకు ఓపెన్ జైళ్ళను ప్రవేశపెట్టిన ఘనుడు ఖైదీలల్లో పరివర్తన బీజాలనాటిన సంస్కరణాభిలాషి పివి భారతదేశ రాజకీయ చరిత్రలోనే చిరస్మరణీయంగా వెలిగి నాయకత్వపటిమతో ప్రధానమంత్రి పదవిని అధిష్టించాడు భారతదేశ అభివృద్ధిలో కీలకభూమిక పివి సంస్కరణలు ఆర్థిక సంస్కరణల ముళ్ళరథాన్ని నవ్యపథంలో సాగించి దేశాన్ని అభ్యుదయపథంలో నడిపించిన భవిష్యత్ ద్రష్ట నవ్యభారతానికి నాందీవాచకమైన పరిపాలనాదక్షుడు పివి అసాధ్యమనుకున్న పనులన్నీ సుసాధ్యం చేస్తూపోతూ భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన కార్యోన్ముఖుడు బంగారు భవిష్యత్తుకు మార్గం వేసిన సంక్షేమసారథి పివి నిజాం కాలంనాటి ముల్కీ నిబంధనలకు మద్దతు పలికి స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే తలంపుకు నాందిపలికాడు స్థానికతే ఉద్యోగాలకు గీటురాయని లక్ష్మణరేఖగీసింది పివి విమర్శలకు ప్రశంసలకు తానెప్పుడూ లొంగిపోకుండా తన పనిని తాను చేసుకుని పోయిన మౌనతపస్వి రాజకీయ మేధోవర్గంలో స్థితప్రజ్ఞతకు మారుపేరు పివి తీవ్రవాదుల ఆగడాల ఆటంకాలను దుశ్చర్యలను చూసి టాడా చట్టాన్ని పక్కాగా రూపొందించిన సాహసవంతుడు ఆటంకవాదులను అడ్డుకున్న అసలైన సింహస్వప్నం పివి సుస్థిరమైన అభివృద్ధికి బలమైన పునాదులను నిర్మించి స్వతంత్ర భారతాన్ని ఉజ్జ్వలంగా ప్రకాశింపజేసినవాడు నవీన భారతదేశం పివి ఆవిష్కరించిన అజేయచిత్రపటం భారతావనిలో మచ్చలేని మహానాయకుడిగా ఎదిగి రాజకీయ విలువలకు పట్టం కట్టిన సేవాదురంధరుడు ఆధునిక రాజకీయ మహాభారతంలో చాణక్యుడు పివి కేంద్ర మానవవనరుల శాఖకు మానవతా రంగులు అద్ది విశిష్టమైన శోభను చేకూర్చిన అపార జ్ఞానసంపన్నుడు మానవ వనరులకు పునాది వేసిన మానవ వనరు పివి విదేశాలదృష్టిలో మనదేశంపై ఉన్న అపోహలను తొలగించి సరికొత్త దృక్పథాన్ని కలిగించిన నవ్య భారతదేశ నిర్మాత  సంస్కరణలను పూలరథాలుగా మార్చిన పథగామి పివి నిరంతరం దేశం కోసం ఆలోచించే మేధావిగా ఉద్బవించి ప్రపంచంలో భారతదేశాన్ని సమున్నతంగా నిలిపిన మేధ ఆర్థిక ఉషస్సులను పంచిన తెలంగాణ తేజం మన పివి  పొరుగుదేశాలతో బలమైన మైత్రీభావాన్ని నెలకొల్పడానికై వాణిజ్య సంబంధాలను కొత్తపుంతలు తొక్కించిన ద్రష్ట నూతన విదేశాంగ విధాయక తారకమంత్ర విధాత పివి తూర్పు ఆసియా దేశాలతో సత్సంబంధాలకు నాందిపలికి అంతర్జాతీయ విపణిలో దేశీయకీర్తిని ఇనుమడింపజేసాడు సంపన్నదేశాలతో సమున్నతమైత్రి నెరపిన రాయబారి పివి అన్ని వేళల్లోనూ మౌనాన్నే ఆశ్రయించి మౌనంగా ఉంటూ మౌనదీక్షతోనే ప్రపంచ రాజకీయాలను జల్లెడ పట్టినవాడు మౌనం మహామహా మేధావుల విలక్షణమైన జ్ఞాన లక్షణం  రాజకీయాలకతీతంగా నాయకులందరి దృష్టిని ఆకర్షించి భారతదేశ అభ్యున్నతికి పాటుపడిన నిజమైన దేశభక్తుడు భవ్యదేశానికి దారిచూపిన సంస్కరణల స్ఫూర్తిప్రదాత పివి ప్రపంచదేశాలతో విశేషమన్ననలను సఖ్యతగా పొందుతూ విశ్వాసపాత్రుడిగా అందరికీ తలలో నాలుకైన విధేయుడు విదేశాంగశాఖకు వన్నెలద్దిన మేధోసంపన్నుడు మన పివి దేశంలో రాజకీయ నాయకత్వ అస్థిరత నెలకొన్నప్పుడు దేశప్రధాని పదవిని చేపట్టి సుస్థిరతను సాధించిన ఘనుడు సమర్థమైన నాయకత్వ పటిమకు అసలైన నిర్వచనం పివి పివి మదిలో తొలచి వికసించిన సంస్కరణల బీజాలు భారతదేశమంతటా పూసిన కల్పతరువుల క్షేత్రాలు నేటి దేశాభివృద్ధికి ఆధారం పివి సంస్కరణ ఫలాలు భారతదేశ సమున్నత అభివృద్ధిని ఆకాంక్షించిన నేతయై దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పరిపాలకుడు ఆధునిక భారతదేశాన్ని అవతరింపజేసిన నిర్మాత పివి విలువైన మాటలను తనదైన శైలిలో చేతలతో చూపించి అఖిల భారతావనిని అబ్బురపరిచిన అపరచాణక్యుడు దేశ రాజధానిలో తెలంగాణ వెలుగులు పంచిన ఠీవి పివి విదేశాంగ విధానంలో సరికొత్త దిశానిర్దేశనం చేస్తూ తన రాజనీతిజ్ఞతతో కొత్తపుంతలు తొక్కించిన విజ్ఞుడు విశ్వయవనికపై భారతదేశాన్ని ఠీవిగా నిలిపినవాడు పివి పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని సంకల్పించి వాటి పురోగతి కోసం పరితపించిన సంక్షేమ క్రాంతదర్శి గ్రామీణాభివృద్ధే సమగ్రమైన అభివృద్ధని కాంక్షించిన పివి పంచాయతీరాజ్ సంస్థలన్నింటికీ చట్టబద్ధత కల్పించి ఆర్థికాభివృద్ధి ప్రణాళికలను రూపొందించిన బీజాక్షరి సామాజిక సంక్షేమానికి బాటలు వేసిన ద్రష్ట పివి ప్రపంచ రాజకీయనాయకుల్లో విలక్షణనేతగా వినుతికెక్కి రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచిన అసమాన దురంధరుడు రాజకీయాల్లో అణువణువునా తలపండిన నేత పివి మానవీయ కోణంలో ఆర్థికసంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడిన ప్రగతి కాముకుడు సామాన్యప్రజలు అభివృద్ధి చెందాలన్నది పివి అభిమతం వాణిజ్యసంబంధాల కోసం విదేశీపర్యటనలు అనేకం జరిపి ఇరుదేశాల వ్యాపారానికి పరస్పరసహకారాన్ని కోరినవాడు వివిధ రంగాలలో అభివృద్ధిని ఆకాంక్షించిన మార్గదర్శి పివి విదేశీ పెట్టుబడులకు ఉదారంగానే స్వాగతం పలుకుతూ నూతన పారిశ్రామిక విధానానికి నాంది పలికిన ధీరుడు దేశ ఆర్థికాభివృద్ధికి గీటురాళ్ళు పివి సంస్కరణల ఫలాలు దేశ రాజకీయాల్లో తాను నమ్మిన విలువలను ఆచరించి భారత ప్రజాస్వామ్య రథానికి పట్టం కట్టిన రథసారథి ఉన్నతమైన రాజకీయాల్లో ఉత్తమ రాజకీయుడు పివి ప్రణాళికబద్ధమైన ప్రగతిమెట్లను అవలీలగా అధిరోహించి అపూర్వమైన సంస్కరణలను చేపట్టి నడిపిన దార్శనికుడు సమగ్రమైన సదాలోచనలకు కార్యకర్తృత్వం మన పివి పాత్రికేయుడిగా తొలినాళ్ళలో కాకతీయ పత్రికను నడిపి కథలు కథనాలు వ్యాసాలు రాసిన నవ యువకెరటం తెలంగాణలో సామాజిక చైతన్యానికి మారుపేరు పివి  జీవిత కాలమంతా అతితక్కువగా మాట్లాడి మౌనభాషియై తన చేతలతోనే దేశాన్ని నడిపించిన అపర గండరగండడు దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన గొప్ప రాజనీతిజ్ఞుడు పివి వ్యవసాయిక పారిశ్రామిక రంగాలు దేశాభ్యున్నతికి బంగారుబాటలు వేసే ఆదాయవనరులుగా భావించాడు దేశాభివృద్ధికి వ్యవసాయ పారిశ్రామిక రెండు కళ్ళన్న పివి అధికారాన్నెపుడూ తన స్వీయవైభవానికి వాడుకోకుండా ప్రజాసంక్షేమమే పరమావధిగా తపించిన నిష్కామయోగి ఆదర్శనాయకుడిగా అవనిలో వెలసిన కలువపువ్వు పివి తెలుగును బోధనాభాషగా పరిపాలనాభాషగా మలచి తెలుగుభాషా సౌందర్యాన్ని లోకానికి వెల్లడించినవాడు తెలుగు భాషాభిమానానికి అసలుసిసలు నిర్వచనం పివి రాజకీయ పదవుల కోసం ఏనాడూ పాకులాడకుండా తన అసాధారణ ప్రతిభతోనే సంపాదించిన అగ్రజుడు రాజకీయంలో నిస్వార్థంగా ఎదిగిన నిరుపమానశీలి పివి భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానం పేరుతో సరళమైన శైలిలో తెలుగులోకి అనువదించిన దిట్ట అనువాదకుడిగా సమున్నత శిఖరాయమానం పివి విదేశాంగ వ్యూహాలను వ్యూహాత్మకంగా అనుసరించి దేశరక్షణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన ధీశాలి దేశభద్రతలో రాజీపడని అంతర్జాతీయ కీర్తిపతాక పివి తెలంగాణ రాజకీయ మాగాణంలో విరిసిన పత్రహరితమై దేశ రాజకీయాల్లో వెలుగులీనిన సహస్రాధిక కాంతిపుంజం ప్రధానిగా దేశసేవలోనే తరించిన సంస్కరణాభిలాషి పివి నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులో తేవాలని నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేసిన రూపకర్త మానవవనరుల మంత్రిగా నవీనవిద్యకు నాందీగీతం పివి అసాధారణ గ్రహణశక్తితో అపారమైన ధారణపటిమతో బహుభాషలను బహుచక్కగా వల్లెవేసిన మహా ఘనాపాఠి స్వయంకృషికి నిరుపమానమైన నిదర్శనం మన పివి పాత విదేశాంగ విధానాలను కొత్తపుంతల్లో తొక్కుతూ దూరదృష్టితో శతృదేశాలను మితృదేశాలుగా మలిసిండు విదేశీ సత్సంబంధాల సాధనకు పునాది వేసింది పివి పంచెకట్టులో తెలుగుదనంతో నడకలో హుందాతనంతో తెలుగు నేలన వెలుగులు నింపిన రాజకీయ శిఖరాగ్రం ప్రపంచాన ప్రజ్ఞను చాటిన అసాధారణ పండితుడు పివి రాజకీయ సాగరంలో తన మేధోబలంతో పయనించి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న అరుదైన వ్యక్తిత్వం రాజకీయంలో అందరాని అందలం ఎక్కిన ఘనుడు పివి సమున్నత పరిపాలనా జ్ఞానంతో అధ్యయన శీలత్వంతో నిరంతరంగా సహస్రాధిక ఆలోచనలను చేసిన అవధాని ప్రాపంచిక చింతనపరుడైన సామాజిక లోచనుడు పివి విప్లవాత్మక సంస్కరణలతో ప్రగతిపథంలో పయనింపజేసి దేశాన్ని అత్యున్నతస్థాయిలో నిలిపిన మేధోసంపన్నుడు భారతదేశ రాజకీయ సామాజిక సంస్కరణాభిలాషి పివి రాజకీయరంగంలో ఎన్నో ఉన్నతపదవులను అలంకరించి వాటికే అలంకారికతను సాధించిన నిరాడంబరమైన జీవి రాజకీయాల్లో రాజనీతిజ్ఞతకు పెట్టింది పేరు మన  పివి  అంతర్జాతీయ ఒప్పందాలను అవలీలగానే కుదిర్చి వాణిజ్యలావాదేవీలను సరళీకృతం చేసిన సంస్కర్త నేటి సంస్కరణఫలాలు నాడు పివి నాటిన విత్తనాలు రాజకీయ రణరంగంలో ఎన్నో కుట్రలను కుతంత్రాలను చాకచక్యంతో అధిగమించి అందలం ఎక్కిన అజేయుడు విలక్షణనేతగా వాసికెక్కిన అపరచాణక్యుడు మన పివి  తెలంగాణలో భూసంస్కరణల పర్వానికి పాదులు వేసి నవసమాజ నిర్మాణానికి నడుంబిగించిన సంస్కరణశీలి భూసంస్కరణలను అమలు చేసిన ధైర్యశాలి మన పివి బాల్యంనుంచే ఉద్యమాల ప్రభావంతో పోరాటపటిమనెంచి నాటి నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన గండరగండడు  ఉడుకురక్తంతో ధిక్కారస్వరాలను వినిపించిన ధీరుడు పివి తెలంగాణ పలుకుబళ్ళను లోకోక్తులను ప్రయోగించి మరాఠీ నవలను తెలుగువాళ్ళకు అందించిన సృజనకర్త అపురూప అనుసృజన సుగంధం పివి అబలా జీవితం ఆయన ఆలోచనలు వేయిపడగలుగా పురివిప్పినందునే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా అలరారుతున్నది నవీన భారతాన్ని ఆకాంక్షించిన భవిష్యత్తు ద్రష్ట మన పివి బూర్గుల దగ్గర జూనియర్ న్యాయవాదిగా చేరుతూనే రాజకీయ మెళకువలను నేర్చుకున్న నిత్య అభ్యాసి సామాజిక మార్పుకోసం విశేష కృషిసల్పిన ధీశాలి పివి రాజకీయంలో ఒంటరిపోరాటం చేసిన యోధుడుగా నిలిచి దేశాభ్యున్నతికి అహరహం విశేషకృషి సలిపిన స్థితప్రజ్ఞుడు అపార మేధాసంపత్తికి అసలుసిసలు నిర్వచనం మన పివి రావణకాష్టంవలె రగిలిన అయోధ్య బాబ్రీమసీదు ఘటన భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వాస్తవిక సంఘటన సత్యాసత్యాలను విశదీకరించిన పివి గ్రంథం అయోధ్య బహుభాషా సాహితీప్రక్రియలలో విశేషమైన రచనలు చేసి కవిపండితుడిగా వినుతికెక్కిన బహుభాషా కోవిదుడు సాహిత్యంలో బహుముఖీన ప్రజ్ఞాపాటవాలకు ప్రతీక పివి ఐరాసలో నిరాయుధీకరణపై చేసిన చారిత్రాత్మక ప్రసంగం విశ్వనాయకుల హృదయాల మన్ననలను చూరగొన్నది విశ్వానికి శాంతిమంత్రాన్ని ఉపదేశించిన శాంతిదూత పివి క్రియాశీలక రాజకీయ రంగంలోకి నూతనంగా ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యుడిగా విజయుడయ్యాడు అప్రతిహత రాజకీయ విజయాలకు అసలైన దిక్సూచి పివి భారతదేశం తలెత్తుకునేలా ప్రధాన పదవిని చేపట్టి దేశం దశదిశను నలుదిశలా చాటిన సంస్కరణల ఠీవి భారతదేశ జెండాను విశ్వంలో ఎగురవేసిన ఘనుడు పివి భారతదేశాన్ని ఒక సమున్నతమైన కుటుంబంగా భావించి ఆసేతుహిమాచలం సమైక్యంగా నిలబెట్టిన రాజకీయదర్పం భారతదేశాన్ని విశ్వయవనికపై రెపరెపలాడించిన ద్రష్ట పివి అసాధారణ ప్రజ్ఞావంతుడిగా తెలంగాణావనిలో ప్రభవించి బహుముఖీన వ్యక్తిత్వంతో వెలుగొందిన జ్ఞానతేజస్సు స్వయంకృషితో సకలరంగాల్లో తేజరిల్లిన ప్రజ్ఞావతంసి పివి                                                  - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

ధైర్యం నింపే అక్షరం

i consider myself a poet first and a musician seccond . i live like a poet and i will die like a poet - bob dyla  ఈ వాక్యం ఈ కవికి చక్కగా సరిపోతుంది. ఐదు పుస్తకాల వయస్సు ఈ కవిది. 2001 నుంచి ఇప్పటివరకు తనని తానూ నరుక్కుంటూ, పేర్చుకుంటూ, అక్షరాలను పేనుకుంటు కవిత్వాన్నీ శ్వాసిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక పేజీని రూపొందించుకున్న కవి శ్రీనివాస్ గౌడ్. ఆరవ పుస్తకం ధైర్యవచనం తో కవిత్వ ప్రేమికుల ముందుకు వచ్చేసారు. నిజం చెప్పాలంటే ఏడాది నుంచి కరోనా కోరల మధ్య జనం బెంబేలెత్తిపోతున్నారు. భయంతో ముడుచుకుపోతున్న మనసులలోకి ధైర్యాన్ని నూరిపోయడం ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. ఈ పుస్తకంలో పిల్లల మీద, అమ్మల మీద, వలస కూలీల మీద అన్ని అంశాల మీద అందంగా ఒదిగిన కవితలే కాదు జపనీయులు రాసిన కవితలను తెలుగులోకి అనువాదం చేసి అలరించారు. ధైర్యవచనం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లిపోతుంది. కవి ఎంత విశాలమైన ప్రపంచాన్ని చూశాడో ఆ కవితలే చెప్తాయి. మన చుట్టూ జరుగుతున్న జీవితాల పని తీరును, ప్రపంచం వేస్తున్న పిల్లి మొగ్గలను చాలా సూటిగా చెప్పారు. కవి ఎప్పుడూ, ఎక్కడ నిలబడతాడు అంటే ప్రపంచం చివర్న నడుస్తూ, పరిగెడుతూ, అప్పుడప్పుడు నవ్వుతూ, కొన్ని కన్నీళ్లను కారుస్తూ, ఎంతో మందితో అంతర్గతంగా యుద్ధం చేస్తాడు. అరుస్తాడు, ఆవేదనతో అల్లకల్లోలమౌతాడు, మకిలి పడతాడు, మలినమౌతాడు..చివరికి అక్షరమై వెలుగుతాడు. తీసుకున్న వస్తుశిల్పాలతో అనుకున్న దాన్ని కొన్ని చోట్ల ఘాటుగా, గట్టిగా, కొన్ని చోట్ల సున్నితంగా వ్యక్తీకరించారు కవి. హిందీ టైటిల్స్ తో కొన్ని చోట్ల అలాగే జపాన్ దేశానికి చెందిన ప్రాచీన కవితలను తెలుగులోకి అనువాదం చేసి అందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి వ్వాహ్ అనిపించేలా చేస్తారు. మనిషి మారాలంటే ఒక్క క్షణం చాలు. ఆ క్షణం లోపలుంటే మనిషి ఎలా ఉంటాడు. ఆ ఒక్క క్షణం దాటితే మూడ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒక్క క్షణం కవితలో మనిషి నిజ స్వరూపాన్ని చూపించారు. ''ఆ క్షణం దాటిందంటే /ముమ్మాటికీ నేను నేను కాదు / ప్రేమగానో / ద్వేషంగానో / ఆ క్షణంలో అలాగే వుంటాను '' అంటారు కవి. మాటల మీద మాటు వేయండి అనే కవితను తీసుకుంటే '' మౌనంగా మాట్టాడే పనిముట్లను సృజించిన పనోడు ఇప్పుడు మాట్టాడాలి / మట్టిలోంచి అన్నం ముద్దల్ని సృష్టించే మట్టి మనిషి ఇప్పుడు మందికి ముందుండాలి '' ఈ వాక్యాలు చదివితే నిజమే కదా అనిపిస్తుంది. సృష్టించేవాడు వెనకబడుతున్నాడు. అర్భక మాటలు చెప్పేవాళ్ళు ముందుకు దూసుకెళుతూ వీళ్ళ మీద పెత్తనం చేస్తూ దోచుకుతింటున్నారనే నేపథ్యంలో ఈ కవితను చాలా ఘాటుగా, సూటిగా రాసారు కవి. మరో కవిత '' గేటు దగ్గర '' కవితను పరిశీలిస్తే '' ఒక్కోసారి గేటు పడుతుండాలి / జీవితం కళ్లబడింది / ఒక్కోసారి గేటు తీసుండాలి / జీవితం తుళ్ళి పడుతుంది '' అంటారు కవి., ఇక్కడ గేటు అనే పదాన్ని మనసుకు ప్రతీకగా వాడారనిపిస్తుంది. అనవసమైన చోట మనసును అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఏ రిలేషన్ ఐనా పట్టూ విడుపు వుండాలని చెప్పకనే చెప్తారు కవి. '' బదలా'' అనే హిందీ టైటిల్ తో రాసిన కవిత చదివిన ప్రతీ ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మతం పేరుతో జరుగుతున్న అనర్ధం పై ప్రతీకారం తీర్చుకోవాలి అంటారు. '' గుండె రాయి చేసుకుని /గునపం చేతిలోకి తీసుకుని నేనూ బదలా తీర్చుకోవాల్సి ఉంటుంది ''అనే వాక్యాలతో ఆ కవితను ముగిస్తారు. పిల్లలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఒక స్కూల్ నేపధ్యాన్ని తీసుకుని పిల్లల చేత పాఠాల్ని బట్టీ పట్టిస్తున్న దృశ్యాన్ని కవిత్వం చేశారు. '' ఆమె పిచ్చి గాని / ఎక్కడైనా తూనీగలు / వరసలో ఒదిగి ఉంటాయా ..? / ఎక్కడైనా పిట్టలు ముక్త కంఠంతో ఒకే పాట పాడతాయా ..? '' అని చాలా సింపుల్గా, సూటిగా, ఆలోచింపజేసేలా చిన్న వాక్యాల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పారు. పాఠకుడికి ఏది ఎక్కువ గుర్తుంటుంది. జ్వలించే కవిత్వాన్ని ముందు వరసలో గుర్తుపెట్టుకుంటాడు. అలాంటి కవిత్వం చీకట్లోంచి మెలకువలోకి తెస్తుంది. తర్వాత పాఠకుడికి అణువణువునా ఆ కవిత్వం రగులుతూనే ఉంటుంది. కొన్ని కవితల రుచి చేదుగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎదురైన అనుభవాలు, సంఘటనలు, మనసును కదిలించే దృశ్యాలే చేదు కవితలకు నేపధ్యాలౌతాయి.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఏదో ఒక చోట ఇలాంటి ఒక చెడును రుచి చూడక తప్పదు. కవి కూడా అలాంటి సందర్భంలోంచి '' చేదు సమయాలు'' పేరుతో చిక్కని వాక్యాలు రాసి అందరినీ ఒప్పించి తీరుతారు ''ఇద్దరం / దొరికిన ఏకాంతాన్ని / తప్పుకు తిరుగుతున్నాం / అడ్డుగా పెరిగి అహం గీతలు / ఇప్పుడు ఇద్దరం కలిసి / ఒకే కలను కనలేం / తెల్లారితే తలో దారి '' ..అహం మనుషుల మధ్య ఎన్ని కంచెలు వేస్తుందో ఈ కవితలో చెప్తారు....నాన్న మీద ప్రతీ కవి స్పందిస్తాడు. అమ్మానాన్నల మీదే కొన్ని అక్షరాలూ రాసి కవిగా తోలి అడుగు వేస్తాడు. ''మనసు మాగాణి మీద / అమ్మను, నన్నూ నాటుకుని / ప్రాణాల్ని రెండు చేతులు చేసి / అడ్డు పెట్టి సాగుతాడు/ ఎం చేస్తాడు నాన్న '' అంటూ ఎంతో ఆర్ద్రం గా మనసు ద్రవించేలా రాశారు. కన్నందుకు అమ్మను అందరూ గౌరవిస్తారు, పూజిస్తారు. కానీ నాన్న జీవితాంతం అమ్మను, బిడ్డల్ని మోస్తున్నందుకు ఆయన్ని ఇంకా ఎంత గౌరవించాలి, పూజించాలి. ఇక టైటిల్ కవిత ''ధైర్యవచనం'' చూస్తే ''అదొక రూపంలో ఉండదు / ఒక చోట ఉండదు / చూడడానికి అతను / మనలాంటి మనిషే గాని / మనలా గడ్డ కట్టుకుపోయిన మనిషి కాదు / లోపల జల ఎండిపోయిన మనిషి కాదు '' అంటూ గుండెకు తాకేలా తాను అనుకున్నది రాశారు కవి. ఈ కవితను ఆపదలో ఆపన్నులను ఆదుకునే తన మిత్రుడు రమణారెడ్డి ఇంకా అతని లాంటి వాళ్ళ కోసం కవి ఈ కవితను రాసి అంకితం చేశారు. ధైర్యం ఎటు నుంచైనా రావొచ్చు. మనిషి రూపంలో, పుస్తకం రూపంలో, ఇంక ఏదైనా రూపంలో.. నిజమే కదా. ఇంకో విషయం చెప్పాల్సి వస్తే జపాన్ కవితలను తెలుగులోకి అనువదించిన కవితల్లో '' మానుకోనా / లేదంటే గుర్తుంచుకోనా / ఈ లోకాన్ని కాదని / మన చివరి కలయికని '' అని ఇజుమీ షికాబు అనే జాపనీస్ కవయిత్రి రాసిన కవితను తెలుగులో అనువదించి తెలుగు పాఠకులను అలరించడం నిజంగా గొప్ప విషయం. ఈ పుస్తకంలోని కవితలు నిజంగా ఎండిపోయిన చెట్టు మళ్ళీ చిగురించినట్టు, భయం తప్ప ఇంకేం లేని ఈ పరిస్థితిలో ధైర్యాన్ని ఇచ్చేలా ఉంటాయి. వాస్తవాలను కవిత్వం చేయాలంటే, దాన్ని పాఠకులు నిక్కచ్చిగా మెచ్చుకుని ఒప్పుకోవాలంటే దానికి కవి ఎంతో ఆచితూచి తెగువ చూపించాలి. కవిత్వం చదివిన వారిలో మనోధైర్యాన్ని నింపాలి. ఎందుకంటే కవి ఎప్పుడూ కలం సైనికుడు మరి. అలాంటి తెగువ, ధైర్యం వున్నా కవి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పొచ్చు.  - అమూల్యచందు

చిక్కని కవితా రూపం అనీడ కవిత్వం

మంచి కవిత్వం ఎప్పుడు వస్తుంది అంటే మధన పడినప్పుడు. మనసు గాయపడినప్పుడు, ఆకలి కోసం పేగులు అల్లాడినప్పుడు. అప్పుడు వచ్చే కవిత్వాన్నికి ఎలాంటి స్వార్థం ఉండదు, ఎలాంటి రంగులు హంగులు అవసరం ఉండదు, ఎంతో స్వచ్ఛంగా  ఉంటుంది...అలంటి అద్భుతమైన కవిత్వాన్ని రూపా రుక్మిణి రాశారు. వెలుగును చూడాలంటే కచ్చితంగా చీకటితో యుద్ధం చేయాల్సిందే అని ఎన్నో కవితల్లో అంతర్లీనంగా చెప్పకనే చెప్పారు. తనకు నచ్చిన వస్తుశిల్పాలతో  మేజిక్ చేశారు రూప. పాల కడలిని చిలికితే ముందు విషం వచ్చి తర్వాత అమృతం వచ్చినట్టు..రూప కూడా ఎంతో మధన పడి ఆచి తూచి ఒక్కో అంశాన్ని ఎంచుకుని అనీడగా మన ముందుకొచ్చారు. ఈ పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి .. ప్రకృతి పలకరిస్తుంది, స్త్రీల  హక్కుల్ని గుర్తుచేస్తుంది, రైతులకు, సైనికులకు సలాం చేస్తుంది..ఇలా ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కవితలై ఒదిగాయి.. రూప కలం వయసు చాలా తక్కువే ఐనా ఆ కలానికి వున్న పదును చాలా ఎక్కువ. కవి గాయపడినప్పుడే అక్షరాలు రక్తాన్ని పులుముకుని ఎర్రని సూర్యుడిలా నిప్పులు కక్కుతూ వెలుగునిస్తాయి. ఆమె అక్షరాలూ కూడా అంతే . రంగుల గాయం కవితలో రెండు వాక్యాలు అందరికీ గట్టిగా తగులుతాయి. ప్రపంచం ఊసరవెల్లి / ప్రతీ రంగులో నిన్ను నీవే ఆవిష్కరించుకోవాలి అనేవి ఆ వాక్యాలు.. ప్రపంచం అందంగా కనిపించినంత అందంగా ఉండదు. పైకి అందం నటిస్తూ లోపల వికారాన్ని ప్రవహిస్తుంది అని చెప్పకనే చెప్పారు రూప. పుస్తకం పేరు చూడగానే పేరు కొత్తగా ఉందని లోపలికెళితే నీడ కవిత కనిపించింది. ఈ కవిత కవయిత్రికి ఎందుకు ఇష్టమో, అభిమానమో అర్థమైంది. పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకు ఎవరు మనతో వున్నా లేకపోయినా మన నీడ మనతోనే ఉంటుంది. నీడ మీద మన ప్రభావం తప్ప ఎవరి ప్రభావం పడదు. ఆ కవితలోని ఆఖరి పదమే అనీడ.. వెలుగున్నంత వరకు నీడ మనతోనే ఉంటుంది. చీకటిలో నీడ కనిపించదు. అప్పుడు దానికి ఏ విలువా ఉండదు. జీవితంలో తాను చూసిన అన్ని మలుపుల్లో తనకు ఎక్కడా వెలుగు రేఖ కనిపించలేదు, తన చుట్టూ వున్న సమాజాన్ని చూసిన రూపకు ఎక్కడా ఎలాంటి సంతోషమూ కనిపించలేదు. అంతా చీకటిమయమే. ఎవరు ఎవరికీ తోడు లేకుండా, ఎవరికీ ఎవరు ఏమీ కాకుండా పోతున్నారు. చివరకి మన నీడ కూడా మనకు తోడు రావడం లేదనే నేపథ్యంలో సమాజాన్ని, బంధాల్ని ఒక్క పదంలో నిక్షిప్తం చేశారు కవయిత్రి. సామాజిక అంశాలనే కాదు. స్త్రీ వాదాన్ని కూడా అంతే బలంగా తనదైన శైలిలో కొత్తగా పలికించడం రూప ప్రత్యేకత. స్త్రీనే / దూషించే వాక్యంగా మలచే పురుషాహంకారాన్ని/ అంటూ చాలా అద్భుతంగా చెప్పారు. మగాడిని నిందించే పదం ఏదీ అంటూ ఈ సమాజంపై  సూటిగా తన ప్రశ్నల బాణాల్ని వదిలారు. పుస్తకం మొత్తం మీద '' నాన్నే ధైర్యం '' కవిత అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. గుండెలపై ఆడించి, చదువులెన్నో చదివించి, ఉద్యోగంలో అండగా నిలబడి, చిన్న గాయానికి అమ్మను అరిచే నాన్నమాత్రం తన  కూతురు మనసుకు ఐన గాయాలను ఎందుకు చూడడు అంటూ  ఆర్తిగా ప్రశ్నించడం ప్రతీ ఆడపిల్ల మనస్సును కదిలిస్తుంది. వాళ్ళ నాన్నలు ఈ కవితను చదివితే మాత్రం తమను తాము తడిమి చూసుకోక మానరు. ఎన్ని ఇచ్చాడు నాన్న / కానీ అణగారిన బతుకు నుంచి బయటికి వస్తానంటే మాత్రం ఒప్పుకోడేందుకో అంటూ బాధతో, ప్రేమతో, కోపంతో ప్రశ్నించే తీరు వర్ణనాతీతం. ఇక ఏడాది కాలంగా గందరగోళాన్ని సృష్టిస్తున్న కరోనా మీద ఎన్నో అద్భుత  కవితలను రాశారు రూప. కరోనా కవితల్లో కొన్ని వాక్యాలు ఒలికిపోతున్న కాలాన్ని / ఒడిసిపట్టలేని క్షణం, నిర్జీవమైపోతున్న జీవం/ ఊరు ప్రేమ పావురంలా రమ్మని పిలుస్తోంది / చాప కింద నీరులా / కుదేలైన వ్యవస్థలో ఒక తరం కనుమరుగైపోతుందేమో..? ఇలా ఎన్నో వెంటాడే వాక్యాలు ఈ పుస్తకంలో వున్నాయి. పత్తి మీద సాము కవిత ఆద్యంతం కన్నీరు తెప్పిస్తుంది. ద్రోహమెరుగని పుడమి పురిటి పంటను ఇచ్చి తన మాట నిలుపుకుంది / అంటూ రాసిన రెండు చక్కని చిక్కని వాక్యాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. కష్టపడి పంట పండించి గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రైతులు ప్రాణాలు వదిలేస్తున్నారు. వారందరికీ నివాళిగా ఈ కవిత  ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అనీడ పుస్తకంలో ఒక్కో కవితది ఒక్కో ప్రత్యేక శైలి. రాతలెప్పుడు రాబోయే తరాలకు చెరగని గుర్తులు.. అలాంటి ఒక గుర్తును ఆహ్వానిద్దాం. మరిన్ని పుస్తకాలతో భవిష్యత్ తరాలకు వెలుగవ్వాలని రూపను ఆశీర్వదిద్దాం.   - అమూల్యచందు  

గుంటూరు శేషేంద శర్మ పరిచయం

  ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్‌, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ.......... - ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, (21 ఆగస్టు, 2000)   పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొక శైలీ నిర్మాత. - యువ నుంచి యువ దాకా (కవితాసంకలనం) అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999 Seshendra : Visionary Poet of the Millennium http://seshendrasharma.weebly.com

అత్తలేని కోడలు ఉత్తమురాలు

  అత్తలేని కోడలు ఉత్తమురాలు       అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం కోడలా కోడలా కొడుకుపెళ్ళామా ఓలమ్మా పచ్చి పాలమీద మీగడేదమ్మా వేడి పాలల్లోన వెన్నయేదమ్మ ఆహుం ఆహుం అత్తా నీచేత ఆరళ్ళెగానీ ఓలమ్మా పచ్చిపాలమీగ మీగ డుంటుందా వేడిపాలల్లోన వెన్న ఉంటుందా ఆహుం ఆహుం చిలక తిన్నపండు నేనెట్టా తిందు ఓలమ్మా చిలకతో మాటొస్తె  నేనెట్టా పడుదు ఆహుం ఆహుం మెచ్చి మేనరికంబు యిచ్చేటికంటె ఓలమ్మా మెడకోసి నూతిలో వేసితే మేలు లేకుంటె గంగలో కలిపితే మేలు ఆహుం ఆహుం మా తాతపెళ్ళికి నే నెంతదాన్ని ఓలమ్మ తలదువ్వి బొట్టెడితె తవ్వంతదాన్ని అన్ని సొమ్ములు పెడితె అడ్డంతదాన్ని ఆహుం ఆహుం నట్టింట కూర్చొని నగల కేడిస్తే ఓలమ్మ ఊరుకో మనవరాల ఊరేగొస్తా నన్నాడే ఆహుం ఆహుం కోడలా కోడలా కొడుకు పెళ్ళామా  ఓలమ్మ కొడుకు ఊళ్ళోలేడు మల్లె లెక్కడివీ ఆహుం ఆహుం ముద్దుచేసిన కుక్క మూతి కఱచేను చనువుచేసిన ఆలి చంకనెక్కేను ఆహుం ఆహుం మొండి కెత్తినదాన్ని మొగుడేమి చేసు ఓలమ్మ లజ్జ మాలినదాన్ని రాజేమి చేసు సిగ్గుమాలినదాన్ని శివుడేమి చేసు ఆహుం ఆహుం (తెలుగు జానపద గీతాలలో అత్యంత ప్రచారం పొందిన పాట)        

ఆమె జీవితంలో ఒక రోజు

ఆమె జీవితంలో ఒక రోజు     తెల్లారితే చెయ్యాల్సిన పనులు కలల్లోనూ వెంటాడుతుంటే నిద్దర చాలక బరువెక్కిన ఆమె కళ్ళల్లోనే పొద్దు పొడిచినట్లుంటుంది చెమటతో తడిసిన ఆమె పల్చని దేహం టేబుల్ మీద పేర్చిన వంటకాల్లో ఘుమఘుమలాడుతుంది ఇంటిల్లిపాదినీ తృప్తిపరిచే క్రమంలో ఎన్నిసార్లు గెలిచినా ఆమె ఓడుతూనే ఉంటుంది ఆరేసిన బట్టల్లో, కడిగిన గిన్నెల్లో, తుడిచిన నేలల్లో తన జీవితంలో లేని మెరుపులు వెతుక్కుని మురుస్తుంటుంది ఇల్లంతా సర్వాంతర్యామిలా తిరుగుతూ పని చేసే ఆమె అరడజనుసార్లు మోగేదాకా ఫోనెందుకెత్తవని గద్దించిన భర్తకు చెప్పడానికి సరైన సమాధానం లేక మాస్టారిముందు లెక్క తప్పు చేసిన పిల్లాడిలా తడబడుతుంది అలసిన సూర్యుడు పడమటి పక్కన వాలినారు ఘడియలక్కూడా మర్నాడు కుటుంబానికి కావాల్సినవమర్చడంలోనే ఉంటుంది యమధర్మ రాజొచ్చినా రేపటి వంటయ్యాకా రమ్మని బతిమాలుతుంది అలసిన దేహాన్ని పక్కపై వాల్చినపుడు మగని ఒంటివేడి చల్లార్చడంకోసం ఆమె మరోసారి తనను తాను వెలిగించుకుంటుంది వేలికొసలతో సున్నితంగా తెరిచి ఆపాదమస్తకం తడిమే కలువ కనుల స్పర్శకై ఏళ్ళతరబడి వేచిన నేస్తం అలిగి అలమరలో ముడుచుక్కూర్చుంటుంది తనని మీటుతూ పలికించే గమకాల పులకరింతలకోసం వేచిన మరొక నేస్తం ఈజిప్షియన్ మమ్మీలా పేటికలో భద్రంగా నిద్ర పోతుంది పెళ్ళికి ముందు పుట్టిన చిత్రరాజం మాసిన గడ్డంతో గోడకి ఉరేసుకుంటుంది రోజూ తనని వెక్కిరించే వీటివంక చూసే తీరికే లేక చీకట్లో ఒంటరిగా నిట్టూర్స్తుంది. కొత్తగా తలలో మొలిచిన తెల్ల వెంట్రుకామెను చూసి పకపకా నవ్వుతుంది. - శారద శివపురపు  

బతుకమ్మ పాట

బతుకమ్మ పాట!     బతుకమ్మ మీద ఇప్పుడు చాలా పాటలే వినిపిస్తున్నాయి. వాటిలో అనాదిగా జానపదులు పాడుకుంటున్న పాటలలో ఒకటి ఇది. హద్యంగా, లయబద్ధంగా బతుకమ్మ కథని పాటరూపంలో పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిస్తుందీ పాట. దాదాపు 60 ఏళ్ల క్రితమే కృష్ణశ్రీ అనే రచయిత ఈ పాటని సేకరించి తన ‘పల్లెపదాలు’ పుస్తకంలో ప్రచురించారు. శ్రీలక్ష్మి దేవియు చందమామ –  సృష్టి బతుకమ్మయ్యె చందమామ పుట్టినా రీతిచెప్పె    చందమామ – భట్టు నరసింహ కవి    చందమామ ధరచోళ దేశమున    చందమామ – ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు    చందమామ – అతి సత్యవతి యండ్రు చందమామ నూరునోములు నోమి చందమామ – నూరుమందిని గాంచె చందమామ వారు శూరులయ్యు చందమామ – వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు    చందమామ – తరగనీ శోకమున చందమామ ధనరాజ్యముల బాసి చందమామ – దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ – వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ – ఘనతపం బొనరించె చందమామ ప్రత్యక్షమై లక్ష్మి చందమామ – పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచూ చందమామ – వెలది తనగర్భమున చందమామ పుట్టుమని వేడగా    చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ – జన్మించె మహలక్ష్మి చందమామ అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరీ చందమామ కపిల గాలవులునూ చందమామ – కశ్యపాంగిరసులు చందమామ అత్రి వశిష్టులూ చందమామ – ఆకన్నియను జూచి చందమామ బ్రతుకుగనె యీతల్లి చందమామ – బ్రతుకమ్మ యనిరంత చందమామ పిలుతు రదివరనుండి చందమామ – ప్రియముగా తలిదండ్రి చందమామ బ్రతుకమ్మ యని పేరు చందమామ – ప్రజలంత అందరూ చందమామ తాను ధన్యూడంచు చందమామ – తనబిడ్డతో రాజు చందమామ నిజపట్టణము కేగి చందమామ – నేల పాలించంగ చందమామ శ్రీమహా విష్ణుండు చందమామ – చక్రాంకుడను పేర చందమామ రాజు వేషంబున చందమామ – రాజు ఇంటికి వచ్చి చందమామ ఇల్లింట మనివుండి చందమామ – అతివ బ్రతుకమ్మను    చందమామ పెండ్లాడి కొడుకులా చందమామ – పెక్కుమందిని గాంచె చందమామ ఆరువేల మంది చందమామ – అతి సుందరాంగులు చందమామ ధర్మాంగుడను రాజు చందమామ – తన భార్య సత్యవతి    చందమామ సరిలేని సిరులతో చందమామ – సంతోషమొందిరీ చందమామ జగతిపై బ్రతుకమ్మ చందమామ – శాశ్వతంబుగ వెలసె    చందమామ - నిర్జర.  

తెలుగులో తొలి శతకం ఏమిటో తెలుసా!

తెలుగులో తొలి శతకం ఏమిటో తెలుసా!   శతకం అనే ప్రక్రియ కేవలం తెలుగువారికి మాత్రమే ప్రత్యేకం కాదు. కానీ మిగతా సాహితీప్రక్రియలతో పోల్చుకుంటే.... తెలుగువారికి శతక సాహిత్యం అంటే మక్కువ ఎక్కువేమో అనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా వెలువడుతూ వస్తున్న వేలకొద్దీ శతకాలే ఇందుకు సాక్ష్యం. అంతేనా! మూఢాచారాలను ఎదిరించడంలోనూ, మనసుని వైరాగ్యంలో ముంచేయడంలోనూ మన శతకాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. అందుకు వేమన శతకమే గొప్ప ఉదాహరణ. ఇప్పటికీ వేమన సాహిత్యాన్ని విప్లవ సాహిత్యానికి దీటుగా భావిస్తుంటారు. ఇంతకీ తెలుగునాట ఈ శతకాలకి నాంది పలికింది ఎవరో! తెలుగులో మొదటి శతకం ఏమిటన్న విషయం మీద కొన్ని వాదోపవాదాలు లేకపోలేదు. అయితే సాంకేతికంగా శతకానికి ఉండాల్సిన అన్ని లక్షణాలతో వెలువడిన మొదటి శతకం ‘వృషాధిప శతకం’ అంటారు. దీని రచయిత పరమ శివభక్తుడైన పాల్కురికి సోమనాథుడు. ఈయన 12వ శతాబ్దంలో వరంగల్లుకి సమీపంలోని పాల్కురికి అనే గ్రామంలో జన్మించారన్నది కొందరి వాదన. పాల్కురికి జీవించే సమయంలో వీరశైవం ఉధృతి మీద ఉంది. సహజంగానే అది సోమనాథుని మీద ప్రభావం చూపింది. దాంతో పాల్కురికి, వీరశైవునిగా మారి సాహిత్యం ద్వారా తన మతాన్ని ప్రచారం చేయడంలో మునిగిపోయాడు. తెలుగుతో పాటుగా ఇటు కన్నడము, అటు సంస్కృతంలోనూ శివభక్తిని ప్రచారం చేసే రచనలు చేశాడు. ముఖ్యంగా శివభక్తుల చరిత్రను వర్ణిస్తూ ఆయన రాసిన ‘బసవపురాణం’ చాలా ప్రసిద్ధచెందింది. అలాగే పండితారాధ్యడనే భక్తుని జీవితం గురించి రాసిన ‘పండితారాధ్య చరిత్ర’కి కూడా తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం ఉంది. ఈ రెండు కావ్యాలూ సామాన్యులకి సైతం అర్థమయ్యేలా ద్విపదలో (రెండే పాదాలు ఉండే పద్యం) రాయడం విశేషం. ఈ రెండూ భక్తి ప్రధానమైన కావ్యాలే అయినప్పటికీ వీటిలో ఆనాటి ప్రజల జీవనశైలి, సంస్కృతి గురించి చాలా విస్తృతమైన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ రెండు కావ్యాలనూ చదివితే 12వ శతాబ్దంలో తెలుగు ప్రజల జీవితం ఎలా ఉండేదో తెలిసిపోతుందని అంటారు చరిత్రకారులు. సోమనాథుడు శివుని స్తుతిస్తూ రాసిన ‘వృషాధిప శతకం’ మిగతా రచనలకు ఏమాత్రం తీసిపోకుండా కనిపిస్తుంది. ఇందులో శివుని కీర్తించే వేలాది పదాలు ఆశువుగా దొర్లిపోతుంటాయి. కావాలంటే ఒకటి చదివి చూడండి.. భక్తిరసాభిషిక్త! భవపాశవితాన విముక్త! జంగమా సక్త! దయాభిషిక్త! తనుసంగతసౌఖ్యవిరక్త! సంతతో ద్యుక్త గుణానురక్త! పరితోషితభక్త! శివైక్యయుక్త! ప్ర వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! ఒక్కసారి ఈ వృషాధిప శతకాన్ని చివరి వరకూ చదివామంటే... ఎంతటివారికైనా భాష మీదా, భావం మీదా పట్టు వచ్చేయడం ఖాయం.    

ఇటు ఉద్యోగం... అటు కుటుంబం... ఓ సరిత కథ!

ఇటు ఉద్యోగం... అటు కుటుంబం... ఓ సరిత కథ!     పొద్దున్న లేస్తూనే విపరీతమైన తలనొప్పి. వేడిగా ఒక టీ తాగినా తగ్గని పోటు. ఆ హడావుడిలోనే వంటపని ముగించి, పిల్లల్ని క్యారేజీలు సర్ది స్కూలుకి పంపేసరికి సరిత తలలో నరాలు జివ్వుమనడం మొదలుపెట్టాయి. ఇంకా నయం తన భర్త తన పని తనే చేసుకుంటాడు. అలాగని సరిత పనిలో మాత్రం సాయపడడు. మగవాడు వంటపనీ, ఇంటిపనీ చేయడమా? డామిట్! పిల్లలూ, భర్తా ఎవరి దారిన వారు వెళ్లిపోయారనుకోవడానికి లేదు. తన ఉద్యోగం ఒకటుందిగా! వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఉంటుందనో, ఇంట్లో ఉంటే తన చదువు వృధా అయిపోతుందనో.... కారణం ఏదైతేనేం, తనూ ఓ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరాక నిమిత్తమాత్రంగా ఉండటం చేతకాలేదు. జాబ్లో చేరిన కొద్ది రోజులకే కంపెనీకి తన ప్రతిభ అర్థమైపోయింది. దాంతో అటు జీతమూ, ఇటు బాధ్యతా రెండూ పెరిగిపోయాయి. సరిత ఆఫీసులోకి అడుగుపెడుతూనే సవాలక్ష సవాళ్లు మెయిళ్ల రూపంలో సిద్ధంగా ఉన్నాయి. వాటికి తోడు ఆఫీసులో పిల్లి ఎలుకా రాజకీయాలతో సమస్యలు మరికొన్ని కాచుకుని ఉన్నాయి. తలనొప్పి తగ్గేందుకు ఓ కాంబిఫ్లామ్ మాత్ర వేసుకుని పనిలో పడిపోయింది సరిత. అంత ఒత్తిడిలోనూ టైమ్ చూసుకుంటూనే ఉంది. రేపటి నుంచి పిల్లల పరీక్షలు. రోజూ సాయంత్రం కాసేపు వాళ్లని పుస్తకాల ముందు కూర్చోపెట్టాలి. రేపేమో అత్తగారు ఇంటికి వస్తున్నారు. ఆవిడ వచ్చేసరికి ఇల్లు కాస్త నీట్గా కనిపించాలి. ఓహ్! ఒక్కసారిగా ఏదో తెలియని నిస్తేజం సరితను ఆవరించింది. ఇక తన వల్ల కావడం లేదు. అటు పిల్లల్ని గమనించుకోవాలి, భర్తని చూసుకోవాలి, ఆయన తల్లిదండ్రుల గౌరవానికి భంగం కలగకూడదు. ఇటు ఆఫీసునీ సంభాలించుకోవాలి, తనేమిటో నిరూపించుకోవాలి. ఎక్కడ ఏ పొరపాటు వచ్చినా అంతా బుర్ర వాచిపోయేలా క్లాసు పీకేస్తారు. నేరుగానో, నేర్పుగానో తనలో అశ్రద్ధ పెరిగిపోతోందని దెప్పిపొడుస్తారు. కూరలో ఉప్పు తక్కువైనా, పిల్లవాడికి మార్కులు తక్కువ వచ్చినా, కంపెనీ ప్రాఫిట్ తగ్గినా... అన్నిటికీ తనదే బాధ్యత. ఛీ బోడి ఉద్యోగం అంటూ ఒకోసారి రిసిగ్నేషన్ లెటర్ విసిరికొట్టాలని అనిపిస్తుంది. కానీ ఆ జీతంతో తన కుటుంబం అలవాటుపడిన జీవితం గుర్తుకువచ్చి మనసు నెమ్మదిస్తుంది. సరిత కథ మనకి కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే మనలో చాలామందికి నిత్యం అనుభవమే! మన ఇంట్లో సరితలాంటి మనిషి ఉంటే వాళ్లని అర్థం చేసుకుని, మన వంతు బాధ్యతగా ఓ చేయి అందించగలం. మనమే ఆ పాత్రలో ఉంటే ఇతరుల నుంచి మాటిమాటికీ సాయం అర్థించలేం కదా! అందుకని మనలోని సూపర్ మామ్ని కాసేపు పక్కన పెట్టి అన్ని పాత్రలనూ ఎలా పోషించాలో ఒక అంచనాకు రావడం అవసరం... పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా అలవాటు చేయాలి; ఇంటి ఆడది ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మగవాడు ఇంటిపనిలో సాయపడాలి అన్న విషయాన్ని భర్తకు స్పష్టంగా తెలియచేయాలి; ఉద్యోగం ఎందుకు చేయవలసి వస్తోందో పిల్లలకి చెప్పితీరాలి; ప్రతి సమస్యకీ కారణం ఉద్యోగమే అన్న గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడాలి; తక్కువ శ్రమ, తక్కువ ఒత్తిడితో ఎక్కువ ఫలితం సాధించే నేర్పు అలవాటు చేసుకోవాలి; ఇంట్లో గడిపే సమయంలో టీవీ, సెల్ఫోన్లకి అంటుకుపోకుండా పిల్లలతో క్వాలిటీ టైమ్ను గడిపే ప్రయత్నం చేయాలి; ఆఫీసు ఇచ్చే సెలవలని పూర్తిగా వినియోగించుకుని కుటుంబంతో అలా సరదాగా వెళ్లి రావడమూ మంచిదే! అన్నింటికీ మించి కుటుంబంతో నేరుగా గడపకపోయినా వారి బాగోగులను మనం నిశ్చింతగా చూసుకోవచ్చు. స్కూల్ టీచర్కి ఫోన్ చేసి పిల్లవాడి చదువు గురించి వాకబు చేయడం, అత్తగారు రోజూ మందులు వేసుకుంటున్నారో లేదో గమనించుకోవడం... లాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో వారిని అశ్రద్ధ చేస్తున్నామన్న భావన రాదు. దురదృష్టం ఏమిటంటే... ఉద్యోగం చేసే ఆడవారిని చూసి వారి ప్రతిభను మెచ్చుకుంటామే కానీ, ఆ ప్రతిభను నిరూపించుకోవడం కోసం వారెంత శ్రమిస్తున్నారో లెక్క కట్టలేం. సరితలాంటి వ్యక్తులు అటు ఉద్యోగాన్నీ, ఇటు కుటుంబాన్నీ ఎలా చూసుకోవాలో సలహాలు ఇవ్వగలమే కానీ... వారి చుట్టూ ఉండే మనుషుల్ని మార్చలేం. - నిర్జర.  

నిజం చెప్పనా

నిజం చెప్పనా     ఊహల తోటలో వసంతమై నే నిలుచున్నప్పుడు, సరాగాల కోయిలవై నీవు పదే పదే కుహూల సవ్వడిని నావైపు వదిలితే.. నీవు నేను మాత్రమే ఉన్న క్షణానికి అచ్చెరువొంది, ఆ మనో గానానికి మంత్రముగ్దుడినై లోకాన్ని మరిచి.. నీ కోసం వెతికే వెతుకులాటలో తగిలిన ఎదురు దెబ్బలు ఎంత మధురమని నీకు చెప్పగలను? కోయిల తో పోల్చానని బుంగమూతి దేనికి బంగారం? అందంలో హంసవే లే.. అప్యాయత కోసం పరుగులిడే మనసుని కప్పిన దేహానికి అలసటే లేదు తెలుసా ఆ క్షణాల్లో! వర్ణిద్దామంటే పదాలు దొరకట్లేదు,కొత్త గా కనిపెడదామనుకుంటే నీ పేరు ని మించిన పదం దొరకలేదు. అది సరే పరిచయపు నవ్వులో అంత మధురాన్ని దాచుకున్నావు, మత్తునలా చల్లి వశీకరించావు. ఏ మాయో అది! నీవున్న క్షణాలు అలా జారిపోతే నా కనులముందే, రేయి జాము నిను చూడక దాటాలంటే ఎన్ని యుగాల రాదారి పయనాలు చేసానో తెలుసా? ఎప్పటికైన ఏమైనా నను తాకిన ఆ చూపులు చెప్పనలవి కావు. కనురెప్పలకి ఏ మువ్వని కట్టి అరంగేట్రమిచ్చావో.. ఆ నాట్యానికి దాసుడనయ్యా.. నను వీడి పోయే క్షణాన ఆ కనులు చేసిన ముక్తాయింపుకి కలలో నిలిచి కమ్మని రసికత్వ జ్వాలలు కురిసినప్పుడు పదాలలా నా పెదాల వెంట ఆగి కలాన్ని తాకి కావ్యమై ప్రసవిస్తే ఉక్క పట్టలేక రాసిన లేఖాస్త్రమిది. నీ ఎద కాంతిపై నా మది శాంతికై!!!! ఇట్లు, నీకై వేచిన క్షణానికి ప్రతిబింబం! - Raghu Alla

సుమతీ శతకం ఎందుకంత ప్రత్యేకం!

   సుమతీ శతకం ఎందుకంత ప్రత్యేకం!     అక్కరకు రాని చుట్టము, అప్పిచ్చువాడు వైద్యుడు... లాంటి మాటలు నిత్యం మన జీవితంలో వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక శతకంలోని చరణాలంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి పద్యంలోనూ ఒక సామెతనో, జాతీయతనో సృష్టించిన ఆ శతకమే సుమతీ శతకం. తెలుగునాట తొలి శతకాలలో ఒకటిగా సుమతీ శతకాన్ని భావిస్తారు. సుమతి అంటే మంచి బుద్ధి అని అర్థం. ఆ పద్యం చదివేవాడు అలాంటి సద్బుద్ధి కలగాలనే ఉద్దేశంతో ‘సుమతీ’ అనే మకుటంతో అందులోని ప్రతి పద్యమూ ముగుస్తుంది. ఇంతాచేసి ఈ శతకాన్ని రాసింది ఎవరన్న విషయం మీద మాత్రం స్పష్టత లేదు. కాకపోతే రాణీ రుద్రమదేవి కాలంలో కాకతీయులకు సామంతునిగా ఉన్న బద్దెన భూపాలుడే ఈ శతకాన్ని రచించాడని చాలామంది అభిప్రాయం. సుమతీ శతకాన్ని ఒకవేళ బద్దెన కవే రాసి ఉంటే... ఈ రచన జరిగి 700 సంవత్సరాలకు పైనే గడిచిపోయి ఉంటుంది. కానీ ఇప్పటికీ అందులోని పద్యాలన్నీ మనకు కంఠస్థం ఉన్నాయంటే, ఆ రచన సులభశైలిలో సాగడమే కారణం. చిన్న చిన్న పదాలు, లయబద్ధంగా సాగిపోయే పాదాలు, వ్యవహారానికి దగ్గరగా ఉండే భాష, నీతి.... అన్నీ కలిసి సుమతీశతకాన్ని చిరస్థాయిగా నిలబెట్టాయి. అటు పండితులని తృప్తి పరిచేలా, ఇటు పామరులకి ఉపయోగపడేలా సాగాయి. సుమతీ శతకంలో తానేం చెప్పదల్చుకున్నాడో కవి తన మొదటి పద్యంలోనే తేల్చేస్తాడు... శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ .... అని సాగే ఆ పద్యంలో జనులు మెచ్చుకునేలా చక్కని నీతులని ధారాళంగా చెప్పాలనుకున్న తన ఆశని వెలిబుచ్చుతాడు. ఈ పద్యం తర్వాత అకారాదిగా (alphabetical order) శతకం ముందుకు సాగుతుంది. తెలుగులో ఈ సంప్రదాయానికి నాంది పలికింది బద్దెన కవే అని చెబుతారు. సుమతీ శతకంలో చాలా పద్యాలలో ఆచరించదగిన నీతి ఉన్నమాట నిజమే! కానీ కొన్ని పద్యాలలో రచయిత పక్షపాత ధోరణ, చిత్రమైన అభిప్రాయాలు కనిపించకమానవు. ముఖ్యంగా స్త్రీలనీ, కొన్ని కులాలనీ, కొందరు అలవాట్లనీ తన పద్యాలలో చులకన చేయడం వల్ల విమర్శకులు మండిపడుతూ ఉంటారు. అలాంటి అభ్యంతరకరమైన పద్యాలని పక్కనపెడితే... ప్రతి తెలుగు విద్యార్థీ జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పద్యాలు సుమతీశతకంలో చాలానే కనిపిస్తాయి. - నిర్జర.    

కొబ్బరి చిప్ప మీద శతకం!!!

కొబ్బరి చిప్ప మీద శతకం!!!     సాహిత్యాన్ని సృజించే మనసు ఉండాలే కానీ... ఏ అంశం మీదయినా రచన చేయవచ్చు. ‘కాదేదీ కవితకనర్హం’ అంటూ కొందరు చిన్నచూపు చూడవచ్చుగాక! కానీ పెద్దమనసు ఉంటే కొబ్బరి చిప్ప మీదైనా శతకం రాయవచ్చు. అందుకు ఉదాహరణగా వావిలికొలను సుబ్బారావుగారు రాసిన ‘టెంకాయచిప్ప శతకం’ గురించి చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణలో చేరింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒంటిమిట్టలోని రామాలయానికి ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. నిజానికి ఒంటిమిట్టకు ఇలాంటి ఒడిదొడుకులు కొత్తేమీ కాదు! రాములవారు సేదతీరిన ప్రాంతమని చెప్పుకొనేటప్పటికీ, విజయనగర రాజుల చొరవతో కానీ ఇది వెలుగులోకి రాలేదు. ఆ సమయంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు ఈ ఆలయాన్ని పునరుద్ధరించే కార్యాన్ని తలకెత్తుకోవడంతో ఈ ప్రాంతానికి ‘ఒంటిమిట్ట’ అన్న పేరు స్థిరపడిపోయింది. విజయనగర రాజుల పాలన తర్వాత మళ్లీ ఒంటిమిట్ట ప్రాభవం తగ్గసాగింది. గుడి పేరున ఉన్న మాన్యాలు అన్యాక్రాంతమైపోయాయి. దాంతో రాములవారి భక్తుడైన వావికొలను సుబ్బారావు, ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించే బాధ్యతను తలకెత్తుకున్నారు. సుబ్బారావుగారు సామాన్యుడేమీ కాదు! మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో తెలుగు పండితునిగా పనిచేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి ఛందోబద్ధంగా అనువదించారు. అందుకనే ఆయనను ‘ఆంధ్ర వాల్మీకి’ అని పిలుస్తారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఆధ్వర్యంలో వ్యవహారిక భాష ఉద్యమం జరుగుతున్నప్పుడు, సుబ్బారావుగారు ఆ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సుబ్బారావుగారు రాయలసీమకు చెందినవారు కాబట్టి, ఆ ప్రాంతంలోని ఒంటిమిట్ట రాముడిని ఇష్టదైవంగా భావించేవారు. ఆ రాముని ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని అనుకున్నారు. ఆలోచన బాగానే ఉంది, కానీ దానికి డబ్బు ఎలా! అందుకు సుబ్బారావుగారు ఓ టెంకాయచిప్పను చేతపట్టుకుని ఆంధ్రదేశమంతటా తిరగడం మొదలుపెట్టారు. అంతటి మహాపండితుడు రాములవారి కోసం బిచ్చమెత్తడం చూసి, ఎదుటపడిన ప్రతివారూ ఎంతోకొంత విరాళాన్ని అందించారు. అలా పోగైన విరాళంతో ఆలయంలోని విమానగోపురం, రథశాల వంటి నిర్మాణాలతో పాటు ధూపదీపనైవేద్యాలకు లోటు రాకుండా చూశారు. మొత్తానికి వావికాలను సుబ్బారావుగారు తల్చుకున్న కార్యం పూర్తయ్యింది. అందుకోసం తనకు సాయపడిన టెంకాయ చిప్ప పేరుతో ఒక శతకాన్ని రాయాలనుకున్నారు. దాంతో ఆంధ్రవాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వానిలో దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి కలదె నీకంటె గొప్ప టెంకాయచిప్ప! ... అంటూ శతకాన్ని మొదలుపెట్టారు. ఆపై తను ఒంటిమిట్ట ఆలయాన్ని బాగుచేయడం కోసం ఎంత శ్రమించానో వర్ణిస్తూ, ఆ రాముని గొప్పదనాన్ని వివరిస్తూ, మధ్యమధ్యలో కాస్త తాత్వికతను జోడిస్తూ... 201 పద్యాలతో శతకాన్ని పూర్తిచేశారు. వావికొలను సుబ్బారావుగారు ఆ తర్వాతకాలంలో వాసుదేవస్వామిగా మారి సీతాదేవి చరిత్రము, శ్రీకృష్ణ తత్వము, వాసుదేవ కీర్తనలు... లాంటి గ్రంథాలెన్నో రాశారు. దురదృష్టం ఏమిటంటే... ఏ ఒంటిమిట్ట ఆలయం కోసమైతే ఆయన అంతగా పాటుపడ్డారో, ఆ ఆలయంలోకే ఆయనకు ప్రవేశం లేకుండా చేశారట కొందరు. - నిర్జర.    

అతడు-ఆమె-ఆకాశం

అతడు-ఆమె-ఆకాశం     ఆమె కళ్ళ మెరుపు వల్లే వెన్నెల మెరుస్తుందా అన్నట్లుగా, నిర్మలంగా ఆకాశం వైపు చూస్తోంది ఎప్పట్లాగే.  "ప్రేమంటే ఏమిటో తెలుసా?" అడిగింది. "అదో బ్రహ్మ పదార్థం" చెప్పాడు. "పుట్టుక, చావుల మధ్య జీవితం ఓ చిన్న గీత. అందులో ప్రేమెంత? ఓ చుక్కంత." " ఆ మాత్రం చుక్కకి అల్లాడుతారు మనుషులు" ఆమె నవ్విందో, లేదో ఓ వెలుగురేఖ పడి మోము మెరిసినట్టైంది " ఎన్నో చుక్కలు కలిస్తేనే కదూ ఈ సరళరేఖ.. ఈ జీవితం! " సరళరేఖలు, వృత్తాలు, త్రికోణాలు విరక్తేమో, అతను చూపు మళ్ళించాడు. ఒంటరి పక్షి ఒకటి, గోధూళి దాటినా రాని తన జంట పక్షి కోసం చూస్తూ, ఏదో చెప్తున్నట్టుంది. బహుషా " ప్రేమంటే భరోసా" అని అంటున్నట్టుంది. అతనికి అర్థమయివుండదు. పరదా మూసివేశాడు. ఆమె వినీ, విననట్టుందేమో లేదా వినాలనుకోవడంలేదేమో.. ఈ సారి రేడియోతో పాటూ, ఆమె గొంతు శృతి చేసుకుంది  " ఆద్యంతమూ లేని అమరనాదమే ప్రేమ  ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ "   - సరిత భూపతి