దుస్తులు... వ్యక్తిత్వం

  దుస్తులు-వ్యక్తిత్వం   ఒక ఊళ్ళో వినోద్ అనే పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళది ధనవంతుల కుటుంబం. అతను ఎప్పుడూ ఖరీదైన బట్టలే వేసుకునేవాడు. ఒక రోజున వినోద్ బడికి వెళ్తుంటే దారిలో ఒక అబ్బాయి కనిపించాడు- వాడు వినోద్ ని చూసి నవ్వుతూ "నా పేరు శీను. మేము ఈ వీధిలోకి కొత్తగా వచ్చాం. నేను కూడా మీ బడిలోనే చదువుతున్నాను!" అని చెప్పాడు. శీను వేసుకున్న నలిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వినోద్ కి ఏమాత్రం నచ్చలేదు. వాడు శీనుతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా, ముఖం ప్రక్కకు తిప్పుకొని, గబ గబా నడుస్తూ వెళ్ళి-పోయాడు. శీను పాపం, చిన్నబోయాడు. ఆ రోజున బడిలో కూడా చాలాసార్లు ఎదురయ్యాడు శీను- కానీ అన్నిసార్లూ ఈసడింపుగా ముఖం తిప్పుకుంటూనే ఉన్నాడు వినోద్. "వీడికేముంటై, తెలివి తేటలు?" అనుకున్నాడు తప్ప, శీనుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అయినా వినోద్ దృష్టిలో శీను విలువ ఏమాత్రం పెరగలేదు- "నాకు వాడంటే ఇష్టం లేదు-అంతే! నేను అట్లాంటి వాళ్లతో మాట్లాడనే మాట్లాడను!" అనుకున్నాడు .   అయితే ఆ తర్వాత ఒక రోజున వినోద్ బడికి వెళ్తూండగా అనుకోకుండా ఒక చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడబోయింది. సమయానికి దగ్గర్లోనే ఉన్న శీను ముందుకి దూకి, వాడి చెయ్యి పట్టుకొని ఇవతలికి లాగకపోతే వాడు ఆస్పత్రి పాలై ఉండేవాడు! చుట్టూ ఉన్నవాళ్లంతా శీనును మెచ్చుకున్న తర్వాత, వినోద్‌కు అర్థమైంది, అతని మంచితనం ఏమిటో! తను వాడిని ఎంతో చులకనగా చూసినప్పటికీ, అది మనసులో పెట్టుకోకుండా తనను కాపాడాడు వాడు! వినోద్ శీనుకు కృతజ్ఞతలు చెప్పటమే కాకుండా తన ప్రవర్తన పట్ల క్షమాపణ కోరాడు. అటు తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. శీను స్నేహం వల్ల వినోద్ కూ మంచితనం అలవడింది! Courtesy.. kottapalli.in

దానం ధర్మం

దానం ధర్మం రచన: T.నాగమణి, 6వతరగతి, టింబక్టు బడి. చిత్రాలు: శివ, మహేశ్, జెయన్‌టియు, హైదరాబాదు.   అవంతీపురం అనేరాజ్యాన్ని విజయుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆ రాజు భార్య మందార- వారికి సంతానం లేదు; అందుకని ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ రాజు మాత్రం తన రాజ్యంలోని ప్రజలను చాలా పీడించి, హింసించి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాదు- కరువుకాటకాలు వచ్చినప్పుడు కూడా ప్రజలను పట్టించు-కునేవాడు కాదు. పైపెచ్చు వారిపైన ఇంకా ఎక్కువ పన్నులు వేసి, పన్నులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేసేవాడు. తన ఖజానాలోని డబ్బులను ఎంత మాత్రం ఖర్చు చేసేవాడు కాదు. ఏ మాత్రం దాన ధర్మాలు చేసేవాడుకాదు. రాజు రాణి ఇద్దరూ సంతానం కోసం తిరగని చోటు లేదు; చూడని గుడి లేదు. చివరికి, అట్లా తిరుగుతూ,తిరుగుతూ వాళ్ళు ఒక ముని ని కలుసుకున్నారు. అప్పుడు ఆ ముని తన దివ్య దృష్టితో చూసి, రాజుతో "చూడండి, మీరు చేసిన పాప ఫలం ఇది. ఇప్పటికైనా గుర్తించండి- ప్రజలంటే ఎవరో కాదు- రాజుకు ప్రజలంతా బిడ్డలే. అలాంటి ప్రజలను పీడించటం వల్ల మీకంటూ వేరే సంతానం కలగలేదు. కాబట్టి, మీ జీవితాలు బాగుపడాలంటే మీరు మీ పిసినారి తనాన్ని విడిచిపెట్టాలి. ఘనంగా దాన ధర్మాలు చేయాలి. పేదలను హింసించకూడదు . అప్పుడు, మీ పుణ్యం కొద్దీ మీకు సంతానం కలుగుతుంది" అని చెప్పాడు. ఆ మాటలు రాజు-రాణి ఇద్దరిలోనూ అలజడి రేపాయి. వాళ్ళు మునికి ధన్యవాదాలు చెప్పి తమ రాజ్యానికి వెళ్ళారు. అటుపైన రాజుగారు పూర్తిగా మారిపోయినట్లు, గుడులు, సత్రాలు కట్టించాడు; దానధర్మాలు చేశాడు; బలవంతపు పన్నుల వసూళ్లు మానుకున్నాడు; 'ఆ రాజు-ఈ రాజు ఒకరేనా' అన్నట్లు ప్రవర్తించాడు. అనతి కాలంలోనే ఆ దంపతులకు ఒక పాప పుట్టింది. రాజు, రాణి, రాజ్య ప్రజలు అందరూ ఎంతో సంతోషించారు. ఆ పాప పుట్టిన తరువాత కొన్నేళ్ళపాటు రాజ్యం చాలా సుభిక్షంగా ఉండింది. సకాలానికి వర్షాలు వచ్చాయి; పంటలు బాగా పండాయి; ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు- రాజ్యంలో మళ్ళీ‌ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఒక ఏడాది. ప్రజల మేలు కోసం ఖజానాలోంచి డబ్బులు బయటికి తీయాలనేసరికి రాజుకు మళ్ళీ లోభం పుట్టింది. 'ప్రజావసరాలు తీరాలంటే ప్రజలు పన్ను కట్టకపోతే ఎలా?'అన్నాడు. ప్రజలు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి- రాజుగారు ప్రజలను హింసించడం మళ్ళీ నిత్య కృత్యమైంది. ఈలోగా రాజు కూతురు కూడా పెరిగి పెద్దదైంది. ఒక రోజు పాపకు జబ్బు చేసింది. రాజు వైద్యులకు చూపించాడు, కాని జబ్బుమాత్రం తగ్గలేదు. రాజ్యంలోని వైద్యులందరిని పిలిపించి పాప జబ్బును నయం చేయమన్నాడు రాజు. కానీ ఏవైద్యుడూ పాపకొచ్చిన జబ్బును నయం చేయలేకపోయాడు.   రాజుకు చాలా భయం వేసింది. ఒక్కగానొక్క పాప దూరం ఐపోతుందేమోనని బాధపడ్డాడు, చివరికి ఆ సమయంలో రాజుకు ముని గుర్తుకొచ్చాడు. "రాజుకు ప్రజలంతా బిడ్డలే" అని ముని చెప్పటం గుర్తుకొచ్చింది. 'తను ఆ సంగతిని ఎంత త్వరగా మర్చిపోయాడు?!' అని విచారం వేసింది. పశ్చాతాపంతో రాజు మునిని స్మరించి, తనను క్షమించమని వేడుకొన్నాడు. ఆక్షణంలోనే ఆయన తన మనసును ప్రజా సంక్షేమం వైపుకు మరల్చాడు. ప్రజలనుండి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని తిరిగి వాళ్ళకోసమే ఖర్చు చేసేటట్లు ఆజ్ఞలు జారీ చేశాడు. పంటకాలువలను, చెరువులను, నీటి పారుదల వ్యవస్థలను, జల సేకరణ వ్యవస్థలను బలోపేతం చేసేసరికి, రాజ్యం మళ్లీ ఒక గాటన పడింది. ఆలోగా యువరాణి ఆరోగ్యమూ బాగుపడింది. తను మంచిపనులు చేయటం వల్లనే తన కూతురు బ్రతికిందన్న విశ్వాసంవల్లనేమో, రాజు అటుపైన ఎన్నడూ ప్రజల్ని కష్టపెట్టలేదు. కాలక్రమేణా ఆయనలోని క్రూరత్వం అంతా పోయి, సహజమైన దయాగుణం వేళ్ళూనుకున్నది. 'విజయ మహారాజు మంచివాడు' అన్న ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది.   Courtesy.. kottapalli.in

తృప్తి

  తృప్తి   అనగనగా శివలింగాపురం అనే ఊళ్ళో రంగయ్య-సోమయ్య అనే అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళకున్న ఆస్తల్లా పూర్వీకులు ఇచ్చిన ఐదెకరాల భూమీ- ఓ పాత ఇల్లూనూ. వాటితోటే రెండు కుటుంబాలూ బ్రతుకు లాగేవి. అన్నదమ్ములిద్దరూ కలిసి తమ భూమిలో పంటలు పండించేవాళ్ళు; వచ్చిన లాభాన్ని ఇద్దరు పంచుకొని తృప్తి పడేవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఓ షావుకారు ఉండేవాడు. అతని దగ్గర అంతులేని డబ్బు ఉండేది; కానీ ఎప్పుడూ ఏవేవో‌ బాధలు. రంగయ్య సోమయ్యలను చూస్తే అతనికి చాలా అసూయగా ఉండేది: "ఇదేంటి, నాకు ఇంత డబ్బు ఉన్నా సంతోషం లేదెందుకు? నాతో పోలిస్తే వాళ్ళకు అసలు ఏమీ లేదే, అయినా వాళ్ళు అంత సంతోషంగా ఎలా ఉండగల్గుతున్నారు?" అని. అయితే అతని ప్రశ్నకు సమాధానం తెలిసే అవకాశం లేదు- రంగయ్య-సోమయ్యలను అడిగితే కూడా ప్రయోజనం ఏమీ లేదు- వాళ్ళ సంతోషానికి కారణం వాళ్ళకే తెలీదు మరి! ఇలా ఉండగా షావుకారుకు చిన్నతనంలో పాఠాలు చెప్పిన గురువుగారు ఒకరోజున అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. షావుకారు ఆయన్ని ఆదరించి, భోజనం పెట్టి, తినేటప్పుడు దగ్గర కూర్చొని విసనకర్రతో విసరుతూ, ఎదురింట్లోని రంగయ్య-సోమయ్యలను చూపించి, "గురువుగారూ! నాకు ఇంత డబ్బు ఉన్నా సంతోషం లేకుండా ఉన్నదెందుకు? ఆ ఎదురింట్లో వాళ్ళకు ఏమీ లేదు కదా, అయినా అంత సంతోషంగా ఉన్నారు ఎందుకని? లోకాచారం ప్రకారం డబ్బుంటే అన్నీ ఉండాలి కదా స్వామీ?" అన్నాడు. గురువుగారు అప్పుడు "నాయనా! ఉన్న దాంతో తృప్తి పడేవాడే ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు తప్ప, డబ్బు ఉన్నవాడు కాదు. అందులో కూడా సంతోషం అనేది అందరికీ ఉండదు- తృప్తిగా ఎందుకుండాలో అర్థం చేసుకొని, దాన్ని జీవితంలో నిలుపుకోవాలనుకునేవాడికి తప్ప, వేరొకరికి ఆ భాగ్యం ఉండదు. కావాలంటే ప్రయత్నించి చూడు" అంటూ ఒక ఉపాయం చెప్పాడు. ఆ రోజునే దాన్ని అమలు చేశాడు షావుకారి. ఎదురింటి రంగయ్య-సోమయ్యలను పిలిచి "మీరు ఇంత సంతోషంగా ఉండటం చూసి నా మనసు నిండిపోతున్నది. 'నేనూ మీలా ఉండగల్గితే బాగుండును' అనిపిస్తున్నది. మీకిద్దరికీ నా తరపున చిన్నపాటి బహుమతి ఇస్తాను-కాదనకండి" అంటూ ఇద్దరికీ చెరొక వంద బంగారు నాణాలు ఇచ్చి వచ్చాడు. తన వంతు డబ్బును కొడుకుకి, భార్యకు చూపించాడు రంగయ్య. వాళ్ళిద్దరూ మురిసిపోయారు. వాళ్ల సంతోషాన్ని చూసి రంగయ్య కూడా మురిసిపోయాడు. రంగయ్య కొడుకు ముందుకొచ్చి ఒక నాణెం తీసుకోబోయాడు. నాణాల సంచీని గబుక్కున వెనక్కి లాక్కున్నాడు రంగయ్య. భార్య ఒక నాణాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుండగా భార్యని తిట్టి ఆ నాణాన్నీ లాగేసుకున్నాడు. 'ఏనాడూ లేనిది ఇవాళ్ల ఇలా ప్రవర్తిస్తున్నాడేమి?' అంటూ భార్య, కొడుకు ఇద్దరు ముఖాలు ముడుచుకున్నారు. రంగయ్య ఇవన్నీ గమనించే స్థితిలో లేడు: 'నాణాలను ఎలా దాచాలి? ఎక్కడ దాచాలి? ఇంట్లో ఉంచితే భార్య-కొడుకు వీటిని మిగలనివ్వరు' అని దీర్ఘంగా ఆలోచించటం మొదలు పెట్టాడు. చివరికి వాటిని తీసుకెళ్ళి తన పొలంలోనే ఎవ్వరూ చూడకుండా ఒక గుంతలో దాచి పెట్టాడు. రోజూ ఒక్కడే వెళ్ళి, గుంతను త్రవ్వి, బంగారు నాణాలను బయటికి తీసి, లెక్కపెట్టుకొని, మళ్ళీ యథాప్రకారం పాతిపెట్టి ఇంటికి రాసాగాడు రంగయ్య. ఇక సోమయ్యకూడా షావుకారు తనకిచ్చిన నాణేలను భార్య, పిల్లలకు చూపించాడు. వాళ్ళూ చాలా ఆనందపడ్డారు. అయితే వెంటనే సోమయ్య భార్య అడిగింది: "షావుకారు మామూలుగా ఎవరికీ‌ ఏమీ ఇచ్చే రకం కాదే, మరి ఈ నాణాలను మనకి ఎందుకిచ్చాడబ్బా?" అని. "ఏమో, మనం సంతోషంగా ఉండటం చూసి ఇచ్చాడట. తనకూ మనలాగా ఉండాలని ఉందట" చెప్పాడు సోమయ్య. సోమయ్య భార్య "అవునా!" అని ఊరుకున్నది. అది విన్న సోమయ్యకూ కొంచెం‌ అనుమానం వేసింది. "ఇందులో ఏదో మనకు తెలీని మతలబు ఉండవచ్చు. అందుకని అసలు ఈ నాణాలు మనవి కావనుకుందాం. ఎక్కడైనా భద్రంగా పెట్టి, ఇక పట్టించుకోనట్లు వదిలేద్దాం. ఆ సొమ్ము మనదే అయితే పర్లేదు; లేకపోతే షావుకారు మళ్ళీ వచ్చి అడుగుతాడు-ఇచ్చేయచ్చు. ఏమంటావు?" అన్నాడు సోమయ్య. "అదే మంచిది" అని భార్య-పిల్లలు అన్నమీదట, వాళ్లంతా కలిసి దాన్ని ఇంటి పెరట్లో ఒక మూలన పాతిపెట్టి, ఇక ఆ సంగతి మరచిపోయారు. షావుకారు తన పథకం ప్రకారం ఇద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు. తను ఇచ్చిన నాణాలను ఎవరు ఎక్కడ దాచారో కూడా చూశాడు. రంగయ్య ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. సోమయ్య మటుకు ఎప్పటిమాదిరే ప్రశాంతంగా ఉన్నాడు. ఇద్దరినీ చూసిన షావుకారు నవ్వుకున్నాడు. తన గురువుగారికి మనసులోనే నమస్కారం పెట్టుకున్నాడు. పధకంలో రెండో భాగానికి శ్రీకారం చుట్టాడు. తర్వాతి రోజున పొలంలో ఖాళీ గుంతను చూసిన రంగయ్యకు గుండె ఆగినంత పనైంది. రంకెలు వేసుకుంటూ, గుండెలు బాదుకుంటూ, ఊరంతా అల్లరి చేస్తూ పరుగులు పెట్టాడతను- "నా డబ్బెవరు దొంగిలించారు?" అని పెడబొబ్బలు పెట్టాడు. రంగయ్య కుటుంబ సభ్యులందరూ గొల్లుమన్నారు. ఇరుగు పొరుగులంతా చేరి వాళ్లను ఓదార్చాల్సి వచ్చింది. రంగయ్యకు ఆ రోజునుండీ కంగారు ఎక్కువైంది; అతని ఆరోగ్యం కూడా బాగా చెడిపోయింది. ఇంటికి వెళితే కంచంలోనూ గ్లాసుల్లోనూ ముద్దకు, నీళ్లకు బదులు బంగారు నాణేలే కనబడసాగాయి. 'నా పిల్లలెలా బ్రతుకుతారు? ఇప్పుడెలా?' అన్న బెంగతో అతను చిక్కి సగం అయిపోయాడు. ఈ సంగతి తెలిసి, "విన్నారా, షావుకారు మీ అన్నకిచ్చిన సొమ్మును ఎవరో ఎత్తుకెళ్ళారట. మన సొమ్ము ఎలా ఉందో మరి?" అన్నది సోమయ్య భార్య. ఇద్దరూ కలిసి పెరట్లో త్రవ్వి చూశారు- నాణాలు లేవు! "నేను అప్పుడే అన్నానుగా, మనది కాని సొమ్ముకు మనం ఆశ పడకూడదు" అన్నది సోమయ్య భార్య. "అవును. ఆ సొమ్ము మనది కాదు- అందుకే పోయింది" అన్నాడు సోమయ్య, తిరిగి గుంతను పూడ్చేస్తూ. అటుపైన వాళ్ళంతా ఎప్పటిమాదిరే ప్రశాంతంగా నిద్రపోయారు. వీళ్ళిద్దరినీ గమనిస్తున్న షావుకారికి అర్థమైంది: సంతోషానికి కారణం తృప్తి. అయితే తృప్తి అనే జీవితాదర్శం నిలవాలంటే దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలోకి స్వాగతించటం అవసరం. అలా కానప్పుడు, 'తృప్తి' అనే ఆ వస్తువు యాంత్రికంగా నిలవజాలదు. ఏదో ఒకనాడు అది పోతుంది; అసంతృప్తినే మిగుల్చుతుంది. తృప్తిని తమ స్వభావంలో ఒకటిగా చేసుకోగల్గినవాళ్ళు ధన్యులు. మరునాడు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిన షావుకారు ఇద్దరి చేతుల్లోనూ రెండు వందల నాణాలు పెడుతూ "మిమ్మల్ని ఆందోళనకు గురిచేశాను- నన్ను క్షమించండి. మీరు దాచిన సొమ్మును అవసరం కొద్దీ తిరిగి తీసుకున్నది నేనే. మీకు ముందుగా చెప్పి ఉండాల్సింది" అన్నాడు. రంగయ్య వాటిని తీసుకొని, గుండెలకు హత్తుకుంటూ నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు. సోమయ్య చిరునవ్వు నవ్వాడు. షావుకారుకు సోమయ్యంటే గౌరవం మరింత పెరిగింది. Courtesy.. kottapalli.in

చెప్పులకు బుద్ధొచ్చింది!

చెప్పులకు బుద్ధొచ్చింది!     రాముకు చెప్పులంటే చాలా ఇష్టం. ఎవరి చెప్పుల్ని చూసినా తనకూ అలాంటి చెప్పులుంటే బాగుండుననుకునేవాడు. ఒకసారి అతను అనంతపురం వెళ్లాడు. అక్కడ దుకాణాల ముంగిట, వరసలు వరసలుగా మెరుస్తున్న చెప్పులు అతన్ని కదలనివ్వలేదు. చూసీ చూసీ చివరికి అతనో జత చెప్పులు కొనుక్కున్నాడు. ఎర్రటి చెప్పు క్రింద నల్లటి తోలు! పైన అందంగా అమర్చిన బంగారు రంగు చంకీ! చెప్పులు భలే ఉన్నై! అవి వేసుకొని తిరిగితే గాలిలో ఎగిరినట్లే ఉంది! చాలా ఉత్సాహంగా ఆ చెప్పుల్ని వేసుకొని ఇంటికొచ్చాడు అతను. ఇంటికైతే వచ్చాడుగానీ వాటిని వదలబుద్ధి కాలేదు. వాటిని వేసుకొని ఇంట్లో అంతా తిరిగాడు; మళ్లీ మళ్ళీ వాటినే చూసుకొని మురిశాడు. అయినా తనివి తీరలేదు. వాటిని వేసుకొనే అన్నం తిన్నాడు; వాటిని వేసుకొనే నిద్రపోయాడు, నిద్రలేచాక మళ్లీ వాటిని చూసుకొని మురిశాడు - ఏం చేసినా తృప్తి కాలేదు! ఇక అవి అతని శరీరంలో భాగం అయిపోయాయి. క్షణం వదలకుండా వేసుకొని తిరుగుతున్నాడు రాము. మామూలుగా `చెప్పులకేం తెలీద'నుకుంటాం గానీ, నిజానికి వాటికీ చాలానే తెలుసు. అవీ అలసిపోతాయి. రాము ఇలా వాటిని వదలకుండా వారం రోజులు వేసుకునే సరికి వాటికి ఎలా తప్పించుకుందామా' అని అలోచన మొదలైంది. కానీ రాము వాటిని వదిలితే గద! చివరికి ఒకసారి రాము గుడికి వెళ్ళి, అయిష్టంగానే చెప్పుల్ని బయట వదిలి, లోనికి పోగానే - చెప్పులు రెండూసమయమిదే'నని చల్లగా జారుకున్నాయి. అట్లా పారిపోయిన చెప్పులకు ఏం చేయాలో తెలీలేదు. అందుకని అవి ఓ అడవిలోకి వెళ్లి ఒక పొద మాటున నక్కి కూర్చుని, ఓం నమ: శివాయ' అని జపం మొదలుపెట్టాయి. వాటి మొరను ఆ శివుడు విన్నాడో లేదో గాని, ఆ దారిన పోయే కట్టెల రంగయ్య మాత్రం చక్కగా విన్నాడు. విని, అతను వచ్చి ఆ చెప్పుల్ని వేసుకొని రాజాలాగా నడవటం మొదలుపెట్టాడు! చెప్పుల పనిపెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు'యింది. రంగన్న బరువు ఎక్కువ. అదీగాక అతను అడవి దారుల్లో ఇష్టం‌వచ్చినట్లు తిరిగేరకం. ఆ చెప్పులు వేసుకొని బరువైన రంగన్న ముళ్ల దారుల్లో పోతుంటే ఒక్కోముల్లూ వాటిని గుచ్చి, శూలంలాగాఅ బాధపెడుతున్నది. రెండు రోజుల్లో వాటి పనైపోయింది! "ఈ అడవి బ్రతుకు బాగాలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి రంగన్న నుండి" అనుకున్నై అవి. త్వరలోనే వాటికి ఆ అవకాశం వచ్చింది. రంగన్న ఒక రోజున వాటిని విడిచి చెట్టెక్కి, కొమ్మలు నరికాడు. ఆపైన క్రిందికి దిగి కట్టెలు కొట్టుకొన్నాడు ; తర్వాత మోపునెత్తుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడు - చెప్పులు మరచి! చెప్పులకు మహదానందమైంది. ఇక అవి రెండూ పారిపోయి, అడవి చివర్లో ఓ గడ్డివాము కనబడితే, దానిలోకి పోయి దాక్కున్నాయి. ఆవుల్ని మేపే ఆదెయ్య అటువైపు వచ్చేసరికి చెప్పులు గాఢ నిద్రలో ఉన్నాయి. కానీ ఆదెయ్య పశువులకోసమని గడ్డి పీకేసరికి అవీ బయటపడ్డాయి. ఇక చెప్పులకు ఆదెయ్య సేవ తప్పలేదు. ఆదెయ్య పశువుల పేడనెత్తినా, మూత్రాన్ని ఎత్తిపోసినా ఈ చెప్పులు వినియోగంలోకి వచ్చాయి. ఎరువు దిబ్బల వెంబడీ, వరిచేళ్ల గట్ల వెంబడీ, జారే జారే బురదలోనూ నడిచీ నడిచీ చెప్పులు నల్లబారాయి. ఇప్పుడు వాటికి బంగారు చంకీలు లేవు. ఎర్రటి పైతోలు లేదు. బంకమన్ను, గడ్డిపోచలు అంటుకొని అవి ఇప్పుడు లావెక్కాయి, బరువుతేలాయి. "ఇది ఇక అయ్యేది లేదు. తప్పించుకోవలసిందే" అనుకున్నై అవి. "రాము మమ్మల్ని ఎంత ముద్దుగా చూసుకునేవాడు! అట్లాంటి వాడిని వదిలి వచ్చేశాం, చూడు" అని వాటిలో పశ్చాత్తాపం మొదలైంది. ఒక రోజున ఆదెయ్య వాటిని వేసుకొని ఊళ్లోకి పోతే, అయిష్టంగానే మోశాయవి. వాటి కోరిక తీరాలనో, ఏమో- ఆదెయ్య వాటిని ఓ ఇంటి ముందు వదిలి, లోనికి వెళ్ళాడు. చూస్తే ఆ ఇల్లు ఎవరిదో కాదు - రాముదే! చెప్పులకు మహదానందమైంది. అవి ఆదెయ్యకు దొరకకుండా తప్పుకొని వేరే మూలన దాక్కున్నాయి. బయటికి వచ్చిన ఆదెయ్య కొంచెం వెతుక్కుని, `సర్లే, పోతే పోయాయి" అనుకొని వెళ్లిపోయాడు. వెంటనే చెప్పులు బయటికి వచ్చి గడప పక్కనే కూర్చున్నాయి - 'రాము తమని ఎప్పుడు చూస్తాడో, ఎప్పుడు మళ్ళీ ముద్దు చేస్తాడో' అని ఎదురుచూస్తూ. రాము ఆ పక్కగా చాలాసార్లు వెళ్ళాడు. కానీ వాటివైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు. ఒకరోజున- `ఎవరో వీటిని ఇక్కడ వదిలేసిపోయారు. పాత మురికి చెప్పులు! ఎవరికి పనికొస్తాయి?" అని రాము వాళ్ల అమ్మ ఆ చెప్పుల్ని తీసి బయట ఓ పక్కకు విసిరేసింది! Courtesy.. kottapalli.in

దేవుడు విన్నాడు!

దేవుడు విన్నాడు!     ఒకసారి ఒక పసుపుముద్దకు తన రంగంటే అసహ్యం వేసింది. "ఏంటి, ఈ రంగు? ఎప్పుడూ పచ్చగానేనా? తను ఎంచక్కా వేరే రంగుకు మారిపోతే ఎంతబాగుండును?" అనుకున్నదది. కానీ అలాంటి అవకాశమే కనబడలేదు. మంచి రంగులు ఏవి కనబడ్డా వాటిని తెచ్చి తనపైన పూసుకునేదది. అయితే అవన్నీ రాలిపోయేవి, కారిపోయేవి తప్ప - నిలిచేవి కావు. అప్పుడు అది దేవుని దగ్గరకు బయల్దేరింది - తన రంగు మార్చమని వేడుకునేందుకు. వెళ్తూంటే, దారిలో దానికో సున్నపుముద్ద ఎదురైంది. "ఏంటమ్మా పసుపూ, ఎటు? బయలుదేరావు?" అన్నది సున్నం, పసుపు హడావిడిని చూసి. "దేవుడి దగ్గరికి వెళ్తున్నానమ్మా, నా రంగు మార్చేయమని అడిగేందుకు. నాకు ఈ రంగు నచ్చలేదు" అన్నది పసుపు. "అవునా, అయితే నేనూ వస్తాను నీ వెంట. నాకూ ఈ రంగు నచ్చలేదు. మార్చమని అడుగుతాను నేనున్నూ!" అని సున్నం పసుపు వెంట బయలుదేరింది. మధ్యదారిలో చాలా చోట్ల అవి రెండూ ఒకదానికొకటి సాయం చేసుకున్నాయి. కొన్నిచోట్ల సున్నం పసుపుచేయి పట్టుకొని పైకిలాగింది. కొన్ని చోట్ల పసుపు సున్నాన్ని కాపాడింది. రెండూ‌గమనించలేదు - రెండింటి చేతులూ ఎర్రగా మెరవటం‌మొదలెట్టాయి. అయితే అవి రెండూ ఇంకా దేవుడి దగ్గరికి చేరకనే పెద్ద వాన మొదలైంది! తలదాచుకునే చోటులేదు - పసుపుముద్ద ఆ వానకు తట్టుకోలేక పగిలిపోతున్నది. తోటిదాన్ని కాపాడదామని, సున్నం తన చొక్కాలోనే పసుపును దాచుకొని కాపాడింది. బయటికి వచ్చిన తర్వాత చూస్తే, పసుపు, సున్నం రెండూ‌ఎర్రబారాయి పూర్తీగా! ఒక్కసారి అవిరెండూ ఒకరిముఖాన్నొకటి చూసుకుని, సంతోషంగా నవ్వాయి. ఆపైన, ఏదో అర్థమైనట్లు, వెనక్కి తిరిగి ఇంటిదారి పట్టాయి - తమ రంగులు మారే మార్గం చూపిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ. Courtesy.. kottapalli.in  

జ్ఞానోదయం

జ్ఞానోదయం "సోము మొదట్లో చదువులో వెనుకబడ్డా అనంతరం రాకెట్‌లా దూసుకెళ్ళాడు. ఇకనైనా మారండి, మీరూ రాకెట్‌లా దూసుకెళ్ళండి" అని ఓ కథ రాసి పంపారు రియాజుద్దీన్ గారు.. కథ ఎలాఉందో మీరే చదివి చెప్పాలి.. రచన: షేక్ రియాజుద్దీన్ అహమద్, తెలుగుపండితులు, శ్రీ విద్యారణ్య యు.పి.స్కూల్, అనంతపురం. మార్పు చేర్పులు: కొత్తపల్లి.   రామాపురంలో వ్యవసాయం చేసుకునే కృష్ణయ్యకు ఇద్దరు కొడుకులు- సోము, రాము. ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచాడు కృష్ణయ్య. "నేను ఎలాగూ చదవలేదు; కనీసం వీళ్లన్నా బాగా చదివితే, అంతే చాలు" అని తపనపడేవాడు అతను. రాము రోజూ బడికి వెళ్ళేవాడు; అయ్యవార్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడు; చక్కగా నేర్చుకొని అందరి మన్ననలను పొందేవాడు. సోము తరచు బడికి ఎగనామం పెట్టేవాడు; అల్లరి చిల్లరిగా తిరిగి, బడి ముగిసే వేళకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. అయితే నిజం ఏమిటో రాము ద్వారా తెలిసేది కదా, తండ్రి ఎప్పుడూ సోమును మందలిస్తూ ఉండేవాడు. "మేరెప్పుడూ నన్నే తిడతారు. రాముని మాత్రం ఏమీ అనరు" అని కుళ్ళేవాడు తప్పిస్తే, సోము మటుకు తన దారిని మార్చుకునేవాడు కాదు. అంతలో "దసరా సెలవుల్ని మీ ఊరిలో గడపదలచుకున్నాం. నేనూ సురేషూ ఇద్దరం వస్తున్నాం" అని హైదరాబాద్‌లో ఉన్న శంకరం బాబాయి ఉత్తరం రాశాడు. శంకరం బాబాయి తెలుగు పండితుడు. ఆయనంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రాము సోములు కూడా బాబాయి రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు. చూస్తూండగానే బాబాయీ, సురేష్, ఇద్దరూ రామాపురం చేరుకున్నారు. తన వెంట తెచ్చిన ఆటవస్తువులను , బొమ్మల పుస్తకాలను ఇస్తూ 'ఎలా చదువుతున్నార్రా?' అని అడిగాడు బాబాయి. "బాగా చదువుతున్నాను బాబాయ్!" చెప్పాడు రాము. సోము ఏమీ జవాబివ్వకుండా దాటవేశాడు. చురుకైన బాబాయి ఆ సంగతిని గమనించాడు. "ఏంటి వీడి కథ?" అని కృష్ణయ్యను అడిగాడు వేరుగా. "ఏం చెప్పమంటావురా, వీడు బడిని ఎగగొట్టి ఎక్కడెక్కడో‌తిరుగుతున్నాడు. ఏం చెప్పినా‌ వినడు!" తమ్ముడితో బాధని వెలిబుచ్చాడు కృష్ణయ్య. "నేను చూస్తానులే, వాడిని నువ్వు ఏమీ అనకు కొన్నాళ్ళు" అని శంకరం అన్నను సముదాయించాడు. ఆ రోజునుండీ‌ శంకరం బాబాయి సోముని జాగ్రత్తగా గమనించటం మొదలు పెట్టాడు. సోము కూడా చురుకైనవాడే. బాబాయి చెప్పే పద్యాలను రాము ఎంత వేగంగా నేర్చేసుకునేవాడో, సోము కూడా అంతే వేగంగా నేర్చుకునేవాడు. అయితే అలా నేర్చుకున్న పద్యాలను రాయమంటే మటుకు వాడు ముడుచుకు పోతాడు! అక్కడినుండి తప్పించుకొని దూరం పోయేందుకు ప్రయత్నిస్తాడు! "ఎందుకురా, నీకు రాయటం అంటే ఇష్టం ఉండదా?" అడిగాడు బాబాయి సోముని. "ఉహుఁ. రాస్తే చేతులు నొప్పులు పుడతాయి. అసలు ఎందుకు, రాసేది?!" అన్నాడు సోము.     బాబాయికి సోము సమస్య అర్థమైంది. "వీడికి రాయటమంటే ఇష్టం లేదు. ఈ సమస్యను మాటలతో పరిష్కరించటం కుదరదు..." మరునాడు బాబాయి తన సంచీలోంచి కొత్తపల్లి పుస్తకం తీసి చదువుకోవటం మొదలు పెట్టాడు. "ఏంటి బాబాయ్! అంత శ్రద్ధగా చదువుతున్నావ్?" అంటూ దగ్గరికొచ్చిన సోము కొత్తపల్లిలో బొమ్మల్ని చూసి ముచ్చటపడ్డాడు. అందులో తనకు నచ్చిన కథనొకదాన్ని వాడికి చదివి వినిపించాడు బాబాయ్- "ఇదిగో సోమూ! కొత్తపల్లిలో సగం కథలు పిల్లలు రాసినవే- కావాలంటే నువ్వూ ఓ కథ రాసి పంపచ్చు. ఇందులో అచ్చైతే నీ కథని ఎంతమంది పిల్లలు చదువుతారో! కథతోబాటు నీ ఫొటో కూడా అచ్చు వేస్తారు వాళ్ళు!" సోముని ఊరించేందుకు ప్రయత్నించాడు బాబాయి. సోము ఉత్సాహం చూపలేదు. అంతలో అక్కడికొచ్చిన సురేశ్ కొత్తపల్లిని చూడగానే ఎగిరి గంతేశాడు- "పోయిన సారిది ఉందా, అందులో నేను రాసి పంపిన కథ ఉంది!" అరిచినంత పని చేశాడు. "అవునా! నీ కథ అచ్చైందా?" ఆశ్చర్యంగా అరిచాడు రాము. ఇద్దరూ ఆ సంచికను వెతుక్కునేందుకు పరుగు పెట్టారు. బాబాయి సోముకేసి చూశాడు. వాడు రాము, సురేష్ వెళ్ళినవైపుకే చూస్తున్నాడు..! బాబాయి తన చేతిలో ఉన్న కొత్తపల్లి పుస్తకాన్ని అక్కడే వదిలేసి పనిపడ్డట్లు బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి వచ్చి చూస్తే అక్కడ కొత్తపల్లీ లేదు; సోము కూడా‌లేడు! ఆరోజు రాత్రి బాబాయి పడుకోబోతుండగా సోము బాబాయి దగ్గరకొచ్చి మెల్లగా అడిగాడు- "నేనేదైనా కథ రాస్తే కొత్తపల్లి వాళ్ళు దాన్ని అచ్చు వేస్తారా?" అని. "ఓ! మా చక్కగా వేస్తారు. ఎందుకెయ్యరు?!" అన్నాడు బాబాయి, నిద్రకు ఉపక్రమిస్తూ. తెల్లవారి బాబాయి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సురేష్ నిలబడి ఉన్నాడు. వాడి ముఖం వెలిగి పోతున్నది- చేతిలో వాడు క్రొత్తగా రాసిన ఓ కథ, గజిబిజిగా గాలికి అటూ ఇటూ కదులుతున్నది! "ఎవరికీ చెప్పకు! దీన్ని కొత్తపల్లి వాళ్ళకు పంపించు! వాళ్ళకిది నచ్చుతుందో నచ్చదో..చూడు" అన్నాడు వాడు గుసగుసగా. బాబాయి కథ చదివి చూశాడు- నిజంగానే అద్భుతమైన కథ! సోము ఇంత చక్కని కథ రాయగలడని ఆనాటివరకూ ఎవ్వరికీ తెలీనే తెలీలేదు! ఆ తర్వాత కొత్తపల్లిలో వరసగా మూడు నెలల పాటు ప్రతినెలా సోము రాసిన కథలు ప్రచురితమయ్యాయి. "ఒరేయ్! నీ కథ కొత్తపల్లిలో వచ్చింది! నువ్వే రాసావా దీన్ని!? నిజంగా?!" అని ఇంట్లోవాళ్ళందరూ గందరగోళ పడ్డారు. ఆ హడావిడిలో ఎవ్వరూ గమనించనే లేదు- సోము ఇప్పుడు బడిని ఎగగొట్టటం లేదు! అర్థ వార్షిక పరీక్షల్లోను, వార్షిక పరీక్షల్లోను వాడికి చాలా మంచి మార్కులు-ఎన్నడూ రానన్ని మార్కులు- వచ్చాయి. "ఒరేయ్! ఇదేంటిరా, ఇట్లా చదివేస్తున్నావు!" అని బళ్ళో టీచర్లందరూ ముచ్చటపడుతున్నారిప్పుడు. సోము కొత్తపల్లికి కథల మీద కథలు రాసి పంపిస్తున్నాడు. వేసవి సెలవుల్లో మళ్ళీ రామాపురం వచ్చిన బాబాయి చేతులు పట్టుకొని కృష్ణయ్య-"భలే మాయ చేసావురా! రాయిలాంటి మా సోము నీవల్ల ఇప్పుడు రత్నంగా మారాడు" అన్నాడు. "కాదు. వాడు ముందునుండీ రత్నమే. 'చదువులు అర్థవంతంగా ఉండాలి' అనేది అందుకనేరా, అన్నయ్యా. 'ఎందుకు చదవాలి, ఎందుకు రాయాలి' అనేది పిల్లలకు ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. సోము చాలా చురుకైనవాడసలు. అయితే వాడికి రాయటం ఎందుకో అర్థంకాలేదు. అందుకనే వాడు మొదట్లో అట్లా ఉండిపోయాడు. కథల పుణ్యమా అని, వాడికి ఇప్పుడు రాయటం ఎందుకో అర్థమైంది- అంతే తేడా!" అన్నాడు బాబాయి, తనూ సంతోషపడుతూ.   Courtesy.. kottapalli.in

సహాయం

సహాయం     ఎప్పటిలాగే ఆ రోజు కూడా పిల్లలంతా బిలబిలమంటూ తాతయ్య చుట్టూ చేరి, కథ చెప్పమని అడిగారు. తాతయ్య మెల్లగా గొంతుసవరించుకున్నాడు. "అబ్బా! వినండర్రా, గోలచేయకండి మరి" అంటూమొదలు పెట్టాడు. దసరా నవరాత్రుల సమయం. ఊరంతా సందడిగా ఉంది. అందరి మొహాల్లో ఆనందం. అయితే ఊరికి ఒక చివరన నివసించే గంగయ్య మాత్రం దిగాలుగా ఉన్నాడు. అతనికి ఒక మనుమడు ఉన్నాడు-చంద్రం. ఆ పిల్లాడి అమ్మానాన్నలు మొన్నటి వరదల్లో కొట్టుకుపోయారు. పండగరోజుల్లో ఆ పిల్లవాడిని చూసుకొని విచార పడుతున్నాడు గంగయ్య. 'తనా వయస్సు పైబడినవాడు- ఈ వయస్సులో వీడినెట్లా సాకాలి?' అని ఆవేదన చెందుతున్నాడు. గంగయ్య వయసులో ఉన్నప్పుడు మేస్త్రీ పని చేసేవాడు. ఆ రోజుల్లో ఇళ్ళు కట్టాలంటే 'ఎవర్ని పిలవాలి' అన్న ప్రశ్నే ఉండేది కాదు- ఊళ్ళో ఏ ఇల్లు కట్టాలన్నా గంగయ్య మేస్త్రీనే. మేస్త్రీ పనిలో గంగయ్య బాగా సంపాదించేవాడు. అయితే ఏనాడూ ఒక్క పైసా కూడబెట్టిన పాపాన పోలేదు- బీడీలలోను, సిగిరెట్లలోను, పేకాటలోను, సారాయిలోను ఆ డబ్బు మొత్తాన్నీ తగలేసేవాడు. కాలం గడచేకొద్దీ కొత్త మేస్త్రీలు పుట్టుకొచ్చారు. ప్రమాదంలో పైనుండి క్రింద పడ్డ గంగయ్య కుంటివాడయ్యాడు. క్రమేణా అతన్ని పనికి పిలిచేవాళ్ళు తగ్గిపోయారు. అందరికీ ఇళ్ళు కట్టించిన గంగయ్యకు ఇల్లే కాదు; తినేందుకు తిండీ కరువైంది. అప్పటికే హాస్టలులో ఉండి చదువుకుంటున్న కొడుకు అంది వస్తాడనుకున్నాడు గంగయ్య. వాడు నిలదొక్కుకున్నట్లే నిలదొక్కుకున్నాడు- ఇప్పుడు ఇదిగో, ఈ పిల్లవాడిని తనమీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి భవిష్యత్తును తలచుకొని ముసలి గంగయ్య కుమిలిపోతున్నాడు. భైరవాపురంలోనే రామయ్య-సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. చిన్ననాటి నుంచీ ఏ పనైనా కలిసి చేసుకొనేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు, స్థితిమంతులయ్యారు. జీవితంలోని ఆటుపోట్లన్నీ ఎదుర్కొని ఉన్నారు. పదిమందికి పనికొచ్చే పనులు చెయ్యటమంటే ఇద్దరికీ ఇష్టం. దసరా పండుగ రోజున ఘనంగా దేవీ పూజ జరిపి ఊరంతటినీ పిలిచి విందు చేయాలని అనుకుంటున్నారు ఇద్దరూ. అదాటుగా అటు పోతున్న సోమయ్యకు కనబడ్డాడు గంగయ్య. సోమయ్య మొదటి ఇంటిని కట్టింది గంగయ్యే. "ఏం గంగయ్యా?! ఎట్లా ఉన్నావు? కాలికి దెబ్బ తగిలాక పని తగ్గించుకున్నట్లుందే? అస్సలు కనబడటం లేదు. ఈ పిల్లాడెవరు? నీ కొడుకు ఏం చేస్తున్నాడు?" పలకరించాడు సోమయ్య. గంగయ్య కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. "నాదేముంది, ఎలాగో ఒకలాగా బ్రతికేస్తాను. ఈ చంద్రం గురించి ఆలోచిస్తేనే, దిగులు వేస్తోంది" అన్నాడు తన పరిస్థితిని వివరించి. గంగయ్య కథ సోమయ్యను ఆలోచనలో పడేసింది. 'భగవంతుడి పేరిట తనూ, రామయ్యా చేసే ధర్మకార్యాలు చాలా ఉన్నై. కానీ తోటి మనిషికి నేరుగా సాయపడే పనులు ఎందుకు చేపట్టకూడదు తాము? గంగయ్యలాంటి ముసలివాళ్లకి, చంద్రం లాంటి పిల్లలకీ పనికి వచ్చేట్లు ఏదైనా చేయగలిగితే బాగుండు గదా?' అనుకున్నాడు. వెళ్లి రామయ్యకు, తమ కుటుంబాలలోని వాళ్లకు విషయం చెప్పాడు. "నిజమే, ఇన్నాళ్ళూ దేవుడి పేరిట మనం చాలా మంచిపనులు చేశాం. ఇప్పుడు మనం కష్టాలలో ఉన్నవాళ్లకు నేరుగా పనికివచ్చేట్లు ఏమైనా చెయ్యాలి" అన్నాడు రామయ్య. "అవునండీ, దసరా తర్వాత ఊరంతటికీ ఒక రోజు విందు చేసే బదులు, ఆ డబ్బుతో గంగయ్యకు, చంద్రానికీ ఇద్దరికీ ఉపాధిమార్గం చూపచ్చు" అన్నది సోమయ్య భార్య. వాళ్ల పిల్లలకీ ఆ ఆలోచన నచ్చింది. మరునాడే రామయ్య-సోమయ్య ఇద్దరూ గంగయ్య దగ్గరికి వెళ్ళారు. అతన్ని, చంద్రాన్ని తమ వెంట పిలుచుకొని వచ్చారు. గంగయ్యకు తాళ్ళు పేనటం వచ్చు. "మేం ఇద్దరం ఇప్పుడు తాళ్ళ వ్యాపారంలోకి దిగుదామనుకుంటున్నాం గంగయ్యా, నువ్వు మాకు తాళ్ళు పేని ఇవ్వాలి. నీకు మేం నెలకు ఇంత అని ఇస్తుంటాము, అట్లాగే చంద్రానికి చదువూ చెప్పిస్తాం- అయితే ఒక్కటే షరతు-నువ్వు తాగుడుకు, పేకాటకు దూరంగా ఉండాలి" అన్నారు రామయ్య సోమయ్యలు. "నేను అవి మానేసి చాలా కాలం అయ్యిందయ్యా, తాళ్లు మీకు ఎన్ని కావాలంటే అన్ని పేనిస్తాను-దానిదేముంది" అన్నాడు గంగయ్య ఉత్సాహంగా. విజయదశమినాటికి గంగయ్య పేనిన తాళ్ళు, తలుగుల అమ్మకాలు మొదలు పెట్టారు రామయ్య-సోమయ్య. గంగయ్యకు ఇప్పుడు ప్రతివారమూ 'ఇంత' అని ఆదాయం వస్తున్నది. చంద్రయ్య బడికి పోయి చదువుకోవటం మొదలుపెట్టాడు. సహజంగా చురుకైన పిల్లవాడేమో, ఒక నెలలోగా వాడు ఉపాధ్యాయులందరికీ ప్రియ శిష్యుడు అయిపోయాడు. రామయ్య-సోమయ్యలు వాళ్లమీద పెట్టిన ఖర్చుకి, గంగయ్య తయారు చేసే తాళ్ళ విలువకు మొదట్లో ఏమాత్రం పొంతన ఉండేది కాదు- కానీ ఇరు కుటుంబాలకూ తెలుసు-'ఇది ఒక సామాజిక కార్యం. ఇందులో ఉన్నదంతా లాభమే- నష్టం అన్న ప్రసక్తే ఉండదు. ఈ పని ద్వారా ముసలి గంగయ్యకు కాలక్షేపం, చిన్నోడు చంద్రానికి విద్యాబుద్ధులు- లభిస్తాయి. దానికోసం కొంత డబ్బు, కొంత సమయం వెచ్చిస్తున్నాం మనం' అని. అయితే మరి రెండేళ్లలో ఈ పనీ విస్తరించింది. ఇప్పుడు రామయ్య చంద్రయ్య కుటుంబాల నీడన ఒక వృద్ధాశ్రమం, ఒక హాస్టలు నడుస్తున్నాయి. రామయ్య-సోమయ్యలేకాక, అనేకమంది సహాయం అందిస్తున్నారు వాటికి. వృద్ధాశ్రమంలో గంగయ్యతోబాటు చాలామంది ముసలివాళ్ళు ఉన్నారు. ముసలి- వాళ్ళు తమకు చేతనైన పనులు చేస్తున్నారు. హాస్టలులో ఉన్న పిల్లలంతా వాళ్ల శక్తి కొద్దీ చదువుతున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రయ్య పెద్దయ్యాక, అతనే ఆ సంస్థను నడిపించటం మొదలుపెట్టాడు. తను పుట్టి- పెరిగిన ఊరికి, తనను ఆదరించిన వారికి మంచి పేరు తెచ్చేట్లు పని చేశాడు. వాళ్ల ఊరు ఈనాడు ఒక ఆదర్శ గ్రామం . "కథ విన్నారుగా, మీరు కూడా చంద్రయ్య లాగా ఆదర్శవంతులు కావాలి మరి!" అని తాత కథ ముగించాడు. పిల్లలంతా ఉత్సాహంగా కథ విన్నారు. సురేష్ ఇంకా ఏదో అడగబోతుంటే "పదండర్రా, ఇప్పుడు పోయి నేను చెప్పిన ఈ కథ గురించి బాగా ఆలోచిస్తూ పడుకోండి" అని లేచాడు తాతయ్య. Courtesy.. kottapalli.in  

మంచి ఏనుగు

అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకి ధనవంతుడొకడు చిన్న ఏనుగు పిల్లని బహుమానంగా ఇచ్చాడు. అవ్వ పేదరాలు. అంత ఏనుగుకు సరిపడే ఆహారాన్ని సమకూర్చటం అవ్వ శక్తికి మించిన పని. అయినా అవ్వకు ఆ ఏనుగు పిల్లని చూస్తే ముచ్చటైంది. దాన్ని తన కొడుకుగా భావించి, ఎంతో‌ కష్టపడి దాన్ని పెంచి పెద్ద చేసింది. ఏనుగు కూడా అవ్వకు తగినట్లే చాలా బాధ్యతతో ఎదిగింది. చుట్టుప్రక్కల ఉన్న పిల్లలందరికీ అదంటే చాలా ఇష్టం. అదికూడా వాళ్లందరితోటీ ఆడుకుంటూ సంతోషంగా ఉండేది. ఒకసారి అవ్వ అడవిలోంచి బరువైన కట్టెల మోపు ఒకదాన్ని ఎత్తుకొని ఇంటికి రావటం గమనించింది ఏనుగు. ఆ సమయంలో అది పొరుగింటి పిల్లలతో ఆడుకుంటున్నది. అంత బరువును మోస్తున్న అవ్వని చూస్తే దాని గుండె కలుక్కుమన్నది. తనని పెంచుతున్న అవ్వకి కృతజ్ఞతగా తనూ ఏదో ఒక పని చేయాలనిపించింది దానికి. తనకు కూడా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావటం వచ్చు కదా, అని అది అడవికి బయలుదేరింది. అడవిలో అంతటా పచ్చని చెట్లే కనిపించాయి. ఎండిన మ్రానులైతే ఎక్కడా లేవు- 'మరి ఇంకేం చేయాలి?' అని ఆలోచనలో పడింది ఏనుగు. అంతలో దానికి కంగారుతో కూడిన అరుపులు వినిపించాయి. ఆ అరుపులు వస్తున్న దిశగా పరుగుతీసిందది. అక్కడ, నది ఒడ్డున ఒక వ్యాపారి నిలబడి ఏడుస్తున్నాడు- 'నా సామాన్లు అన్నీ నీటి పాలయ్యాయి. నాకేమో ఈత రాదు. ఎవరైనా నా సామాన్లు తీసి పెట్టండి. మీ రుణం ఉంచుకోను' అంటున్నాడు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ వేగంగా పారే నదిలోకి దిగేందుకు సాహసించటం లేదు. ఏనుగుకు అతన్ని చూస్తే జాలి వేసింది. అది గబుక్కున నీటిలోకి దూకి, ఒక్కటొక్కటిగా అతని సామాన్లన్నిటినీ నదిలోంచి బయటికి తీసి పెట్టింది. వ్యాపారితో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుండిపోయారు, ఆ వింతను.   ఏనుగు ఒకటి వచ్చి సామాన్లు తీసి పెడుతున్నదనే సరికి వ్యాపారి ఏడుపు ఆగిపోయింది. దానికి తోడు అక్కడ ఉన్నవాళ్లంతా 'ఏనుగుకు ఏదో ఒకటి ఇవ్వు. పాపం అది అంత శ్రమపడింది నీకోసం' అనే సరికి, వ్యాపారి తన సామాన్లు ఎన్ని ఉన్నాయో అన్ని బంగారు నాణాలను లెక్కపెట్టి ఓ సంచిలో వేసి, ఏనుగు మెడకు కట్టి, దాన్ని సత్కరించి పంపాడు. ఆ సరికి చీకటి పడుతున్నది. ఏనుగుపిల్ల ఇంకా ఇంటికి రాలేదమని కంగారు పడిన అవ్వ, దాన్ని వెతకటం కోసం అప్పుడప్పుడే పిల్లల్ని పంపబోతున్నది- అంతలోనే ఏనుగు పిల్ల ప్రత్యక్షం అయ్యింది- మెడలో బంగారు నాణాల మూటతో.   ఆ మూటలో అవ్వకొక ఉత్తరం కూడా దొరికింది: 'ఏనుగు గారి యజమానికి- అయ్యా, మీరెవరో నాకు తెలీదు; కానీ మీ ఏనుగు వల్ల నాకు ఈరోజు లక్షలాది రూపాయల నష్టం తప్పింది. అందుకుగాను నేనిచ్చే ఈ చిన్న బహుమతిని స్వీకరించండి. ఇదికాక నానుండి వేరే ఎలాంటి సహాయం కావాలన్నా నేను మీకు చేసిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని మరువకండి. నన్ను తప్పక సంప్రతించండి" అని. అన్ని బంగారు నాణాలను అవ్వ ఏనాడూ చూసి ఎరుగదు! ఆ సొమ్ముతో అవ్వ కష్టాలు పూర్తిగా తీరాయి. అటుపైన ఏనుగు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ, కష్టాల్లో ఉన్నవాళ్ళకు అందరికీ సాయం చేస్తూ గడిపింది. అంత చక్కని ఏనుగును సాకినందుకు అవ్వ ఎంతగానో గర్వపడింది.   Courtesy.. kottapalli.in

సముద్ర తీరం

సముద్ర తీరం సముద్రతీరం పోవటం చాలా మంది పిల్లలకు వినూత్న అనుభవం. మనదేశానికి అంత పొడవు తీరరేఖ ఉన్నా, ఆ రేఖకు కడు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని లక్షలాది మందికి తమ జీవితంలో ఒక్కసారికూడా సాగరుడిని చూసే అవకాశం ఉండదు. చెన్నేకొత్తపల్లి పిల్లల్లోకూడా, నిజానికి, నూటికి 99 మందికి ఈ భాగ్యం కలగలేదు- అయినా పాడుతున్నారు ముచ్చటగా- చిలుక పలుకులు! సముద్ర తీరం పోతిమి, చాల సేపు చూస్తిమి సూర్యుడెంతో గుండ్రముగా చల్లని వెన్నెల కాయగా అలలు చక్కగ దొర్లుతూ, అవసరముగ పొర్లుచూ నిలిచిఉన్న మాపైన,నీళ్ళు ఎత్తి  చల్లెను కొత్త పావడా తడిసెను, ఎత్తి పట్టి నడిచాను అంతలోన గవ్వలు, ఎంతో తెల్లగ వచ్చెను జవర పట్ట బోతిమి, అన్నీ జారిపోయెను Courtesy.. kottapalli.in  

సాహసవీరుడి కథ

సాహసవీరుడి కథ అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఇద్దరు కొడుకులు. వాళ్లు ఒక రోజున పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ పెళ్ళి చేసుకునేందుకు ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు! దాంతో వాళ్లిద్దరూ వాళ్ళకు కావలసిన రాకుమార్తెల్ని వెతుక్కొని రావాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజున ఇద్దరూ గుర్రాల మీద ఎక్కి అడవిమార్గం గుండా ప్రయాణం‌ మొదలు పెట్టారు. అట్లా చాలా దూరం వెళ్ళాక, వాళ్లు పోతున్న దారి చీలింది- ఒక వైపుకు పోతే ఒక రాజ్యం, రెండో వైపుకు పోతే రెండో రాజ్యం‌ వస్తాయి. అప్పుడు వాళ్లు ఇద్దరూ ఏమనుకున్నారంటే- “ముందుగా మనం ఇక్కడ రెండు మొక్కలు నాటుదాం. తర్వాత ఇద్దరం తలా ఒక దారీ పట్టుకొని పోదాం. మనకు ఎదురైన రాజ్యాలలో‌ మన మనసులకు నచ్చే రాకుమార్తెలు ఉన్నారేమో చూద్దాం, వీలైతే పెళ్ళి కూడా చేసుకుందాం! ఏది ఏమైనా సరే, మూడు నెలల్లో ఇక్కడికి తిరిగి వచ్చేయాలి. మనిద్దరిలో ఎవరం వచ్చినా సరే, ఇక్కడ రెండోవాడు నాటిన మొక్కను చూడాలి. అది బాగుంటే సోదరుడు బాగున్న్నట్లే లెక్క. వాడికోసం ఇక్కడే ఆగి ఎదురు చూడాలి. అట్లా కాక అది గనక వాడి పోయి ఉంటే వాడు కష్టాలు ఎదుర్కొంటున్నట్లు లెక్క. వాడికి 'సహాయం కావాలి' అని అర్థం, అదే ఆ మొక్క గనక పూర్తిగా చనిపోయి ఉంటే సోదరుడు చనిపోయాడన్న మాట! అప్పుడు ఇక అతని కోసం ఒక్క క్షణం కూడా ఆగనక్కర లేదు. సరేనా?” అని. "సరే" అని ఇద్దరూ చెరొక దారిని పట్టుకొని పోయారు. చిన్నవాడు అట్లా పోతుంటే అతనికి అందమైన రాజకుమార్తె ఒకామె ఎదురైంది. అటువైపు ఉన్న ఆ రాజ్యం ఆమెదేనట! వేటకోసమని ఆమె అడవికి వచ్చింది. అయితే తోటి సైనికులనుండి వేరుపడి అడవిలో దారి తప్పింది. దాహమై, నీళ్ళకోసం వెతుక్కుంటోంది.   "నాకు కూడా దాహంగానే ఉంది- పద- ఇద్దరం కలిసి నీళ్ళు వెతుక్కుందాం" అన్నాడు తమ్ముడు. అట్లా పోతుంటే వాళ్లకు ఒక చిన్న గుడిసె కనబడింది. గుడిసె తలుపు తట్టి, "కొంచెం నీళ్లు ఇస్తారా" అని అడిగారు వాళ్ళు. అంతలోనే గుడెసె లోపలి నుంచి 'రాయిగా మారిపో!' అని వినబడింది. వెంటనే చిన్న రాకుమారుడు, ఆ రాజకుమార్తె ఇద్దరూ- ఉన్నవాళ్ళు ఉన్నట్లే- రాళ్ళుగా మారిపోయారు! ఇక పెద్దవాడు వెళ్తుంటే అకస్మాత్తుగా ఒక పులి అతని మీదికి దూకింది. రాకుమారుడు ధైర్యంగా పోరాడి, అతి కష్టం మీద దాన్ని తుదముట్టించాడు. దాని చర్మం, గోర్లు తీసుకొని అతను అవతలి రాజ్యం చేరుకున్నాడో, లేదో ప్రజలందరూ అతనికి జేజేలు పలికారు! అతన్ని తమ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. “ఇన్నేళ్ళుగా మా వాళ్ళు ఎంతమంది ప్రయత్నించినా ఆ పులిని చంపలేకపోయారు. నువ్వు మహా వీరుడివి! నీకు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను!” అన్నారు రాజుగారు. రాకుమారిని చూడగానే ఆమె నచ్చేసింది రాజకుమారుడికి! దాంతో వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది. మూడు నెలలు కావస్తుండగా పెద్ద రాకుమారుడు తన భార్యకు, అత్తమామలకు చెప్పి, తను, తమ్ముడు విడిపోయిన చోటికి చేరుకున్నాడు. చూస్తే అక్కడ తమ్ముడు నాటిన చెట్టు వాడిపోయి ఉన్నది!   ఇంక ఆలోచించేది ఏమున్నది? తమ్ముడు ఏదో‌ కష్టంలో ఉన్నాడని గబగబా తమ్ముడు వెళ్ళిన దారి వెంట వెళ్ళాడు అన్న. అక్కడ ఒక ఒంటరి గుడిసె, దాని ముందు రక రకాల సైజుల్లో‌ రాళ్ళు కనిపించాయి. వాటిలో ఒక శిలను చూడగానే తన తమ్ముడి పోలికలు గుర్తించాడు రాజకుమారుడు. దాంతో సంగతి అర్థమైంది. 'ఏం చెయ్యాలా?' అని ఆలోచిస్తున్నంతలో గుడిసెలో ఏదో అలికిడి అయ్యింది. రాకుమారుడు వెంటనే ఒక రాయి మాటున నక్కాడు. గుడెసె తలుపు తీసుకొని ఓ ముసలి మంత్రగత్తె బయటికి వచ్చింది. అక్కడున్న రాయినొకదాన్ని చూసి విక వికా నవ్వుతూ “మీ‌ బ్రతుకు ఇంతే. నన్ను మాట్లాడించద్దంటే విన్నారా? అందరూ శిలలై పడి ఉన్నారు!” అన్నది గట్టిగా. ఆమె మాటలు విన్న రాజకుమారుడు ఉగ్రరూపుడైపోయాడు. సర్రున కత్తి దూసి, మంత్రగత్తె ముందు దూకాడు. ఆమె తేరుకునేలోగా ఆమెను హతం చేసాడు! మంత్రగత్తె చనిపోగానే అక్కడున్న శిలలన్నీ మనుషులుగా మారిపోయాయి. వాళ్లలో తన తమ్ముడిని చూసిన రాజకుమారుడి సంతోషానికి మేరలేదు. అటుపైన తమ్ముడి పెళ్ళి తను మెచ్చిన రాకుమారితో వైభవంగా జరిగింది!   Courtesy.. kottapalli.in

బంగారు బిందె

  బంగారు బిందె   సేకరణ: ఓమలత, మూడవ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.   కట్టెలు కొట్టేవాడి చేతిలోంచి గొడ్డలి జారి కింద పడింది.. నీటి దేవత బంగారు గొడ్డలి తెచ్చింది.. ఈ కథ తెలిసిందే కదా? అనేక రూపాలలో ఈ కథ ఆంధ్రదేశం అంతటా వ్యాప్తిలో ఉంది. దాని ఒక రూపాన్ని ఓమలత మీతో పంచుకుంటోంది. చూడండి: ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. వాళ్లలో మొదటి భార్య చాలా చెడ్డది, రెండవ భార్య చాలా మంచిది. ఒకరోజు చిన్న ఆయమ్మ పెద్ద ఆయమ్మను దూరంగా ఉన్న బావినుండి నీళ్లు తెమ్మని పంపించింది. చిన్న ఆయమ్మ ’సరే’ అని వెండి బిందె పట్టుకొని బావి దగ్గరకు వెళ్లింది. అయితే ఆమె చేతిలోంచి బిందె జారి నూతిలో పడిపోయింది. బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది- లోతుగా ఉన్న బావిలోకి దిగలేక ఏడిచింది. అప్పుడు ఆ బావిలోంచి గంగా దేవత ప్రత్యక్షమైంది. ఆమె తన చేతిలో ఒక బంగారు బిందెను పట్టుకొని ఉన్నది. ’ఇదేనా, నీ బిందె? బంగారు బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. గంగా దేవి వెళ్లి, ఈసారి ఇత్తడి బిందెతో తిరిగి వచ్చింది: ’ఇదేనా నీ బిందె? ఇత్తడి బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. మళ్లీ గంగాదేవి వెళ్లి, ఈసారి ఆయమ్మ బిందెతోనే తిరిగి రాగానే, చిన్న ఆయమ్మ ’అదే, అదే, నా బిందె!’ అన్నది. ఆ దేవత ఆయమ్మ మనసును తెలుసుకొని చాలా సంతోషపడింది. ’ఈ మూడు బిందెలూ నువ్వే తీసుకో, చాలా మంచిదానివి’ అన్నది. అని, ఆయమ్మకు మూడు బిందెలూ ఇచ్చేసింది. చిన్నాయమ్మ మూడు బిందెలూ పట్టుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇది చూసిన పెద్దాయమ్మ ఊరుకోలేదు. ’ఇన్ని బిందెలు ఎక్కడివి?’ అని అడిగింది. ’నాకు బావిలో దేవత ఇచ్చింది’ అని చిన్నాయమ్మ చెబితే, పెద్ద ఆయమ్మ కూడా పోయిందక్కడికి, బిందెలకోసం. ఊరికే యాక్షన్ చేసుకుంటూ పోయి, కావాలని తన ఇత్తడి బిందెను బావిలోకి జారవిడిచింది. గంగా దేవి ఆమె బిందెనే తీసుకొని ప్రత్యక్షమైంది: ’ఈ బిందె నీదేనా?’ అని అడిగింది. ’ఉహుఁ, కాదు’ అన్నది పెద్ద ఆయమ్మ. ’అయితే ఇది నీదేనా’ అన్నది గంగాదేవి, వెండి బిందెను తెచ్చి. ’కాదు’ అన్నది పెద్దాయమ్మ బంగారు బిందెపైన ఆశతో. మళ్లీ గంగాదేవి బంగారు బిందెను తేగానే ’అదే, అదే, నాబిందె!’ సంతోషంతో అరిచింది పెద్దాయమ్మ. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. ’నువ్వు చాలా చెడ్డదానివి, నీకు ఏబిందే ఇవ్వను పో’ అని ఆమె మాయం అయిపోయింది. దాంతో పెద్దాయమ్మకు బుద్దివచ్చి మంచిదైపోయింది. ఆనాటినుండి ఆశపోతుగా ఉండకుండా మంచిగా ఉండింది.

గువ్వ కథ

  గువ్వ కథ     ఒక ఊర్లో గువ్వంట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముల్లు గుచ్చుకుందంట. ఆ గువ్వ ఒక పిల్లోడి దగ్గరకుపోయి "మనవడా! మనవడా! నా కాలిలో ముల్లు తీస్తావారా?" అని అడిగిందంట. " నేను తీయను. నన్ను అవ్వ కొడుతుంది- పో " అన్నాడట వాడు. "అట్లనా!" అని, ఆ గువ్వ అవ్వ దగ్గరకి పోయి, "అవ్వా! అవ్వా! నా కాలి ముల్లు తీస్తావా అవ్వా?", అని అడిగిందట. "నన్ను తాత కొడతాడు. నేను రాలేను- పో" అని అవ్వ చెప్పిందంట. "సరేలె"మ్మని, ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందంట. పోయి, "తాతా! తాతా! నా కాల్లోంచి ముల్లు తీస్తావా తాతా?" అని అడిగిందట. "నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్టా!" అని తాత అన్నాడట. "సరే"నని ఆవుదగ్గరికెళ్లి, "ఆవూ! ఆవూ! నా కాలి ముల్లు తీస్తావా, ఆవూ?" అని అడిగిందట గువ్వ. అప్పుడు ఆవు, "నన్ను దూడ కొడుతుంది" అని చెప్పిందట. "సరే అయితే. నేను దూడని అడుగుతాను ఉండు" అని దూడ దగ్గరికెళ్లి, "దూడా! దూడా! నా కాల్లో ముల్లు తీస్తావా దూడా?" అని అడిగిందంట గువ్వ. దూడేమో, "ఊ...నేను తేనీగతో ఆడుకోవాలమ్మా! లేకపోతే అది నన్ను తిట్టదూ?" అని చెప్పిందట. "ఐతే నేను తేనీగను అడుగుతాలే" అని తేనీగ దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నదట గువ్వ. "అయ్యో పాపం! నీ కాళ్లో గుచ్చుకున్న ముల్లును తీసెయ్యించడానికే ఇంత కథ నడిచిందా? ఉండు, నేను చూసుకుంటానుగానీ" అని, అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిందట. ఆవుపోయి తాతను గుద్దిందంట. తాత పోయి అవ్వను కొట్టాడంట. అవ్వ పోయి మనవడ్ని వేళ్లతో పొడిచిందంట. మనవడు పోయి గువ్వ కాల్లో ఇరుక్కున్న ముల్లును తీసేశాడట. ముల్లు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకుని ఎగిరిపోయిందంట!!   Courtesy.. kottapalli.in

కన్నీళ్ల ఎర్రగడ్డ

కన్నీళ్ల ఎర్రగడ్డ     అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక టమోట, ఒక ఎర్రగడ్డ, ఒక మిరపకాయ, ఒక ఐస్ క్రీం ఉండేవారు. వారంతా ప్రాణ స్నేహితులు. ఒకసారి వారంతా కలసి ఒక జాతరకు బయలుదేరారు. వారంతా దారిలో పోతుండగా, ఒక సైకిల్ ఆయప్ప వచ్చి, టమోట కాయ మీదుగా సైకిల్ని పోనిచ్చాడు. తక్కిన ముగ్గురూ జరిగినదానికి చాలా బాధపడ్డారు, కానీ ’జరిగిందేదో జరిగింది’ అని ముందుకు సాగారు. ఒక చెరువు దగ్గరికి పోయి అందులో స్నానం చేద్దామని అందరూ కలసి అందులోకి దిగారు. చెరువు స్నానానికి వచ్చిన పిల్లవాడొకడు ఐస్ క్రీం ని చూడగానే దాని మీదికి దూకి చప్పరించేశాడు. తక్కిన రెండింటికీ చాలా బాధ కలిగింది. ఇక ఆ రెండే ముందుకు సాగాయి. ఇంతలో బజ్జీలకోసమని మిరపకాయలు తీసుకపోతున్న పిల్లవాడొకడు దారిన పోయే మిరపకాయను చూసి దాన్ని తన సంచిలోకి వేసుకున్నాడు. ఇక ఎర్రగడ్డ మాత్రమే మిగిలిపోయింది. ’మిత్రులు లేని ఈ జీవితం నాకెందుకు?’ అని అది చాలా బాధపడుతూ, జాతరను చేరి, గుడిలోకి వెళ్ళింది. ’ఏమి దేవుడా! నా మిత్రులందరినీ నాకు లేకుండా చేశారు ఈ మనుషులు? నాకు వారి మీద చాలా పెద్ద ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. అలాంటి వరాన్ని నాకివ్వు’ అని దేవుడిని వేడుకుంది. అంతలోనే దేవుడు ఎర్రగడ్డకు కనిపించాడు. ’సరే ఎర్రగడ్డా! నీకోరిక తీరుస్తున్నాను. ఇకమీదట నిన్ను ఎప్పుడైనా మనుషులు కోయగానే వాళ్ళ కళ్ళవెంబడి నీళ్ళు కారుగాక!’ అని వరమిచ్చాడు. అందుకే, ఉల్లిపాయ తరిగేప్పుడు మనకు కళ్ళళ్ళో నీరుకారేది!   Courtesy.. kottapalli.in

కాకమ్మ కథ... నీళ్ళు మాత్రం పైకి రాలేదు

  నీళ్ళు మాత్రం పైకి రాలేదు     మంచి ఎండకాలం. ఎండ పెళపెళలాడుతోంది. ఒక పిల్లకాకికి చాలా దాహమయింది. ఎటుచూసినా ఎండిపోయిన గుంటలే. నీటి బొట్టు కానరాలేదు. ఎండలో ఎగిరీఎగిరీ అలసిపోతున్న తరుణంలో దానికొక కూజా కనిపించింది. సన్నమూతి కూజా. దొర్లించడానికి వీలులేని కూజా. చిల్లి పొడిచేందుకు వీలుకాని కూజా. దానిలో అడుగున ఎక్కడో నీళ్ళున్నాయి. వెంటనే అది చుట్టూ వెదికింది. గులక రాళ్ళకోసం. తన ముత్తాత మాదిరి. ఒక్కొక్కటిగా గులక రాళ్ళను తీసి, కూజాలో వేసింది. ఆశతో ముక్కుని తడుముతూ. ఎన్ని వేసినా నీళ్ళుమాత్రం పైకిరాలేదు. కూజా రాళ్ళతో నిండిపోయింది. పిల్లకాకికి ఆశ్చర్యంవేసింది - "ఇదేంటి,ఇది తప్పెలా అవుతున్నది? తరతరాలుగా తల్లి పిల్లకు, పిల్లలపిల్లలకు చెప్పుకొస్తున్న ఈ కథ తప్పెలా అవుతున్నది?" నీళ్ళ టబ్బులో కూర్చుని లేచిన ఆర్కిమెడిస్ చెప్పిన సూత్రాలు పనిచేయడం మానేశాయా? ఏమో, తెలీదు. నీళ్ళు మాత్రం పైకి రాలేదంతే. ఇలాంటి చరిత్రలు చాలానే ఉన్నాయి. చాలా కాలంక్రితం ప్రభుత్వాలు పంచిన పొగరాని పొయ్యిలు, కొంతకాలం క్రితం ఇజ్రాయల్ పద్ధతిలో చేసిన కార్పొరేట్ వ్యవసాయం, ఈ మధ్యకాలంలో నడుపుతున్న కార్పొరేట్ బడుల, కార్పొరేట్ ఆసుపత్రుల సౌకర్యం........ అయినా ఈ కాకికథకు కొత్తగా పుట్టిన పిల్లలు ఊఁ కొడుతూనే ఉన్నారు. తమ పిల్లలకు ఈ కాకమ్మ కథను చెప్పుకుంటూనే పోతున్నారు - గర్వంగా, ఏవో తెలివితేటల్ని అందిస్తున్నామన్న ఉత్సాహంతో- గాలికి బరువుందని చూపాల్సిన బెలూన్ల ప్రయోగం మాదిరి- అవి ఎప్పటికీ చూపవు; మనం ఆ ప్రయోగాన్ని ’చెప్పకుండా’ ఉండనూ ఉండం. మళ్లీ ఒక సారి చూ(పి)స్తే చాలు - నిజం తెలిసిపోతుంది. అందుకే మనమెంతగా ఎరిగిన సత్యాలనైనా ఒక్కసారి ఇంకొంచెంగా పరీక్షించుకుంటే మంచిదేమో. శాస్త్రీయతని పుస్తకాల్లోనుంచి లేవనెత్తి ఇంకొద్దిగా జీవితాల్లోకి రానిస్తే నయమేమో. ఏమంటారు?   Courtesy.. kottapalli.in

చింపిరి చింపు

చింపిరి చింపు రచన: యం. శివ లక్ష్మి, ఇ-మెయిలు   అనగా, అనగా ఓ అడవిలో ఒక కోతిపిల్ల ఉండేది. దాని పేరు చింపు. అది ఆడుతూ, పాడుతూ, చలాకీగా అడవిలో తిరుగుతూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అయితే మిగిలిన జంతువులన్నీ చింపుని ఏమైన పనులున్నప్పుడు దగ్గరికి రానిచ్చేవి తప్పిస్తే, మిగిలిన సమయాల్లో పూర్తిగా దూరం పెట్టేవి. -కారణం? చింపు మురికిగా ఉండటమే! చింపూ రోజంతా పని చేసేది, చెమటలు కక్కేది, సరిగా స్నానం చేసేది కాదు; మంచి బట్టలు కూడా వేసుకునేది కాదు. కాని ఈరోజెందుకో, అది సూటు, బూటు వేసింది; తలకు నూనె పెట్టింది; చక్కగా దువ్వుకుంది; ముఖానికి పౌడర్ రాసుకున్నది; అందంగా ముస్తాబైంది; దర్జాగా రోడ్డు మీద వెళ్తూ ఉంది! "ఎప్పుడు మురికిగా ఉండే కోతి పిల్ల ఈ రోజు ఇంత చక్కగా ఎందుకు తయారయిందబ్బా?" అని దాన్ని చూసిన జంతువులన్నిటికీ విచిత్రంగా తోచింది.   "చింపు స్వయంవరానికి వెళ్తునట్లు ఉన్నాడు" అని గాడిద హేళనగా నవ్వింది. "చింపిరి చింపూ! ఎక్కడికీ, వెళ్తున్నావు? ఎక్కడ ఊడుస్తావు, ఈ రోజు?" అని జింక అడిగింది, వెటకారంగా. "ఏయ్! ఎటు, పోతున్నావు? ఆగు! దుంపలు ఏరటంలో నాకు సహాయం చేయాలి- రా!" అని కుందేలు గద్దించింది. అయినా చింపు ఎవ్వరికీ ఏమీ సమాధానం చెప్పలేదు. తనకి ఏమీ పట్టనట్లు, వాళ్లందరికేసీ పొగరుగా చూసి నడుచుకుంటూ పోసాగింది. దాంతో తోడేలుకు చాలా కోపం వచ్చింది. "ఎంత పొగరు! ఎంత కావరం?! ఈ చింపిరి చింపుకి మనమంటే ఎంత చులకనో చూడు!! మనల్ని కాదని ఇది ఈ అడవిలో ఎట్లా బ్రతుకుతుందో చూస్తాను" అని కోపంతో రగిలిపోయింది. "ఇది మనల్ని అందరినీ ఎగతాళి పట్టించి, తనొక్కతే ఎక్కడికో పోదామనుకుంటున్నది. అదేమీ‌ కుదరదు. ముందు మనందరం ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం- తర్వాత దీని పని పడదాం, పదండి!" అంది ఏనుగు. "సరే సరే" అన్నాయ్ మిగిలిన జంతువులు. చింపు నడిచి నడిచి చెరువు పక్కన- ఉన్న ఓ పొద దగ్గర ఆగింది. దానినే అనుసరిస్తూ వస్తూన్న జంతువుల గుంపంతా దానితోబాటే ఆగింది. అప్పుడు చూసాయవి- ఆ పొద అంతా రకరకాల పువ్వులతో అలంకరించబడి చాలా అందంగా ఉంది! కొంగలు అతిథుల కోసం విందు ఏర్పాట్లు చేస్తున్నాయి! నెమళ్ళు, తాబేళ్లు కోలాహలంగా అటు ఇటు తిరుగుతున్నాయి! అవన్నీ ఏదో‌ పార్టీకి వచ్చాయి! ఏమీ అర్థం కాక, అయోమయంగా చూస్తున్న జంతువుల గుంపుతో చింపు చెప్పింది- "చూడండి మిత్రులారా! మీ అందరికీ చాలా కృతజ్ఞతలు! విషయం ఏమిటంటే, ఈరోజు నా మిత్రురాలు టుమ్మి పుట్టినరోజు. దానికి 'మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలి' అనుకున్నాను. కానీ నాకు తెలుసు- 'మీరు అందరూ బిజీగా ఉంటారు- ఎవరివో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి రమ్మంటే మీరు ఎవ్వరూ రారు' అని! ఆందుకే ఈ పథకం వేసాను- ఎప్పుడు మురికిగా ఉండే నేను చక్కగా ముస్తాబై వెళ్తుంటే, 'కుతూహలం కొద్దీనైనా మీరంతా నా వెంట వస్తారు' అని ఈ పని చేసాను. మీరంతా నన్ను క్షమించాలి" అంది. చింపు తెలివికి అవన్నీ ఆశ్చర్యపోయాయి, ఇంతలో మర్రి చెట్టు మీద నుండి ఉడతమ్మ దిగి వచ్చి టుమ్మీని పిలిచింది- ఇదిగో టుమ్మీ!‌ ఎవరెవరు వచ్చారో చూడు! త్వరగా బయటకి రా!" అని పిలిచింది. టుమ్మి బయటకి వచ్చి "హాయ్ చింపూ,హాయ్ ఏనుగు మామా! హాయ్ అందరూ! హమ్మయ్య! వచ్చారా! మీరెవ్వరూ రాలేదనే బెంగ పడుతున్నాను!" అంది. జంతువులన్నీ‌ సిగ్గు పడుతూ నవ్వాయి. టుమ్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. "వీళ్లందరినీ నేనే పిల్చుకొచ్చాను. ఇకనుండి వీళ్లంతా కూడా నీ మిత్రులు" చెప్పింది చింపూ. "పదపద.. కేక్ కోద్దాం! టైం అయ్యింది" అని టేబుల్ దగ్గరకి తీసుకెళ్ళింది చింపు. టుమ్మి కేకు కట్ చేసీ అతిథులందరికి తినిపించింది. అంతలో "మీ అమ్మా, నాన్న ఎక్కడ టుమ్మీ?!" అని అడిగింది తోడేలు. టుమ్మీ ముఖం చిన్నబోయింది. కళ్లలో నీళ్ళు తిరిగాయి.   "మీకు తెలియదు కదూ? టుమ్మీకి అమ్మా-నాన్న లేరు. ఎప్పుడో చనిపోయారు. దాంతో టుమ్మీ ఊరికే కూర్చొని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఆ సమయంలో టుమ్మీకి చింపూతో స్నేహం కుదిరింది. దాన్ని అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది చింపూ. దాని సాయం వల్లనే టుమ్మి కోలుకుని, ఇప్పుడు ఇంత పెద్దదయింది. ఈ పుట్టిన రోజు వేడుకలను కూడా చింపునే ఏర్పాటు చేసింది- తెలుసా? 'నాకు ఎవ్వరూ లేరు' అని టుమ్మి బాధ పడుతుంటే "లేదు టుమ్మీ!మనకి చాలా మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు" అని చెప్పి, మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది" వివరించింది అక్కడికొచ్చిన గొల్లభామ. "బయటికి ఎప్పుడు అల్లరి చిల్లరిగా కనిపించే మురికి కోతిపిల్ల 'చింపిరి చింపూ' మనసు మాత్రం పాలంత తెల్లనిది; సెలయేటి నీరంత స్వచ్చమైనది" అని తెలుసుకున్నాయి అడవిలోని జంతువులన్నీ. "స్నేహానికి విలువ కట్టలేం; 'ఎవరికైనా రూపం కాదు- గుణం ముఖ్యం' " అని పాడాయి. ఆ రోజే కాదు; తర్వాత ఏనాడూ‌ టుమ్మీకి ఇక ఒంటరితనం గుర్తుకే రాలేదు- అంతగా అవన్నీ కలిసి పోయాయి! Courtesy.. kottapalli.in

తెలివైన కుందేలు

  తెలివైన కుందేలు     అనగనగా ఒక అడవిలో కొన్ని తేనెటీగలు, ఒక ఎలుగుబంటి, కుందేలు, ఏనుగు ఉండేవి. తేనెటీగలు పోగుచేసిన తేనెను ఎలుగుబంటి తాగేస్తుండేది. తేనెటీగలు, పాపం, తమ తేనె మొత్తాన్ని ఎలుగు బంటి తాగేస్తోందని బాధ పడుతుండేవి. ఎలాగయినా సరే, ఎలుగు బంటి బారినుండి తప్పించుకునేందుకు ఉపాయం వెతుకేవి. అప్పుడు వాటికి తమ మిత్రుడు కుందేలు గుర్తుకు వచ్చింది. కుందేలుకు తెలివి ఎక్కువ కదా, అందుకని అవి అన్నీ కలసి కుందేలును ఉపాయం అడిగాయి. తమకు సాయం చేస్తే కావలసినంత తేనెను ఇస్తామని మాట ఇచ్చాయి. కుందేలు బాగా ఆలోచించి, తేనెటీగలకు "మీరు తేనె తుట్టెను సింహం గుహ వెనక దాచి పెట్టమ"ని సలహా ఇచ్చింది. ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టె దానికి కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే అవి తాము కుందేలుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఒక రోజు కుందేలు ఇంటికి బంధువులు వచ్చారు. వారికి తీయని తేనె రుచి చూపాలనుకుంది కుందేలు. అది తేనెటీగల దగ్గరకి వెళ్ళి ఇచ్చిన మాటప్రకారం కొంత తేనె ఇవ్వమని అడిగింది. ’నీలాంటి వారికోసం ఇవ్వడానికేనా మేము తేనెను పెట్టుకున్నది?’ అన్నాయి తేనెటీగలు. కోపంకొద్దీ కుందేలు ఎలుగుబంటికి తేనెతుట్టె ఎక్కడ ఉన్నదీ చెప్పేసింది. మళ్లీ ఎలుగుబంటి తేనెను తాగేయడం మొదలు పెట్టింది. తేనెటీగలకు బాధలు మొదటికొచ్చాయి. మళ్ళీ వాటికి కుందేలు సహాయం అడగక తప్పలేదు. అవి కుందేలు దగ్గరకు వచ్చి తమను క్షమించమని వేడుకున్నాయి. కుందేలు వాటిని క్షమించి ఇంకొక ఉపాయం చెప్పింది. పథకం ప్రకారం తేనెటీగలు ఒక తారు డ్రమ్మును తీసుకొని సింహం గుహలో పెట్టాయి. కుందేలు ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి "ఎలుగుబంటి మామా! తేనెటీగలు ఒక డ్రమ్మునిండా తేనెను చేసి గుహలో దాచి పెట్టాయి, మనం ఈ రోజు రాత్రి చీకటి పడిన తరువాత వెళ్లి దాన్నంతా తాగేద్దాం" అని చెప్పింది. అయితే ఎలుగు బంటి కుందేలుకంటే ముందు తానే వెళ్ళి తేనెను తాగెయ్యాలనుకుంది. చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరకు వెళ్లింది. చీకట్లో డ్రమ్ములోపల ఏముందో సరిగా కనబడలేదు. తారును చూచి నిజంగానే తేనె అనుకున్నది. దాన్ని అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములోకి దూరి, తారు కారణంగా అందులోనే ఇరుక్కు పోయింది. హాహా కారాలు చేస్తున్న ఎలుగుబంటిని తేనెటీగలు, కుందేలు వచ్చి చూశాయి. తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తనను కాపాడమని మొరపెట్టుకున్నది. అప్పుడవి తమ మిత్రుడైన ఏనుగు సహాయంతో ఎలుగుబంటిని డ్రమ్మునుండి బయటికి తీసి శుభ్రం చేశాయి. అందరూ మిత్రులైనారు. తాము ప్రత్యేకంగా చేసిన తేనెతో తేనెటీగలు అందరికీ విందు చేశాయి.

తెలివైన కుందేలు

  తెలివైన కుందేలు     అనగనగా ఒక అడవిలో కొన్ని తేనెటీగలు, ఒక ఎలుగుబంటి, కుందేలు, ఏనుగు ఉండేవి. తేనెటీగలు పోగుచేసిన తేనెను ఎలుగుబంటి తాగేస్తుండేది. తేనెటీగలు, పాపం, తమ తేనె మొత్తాన్ని ఎలుగు బంటి తాగేస్తోందని బాధ పడుతుండేవి. ఎలాగయినా సరే, ఎలుగు బంటి బారినుండి తప్పించుకునేందుకు ఉపాయం వెతుకేవి. అప్పుడు వాటికి తమ మిత్రుడు కుందేలు గుర్తుకు వచ్చింది. కుందేలుకు తెలివి ఎక్కువ కదా, అందుకని అవి అన్నీ కలసి కుందేలును ఉపాయం అడిగాయి. తమకు సాయం చేస్తే కావలసినంత తేనెను ఇస్తామని మాట ఇచ్చాయి. కుందేలు బాగా ఆలోచించి, తేనెటీగలకు "మీరు తేనె తుట్టెను సింహం గుహ వెనక దాచి పెట్టమ"ని సలహా ఇచ్చింది. ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టె దానికి కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే అవి తాము కుందేలుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఒక రోజు కుందేలు ఇంటికి బంధువులు వచ్చారు. వారికి తీయని తేనె రుచి చూపాలనుకుంది కుందేలు. అది తేనెటీగల దగ్గరకి వెళ్ళి ఇచ్చిన మాటప్రకారం కొంత తేనె ఇవ్వమని అడిగింది. ’నీలాంటి వారికోసం ఇవ్వడానికేనా మేము తేనెను పెట్టుకున్నది?’ అన్నాయి తేనెటీగలు. కోపంకొద్దీ కుందేలు ఎలుగుబంటికి తేనెతుట్టె ఎక్కడ ఉన్నదీ చెప్పేసింది. మళ్లీ ఎలుగుబంటి తేనెను తాగేయడం మొదలు పెట్టింది. తేనెటీగలకు బాధలు మొదటికొచ్చాయి. మళ్ళీ వాటికి కుందేలు సహాయం అడగక తప్పలేదు. అవి కుందేలు దగ్గరకు వచ్చి తమను క్షమించమని వేడుకున్నాయి. కుందేలు వాటిని క్షమించి ఇంకొక ఉపాయం చెప్పింది. పథకం ప్రకారం తేనెటీగలు ఒక తారు డ్రమ్మును తీసుకొని సింహం గుహలో పెట్టాయి. కుందేలు ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి "ఎలుగుబంటి మామా! తేనెటీగలు ఒక డ్రమ్మునిండా తేనెను చేసి గుహలో దాచి పెట్టాయి, మనం ఈ రోజు రాత్రి చీకటి పడిన తరువాత వెళ్లి దాన్నంతా తాగేద్దాం" అని చెప్పింది. అయితే ఎలుగు బంటి కుందేలుకంటే ముందు తానే వెళ్ళి తేనెను తాగెయ్యాలనుకుంది. చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరకు వెళ్లింది. చీకట్లో డ్రమ్ములోపల ఏముందో సరిగా కనబడలేదు. తారును చూచి నిజంగానే తేనె అనుకున్నది. దాన్ని అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములోకి దూరి, తారు కారణంగా అందులోనే ఇరుక్కు పోయింది. హాహా కారాలు చేస్తున్న ఎలుగుబంటిని తేనెటీగలు, కుందేలు వచ్చి చూశాయి. తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తనను కాపాడమని మొరపెట్టుకున్నది. అప్పుడవి తమ మిత్రుడైన ఏనుగు సహాయంతో ఎలుగుబంటిని డ్రమ్మునుండి బయటికి తీసి శుభ్రం చేశాయి. అందరూ మిత్రులైనారు. తాము ప్రత్యేకంగా చేసిన తేనెతో తేనెటీగలు అందరికీ విందు చేశాయి.

నలుగురు మిత్రులు

చూడు విక్రమ్! ఈ ప్రపంచంలో అందరూ ఎవరికి వాళ్ళే పెద్దలు. ఊరికే పేరుకు 'గురువులు' అంటుంటారుగానీ, ఆ గురువులు ఇచ్చే సలహాలను మటుకు ఎవ్వరూ పట్టించుకోరు. అట్లాంటి ఓ నలుగురు పనికిమాలిన శిష్యుల కథను చెప్పింది- కులుసూంబీ అనే పాప. శ్రమ తెలీకుండా ఉండేందుకు నీకు ఆ కథ చెబుతాను, విను " అంటూ ఇలా చెప్పసాగింది.   అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఈ నలుగురిలో ఒకరు మేస్త్రీ, ఒకరు చిత్రకారుడు, ఒకరు శిల్పి, ఇక నాలుగోవాడు పూజారి. అయితే పాపం వీళ్ళకు సొంత వూరిలో పని లేకుండా అయ్యింది. దాంతో "ఉన్న ఊళ్ళో‌ బ్రతకటం‌ అనే యోగం‌ అందరికీ‌ ఉండదు- మనకు ఇక్కడ నప్పేటట్లు లేదు. వేరే ఎక్కడికైనా పోతే నయం" అన్నాడు పూజారి. "ఎక్కడైనా పెద్ద పెద్ద పనులు జరిగే చోట ఉండాలి. రాజుగారు గొప్ప నిర్మాణాలు చేపట్టుతుంటారు. అక్కడికి వెళ్తే మనందరికీ పనులు చిక్కుతై" అన్నాడు శిల్పి. "నిజమే- రాజాస్థానంలో‌ తప్ప నేను గీసే చిత్రాలకు గుర్తింపు ఉండదు- అక్కడికి వెళ్దాం" అన్నాడు చిత్రకారుడు. "రాజధానిలో‌ పెద్ద పెద్ద ఇళ్ళు కడుతుంటారు- నాకూ‌ అక్కడేదో‌ పని దొరక్కపోదు. పదండి" అన్నాడు మేస్త్రీ.   పూజారి నిర్ణయించిన ముహూర్తానికి నలుగురూ బయలుదేరి రాజధాని బాట పట్టారు. ఆ రోజుల్లో‌ ఇప్పటిలాగా బస్సులూ, స్కూటర్లూ లేవు- నలుగురూ అడవి దారుల్లో నడుచుకుంటూ పోసాగారు. పగలంతా నడక; అలసట; సాయంత్రం ఏదో‌ ఒక పల్లెలో బస; విశ్రాంతి. ఇలా చాలా రోజులు సాగింది. దారిలో తిందామని వాళ్ళు తెచ్చుకున్న సామాన్లన్నీ దాదాపు ఖాళీ అయిపోయాయి. ఎక్కడైనా ఏమైనా కొనుక్కుందామన్నా చేతిలో‌ డబ్బులు లేని స్థితి. ఆ సమయంలో ఒక రోజున వాళ్ళు ఒక అడవిలో ప్రయాణిస్తుండగానే సాయంత్రం అయ్యింది. దాంతో వాళ్ళు నలుగురూ‌ అక్కడే వంట చేసుకొని, సమీపంలో ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని భోజనం చేసారు. ఆ సరికి చీకటి పడింది. "అందరం తలా ఒక చెట్టు చూసుకొని పడుకుందాం" అన్నాడు పూజారి, చీకట్లోకి చూస్తూ. "చెట్టు క్రింద పడుకుంటే అంతే బాబయ్యా, పైకెక్కాలి" అన్నాడు మేస్త్రీ. "అందరం నిద్రపోతే సమస్య కావొచ్చు- క్రూరమృగాలూ అవీ వస్తే కష్టం" అన్నాడు చిత్రకారుడు. "వంతులు వేసుకొని కాపలా కాద్దాం. మిగతావాళ్లంతా నిద్రపోవచ్చు. పుల్లలు తెచ్చి నెగడు వేస్తే ఏ మృగాలూ రావు. అది ఆరిపోకుండా చూసుకుంటే చాలు" అన్నాడు శిల్పి. మొదటి వంతు మేస్త్రీకి వచ్చింది. మేస్త్రీ మేలుకుని వున్నాడు; మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారు. నెగడు బాగా వెలుగుతున్నది. కొద్దిసేపటికి మేస్త్రీకి నిద్రరావటం మొదలైంది. “ఇట్లా ఏమీ చేయకుండా ఊరికే కూర్చొని ఉంటే నిద్ర మేలుకోవడం కష్టం! ఏదో ఒకటి చేస్తుంటే తప్ప శరీరం సహకరించదు” అని చుట్టూ చూసాడు అతను. అక్కడికి దగ్గర్లో మంచి మంచి రాళ్ళు కనిపించాయి. వాటిని తీసుకొచ్చి, ప్రక్కనే ఉన్న వేపచెట్టు క్రింద ఒక చిన్న అరుగు, దానిపైన ముద్దుగా ఓ చిన్న ఇల్లు కట్టాడు అతను. ఆ సరికి తన వంతు సమయం గడిచింది- శిల్పిని నిద్రలేపి తను పడుకున్నాడు. శిల్పి చూసాడు- మేస్త్రీ నిర్మించిన ఇల్లు ముచ్చటగానే ఉంది- కానీ "పూర్ణత్వం‌ లేదు" అనుకున్నాడు. "ఖాళీగా ఉంటే బాగా లేదు" అని అటూ ఇటూ చూసాడు. దగ్గర్లోనే ఒక మంచి రాయి కనిపించింది. దాన్ని చెక్కటం మొదలెట్టాడు- అద్భుతమైన గణపతి బొమ్మ ఒకటి తయారైంది. దాన్ని ఆ ఇంటిలో‌ ఉంచాడు. "ఇప్పుడు బాగుంది" అనుకున్నాడు. ఆ సరికి తనవంతు సమయం అయిపోయింది- చిత్రకారుడిని నిద్రలేపి, తను పడుకున్నాడు.   చిత్రకారుడు చూసాడు- నెగడు వెలుగు-తున్నది. ఆ వెలుగులో‌ కొత్తగా కట్టిన చిట్టి ఇల్లు, అందులోని గణపతి విగ్రహం కనిపించాయి. "చాలా చక్కగా ఉన్నై" అనుకున్నాడు. "అయినా ఎంత బాగున్నా, రంగులు వేస్తేనే కదా, వీటికి అందం?! అప్పుడింక ఇవి చాలా చాలా బాగుంటాయి" అని తన ప్రతిభతోటి వాటికి అద్భుతమైన రంగులు వేశాడు. ఇక దాంతో అతని వంతు సమయం అయిపోయింది- పూజారిని నిద్రలేపి తను పడుకున్నాడు. పూజారి లేచి చూసే సరికి అక్కడో చక్కని చిట్టి ఇల్లు, అందులో నెలకొని ఉన్న అద్భుతమైన గణపతి, వాటికి సజీవత్వాన్ని ఇచ్చే ఆకర్షణీయమైన రంగులు కనిపించాయి. "ఇకనేమి, ఈ అడవి తరించింది! ఇక్కడ భగవంతుడు మూర్తీభవించాడు" అని అతను అడవి పూలు, అడవి పండ్లు తెచ్చి, రకరకాల స్తోత్రాలతో పూజలు చేయటం‌ మొదలు పెట్టాడు. అయితే అక్కడికి దగ్గర్లోనే ఓ గ్రామం ఉంది. గ్రామస్తులు ఉదయాన్నే‌ అటుగా వెళ్తూ విన్నారు- "ఇదేందబ్బా! ఇక్కడేవో‌ మంత్రాలు వినిపిస్తుండాయి?" అని అక్కడికి వచ్చి చూస్తే "రాత్రికి రాత్రి వెలిసిన గణపతి!" ఇంక అందరూ అక్కడికి వచ్చి మొక్కుకున్నారు. ముచ్చటగా ఉన్న ఆ గుడినీ, ప్రాణం ఉట్టిపడేట్లున్న మూర్తినీ, చక్కని ఆ రంగుల్నీ, పవిత్ర వాతావరణాన్నీ చూసి మైమరచి పోయారు. వాళ్ళని చూసి ముచ్చటపడిన నలుగురు మిత్రులూ "ఇవాల్టికి ఇక్కడే ఉండి, రేపు ఉదయాన్నే వెళ్దాం" అని అక్కడే ఆగిపోయారు. అయితే "అడవిలో వెలిసిన గణపతి" కథ ఒకరినుండి ఒకరికి అందింది- సాయంత్రం అయ్యేసరికి ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఊళ్ళన్నిటి నుండీ జనాలు కుప్పలు తెప్పలుగా, తిరనాళ్ళకు వచ్చి పడ్డట్లు వచ్చారు. అందరూ బారులు తీరి దేవుడిని దర్శించుకున్నారు. "అయ్యలూ, మీరు ఇంత శక్తి గలవాళ్ళు- మీరు ఇక్కడే ఉండాల, కొంతకాలం" అని ఎవరికి వాళ్ళు పండ్లు, తినే పదార్థాలు, బియ్యం, డబ్బులు ఇంకా ఏవేవో కానుకలు ఇచ్చారు మిత్రులకు. చీకటి పడేసరికి ఆ పల్లెల పెద్దలంతా కలిసి వచ్చారు- "మా ఊళ్ళన్నీ మీ వల్ల పావనమైనాయి. మీరు సరేనంటే మేమందరం చందాలు వేసుకొని ఇక్కడే ఓ గొప్ప గుడిని నిర్మిస్తాం. దానికి మీరే సారధులు!" అన్నారు. మిత్రులు నలుగురూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, సంతోషంగా సరేనన్నారు.   ఆరోజు రాత్రి చక్కగా భోంచేసాక, నలుగురూ మాట ముచ్చట్లు చెప్పుకుంటూండగా "..కానీ- నేనెప్పుడూ గుడిని కట్టలేదు" అన్నాడు శిల్పి. "నేను ఎన్నడూ గుడిలో ఉంచే విగ్రహాలను చెక్కలేదు- ఇప్పుడు ఒక్కసారిగా భవ్యమందిరపు విగ్రహాలు అన్నీ చెక్కమంటున్నారు- ఎట్లాగో ఏమో.." అన్నాడు మేస్త్రీ. "ఏదో ఊరికే రంగులు వేసాను గానీ, ఇంత పెద్ద నిర్మాణానికి రంగుల నిర్ణయం- నావల్ల అవుతుందా?" అన్నాడు చిత్రకారుడు. "సరిగా పూజ చేయాలంటే నేను చదవాల్సిన శాస్త్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా నాకు తెలీదు- అందుకని మనం ఒకసారి మనం ఊరికి వెళ్ళొద్దాం. మనకు విద్య నేర్పిన గురువులను సంప్రతిద్దాం- పని పరంగా వాళ్ళిచ్చే సలహాలను పాటిస్తే తప్పులు జరగవు-" అన్నాడు పూజారి. మిత్రులందరికీ ఆ ఐడియా నచ్చింది. "ఒక్కసారి మా పెద్దల్ని కలిసి వచ్చేస్తాం- రాగానే పని మొదలెడతాం. ఆలోగా మీరు విరాణాలు సేకరిస్తూండండి" అని పల్లె పెద్దలకు చెప్పి నలుగురూ సొంత ఊరు చేరుకున్నారు. శిష్యులు చెప్పిందంతా విన్నారు వాళ్ల గురువులు. "నువ్వు చదివిన స్తోత్రాలు తప్పు- క్రొత్తగా కట్టిన మందిరం అభివృద్ధిలోకి రావాలంటే ఫలానా మంత్రాలు చదవటం, ఈ ఈ తంతులు చేయటం తప్పని సరి- అవన్నీ తెలీకుండా నువ్వసలు పూజలెలా చేసావు?" కసిరాడు పూజారికి విద్య నేర్పిన గురువు. "గుడి నిర్మాణానికీ, ఇంటి నిర్మాణానికీ చాలా‌ తేడాలుంటాయి. వాస్తు లెక్కలు ఉంటాయి- నువ్వు అన్నింటా తప్పావు!" అన్నాడు మేస్త్రీకి విద్య నేర్పిన గురువు. "చుట్టూ పచ్చని వాతావరణం ఉన్నప్పుడు ముదురు రంగులు బాగుంటాయి- నువ్వు అన్నీ తేలిక రంగులు వేసావు- చాలా వికారంగా ఉండి ఉంటుంది" అన్నాడు చిత్రకారుడి గురువు. "గుడిలో ఉంచే విగ్రహానికుండాల్సిన లక్షణాలు లేశ మాత్రంగానైనా లేవు, నువ్వు చెక్కిన బొమ్మలో. విగ్రహాలు నాట్యశాస్త్రానికి అనుగుణంగా కదా, ఉండాల్సింది?" అన్నాడు శిల్పికి విద్య నేర్పిన గురువు. కొంచెం చిన్నబుచ్చుకున్న మిత్రులు నలుగురూ "మీరూ మాతో రండి- అందరం కలిసి మందిరం‌ నిర్మించి వద్దాం" అన్నారు గురువులతో. వాళ్ళెవరూ ఒప్పుకోలేదు- "లేదు- మీకు అర్థం అయినట్లు లేదు. మమ్మల్నడిగితే అసలు ఇట్లా సొంతగా పని చేసేది ఏదీ పెట్టుకోకండి. పోయి రాజుగారి దగ్గర ఏవైనా చిన్న పనులు వెతుక్కోండి" అన్నారు. మిత్రులు నలుగురూ కొంచెం సేపు ఆలోచించి, వచ్చిన త్రోవనే వెనక్కి తిరిగి వెళ్ళారు. సంవత్సరం తిరిగే సరికి, వాళ్ల సారధ్యంలో నిజంగానే చాలా గొప్ప మందిరం ఒకటి తయారైంది. చుట్టు ప్రక్కల పల్లెల్లోంచే కాక, సుదూరంగా ఉన్న రాజధాని నుండి కూడా, అనేకమంది ఆ గుడిని, విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చారు. అందరూ వాళ్ళ పనితనాన్ని, మందిర నిర్మాణ కౌశలాన్ని మెచ్చుకుంటుంటే మిత్రులు "ఇదంతా మా గురువుల గొప్పతనమే- మాదేమీ లేదు" అనేవాళ్ళు వినయంగా. విక్రమ్‌కు ఈ కథ చెప్పిన బేతాళం "ఇంతకీ విక్రమ్‌- అసలు ఈ నలుగురు మిత్రుల సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. పనులన్నీ తప్పుగా చేసినవాళ్ళు, గురువుల మాట వినకుండా వెనక్కి పోయి మందిర నిర్మాణం ఎందుకు తలపెట్టినట్లు- గురువులు చెయ్యమన్నది అది కాదు గదా? ఇకపోతే, వాళ్ళు అన్ని తప్పులు చేసినా జనాలు వాళ్ళని శ్లాఘించటం ఏమిటి? పనితనంతో బాటు సరైన కళను మెచ్చేవాళ్ళూ తగ్గిపోతున్నారనటానికి ఇది ఒక తార్కాణం కాదా?! చేసేదంతా చేసాక, మరి వాళ్ళు 'ఇదంతా గురువుల గొప్పతనమే' అనటమేమిటి?" అని అడిగాడు. విక్రం చిరునవ్వు నవ్వి "శిష్యులకు విద్య గరపటం, వాళ్ళ పనిలో తప్పొప్పులు గుర్తించి చెప్పటం గురువుల ధర్మం. ఈ కథలో నలుగురు గురువులూ తమ శిష్యుల తప్పుల్ని ఎత్తి చూపటమే కాక, సరైన మార్గదర్శనం కూడా చేసారు. తెలివైన శిష్యులు తమ తప్పుల్ని ఆ క్షణంలోనే గుర్తించారు; సరైన పద్ధతులేమిటో కూడా అర్థం చేసుకున్నారు. కనుకనే ధైర్యంగా వెళ్ళి మందిర నిర్మాణం చేపట్టారు. తమ పని ఎలా ఉండాలో తెల్సుకున్నారు కనుక అటుపైన వాళ్ళు మందిరాన్ని పూర్తిగా శాస్త్రబద్ధంగా నిర్మించి ఉంటారు. అలాంటప్పుడు అది అందరి ప్రశంసలనూ అందుకోవటంలో‌ ఆశ్చర్యమేమీ లేదు" అన్నాడు. అలా విక్రంకు మౌనభంగం కలగటంతో బేతాళం అతని పట్టు నుండి చటుక్కున విడివడి, మళ్లీ చెట్టుకొమ్మ మీదికి చేరుకున్నది! Courtesy.. kottapalli.in