ఉగాది కొత్త పలుకు
posted on Mar 29, 2025
ఉగాది
పాట రంజితమై
లోక శోభితమై
నేటి ఆమనిలో
పలుకు పావనివై
గాన కోకిలమ్మ!
వర్ణ సారూప్యాన
వెర్రి ఏకాక్షిలా
పిచ్చి ప్రేలాపనలు
పొల్లు భాషణములను
వల్లె వేయకుసుమీ!
మంచి చెడ్డలను
తప్పు ఒప్పులను
లోటు పాటులను
రాగద్వేషముల్లేకనే
శృతిలోనే ఆలపించుసుమీ!
ఆపన్నుల ఆక్రందనలు
అన్నార్తుల ఆకలికేకలు
రాబందుల రక్కసిచేష్టలు
జనగణములు తెలుసుకొనేట్టు
నలుదిక్కుల గళమెత్తుసుమీ
యుద్ధకాంక్షలు సన్నగిల్లగ
క్షామమన్నది సమీపించక
పిల్లపాపలు చల్లగుండగ
విశ్వశాంతికి అడుగువైపుకు
శాంతిగీతం పాడుముసుమ్మీ!
- రవి కిషోర్ పెంట్రాల