ఫిన్ ఎలెన్ పరుగుల సునామీ.. టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు దూసుకెళ్లిన కివీస్
Publish Date:Mar 4, 2026
Advertisement
న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి దర్జాగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ సఫారీలను 169 పరుగులకే కట్టడి చేసింది. ఓ దశలో సఫారీలు కేవలం 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మార్కో యాన్సెస్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయడానికి దోహదపడ్డాడు. మార్క్ 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 34 పరుగులతో డివాల్ట్ బ్రెవిస్, 29 పరుగులతో ట్రిస్టన్ స్టబ్స్ కూడా రాణించడంతో దక్షిణాఫ్రికీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. పెనర్ ఫిన్ అలెన్ అయితే పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకబాది టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతంమైన సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. మరో ఓపెనర్ టిమ్ స్టిఫర్డ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు కేవలం 9.1 ఓవర్లలోనే 117 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. 58 పరుగులు చేసిన స్టిఫర్డ్ ఔటైన తరువాత రచిన్ రవీంద్ర బరిలోకి వచ్చాడు. మరో వికెట్ పడకుండా కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టోర్నీలో ఇప్పటి వరకూ అపజయమనేదే లేకుండా సెమీస్ కు చేరిన దక్షిణాఫ్రికా ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అసలైన హైలైట్ ఫిన్ అలెన్ బ్యాటింగే. తన విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. అలెన్ 33 బంతుల్లో శతకబాది.. 47 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డును తిరగరాశాడు. మొత్తం మీద కివీస్ 170 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫిన్ అలెన్ విధ్వంసక బ్యాటింగ్‌తో ఈ సెమీఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. దక్షిణాఫ్రికా మరోసారి ఐసీసీ టోర్నీలో నాకౌట్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
http://www.teluguone.com/news/content/kiwis-enter-t20-world-cup-finals-36-215029.html





