ఊరు నిదరోయింది

ఊరు నిదరోయింది...
పట్టపగలేనట్టనడివీధిన
ఊరునిదరోయింది...

ఊపిరాడక ఏజామున
ఏమూలన ఎవరింట్లో
బోరుమనేనిశ్శబ్దం
తాండవమాడతందోనని
ముందుగానే ముంగిట్లో ఊరు నిదరోయింది...

కడుపులో కాలుకదుపుతున్న
తొమ్మిదినెలలపసిగుడ్డు
అసువులుబాసిన అమ్మతనాన్ని
చూడకుండా గడ్డకట్టినవార్త
వినిపించవలివస్తుందోనని
ముందుగానేఊరునిదరోయింది..

భయంగుపెట్లోబరువెక్కి
బతుకుభారంతోబిక్కుబిక్కున
ఉస్సురంటూ..తుదిశ్వాస ఆగిపోతందోనని..
ముందుగానేఊరునిదరోయింది..

కాటినిండాకణకణకాలే..
శవాలకమురువాసనలతో
ఊరేవల్లకాడులామారుతుందేమోనని
ముందుగానేఊరునిదరోయింది..

పిల్లల్ని అనాధలుగావదలి
వెళ్ళిపోయినతల్లిదండ్రుల
జ్ఞాపకాలతోరోధిస్తున్న
రోదనల్నివినలేక....
ముందుగానేఊరునిదరోయింది

పలకరించే పిలుపులేక
ఓదార్చేఉనికిలేక
దరిచేర్చేదారిలేక
స్పృసించేస్పర్శలేక
ఊరుఊరుగాలేదు
వెలివేసినవాడలావుంది

ఇపుడు మానవజాతికి
వాసనతెలియటంలేదు
రుచితెలియటంలేదు.
శ్వాస అందక నాదేశం
ప్రాణవాయువు కోసం
మొక్కలునాటుతుంది.....


            -గుడిసేవ.విష్ణుప్రసాద్