మాననిగాయం
posted on May 31, 2021
పట్టపగలే ఇంటిగుమ్మంలోనే వాలిపోతున్న బతుకులు
పూటగడిస్తే చాలన్నట్లు
అలజడి లేని జీవనగమనం
కాలమేసే కాటునుండి కోలుకున్న గ్యారంటీ లేని జీవితం
లక్ష్మణరేఖలెన్ని గీసినా
కాలరాక్షసిలా తనరూపం మార్చుకుంటూ ముప్పేట వేట
మునుపెన్నడు చూడని ముప్పు
ధరణిపై తన ఆధిపత్యం చెలాయిస్తూ
దేహాలనన్నీ పీల్చిపిప్పిచేస్తోంది
ఆరనిజ్వాలను రగిలించింది
ప్రపంచాన్నంతా గజగజలాడిస్తూ
తన పంజాదెబ్బ రుచిచూపిస్తోంది
తనువులన్నీ రాలుతున్న దృశ్యం
తరుముతున్నా అలుపెరుగని పోరాటం
కటువుతనం పుడమినిండుకున్నది
కోల్పోతున్న ఆప్తుల యాదిలో జారిపడుతున్న కన్నీరు
ఆశలన్నీ కాలిపోతున్న కాలం
కాలమాగిపోతున్నట్టు
నవ్వులన్నీ మాయమౌతున్నయ్
మబ్బులునిండిన జీవితంలో
స్వప్నశిల్పాలన్నీ పగిలి పటాపంచలౌతున్నయ్
విశాలమైన విశ్వమంతా
ఇంటిలో ఇమిడిపోయింది
ఎడతెరపిలేని దండయాత్రలో
ఊపిరిదొరకక ఉక్కిరిబిక్కిరి
గుండెనిండ భయం పరుచుకున్నది
రోజుకో గాయం!
గమనం ఓ సమరం!!
వర్తమానం మళ్ళీ గతంలా
భవిష్యత్తు చిత్రం చిగురిస్తుందా??
సి. శేఖర్(సియస్సార్)