భలే మేకు

భలే మేకు   అనగనగా ఒక ఊరిలో ఒక రంగయ్య ఉండేవాడు. ఒకసారి ఆ రంగయ్యకు ఓ పెద్దాయన ఓ కేలెండర్ ఇచ్చారు. రంగయ్య దాన్ని తెచ్చి ఇంట్లో మేకుకు తగిలించి, "బట్టలు కొనుక్కుంటే నయం" అనుకొని త్రిపురాంతకం వెళ్లాడు. అప్పుడు వాళ్ల ఇంట్లోకి ఓ కుక్క దూరింది. దూరగానే దానికి రంగుల రంగుల కేలెండరూ, దాన్ని తగిలించిన మేకూ కనిపించాయి. దానికి ఆ కేలెండరు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించి, "దగ్గరికి వెళ్లి చూద్దాం" అని అక్కడికి వెళ్ళింది.  అది తన దగ్గరికి రాగానే మేకుకు చాలా సంతోషం వేసింది- "కుక్కా! బాగున్నావా?" పలకరించింది మేకు. "ఏదో, ఉన్నాను. నువ్వు బాగున్నావా?" అంది కుక్క. "నాకేమి? నేను మేకులాగా ఉన్నాను. చాలా బాగున్నాను " అన్నది మేకు. "మీ క్యాలండర్ అచ్చంగా మా పాత ఇంట్లో క్యాలండరు లాగే ఉన్నది. మీ యజమాని ఫొటో ఉందా ఎక్కడైనా?" అడిగింది కుక్క. "అదిగో, అక్కడ వ్రేలాడుతున్నది ఆయన ఫొటోనే" అంది మేకు. "అయ్యో! మీ రంగయ్య చాలా చెడ్డవాడే, పాపం నీది కూడా నాలాంటి కష్టపు బ్రతుకేనన్నమాట!" అంది కుక్క రంగయ్య ఫొటోని చూస్తూ. "ఏమీ లేదు. రంగయ్య చాలా మంచోడు. నీకెందుకు అట్లా అనిపించింది?" అడిగింది మేకు, ఆశ్చర్యపోతూ. "మా యజమాని గురించి నీకు తెలీదు కదా, అచ్చం రంగయ్య లాగే ఉంటాడు. చాలా చెడ్డవాడు. మీ రంగయ్య కూడా ఆయన లాగే చాలా చెడ్డవాడు అయిఉంటాడు. ఇంకేమి?" అంది కుక్క. "ఏమీ లేదే! రంగయ్య నన్ను ఏమీ అనడే?!" ఆశ్చర్యపోయింది మేకు. "నువ్వైతే మేకువు- సరే. మరి మీ ఇంట్లో కుక్కను బాగా చూసుకుంటాడా, రంగయ్య?" అడిగింది కుక్క. "మా ఇంట్లో కుక్కే లేదు అసలు! అదే ఉంటే‌ నువ్వు ఇక్కడ ఎట్లా నిలబడేదానివి?!" నవ్వింది మేకు. "అదేంటి- రంగయ్య, మా యజమాని ఒకేలాగా ఉన్నప్పుడు, మీ ఇంట్లో కూడా నాలాంటి కుక్క ఉండాల్సిందేనే?!" అంది కుక్క, కుక్కలాగా ఆలోచించి. మేకుకు ఏమనాలో తెలియలేదు. అప్పుడు గుర్తొచ్చింది- రంగయ్య బిడ్డ రోజూ చదివే పద్యం ఒకటి అప్పుడు అర్థమైంది దానికి. కుక్కని చూసి నవ్వుతూ అది చెప్పింది. "చూడు కుక్కా, ఉప్పు, కర్పూరం చూసేందుకు ఒకేలాగా ఉంటాయి. కానీ వాటి రుచులు పూర్తిగా వేరుగా ఉంటై. అట్లాగే మనుషులు కూడా-చూపులకు ఒకేలాగా ఉన్నా, మనసులు, ప్రవర్తన మటుకు వాటి ఇష్టం వచ్చినట్లు అవి ఉంటాయి.  అందుకని మనిషుల్ని పరిశీలించకుండా, వాళ్ల రూపాన్ని బట్టి 'మంచి-చెడ్డ' అని చెప్పలేం తల్లీ!" అంది. మామూలుగా అయితే కుక్క ఏదో అనేదే గానీ, పద్యం విన్నాక ఇంక అనేందుకు ఏమీ లేక,"బాబోయ్! ఇది భలే మేకు" అనుకుంటూ వెళ్లిపోయింది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మేక తెలివి

మేక తెలివి   ఒక మేకల కాపరికి చాలా మేకలున్నాయి. అతను రోజూ ఆ మేకలన్నిటినీ అడవికి తీసుకెళ్తూ ఉండేవాడు.  ఒకసారి వాటిల్లో మేక ఒకటి మందలోంచి విడిపోయింది. దారి తప్పి, అటూ ఇటూ తిరిగి తిరిగి అలసిపోయి తనకు కనబడ్డ ఓ గుహలోకి దూరి పడుకున్నది.    ఆ గుహ ఒక తెలివి తక్కువ సింహంది. మేక పడుకునే సమయానికి ఆ సింహం వేటకని బయటికి వెళ్ళి ఉన్నది. కొంత సేపటికి వెనక్కి తిరిగి వచ్చిన సింహం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది: తన గుహలో ఎవరో దూరారు! నిద్రపోతున్నట్లు నటిస్తున్నారు!    అంతకు ముందు ఎన్నడూ సింహం అలాంటి జీవిని చూసి ఉండలేదు: పెద్ద గడ్డం,వాడిగా ఉన్న కొమ్ములూ, చూసేందుకు చిన్నగానే ఉన్నా, బలిష్ఠంగా వంపులు తిరిగి ఉన్న శరీరం! ఆ వింత జంతువును చూడగానే సింహానికి భయం వేసింది. గుహలోంచి బయటికి పరుగెత్తి, గుహద్వారం ముందు అటూ ఇటూ తిరుగుతూ పచార్లు చేయటం మొదలెట్టిందది.   అలికిడికి నిద్రలేచిన మేక, సింహాన్ని చూసి చాలా భయపడ్డది. అయితే సింహం తోకముడుచుకొని బయటికి పరుగెత్తటం చూసేసరికి, దానికి ఎక్కడలేని తెగింపూ వచ్చేసింది. అది నేరుగా గుహ ముందుకే వెళ్ళి, "ఎవర్రా నువ్వు?!" అంటూ సింహాన్ని గద్దించింది. "నేను సింహాన్ని" భయం భయంగా చెప్పింది సింహం.   "రా! ఒక్క సింహాన్నయినా చంపనిదే ఈ గడ్డాన్ని తీసేది లేదని ప్రతిజ్ఞ చేశాను. రా, ఇప్పుడు నిన్ను చంపి నా గడ్డానికి విముక్తి కలిగిస్తాను" అని ఒక్క ఉదుటున సింహం మీదికి దూకింది మేక.  హడలిపోయిన సింహం పరుగే పరుగు. 'బ్రతుకు జీవుడా' అనుకుంటూ మేకపోతు మరో వైపుకు పరుగు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

 పారిపోకు

   పారిపోకు!   శివ బాగా చదివేవాడు కాదు. కానీ వాడికి చదవటం అంటే చాలా ఇష్టం! వినేందుకు ఇదేదో వింతగా ఉంది కదూ? నిజమే. ఇదో వింత సమస్య. చదవమని శివకి ఎవ్వరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాడు రోజంతా పుస్తకాలు పట్టుకొనే కూర్చునేవాడు.   అయితే అంత సేపు కూర్చున్నా వాడి లోపలికి ఏమీ ఎక్కేది కాదు! ఒక అరగంట పాటు కష్టపడి ఏమైనా బట్టీ కొట్టినా, మరో పది నిముషాల్లో దాన్ని మర్చిపోయేవాడు! దాంతో వాడికి వాడికే కష్టం అనిపిస్తుండేది. టీచర్లంతా వాడిని 'మొద్దు శివ' అనేవాళ్ళు. తోటి పిల్లలు ఎగతాళి చేసేవాళ్ళు.   శివ చిన్నప్పుడే వాళ్ల నాన్న ఇల్లు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇంట్లో అమ్మ, చెల్లి, తను- ముగ్గురే ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళమ్మ వాడికి రకరకాల పనులు చెబుతూ ఉండేది- "ఫలానా వాళ్ళింటికి వెళ్ళి అప్పు తీసుకురా; కాఫీపొడి ఐపోయింది; ఆవాలు కొన్ని ఇమ్మను; కూలికి పో; వాళ్ళకు సున్నం పూసి పెట్టు, కాసిని డబ్బులు ఇస్తారు.." అంటూ. రాను రాను ఆవిడ ఇంకో రాగం మొదలు పెట్టింది: "ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని కూర్చుంటే ఇల్లెట్లా గడుస్తుంది? అయినా నీకు ఏమీ చదువు రావట్లేదు కదా, బడికి పోయేదెందుకు?" అని.   ఈ ప్రశ్నకు జవాబు ఎట్లా చెప్పాలో శివకు అర్థం కాలేదు. కానీ బడి మానెయ్యటం మాత్రం వాడికి అస్సలు ఇష్టం లేదు. ఇట్లా ఇంకొన్నినాళ్లు గడిచాయి. అయినా చివరికి అమ్మ మాటే నెగ్గింది. శివ చదువు మానేసి, గ్యారేజ్‌లో పనికి చేరుకోవాల్సి వచ్చింది. అయితే అక్కడా వాడికి కష్టాలే ఎదురయ్యాయి. గ్యారేజ్ ఓనర్ వాడితో పని చేయించుకునేవాడు గానీ, మనసు పెట్టటం లేదని విపరీతంగా తిట్టేవాడు. ఆ సమయంలో వాడికి పట్నం గురించి తెలిసింది. 'పట్నంలో ఎక్కడో ఒకచోట బతుక్కోవచ్చు. ఇట్లా రోజూ తిట్లు తింటూ ఉండనక్కర్లేదు..!'    దాంతో ఒక రోజున వాడు ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరి పట్నం వెళ్ళిపోయాడు. అక్కడ టీ దుకాణాల్లోను, హోటళ్లలోను పని చేసుకుంటూ ఇక ఇంటి ధ్యాస అనేదే లేకుండా వారం పది దినాలు గడిపాడు. అయితే త్వరలోనే వాడికి ఆ బ్రతుకు మీద రోత పుట్టింది. 'అదంతా ఓ మురికి ప్రపంచం! మురికిలోనే పెరుగుతూ, మురికిలో పడుకొని నిద్రపోతూ, బ్రతుకు-తారు అందరూ. ఇట్లా బ్రతకటం కంటే తను పల్లెలో ఉండటమే నయం!’   ఇక కొడుకు ఇల్లు వదిలి పెట్టి పోయే సరికి శివ వాళ్ల అమ్మ శాంతమ్మకు రెక్క తెగినట్లు అనిపించింది. అప్పటి వరకూ వాడిని చూసుకొని బ్రతుకు ఈడ్చిన ఆమె, ఇప్పుడు రోడ్డున పడింది. తల్లి, కూతురు ఇద్దరూ కూడా పట్టణం చేరుకున్నారు. పట్టణం అంత పెద్దదని ఆమె అనుకోలేదు. తీరా దాన్ని చూసేసరికి 'తను, తన కూతురు అక్కడ ఎట్లా బ్రతుక్కోవాలి?' అని ఆమెకు విపరీతమైన భయం వేసింది. తల్లి, బిడ్డ ఇద్దరూ రోడ్లమీద అడుక్కుంటూ పోయారు. శివ ఫొటో ఒకటి అందరికీ‌ చూపిస్తూ‌ "వీడు నా కొడుకు శివ. వీడిని ఎక్కడైనా చూశారా?"‌ అని అడగడం మొదలుపెట్టింది, వాళ్ల అమ్మ.   సరిగ్గా ఆ సమయానికి ప్రభుత్వం వారు పట్టణంలోని బిచ్చగాళ్లని సంస్కరించే కార్యక్రమం ఒకటి మొదలు పెట్టి ఉన్నారు. వాళ్ళ బృందం ఒకటి రోడ్డు మీద అడుక్కుంటున్న తల్లిని, పిల్లని కనుగొని, వాళ్లని తాము నడిపే "హోం"కు తీసుకెళ్లింది. వీళ్ల అదృష్టం కొద్దీ అక్కడ ఉన్న అధికారి- మానవత్వం ఉన్నవాడు. ఆయన వాళ్ల వివరాలన్నీ అడిగి తెలుసుకొని, పోలీసుల సహాయంతో పట్నం మూలల్లో ఉన్న శివను వెతికి పట్టాడు. అప్పటికే పట్నపు జీవితం అంటే విసుగెత్తిన శివ, తల్లి-చెల్లెళ్ల స్థితిని చూసి చలించిపోయాడు. "నేను ఇల్లు వదిలి పారిపోతే వీళ్ల పరిస్థితి ఇంత ఘోరంగా అవుతుంది- దానికి నేనే బాధ్యుడిని కదా?" అని వాడిలో పశ్చాత్తాపం మొదలైంది.   "నేను మంచిగా ఉంటాను సర్, మేం అందరం మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతాం. నేను కూలి పని చేసైనా సరే, మా కుటుంబాన్ని పోషించుకుంటాను" అన్నాడు అతను, ఆత్మ విశ్వాసంతో. 'హోం' అధికారి శివను మెచ్చుకుని, "ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందిలే; నువ్వు అంత శ్రమ పడనక్కర్లేదు. నువ్వు-మీ చెల్లి చేయాల్సిందల్లా బాగా చదువుకోవటం; బాధ్యత గల పౌరులుగా ఎదగటం. దీనిలో వ్యక్తిగతంగా కూడా, నాకు చేతనైన సాయం నేను చేస్తాను. మీరు బాగా చదివి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవటమే నాకు కావాలి" అన్నాడు, వాళ్లని ఊరికి సాగనంపుతూ.   అట్లా శివ, శివ చెల్లి కూడా మళ్ళీ బడిలో చేరారు. అయితే ఆశ్చర్యం, ఇప్పుడు శివకు తను చదివినవన్నీ అద్భుతంగా గుర్తుంటున్నాయి! అప్పటివరకూ అతన్ని 'మొద్దు' అన్నవాళ్ళంతా ఇప్పుడు 'శివ బలే తెలివైనవాడు. చాలా మంచివాడు కూడా" అనటం మొదలు పెట్టారు. శాంతమ్మ కూడా "చదువెందుకు?" అనటం‌ మానేసింది. పైపెచ్చు "నన్ను క్షమించురా! నువ్వు చదువుకుంటా అన్నా చదువుకోనివ్వలేదు ఇన్నాళ్ళూ" అని బాధపడింది. ఆపైన శివ ప్రభుత్వ సహాయంతో పై చదువులు కూడా చదివి, పోటీ పరీక్షల్లో నెగ్గి, ప్రభుత్వాధికారి అయ్యాడు: "మానవత్వం ఉన్న మంచి అధికారి-ఈయనకు ప్రజల కష్టం తెలుసు" అనిపించుకున్నాడు.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఎర్ర ముక్కు జింక

ఎర్ర ముక్కు జింక   అనగా అనగా ఒక ధృవపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ. సాధారణంగా ధృవపు జింకలకు పొడవాటి ముక్కులు ఉండవు. ఉన్నా అవి అట్లా ఎర్రగా మెరవవు. అందుకని అందరూ రుడాల్ఫును 'ఎర్రముక్కు జింక' అని పిలిచి, ఏడిపించేవాళ్ళు. రుడాల్ఫు తన ఎర్ర ముక్కును చూసుకొని నిజంగా కుమిలిపోయేవాడు. మిగిలిన జింకలన్నీ అతన్ని ఎగతాళి చేస్తుండేవి. రుడాల్ఫు తల్లిదండ్రులు గాని, తోడబుట్టినవాళ్ళు గాని అతనివైపుకు చూడకుండా నేలబారున చూస్తూ మాట్లాడేవాళ్లు. అతన్ని తలచుకొని సిగ్గుపడేవాళ్ళు. "తనేం నేరం చేశాడని భగవంతుడు ఇట్లా శిక్షిస్తున్నాడు?" అని రుడాల్ఫు అనుక్షణం బాధపడేవాడు. డిసెంబరు నెల. క్రిస్మస్ రానున్నది. క్రిస్మస్ తాత ప్రపంచంలోని పిల్లలందరికోసం బహుమతులు తీసుకొని, ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామూలుగా తన బండిని లాగే ధృవపుజింకలు-డాషర్, డ్యాన్సర్, ప్రాన్సర్, విక్సన్ లను సిద్ధం కమ్మన్నాడు. వాళ్లు లాగే ఆ బండిని ఎక్కి, తాత బయలుదేరగానే, ధృవపుజింకలన్నీ అంతటి గౌరవానికి నోచుకున్న తమ జాతి హీరోలను కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశాయి. కానీ ఏం లాభం? ఆ సాయంత్రం భూమిని ఒక భయంకరమైన పొగమంచు కప్పేసింది. దారి ఏమాత్రం కనబడటంలేదు. క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిచ్చేందుకు వచ్చేది ఇళ్ల పొగ గొట్టాల్లోంచే కదా! ఆ మంచుపొర ఎంత దట్టంగా ఉందంటే, తాతకు, పాపం ఒక్క పొగగొట్టం కూడా కనబడలేదు! ఆ పొగమంచులోంచి దారి కనుక్కోవాలని తాత తన చేతిలో ఉన్న లాంతరును ఎంత ఊపినా ప్రయోజనం లేకపోయింది.   ఏం చేయాలో పాలుపోక, క్రిస్మస్ తాత కంగారు పడుతున్న ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు రుడాల్ఫు. అతని ముక్కు రోజూకంటే ఎర్రగా మెరిసిపోతూ వెలుగులు చిమ్ముతున్నది. తాత సాంతాక్లజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది- రుడాల్ఫుకు బండి సారధ్యం లభించింది! క్రిస్మస్ తాత రుడాల్ఫును బండిలో అన్ని జింకలకంటే ముందు నిలిపి, కళ్లెం వేసి, తను బండినెక్కాడు. మరుక్షణంలో‌బండి ముందుకు దూసుకుపోయింది. రుడాల్ఫు క్రిస్మస్ తాతను ఆరోజు ప్రతి ఇంటి పొగగొట్టానికీ చేర్చాడు- భద్రంగానూ, వేగంగానూ. వాన, పొగమంచు, మంచు, వడగళ్ళు- ఇవేవీ ఆపలేకపోయాయి రుడాల్ఫును. ఎర్రగా మెరిసే అతని ముక్కు, అంత దట్టమైన పొగమంచునూ చీల్చుకొని ముందుకు పోయింది! ఆ తర్వాత క్రిస్మస్ తాత అందరికీ చెప్పాడు, సంతోషపడుతూ- "రుడాల్ఫు గనక లేకపోతే ఆరోజున నేను ఎక్కడికీ కదలలేకపోయేవాడిని" అని. ఇప్పుడు అందరూ రుడాల్ఫునూ, అతని బలాన్నీ, అతని ఎర్రముక్కునూ కొనియాడటం మొదలుపెట్టారు! ఒకనాడు అతను సిగ్గుపడి, దాచలేక- దాచలేక- దాచుకున్న ఎర్రముక్కే, ఈనాడు ప్రతి ధృవపుజింకకూ కలల వెలుగైంది. అన్ని జింకలూ ఇప్పుడు అలాంటి ముక్కుకోసం తపించటం మొదలుపెట్టాయి! శక్తికీ, మంచితనానికీ మారుపేరైన రుడాల్ఫు క్రమంగా అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. లోపాలను తలచుకొని కుమిలిపోయే వాళ్లెవరైనాసరే- తన కథను విని స్ఫూర్తి తెచ్చుకునేంతగా ఎదిగాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

బడికి పోదాం!

బడికి పోదాం!   కలసి సాగుదాం - బడికి కదులుదాం  అలుపు సొలుపు మరచిపోయి  నడచి సాగుదాం!  కొండవాగు ఉరకలెత్తు మా అడుగులో  గుండె ఊసులెన్నో పొంగు ఈ బాటలో  కలసి పాడుదాం-బడికి సాగుదాం  చెట్ట పట్ట జట్టుకట్టి - కదలిసాగుదాం  తెలుగు పూలు రేకులెత్తి పరిమళించగా  వెలుగు బాట వికసించే పదం పాడుదాం  కలసి పాడుదాం-బడికి సాగుదాం  గట్టు పుట్ట మెట్టదాటి కదలిసాగుదాం  కలం యోధులెందరినో తలచుకొందము  విజ్ఞాన శాస్త్రవేత్తలను తెలుసుకొందము  తలపు పెంచుదాం - కలుపు తుంచుదాం  వెలుగు నీడ రాపిడిలో విలువ పెంచుదాం  చిత్తు శుద్ధి, నమ్రతా వదిలి పెట్టము  నిరంతరం శ్రమచేస్తాం - బద్ధకించము  మాట తప్పము - తప్పి నడవము  బాటతప్పి బూకరిస్తె వదిలిపెట్టము  అడ్డమయిన బండరాయి మెట్టుచేసుకొని  ఎగుడుమెట్ల కుట్రల్ని రచ్చకీడ్చుదాం  చిన్న వాళ్ళందరికీ ఊతమిద్దము  చిన్న చిన్న అడుగులతో ముందుకెళ్దాము.  కదలి సాగుదాం - బడికి కదులుదాం  చదువు సార మెరిగి  బతుకు వెతలు చెరుపుదాం. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కోపం వచ్చిన చీమ

కోపం వచ్చిన చీమ     అనగనగా ఓ ఇంటి ఆవరణలో ఉండేవి- ఒక చీమ, ఒక దోమ, ఒక ఈగ. దోమ పాటలు పాడుతూ మొక్కల చుట్టూ, పొదల చుట్టూ, మనుషులచుట్టూ తిరుగుతుండేది. ఈగ ఎక్కడ ఆహారం కనబడితే అక్కడ, ఆ ఆహారం చుట్టూ గింగిరాలు కొడుతుండేది. చీమ మటుకు ఎక్కడెక్కడో పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరి తన ఇంటికి మోసుకొని వెళ్తూ ఉండేది రోజంతా. దానికి ఆశ ఎక్కువని, ఎప్పుడూ ఆహారాన్ని సేకరించుకొని కూడబెడుతూనే ఉంటుందని ఈగ, దోమ ఆటపట్టిస్తూ ఉండేవి. కానీ చీమ మటుకు ఆ మాటల్ని పట్టించుకునేది కాదు. "నాకూ వస్తుంది అవకాశం. అప్పుడు చెబుతా, వీళ్ళ పని!" అని సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుండేది.   ఒకసారి చీమకు ఎదురొచ్చింది ఈగ. చీమ ప్రక్కకు తప్పుకొని వెళ్ళబోయింది; కానీ దాన్ని ముందుకు పోనివ్వలేదు ఈగ. 'ఏయ్! చీమా! ఆగు! నీకన్నా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే నమస్కరించాలన్న కనీస జ్ఞానం కూడా లేదా, నీకు?' అన్నది చీమ దారికి అడ్డం వస్తూ. చీమకు కోపం వచ్చింది. 'నువ్వు నాకంటే దేనిలో గొప్పవాడివోయ్?' అని అడిగింది ఈగను. 'నేను ఏ ఆహారాన్నయినా రుచి చూడగలను. ఏ చోటికైనా వెళ్లగలను. ఎవరూ నన్ను ఆపలేరు' జవాబిచ్చింది ఈగ, గర్వంగా. 'అవునవును. పిలువని పేరంటానికి వెళ్తుంటావు నువ్వు. అందరూ నిన్ను ఛీ కొడుతుంటారు. నువ్వూ, మీవాళ్ళూ అందరూ అసహ్యించుకునే పదార్థాలమీద కూడా వాలుతుంటారు. 'మీ రాక ఎన్నో అనారోగ్యాలకు మేలుకొలుపు' అని అందరూ భయపడుతుంటారు. రోగాలను ఒకరినుండి ఒకరికి చేర్చటంలో మీకు మీరే సాటి! కాస్త పక్కకు తప్పుకుంటే నా దారిన నేను వెళ్తాను. చాలా పని ఉంది' కోపంగా జవాబిచ్చి ముందుకు కదిలింది చీమ. ఈగ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయ్యింది. మౌనంగా ప్రక్కకు తప్పుకున్నది.     కొంచెం దూరం వెళ్ళగానే దోమ ఎదురైంది చీమకు. 'ఏంటి చీమక్కా! కాసేపు తిండి యావ మానేసి, ప్రపంచం ఎంత అందంగా ఉందో, నీ చుట్టు ప్రక్కల వాళ్లు ఎంత సంతోషంగా జీవిస్తున్నారో చూడు, ఓసారి' అంది దోమ, చీమకు హితోపదేశం చేస్తున్నట్లు. 'నువ్వేనా, సంతోషంగా జీవిస్తున్నది?' అడిగింది చీమ, చిర్రెత్తుకురాగా. 'అవును! నేను ఎక్కడికి కావలిస్తే అక్కడికి ఎగిరి పోగలను. కావలసినంత రసాన్ని, రక్తాన్ని పీల్చగలను. రాజు గారిని కూడా‌వేధించగలను' అంది దోమ. 'ఆ రాజుగారు అరచేతితో ఒక్కటిస్తే చావగలవు కూడాను, నువ్వు! దొంగ చాటుగా‌ మనుషుల రక్తాన్నీ, జంతువుల రక్తాన్నీ‌, మొక్కల రసాన్నీ పీల్చుకొని బ్రతికే పరాన్న జీవివి, రక్త పిపాసివి నువ్వు. గర్వపడకు. నాలాగా కష్టపడి సంపాదించింది తిను- స్వయం కృషితో సంపాదించిన ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది. అయినా కష్టపడి బ్రతికే కూలిదాన్ని నేను. రాక్షసులతోటీ, దొంగలతోటీ నాకు పనేమున్నది? అడ్డులే! పోనివ్వు!' అని ముందుకు కదిలింది చీమ. దోమ బిత్తరపోయి చూసింది.   తర్వాత వర్షాకాలం వచ్చింది. కుండపోతగా వర్షం కురిసింది. దోమకు, ఈగకు ఆకలి ఎక్కువైంది. మనుషుల రక్తం పీల్చాలని పోయిన దోమ, విషపు వాసనలకు తట్టుకోలేక పోయింది. ఊపిరాడక చనిపోయింది. మనిషిని చికాకు పెట్టిన ఈగ కూడా అకాల మృత్యువు పాలైంది. చీమ మాత్రం వెచ్చగా ఇంట్లోనే ఉండి, తను దాచుకున్న ఆహారాన్ని తింటూ సుఖంగా కాలం గడిపింది.      

కలిసి బ్రతుకుదాం!

కలిసి బ్రతుకుదాం!   ఒక చేతిలో కర్ర, మరో చేత సంచీ పట్టుకొని ఒక మనిషి అడవిలోకి ప్రవేశించాడు. అటూ యిటూ చూస్తూ, పాటలు పాడుకొంటూ పోతున్నాడు. ముందుగా అతన్ని చూసిందొక కుందేలు. పరుగు పరుగున పోయి తన మిత్రులు జింకకు, నెమలికి ఆ సంగతి చెప్పింది. మూడూ పొదలమాటున దాగి చూసాయి. "వీడు ఇటు ఎందుకు వచ్చాడు?" అనుమానంగా అడిగింది నెమలి. "వేటకే అయి ఉంటుంది! ఇంకెందుకు వస్తాడు?" అన్నది జింక. "ఎట్లా కనుక్కోవటం?" అంది నెమలి. "వాడి చూపులు చూస్తే తెలియట్లేదా?" అంది జింక. "ఆ మనిషినే అడిగి చూస్తాను.. అపకారి అయితే సూటిగా నేనే ఎదుర్కొంటాను. మీరు పొదలమాటున దాగి ఉండండి- బయటికి రాకండి! " అని ఓ ఎత్తయిన చెట్టు పైకెగిరి కూర్చుంది నెమలి- "ఎవరయ్యా, నువ్వు?! ఈ అడవిలోకి వచ్చింది వేటకోసమేనా? ఆ సంచిలో ఏమున్నాయి? వేటకత్తీ, వల తెచ్చావా?! మర్యాదగా అందులో‌ ఏమున్నాయో చూపించు తక్షణం!" గద్దిస్తూ ప్రశ్నించింది నెమలి. ఆ మనిషి ఆగి "మిత్రమా! నేను వేటగాడిని కాదు- వేటాడేందుకు రాలేదు. నేనొక పర్యావరణ ప్రేమిని. సహజ వాతావరణమన్నా, పరిసరాలన్నా నాకు ఇష్టం. అడవి అందాలను ఆస్వాదిద్దామని, మిమ్మల్ని చూద్దామని వచ్చాను. మీరు నన్ను అనుమానించవలసిన పనిలేదు. నేను మేలు చేసేవాడినే కాని కీడు చేసేవాడిని కాను. పక్షులకు ఆహారంగా వేద్దామని ధాన్యాలు తెచ్చాను చూడండి" అన్నాడు నెమలికి సంచీని చూపిస్తూ. "మీ మనుషుల్ని మేం నమ్మం. మీరు నమ్మించి మోసం చేస్తారు. మా పరిసరాలన్నిటినీ నాశనం చేస్తున్నది మీరే" అన్నది నెమలి. "అవును. నిజంగా అవును" అరిచాయి కుందేలు, జింక బయటికి వచ్చి నిలబడి. "మీ తెలివి తక్కువతనం, స్వార్థం వల్ల ఎన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయో తెలుసా, అసలు మీకు?!" కుందేలు అన్నది ఆవేశంగా.   "రాయీ రప్పా, చెట్టూ-చేమా, పక్షులు-జంతువులు అన్నీ నాశనమే. సమతుల్యంగా వుంటేనే కదా, అన్ని జీవులకూ మనుగడ? ఈ సంగతి ఎప్పటికి తెలుస్తుంది, మీ మనుషులకు?" కోపంగా అడిగింది జింక. విచక్షణ లేకుండా ప్రవర్తించటం వల్ల ప్రకృతి దెబ్బతింటున్నదని గుర్తించే కదా, మా ప్రభుత్వం కొన్ని అరణ్యాలని అభయారణ్యాలుగా ప్రకటించింది; అంతరించిపోతున్న జీవ జాతులకు రక్షణ, పోషణ కల్పిస్తున్నది; పర్యావరణాన్ని కాపాడాలి అని ప్రచారం చేస్తున్నది" అన్నాడు మనిషి. "ప్రభుత్వాలు ప్రకటించినంత మాత్రాన మా కష్టాలు తీరినాయా? మీ మనుషులు దొంగచాటుగా ఎన్ని కృత్యాలు చేయడం లేదు?!" ఈసడిస్తూ అన్నది కుందేలు. "నువ్వన్నది నిజమేనమ్మా. అక్షర సత్యం. వ్యక్తిగతంగా ప్రతి మనిషీ తనకు తానుగా బాధ్యతను గుర్తించి మసలుకోవాలి. జీవజాలం అంతా ఒకదానిమీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పుష్పజాతులు పెరిగితే తేనెటీగలు వృద్ధి చెందుతాయి; మధురమైన తేనెను ఇస్తాయి. ఎలుకలను అదుపులో‌ ఉంచి పాములు, గింజలు తయారు చేయటంలో చురుకుగా వ్యవహరించి కీటకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి కదా. అట్లా ఒక జీవం లేదంటే మరొకటి ఉండదు. అందుకని అందరం కలిసి బ్రతకాలి. సహజీవనమే మార్గం; మరొకటి లేదు" అన్నాడు మనిషి.   "పరిసరాలను మీకు అనుగుణంగా మలుచుకుంటూ, మా ఉనికికి, భద్రతకు ముప్పు కలిగించడం సరైందేనా, చెప్పు అసలు?" ప్రశ్నించింది జింక. "తప్పే తల్లీ. అందుకనే- దాన్ని గుర్తించి, అట్లాంటి అనర్థాలు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే. అనేకమంది మనుషులు స్వచ్ఛంద సంస్థలద్వారా కృషి చేస్తున్నారు. మనుషులందరూ స్వార్థపరులు కారు తల్లీ. ముఖ్యంగా ఇప్పటి పిల్లలు చాలామంది పర్యావరణాన్ని గౌరవిస్తారు; జీవరాసులన్నిటినీ అభిమానిస్తారు, ప్రేమిస్తారు" చెప్పాడు మనిషి. "అవునవును. మమ్మల్ని కొట్టేయకూడదు. జంతువులతోటి ఎక్కడలేని విన్యాసాలూ చేయించకూడదు" అన్నది అప్పటివరకూ ఊరికే నిల్చున్న చెట్టు. "అవునవును. అందుకని మీరంతా ఇంక వేటాడటం మానెయ్యాలి. అందరం సహజీవనం చేద్దాం. అందరం కలిసి భావి తరాలకు మంచి పరిసరాలను అందిద్దాం" అన్నది జింక. "మనం అందరం ఒకరికొకరం శత్రువులం కాదు. నేస్తాలం!" అన్నాయి నెమలి, జింక, కుందేలు. మనిషి వాటితో గొంతు కలిపాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పావురాల గోల

పావురాల గోల   సుద్దాలకొట్టంలో నివసించే గిరీష్ పావురాలను పెంచేవాడు. పిల్లవాడుగా ఉన్నప్పుడు అతనొక పావురాన్ని కాపాడాడు. దాంతో అది, దాని పిల్లలు వాడికి దగ్గరైనాయి. తల్లిదండ్రులు తన ఖర్చులకోసం ఇచ్చిన డబ్బులతో వాడు ఆ పావురాలకు మేత తీసుకొచ్చేవాడు అప్పట్లో. చూస్తూండగానే ఆ నాలుగు పావురాలూ ఎనిమిది అయినాయి. వాటికి ఇక మేత చాలకొచ్చింది. దాంతో మరిన్ని డబ్బులకోసం గిరీష్ తల్లిదండ్రులను పీడించటం మొదలెట్టాడు. మొదట్లో మురిపెం కొద్దీ వాడు అడిగిన మొత్తాలు ఇస్తూ వచ్చారు తల్లిదండ్రులు. కానీ పావురాల సంఖ్య పెరుగుతూనే పోయింది! తల్లి దండ్రులు మాత్రం ఎంత అని తెస్తారు? ఒక స్థాయి దాటే సరికి వాళ్ళు 'కొన్ని పావురాలను అమ్మెయ్యి' అనసాగారు. అయితే గిరీష్ తన పావురాలను అమితంగా ప్రేమించేవాడు. వాటిని అమ్మటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు! అట్లా చూస్తూ చూస్తూండగానే అతని సంరక్షణలోని పావురాలు వందకంటే ఎక్కువయ్యాయి! పావురాలకు ఇప్పుడు వసతి కల్పించటం కష్టమైంది. అవి వేసే రెట్టలని శుభ్రం చేయటం పెద్ద పనవుతున్నది. "వాటికి తిండి పెట్టి మేపటం ఎందుకు? వదిలేస్తే పోలేదా?" అని కూడా అనిపించింది గిరీష్ తల్లి దండ్రులకు. అయితే గిరీష్ తన పావురాలను ఎప్పుడూ లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు. అవి తప్పిపోకుండా వాటికి రెక్కల క్రింద స్కెచ్ పెన్ లతో గుర్తులు పెట్టాడు కూడా. వాటిలో‌ ఏ ఒక్కటి తగ్గినా పెద్ద గొడవ చేసేవాడు వాడు! ఇదంతా తల్లిదండ్రులకు పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఒకసారి ఆ గుంపులోని పావురం ఒకటి తప్పిపోయింది. దానికోసం చాలా గొడవ చేసాడు గిరీష్. బడి ఎగగొట్టి మరీ వెతికాడు. సాయంత్రం కావొచ్చింది గానీ‌ పావురం జాడ లేదు. "పోనీరా! ఒక్కటే గా!" అన్నారు తల్లిదండ్రులు. కానీ వాడు వింటేగా? రోజంతా అన్నం తినలేదు; ఏడ్చుకుంటూ‌ కూర్చున్నాడు, గోడకు ఒరిగి. ఊరి చెరువుకు అవతలగా ఎవ్వరూ పోని గుబురు ప్రదేశం ఒకటి ఉంది. తన పావురం అక్కడికి ఏమైనా వెళ్ళిందేమోనని గిరీష్‌కి అనుమానం.   ఆ అనుమానంతో వాడు అప్పటికప్పుడు బయలుదేరి ఆ గుబురులోకి పోయాడు. తన పావురం అక్కడే ఉన్నది! అయితే వీడిని చూడగానే అది దగ్గరికి రావటానికి బదులు, పారిపోవటం మొదలెట్టింది! గిరీష్ ఆ పావురం వెనుకే పరిగెత్తాడు. పరుగెత్తుతూనే ఆ పావురం రెక్కల వెనక ఉన్న గుర్తులు చూసాడు. అతను తన పావురాలకు మూడు రంగుల గుర్తు వేసి ఉన్నాడు. కానీ ఈ పావురానికి రెండే రంగుల గుర్తు ఉంది! ఒక్క క్షణం పాటు "ఇది నా పావురం కాదేమో" అనిపించింది అతనికి. "కానీ ఆ పరిసరాల్లో ఎక్కడా పావురాలను పెంచేవాళ్ళు లేరు, తను తప్ప! ఇది తనదే, ఒక రంగు చెరిగిపోయి ఉండాలి!" అనుకుని, అతను ఆ పావురాన్ని వెంబడిస్తూ ముందుకు సాగాడు. ఈ పావురం గబగబా వెళ్ళి అక్కడే 'కుక్కూ గుక్కూ' మంటూ కూర్చొని ఉన్న ఒ పెద్ద పావురాల గుంపులో కలిసిపోయింది. గిరీష్ ని చూడగానే ఆ పావురాల గుంపు మొత్తం రెక్కలు టపటప లాడించుకుంటూ పైకి లేచింది. పట్టు వదలని గిరీష్‌ ఆ గుంపు వెనకాలే పరుగు తీసాడు. పావురాలన్నీ ఎగురుకుంటూ చాలా దూరం పోయి, చివరికి ఒక క్రొత్త రాజ్యంలోకి ప్రవేశించాయి. ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా పావురాలు ఉన్నాయి. గిరీష్ మనసులోనే లెక్కించుకుని, "ఐదారు వేల పావురాలు ఉండచ్చేమో!" అనుకున్నాడు. వాడి ఆ పావురం వాటితో కలిసి పోయింది. దాన్ని గుర్తుపట్టటం కూడా కష్టమే ఇక! కానీ దాన్ని మర్చిపోలేని గిరీష్‌ వారి రాజ్యంలో అడుగు పెట్టాడు. చూడగా అక్కడి సైనికులు పది పదిహేనుమంది కలిసి ఓ పావురం‌ వెంట పడుతున్నారు! ఆశ్చర్యపోయిన గిరీష్ తనకు ఎదురైనవాడిని ఒకడిని ఆపి సంగతి కనుక్కున్నాడు. "మా రాజ్యంలో ఇప్పటికే చాలా పావురాలు ఐనాయి. ఇప్పుడు వాటిని పెంచుకోవటమే కష్టంగా ఉందంటే, ఇట్లా కొత్త పావురాలు వస్తుంటాయి. పావురాలు పట్టటంలో శిక్షణ పొందిన మా సైనికులు వాటిని వెంబడించి పట్టుకుంటారు. తర్వాత వాటితోపాటు మరిన్ని పావురాలను బయటి రాజ్యాల వాళ్లకు ఎవరికైనా ఇచ్చేస్తారు" అని చెప్పాడతను!   అంతలో పావురం ఎగురుకుంటూ వచ్చి గిరీష్ భుజం మీద వాలింది. దాని వెనకనే వచ్చిన సైనికులు వాడిని చూసి, 'వేరే రాజ్యంవాడు' అని గుర్తించి, తక్షణం బంధించారు. పావురంతో సహా రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు. "ఎవరురా, నువ్వు?! మా రాజ్యంలోకి పావురాలను ఎందుకు తీసుకు వచ్చావు? ఇప్పటికే ఉన్న పావురాలతో చస్తుంటే, నువ్వు మరిన్ని పావురాలు తెస్తే మేం ఎలా బ్రతకాలి?" అడిగాడు మహారాజు కోపంగా. గిరీష్‌ బిత్తరపోయి "మహారాజా! మాది తమ పొరుగు రాజ్యం. తమరి రాజ్యానికి పావురాలు తేకూడదని నాకు తెలీదు. వాస్తవంగా నాదగ్గర నూరు పావురాలు ఉన్నాయి. అందులో నుంచి ఒక పావురం తప్పిపోయి మీ రాజ్యపు పావురాల గుంపు లోకి చేరింది. నేను దానిని వెంబడిస్తూ ఇటుగా వచ్చాను" అని చెప్పాడు. రాజుగారితో పాటు సభికులు అందరూ గట్టిగా నవ్వారు. "చూడగా మీ రాజ్యం వాళ్ళు పెద్ద అమాయకులలాగా ఉన్నారు. నీకు కావాలంటే మేం ఓ ఐదువందల పావురాలు ఇచ్చి పంపిస్తాం" నవ్వుతూ చెప్పాడు ఒక సభికుడు. "కాదు వెయ్యి ఇస్తాం" అన్నాడు మరొకడు. "ఓ ఐదువేలు పట్టుకుపోవయ్యా, మాకు వీటి పీడ వదుల్తుంది" అన్నారు మంత్రిగారు. సభలో వాళ్లంతా విరగబడి నవ్వారు మళ్ళీ. గిరీష్‌కు తల తీసేసినట్లు అయ్యింది. "పావురాలకు ఎంత పెట్టినా సరిపోవట్లేదు. మేం వాటికి కావలసిన ధాన్యాన్ని పొరుగు దేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. లేకపోతే అవి పంటల్ని నాశనం చేస్తున్నాయి. వాటి సంఖ్యని పరిమితంగా ఉంచుకోకపోతే చాలా కష్టం. అందుకనే ఈ‌మధ్య మేం పావురాల మాంసాన్ని తినేవారికి అదనపు జీతాలు కూడా ఇస్తున్నాం మా దేశంలో" వివరించాడు ఒక మంత్రి. "నిన్ను చూస్తే ఎవరో‌ మంచివాడివి లాగా ఉన్నావు. వంద పావురాలు ఉన్నాయంటున్నావు. వాటికి తిండి ఎలా పెడుతున్నావు? చూస్తూ చూస్తూండగానే అవి మీ రాజ్యం అంతా పరచుకునేన్ని ఐపోతాయి జాగ్రత్త! మీ రాజ్యంలో‌ పావురాల మాంసం తినేవారు లేరా?" అడిగారు రాజుగారు. "ఉన్నారు మహారాజా! కానీ, నేను నా పావురాలను ఎవ్వరికీ ఇవ్వను.." గొణిగాడు గిరీష్.   రాజుగారు నవ్వారు. "పిచ్చివాడా! ముందు ఏమీ‌ ఆలోచించకుండా నీ‌ దగ్గరున్న పావురాలని ఎన్నిటిని వీలైతే అన్నిటిని తినే వారికి అమ్మెయ్యి. నీ ఆర్థిక స్తోమత నువ్వు చూసుకోవాలి. లెక్క లేకుండా ఖర్చు పెట్టటం మంచిది కాదు- అయినా ఎంతని ఖర్చు చేస్తావు? దేనికైనా ఒక అంతు ఉండాలి" అని మెత్తగా తిట్టి, అతనికి మరి కొన్ని పావురాలను కూడా అదనంగా ఇచ్చి పంపారు రాజుగారు. గిరీష్‌ చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. అయితే త్వరలోనే అతని దగ్గర పావురాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం మొదలెట్టాయి. రాజుగారి మాటలు గుర్తుకు తెచ్చుకున్న గిరీష్ భయపడి, వాటిని అమ్మటం మొదలెట్టాడు. వాడిలో వచ్చిన మార్పుకు వాడి తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. తమకు ఎన్నడూ‌ కనబడని రాజుగారికి మనసులోనే దండాలు పెట్టుకున్నారు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

స్నేహితులు లేని కాకులు

స్నేహితులు లేని కాకులు   అనగనగా ఒక అడవిలో రెండు కాకులు ఉండేవి. ఆ కాకులు ఇతర పక్షులతో సరిగా కలిసేవి కాదు, మాట్లాడేవి కాదు, ఒంటరిగా ఉండేవి. వాటికి స్నేహితులు ఎవరూ లేరు. వాటికి రెండు కాకి పిల్లలు. కాకులు వాటి పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటూ తమ దారిన తాము బ్రతికేవి. అయితే ఒకరోజున ఒక వేటగాడు వచ్చాడు. ఆ రోజు కొంచెం చలిగా ఉందని, ఆ చెట్టు కింద నిప్పు పెట్టుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక వెళ్ళిపోయాడు; కానీ ఆ నిప్పును మాత్రం అలాగే వదిలేసాడు. మెల్ల మెల్లగా గాలి వీస్తుండేసరికి, ఆ చుట్టుప్రక్కల ఉన్న గడ్డి అంటుకున్నది. వాతావరణం వేడెక్కింది. దాంతో పిల్లలు ఏడవటం మొదలుపెట్టాయి. కానీ కాకులకు ఏం చేయాలో తెలీలేదు! పిల్లల దగ్గరికి వెళ్ళటానికి కూడా వాటికి ధైర్యం చాలలేదు.    'పిల్లలు ఆ వేడికి తట్టుకోలేవు' అని అవి తల్లి కాకి ఏడవటం మొదలు పెట్టింది. తండ్రి కాకి అక్కడే వేరే చెట్టు మీదికి ఎక్కి "ఏడవకండి! అరవకండి! కదలకండి! " అని గట్టిగా కేకలు పెట్టింది. అంతలో అటుగా వెళ్తున్న పావురం ఒకటి, ఆ హడావిడి విని అక్కడికి వచ్చి చూసింది. పరిస్థితిని అర్థం చేసుకున్నది.    వెంటనే తన స్నేహితుడైన ఏనుగు దగ్గరకు పరుగు పెట్టింది. "త్వరగా రా! పాపం, ఆ కాకి పిల్లలు మంటల్లో ఇరుక్కున్నాయి. వాటిని కాపాడాలి!" అని దాన్ని పిలుచుకొచ్చింది. ఏనుగు కూడా నడుస్తూ నడుస్తూనే ఆలోచించింది: దారిలో ఉన్న ఓ మడుగులోంచి తొండం నిండా నీళ్ళు పీల్చుకొని వచ్చింది.   ఆ నీళ్లని బలంగా ఊసి, మంటల్ని ఆర్పింది. కాకులు పావురానికి, ఏనుగుకి కృతజ్ఞతలు చెప్పాయి. "ఓ, దీనిదేముంది, ఒకరికొకరం సాయం" అని అవి రెండూ చెట్టాపట్టాలు వేసుకొని వెళ్ళిపోయాయి. వాటిని చూసాక అర్థమైంది కాకులకు 'స్నేహితులు వుండటం చాలా ముఖ్యం- స్నేహితులు ఉంటే బాగుంటుంది' అని. అటు తర్వాత అవి ఇతర పక్షులతో స్నేహం చేసినై. అన్నింటితోటీ కలిసిమెలసి ఉండసాగినై.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

నీళ్ళను వెతికిన చేప

నీళ్ళను వెతికిన చేప   అనగా అనగా దేవి అనే చేపపిల్ల ఒకటి ఉండేది. అది చాలా తెలివైనది. రాళ్ళ సందుల్లో దాక్కుని ఆడుకోవటం అంటే దానికి చాలా సరదా. రాత్రిపూట సముద్రపు అడుగున, నేలబారుగా నడుస్తూ పోయే జలచరాల్ని గమనిస్తూ కూర్చోవటం కూడా దానికి చాలా ఇష్టం. ఒక రోజున అది తన స్నేహితులైన సముద్రపు గుర్రాలకోసం ఎదురు చూస్తున్నది. ఆ సమయంలో వాళ్ల అమ్మమ్మ గౌరమ్మ వేరే ఎవరితోనో అంటున్నది- "నీళ్ళలో బ్రతికే చేపలన్నీ.."అని. "నీళ్లా?" అని దేవి ఆశ్చర్యపోయింది. "నీళ్లంటే?" అమ్మమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. "నీళ్లు ఎక్కడుంటాయి?" అని ఆలోచనలో పడింది దేవి. కొంత సేపటికి, "ఆలోచించి లాభం లేదు. నేనే వెళ్ళి కనుక్కుంటాను- అదే నయం" అని బయలు దేరిందది. "అయితే నీళ్ల కోసం ఎక్కడ వెతకాలి?" అని దానికి అనుమానం వచ్చింది.  సముద్రపు గుర్రాలు రాగానే అది వాటిని అడిగింది: "నమస్కారం మిత్రులారా! నీళ్లు ఎక్కడుంటాయో చెబుతారా, కాస్త?" అని. సముద్రపు గుర్రాలు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. "ఏమంటున్నావు? నీళ్లా?! మాకెట్లా తెలుస్తుంది? మేమైతే ఇప్పటివరకూ ఆ మాటే వినలేదు!" అన్నాయి. "అయ్యో! క్షమించండి. నేను వేరే ఎవరినన్నా అడుగుతాను" అని దేవి ముందుకు సాగింది. కొంచెం దూరం పోయాక దానికి కొన్ని యీల్ చేపలు కనబడ్డాయి. అది అడిగింది-"హెల్లో! ఈల్ చేపలూ! నేను చాలా అవసరంగా వెతుకుతున్నాను- ’నీళ్లు ఎక్కడ ఉంటాయి?’ అని. మీరు నాకు కొంచెం వెతికి పెడతారా, దయచేసి?" అని. అవి "ఆఁ..ఊఁ" అని సణిగాయి. ఒక ఈల్ చేప దూరంగా ఉన్న ఒక గుహకేసి చూపిస్తూ "నీళ్లా?! మాకు తెలీదమ్మా, ఎక్కడని వెతకాలి? నువ్వు వెతికేవేవో బహుశ: ఆ కొండగుహలో ఉంటాయేమో మరి, చూడు" అన్నది.    దేవికి సాధారణంగా చీకటి ప్రదేశాలంటే ఇష్టం ఉండదు. కానీ అది అనుకున్నది- "ఓహో! నీళ్ళు గుహల్లో ఉంటాయన్నమాట! నేను ఎప్పుడూ గుహల్లో ఏముంటుందో చూడలేదు కదా, ఇప్పుడు పోయి చూస్తాను" అని, మెల్లగా ఆ కొండగుహలోకి పోయి వెతికింది. అక్కడ దానికి రకరకాల మొక్కలు, రాళ్ళు, వింతవింత పురుగులు, నేలమీద ప్రాకే జీవులు- అది ఇంతకు ముందెన్నడూ చూసి ఉండనివి- చాలా కనబడ్డాయి, కానీ-నీళ్లు మాత్రం కనబడలేదు! అది ఆ గుహలోంచి నిరాశగా వెనుదిరిగింది. గుహలోంచి బయటికి వస్తుంటే అకస్మాత్తుగా దానికొక నక్షత్రపు చేప ఎదురైంది. తన నిరాశలో దేవి దాన్ని చూసుకోనే లేదు- వెళ్ళి దాదాపు దాన్ని ఢీకొట్టింది! "ఓయ్! ఓయ్! కొంచెం చూసుకొని పోమ్మా, చిన్న చేపా!" అన్నదది. "అయ్యో! చూసుకోలేదు నక్షత్రం! క్షమించు. నేను ఇక్కడినుండి బయటికి పోబోతున్నాను" అన్నది దేవి. "అయినా ఈ చీకటి గుహల్లో ఏం చేస్తోంది, చిన్న చేప?" అడిగింది నక్షత్రం. "నేను నీళ్లకోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ వేరే ఏవేవో ఉన్నాయి గానీ, నీళ్ళు మాత్రం ఎక్కడా కనబడలేదు. అందుకని, బై! బై!" అని పోబోయింది దేవి. "ఓయ్! ఓయ్! చిన్నచేపకు బలే సందేహం వచ్చిందే! ఆగు, ఆగు, ఒక్కనిముషం!" అని కేకలు పెట్టింది నక్షత్రం. "ఏమంటున్నావు నువ్వు? గుహలో నీళ్ళు లేవా?! అసలు నువ్వు ఈ గుహలోకి ఎట్లా వచ్చావనుకుంటున్నావు?" అడిగింది అది. "ఉం.. ఎట్లా వచ్చానా? ఈదుకుంటూ వచ్చాను!" అన్నది దేవి తెలివిగా. "ఓహో! మరైతే నువ్వు 'దేనిలో' ఈదుకుంటూ వచ్చావు?" అడిగింది నక్షత్రం. దాని గొంతులో ఇప్పుడు కొంచెం ఎగతాళి ఉంది. దేవికి ఆ ప్రశ్న అస్సలు అర్థం కాలేదు. ’దేనిలోనో’ ఈదటం ఏమిటి? తను కేవలం ’ఈదింది’ -అంతే కదా!" నక్షత్రం ఒక వెర్రి నవ్వు నవ్వింది. "ఓ నా ప్రియమైన చిన్న చేపా! నువ్వు ఒకవేళ నిజంగా నీళ్ళకోసమే వెతుక్కుంటుంటే మాత్రం, నీ వెతుకులాట ముగిసినట్లే. ఎందుకంటే, నీళ్ళు ఈ క్షణంలో నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి!" అన్నది. దేవి ఇంకా గందరగోళపడింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలీలేదు దానికి. సిగ్గు ముంచెత్తగా అది "మరి, ఉం...ఈ గుహలో అంతా చాలా చీకటిగా ఉందిగదా, బహుశ: అందువల్లనే కావచ్చు..నేను నీళ్లను చూడలేకపోతున్నాను " అన్నది.   నక్షత్రం మళ్ళీ ఒకసారి నవ్వింది: "చిన్నచేప పాపా! నువ్వు నీళ్లను చూడాల్సిన అవసరం లేదు. నిజానికి చాలా చేపలు నీళ్ళను చూడనే చూడవు! నీళ్ళు మన లోపలా ఉన్నాయి, మన బయటా ఉన్నాయి. మనందరం ఈ నీళ్ల వల్లనే తయారౌతాం; నీళ్ల వల్లనే బ్రతుకుతాం; చివరికి ఈ నీళ్లలోనే కలిసిపోతాం. నీ చర్మం నిన్ను అన్ని వైపులా ఆవరించినట్లు, నీళ్ళు కూడా ఎల్లప్పుడూ ఆవరించి ఉంటాయి, నిన్ను. మనకు నీళ్లే జీవం! అవి లేకుండా మనం లేము" అని వివరించింది. దేవికి కొంచెం సేపు తను వింటున్నది నిజమో కలో అర్థం కాలేదు. "నా చుట్టూతానే నీళ్లను పెట్టుకొని, ఆ నీళ్లకోసం ఎక్కడెక్కడో వెతికానే!" అనుకున్నది. ఆ పైన దేవికి మెల్లగా ఆ నీళ్లతోటి ఏమేం చేయచ్చో కూడా తెలిసింది. అది దానిలో బుడగలు ఊదింది; తన మొప్పల్ని వాడి దానిలో ఈదింది; తనకంటే చిన్న చేపలకు ఈదటంలో సాయం చేసింది; నిశ్చలంగా, అలా-ఊరికే- ఏమాత్రం కదలకుండా నిలబడి, నీటి అలలు తన చుట్టూ కదిలి తనకు హాయినిచ్చేట్లు చేసుకున్నది. ఒకసారి ’ఉన్నాయి’ అని గుర్తించాక, దేవి చేప జీవితానికి ఇక ఆ నీళ్లు మరింత ఆశ్చర్యానందాలను జోడించి, భలే సాయపడ్డాయి! చేపచుట్టూ నీళ్ళు ఉన్నట్లుగానే, మన చుట్టూ ఉంది- సంతోషం. మనం ఒక్కసారి దాన్ని గుర్తించామంటే, ఆ సంతోషం మనల్ని ముంచెత్తగలదు! దానికోసం వేరే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరమే లేదు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పిచ్చుకల ముచ్చట

పిచ్చుకల ముచ్చట ఒక ఊళ్లో రైస్‌మిల్లు ఒకటి ఉండేది. ఆ ప్రాంతాల్లోనే ఒక పిచ్చుకల జంట ఉండేది. రైస్‌మిల్లు బయటివైపున చూరులో గూడు చేసుకున్నాయవి. తినేందుకు అక్కడ వాటికి లెక్కలేనన్ని బియ్యపు గింజలు, పురుగులూ దొరికేవి. అయినా అదేంటో గానీ అంత సంపద ఉన్నా, ఆ ఊళ్ళో మరొక పిచ్చుకల జంట అంటూ లేదు! ఒకసారి ఆడ పిచ్చుక రెండంటే రెండే గుడ్లని పెట్టింది. వాటిని చాలా జాగ్రత్తగా పొదిగింది. కొన్ని రోజుల తరువాత వాటిలోంచి రెండు చిట్టి చిట్టి పిచ్చుక పిల్లలు బయటకు వచ్చాయి. పెద్ద పిచ్చుకలు రెండూ పిల్లలకు సరిపోయేంత లేత పురుగులను పట్టుకొచ్చి తినిపించాయి.   కొంచెం కొంచెంగా అవి పెద్దయ్యాయి. గూడులోంచి బయటికి వచ్చి, దగ్గర్లోని కొమ్మమీద కూర్చునే దశకు వచ్చాయి. ఒక రోజున పెద్ద పిచ్చుకలు రెండూ ఆహారం కోసం వెళ్ళినప్పుడు, చిన్న పిచ్చుకలు రెండూ కొమ్మ మీదికి వెళ్ళి మాట్లాడుకుంటున్నాయి. ఒక పిచ్చుక పిల్ల అన్నది: మనకు ఆడుకునేందుకు వేరే స్నేహితులు ఎవ్వరూ దొరకడం లేదు. రెండో పిచ్చుక పిల్ల: అవునే! నేను ఇంతకాలమూ గమనించనే లేదు! మనం తప్పిస్తే ఈ ఊళ్ళో వేరే పిచ్చుక పిల్లలే లేవు! మొదటి పిచ్చుక పిల్ల:‌ ఎందుకు? మనలాంటి పిచ్చుకలకు ఏమైంది? ఇంత చక్కని ఊళ్ళో పిచ్చుకలే లేకుండా ఎట్లా అయ్యింది? రెండో పిచ్చుక పిల్ల: ఏమో, తెలీదు- నిన్న వాళ్ళెవరో చెప్పుకుంటుంటే విన్నాను మన జాతి పక్షులు అంతరించి పోతున్నాయట. ఎందుకనో మరి, అర్థం కాలేదు.   మొదటి పిచ్చుక పిల్ల: ఇందులో అర్థం కానిదేమున్నది? కాలుష్యం వల్ల! కాలుష్యం వల్లనే మన జాతి అంతరించి పోయింది. రెండో పిల్ల: కాలుష్యం అంటే ఏంటి? ఇక్కడ రైస్‌మిల్లులో చెత్త, చెదారం ఏమీ ఉండవు. పెద్దగా పొగకూడా లేదు! ఊళ్ళో వాహనాలు కూడా ఏమన్ని లేవు కదా, మరి ఇంక ఈ కాలుష్యం ఎక్కడినుండి వస్తున్నది? మొదటి పిల్ల: నేనూ మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది. నేను మాట్లాడకుండా ఊరికే ఉన్నాననుకో. అప్పుడు కూడా నీకు ఏమైనా శబ్దం వినిపిస్తుందా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు? రెండో పిల్ల: అవును. ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి కదా, "కుయ్.. కుయ్య్....కీచ్..కీచ్" అని గాలిలోంచే వస్తుంటాయి శబ్దాలు! మొదటి పిల్ల: అదే, కాలుష్యం. ఇదివరకు ఈ శబ్దాలు ఉండేవి కావట. మనుషులు "సెల్ఫోనులు" అని ఏవో కనుక్కున్నారట. వాటికోసం పెద్ద పెద్ద టవర్లు కట్టారట.   ఆ టవర్లలోంచి ఇదిగో, ఇట్లాంటి శబ్దాలు వస్తాయి. అవి మనుషులకు వినపడవట; కానీ మనకు వినిపిస్తాయి! కొద్ది రోజులకి ఆ శబ్దాలకు తట్టుకోలేక మనవాళ్లంతా అవి వినపడని చోట్లకు పారిపోయారట. మన బంధువులంతా ఆ రకంగా అడవుల్లోకి చేరుకున్నారు. అందుకనే ఇక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు మనకు! రెండో పిల్ల: అయ్యో! మరి ఈ సంగతి తెలీదా, మనుషులకు? మొదటి పిల్ల: పాపం, వాళ్లకీ బాగా తెలీదు. వాళ్లకి వినపడవు కదా, ఈ శబ్దాలు! అందుకని అవి మనకీ వినిపించవనుకుంటారు. ఎవరైనా వాళ్లకి ఈ సంగతి చెబితే బాగుండు! రెండో పిల్ల: భూమి మీద మనలాంటి పక్షులు కూడా బ్రతకాలంటే, వాళ్లు వాళ్ల పద్ధతులను కొంచెం మార్చుకోవాలి కదా! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సూపర్ మ్యాన్

సూపర్ మ్యాన్   నేనొక సూపర్‌ మ్యాన్‌ని. ఎగరగలుగుతాను. ఎటు కోరితే అటు వెళ్ల గల్గుతాను. దూరదూరాల్లో ఏం జరుగుతున్నదీ‌ కూడా నాకు కనిపిస్తుంది. నన్నెవరు తలచుకున్నా నాకు వినిపిస్తుంది.. ఒకరోజున నేను అట్లా ఊరికే కూర్చొని ఉంటే, ఎవరో సహాయం కోసం పిలుస్తున్నట్లు నాకు అనిపించింది. తక్షణం నేను అటువైపుకి ఎగిరాను. చూస్తే అక్కడ ఇల్లు ఒకటి, కాలి పోతున్నది! ఆ ఇంటిలో ఒక పిల్లవాడు ఇరుక్కుపోయి ఉన్నాడు. బయటికి రాలేక ఏడుస్తున్నాడు. నేను ఇంక అటూ ఇటూ చూడలేదు: రివ్వున వాడి దగ్గరికి దూసుకు పోయాను. వాడిని ఎత్తుకొని, కిటికీలోంచి అంతే వేగంగా బయటికి ఎగిరిపోయాను. నేను వాడిని బయటికి తీసుకెళ్ళిన మరుక్షణం ఇల్లు మొత్తం కూలిపోయింది! నిజానికి నా వెనక ఏం జరిగిందో‌ నాకు తెలీనే లేదు.   నేను ఆ పిల్లవాడిని క్రిందికి దింపి, వాడి తల్లిదండ్రులకు అప్పగించటంలో బిజీగా ఉన్నాను. అక్కడ చేరినవాళ్లంతా నన్ను చాలా మెచ్చుకున్నారు. అభినందించారు. "సూపర్ హీరో!" అని పొగిడారు. ఇక ఆనాటినుండి నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాను. ఒకసారి పది అంతస్తుల భవనం ఒకటి కూలిపోవస్తున్నది. సరిగ్గా ఆ సమయానికి నేను అక్కడే ఉన్నాను. నేను నా చేతులతో ఆ భవనాన్ని నిలబెట్టబోయాను. కానీ దాన్ని అలా నిలపటం అసాధ్యం. దాని పునాది సరిగా లేదు- ఒక వైపునుండి అది మెల్లగా కూరుకుపోతున్నది. నేను నా శక్తినంతా వెచ్చించి, భుజాల్ని దానికి తాటించి నిలబడ్డాను. అట్లా అది కొంత సేపు నిలబడింది; కానీ అంతలోనే మెల్లగా క్రుంగిపోసాగింది! ఆ సమయంలో నాకు చాలా నిరాశగా అనిపించింది: 'ఈ పని నా వల్ల కాదు; నేను ఏమీ చేయలేను' అని. అయితే అది ఒక్క క్షణం‌ మాత్రమే.. మళ్ళీ నేను ధైర్యం తెచ్చుకున్నాను. క్రుంగిపోతున్న భాగాన్ని నా చేతులతో పట్టుకొని ఎత్తటం మొదలు పెట్టాను. అక్కడ చేరినవాళ్లంతా నన్ను ప్రోత్సహిస్తూ "సూపర్‌ హీరో! నువ్వు చెయ్యగలవు! నువ్వు వీళ్లందరినీ కాపాడగలవు" అని అరుస్తున్నారు. అట్లా నేను దాదాపు ఒక అరగంట పాటు ఆ భవంతిని నిలిపి ఉంచగలిగాను. అయితే ఆలోగా అందులో ఉన్న మనుషులందరూ బయటికి వచ్చేసారు. ఆ పైన నేను మెల్లగా భవంతిని వదిలి ఇవతలికి రాబోతున్నాను..   అంతలో గుంపులోంచి వినబడింది... నాకు బాగా పరిచయం ఉన్న గొంతే అది: "ఇట్లా అయితే ఎలాగ? అందరూ ఏమంటారు? ఎంత సేపురా, ఇలాగ? నా వల్ల కాదు" అంటున్నారు ఎవరో. "ఎవరది? ఏమంటున్నారు? ఇంత బరువు ఎట్లా మొయ్యాలి?" అంటున్నాను నేను. "ఏం కల వచ్చిందిరా? మళ్ళీ ఆ సూపర్ మ్యాన్ కలేనా? ఎప్పుడూ ఆ పిచ్చి పిచ్చి సినిమాలు చూడద్దురా అంటే వినవు!" అంటోంది అమ్మ. "ఓహో ఇదంతా కలేనా?!" అనుకున్నాను నేను. "ఎంత కలైనా ఇంతమందికి సాయం చేయటం మాత్రం బలే ఉంది!" అని నవ్వుకుంటూ లేచి బాత్రూముకు పరుగెత్తాను. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సోమరిపోతు కథ

సోమరిపోతు కథ   అనగనగా గడ్డంనాగేపల్లిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ పిల్లవాడు చాలా సోమరిపోతు. అతనికి ఏ పని చేయడానికీ ఇష్టం లేదు. ఎప్పుడూ నిద్ర పోవాలనుకునేవాడు. తల్లిదండ్రులు చెప్పిన చిన్న పని చేయడానికి కూడా చాలా మొండికేసేవాడు. ఇంట్లో వాళ్ళూ, ఊళ్ళో వాళ్ళూ అందరూ అతన్ని సోమరి పోతు అనేవారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఒక సారి అతడు దేవుణ్ణి ప్రార్థించాడు - తనకు ఒక సేవకుణ్ణి పంపించమని. 'ఈ సోమరిపోతుకు గుణపాఠం చెప్పడానికి ఇదే మంచి సమయం' అనుకున్నాడు దేవుడు. కొంచెం ఆలోచించి, ఒక పిశాచాన్ని అతనికి సేవకుడిగా పంపించాడు. ఆ రోజు రాత్రి సోమరిపోతు ఇంటికి పిశాచం వచ్చి తలుపు తట్టింది. "అయ్యా! దేవుడు నన్ను మీ సేవకుడిగా ఉండమని పంపాడు. మీరు నాకేమి పని చెబితే ఆ పని చేస్తాను," అని పిశాచం తనని తాను పరిచయం చేసుకున్నది.   మరుసటి రోజు ఉదయం నిద్ర లేస్తూనే సోమరిపోతు సేవకునికి చాలా పనులు చెప్పాడు. రోజూ తల్లిదండ్రులు చెప్పే పనులన్నీ సేవకుడి చేత చేయించాడు. సేవకుడు వాటిని చక చకా చేసేసాడు. ఇంకా ఏం పనులున్నాయని అడిగాడు. "మా నాన్న ఊరి చివర ఒక గుడిసె కట్టించాడు. దాన్ని శుభ్రం చేసి, అలికి, సున్నం పూసి, ఇంటి చుట్టూ కంచె వేసి, గేటు బిగించి, దాన్ని ఎవరికైనా ఎక్కువ ధరకు అమ్మేసి, డబ్బు తీసుకురా" అన్నాడు. ఆ పనిని కూడా సేవకుడు తొందరగా చేసేసాడు. 'ఇంకేదైనా పని ఇమ్మని' అడిగాడు.   "సరే, ఇప్పుడు నువ్వు పోయి మా ఊరి చెరువులో ఉండే మొసలిని చంపేసి రా" అని పని చెప్పాడు. పిశాచానికి ఆ పని ఎంత సేపు? చెప్పీ చెప్పగానే పూర్తి చేసుకొని వచ్చింది. ఇలా సోమరిపోతు యజమాని ఏ పని చెప్పినా పిశాచ సేవకుడు తొందరగా పూర్తి చేసేసి, 'ఇంకా పని చెప్పండి' అని అడుగుతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పనులు చెప్పడానికి కూడా విసుగేసింది సోమరిపోతుకు. దీని బదులు ఏదైనా పని చేయాలనిపించింది. అంతే. సోమరిపోతుకి పని చేద్దామని అనిపించేసరికి, పిశాచం కాస్తా మాయమైంది. సోమరిపోతుకు బుద్ధి వచ్చినందుకు అతని తలిదండ్రులే కాదు, దేవుడు కూడా సంతోషించాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అల్లరి కోతి

అల్లరి కోతి     ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి ఒక రోజు సమావేశం అయ్యాయి. అడవిలో‌ ఒక స్కూలు పెట్టుకోవాలని అనుకున్నాయి. అన్నీ‌ కలిసి సింహం రాజుగారిని అనుమతి అడిగాయి. సింహం ఒప్పుకున్నాడు. వెంటనే స్కూలు కూడా మొదలైంది. స్కూల్లో కోతి బాగా అల్లరి చేసేది; వేరే వాళ్ళ పెన్సిళ్ళను, పెన్నులను దొంగిలించేది. టక్కరి నక్క పోయి, కోతి దొంగతనం గురించి సింహం రాజుకు ఫిర్యాదు చేసింది. అప్పుడు రాజు కోతితో "ఇంకోసారి అల్లరి చేస్తే పట్టణంలోకి పంపుతాం" అన్నాడు.   రాజు అలా అనగానే కోతి చాలా సంబరపడింది. దానికి పట్నం అంటే చాలా ఇష్టం మరి! అందుకని కోతి ఇంకా ఎక్కువ అల్లరి చేయటం మొదలు పెట్టింది. ఇక తట్టుకోలేని జంతువులన్నీ కలిసి న్యాయవిచారణ చేసి, కోతిని అడవిలోంచి తరిమేశాయి. పట్నం చేరుకున్న కోతికి మొదట్లో‌ చాలా సంతోషం కలిగింది. అక్కడి దుకాణాలు, వాహనాలు చూస్తూ‌ అది తనను తాను మరచి పోయింది. అంతలోనే దాన్ని ఒకపిల్లవాడు పట్టుకున్నాడు. కోతితో సర్కస్ చేపించి బాగా డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు వాడు.   కోతికి కూడా మొదట్లో ఆ ఆట ఇష్టమే అయ్యింది, కాని వాడు రాను రాను దానికి తక్కువ అన్నం పెడుతుండేసరికి, అది చాలా బాధ పడింది. "నేను అడవిలో అల్లరి చేయకుండా ఉంటే బాగుండేది- నాకు ఇన్ని తిప్పలు తప్పేవి కదా" అనుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు దానికి తప్పించుకునేందుకు అవకాశం వచ్చింది. వెంటనే అది పిల్లవాడి బారి నుండి తప్పించుకొని అడవిలోకి వెళ్ళింది. అక్కడ సింహం రాజు గారి దగ్గరికి పోయి "రాజా! నన్ను క్షమించండి - పట్నం మీది మోజుతో అడవిలోని జంతువులన్నిటినీ వేధించాను. ఇకపై బాగుంటాను- నన్ను ఇక్కడ ఉండనివ్వండి చాలు" అని కోరింది. సింహం రాజు దాన్ని క్షమించి, అడవిలో ఉండనిచ్చాడు. అప్పటినుండీ అది అల్లరి మానేసింది- బుద్ధిమంతురాలైంది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తుంటరి బాలలు

తుంటరి బాలలు     కొత్తపల్లిలో ఉండే రాఘవరావుకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు 'బాల'కు పన్నెండేళ్ళు; కూతురు 'చంద్రిక'కు పదేళ్ళు. కొత్తపల్లిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు బాల. చెల్లెలు చంద్రికేమో ఐదవతరగతి. బాల కాస్త తుంటరి పిల్లాడు. బుడుగు లాంటి మాటలు, చమత్కారపు తెలివితేటలు అతని సొంతం. అతను చేసే అల్లరికి, ఇచ్చే జవాబులకు బళ్లో అందరూ వాడిని 'బాల రామలింగా' అనో, 'బీర్బల్‌' అనో పిలిచేవాళ్ళు. అది సెలవు రోజు. జేజి తాతయ్యని అడిగి డబ్బులు తీసుకెళ్ళి, సందు చివర్లో ఉన్న స్వీట్‌ షాపులోంచి డజను లడ్డూలు కొనుక్కొచ్చింది చంద్రిక. కిటికీ సందుల్లోంచి చూడనే చూసాడు బాల. 'తనకి ఒక్కటీ ఇవ్వకుండా లడ్డూలన్నీ ఆ పిల్ల ఒక్కతే తినేస్తుందేమో' అని వాడికి అనుమానం వచ్చింది. అందుకని, నేరుగా ఆమె దగ్గరకెళ్ళి, ప్రేమ ఒలకబోస్తున్నట్లే "చెల్లీ!‌ నాకు కూడా నాలుగు లడ్డూలు ఇవ్వచ్చు కదా!  గేదె తిన్నట్లు ఒక్క దానివే తినకపోతే?!" అన్నాడు. అట్లా అడిగితే ఎవరైనా ఎందుకిస్తారు? అందుకని వెంటనే చంద్రిక కూడా "ఆ చాల్లే! గుడ్ల గూబ ముఖమూ నువ్వునూ! నాకేదైనా లాభమా నీకు ఇస్తే?! నాకూ లాభం రావాలి కదరా, అన్నయ్యా?!" అంది. వెంటనే మన వాడి మెదడు కాంతి వేగంతో పని చేసింది. ఇప్పుడు తను వెళ్ళి జేజి తాతయ్యని అడిగినా ఆయన తనకు డబ్బులు ఇవ్వడు. కారణం తను ఎప్పుడూ జేజి గురించి పట్టించుకోడు. తనది నాయనమ్మ పార్టీ. తను ఆవిడ మాటే వింటాడు. అవసరం వచ్చినపుడే మాట్లాడతాడు జేజి తాతయ్యతో. అంతే కాక ఆయన ఏమైనా సాయం అడిగితే కూడా, ఈ తుంటరివాడు సేవ చేయడు.   అందుకని వెంటనే తన తీరు మార్చాడు వాడు: "ఎంత మాట అన్నావు చెల్లెమ్మా! మాటలతోటే పల్టీ కొట్టించావు. సరే, నేను ఓటమిని అంగీకరిస్తాను. మరైతే నేను నాన్నను చమత్కారంగా పల్టీ కొట్టించాననుకో, అప్పుడు మరి నువ్వు తెచ్చుకున్న లడ్డూల్లోంచి నాలుగు లడ్డూలిస్తావా?" అన్నాడు చంద్రికతో. "ఇంత ముచ్చటగా అడిగావు కాబట్టి, సరే అగ్రజా! ఈ ఒప్పందం నాకు ఒకే" అంది చంద్రిక. అసలు కథ ఏంటంటే, తను డజను లడ్లు తెచ్చుకునే ముందు జేజి తాతయ్యకు మాట ఇచ్చింది: "ఆరు నాకు, ఆరు అన్నయ్యకు" అని. 'ఇప్పుడు వీడు నాలుగు చాలు' అంటున్నాడు.. 'మరింకేమి?' అని, ఆ పాప పథకం. వెంటనే వాళ్ల నాన్న దగ్గరకు వెళ్ళాడు బాల. "నాన్నా ! నీ వెంట్రుకలు ఏమిటో తెల్లబడి పోతున్నాయి. ఎందువల్లంటావు?" అన్నాడు. న్యూస్‌పేపర్‌ చదువుతున్న తండ్రికి కొడుకు పథకం పూర్తిగా అర్థమైంది. తను ఏమి అనాలని వాడు ఆశిస్తున్నాడో, ఆ తర్వాత వాడు ఏమి అనబోతున్నాడో కూడా తండ్రికి అర్థం అయ్యింది. అయినా కొడుకు ముచ్చట తీర్చటం కోసం "ఒరేయ్‌ బాలా! ఏ కొడుకైనా అల్లరి పనులు చేసినా, అబద్ధాలు చెప్పినా, వెంటనే వాళ్ల నాన్న వెంట్రుకలు ఒక్కొక్కటి చొప్పున తెల్లబడిపోతాయి" అని బదులిచ్చి, ముఖాన్ని పేపర్లో దాచుకున్నాడు. వెంటనే బాల అద్భుతమైన దొంగ సమయస్ఫూర్తితో "అవునా, నాన్నా! నువ్వెన్ని తప్పులు చేసావో, మరెన్ని అబద్ధాలు చెప్పావో కదా మరి, మన జేజి తాతయ్య గడ్డం, మీసాలు, తలవెంట్రుకలు సైతం తెల్లబడిపోయాయి. నాకంటే ఎక్కువ తప్పులు నువ్వే చేసి ఉండాలి కద, నాన్నా?! నక్షత్రకుడిలా మీ నాన్నని పీడించి వుంటావు!" అన్నాడు. ఈ మాటలకి రాఘవరావు ఖంగు తిన్నట్లుగా నటించాడు. ఆనక తేలుకుట్టిన దొంగ వేషం వేసి, అవాక్కుగా కూర్చుండిపోయాడు. పక్కనే ఉన్న పరంధామయ్యకు ఈ జోకు పాతదే అని తెలీదు. మనుమడి తుంటరి సమాధానం వాడి సొంత తెలివే అనుకున్నాడాయన. దాంతో ఉల్లాసంగా బోసి నవ్వులు నవ్వాడు. బాలా వాళ్లమ్మ సుగుణ పగలబడి నవ్వింది. అత్తయ్యకు టీ ఇస్తూ. ఒప్పందం ప్రకారం చెల్లెలు గొల్లున నవ్వుతూనే నాలుగు లడ్డూల్ని వాడికి అందించింది. అటుపైన, వాడు అటు తిరగ్గానే మిగిలిన ఎనిమిది లడ్డూలనీ తాతయ్యకి చూపించి కన్నుగీటి, ఒక లడ్డూని నేరుగా ఆయన నోటికి అందించింది! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

సరైన పాలకుడు

సరైన పాలకుడు     చాలా కాలంక్రితం దక్షిణాపథానికి విజయసింహుడు అనే చక్రవర్తి ఏలికగా ఉండేవాడు. ప్రజలకు ఎలాంటి లోటూ రానివ్వకుండా పరిపాలించేవాడు ఆయన. వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల రాజ్యం అంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేది. ఆయన ఏలుబడి క్రింద అనేక సామంత రాజ్యాలు ఉండేవి. ఎందరో రాజులు ఆయనకు లోబడి నడచుకునేవాళ్ళు. ఒకరోజు విజయసింహునికి ఒక ఆలోచన వచ్చింది: "మనకు ఇంతమంది సామంతులున్నారు- అయినా వాళ్ళకు ఒకరంటే ఒకరికి సరిపోవట్లేదు. పొరపొచ్చాలు రావటానికి ప్రథాన కారణం, వాళ్ళకు ఒకరి గురించి ఒకరికి తెలియక పోవటం. అందువల్ల మనం త్వరలో ఒక విందును ఏర్పాటు చేసి, వాళ్లందరినీ ఆహ్వానిద్దాం! వాళ్లంతా ఒకరితో ఒకరు కలిసి చర్చించుకునే సందర్భాన్ని కల్పిద్దాం. అట్లా చేస్తే వాళ్లందరి మధ్య సయోధ్య కుదురుతుంది; ఒకరికొకరు మిత్రులౌతారు. అదే సందర్భంలో వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారో వాళ్ల నోటి ద్వారానే విందాం! గొప్పగా పరిపాలిస్తున్న రాజ్యాధినేతలను గౌరవిస్తూ, ప్రోత్సాహక బహుమతులు ఇద్దాం!" అని. వెంటనే మహామంత్రి వివిధ రాజ్యాధీశులందరికీ పేరు పేరునా ఆహ్వానాలు పంపించాడు. అనేకమంది రాజులు, సామంతులు, ఆయా రాజ్యాలలోని ధనికులు- అందరూ విజయసింహ మహారాజు నిర్వహిస్తున్న విందుకు విచ్చేసారు. మహారాజుతో సహా అందరూ వారికి గౌరవంగా స్వాగతం పలికి తగిన వసతులు ఏర్పరచారు. ఆరోజు విందు ముగిసిన తరువాత, మహామంత్రి లేచి, వివిధ రాజ్యల నుంచి వచ్చిన రాజులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఆర్యులారా! మా ఆహ్వానం అందుకొని మీరంతా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తమరు కొంత సమయం తీసుకొని తమరి గురించీ, తమరి రాజ్యాల గురించీ, తమరి పరిపాలన గురించీ క్లుప్తంగా చెప్పవలసిందిగా మనవి. ఆ విధంగా మీరు చేస్తున్న మంచి పనుల గురించి మిగిలిన పాలకులందరికీ తెలుస్తుందనీ, వాటి అమలు వల్ల ఇతర రాజ్యాల ప్రజలకు కూడా మేలు కలుగుతుందని చక్రవర్తుల వారి భావన!" అన్నాడు.     అప్పుడు కోసలదేశపు మహారాజు లేచి నిలబడి గంభీరంగా "మహారాజా! నేను పది రాజ్యాలను గెలిచాను. నా ఖజానా నిండా ఎనలేని బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, నగలు ఉన్నాయి. నావద్ద ఉన్నంత సంపద మన దక్షిణాపథంలో ఎవ్వరి వద్దా లేదు. యావద్దక్షిణాపథంలో నన్ను మించిన వారు లేరు" అని చెప్పి కుర్చున్నాడు. వెంటనే కళింగ మహారాజు లేచి గట్టిగా నవ్వి, "నీ సొత్తుకు మూడింతల సొమ్ము ఉంది, నా దగ్గర. పైపెచ్చు పధ్నాలుగు మండలాలు పూర్తిగా నా ఆధీనంలో ఉన్నాయి. ఇరవై వేల మంది సైనికుల బలం మాది. కేవలం ప్రభుత్వ వినియోగం కోసమనే మూడు వేల ఎకరాల భూమి ఉంది మాకు!" అని చెప్పి కూర్చున్నాడు. ఆ వెంటనే పకపకా నవ్వుకుంటూ విజయనగర మహారాజు లేచాడు. "మాకు ఐదు వేల ఎకరాల భూమి ఉంది. మీకు లేనంత ధనము, సైనిక బలము ఉన్నాయి. మీరు మాకన్నా దేనిలోనూ ఎక్కువ కాదు! నేను ఎందరు రాజులను ఓడించి చెరసాలలో బంధించానో లెక్కలేదు: అని కూర్చున్నాడు. ఈ విధంగా రాజులందరూ ఒక్కొక్కరూ తమ గొప్పతనాన్ని తమ ముందు రాజులు చెప్పిన సంపద లెక్కలతో పోల్చి చెప్పుకుంటూ పోయారు. చివరికి, అంగ మహారాజు లేచాడు. ముందుగా సభలోని వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పి, ఆనక విజయసింహ మహారాజుతో చెప్పాడు: "మహారాజా! తమరి సామ్రాజ్యపు సరిహద్దున ఉన్న చిన్న దేశం మాది. ఈ రాజులందరూ చెప్పినన్ని మొత్తాలు మా ఖజానాలో ఏనాడూ లేవు. అయినప్పటికీ మేము మా రాజ్యంలో ఎన్నో చెరువులు, బావులు త్రవ్వుకున్నాం. చక్కని రోడ్లు వేసుకున్నాం. రాజ్యంలోని ప్రజలందరికీ కనీస ఆహార,గృహ వసతులను, పిల్లలు చదువుకునేందుకు చక్కని పాఠశాలలను ఏర్పరచుకున్నాం.     మా సైనికులకు, వారి కుటుంబాలకు వసతులు ఏర్పరచుకున్నాం. ఇవన్నీ మా ప్రజల మంచితనం వల్ల, క్రమశిక్షణ వల్ల వీలైనాయి. ఇక ఇంతకంటే గొప్ప పనులు ఐతే మేము ఏమీ చేయలేదు: అని ముగించి కూర్చున్నాడు. సభ అంతా కొద్ది సేపు నిశ్శబ్దమైపోయింది. తర్వాత రాజులు, మహరాజులతో అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సభంతా హర్షధ్వానాలతో నిండిపోయింది. విజయసింహుడు అంగరాజును అభినం-దిస్తూ " 'రాజు తన ఖజానా గురించి కాక, ప్రజల బాగు గురించి తపించాలి' అని మాకందరికీ నేర్పించిన అంగ ప్రభువులవారు మాకు గురు తుల్యులు. వారికి మనసారా నమస్కరిస్తూ, రాబోయే పది సంవత్సరాల వరకు అంగరాజ్యం వారు మాకు కట్టవలసిన కప్పాన్ని పూర్తిగా మినహాయిస్తున్నాం" అని ప్రకటించాడు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో    

అమ్మ మాట వినకపోతే

అమ్మ మాట వినకపోతే     నేనూ, మా అన్న ఉండేవాళ్ళం, మా యింటికల్లా పిల్లలం. మా ఇంటికెవరేనా పిల్లలొస్తే మాకెంతో సంతోషంగా ఉండేది. ఎవరూ లేనప్పుడు, మేం చదవనప్పుడూ మేమిద్దరం ఆడుకునేవాళ్లం. ఇలా ఉంటుంటే- మా యింటికి చుట్టాలొచ్చారు. వాళ్లతో వాళ్ల పిల్లలు ముగ్గురు వచ్చారు- సూర్యం, భాస్కరం, నారాయణ. మాకు లేక లేక నేస్తాలు దొరకడం మూలాన్నీ, మా నాన్నగారు ఇంట్లో లేని మూలాన్నీ ఆ వేళ మధ్యాహ్నం అంతా ఆటలాడేశాం. ఆ వేళ పౌర్ణమి రాత్రి వెన్నెట్లో దొంగాటాడుదాం అని పెంద్రాళే అందరం అన్నాలు తినేశాం. మా అన్నావాళ్ళు అప్పుడే మా యింటి ముందర సిద్ధంగా కూర్చున్నారు.   నేను కూడా వెళ్ళిపోతుంటే, మా అమ్మ అంది-"నాయనా! పొద్దున్నుంచి పుస్తకం ముట్టుకోలేదు కదా! ఇప్పుడేనా చదవరాదూ? రాత్రిళ్ళు ఆటలేమిటీ? పురుగూ పుట్రాను!" అంది. నేనన్నానూ-"అమ్మా! పొద్దున్నేకదే పుస్తకాల పెట్టి సర్దేనూ? పుస్తకం ముట్టుకోలేదంటావేం?" అని, అమ్మ ఒద్దంటున్నా కూడా‌ వినకుండా పెరట్లోకి పారిపోయాను. సరే, దొంగాటకి పంటలేసుకున్నాం. సూర్యం దొంగయ్యాడు. ఉన్నవాళ్ళలోకి నేనే కొంచెం చిన్నవాణ్ణి. అందుచేత నన్నే సూర్యం తరిమాడు. పరిగెడుతూ కంగారులో ఓ కప్పని తొక్కాను. బెదిరిపోయి నాలాగే గెంతుతున్న ఆ కప్ప నా కాళ్ళకింద పడింది. ఆ కంగారుతో వరండాలోకి పరిగెత్తాను. పొద్దున్న తిని పారేసిన అరిటిపండు తొక్కమీద కాలు పడింది. అది బోరగిల్లా ఉందేమో, పడీ పడ్డంతోటే కాలు జారి కింద పడ్డాను. తలకి, మోచేతికి దెబ్బలు తగిలాయి.     అప్పుడే ఆఫీసునుంచి వస్తున్న మా నాన్నారు నన్నప్పుడు తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టి సేదతీర్చిన తరువాత, తాపీగా నే చెప్పిందంతా విని ఫక్కున నవ్వి, అన్నారు: "చూశావా! అమ్మకి పెంకి సమాధానం చెప్పి, అమ్మ వద్దంటున్నా ఆటకి వెళ్ళినందుకు ప్రతిఫలం చూశావా! అమ్మ మాటే వినుంటే నీకు ఈ తిప్పలే లేకపోను గదా" అని బుద్ధి చెప్పారు. తక్కిన పిల్లలంతా బొమ్మల్లా నిలబడిపోయారు. అప్పడ్నించి నేను అమ్మ చెప్పినట్లు విని బుద్ధిగా ఉంటున్నాను. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పరివర్తన 

పరివర్తన    శ్రావణి వాళ్ళ తరగతిలో‌ పిల్లలందరూ పాఠాలను శ్రద్ధగా వినేవారు ఒకరు తప్ప. ఆ వినని పిల్లాడు కలెక్టరు గారి అబ్బాయి బబ్లు. అతను చివరి బల్ల మీద కూర్చుని బాగా అల్లరి చేసేవాడు. అందరినీ ఏడిపించేవాడు. అయినా ఎవ్వరూ అతన్ని తప్పు పట్టేవాళ్ళు కారు కలెక్టరు గారి అబ్బాయి కనుక. ఒకరోజున శ్రావణి వాళ్ళ తరగతికి హెడ్మాస్టర్ గారు వచ్చారు. "ఉపాధ్యాయ దినోత్సవానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నది. ఆ రోజున ప్రతి తరగతి నుండీ ఒకరు మాట్లాడాల్సి ఉంటుంది: ఉపాధ్యాయుల గొప్పదనం గురించి చెప్పాలి. మరి మీ తరగతి నుండి ఎవరు మాట్లాడతారు?" అడిగారు. శ్రావణి టక్కున చెప్పేసింది: "మా తరగతి నుంచి బబ్లు వస్తాడండి" అని.   బబ్లు చకాలున తల ఎత్తాడు. "నేను రాను!" అని అరుద్దామనుకున్నాడు. అయితే అంతలోనే హెడ్మాస్టరుగారు బబ్లూని నిలబడమని, విపరీతంగా మెచ్చుకునేశారు: "నాకు చాలా సంతోషంగా ఉంది. బబ్లూ ఇచ్చే స్పీచ్‌ని వినేందుకు మేమందరం ఎదురు చూస్తూంటాం" అని చెప్పేసారు. దాంతో బబ్లు నోరు మూత పడింది. అందరి ముందూ "ఇది మోసం! నేను మాట్లాడను!‌ ఇదంతా కావాలని చేసింది శ్రావణి!" అని అనలేకపోయాడు. బిక్క మొహం‌ పెట్టుకొని ఊరుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ల నాన్న అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి,"నాన్నా! ఉపాధ్యాయుల గొప్పదనం గురించి ఏమని చెప్పాలి? వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళా, నాన్నా?" అని అడిగాడు బబ్లు. "అవును బబ్లూ! వాళ్ళు చెప్పే చదువు వల్లనే మనకి ప్రపంచం గురించి తెలుస్తుంది. అందుకే‌ గురువులను దైవంతో పోల్చారు.    నేను ఈరోజున ఈ స్థానంలో ఉన్నానంటే అది మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల వల్లనే!" అన్నాడు బబ్లూ వాళ్ళ నాన్న. ఆ తర్వాత బబ్లూ తోటమాలి దగ్గరకు వెళ్ళాడు. "అంకుల్, అంకుల్! టీచర్లు నిజంగా గొప్పవాళ్ళేనంటావా?" అని అడిగాడు. "అవును చిన్నబాబూ! వాళ్ల వల్లనే మనమూ గొప్పవాళ్లమౌతాం" అన్నాడు తోటమాలి. "అవునా? మరి వాళ్ళంతా నిజంగానే గొప్పవాళ్లయితే, మరి నువ్వు తోటమాలిలా ఎందుకు ఉన్నావ్? నువ్వూ ఏ కలెక్టరో, సర్పంచో, డాక్టరో అయి ఉండొచ్చుగా?" అన్నాడు బబ్లూ, తెలివిగా. తోటమాలి విచారంగా ముఖం పెట్టి "నేను వాళ్ల మాట వినకపోవడంతో ఇదిగో, ఇట్లా అయ్యాను. అటూ ఇటూ కాకుండా సరిగ్గా స్థిరపడలేకపోయాను" అన్నాడు.   "అదేంటి? చదువుకునే రోజుల్లో నువ్వు ఏం‌చేసేవాడివి?" అడిగాడు బబ్లు. "నేను వెనక బెంచీలో కూర్చుని పిల్లికూతలు కూసేవాడిని" అని తోటమాలి అనగానే బబ్లూకి తన భవిష్యత్తు కనిపించింది. ఉపాధ్యాయ దినోత్సవంనాడు బబ్లు చాలా చక్కగా మాట్లాడాడు. అందరూ అతన్ని బలే మెచ్చుకున్నారు. బబ్లూకి ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషం అనిపించింది. తరవాత వాడు శ్రావణి దగ్గరికి వెళ్ళి "నువ్వు హెడ్మాస్టరు గారికి నా పేరు చెప్పగానే ముందు చాలా కోపం వచ్చింది. కానీ నువ్వు నాలో మార్పు తెచ్చేందుకే అలా చేశావని తెలుసుకున్నాను. నన్ను క్షమించు" అన్నాడు. "అయ్యయ్యో, అట్లా అంటావేంటి? నీలో మంచి మార్పు తీసుకురావడం నా బాధ్యత! నేను నిన్ను మార్చాననుకో, అప్పుడు నాకు గురువును అయినంత సంతోషం వస్తుంది ..." అన్నది శ్రావణి నవ్వుతూ.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

హంస కధ

హంస కధ   అనగనగా ఓ హంస. ఆ హంస ఒకసారి ఓ చక్కని చెరువులో ఈత కొడుతూ తిరుగుతున్నది, తోటి హంసలతో బాటు. సరిగ్గా ఆ సమయానికే అ దేశపు మహారాజు ఏదో పని మీద వెళుతూ ఉన్నాడు ఆ త్రోవలో. వెళుతూ వెళుతూ దాహం తీర్చుకోవటంకోసం ఆయన చెరువులోకి దిగాడు. ఆయన్ని చూడగానే హంసలన్నీ ఎగిరిపోయాయి- కానీ మన హంస మాత్రం, పరధ్యానంలో ఉండి రాజు దగ్గరకే ఎగిరి వచ్చి, ఆయన చేతచిక్కింది. ఆ మహారాజు కూడా పాపం మంచివాడు- ఆ హంసను ఏమీ చేయలేదు. ఊరికే దాని రెక్కలను దువ్వి విడిచి పెట్టేశాడు. దానికి ఆ హంస చాలా ఆనందపడి "ఓ మహారాజా! నీ చేత చిక్కినా కూడా నాకు ఏ ఆపదా కలిగించకుండా విడిచి పెట్టావు. అందుకు కృతజ్ఞతగా నేను నీకొక సహాయం చేస్తాను. మా దేశంలో మహారాజుకు ఓ కుమార్తె ఉంది. ఆ అమ్మాయి చాలా చక్కనిది, మంచిది, అనేక శాస్త్రాలు చదివింది. నువ్వూ మంచివాడివే కనుక, నేను ఏం చేస్తానంటే- ఆమెకు నీ గురించి చెబుతాను. ఎలాగైనా ఆమెకు నువ్వంటే ఇష్టమయ్యేలా చేస్తాను. మరి నువ్వు కొన్ని రోజుల తర్వాత మా దేశానికి వచ్చి ఆ అమ్మాయిని పెళ్ళాడు!" అన్నది. రాజు అంగీకరించాడు. ఆ హంస అన్నంత పనీ చేసింది. తమ దేశపు యువరాణి దగ్గరకు వెళ్ళింది. ఆ యువరాణికి అందకుండా పరిగెత్తింది, మళ్ళీ ఆమె చేతికి చిక్కింది, ఆమెను మురిపించింది, ఆపైన 'త్ర-త్ర' అనుకుంటూ ఇట్లా మాట్లాడింది.   సహస్ర పత్రాసన పత్రహంస వంశస్య పత్రాణి పతత్రిణః స్మ !  అస్మాదృశాం చాటురసామృతాని స్వర్లోకలోకేతరదుర్లభాని    "అమ్మాయీ! నేను బ్రహ్మవాహనమైన హంసల కుటుంబానికి చెందిన దాన్ని. నేను మాట్లాడే చమత్కారమైన మాటలు వినటం దేవతలకు కూడా సాధ్యంకాదు" అని దీని అర్థం. అట్లా తన పాండిత్యంతోటి ఆమెను మెప్పిస్తూ, మెల్లగా మాటలు కలిపింది; తను మాట యిచ్చిన మహారాజు రూప లావణ్యాల గురించి, శౌర్య ప్రతాపాల గురించి చెప్పింది; ఇలా చక్కటి దూతగా తన పని చేసింది. ఆపైన ఆ మహారాజు, వీళ్ల రాజ్యానికి రావటం, స్వయంవరంలో పాల్గొని యువరాణిని పెళ్ళాడటం జరిగిపోయింది! ఆ మహారాజు పేరు నలుడు. యువరాణి దమయంతి! ఈ కథలో హంసను చేర్చి, అందంగా తీర్చిన కవి పేరు 'శ్రీహర్షుడు'. ఆయన సంస్కృతంలో వ్రాసిన కావ్యం పేరు 'నైషధీయచరితమ్'. ఈ కావ్యాన్నే కవిసార్వభౌముడైన శ్రీనాథుడు 'శృంగారనైషధమ్' అన్న పేరుతో తెలుగులోకి అనువదించాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో