జింక రాజు కథ

  జింక రాజు కథ బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అతనికి ఉండే వ్యసనాల్లో ఒకటి, వేట. కాశీ యువరాజుకి కొంత సమయం చిక్కిందంటే చాలు, వేటాడేందుకు అడవిలోకి పోయేవాడు. ధనుర్బాణాలు ధరించి, గుర్రాన్నెక్కి కాలయముడిలా సంచరించే బ్రహ్మదత్తుడిని చూస్తే అడవిలోని జంతువులన్నీ వణికి పోయేవి. అతని వల్ల జంతువులన్నిటిలోనూ ఎక్కువ నష్టపోయింది జింకలు. కాశీ రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవుల్లో లెక్కలేనన్ని జింకలు ప్రశాంతంగా జీవించేవి. ఇప్పుడవన్నీ భయంతో బక్కచిక్కిపోసాగాయి.   వాటన్నిటికీ రాజుగా ఉండిన బోధిసత్త్వుడు ఒకనాడు తోటి జింకలన్నిటినీ సమావేశపరచి, "మిత్రులారా, అనేక తరాలుగా మనవాళ్లంతా ఎలాంటి దురవస్థలూ లేక సుఖంగా జీవించటానికి అలవాటుపడి ఉన్నారు. మన శరీరాలన్నీ బాగా క్రొవ్వు పట్టినై, ఎముకల సంధులు కావలసినంత చురుకుగా కదలటం లేదు. ఇప్పుడు యీ కాశీ యువరాజు పేరిట ఆపద ముంచుకొచ్చే సరికి, మనం అతని బాణాలకు సులభంగా చిక్కుకుంటున్నాం. అందువల్ల మనందరం మన శరీరాలను బాగుచేసుకోవాలి; మన చురుకుదనం పెంచుకోవలసి ఉన్నది. అయితే బ్రహ్మదత్తుని తీరు చూస్తే ఆ లోగానే మనం ఎవ్వరం మిగలని పరిస్థితులు ఎదురవుతామేమో అనిపిస్తున్నది. ఉత్తమ సంస్కారాలను అనేకాన్ని ప్రోది చేసుకున్న కారణంగానే యీ బ్రహ్మదత్తు కాశీ యువరాజుగా జన్మించాడు. అయితే ఏనాటి దుష్ట కర్మలో అతన్ని యీ మారణ పర్వంలో భాగస్వామిని చేస్తున్నాయి. అతనిలో కరుణ బలపడితే తప్ప మన కష్టాలు పూర్తిగా తీరవు. దానికై మనం పెను త్యాగాలకు సిద్ధమవ్వాలి. మీరంతా సరేనంటే నేను అతనితో మాట్లాడతాను" అన్నది. జింకలన్నీ సమ్మతించిన మీదట, ఆరోజు వేటకై బయలుదేరిన బ్రహ్మదత్తుడికి అడవి అంచునే ఎదురేగి, ప్రేమ పూరితమైన స్వరంతో, మానవ భాషలో- "యువరాజా! నీ బలసంపదకు ఎదురొడ్డి నిలువలేని జింకల సమూహం కొద్ది నెలల్లోనే, నీ ప్రతాపం వల్ల వందల సంఖ్యకు చేరుకున్నది. మిగిలి ఉన్న జింకలు కూడా తమ జీవన క్రియలన్నిటినీ ప్రక్కన పెట్టి భయంతో ముడుచుకొని పోయాయి. ఇదే గనక కొనసాగితే ఇక యీ అడవులలో జింక అన్నదే కనిపించకుండా పోతుంది. అందువల్ల నువ్వు మా మీద దయ చూపాలి. మమ్మల్ని వధించరాదు" అన్నది. బ్రహ్మదత్తుడు దాని మాటలకు నవ్వి "ప్రభువులు మృగయా వినోదులు. కాబట్టి నన్ను వేటాడవద్దనే అధికారం మీకు లేదు. అయితే మీరంతా మా రాజ్యంలోని ప్రాణులు- కనుక మీ కోరికని నేను మనసులో పెట్టుకుంటాను- అయితే దాని వల్ల నాకేమి లాభం?" అన్నాడు. "ఏ ప్రాణి పట్ల అయినా మీ మనసులో ఉదయించే కరుణ మీకు ఎనలేని మేలు చేస్తుంది. ప్రభువులైన తమకు మాబోటి అల్పజీవులు చేయగల మేలు అంతకంటే ఏముంటుంది?" అన్నది జింకరాజు. "అలా కాదు. నేను మీ జాతినంతటినీ ఏమీ చేయకుండా వదులుతాను. మీరు నిశ్చితంగా బ్రతకవచ్చు. అయితే దానికి బదులుగా, మీలో రోజుకొకరు నాకు ఆహారం అవుతూ ఉండాలి. అది మీ జాతి పట్ల మీకున్న నిబద్ధతను సూచిస్తుంది; నేను ఇచ్చిన మాటను కూడా నాకు ఏరోజుకు ఆరోజు గుర్తు చేస్తుంటుంది" అన్నాడు బ్రహ్మదత్తుడు. జింకల రాజు మిగిలిన జింకలకేసి జాలిగా చూసింది. అవి సమ్మతిస్తూ తలలు ఊపిన మీదట, అది బ్రహ్మదత్తుడికి తమ అంగీకారాన్ని తెలియజేసింది. ఆ రోజునే జింకలన్నీ వంతులు వేసుకున్నాయి; రోజుకొక జింక చొప్పున యువరాజుకు ఆహారమౌతూ వచ్చింది. ప్రతిరోజూ ఒక జింకను అడవి అంచున నిలిపే బాధ్యత జింకరాజుది. జింకల జీవితాలు త్వరలోనే సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎటొచ్చీ రోజుకు ఒక జింక నిశ్శబ్దంగా అదృశ్యం అయిపోయేది; అయితే మిగిలిన జింకల్లో నిర్భయత పెరిగింది; అవి తిరిగి బలం పుంజుకున్నాయి; వాటి శరీరాలు చురుకుగా తయారయ్యాయి. జింకల సంతతి తిరిగి పెరగనారం లభించింది. ఆ సమయంలో ఒకసారి యువరాజుకు ఆహారంగా వెళ్లే వంతు ఒక ఆడ జింకదైంది. అది ఆ సమయంలో నిండు గర్భిణి. 'తన పిల్లను యీ లోకంలోకి తెచ్చే ముందుగానే తన జీవితం ముగియనున్నదే' అని దానికి చాలా దు:ఖం వచ్చింది. దాన్ని అడవి దాటించేందుకు వచ్చిన జింకరాజుకు దాని దు:ఖం అర్థమైంది-"జింకల సంతతిని తిరిగి వృద్ధి చేసేందుకు గదా, యువరాజుతో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్నది? ఇప్పుడు ఇలా నిండు గర్భిణిని అతనికి ఆహారంగా పంపటం ఎంత తెలివి తక్కువ పని?!" అని ఆలోచించి, దాన్ని ఊరడిస్తూ "తల్లీ! వంతును మళ్లీ ఏదో ఒకనాటికి మార్చుకుందువు. ఇవాల్టికి ఏదో ఒక విధంగా ఆ ఖాళీని భర్తీ చేస్తాను. నువ్వు పో!" అని దాన్ని వెనక్కి పంపించేసింది. ఆనాడు స్వయంగా తనకు ఆహారం అయ్యేందుకు వచ్చిన జింకరాజును చూసి బ్రహ్మదత్తుడికి చాలా ఆశ్చర్యం వేసింది. "ఏంటి ఇది? ఇవాళ్ల నువ్వే వచ్చావెందుకు? మిగిలిన జింకలేమైనాయి?" అని అడిగాడు దాన్ని. జింకరాజు అతనికి జరిగిన సంగతిని వివరించి, "రాజా! నేను లేకున్నా మా జాతి వారు తమ మాట తప్పరు. నువ్వు నిశ్చింతగా నన్ను చంపవచ్చు; ఏమీ పర్వాలేదు" అన్నది.   "కాదు, నువ్వు వెళ్లి వేరే జింకను దేన్నైనా పంపు. నిన్ను చంపటం నాకెందుకో ఇష్టం కావట్లేదు" అన్నాడు బ్రహ్మదత్తుడు, కలవరపడుతూ. జింకరాజు నవ్వి "యువరాజా! శరీరం అంటూ ఒకటి ఉన్నప్పుడు దానికి కష్టాలు తప్పవు. చిన్నతనంలోను, యౌవనంలోను, మధ్య వయస్సులోను, ముసలితనంలో కూడాను ఎక్కడి దు:ఖం అక్కడ, ఉండనే ఉన్నది. రాజైన వాడు దు:ఖాన్ని అధిగమించి ఇతరులకు మార్గదర్శకుడు కావాలి తప్ప, తన శరీర రక్షణ కోసం ప్రజలను బలి చెయ్యకూడదు." అన్నది. ఆ క్షణంలోనే యువరాజులో అనంతమైన పశ్చాత్తాపం నెలకొన్నది. "రాజ ధర్మాన్ని నిలుపుకునేందుకు సాధారణమైన జింక ఒకటి తన ప్రాణాలను అలవోకగా త్యజించబోయిందే, మరి తను? ఇన్ని ప్రాణులకు ప్రభువైన తను నిస్సిగ్గుగా ఆ ప్రాణులను ఎలా హింసిస్తున్నాడు, ఇన్నాళ్లుగా?! నిజానికి వాటిని అన్నిటినీ కాపాడవలసిన బాధ్యత తనదే; తను 'వేట' అనే యీ కౄరకర్మలో ఎందుకు కూరుకుపోయాడు?” తక్షణం అతనిలో హృదయ పరివర్తన కలిగింది. జింకరాజులో బోధిసత్త్వుడిని దర్శించిన యువరాజు దాని ముందు మోకరిల్లాడు. అటుపైన అతను ఇక ఏనాడూ వేటాడలేదు; జంతువుల్ని హింసించలేదు!! Courtesy.. kottapalli.in  

కప్ప- రాకుమారుడు

 కప్ప- రాకుమారుడు ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతి రోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటుండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది. "అయ్యో నా అందమైన బంతి", అంటూ ఏడ్చిందా యువరాణి. "ఏమయింది యువరాణి?" అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కన్పించింది. "నా బంతి బావిలో పడిపోయింది" ఏడుస్తూ చెప్పింది యువరాణి. "ఏడవకు", అంది కప్ప. "నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు?" అని అడిగింది. "నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా?" అని అడిగింది యువరాణి."అవేవీ కావు! నన్ను నీ స్నేహితుడిలా చేసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్‌పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్లేంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి, అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను". అంది కప్ప. "సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను", అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది. అంతే యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం 'కృతజ్ఞతలు' కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగుపెట్టింది. "ఆగు, ఆగు", అని అరిచింది కప్ప. కాని యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీలేక బావిలోకి జారుకుంది.మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది. "ఏమయింది, తల్లీ?" అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి."ఎలాంటి పరిస్ధితిలో నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కప్పను ఇంట్లోకి రానివ్వు" అన్నాడు రాజు.యువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్లి, కుర్చీ పైకి ఎక్కింది. "నన్ను పైకి తీసుకో. నేను నీ బంగారు పళ్లెంలో భుజించాలి" అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్లెం చేత్తో పట్టుకుని, కప్పను ముట్టుకోగానే, అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది. "నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది". అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు.అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు, అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు.  

బర్రె-పిల్లి

బర్రె-పిల్లి ఊరికే రూపాన్ని చూసి మోసపోకండి పాపలూ, బాబులూ, జాగ్రత్త!" సేకరణ: యం.అశ్వని, ఎనిమిదవ తరగతి, పి.వి.ఆర్.జడ్.పి.హెచ్.స్కూల్, గుండువారి పల్లి, తలుపుల మండలం, అనంతపురం జిల్లా. అనగనగా ఒక కలుగులో ఒక చిట్టి ఎలుక, వాళ్ళ అమ్మ నివసిస్తూ ఉండేవి. చిట్టి ఎలుక పుట్టాక ఏనాడూ కలుగులోంచి బయటికి అడుగు పెట్టి ఎరుగదు- వాళ్ళమ్మ ముందుచూపుతో దానికి ఆర్నెల్లకు సరిపడా ఆహారాన్ని కలుగులో జమ చేసి పెట్టింది కదా, అందుకని. అయితే కలుగులో పెరిగీ పెరిగీ చిట్టి ఎలుకకు బయట ప్రపంచంలో ఏముంటుందో చూడాలని కోరిక బలపడిపోయింది. ఒక రోజున అది వాళ్ల అమ్మతో "అమ్మా...అమ్మా...నేను అట్లా కొంచెం సేపు బైట తిరిగి, ఎక్కడ ఏముందో‌ చూసి వస్తానమ్మా, ప్లీజ్!" అని అడిగింది. వాళ్ళ అమ్మకి దాని తెలివిని చూసి ముచ్చటేసింది. "సరేలే, పోయి చూసి రా! కానీ జాగ్రత్త, మరి- ఏది కనిపించినా దూరం నుంచే చూడు, తప్ప దగ్గరికి మాత్రం పోకు! వెనక్కి తిరిగి వచ్చాక ఏది ఎట్లా ఉందో చెప్పాలి నాకు, సరేనా?" అని హెచ్చరించి పంపింది.   కలుగులోంచి బయటికొచ్చిన చిట్టి ఎలుకకి ఈ ప్రపంచం అంతా చాలా అందంగా కనిపించింది. ఉషారుగా పాటలు పాడుకుంటూ అది కొంచెం దూరం పోయేసరికి దానికి భయంకరమైన జంతువొకటి కనిపించింది- పెద్దగా, నల్లగా, రెండు కొమ్ములు పెట్టుకొని- అది చిట్టి ఎలుక దగ్గరికల్లా మూతి తీసుకొచ్చి ఇట్లా "ఉఫ్......" అన్నది! చిట్టి ఎలుక కాస్తా వణికి పోయి, ఎటుపోతోందో కూడా చూసుకోకుండా పరుగు పెట్టింది. అంతలోనే ఆ జంతువు గట్టిగా "బా......వ్" మని అరిచింది! ఎలుక పిల్ల చటుక్కున దగ్గర్లో ఉన్న ఓ బండ మూలన నక్కి వెనక్కి చూసింది. ఆ జంతువు ఇప్పుడు తన ప్రక్కనే ఉన్న గడ్డిని పీక్కొని తింటున్నది: తెల్లగా మెరుస్తున్న దాని పళ్ళు గడ్డి పరకల్ని నములుతుంటే కరకరా శబ్దం‌ వస్తున్నది. వాటిని చూసే సరికి చిట్టి ఎలుకకు చెమటలు పోసాయి. కొద్ది సేపు దాన్ని అలాగే చూసాక అది మెల్లగా బండ వెనకకు అడుగులు వేసి, చటుక్కున కలుగు వైపుకు పరుగు పెట్టింది. అట్లా అది కలుగు అంచుకి చేరుకుని లోనికి దూరబోతుండగానే అల్లంత దూరాన మరొక జంతువు కనిపించింది దానికి. ఇది అస్సలు భయంకరంగా లేదు. మెత్తగా, తెల్లగా, ముద్దుగా ఉంది. దానికో చక్కని కుచ్చు తోక ఉంది. కళ్ళు పచ్చగా లేత ఆకులలాగా మెరుస్తున్నాయి. సన్న గొంతుతో "మ్యా..వ్" అంటోందది! "ఇది బలే ఉంది! వెళ్ళి దీంతో‌ పరిచయం చేసుకుంటాను.." అనుకున్నది ఎలుక పిల్ల. కానీ అంతలోనే కలుగులోంచి చటాలున దాన్ని లోపలికి లాక్కున్నది వాళ్ళ అమ్మ. అప్పుడు అమ్మ ఊపిరి బరువుగాను, ముఖం గంభీరంగాను ఉండినై. ఎలుక పిల్లకి భయం వేసింది- "కొంచెం సేపు అమ్మని మాట్లాడించ కూడదు" అని ఊరుకున్నది.   కొంచెం సేపటికి అమ్మ మామూలుగా అయ్యాక, అది అమ్మతో అన్నది- "అమ్మా! ఇవాళ్ల నాకు రెండు జంతువులు కనబడ్డాయి తెలుసా? ఒకటేమో మన ఇంటికి అల్లంత దూరాన ఉండింది. ఎంత నల్లగా భయంకరంగా ఉందో తెలుసా?! నామీద మూతి పెట్టి 'ఊఫ్..' అని ఊదితే, నేను ఎక్కడికో ఎగిరిపోయి పడ్డాను. ఆ తర్వాత అది 'బా...' అని ఎట్లా అరిచిందో! నేను భయపడి పోయాను" అన్నది. "గడ్డి తింటున్నదా, అది?" అడిగింది అమ్మ ఎలుక ఊపిరి బిగబట్టి. "అవునవును. దాని పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి" అన్నది ఎలుక పిల్ల. అమ్మ నవ్వింది. "దాన్ని బర్రె అంటారు. అది మనల్ని ఏమీ చెయ్యదు. చాలా మంచిదది" చెప్పింది అమ్మ. "మరి ఇంకొకటేమో చాలా అందంగా, ముద్దుగా ఉంది. దానికో చక్కని కుచ్చుతోక, మూతికంతా మీసాలు- బలే నవ్వొచ్చింది నాకు. అది నన్ను చూడగానే "మ్యా...వ్" అని ఎంచక్కా పలకరించింది. నాకు అది బలే నచ్చిందిలే. రేపు వెళ్ళి దానితో‌ పరిచయం చేసుకుంటాను" అన్నది చిట్టెలుక నవ్వు ముఖంతో. అమ్మ ముఖం భయంతో వణికింది. "ఆ పని మాత్రం చెయ్యకు. దాన్ని పిల్లి అంటారు. అది మనకు శత్రువు. నువ్వు దొరికావంటే చాలు- గబుక్కున మింగేసి పోతుందది. అది కనిపిస్తే చాలు- పారిపోవాలి మనం. ఊరికే రూపాన్ని చూసి మోసపోకు పాపా, జాగ్రత్త!" అని హెచ్చరిస్తూ దాన్ని హత్తుకున్నది తల్లి ఎలుక. Courtesy.. kottapalli.in

అపనమ్మకపు టింకీ

  నాగసముద్రానికి తూర్పున ఉన్న అడవిలో పింకీ, టింకీ, చంకీ అని మూడు కుందేళ్లు ఉన్నాయి. అవి మూడూ మంచి స్నేహితులు. ఓసారి ఆ మూడూ రామయ్య అనే రైతు తోటలో క్యారట్లు తింటూ ఉన్నాయి.       సరిగ్గా ఆ సమయానికే రామయ్య, అతని చిన్ననాటి స్నేహితుడు సోమనాథ్‌ ఇద్దరూ మాట్లాడుకుంటూ అటుగా వచ్చారు. "ప్రక్క ఊరిలో జాతర జరుగుతుందట, వెళ్దాం సోమనాథ్" అంటున్నాడు రామయ్య. ఆ సంగతి విన్నది టింకీ.   వెంటనే పరిగెత్తుకొని వచ్చి పింకీకి, చంకీకి ఆ సంగతి చెప్పింది. "మనం కూడా వెళ్దామా?" అంది. 'సరే' అని ముగ్గురూ జాతరకు బయలుదేరారు.     దారిలో ఈత కాయలు, నేరేడు పండ్లు కడుపునిండా తిన్నారు ముగ్గురూ. చివరకు జాతరకు చేరుకున్నారు. దేవుడిని దర్శించుకున్నారు. గుడి ప్రక్కనే ఐస్‌క్రీం బండి ఉంది. ముగ్గురికీ నోరు ఊరింది. వెంటనే అక్కడికి వెళ్లి తలా ఒక ఐస్‌క్రీం తీసుకున్నారు. అప్పుడు గుర్తొచ్చింది- వాళ్ల దగ్గర డబ్బు లేదు!     పింకీ, చంకీ ఐస్‌క్రీములు చేత బట్టుకొని అక్కడే నిలబడ్డాయి. "ఇంటికెళ్లి డబ్బులు తీసుకురా, టింకీ! గబుక్కున వచ్చేయి!" అని టింకీని ఇంటికి పంపించాయి. 'సరే' అని బయల్దేరింది టింకీ. అయితే వెంటనే దానికో అనుమానం వచ్చింది- "నేను వచ్చే లోపల వాళ్లు నా ఐస్‌క్రీం కూడా తినేస్తే ఎలాగ?" అని. అందుకని అది ఇంటికి పోకుండా ప్రక్కనే ఉన్న ఓ చెట్టు చాటున దాక్కొని, పింకీ-చంకీల చేతుల కేసే చూడటం మొదలు పెట్టింది. అరగంట దాటింది.. ఇంకా రాలేదు టింకీ. ఆలోగా ఐస్‌క్రీం మొత్తం కరిగిపోయి కారటం మొదలెట్టింది. "అయ్యో ఐస్‌క్రీం మొత్తం కారిపోతోందే" అని ఏడుపు మొహంతో దాన్ని నాకెయ్యబోయారు పింకీ-చంకీలు.   "ఏయ్! నాకు తెలుసు, మీరు మోసం చేసి, నా ఐస్‌క్రీం కూడా తినేస్తారని! అందుకనే, నేనసలు ఇంటికి వెళ్ళనే లేదు- ఇక్కడే, ఆ చెట్టు చాటున దాక్కొని చూస్తున్నాను!" అని ఇకిలించింది టింకీ, వాళ్ళ ముందుకు దూకి. మిత్రులిద్దరికీ పిచ్చి కోపం వచ్చింది.     "మమ్మల్ని క్షమించన్నా. ఇది ఇంత తెలివి తక్కువ దద్దమ్మ అనుకోలేదు- మేమిద్దరం వెంటనే ఇంటికెళ్ళి, పది నిముషాల్లో నీ డబ్బులు నీకు తెచ్చిస్తాం" అన్నాయవి ఐస్‌క్రీం బండి అతనితో. బండి అతను నవ్వి "ఈ టింకీ ఒట్టి దద్దమ్మే కాదు. దీనికి నమ్మకం అంటే ఏంటో కూడా తెలీదు. ముందు దీనికి స్నేహంగా ఉండటం నేర్పండి. నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదులే" అని బండిని నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు.   Courtesy.. kottapalli.in

మాయమయ్యే కథ

  మాయమయ్యే కథ     అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు రఘూత్తముడు. ఆయన మంచి రాజు. అయినా ఆయనకు తృప్తి లేదు. “ఈ లోకం ఎందుకు ఇలా చప్పగా ఉంది? నా చేతిలో ఏదైనా మ్యాజిక్ ఉంటే ఎంత బాగుంటుంది?!” అనుకుంటూ ఉండేవాడు ఆయన. ఒక రోజు గంగా నదిలో స్నానం చేస్తుంటే ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. "ఒక కోరికను కోరుకో" అని అడిగాడు రాజును. రాజు కొంచెం ఆలోచింది, "నేను తాకిందంతా‌ మాయం‌ అవ్వాలి" అని కోరాడు. దేవుడు "సరిగ్గా ఆలోచించుకున్నావా? అని అడిగాడు. “ఓఁ చాలా బాగా ఆలోచించుకున్నాను" అన్నాడు రాజు. "అయతే సరే, తథాస్తు" అని మాయం అయిపోయాడు దేవుడు. రాజు అప్పుడు ఇంక రాజ్యంలోకి వెళ్ళాడు. అంతలో రాజుగారి ప్రాణ స్నేహితుడు ఒకతను వచ్చాడు. అతని పేరు శివయ్య. రాజుగారు అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అంతే- రాజుగారి స్నేహితుడు కాస్తా మాయం అయిపోయాడు! రాజుగారు చాలా బాధపడ్డారు. ఆయన అట్లా బాధగా కూర్చొని ఉండగా ఆయన సైనికుడు ఒకడు వచ్చి కొన్ని లడ్డూలు ఇచ్చి తినమన్నాడు. రాజుగారికి వాటిని చూడగానే నోరు ఊరింది. అయితే ఆయన లడ్డూలను తాకాడో లేదో- అవి మాయమయ్యాయి! రాజుగారు మళ్ళీ బాధగా కూర్చున్నారు. తన చేతితో ఒక బంగారు కుండను తాకారు. తక్షణం అది కాస్తా మాయమయిపోయింది! అంతలోనే రాజుగారు కూర్చున్న బంగారు కుర్చీ కూడా మాయమయిపోయింది. రాజుగారి బాధకు అంతులేదు. మొదట తన ప్రాణ స్నేహితుడు, తర్వాత తన లడ్డూలు, బంగారు కుండ, బంగారు కుర్చీ‌- అన్నీ మాయమయిపోయాయి. ఇప్పుడు రాజుగారికి ఎక్కడ లేని ఆకలి! ఎక్కడా లేని దప్పిక! ఆకలి దప్పులంటే ఏమిటో తెలిసివచ్చాయాయనకు! ఇట్లా కొద్ది రోజులు గడిచాయి. ఏం అనుకొని రాజు ఈ కోరికను కోరాడో గాని, ఇప్పుడు మటుకు ఆయనకు అదే శాపంగా తోచసాగింది. ఇప్పుడాయన బక్కచిక్కిపోయాడు. కొంచెం సేపు కూడా ఎక్కడ మనసు నిలవకుండా అయ్యింది. ఎక్కడా కూడా కొంచెం సేపు ఉండలేడు! దేన్నీ‌ ముట్టుకోలేడు! చివరికి వేసారిపోయారు రాజుగారు. మళ్ళీ ఓసారి భక్తి శ్రద్ధలతో దేవుడిని ప్రార్థించారు. దేవుడికి రాజుగారి మీద దయ కలిగింది. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు దేవుడు- "ఏమైంది?! అంతా బాగుందా? నువ్వు తాకినవన్నీ‌ మాయం అవుతున్నాయా?" అని అడిగాడు చిరునవ్వుతో. జరిగినదంతా చెప్పారు రాజుగారు. దేవుడికి అర్థం అయ్యింది- రాజుగారి మనసు నిజంగానే మారింది. అందుకని ఆయన తన వరాన్ని తానే వెనక్కి తీసుకున్నాడు. మరుక్షణం రాజు గారి ప్రాణ స్నాహితుడు, లడ్డూలు, కుండ, బంగారు కుర్చీ, అన్నం, నీళ్ళు అన్నీ తిరిగి వచ్చాయి. రాజుగారు అంతులేని ఆనందంతో‌ స్నేహితుడ్ని కౌగిలించుకున్నారు; లడ్డూలు తిన్నారు;, బంగారు కుర్చీ మీద మహారాజులాగా ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు రాజు చాలా ఆనందంగా‌ఉన్నాడు! ఆయనకు లోకం చాలా బాగా కనిపిస్తోంది. మ్యాజిక్ మీద మోజు పోయింది. ఆ రోజంతా రాజుగారు పేదలకు దానం చేస్తూనే ఉన్నారు. ఆ పైన ఏనాడూ గొంతెమ్మ కోరికలు కోరలేదు- తనకు ఉన్న వాటితో చాలా ఆనందంగా గడిపారు.   - kottapalli.in సౌజన్యంతో

పరుగో పరుగు!

  పరుగో పరుగు!     అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దాని పేరు శశకం. ఒక రోజున అది మెల్లగా షికారుకు బయలుదేరింది.     "ఓయ్.. శశకం, జాగ్రత్త! మన అడవిలోకి భల్లూకం అని ఓ ఎలుగుబంటి కొత్తగా చేరుకున్నది. అది నీలాంటి చిన్న జంతువుల్ని చాలానే ఏడిపిస్తున్నదని విన్నాను" అన్నది చెట్టు మీదున్న కోతి- మర్కటం మామ. "అది నన్నేమీ అనదులే, మామా! అయినా నేను ఎక్కువ దూరం పోను" అన్నది శశకం. అంతలోనే తడుముకుంటూ దాని మీదికి వచ్చేసింది భల్లూకం. వికటంగా నవ్వుతూ "దొరికావు! రెండు రోజులనుండీ నీ కోసమే చూస్తున్నాను. ఇవాళ్ళ నా ఆహారం నువ్వే!" అన్నది. కుందేలు గజ గజ వణికింది. దానికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చేతుల్తో విసురుకోవటం మొదలు పెట్టింది. గబ గబా ఆలోచించింది.   "నువ్వు ఏ కుందేలు కోసం చూస్తున్నావు? చెమట పట్టిన కుందేలు కావాలా, చెమట లేని కుందేలు కావాలా, నీకు?" అని అడిగింది ఎలుగుబంటిని. "చెమట పట్టింది నాకెందుకు? చెమట లేని మంచి కుందేలే కావాలి నాకు!" అన్నది భల్లూకం.     "మరైతే ఈ చెట్టును ఊపు. కొంచెం గాలి తెప్పించు. నిన్ను చూసేసరికి భయంతో నాకు చెమటలు పట్టిపోతున్నాయి" అన్నది కుందేలు, చెట్టుమీద ఉన్న మర్కటం మామకు సైగ చేస్తూ. ఎలుగుబంటి తన బలం చూపించుకుందామనుకున్నది. కొబ్బరి చెట్టు మొదలును పట్టుకొని దబగబా ఊపింది. చెట్టు జుయ్ జుయ్ మని ఊగింది. చెట్టుమీద ఉన్న మర్కటం మామ కూడా చెయ్యి చేసుకున్నాడు.       దాంతో కొబ్బరి బోండాలన్నీ‌ జలజలా రాలాయి. మూడునాలుగు కాయలు వచ్చి నేరుగా భల్లూకం తలమీదే పడ్డాయి. దెబ్బకు ఎలుగుబంటి దిమ్మ తిరిగి పడిపోయింది. తేరుకున్న శశకం పరుగో...పరుగు! Courtesy.. kottapalli.in  

చిన్న సూర్యుడు

  చిన్న సూర్యుడు   ఓ గ్రామంలో పండితుడు ఒకాయన నివసిస్తూ ఉండేవాడు. ఊళ్ళోవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవమూ, మర్యాదానూ. ఆయనకు ఒక కొడుకు. పేరు చిన్నయ్య. చిన్నయ్యకు మాత్రం విద్యాగంధం అనేది ఏమాత్రమూ అంటలేదు. తండ్రి దగ్గర చదువు నేర్చుకోవటం మాట అలా ఉంచి, మర్యాదగా మాట్లాడికూడా ఎరుగడు చిన్నయ్య. మెల్లగా అతనికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అక్షరాలు గుర్తించటం కూడా రాదు. పనికొచ్చే పని ఒక్కటీ రాదు. 16సంవత్సరాల వయసులో మనిషి శరీరంలో ఏవేవో మార్పులు సంభవిస్తాయి. మన ఆలోచనా వ్యవస్థ, భావనల తీరు, మొత్తం చాలా సున్నితంగా తయారౌతై. ఆ సమయంలోనే చిన్నయ్య మేనమామ ప్రక్కఊరినుండి వాళ్ళింటికి వచ్చాడు. ఒక రోజంతా ఏమీ అనకుండా చిన్నయ్య పోకడల్ని గమనిస్తూ ఉన్నాడాయన. ఆ తరువాత ఊరికి వెళ్తూ, వెళ్తూ, చిన్నయ్య భుజంమీద చెయ్యివేసి ఊరి చివరి వరకూ తీసుకెళ్ళాడు, ఏవేవో సంగతులు మాట్లాడుతూ. ఏం చెప్పాడో, ఏమో! వెనక్కి వచ్చే సరికి చిన్నయ్య చిన్నయ్యగా లేడు. అదే రోజు రాత్రి అతను ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తరువాత - అద్భుతమే అనాలి - ఆరు సంవత్సరాల తరువాత - అతని తెలివితేటలు, పాండిత్యం గురించి దేశమంతటా చెప్పుకోవటం మొదలైంది. సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలోనూ అతని ప్రజ్ఞాపాటవాలు అసామాన్యమైనవని పండితులందరూ అంగీకరించారు. సంస్కృత 'నీతి చంద్రిక' ను తెలుగులో 'పంచతంత్రం' గా వ్రాసిన చిన్నయసూరి తన పేరును తెలుగు సాహిత్యంలో అజరామరం చేసుకున్నాడు. ఇంతటి అసమాన ప్రతిభను అతి కొద్దికాలంలో సాధించిన చిన్నయసూరి, తనకు 16సంవత్సరాలు వచ్చేంతవరకూ చదువుకోలేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ అద్భుతానికి కారణం చిన్నయ్యలో జాజ్వల్యమానంగా వెలుగొందిన దీక్షా శక్తా? లేక ఆ ఆరేడేళ్ళూ అతనికి విద్య గరపిన గురువుల దక్షతా? గురువులు విద్యను అందించే మాధ్యమాలు మాత్రమే. వారినుండి పిల్లలు ఎవరికి తోచినంత జ్ఞానాన్ని వారు సేకరించుకుంటారు. దానికి అనువైన వాతావరణాన్ని బడి కల్పించాలి. అలాకాక, 'బళ్ళూ, గురువులూ పిల్లల్ని తోమటం' అనే ప్రక్రియ, ఎప్పుడు మొదలైందో గాని, అది పిల్లలకే కాదు, గురువులకూ బరువై కూర్చున్నది. -ఏమంటారు? Courtesy.. kottapalli.in

టోపీల వ్యాపారి

  టోపీల వ్యాపారి   బషీర్ వృత్తి టోపీల వ్యాపారం. వాళ్ళ నాన్న కూడా టోపీలమ్మేవాడు. వాళ్ల తాతా అదే పని. బషీర్ ఈ పనిలో మెళకువల్ని, అందరిలాగే, తన తండ్రినుండి పుణికి పుచ్చుకున్నాడు. బషీర్ కు దుకాణం లేదు. అతను ఇల్లిల్లూ తిరిగి టోపీలమ్మేవాడు. టోపీలను చక్కగా మడిచి, దొంతరలుగా పేర్చి, గట్టి బట్టతో కట్టి తలపై పెట్టుకొని, ఊరూరా తిరిగి అమ్ముకునేవాడు. ఒక రోజున బషీర్ తలమీద బరువైన టోపీల మూటతో పోతున్నాడు, ఓ దారి వెంబడి. అప్పటికే అతను రెండు గ్రామాలు తిరిగి బాగా అలసిపోయి ఉన్నాడు. ఎండాకాలం. మధ్యాహ్నపు ఎండ దహించి వేస్తున్నది. అతను ఊరికి దూరంగా, ఓ చెట్టుకింద ఆగి, తలమీది మూటను దించి, భార్య ఇచ్చిన భోజనపు డబ్బా తెరచి తృప్తిగా తిని, ఓ కునుకు తీశాడు. అలసిపోయి ఉన్నాడేమో బలంగా నిద్రపట్టింది. కళ్లు తెరచి చూసుకునేటప్పటికి, తన టోపీల మూట విప్పదీసి ఉన్నది. బట్ట పూర్తిగా నేల మీద పరచి ఉన్నది. టోపీలన్నీ మాయం! బషీర్ కంగారుగా అన్ని దిక్కులా వెతికాడు. చివరికి అతనికి తలపై టోపీ పెట్టుకొని కులుకుతున్న కోతి ఒకటి కనబడింది. తేరుకున్న బషీర్ తలెత్తి పైకి చూస్తే చెట్టు నిండా కోతులు! ప్రతికోతి తలపైనా తన టోపీనే! బషీర్ కు కళ్ల నీళ్లు వచ్చాయి. కోతులు తనకు టోపీల్ని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. వాటికి చిక్కిన టోపీలు పోయినట్లే. తన వ్యాపారం సర్వం ఈ నాటితో సరి. ఇంత పెద్ద దెబ్బను తట్టుకునేంత స్తోమతు తనకు లేదు. అయినా ఏదో ప్రయత్నం చెయ్యాలి గనక, అతను పైకి చూస్తూ అన్నాడు. " అయ్యా, కోతి సోదరులారా, కొంచెం దయ చూపండి. నా టోపీలు నాకు తిరిగి ఇచ్చెయ్యండి. నేను నాశనమైపోతే మీకు ప్రత్యేకంగా ఏమీ సంతోషం కలగదు గదా! అందుకని, ఇచ్చెయ్యండి. దయచేసి ఇవ్వండి. దయచేసి" అని. కోతులు అతను చెప్పినదాన్ని శ్రద్ధగా విన్నై. కానీ ఏమీ చెయ్యలేదు. బషీర్ కి కోపం వచ్చింది. ఇక కోతుల్ని తిట్టడం మొదలెట్టాడు. "పిచ్చి కోతుల్లారా! టోపీలు పెట్టుకుంటే మీరు మరింత వికారంగా కనబడుతున్నారు. మర్యాదగా టోపీల్ని పడేస్తారా, లేకపోతే మిమ్మలనందర్నీ చంపెయ్యమంటారా?" అని చిందులు వేశాడు. కోతులు వెకిలిగా నవ్వాయి. బషీర్ కి నిజంగా కోపం వచ్చింది. ఒక కట్టెపుల్ల తీసుకొని , దాన్ని తీవ్రంగా ఊపడం మొదలెట్టాడు. దాని వల్ల కూడా పని జరగలేదు. కోతులకది వినోదంగా అనిపించింది. అవి కూడా చిన్న పుల్లల్ని తుంచి బషీర్ ని బెదిరించటం మొదలెట్టాయి. ఎలాగూ కట్టెపుల్లలకి అందనంత దూరంలో ఉన్నామని వాటికి తెలుసు! బషీర్ ముఖం కోపంతో ఎర్రబారింది. అతను నేలమీది నుండి రాళ్లు ఏరి, కనబడిన కోతిమీదికల్లా విసరటం మొదలుపెట్టాడు. కానీ అవి రాళ్లకు అందకుండా తప్పించుకుంటున్నాయి. విసిరీ విసిరీ బషీరే అలసిపోయాడు తప్పిస్తే, ఒక్క టోపీ కూడా కిందికి రాలేదు. కోతులకు ఇంకా సంతోషమైంది. అవి కొమ్మ నుండీ కొమ్మకు దూకుతూ ’గుర్ గుర్’ మనటం మొదలెట్టాయి ఆటగా. బషీర్ అలసిపోయాడు - శారీరకంగాను, మానసికంగా కూడాను. రెండు చేతుల్తోటీ తల పట్టుకుని నేలపైనే చతికిలబడ్డాడు. ఏం చేయాలో పాలుపోలేదు అతనికి. కొంచెంసేపు కదలకుండా కూర్చున్న తరువాత అతను కొద్దిగా సమాధానపడ్డాడు. క్షణకాలం పాటు, తను మోస్తున్న ఆర్థిక భారాన్ని మరిచిపోగల్గాడు. నిటారుగా నిలబడి, తన నెత్తి మీదున్న టోపీని తీసి చేతిలో పట్టుకొని, "మీరు వినరు కదూ? అయితే తీసుకోండి, దీన్ని కూడా- ఈ ఒక్కటీ నాకెందుకు?" అని, దాన్నీ నేల మీద పడేశాడు- నిరాశగా. అతన్నే గమనిస్తున్న కోతులన్నీ- ..అలాగే చేశాయి!! -తమ నెత్తి మీదున్న టోపీల్ని తీసి అవికూడా నేల మీదికి గిరాటేశాయి. వివిధ రకాల టోపీలు - రంగురంగుల టోపీలు - చిన్నవి, పెద్దవి- టోపీలతో నేలంతా నిండిపోయింది! బషీర్ నోట మాట రాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తేరుకోగానే అతను టోపీలన్నీ ఏరుకొని తిరిగి మూటగట్టుకున్నాడు. " నేనేం చేయాలో నాకు తెలుసని నేను అనుకున్నంత కాలమూ నాకేమీ తెలీలేదు. కానీ నాకేమీ తెలీదన్నపుడు, నాకు తెలిసి వచ్చింది!" అనుకుంటూ. (మీకేమన్నా తెల్సిందా?) ఈ కథ పిల్లలందరికీ తెల్సిందే అయినా దాన్ని ఈ రీతిగా చెప్పిన ఘనత శ్రీ పర్తాప్ అగర్వాల్ గారిది. వారికి అనేకానేక ధన్యవాదాలు. Courtesy.. kottapalli.in

గువ్వకు జరమమ్మా (కవిత)

  గువ్వకు జరమమ్మా   గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు ముక్కుకు ముక్కెర కావాలన్నది ముక్కు తిప్పుతూ నడవాలన్నది గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వేతినలేదు గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు చేతికి గాజులు కావాలన్నది చెయ్యి తిప్పుతూ నడవాలన్నది చేతికి గాజులు కావాలన్నది చెయ్యి తిప్పుతూ నడవాలన్నది గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు నడుముకు డాబులు కావాలన్నది నడుము తిప్పుతూ నడవాలన్నది నడుముకు డాబులు కావాలన్నది నడుము తిప్పుతూ నడవాలన్నది గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు కాళకు గజ్జెలు కావాలన్నది కాళ్లు తిప్పుతూ నడవాలన్నది కాళ్లకు గజ్జెలు కావాలన్నది కాళ్లు తిప్పుతూ నడవాలన్నది గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు   Courtesy.. kottapalli.in

అయ్యవార్లకు పరీక్షలు!

  కథియవాడ బడికి ఇన్స్‌పెక్టరుగారు వచ్చారు. ఆయన వస్తున్నట్లు ఎవరికీ ముందుగా తెలీదు. ఆ రోజుల్లో ఇన్స్‌పెక్టర్లు అందరూ ఇంగ్లీషు వాళ్ళు. వాళ్లని చూస్తే అధ్యాపకులకు అందరికీ వణుకు. స్కూలు ఇన్స్‌పెక్టరుగారి మెప్పు పొందటం అవసరం- లేకపోతే వాళ్ల ఉద్యోగాలు ఊడేవి! ఆ వచ్చే కొద్దిపాటి జీతమూ రాకపోతే కుటుంబం గడవదు కూడాను! ఇన్స్‌పెక్టరుగారు వచ్చి 'తరగతి ఉంచుకున్న తీరును గమనిస్తారు; పిల్లల శుభ్రతని చూస్తారు; మంచి మంచి వాక్యాలు గోడలకు వ్రేలాడుతున్నాయా, లేదా? వివిధ ప్రపంచ దేశాల మ్యాపులున్నాయా? "బ్రిటిష్ రాజు గారు వర్థిల్లాలి" అని నేర్పుతున్నారా, లేదా? అన్నిటినీ మించి- సరైన ఇంగ్లీషు నేర్పుతున్నారా, లేదా?' అని పరిశీలిస్తారు. పిల్లలకు డిక్టేషను ఇస్తారు; వాళ్ళు రాసినవాటిని స్వయంగా దిద్దుతారు; పిల్లల స్థాయి ఎలా ఉందో చూసి, దాన్ని బట్టి అయ్యవారి విలువను అంచనా వేస్తారు. పిల్లలు జవాబులు బాగా చెప్పకపోతే, తప్పులు రాస్తే, అయ్యవార్లకు చీవాట్లు తప్పవు. పిల్లలు మరీ‌ ఘోరంగా ఉంటే అయ్యవారిని మార్చేస్తారు- పనిలోంచి తీసెయ్యచ్చు కూడాను! ఇన్స్‌పెక్టరుగారి పేరు గైల్స్ దొర. బడిలోకి వచ్చీ రాగానే పరిసరాల్ని గమనించాడాయన. ఆ వెంటనే చకచకా ఆరో తరగతిలోకి వెళ్ళాడు. అక్కడున్న టీచరుగారు ఆయన్ని చూడగానే తను చెబుతున్న పాఠం ఆపి, లోనికి ఆహ్వానించారు వణుక్కుంటూ. పిల్లలందరూ లేచి నిలబడి 'గుడ్ మార్నింగ్' చెప్పి, 'గాడ్ సేవ్ ద కింగ్ (బ్రిటన్ జాతీయగీతం) పాడారు. ఇన్స్‌పెక్టరుగారు పిల్లలందర్నీ దూరం దూరంగా కూర్చోబెట్టారు. పలకలు తీయమని ఐదు పదాలు డిక్టేట్ చేశారు- అయ్యవారికి సంతోషంగానే ఉంది- "ఈ పదాలన్నీ తను చెప్పినవే; పిల్లలందరూ వీటిని సరిగ్గానే రాస్తారు. తనని ఇన్స్‌పెక్టరుగారు మెచ్చుకుంటారు బహుశ:. తరగతి గదిలో వెనకవైపుగా ఉండి, ఎవరు ఎలా రాస్తున్నదీ చూడసాగాడాయన. ఆరో తరగతిలో కొత్తగా చేరిన వాళ్ళల్లో మోహన్‌దాస్ అని ఓ పిల్లాడుండేవాడు. కొంచెం వెనకబడినట్లుండేవాడు. వాళ్ల నాన్న కరంచంద్ గారు కథియవాడ్ మహారాజావారి ఆస్థానంలో‌ పెద్ద ఉద్యోగి. మోహన్‌దాస్ ఒక పదాన్ని తప్పుగా రాశాడు: "kettle" అని రాసేబదులు "ketle" అని రాశాడు. అయ్యవారు వెంటనే మోహన్ ప్రక్కకొచ్చి నిలబడ్డారు- కొంచెం‌ ముందుకెళ్ళి వెనక్కి తిరిగారు- కేవలం మోహన్‌కే కనబడేట్లు సైగ చేశారు- "ప్రక్కవాడి పలకలో చూడు- చూసి, సరిగ్గా రాయి!" అని. మోహన్‌దాస్ అమాయకుడో, మరేమో, అధ్యాపకులవారి సైగలు అర్థం కానట్లే ఉండిపోయాడు- దిక్కులు చూసుకుంటూ. తర్వాత ఇన్స్‌పెక్టరుగారు అందరి పలకలూ దిద్దారు- మోహన్‌దాస్ తప్పిస్తే అందరూ అన్ని పదాలూ సరిగా రాశారు. అతనొక్కడే- 'కెటిల్' అని రాయలేకపోయాడు! అందరూ తననే చూస్తుంటే మోహన్‌దాస్ సిగ్గుగా తలవంచుకొని కన్నీళ్ళతో‌ నిలబడ్డాడు. ఇన్స్‌పెక్టరుగారు వెళ్ళాక, అధ్యాపకులవారు మోహన్‌ని కసిరారు- "నేను సైగలు చేస్తూనే ఉన్నాను కదా, ప్రక్కవాడి పలకలో చూసి కాపీ కొట్టమని?! అది కూడా రాకపోతే ఎలాగ?" అని. ఆ మోహన్‌దాసే, పెద్దయ్యాక, తన ఆత్మకథలో ఈ సంగతి చెబుతూ "చిన్నప్పటినుండి నాకు సత్యం పట్ల ఆకర్షణ ఉండేది- నాకైనేను సత్యంగా ఉండటం, ఇతరులతో ఎప్పుడూ నిజమే చెప్పటం, భగవంతుడి పట్ల నిజంగా ప్రవర్తించటం- వీటి వల్లనే నా ఆత్మకు బలం చేకూరింది" అని రాసుకున్నాడు. ఇంతకీ‌ మోహన్‌దాస్ ఎవరో గుర్తు పట్టారా? మన జాతిపిత, మహాత్మా గాంధీ! పిల్లలకి నిజాయితీ గురించి చెప్పేటప్పుడు సాధారణంగా ఈ సంఘటనను గుర్తుచేసు-కుంటుంటారు అందరూ. అయితే, ఇంతకీ ఈ కథలో ఇన్స్‌పెక్టరుగారు పరీక్ష పెట్టింది ఎవరికి? పిల్లలకా, అధ్యాపకుడికా? పైకి చూసేందుకు 'ఆ పరీక్ష పిల్లలకే' అనిపిస్తుంది; కానీ నిజానికి ఆ పరీక్ష అధ్యాపకులకు! పిల్లల స్థాయిని బట్టి అధ్యాపకుల జ్ఞానాన్ని, ప్రతిభను అంచనా వేయచ్చు! ఇవాల్టి పరీక్షలలో అలాంటి స్ఫూర్తి ఒకటి రావటం అవసరమేమో అనిపిస్తుంది. పరీక్షలు ఉన్నది మన పిల్లల్లో సింహ భాగాన్ని దోషులుగా నిలబెట్టి వాళ్ల లోటుపాట్లని బహిర్గతం చేసేందుకు కాదు; ఎవరో కొందరు పిల్లల్ని మునగ చెట్లు ఎక్కించేందుకూ కాదు- వారికి విద్యగరిపిన అధ్యాపకుల ప్రతిభను గుర్తించేందుకు అవి గీటురాళ్ళు' అనుకుంటే కొంత బాగుంటుందేమో. 'పరీక్షల అసలు పరమావధి విద్యార్థి కాదు- అధ్యాపకులే' అనిపిస్తుంది- మీరేమంటారు? Courtesy.. kottapalli.in

జంగయ్య - చందమామ

జంగయ్య- చందమామ   రచన - సౌజన్య,  5 వ తరగతి.  ఒక ఊరిలో జంగయ్య అనే పిల్లవాడు ఉండేవాడు. జంగయ్యకు ఏడేళ్ళు. ఎప్పుడూ ఏదో ఒకపని చేస్తుంటాడు; ఏదో ఒకటి ఆలోచిస్తూంటాడు. ఒక రోజు కులాసాగా పడుకున్న జంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. చందమామ మీదకు వెళ్తే ఎంత బాగుంటుంది! ఇదీ, జంగయ్య కొత్త ఆలోచన! ఆరోజు సాయంత్రం జంగయ్య ఒక రాకెట్ సంపాదించాడు. దాని మీద కూర్చొని చందమామ దగ్గరికి బయలు దేరాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో చీకటి పడింది. జంగయ్యకు భయం వేసింది. ఆ చీకట్లో చందమామ ఎక్కడున్నాడో జంగయ్యకు కనబడలేదు. దారి కూడా తెలీలేదు! అయినా అతను పట్టు వీడలేదు; వెనక్కి తిరగ లేదు. జంగయ్య ఎక్కిన రాకెట్ ఇంకా ఇంకా పైకి వెళ్లింది. చాలా దూరం వెళ్ళాక అతనికి చందమామ కనిపించాడు. జంగయ్య ఆనందానికి అంతులేదు. అతను రాకెట్ మీదినుండి చందమామ మీద దిగాడు; అటూ ఇటూ తిరిగాడు- అంతా ఎడారిలాగా ఉంది. అక్కడక్కడా రాళ్ళు. దూరంగా కొండలు. చూద్దామంటే ఒక్క చెట్టు కూడా లేదు- కనీసం గడ్డి కూడా కనబడలేదు- ఒక పిట్టకానీ , ఒక జంతువు కానీ లేదు. తాగటానికి నీళ్లు కూడా లేవు. సరిగా ఊపిరాడటం లేదు. ఇదేం చందమామ ? ఇక్కడేం బాగాలేదు. మావూరే దీనికన్నా చాలా బాగుంది అనిపించింది జంగయ్యకు. తిరిగి అక్కడి నుండి బయలు దేరి ఊరి ముఖం పట్టాడు. ఊరు చేరుకునే సరికి ప్రాణం లేచి వచ్చినట్లైంది. అంతలోనే మెలకువ కూడా వచ్చింది. ఆ తరువాత అతను చందమామ మీద చూసిన విషయాలు ఊరందర్నీ పిలిచి చెప్పాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో   

నిజమైన మేధావి (కథ)

నిజమైన మేధావి   రాజు తెలివైన కుర్రాడు.ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో  గొంతు   వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది. చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం. తెలివైన రాజు, "నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?" అని అడిగాడు. దానికి ఆ భూతం "ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం "దయచేసి నన్ను విముక్తుడిని చెయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను" అని బతిమాలసాగింది. "నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు" అన్నాడు రాజు. భూతం "నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది" అని చెప్పింది. దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యడు రాజు. Courtesy.. http://podupukathalu.blogspot.in

చలి చొక్కా ( కథ)

  చలి చొక్కా ( కథ)     ఓసారి ఏమైందంటే, గంగరాజుకి బాగా చలి పుట్టింది. చలికాలం కదా, అందుకని. అయితే వాడి దగ్గర చలిచొక్కా లేదు. పాపం వాళ్ళమ్మ ఒక్కత్తే ఎంతకని కష్టపడుతుంది? అందుకని వాడు తన చలి గురించి ఆమెకి చెప్పనేలేదు- అట్లానే ఓర్చుకున్నాడు. అయితే ఆరోజు బడికి రత్నాలవారి అబ్బాయి భూపతి గొప్ప చలిచొక్కా ఒకటి వేసుకొని వచ్చాడు.లావుగా, మెత్తగా, చక్కగా మెరిసిపోతూ- భలే ఉందది. దాన్ని చూసినవాళ్లందరికీ ఎండపొద్దునకూడా చలి పుట్టింది, ఆరోజున. "ఒరే, ఒక్కసారి వేసుకోనియ్యిరా!" అని వాడిని అడుక్కున్నారు అందరూ. "మా అమ్మ ఎవ్వరినీ వేసుకోనివ్వద్దందిరా" అని పోజు కొట్టాడు వాడు. అమ్మ మాటని ఏనాడూ కాదనని కొడుకు మాదిరి మొకం కూడా పెట్టాడు. ఆ రోజంతా గంగరాజు భూపతి తోకల్లే తిరిగాడు. అయితే ఎంత రాసుకొని పూసుకొని తిరిగినా భూపతి మాత్రం‌ ఒక్కసారంటే ఒక్కసారన్నా చలిచొక్కా ఇవ్వలేదు. సాయంత్రం బడిగంట అవ్వగానే గంగరాజు భూపతి వెంట పోయాడు: "ఇంటికెళ్ళినాక చలిచొక్కా విప్పుతాడు కదా, అప్పుడైనా వేసుకోనిస్తాడేమో" అని. ఉహుఁ..లాభం లేదు. చొక్కా మార్చుకునేందుకు లోపలికి వెళ్ళిన భూపతి ఇంక బయటికి రానే లేదు. గంగరాజుకి చాలా బాధైంది. నిజంగానే తనకూ ఓ చలిచొక్కా కొనిపెట్టమని అడిగెయ్యాలనుకున్నాడు అమ్మని. గబ గబా ఇంటికి పరుగు పెట్టాడు. అయితే వాడు వెళ్ళేసరికి అమ్మ ఇంటి బయట పాత్రలు తోముతోంది- "ఒరేఁ గంగీ! ఓ సారి పొయ్యికి కట్టెలు ఎగెయ్యిరా! అట్లానే కూర కలబెట్టు, గంటెతో" అని అరిచింది, బయటినుండే. గంగిరాజు పుస్తకాల సంచీని ఇంట్లో మూలకి విసిరేసి, పొయ్యి దగ్గరికి వెళ్ళాడు- ఆశ్చర్యం! పొయ్యి దగ్గరంతా ఎంత వెచ్చగా ఉందో! భలే ఉంది. పొయ్యిలోకి కట్టెలు ఎగేస్తూంటే చేతులంతా హాయిమన్నాయి. కూర కలబెడుతూ గంటె పట్టుకుంటే- ఇంక అక్కడినుండి లేవబుద్ధి కాలేదు. "రేయ్! లెగు. పొయ్యి దగ్గర కూచొని ఏం చేస్తా ఉండావు?" అంటూ‌ లోపలికి వచ్చిన అమ్మ, చలి కాగుతున్న కొడుకుని సూటిగా చూసి "పొయ్యి దగ్గర కూకొని చలి కాగుతుండావా, సాయంకాలం పూటనే?! రేప్పొద్దున్న సంతలో ఓ చలిచొక్కా కొనుక్కొస్తాలే, నీకంత చలైతే!" అంది. "ఏం వొద్దులే, అమ్మా!‌ మాపటేలా, పొద్దున్నా మంట వేసుకుంటే ఎంత చలైనా పారిపోతుందిలే. ఇంక చలిచొక్కా దేనికి, ఊరికెనే?!" అన్నాడు గంగిరాజు, పొయ్యికి మరింత దగ్గరగా జరుగుతూ.     ........ kottapalli.in సౌజన్యంతో

పిల్లల ఇల్లు

  పిల్లల ఇల్లు అనగా అనగా చాలా కాలం క్రితం గ్రీకు దేశంలో ప్లాటో అనే ఒక పెద్ద గురువుగారు ఉండేవారు. చాలామంది రాజులూ, చక్రవర్తులూ సైతం ఆయన జ్ఞానం ముందు తలవంచేవాళ్ళు. ఖగోళ శాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం- ఒకటేమిటి, అన్ని శాస్త్రాల్లోనూ దిట్ట, ఆయన. ఆయన మాట అంటే అక్కడి రాజుగారికి వేదవాక్కులాగా ఉండేది. బాగాతిని, కూర్చొని దీర్ఘంగా ఆలోచించి చాలా విలువైన నిర్ణయాలు వెలువరిస్తూ ఉండేవాడాయన. భూస్వాములూ, చిన్న చిన్న రాజులూ ఆయన ఆలోచనల్ని అమలు పరచటమే తప్ప, ఎదురు తిరిగి ప్రశ్నించటం అనేదే ఉండేది కాదు. ఆయనకు ఒకసారి ఒక ఐడియా వచ్చింది: ప్రపంచంలో చాలా అసమానతలు ఉన్నై. కొందరు ధనికులు, కొందరు పేదలు. ధనికులు వాళ్ల పిల్లల్ని చాలా బాగానే పెంచుతున్నారు. వాళ్లకు దేశాభిమానమూ, నైతిక విలువలూ‌అన్నీ‌నేర్పుతున్నారు. కానీ, పేదవాళ్ళు? వాళ్ల పిల్లలకు దేశప్రేమా ఉండట్లేదు; నీతి నియమాలూ ఉండట్లేదు. వాళ్లంతా రోగిష్టులూ, పోకిరీలూ అయిపోతున్నారు. అందుకని, పిల్లలందర్నీ రాజే పెంచితే బాగుంటుంది- అంటే రాజుగారు ఏరి కోరి ఎంపిక చేసిపెట్టిన మేధావి వర్గమే అందరు పిల్లల్నీ‌ మలచే బాధ్యత స్వీకరిస్తుందన్నమాట. ఈ‌మేధావి వర్గంవాళ్ళు దేశంలో పుట్టిన పిల్లలందర్నీ వాళ్ల తల్లిదండ్రులకు దూరంగా, రాజుగారు అప్పటికే గొప్పగా నిర్మించి పెట్టిన కలల ప్రపంచంలోకి ఎత్తుకెళ్ళిపోతారు. పిల్లల్ని ఒకసారి ఇట్లా కుటుంబాల పరిధిలోంచి తప్పించేశాక, వాళ్లకు మనం ఏవి కావాలనుకుంటే అవి నూరిపోయవచ్చు; వాళ్లందరూ గొప్ప పౌరులయ్యేట్లు శిక్షణనివ్వచ్చు. పేదవాళ్ళు బాగుపడటంకోసం‌ ధనికులు ఈమాత్రంత్యాగంచెయ్యవలసిందే- తమ పిల్లల్నీ రాజుగారి బడికి పంపించాల్సిందే. అక్కడ పిల్లలందర్నీ ఒకేలాగా చూస్తారు కనుక, వాళ్లలో తేడాలుండవు. అందరూ కలిసి మానవ సమాజంకోసం శ్రమిస్తారు. అయితే రాజుగారు అట్లాంటి పని మొదలు పెట్టేసరికి ఏమై ఉంటుందో ఊహించుకోవటం సులభం. గందరగోళమైంది! పిల్లలందరూ కలవరపడిపోయారు; ఎదురు తిరిగారు, తల్లిదండ్రులు గొడవ చేశారు; రాజ్యమంతా అల్లకల్లోలం అయ్యింది; అంతా జరిగాక గురువుగారి నోరు మూతపడింది. లోకం మళ్ళీ మామూలుగా తన దారిన తను నడవటం మొదలు పెట్టింది. పిల్లలు మైనపు బొమ్మలు కారు. వాళ్లని ఇష్టం వచ్చినట్లు మలచిపారెయ్యటం వీలవదు. ప్రతి పిల్లవాడిలోనూ, ప్రతి పాపలోనూ తనదైన ఆత్మ ఒకటి ఉంటుంది. స్వీయమైన ఆ ఆత్మ ఎదిగే క్రమం కూడా‌ఒకటి ఉంటుంది. చదువు నేర్పించే వాతావరణం ఆ క్రమానికి దగ్గరగా ఉంటే, పిల్లలు అందులో ఇమిడిపోయి, ఆ ధారలో ప్రవహిస్తూ, ఆ ధారకే క్రొత్త రంగులు అద్దుతూ, సంతోషంగా‌ ఎదుగుతారు. అట్లా ఎదిగిన పిల్లల్లో చైతన్యం ఉంటుంది. శాస్త్ర విజ్ఞాన రంగాల్లో గానీ, కృషియాంత్రిక రంగాల్లోగానీ, కళల్లో గానీ- తాము దేన్ని ఎంచుకుంటే ఆ రంగంలోకి ఆ చైతన్యాన్ని జొప్పిస్తారు వాళ్ళు. అలా‌ వాళ్ళు ఎదుగుతూ, ఆయా రంగాల్నీ‌ రాణింపజేస్తారు. ఈ భావనని ఇలా ఊరికే చెప్పటం కాకుండా, 'ఇది నిజంగా కావాల్సిందే' అని చేసి చూపించింది, మేరియా మాంటిసోరీ. ఇటలీ దేశానికి చెందిన ఈ డాక్టరమ్మ, పిల్లల్ని 'అర్థం చేసుకోవాలి' అని నొక్కి చెప్పిన గొప్ప మనిషి. జనవరి తొమ్మిదిన ఆవిడ మొదలుపెట్టిన 'కాసా ద బాంబిని'- పిల్లల ఇల్లు, ఈ నూరు పై చిలుకు సంవత్సరాల్లో చాలా‌ పెద్దదే అయ్యింది. ఆవిడకు, ఆవిడ కట్టిన ఆ పొదరింటిని మరింత గుబాళింపజేసేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లకు అందరికీ నమస్కారాలు.

నీళ్ళు-వజ్రాలు

నీళ్ళు-వజ్రాలు   సహారా ఎడారిలో పోతూ దారి తప్పారు రాము-సోము. ఎటెటో తిరిగారు- సరైన దారి చిక్కనే లేదు. రెండు రోజులు గడిచేసరికి, వాళ్ళ దగ్గరున్న నీళ్ళన్నీ అయిపోయాయి. దాహం..ఎండ. ఇంక ఒక్క అడుగు కూడా‌ ముందుకు వేసే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళకు దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి సాయం చేయగలిగింది ఆయన ఒక్కడే. మనసులో ఆ దేవుడినే తలచుకున్నారు ఇద్దరూ, ఆర్తిగా..మళ్ళీ మళ్ళీ. అట్లా మగతలో, ఇసకలో, మండుటెండలో పడిపోయిన వాళ్ళని చూసి జాలిపడ్డాడు దేవుడు. వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు. దేవుడిని కళ్ళెత్తి చూసేంత శక్తి కూడా మిగల్లేదు వాళ్ళలో- దేవుడి మాటలు కూడా సరిగ్గా వినబడటంలేదు వాళ్ళకు. దేవుడు చెబుతూ పోయాడు చాలా సేపు- "చూడండి, అందం పై పైనే ఉంటుంది. మీరు 'అందంగా ఉంది' అనుకునే వస్తువులో నిజానికి పస ఉండకపోవచ్చు. 'అస్సలు బాగాలేదు' అనుకునే వస్తువులో అపార సంపదలు దాగి ఉండవచ్చు. నిజానికి ఎవరికైనా ఉపయోగపడేది మంచి మనస్సే. అదొక్కటి ఉంటే చాలు- అన్నింటా విజయం వరిస్తుంది.." రాము సోములకు దేవుడి ప్రవచనాలు అక్కర్లేదు- స్వామీ, మాకు కాసిని నీళ్ళు ఇవ్వండి చాలు. మిగతావి మేం సొంతంగా ఆలోచించుకొని నేర్చుకుంటాం" అన్నారు స్వామికి అడ్డొస్తూ. "అవునవును. అందుకే వచ్చాను నేను. నా వరకూ మీరిద్దరూ ఒకటే- అయినా ఎవరికి ఏది కావాలో ఎంపిక చేసుకొనే అవకాశం మీకిద్దరికీ వేరు వేరుగా ఇస్తాను" అని, దేవుడు రాముని దగ్గరికి పిలిచి, రహస్యంగా రెండు సంచులు చూపించాడు. ఒక సంచీ చాలా బాగుంది. మఖ్మల్ బట్టతో కుట్టి, బంగారు తాళ్ళతో అలంకరించి ఉన్నది. ఇంకో సంచీ ముతకగా, పాత తోలుతో చేసిన తిత్తిలాగా ఉన్నది. "వీటిలో నీకు ఏది కావాలో తీసుకో" అన్నాడు. "రెండోది వాడికి ఇస్తావా?" అన్నాడు రాము, సోమువైపు చూస్తూ. "ఉహు, అతనికీ‌ రెండు అవకాశాలు ఇస్తాను" అన్నాడు దేవుడు. "అన్యాయం. మరి రెండిటిలోనూ ఏది మంచిదో ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా?" అన్నాడు సోము. "చెప్పలేం. ఎవరు కోరుకున్న సంచిలో ఏముంటుంది అన్నది పూర్తిగా వాళ్ళ రాత మీద ఆధారపడి ఉంటుంది. మనుషుల రాతను నేనే కాదు, ఎవ్వరూ మార్చలేరు" అన్నాడు దేవుడు. రాము రెండు సంచులనూ మార్చి మార్చి చూశాడు. రెండూ సమానం బరువు ఉన్నై. చివరికి చూపులే గెలిచాయి. అందంగా ఉన్న సంచీ మీద ఆశ పుట్టింది. మఖ్మల్ సంచిని ఎంచుకున్నాడు రాము. అదే సమయంలో దేవుడు సోముకూ రెండు సంచుల్ని చూపించాడు. సోము ఎక్కువ ఆలోచించకుండా తోలు తిత్తిని ఎంచుకున్నాడు. దేవుడు ఇద్దరినీ దీవించి మాయం అయిపోయాడు. అయినా ఇద్దరికీ కనిపించకుండా అక్కడే నిలబడి చూడసాగాడు. రాము హడావిడిగా విప్పి చూశాడు- మఖ్మల్ సంచిలోపల అద్భుతమైన వజ్రాలు ఉన్నై! సోము తోలు సంచిలో చూసుకున్నాడు- నిండా నీళ్ళు ఉన్నై!! దు:ఖం కొద్దీ రాము బావురుమన్నాడు- "ఈ వజ్రాలను నేనేం చేసుకోను? రూపానికి ఆశపడద్దని దేవుడు అంతసేపు చెప్పినా వినకపోతినే?! మఖ్మల్ సంచిని ఎంచుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఇక నాకు చావే గతి!" అని. సోము వాడిని ఓదార్చాడు- "ఎందుకురా, అంత బాధ? మనిద్దరం కలిసే కద, వచ్చింది? కలిసే పోతాం. తోలు సంచీలో నీళ్ళు ఇద్దరికీ సరిపోతాయిలే. త్రాగి నడక మొదలెడదాం. ఏదో ఒక దారి దొరక్క పోదు" అన్నాడు తోలుతిత్తిని అతనికి అందిస్తూ. ఇద్దరూ త్రాగినా, ఇంకా కొన్ని నీళ్ళు మిగిలాయి తిత్తిలో! కొంతదూరం నడిచాక, వాళ్లనే వెతుక్కుంటూ వస్తున్న మనుషులు ఎదురయ్యారు వాళ్ళకు. ఆ పైన రాము సోములు ఇద్దరూ వజ్రాలను సమానంగా పంచుకున్నారు. అప్పటివరకూ వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్న దేవుడు చిన్నగా నవ్వి మాయం అయిపోయాడు. మనుషున్నాక కష్టాలూ సుఖాలూ అన్నీ ఎదురౌతుంటాయి. సరిగ్గా కలిసి బ్రతికితే కష్టాలు తగ్గుతాయి; సుఖాలు అంతకంత పెరుగుతాయి ........ kottapalli.in సౌజన్యంతో

గాలి పటం (సంక్రాంతి స్పెషల్)

  గాలి పటం   సంక్రాంతి సెలవులు కదా అని హైదరాబాదులో మా చెల్లెలింటికి వెళ్లా. పదేళ్ల అభి నన్ను చూడగానే అడిగాడు. "మామయ్యా! నీకు గాలిపటం ట్చేయటం వచ్చట కదా, అమ్మ చెప్పింది?" అని. "చిన్నప్పుడు న్యూస్ పేపర్లతో చేసి ఎగరేసే వాళ్లంరా, ఇప్పుడు మర్చిపోయినట్లున్నాను" అన్నా. "ఏం కాదులే, ఒకసారి నేర్చుకొని చేసేస్తే, అవి ఇక మన బ్రెయిన్‌లోంచి పోవట-మా టీచర్ చెప్పింది. అయినా ట్రై చెయ్యి, ఎట్లా వచ్చినా నేనున్నా కద, ఎగరేసేందుకు?!" అన్నాడు అభి. "సరేలేరా! ఓ పెద్ద న్యూస్ పేపరు తీసుకురా, ఓ పేజీ చింపు జాగ్రత్తగా!" అన్నా. వాడు తెచ్చాడు. నాలుగంచులూ సమానంగా ఉండేట్లు చింపు, ఓ చతురస్రం చెయ్యి అన్నా. చక్కగా చేశాడు. ఇప్పుడు మంచి కొబ్బరి చీపురు పుల్లలు రెండు పట్టుకురా అన్నా. తెచ్చాడు. మిగిలిన న్యూస్ పేపరులోంచి ఒక అంగుళంన్నర-రెండంగుళాలు వెడల్పుండే ముక్కలు చేసిపట్టుకో, అలాగే మంచి బంక తీసుకురా అన్నా. పాపం శ్రద్ధగా చెప్పినట్లు చేశాడు. "ఇప్పుడి ఒక పుల్లని ఆ చతురస్రానికి అడ్డంగా పెట్టు- రెండు చివర్లలోనూ బంకరాసిన కాయితం ముక్కలు అంటించెయ్, పుల్లకదలకుండా-" అంటించాడు. "సరే, ఇప్పుడు రెండో పుల్లని ధనస్సులాగా వంచు. బొమ్మలో చూపించినట్లు బంకరాసిన కాయితాలతో మూడు నాలుగు చోట్ల అంటించెయ్, కదలకుండా-" కొంచెంకష్టపడ్డాడు గానీ బాగానే చేశాడు. "ఇప్పుడు గాలి పటానికి తోక పెట్టు. అంగుళం వెడల్పుతో తోక ఓ రెండు అడుగులుండాలి" అంటించాడు. "ఇప్పుడు ఓ కష్టం పని ఉందిరా, సూత్రం కట్టాలి. దారం తీస్కురా, గట్టి నూలు దారం కావాలి అన్నాను. మంచి దారం ఉండ తెచ్చాడు వాడు. గాలి పటాన్ని వెనక్కి తిప్పి, పుల్లతో సరైన చోట్ల నాలుగు చిల్లులు చేసి, వాటి గుండా పోయేట్లు దారం కట్టా, లెక్కగా పైన ముడి వేశా. "సూత్రం కట్టటం అందరికీ బాగా రాదు. సూత్రం బాగా కడితే గాలిపటం తోక లేకుండా కూడా ఎగురుతుంది" చెప్పా. "మరిప్పుడు "మాంజా" తేనా?" అడిగాడు అభి. 'మాంజా' అంటే?" అడిగా. "మంచి దారంలే; అదివ్వనా?" అని పోయి పెద్ద కండెడు దారం తెచ్చాడు వాడు. రకరకాల లావుల్లో, రకరకాల గట్టి దనాలతో, మెత్తగా-గరకుగా రకరకాలుగా‌ఉన్నదది! "ఓరి! ఇంత దారం ఉందే, నీ దగ్గర!" ఆశ్చర్యపోయా. "మరేమనుకున్నావు, గాలిపటాలు ఎగరెయ్యాలంటే 'మాంజా' కావాలిగా మరి! రా, ఇప్పుడు మనం మేడమీదెక్కి ఎగరేద్దాం" అన్నాడు వాడు, గొప్ప నిపుణతతో గాలిపటానికి దారం కడుతూ. నిజానికి వాడికి నాకంటే బాగా వచ్చు- గాలిపటం ఎగరెయ్యటం. చాలా చక్కగా ఎగరేశాడు. చూస్తూ చూస్తూండగానే గాలిపటం ఆకాశంలోకి ఎత్తుగా ఎగిరింది. "దారాన్ని నా చేతికి ఇయ్యిరా కొంచెం" అన్నాను . చేతికి ఇచ్చినట్లే ఇచ్చి "ఖీంచ్ ఖీంచ్" అరిచాడు వాడు- బిత్తరపోయి చూశా. వాడు నా చేతిలోంచి గబుక్కున దారాన్ని తన చేతిలోకి తీసుకొని లాగుతూ, "గాలిపటం పడిపోతున్నా, గుండ్రగా తిరుగుతున్నా దారాన్ని లాగాలి" అన్నాడు. "ఓహో, 'ఖీంచ్' అంటే అర్థం అదా?" నవ్వాను. "ఢీల్ ఢీల్" అంటే దారం వదలాలి. అప్పుడు గాలిపటం ఇంకా దూరం పోతుంది" చెప్పాడు. "ఖీంచ్ ఖీంచ్...ఢీల్...ఢీల్...ఢీల్.." వాడిసూచనల ప్రకారం పట్టుకొని లాగుతూ వదుల్తూ పోతే, గాలిపటం బలే ఎగిరింది! తర్వాత నా దగ్గరినుండి దారం తీసుకొని తనే గాలిపటం ఎగరేస్తూ కూడా "ఖీంచ్ ఖీంచ్..ఢీల్ ఢీల్" అని అరుస్తూనే ఉన్నాడు వాడు. వాడి సంతోషపు కేకలు వింటూంటే ఓ క్షణాన అనిపించింది-"మన జీవితం నిజంగానే, ఒక గాలిపటం లాంటిది. ఒక్కోసారి దాని మీద పట్టు బిగించి, లాగి- దాని దిశనూ, వేగాన్నీ నియంత్రించాలి. ఒక్కోసారి దాన్ని వదలాలి, ప్రవహించనివ్వాలి, దానితో బాటూ మనమూ ప్రవహించాలి. మన చదువుల్లోనూ, పరీక్షల్లోనూ- అన్నింటా ఈ సంగతి గుర్తుంచుకోవాలి- ఎప్పుడూ బిగపట్టుకోనూ కూడదు, అట్లా అని ఎప్పుడూ బలాదూరుగా ఉండనూ కూడదు. ఎప్పుడు ఏది అవసరమో గుర్తించుకుంటూ అప్పుడు ఆ పని చేయాలి" అని.  మీరేమంటారు? ........ kottapalli.in సౌజన్యంతో

బాల కార్మికులు

బాల కార్మికులు   14సం|| లోపు వయసు గల పిల్లల్ని కొన్ని అంతర్జాతీయ చట్టాలు ’బాలలు’ అని గుర్తిస్తాయి. అయితే కొన్నిచట్టాల ప్రకారం మన దేశంలో 18సం ||కు తక్కువ వయసుగలవారంతా కూడా బాలలే. పేదరికం పెరగడం కారణంగా భారతదేశంలో చాలామంది పిల్లలు చదువులు మాని, కఠినమైన పనులు చేస్తూ బాలకార్మికులు అవుతున్నారు. ’వీరంతా బాలకార్మికులుగా ఎందుకు మారుతున్నారు’ అన్నది మనం అందరం ఆలోచించవలసిన విషయం. ఎక్కువగా పల్లెలో ఉన్న పిల్లలే బాలకార్మికులుగా మారుతుంటారు-ఎందుకంటే వారికి తినడానికి తిండి లేక. వాళ్ళ పెద్దవాళ్ళు తమ పిల్లలను చదివించే స్తోమతు లేక, పట్టణాలలో స్వీట్ షాపుల్లోను, బీడీ అంగళ్లలోను, ఆడపిల్లల్నైతే ఇళ్లలో పని మనిషులుగాను పెట్టి, వారు తెచ్చిన డబ్బుల్ని కూడా తీసుకుని వాడుకుంటారు. కాని ఆ పిల్లలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిద్రలేకుండా గొడ్డుచాకిరి చేస్తారు . రాజకీయ నాయకులు, పెద్ద మనుషులు ఉపన్యాసాలిస్తారు-’బాలకార్మికుల వ్యవస్థను రద్దుచేస్తాము; వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తాము’ అని. కానీ ఒక్కరు కూడా వాటిని అమలు చేయరు.   భారతదేశంలో ఏ ఇతర దేశాలలో లేనంతగా బాలకార్మికులున్నారు.బాలకార్మికులు లేకుండా ఉండడానికి ప్రభుత్వం మొదట జనాభాని నియంత్రణ చేయాలి. అంతే కాకుండా గ్రామాలలోని పిల్లలకు చదువులు చెప్పడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. బారతదేశంలో మొత్తం 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలకు పోకుండా వ్యవసాయరంగంలోను, కర్మాగారాలలోను పని చేస్తున్నారు . అలా ఉన్న పిల్లలను చూసి ప్రభుత్వం వారికి కావల్సిన సదుపాయాలు చేస్తే మంచిది. బాలలను అలా కర్మాగారాలలో పని మనుషులుగా పెట్టుకున్నవారికి తాఖీదులిచ్చి, వారిని వెంటనే పాఠశాలకు పంపటం మొదలుపెట్టాలని చెప్పాలి. అలా చేయని వారిని ప్రభుత్వం జైల్లో వేసేటట్లు చేస్తే తప్ప మన భారత దేశం ఈ బాలకార్మిక సమస్య నుండి విముక్తి పొందదు.   బాల కార్మికులకు కొన్ని ఆశలు, ఆశయాలు, కష్టాలు ఉంటాయి.మనం వాటిని గుర్తించి, వారికి చదువు చెప్పడం వలన చాలా లాభం కలుగుతుంది. బాల కార్మికులను చిన్న చూపు చూస్తే వారు ఎదగరు, అలాగే వుంటారు. అంతే కాకుండా మిగిలిన పిల్లలు కూడా వారిలా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వారిని చిన్నచూపు చూడటం మాని, వారికి సరైన అవకాశాలు కల్పించి, వారు కూడా జనజీవనంలో కలిసిపోయేందుకు అవకాశాలు కల్పించాలి. .......... kottapalli.in సౌజన్యంతో

వేటగాడి దురాశ ( కథ)

వేటగాడి దురాశ     ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. అది అక్కడే ఉన్న సరస్సులో నివసించే ఒక కప్పతో స్నేహం చేసింది. కొద్దిరోజుల్లోనే అవి రెండూ మంచి స్నేహితులై పోయాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. సరస్సు దగ్గరున్న నెమలిని చూసాడు. వల విసిరి దాన్ని పట్టుకున్నాడు. అది చూసి కప్ప బాధతో విలవిల్లాడి పోయింది. ‘‘దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది.‘‘నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేం లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్ళి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది’’ అన్నాడు వేటగాడు.కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ‘‘ఒకవేళ నీకు ధనం ఇస్తే నెమలిని వదిలిపెడతావా?’’ అని అడిగింది.‘‘తప్పకుండా!’’ అన్నాడు వేటగాడు. కప్ప నీటిలోకి మునిగి, కాస్సేపటి తరువాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ‘‘ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అని అంది.వేటగాడు ఆ ముత్యాన్ని చూసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య ‘‘వెర్రినాగన్న! ఇది ఎంతో విలువైన ముత్యం. ఒక్కటే తీసుకుని వచ్చావు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి. వెళ్ళి మొత్తం పట్రా!’’ అని చెప్పింది. వేటగాడు తిరిగి అడవికి బయలుదేరుతుంటే అతని భార్య ‘‘ఈ ముత్యం తీసుకెళ్ళి ఆ కప్పకు చూపించి ఇలాంటివే ఇంకొన్ని తీసుకురమ్మని చెప్పు. లేదంటే ఇంకేదైనా పట్టుకుని వస్తుంది’’ అంది. వేటగాడు సరస్సు దగ్గరకు వెళ్ళి కప్పను కలుసుకున్నాడు. ‘‘మళ్ళీ వచ్చావేమిటి?’’ అని అడిగింది కప్ప. ‘‘నాకు ఇలాంటి ముత్యాలు ఇంకొన్ని కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను’’ అని బెదిరించాడు.‘‘సరే, నీ చేతిలోని ముత్యం ఇలా ఇవ్వు. అలాంటివే వెదికి తెస్తాను’’ అంది కప్ప. వేటగాడు ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా ఈది వెళ్ళి ‘‘అత్యాశతో చేతిలో ఉన్నది కాస్తా పొగొట్టుకున్నావు. నా స్నేహితురాలు అడవిలోకి వెళ్ళిపోయింది. నీకు దొరకదు. నేను కూడా దొరకను. వస్తా’’ అని చెప్పి బుడుంగున నీటిలోకి మునిగిపోయింది. Courtesy.. http://podupukathalu.blogspot.in

వరద

వరద వరద వచ్చింది- పల్లెలకు పల్లెలే మునిగిపోయాయి. ఇళ్లలో ధాన్యంతో సహా అన్నీ మట్టిలో కలిశాయి. త్రాగేందుకు శుభ్రమైన నీళ్లు కరువయ్యాయి. ఎన్ని పశువులు, పక్షులు చచ్చిపోయాయో లెక్కలేదు. ఎందరి బ్రతుకులు అల్లకల్లోలమయ్యాయో లెక్కలేదు. రాజాల్లాగా బ్రతికిన రైతులంతా ఇతరుల దయాధర్మాలమీద జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకైంది ఇలాగ? బహుళార్ధ సాధక ప్రాజెక్టులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి, నిజమే. అయితే దీనికోసం ఆ జలాశయాలనిండా నీళ్లుండాలి. అట్లా నీళ్ళు నిండుగా ఉంటే, మరి అవి వరదల్ని ఆపలేవు. ఇప్పుడు జరిగింది అదే. ఈ వరదల్ని ప్రకృతి తేలేదు. ఇవి పూర్తిగా మానవ నిర్మితాలు! "కరెంటు కక్కుర్తీ, కాలువ ప్రాంతాల ఒత్తిడీ ఎప్పుడూ గెలుస్తాయి- జలాశయాల్ని ఖాళీగా ఏనాడూ ఉండనివ్వవు. అందుకని, పెద్ద ప్రాజెక్టులు తప్పనిసరిగా వరదల్ని తెస్తాయి." అని పర్యావరణ ఉద్యమకారులు ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తూనే వచ్చారు. ఎవ్వరమూ వినలేదు. "చిన్న ఆనకట్టలు మంచివి. చెరువులు బాగు చేయించుకోవాలి. వర్షపునీటిని సరిగా వాడుకోవాలి. నేల కోతను ఆపాలి. భూమి పైపొరల్ని కాపాడాలి. వర్షాధారిత పంటలకు పెద్దపీట వేయాలి. విద్యుత్తు వినియోగం తగ్గించుకోవాలి. పెద్ద డ్యాముల్లో పేరుకుపోయే బురద రానురాను మరిన్ని సమస్యల్ని సృష్టించనున్నది. అందువల్ల వాటిపైన ఆధారపడటం తగ్గించుకోవాలి" అని మేధాపట్కర్ లాంటివాళ్ళు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందేమో చూడాలి. మనుషులం, ప్రకృతితో ఎంత పెద్ద స్థాయిలో తలపడతామో, మానవ తప్పిదాలకు అంత పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తున్నది. అందుకని, పెద్ద పెద్ద ప్రణాలికల్ని ప్రక్కన పెట్టి, కొంచెం తగ్గి వ్యవహరించటంలోనే విజ్ఞత ఉన్నదనిపిస్తుంది- ఏమంటారు? - kottapalli.in సౌజన్యంతో