Top Stories

జగన్ ఫోటో పెడితే ఊరుకోను..అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరిక

  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెడితే ఊరుకోబోమని  సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే  ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఎవరైనా అధికారులు ఆయన ఫోటో పెడితే నడిరోడ్డుపై పగలగొడతామని హెచ్చరించారు. కొందరు ఉద్యోగులు గవర్నమెంట్ ఆఫీసులో జగన్ ఫోటో పెడితున్నారు. మీకు అభిమానముంటే మీ ఇళ్లలో పెట్టుకోవాలి ఆయన అన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలాంటి పనులు చేయొద్దు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.  ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ సీఎం జగన్ ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతున్నారు. ప్రధానంగా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా జగన్ ఫోటోలు ఉండటంపై అనంత టీడీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ విధంగా జగన్ ఫోటోను ఉంచారంటూ జడ్పీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా కూడా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఫైర్ అయ్యారు. జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్‌‌లో కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచుతున్నారని, సీఎం చంద్రబాబు ఫోటోలు ఉంచడం లేదని విరుచుకుపడ్డారు
జగన్ ఫోటో పెడితే ఊరుకోను..అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరిక Publish Date: May 25, 2025 7:10PM

ఆ నలుగురిలో నేను లేను : అల్లు అరవింద్

  తెలుగు ఇండస్ట్రీలో ఆ నాలుగురు ఆ నాలుగురు అంటున్నారు. కానీ ఆ నలుగురిలో లేనని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసం అని విమర్శించారు. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి... కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందినవాళ్లు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదని అన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని... అలాంటప్పుడు గత ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. "మనకు కష్టం వచ్చిందనే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు... మరి ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి.  ఇలాంటప్పుడు అందరూ కూర్చుని ఏం చేయాలనేది చర్చించాలి కదా! నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలి" అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తెలుగు సినిమా పెద్దలు కనీసం మర్యాదకైనా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. టాలీవుడ్ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు.  రెగ్యులర్ గా జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశాలకు తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే, సినీ పరిశ్రమకు ఏదైనా సమస్య వస్తే తన మద్దతు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఆ 'నలుగురు' కాస్తా ఇప్పుడు 10 మంది అయ్యారు... వారిలో నన్ను కలపవద్దని మీడియాను కోరుతున్నా అని విలేకరులతో అన్నారు. తాను 50 ఏళ్లుగా సినిమాలు తీసే వృత్తిలో ఉన్నానని, తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లీజులో లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీలో 1,500 థియేటర్లు ఉంటే, అందులో ప్రస్తుతం తనకు 15 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆ 15 థియేటర్లను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నానని అన్నారు. లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా సిబ్బందికి చెప్పాను అని వివరించారు. థియేటర్ల మూసివేతపై ఏపీ మంత్రి మాట్లాడింది సమంజసమే అనుకుంటున్నానని అల్లు అరవింద్ తెలిపారు.
ఆ నలుగురిలో నేను లేను : అల్లు అరవింద్ Publish Date: May 25, 2025 6:31PM

ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీయే సీఎంలు తీర్మానం

  ఆపరేషన్‌ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, సాయుధ బలగాలను ప్రధాని వెన్నంటి పోత్సహిస్తూ వచ్చారని, ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆపరేషన్ సిందూర్ గట్టి సమాధానం ఇచ్చిందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ విజయంలో భద్రతా బలగాలు, ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఎన్డీయే రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టిన ఈ  తీర్మానాన్ని మిగతా నేతలు ఆమోదించారు. ఎన్డీయే ( పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.  దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. సమావేశంలో భాగంగా.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టే అంశంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే మాట్లాడుతూ..ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు అధికారాను ఇచ్చి..ముందుకు నడిపించారని కొనియాడారు . ఎన్డీయే రాష్ట్రాల సీఎంలతో సమావేశం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో కుల జనగణనపై ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రశంసించామని వారు తెలిపారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారం లక్ష్యంగా అందరు కలిసి పనిచేయాలి అని తెలిపారు.
ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీయే సీఎంలు తీర్మానం Publish Date: May 25, 2025 5:55PM

కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన లాలూ ప్రసాద్‌

  రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌‌ను  ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు  ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు విరుద్ధంగా నడుచుకుంటున్నందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందుకు తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి, కటుంబం నుంచి బహిష్కరిస్తున్నామని లాలూ యాదవ్‌ ట్వీట్టర్ వేదికగా ద్వారా పేర్కొన్నారు.  తాను 12 ఏళ్లుగా అనుష్క యాదవ్‌ అనే మహిళతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుపుతూ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శనివారం చేసిన పోస్టు వైరల్‌ అయ్యింది. ఆ మరుసటి రోజే లాలూ యాదవ్‌ అతడిపై బహిష్కరణ వేటు వేశారు. అయితే తన ఫేస్‌బుక్‌ పోస్టుపై ఆదివారం ఉదయమే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ స్పందించారు. ఆ పోస్టు తాను పెట్టింది కాదని, తన ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ పోస్టుతో జత చేసిన ఫొటో కూడా ఒరిజినల్‌ కాదని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఎడిట్‌ చేశారని ఆరోపించారు. తమ ఫ్యామిలీ పరువు తీయడానికే ఎవరో ఇలా చేశారని విమర్శించారు. అయినా ఆ పోస్టును కారణంగా అతడి తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. తేజ్‌ ప్రతాప్‌పై పార్టీ నుండి సస్పెండ్ చేశారు.  
 కుమారుడిని పార్టీ నుంచి  సస్పెండ్ చేసిన లాలూ ప్రసాద్‌ Publish Date: May 25, 2025 4:40PM

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌‌తో కేటీఆర్ భేటీ..అందుకోసమేనా?

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌ను ఆపార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌‌లో కలిశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ దాని పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కవిత తండ్రి కేసీఆర్‌కు ఆమె లేఖ రాయటం.. పార్టీలోని కొంతమందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అని కవిత అనటంతో తీవ్ర దుమారం రేగింది. కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుందంటూ నిన్న(శనివారం) జరిగిన సమావేశంలో కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.  
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌‌తో కేటీఆర్ భేటీ..అందుకోసమేనా? Publish Date: May 25, 2025 4:17PM

ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు : హ‌రీశ్‌రావు

  రాష్ట్ర నీటి అవ‌స‌రాలు కాపాడ‌టంలో ఈ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది.. గోదావ‌రి – బ‌న‌కచ‌ర్ల ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 200 టీఎంసీల గోదావ‌రి జ‌లాలు ఏపీ త‌ర‌లించుకుపోయే కుట్ర జ‌రుగుతుంది. తెలంగాణ‌కు ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. గోదావ‌రి – బ‌న‌క‌చ‌ర్ల‌కు ఒక్క అనుమ‌తి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది.  కేంద్రం జుట్టు త‌న చేతిలో ఉంద‌ని చంద్ర‌బాబు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన జ‌ల‌దోపిడీ.. కాంగ్రెస్ పాల‌న‌లో మ‌ళ్లీ మొద‌లైంది. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. తెలంగాణ చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు మోకాలు అడ్డుపెట్టారు. తెలంగాణ ప్రాజెక్టులు ర‌ద్దు చేయాల‌ని కేంద్రానికి లేఖ‌లు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాల‌ని ఏపీకి 20కి పైగా లేఖ‌లు రాసింది. పాల‌మూరు, భ‌క్త‌రామ‌దాసు, డిండిపై చంద్ర‌బాబు లేఖ‌లు రాశారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.
ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు : హ‌రీశ్‌రావు Publish Date: May 25, 2025 3:45PM

సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న గవర్నర్‌ దంపతులు

  కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు పుష్కర పుణ్య స్నానం ఆచరించారు.  గవర్నర్‌ దంపతులకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు.   అనంతరం గవర్నర్ సతీసమేతంగా ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మే 15 నుండి మే 26 వరకు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్నాయి. ఈ పవిత్ర 12 రోజుల ఉత్సవంలో గోదావరి, ప్రాణహిత, భూగర్భ సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో భక్తులు పుష్కర స్నానం చేస్తారు.  పుష్కరాల సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టీఎస్‌ఆర్టీసీ ద్వారా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుష్కరాలు ముగింపు దశకు రావడంతో భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నేడు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
 సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న గవర్నర్‌ దంపతులు Publish Date: May 25, 2025 1:48PM

మిస్ వ‌ర‌ల్డ్‌లో రాజ‌కీయ కుట్ర కోణం?

  మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్య‌వ‌హార శైలి కాస్త అనుమానాస్ప‌దంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మ‌ర్ అయిన మ్యాగీ త‌న త‌ల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విష‌యాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వ‌స్తోంద‌ని అంటారు కొంద‌రు.మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు అన‌గా ఇప్ప‌టికిప్పుడొచ్చిన న‌ష్టం ఏమీ లేదు. ఎందుకంటే 1951లో ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇంగ్లండ్ లో ఒక బికినీ షోతో మొద‌లైన ఈ పోటీలు.. ఆనాడే వివాదాస్ప‌దం. ఆ త‌ర్వాత అదిప్ప‌టికి అర‌డ‌జ‌ను సార్ల‌కు పైగా ర‌క‌ర‌కాల వివాదాల‌తో తీవ్ర అభ్యంత‌రాల‌ను ఎదుర్కుంది. తెలుపు- న‌లుపు, మ‌తానికి సంబంధించి, ఆపై కోవిడ్ వంటి విష‌యాల్లో ఈ పోటీలు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆ మాట‌కొస్తే హైద‌రాబాద్ లోనూ వ్య‌తిరేక‌త‌లు ఎదుర‌య్యాయి. కొన్ని ప్ర‌జా సంఘాల వారు ఈ పోటీల‌ను తొలి  నుంచీ వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు.  ఇప్పుడు కూడా ఇక్క‌డ కూడా వ్య‌తిరేకించారు. అయితే ఇక్క‌డ మ్యాగీ విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలేంటంటే.. ఇది ఒక ఇంగ్లండ్ కి సంబంధించిన పీజెంట్. ఆమె మ‌రెవ‌రో కాదు మిస్ ఇంగ్లండ్. అలాంటిది త‌న దేశానికి సంబంధించిన ఒక పోటీలో పాల్గొని.. ఎలాగోలా ఇక్క‌డి స్థితిగ‌తుల‌ను అవ‌గ‌తం చేసుకుని వాటిని పూర్తి చేసి.. ముందుకెళ్లి కిరీటం ద‌క్కించుకోవాలి. ఆమెకంటూ ఈ కిరీటం ద‌క్క‌ద‌నుకుందో ఏమో తెలీదు. కానీ ఆమె అయితే అర్ధాంత‌రంగా అది కూడా ఒక అబ‌ద్ధం చెప్పి త‌ప్పుకుంది. త‌న త‌ల్లికి బాగోలేద‌ని ఆమె చెప్ప‌డం విడ్డూరం. ఇది ఎప్ప‌టికీ స్ఫూర్తి కాదు. రెండో విష‌యం ఇక్క‌డంద‌రూ త‌న‌నొక వేశ్య‌ను చూసిన‌ట్టు చూస్తున్నారంటే.. అర్ధ‌మేంటి? ఇక్క‌డో మాట అక్క‌డో మాట చెప్ప‌డంలో మీనింగ్ ఏమ‌నుకోవాలి?అంటే మిగిలిన కంటెస్టెంట్లంతా వేశ్య‌ల‌నా? లేక హైద‌రాబాద్ అంటే అతి పెద్ద విటుల సంఘ‌మ‌నా ఒక ర‌కంగా చెబితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యానాల వ‌ల్ల ఆమె ఒక్క‌రే శుద్ధ  పూస మిగిలిన వారాంతా వ్య‌భిచారుల‌ని.  అంతేగా దీన‌ర్ధం! మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ఇటు వ‌చ్చింది సాదా సీదా టూరిస్టుగా కాదు. ఒక దేశానికి ప్ర‌తినిథిగా. పైపెచ్చు ఇదామె దేశానికి సంబంధించిన ప్ర‌పంచంలోనే నాలుగో అతి  పెద్ద బ్యూటీ ఈవెంట్. దాన్ని అప‌హాస్యం చేయ‌డం అంటే త‌న దేశాన్ని సైతం అప‌హాస్యం చేయ‌డంతో స‌మానం.  మ‌రో ఇంపార్టెంట్ థింగ్.. ఇది బ్యూటీ విత్ ప‌ర్ప‌స్ గా 1980ల కాలం నాటి నుంచి ప్రాచుర్యం పొందింది. ఈ మొత్తం ఈవెంట్ ద్వారా సంపాదించిన మొత్తంలోంచి 1 బిలియ‌న్ పౌండ్ల‌ను విక‌లాంగులు, అనాథ బాలల‌కు ఒక చారిటీగా ఇస్తారు. దీన్ని కూడా ఆమె క‌నీసం గుర్తించ‌లేదు.ఇక పోతే హైద‌రాబాద్ కి లండ‌న్ కొ ఒక పోలిక ఏంటంటే.. హైద‌రాబాద్ లోనూ లండ‌న్లోనూ న‌దులుంటాయి. లండ‌న్ న‌గ‌ర మ‌ధ్య భాగంలో థేమ్స్ న‌ది ఉన్న‌ట్టు.. ఇక్క‌డ కూడా మూసీ న‌ది ఉంటుంది. ఈ ప్ర‌భుత్వం మూసీ ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించింది. తాను వ‌చ్చేట‌పుడు ఈ విష‌యం కూడా తెలుసుకుని.. తాను ఈ దిశ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా విరాళాలు సేక‌రించి త‌న వంతు బాధ్య‌త తీసుకోవ‌చ్చు.  అదీ  మిస్ చేసిందీ మిస్ ఇంగ్లండ్. ఇక పోతే.. వ‌చ్చే రోజుల్లో ఈమె అందానికి దాని వెన‌క ఉన్న తెలివికి మెచ్చి పొర‌బాటున ఐక్య‌రాజ్య స‌మితి ఈమెకు ఏ సోమాలియాకో పంపి అక్క‌డి మ‌హిళ‌ల‌ల్లో సంస్క‌ర‌ణ తీసుకురావాల‌ని.. వారికంటూ ఆత్మ విశ్వాసాన్ని నూరిపోయాల‌న్న బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తూ ఒక అంత‌ర్జాతీయ రాయిబారిగా పంపితే అక్క‌డ వారు ఇలా చేశారు అలా చేశారు. అక్క‌డి అర‌టిపండ్లు, ఒంటె పాలు నేను తాగ‌లేక పోయానంటే ఎలా ఉంటుంది?ఇదిలా ఉంచండి. బేసిగ్గా మ్యాగీ ఒక స్విమ్మ‌ర్. స్విమ్మింగ్ ఏం చెబుతుంది? ఎన్నేసి అవాంత‌రాలు ఎదురైనా వాటిని ఈదుకుంటూ వెళ్లాల‌ని. క‌నీసం ఆ స్పిరిట్ కూడా ఆమె కొన‌సాగించ‌లేక పోయారు. ఫైన‌ల్ గా ఇక్క‌డ మ్యాగీ వ్య‌వ‌హార‌శైలి అనుమానాస్ప‌దంగా  ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక్క‌డున్న కొన్ని ప్ర‌త్య‌ర్ధి పార్టీ ఎన్నారై లింకులు అక్క‌డ మ్యాగీ మ‌ద‌ర్ ని మేనేజ్ చేసి ఉంటారేమో.. అని అంటున్నారు కొంద‌రు.  అంతే కాదు ఇక్క‌డ ఒక రాజ‌కీయ పార్టీ క‌ర‌ప‌త్రిక‌ ఈ విష‌యంపై ఎంతో ఆతృత క‌న‌బ‌ర‌చి.. త‌ద్వారా ఆమెకు ఫోన్ చేసి మ‌రీ ఈ విష‌యం ఒక క్లారిటీ తెచ్చుకుని.. అక్క‌డున్న త‌మ యూకే ప్ర‌తినిథి  చేత ఇది బ్రాండ్ హైద‌రాబాద్ ఇమేజీకే డ్యామేజీ క‌లిగించే అంశ‌మంటూ స్టేట్మెంట్ ఇప్పించారంటే.. దీని వెనక ఏ రాజ‌కీయ కుట్ర కోణం లేద‌నుకోవాలా? అంటున్నార‌ట కొంద‌రు. మ‌రి చూడాలి.. ఇలాంటి కుట్ర కోణాలు ఇందులో మ‌రేవైనా దాగి ఉన్నాయో తెలియాల్సి ఉందంటున్నారు వీరు.  ఏది ఏమైనా మ్యాగీ చాలా పెద్ద త‌ప్పు చేశారు. ఇటు త‌న ఇంగ్లండ్ సంస్థ మిస్ వ‌ర‌ల్డ్ ఆర్గ‌నైజేష‌న్ కి, అటు హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజీకి మాయ‌ని మ‌చ్చ తెచ్చారు. అంతే కాదు త‌న‌తో పాటు పాల్గొన్న ఇత‌ర కంటెస్టెంట్ల‌ను కూడా ఆమె ఒక ర‌కంగా వేశ్య‌ల‌ని ఇండెరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది త‌ప్ప కుండా కోటిన్న‌రకు పైగా జ‌నాభాగ‌ల స‌గ‌టు హైద‌రాబాద్ వాసి ఖండించాల్సి ఉందని అంటారు కొంద‌రు సామాజిక వేత్త‌లు. మ‌రి మీరేమంటారు?  
మిస్ వ‌ర‌ల్డ్‌లో  రాజ‌కీయ కుట్ర కోణం? Publish Date: May 25, 2025 1:01PM

సిట్‌ పిలిస్తే లిక్క‌ర్ స్కామ్‌లో సంచలన విషయాలు చెబుతా : ఎంపీ సీఎం ర‌మేశ్‌

  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో బీజేపీ ఎంపీ  సీఎం ర‌మేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చాలా విష‌యాల‌పై సిట్ ఇంకా పూర్తిగా దృష్టిసారించ‌లేదని ఆయ‌న పేర్కొన్నారు. సిట్ పిలిస్తే తాను వెళ్లి మద్యం కుంభకోణంలో బ‌య‌ట‌కు రాని విష‌యాలు వెల్ల‌డిస్తాని ఆయన అన్నారు. ఢిల్లీలోని త‌న నివాసంలో ఎంపీ సీఎం ర‌మేశ్ మీడియాతో మాట్లాడారు. జగన్ హ‌యాంలో లిక్కర్ షాపుల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ప్ర‌తి నెలా రూ. 5 కోట్లు జ‌గ‌న్ మ‌నుషులు క‌మీష‌న్‌గా వ‌సూలు చేశారు. మ‌ద్యం దుకాణాలు, డిపోల వ‌ద్ద నియ‌మించిన దాదాపు 11వేల మంది సెక్యూరిటీ సిబ్బంది వేత‌నాల నుంచి కూడా క‌మీష‌న్ల రూపంలో నెల‌కు రూ. 3 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు నా వ‌ద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి అని ఆయ‌న అన్నారు.  ఇక‌, కరెంట్ కొనుగోళ్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినట్లు నిరూపిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు. లేదంటే జ‌గ‌న్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా అని సీఎం ర‌మేశ్ స‌వాల్ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబును వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అప్పుల సామ్రాట్ అని వ్యాఖ్యానించ‌డంపై కూడా సీఎం ర‌మేశ్ స్పందించారు. "మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం రాష్ట్రం ఏర్ప‌డే నాటికి రూ. ల‌క్ష కోట్ల అప్పు ఉంటే... ఆ త‌ర్వాత చంద్ర‌బాబు రూ. 2,49,350 కోట్ల అప్పు చేశారు. 2019-24 మ‌ధ్య కాలంలో త‌మ పాల‌న‌లో రూ. 3.32 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిన‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించుకున్నారు. గ‌త ముఖ్యమంత్రి కంటే దాదాపు రూ. ల‌క్ష కోట్లు అధికంగా అప్పు చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబును అప్పుల సామ్రాట్ అని విమ‌ర్శించ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంది" అని ఎంపీ తెలిపారు.  
సిట్‌ పిలిస్తే లిక్క‌ర్ స్కామ్‌లో సంచలన విషయాలు చెబుతా : ఎంపీ సీఎం ర‌మేశ్‌ Publish Date: May 25, 2025 12:46PM

పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి

  పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్  వద్ద చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి షాపూర్  బెంగళూరు జాతీయ రహదారిపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనాలను కానిస్టేబుల్స్ తనిఖీ చేస్తున్నారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.  వాహనం వద్దనున్న విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుల్స్ కు తీవ్రగాయాలైనట్లు సమాచారం. తోటి కానిస్టేబుల్స్ వారిని సమీప ఆస్పత్రికి తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ విజయ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. 
పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి Publish Date: May 25, 2025 11:37AM

బలగం నటుడు కన్నుమూత

  ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు  మరణించారు. జీవీ బాబు మృతి పట్లా బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. 'ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది' అని పేర్కొన్నారు. కాగా, రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.  ఇందులో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. చాలా మందికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాగా, ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లె టూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి జీవీ బాబు మెప్పించారు. అలాంటి నటుడు మృతిచెంద‌డంతో సినీ ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది.  
బలగం నటుడు కన్నుమూత Publish Date: May 25, 2025 11:13AM

కుప్పంలో చంద్రబాబు గృహప్రవేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు.    శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలో  రెండు ఎకరాల స్థలంలో  చంద్రబాబు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి విదితమే. ఆ ఇంటిలో  ఆదివారం (మే 25) చంద్రబాబు దంపతులు గృహప్రవేశం చేశారు. శనివారం (మే 24) రాత్రికే చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్, బ్రహ్మణి దంపతులు కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు హస్తినలో నీటి అయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత నేరుగా కుప్పం చేరుకున్నారు.  చంద్రబాబు గృహప్రవేశ మహోత్సవానికి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  దాదాపు  30 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు అంచనా. చంద్రమాబునాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించారు.  ఆదివారం వేకువజామున 3 నుంచి 4 గంటల నడుమ గృహ ప్రవేశంను గోపూజ, పూజాది కార్యక్రమాలతో నిర్వహించారు.   
కుప్పంలో చంద్రబాబు గృహప్రవేశం Publish Date: May 25, 2025 10:01AM

మహానాడుపై వైసీపీ విషం.. మాస్కులు ధరించి నాటకం!

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. తెలుగుదేశం చరిత్రలోనే తొలి సారిగా కడపలో మహానాడు జరుగుతోంది. ఈ ఏడాది మహానాడు నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. జగన్ అడ్డాలో ఈ నెల 27 నుంచి 29   నిర్వ‌హించే మ‌హానాడుకు ఇక రెండు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది.  వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి.  అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది.   మహానాడు నిర్వహణకు అనుమతి రద్దు చేయండి అంటూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నాయకత్వంలో ప‌లువురు నాయ‌కులు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చేందుకు వారంతా మాస్కుల ధరించి వచ్చారు.   ఇంతకీ మహానాడును ఆపేయాలంటూ వారు వినతి పత్రం ఎందుకు ఇచ్చారంటే.. కరోనా మహమ్మారి. కరొనా విజృంభిస్తున్న ఈ సమయంలో మహానాడు నిర్వహణ వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనీ, రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుందనీ వారా వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మహానాడుకు వచ్చే వాహనాలనూ అనుమించవద్దనీ, వాహనాలకు ఇప్పటికే లైసెన్సులు ఇచ్చి ఉంటే వాటినీ రద్దు చేయాలనీ వారా వినతిపత్రంలో కోరారు.  ఇదంతా ప్రజల ఆరోగ్యం పట్ల తమకున్న అక్కర, ఆందోళనగా వారు చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటికే కడప .జిల్లాలో ఉనికి మాత్రంగా మిగిలిన వైసీపీ పలుకుబడి మహానాడు తర్వాత ఆ మాత్రంగా కూడా ఉండదన్న ఆందోళనే కారణమని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి కరోనా కేసులు అక్కడక్కడా ఒకటీ అరా వెలుగు చేసినప్పటికీ.. కేంద్రం ఇప్పటికే ఇప్పుడు కరోనా ప్రమాదకరమైన వైరస్ కాదని స్పష్టంగా ప్రకటించింది. ఎలాంటి అలర్ట్ ప్రకటించలేదు. ఆందోళన అవసరం లేదని ప్రజలకు భరోసా కూడా ఇచ్చింది.   అయినా   వైసీపీ నాయ‌కులు  మ‌హానాడు నిర్వహణపై కరోనా బూచిని చూపుతూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.  కడపలో మహానాడు నిర్వహణతో తెలుగుదేశం పుంజుకుంటుందనీ, తమ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నభయంతోనే ఇప్పుడీ యాగీ చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  
మహానాడుపై వైసీపీ విషం.. మాస్కులు ధరించి నాటకం! Publish Date: May 25, 2025 8:50AM

భక్త జన సంద్రంగా తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం (మే 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శనివారం (మే 24)   శ్రీవారిని మొత్తం  90 వేల 211 మంది దర్శించుకున్నారు. వారిలో 43 వేల 346 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 11 లక్షల రూపాయలు వచ్చింది. 
భక్త జన సంద్రంగా తిరుమల Publish Date: May 25, 2025 8:23AM

నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం

ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ఇచ్చిన ప్రెజంటేషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ సైతం అభినందించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో  వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై చంద్రబాబు నాయుడు నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు. చంద్రబాబు ప్రజెంటేషన్‌కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజెంటేషన్‌లో ఏపీ సీఎం ప్రస్తావించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు ప్రజెంటేషన్‌లో వివరించారు. రాష్ట్రంలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని తన ప్రజంటేషన్‌లో తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా ఏపీ సీఎం కోరారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం.. కర్నూలులో డ్రోన్ సిటీ  ప్రణాళికలను ప్రజెంటేషన్‌లో ప్రత్యేకంగా వివరించారు. డిజిటల్ గవర్ననెన్స్‌లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల నిబంధన రద్దు చేసినట్టు సీఎం వివరించారు. మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్టు సీఎం వెల్లడించారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, రాష్ట్ర పురోగతిని కొలిచేందుకు 523 కీలక సూచికలు సిద్ధం చేశామన్నారు. ప్రతి కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ పార్క్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పీ4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని.. అర్బన్ రూరల్ సినర్జీ మోడల్ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తన ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం Publish Date: May 24, 2025 6:02PM

మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగిన మిస్ ఇంగ్లాండ్

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్   పోటీల నుంచి  బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా వైదొలగింది. తొలుత తాను వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని చెప్పిన మాగీ..  ఆ తరువాత మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. ది సన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ పోటీల్లో కేవలం ప్రదర్శన ఇచ్చే కోతుల్లా తమను చూస్తున్నారని ఆమె విమర్శించారు. అంతే కాకుండా తనను ఓ వేశ్యలా ట్రీట్ చేశారని, ఈ తీరు తనను మానసికంగా తీవ్రంగా గాయపరిచిందని మాగీ వెల్లడించారు.   24 ఏళ్ల మిల్లా మాగీ, గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచి భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చింది.  మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా జరిగిన వివిధ కార్యక్రమాలలో  కంటెస్టంట్లను  మగస్పాన్సర్ల ముందు కవాతు చేయించడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బ్యూటీ విత్  ఏ పర్పస్  అన్న స్ఫూర్తికి భిన్నంగా అందం ప్రదర్శనకు మాత్రమే అన్నట్లుగా ఈ పోటీల తీరు ఉందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ  ఆవేదన వ్యక్తం చేశారు.   కాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగాలన్న మిల్లా మాగీ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి.  
మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగిన మిస్ ఇంగ్లాండ్  Publish Date: May 24, 2025 5:04PM

కవిత వెనక కమల దళం?

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ  తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవంక కవిత లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా.. అందుకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వీటన్నింటి మించి గత కొంతకాలంగా ఆమె పార్టీతో, ఫ్యామిలీతో సంబంధం లేకుండా సొంత పంథాలో సాగిస్తున్నరాజకీయాలను గమనిస్తే.. ఆమె వెనక ఇంకెవరో ఉన్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ లో తనకు అండదండ రెండూ లేవనే నిర్ణయానికి వచ్చే..  ఆమె మరో మార్గంలో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇంతలా సంచలనం సృష్టించిన కవిత లేఖ పై బీఆర్ఎస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలు, వేచి చూచే ధోరణిలోనే ఉన్నాయి.  పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కవిత లేఖను పరస్పర ఆరోపణలకు వినియోగించుకుంటున్నాయి. ఆచి తూచి స్పందిస్తున్నాయే కానీ.. గట్టిగా రియాక్ట్  కావడం లేదు. ఆమె రాసిన లేఖను గానీ, ఆమె చేసిన వ్యాఖ్యలను గానీ, అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.  బీఆర్ఎస్ ముఖ్య నాయకులలో ఒక్క కేటీఆర్ మినహా మరెవరూ స్పందించలేదు. కేటీఆర్ కూడాజజ పార్టీ అంతర్గత సమస్యలను పార్టీలో చర్చించు కోవాలే కానీ, బయట మాట్లాడడం మంచింది కాదని పరోక్షంగా కవితను హెచ్చరించారు. అలాగే, కవిత లేఖ అంత పెద్ద విషయం కాదని  కేటీఆర్  కవిత రేపిన దుమారాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అలాగే..  నేషనల్ హెరాల్డ్  కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో రెంత్ రెడ్డి పేరున్న విషయాన్ని పైకి తెచ్చి  చర్చను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు. మరోవంక కాంగ్రెస్, బీజేపీలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్లుగా.. ఇదంతా ఫ్యామిలీ డ్రామా అన్నట్లుగా కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో  కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు , మంత్రులు వివరణ కోరుతున్నారు. ఆ దయ్యాల పేర్లు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జాయింట్ గా  డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నారు.   అయితే నిజంగానే.. ఇది ఫ్యామిలీ డ్రామానే అయినా, ఈ డ్రామాలో బీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్, బీజేపీ పాత్ర కూడా ఉందని  రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి పైకి కనిపిస్తున్న చిత్రానికి, లోపల జరుగతున్నతతంగానికి మధ్య పొంతన, పోలిక లేదని అంటున్నారు. ముఖ్యంగా, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ను బలహీన పరిచేందుకు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కిన కవితను, పావుగా ఉపయోగించుకునే  వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. నిజానికి  ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై, బెయిలుపై విడుదలై వచ్చిన తర్వాతనే కవిత  ధోరణిలో మార్పు వచ్చిందని, ముఖ్యంగా తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనను పార్టీ, ఫ్యామిలీ పట్టించుకోలేదనే బాధ ఆమెలో ఉందని మెల్ల మెల్లగా బయటకు వస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, కవిత బీజేపీకి దగ్గరయ్యారని, అంటున్నారు. అందుకే  జైలు నుంచి బెయిలు పై వచ్చిన తర్వాత కవిత బీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లు ఉండడమే కాకుండా, తెలంగాణ జాగృతి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. మరో వంక సామాజిక తెలంగాణ నినాదాన్ని పైకి తీసుకు వచ్చి, బీసీల్లో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలనే డిమాండ్  తో పాటుగా బీసీల హక్కుల పోరాటాల్లో పార్టీతో సంబంధం లేకుండా  తెలంగాణ జాగృతి తరపున పాల్గొన్నారు.   అయితే.. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్  నీడ అయినా తనమీద పడకుండా  కవిత జాగ్రత్త  పడుతున్నారు. చివరకు   అమెరికా నుంచి శుక్రవారం (మే 23) హైదరాబాద్  చేరుకున్న సమయంలో కూడా ఆమెకు స్వాగతం పలికేందుక  వచ్చిన వారిలో, కుల సంఘాలు, జాగృతి కార్యకర్తలతో పాటుగా కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నా, ఏ ఒక్కరూ కూడా గులాబీ జెండా పట్ట లేదు, కేసీఆర్ కు జై కొట్టలేదు. అంటే..  బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా కవిత, సామాజిక తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని, ఈ ప్రయత్నాల్లో ఆమె సక్సెస్ అయితే, సామాజిక తెలంగాణ నినాదంగా సొంత పార్టీని ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. అయితే.. ఇదంతా కవిత బీజేపీ కనుసన్నల్లో చేస్తున్నారని అంటున్నారు.    రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తార స్థాయికి చేరిందిజ  రానున్న మూడున్నర  ఏళ్లలో కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతుందని అంచనా వేస్తున్న కమల దళం, కవితను ప్రయోగించి, బీఆర్ఎస్ ను బలహీన పరిస్తే..  కొత్త సమీకరణాలతో, కొత్త పొత్తులతో రాష్ట్రంలో పాగ వేయవచ్చని   భావిస్తోంది. అందులో భాగంగానే  కవిత ఎపిసోడ్ తెర పైకి వచ్చిందని అంటున్నారు.
కవిత వెనక  కమల దళం? Publish Date: May 24, 2025 5:02PM

పీఎస్సార్ కు బీపీ డౌన్.. బెజవాడ జైలు నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలింపు

విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 24) అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఆయనకు బీపీ డౌన్ అయ్యిందని అంటున్నారు. ముంబయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో పీఎస్సార్ ఆంజనేయులును ఏప్రిల్ 22న హైదరాబాద్ లో  ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  అంతేకాకుండా ఆయన ఇంటితో పాటు ఫామ్‌హౌస్‌లోను, ఆయన బంధువుల ఇళ్లల్లోను సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు.  అంతకు ముందు శుక్రవారం (మే 23) హైదరాబాద్   శివారు మొయినాబాద్ మండలంలోని  ఆయన ఫామ్ హౌస్ లో  ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సోదాలు కొనసాగాయి.  ఈ ఫామ్ హౌస్ లోనే గత నెల 22న ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా పీఎస్సార్   ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ వాల్యుయూషన్ లో అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  2018-2019 మధ్య కాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు   నిధులు దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలపై పీఎస్సార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.  
పీఎస్సార్ కు బీపీ డౌన్.. బెజవాడ జైలు నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలింపు Publish Date: May 24, 2025 4:17PM

కవిత లేఖపై కేటీఆర్ ఏమన్నారో తెలుసా?

బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయింది. అసలు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకోలేదనే చెప్పాలి. ఏవో  ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో  హడావుడి చేస్తున్నప్పటికీ.. పార్టీ మాత్రం అంతర్గత విభేదాలతో కూనారిల్లుతూనే ఉంది. పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడం దగ్గర నుంచి ఆ పార్టీలో ఎక్కడా ఎన్నడూ ఐకమత్యం, ఏకాభిప్రాయం కనిపించిన దాఖలాలు లేవు. కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా లేకపోవడంతో ఆ పార్టీ అత్యంత తీవ్రమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు పార్టీలో సంపూర్ణ మద్దతు లేదన్న విషయం దాదాపు ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధమైందన్న వార్తలు వచ్చిన ప్రతిసందర్భంలోనూ బహిర్గతమైంది. తాజాగా పార్టీ పాతికేళ్ల పండుగను వరంగల్ లో ఘనంగా నిర్వహించుకుంది. ఆ సందర్భంగా కేటీఆర్ కు పార్టీ పగ్గాల అప్పగింతకు కేసీఆర్ సర్వం సిద్ధం చేశారన్న వార్తలు వినిపించాయి. అందుకు అనుగుణంగా రజతోత్సవ సభా ప్రాంగణం, వేదిక అంతా కేటీఆర్ మయంగానే కనిపించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫొటోలు వినా మరెవరివీ కనిపించలేదు. ఇక పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావుకు అయితే రజతోత్సవ సభ సందర్భంగా కనీస ప్రాధాన్యత కూడా లభించలేదు. దీంతో హరీష్ రావు మనస్తాపానికి గురయ్యారనీ, పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకుంటారనీ వార్తలు జోరుగా వినిపించాయి. అయితే కేసీఆర్ రంగంలోకి దిగి, కేటీఆర్, కేసీఆర్ మధ్య సయోధ్య కుదిర్చారు. కేటీఆర్ స్వయంగా రెండు సార్లు హరీష్ రావు నివాసానికి వెళ్లి చర్చించారు. దీంతో పార్టీలో విభేదాలన్న ప్రచారం టీ కప్పులో తుపానేనని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే ఉరుములేని పిడుగులా ఆ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగాన్నే తప్పుపడుతూ తెలంగాణ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత సంధించిన లేఖాస్త్రం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి కారణమైంది. రాజకీయవర్గాలలో దుమారం లేపింది. బీఆర్ఎస్ లో చీలిక తప్పదా అన్న సందేహాలను లేవనెత్తింది. ఈ లేఖపై పార్టీలో ఎవరికీ కూడా ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. దీంతో తన భావాలను తండ్రితో స్వేచ్ఛగా, నిర్భయంగా పంచుకోగలిగిన కవిత లేఖ ఎందుకు రాస్తారు అంటే ఆ లేఖ కల్వకుంట్ల కవిత రాయలేదనీ, ఎవరో సృష్టించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే లేఖ వెలుగులోనికి వచ్చిన మరునాడే తన అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కవిత ఆ ప్రచారాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆ లేఖ తానే రాశాననీ, కానీ పార్టీలోని కోవర్టుల కారణంగానే అది లీకైందనీ కుండబద్దలు కొట్టేశారు.  ఇప్పుడు తాజాగా కవిత లేఖపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. కవిత లేఖ రాయడంలో తప్పు లేదంటూనే.. అంతర్గత విషయాలను బహిరంగం చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించి కవిత లేఖ తప్పా, రైటా అన్న విషయం తేల్చకుండా దాటేశారు. బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందన్న కేటీఆర్ ఎవరైనా పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయవచ్చునని చెబుతూనే.. పార్టీ అంత‌ర్గ‌త విష‌యాల‌పై అంత‌ర్గ‌తంగానే చ‌ర్చించడమే మేలని ముక్తాయించారు. అదే విధంగా కవిత చేసిన కోవర్టుల వ్యాఖ్యపై కూడా అంటీముట్టనట్టుగానే మాట్లాడారు. కోవర్టులు లేని పార్టీయేలేదని అంటూనే వారంతా సమయం వచ్చినప్పుడు బయటపడతారన్నారు. మొత్తంగా కవిత లేఖపై కేసీఆర్ స్పందన ఒక విధంగా కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్న సమెతను గుర్తుకు తెచ్చిందని పరిశీలకులు అంటున్నారు.  
కవిత లేఖపై కేటీఆర్ ఏమన్నారో తెలుసా? Publish Date: May 24, 2025 3:23PM

తాగుబోతు ఖాకీలపై చర్యలు.. టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుమలలో తప్పతాగి హల్ చల్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు చెప్పారు.  అన్నమయ్య భవన్ లో శనివారం (మే 24) డయల్ యువర్ ఈవో కార్యకరమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.  శ్రీవారి పుష్కరిణిలో శుభ్రంగా ఉండడం లేదని భక్తుల ఫిర్యాదు చేశారనీ,  అద్దె గదులలో బాత్రూంలు కొన్ని సరిగా క్లీన్ చేయడం లేదని కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. ఇక శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి, బంగారు వాకిలి దగ్గర ఎక్కువ తోపులాట జరుగుతోందని భక్తుల వద్ద నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. భక్తుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈవో స్పష్టం చేశారు. అలాగే  శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తున్నమన్న ఆయన ఇటీవల తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనల మేరకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.  తిరుమలను ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేస్తామన్నారు. 100 బిగ్ క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్ల కేటాయింపు విషయంలో నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు.  163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని అన్నారు.  భక్తులకు సాంప్రదాయ వంటలు మాత్రమే అందించాలని మరోమారు స్పష్టం చేశారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  టెక్నాలజీ ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.  త్వరలో జిపిటి చాట్ బోట్ అందుబాటులోకి తీసుకువస్తామనీ, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 4 సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని మరో 10 సేవలు ట్రయల్ రన్ లో ఉన్నాయని ఈవో శ్యామలరావు వివరించారు.  
తాగుబోతు ఖాకీలపై చర్యలు.. టీటీడీ ఈవో శ్యామలరావు Publish Date: May 24, 2025 2:33PM

జీవన విధానంలో యోగా భాగం కావాలి.. హోంమంత్రి అనిత

జీవన విధానంలో యోగా భాగం కావాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విశాఖ రానున్న నేపథయంలో సన్నాహక కార్యక్రమాలను కూడా ఘటనంగా నిర్వహిస్తున్నారు.  విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు.  యోగా   శరీరానికీ, మనసుకూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు   ఎనర్జిటిక్‌గా ఉండటానికి యోగాయే కారణమన్న అనిత..   ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక గంట యోగానికి సమయం కేటాయిస్తే..  రోజంతా ఉత్సహంగా గడిపేందుకు వీలుంటుందన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి,ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి,అధికారులు పాల్గొన్నారు. 
జీవన విధానంలో యోగా భాగం కావాలి.. హోంమంత్రి అనిత Publish Date: May 24, 2025 1:18PM

ఇంటి పార్టీ పక్కాగా రెండు ముక్కలు?

బీఆర్ఎస్ లో చీలిక పక్కా అయిపోయిందా?  కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమైపోయిందా? అంటే.. గులాబీ పార్టీ వర్గాల నుంచి ఔననే  సమధానమే వస్తోంది. నిజానికి కవిత  చాలా కాలంగా  సొంత కుంపటి’ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే..  కేటీఆర్, హరీష్ రావులను కలిపినట్లుగానే కేసీఆర్  ఏదో చేసి కవితను దారికి తెస్తారనే  ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి.  కవిత అమెరికా నుంచి వస్తూ వస్తూనే.. తెలంగాణ గడ్డ పై కాలుపెట్టీపెట్టక ముందే చేసిన ‘దయ్యాల’ వ్యాఖ్యలతో, ఆ కొద్ది పాటి దింపుడు కళ్ళెం ఆశ కూడా కొడిగట్టిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏదో మహాద్భుతం జరిగితే తప్పించి, గులాబీ పార్టీ చీలికను నిరోధించడం  ‘దేవుడి’ కి కూడా సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవును. భారత రాష్ట్ర సమితి లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావుకు, ఆయన కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత రాసిన రాజకీయ లేఖ సంచలనంగా మారింది.  నిజానికి, కవిత ఎవరో పరాయి వ్యక్తిలా, కన్న తండ్రికే  లేఖ రాయడమే ఒక సంచలనం అయితే..  ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలు మరింత సంచలనంగా మారాయి.  ముఖ్యంగా  బీఆర్ఎస్ రజతోత్సవ సభ తీరు తెన్నులు.. ఆ సందర్భంగా కేసీఆర్ చేసియన్ ప్రసంగం మంచి చెడులను ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. అదే సమయంలో ఆమె చేసిన మర్మ గర్భ వ్యాఖ్యలూ..  ముఖ్యంగా బీజేపీని విమర్శించ వలసినంతగావి మరించలేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  అంతకు మించి అమెరికా నుంచి  వస్తూనే, ఆ లేఖ రాసింది తానేనని స్పష్టం చేయడంతో పాటు, మా నాయన, కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి’ అంటూ చేసిన, వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. అలాగే..  లేఖ లీక్  కు సంబదించి కవిత లేవనెత్తిన ప్రశ్నలు.. ఆమె పుట్టింటి  కుట్రలకు అద్దం పడుతోందని అంటున్నారు.  నిజానికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్  అన్నట్లుగా పార్టీ నాయకురాలిగా కవిత లేఖ రాయడం తప్పు కాదు. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టవలసిన అవరం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితిని ఆమె తనకున్న అవగాహన మేరకు ప్రజాస్వామ్య స్పూర్తితో పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళారు. పార్టీ నాయకురాలిగా పార్టీకి పార్టీ అధ్యక్షునికి సూచనలు చేశారు. దాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కానీ  ఆమె  అక్కడితో ఆగ లేదు. కేసీఆర్ ను దేవుడిగా పేర్కొంటూనే.. ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని  పరోక్షంగానే అయినా తండ్రి పైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక విధంగా ధృతరాష్ట్రుడితో  పోలిక తెచ్చారా అన్నట్లుగా  ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.   కేసీఆర్ కుమార్తెగా  తాను రాసిన లేఖే లీక్ అయితే..  సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి? ఇది అత్యంత బాధాకరం. లేఖ ఎలా లీక్ అయిందో, పార్టీ ప్రజలు కూడా ఆలోచించాలి  అంటూ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. లేఖ లీక్ లోనే కుట్ర కోణం దాగుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, దేశంలో అడుగుపెడుతూనే, పార్టీని ముఖ్యంగా కన్న తండ్రి కేసేఆర్ ను ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఆమె,లక్ష్యం ఇంకేదో ఉందనే విషయాన్ని స్పష్టమౌతోందని పరిశీలకులు అంటున్నారు.     అదొకటి అయితే, కవిత.. నాన్నకు ప్రేమతో.. రాసిన లేఖ వెనక చాలా,  పేద్ద   కథే ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. ఇటీవల ఆమె నడకలో, నడతలో, భాషలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పు  నేపథ్యంలో కవిత అడుగులు ఎటుగా పడుతున్నాయి?  ఆమె తదుపరి రాజకీయ ప్రస్థానం ఎటుగా సాగుతోంది? ఆమె ఆమెగానే, అడుగులు వేస్తున్నారా.. లేక, నడిచేది ఆమే అయినా నడిపించే వారు వేరే ఉన్నారా? అనే ప్రశ్నలు, అనేక వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కవిత వెనక ఎవరున్నారు అనేది పక్కన పెడితే,  కవిత కారు దిగడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. నిజానికి..లిక్కర్ కుంభకోణం విచారణ మొదలైనప్పటి నుంచే ఆమెకు ఇటు ఫ్యామిలీలో,అటు పార్టీలో వ్యతిరేకత మొదలైందని అంటున్నారు. అక్కడి నుంచే ఆమె పార్టీకి, ఫ్యామిలీకి కూడా దూరం అవుతూ వచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి, ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత పార్టీని,ఫ్యామిలీని నమ్ముకుంటే కష్టమనే నిర్ణయానికి కవిత వచ్చారని అంటున్నారు. అందుకే..  ఆమె, పార్టీలో, ఫామిలీలో తమ స్థానం ఏమిటో స్పష్టం  చేయాలని, అన్న కేటీఆర్ తో సమాన హోదా కోసం పట్టుపడుతూ వచ్చారని అంటారు. అయితే.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో  పార్టీలో తన స్థానేమిటో తేట తెల్లకావడంతో పాటుగా ఆమె అమెరికా ప్రయాణానికి ముందు కేసీఆర్ మధ్యవర్తిత్వం వహించి మరీ కేటీఆర్, హరీష్ రావులను కలపడంతో.. కవితకు తన స్థానం ఏమిటో తెలిసివచ్చిందని, అందుకే ఆమె కొత్త దారులు వెతుక్కుంటున్నారని అంటున్నారు. అందుకే..  విమానం దిగుతూనే ఇక  మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా దయ్యాల  తూటాను, ఎవరికి తగలాలో వారికి తగిలే విధంగా పేల్చారని అంటున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందునుంచే ఉహించిన కవిత ఒకటి కంటే ఎక్కవ ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పడు.. ఆమె కారు దిగడం ఖాయమని తెలిపిన నేపధ్యంలో, ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు.. ఎటుగా అడుగులు వేస్తారు  అనేది చూడవలసి ఉందని అంటున్నారు.
ఇంటి పార్టీ పక్కాగా  రెండు ముక్కలు? Publish Date: May 24, 2025 1:05PM

పాక్ పై కోపంతో మైసూర్ పాక్ పేరు మార్చేశారు!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు, పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఆ దేశం పట్ల వ్యతిరేకత, ఏహ్యత ఏ స్థాయిలో వ్యక్తం అవుతోందంటే.. దేశ ప్రజలంతా ఎంతో ఇష్టపడే స్వీట్ మైసూర్ పాక్ పేరు మార్చేయాలంటూ నెట్టింట ఓ రేంజ్ లో డిమాండ్ వినిపిస్తోంది.  ఈ డిమాండ్ కు అనుగుణంగా  ఓ మిఠాయి వాలా వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లలో పాక్ అనే పదం లేకుండా వాటి పేర్లు మార్చేశాడు. ఔను నిజంగా నెటిజనుల ప్రతిపాదన రాజస్థాన్ లోని ఓ స్ట్వీట్స్ దుకాణం యజమానికి విపరీతంగా నచ్చేసింది.  అంతే వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లకు పాక్‌ పదాన్ని తీసేసి ఆ స్వీట్లకు కొత్త పేర్లు పెట్టారు.  మైసూర్ పాక్  పేరును  మైసూర్ శ్రీగా మార్చేశారు.    జైపుర్‌లో గల ప్రముఖ  త్యోహార్‌ స్వీట్స్‌  యజమాని ఈమేరకు తమ దుకాణంలోని స్వీట్ల పేర్లకు పలు మార్పులు చేశారు.  ఒక్క మైసూర్ పాక్ పేరునే కాదు  మోతీ పాక్‌, ఆమ్‌ పాక్‌, గోండ్‌ పాక్‌ పేర్లను కూడా మార్చేశారు. వాటికి కూడా  మోతీ శ్రీ, ఆమ్‌ శ్రీ, గోండ్‌ శ్రీ అని కొత్తగా నామకరణం చేశారు. స్వర్ణ భాషం పాక్‌, చాందీ భాషమ్‌ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు.   వాస్తవానికి స్వీట్లకు ఉన్న పేరులో పాక్ అన్న పదానికి, పాకిస్థాన్ కీ సంబంధం లేదు. పాక్ అనే పదానికి సంస్కృతంలో వండటం అని అర్ధం. అయినా ఆ పదం పాకిస్థాన్ ను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో.. ఆ పదం పలకడానికీ, వినడానికి ఇష్టం లేకనే తమ దుకాణంలో ఆ స్వీట్ల పేర్లు మార్చేశానని త్యోహార్ స్వీట్స్ యజమారి అంజలీ జైన్ తెలిపారు.  
పాక్ పై కోపంతో మైసూర్ పాక్ పేరు మార్చేశారు! Publish Date: May 24, 2025 11:46AM

తిరుమలలో తాగుబోతు ఖాకీల హల్ చల్

తిరుమలలో ముగ్గరు తాగుబోతు ఖాకీలు హల్ చల్ చేశారు.  మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు.  ఇక కొండపై భక్తులను  ఇబ్బందులకు గురిచేశారు.  మద్యం తాగిన పోలీసులను  టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పోలీసులూ కర్నూలుకు చెందిన   రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గాగుర్తించారు.  వీరిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తే 300 పాయింట్లు చూపినట్లుగా తెలుస్తోంది.  తిరుమలలో వరుస అపచారాలపై భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తప్పతాగిన కానిస్టేబుళ్లు అలిపిరి వద్ద తనిఖీలను దాటుకుని ఎలా వచ్చారన్న ప్రశ్న భక్తుల నుంచి వస్తున్నది. ఇటీవల కొన్ని రోజుల కిందట   తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్‌ చేసిన ఘటన మరువక ముందే.. ముగ్గురు పోలీసులు ఏకంగా తప్పతాగి తిరుమల కొండపైకి వచ్చి నానా హంగామా చేసిన సంఘటన జరగడంతో అసలు తిరుమలలో నిఘా ఉందా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  నమాజ్‌ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.
తిరుమలలో తాగుబోతు ఖాకీల హల్ చల్ Publish Date: May 24, 2025 11:05AM

హ‌రిహ‌ర‌మ‌ల్లుకు అడ్డొస్తున్న ఆ న‌లుగురెవ‌రు?

ఒక్క‌రిలోనే న‌లుగుర్ని చూసుకుంటున్నారా? అల్లంత దూరంలో క‌నిపించే ఆ ఒక్క‌రే న‌లుగురా? తీస్తే మ‌రో సినిమా అయ్యే ఆ క‌థ‌, క‌మామిషు! ఆ న‌లుగురూ.. ఆ న‌లుగురూ.. అనే పాట జ‌న‌సేన నాయ‌కుల‌కు మ‌ళ్లీ గుర్తుకు వ‌స్తోంది.  కార‌ణం.. జూన్ 12న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విడుద‌ల కావ‌ల్సి ఉన్న సంద‌ర్భంలో క‌రెక్టుగా థియేట‌ర్ల మూత అనే వార్త విడుద‌ల కావ‌డం వెన‌క ఆ న‌లుగురి పాత్ర ఏదైనా ఉందా? అన్న చర్చోపచ‌ర్చ‌లు సాగుతున్నాయ్.  ఈ మ‌ధ్య ఈ థియేట‌ర్ల గొడ‌వ ఒక‌టి గంద‌ర‌గోళానికి గురి చేస్తోంది. ఆ న‌లుగురిలో ఎప్పుడూ ముగ్గిరి పేర్లు బాగా హైలెట్ అవుతాయి కానీ ఆ నాలుగో పేరు ఎవ‌రిదో తెలీదు. కానీ ఆ న‌లుగురు ఆ న‌లుగురు అన‌డానికి బాగుంద‌ని అంటున్నారులా ఉంది చూస్తుంటే. అద్స‌రే ఆ న‌లుగ‌రిలో మ‌న‌కు కావ‌ల్సిన ఒక‌రైతే ఉన్నారుగా. ఇక‌నే! ఆ ఒక్క‌రినే న‌లుగురు అనుకుని గ్లాసు పార్టీ లీడ‌ర్లు, ఆ న‌లుగురినీ ఒక్క‌రిలోనే అల్లంత దూరంలో చూసుకుని.. ఆ న‌లుగురు ఆ న‌లుగురు అనేసుకుంటున్నారు బాగానే ఉంది. ప్ర‌తిసారీ ఈ న‌లుగురి గొడ‌వేంద‌ని? జూనియ‌ర్ సినిమా వ‌స్తే.. ఒక‌లా, అల్లు హీరో మూవీ రిలీజైతే మ‌రోలా.. ఇక ప‌వ‌న్ సార్ సినిమా అంటే ఇంకోలా.. సినిమాల‌కూ రాజ‌కీయాల‌కూ ఎంత సంబంధ బాంధ‌వ్యాలున్నా.. ఈ థియేట‌ర్ల గొడ‌వేంటో అర్ధం కాదు. అంతా ఒక్క‌టే అంటారు. ప‌వ‌న్ గెలిచి ఉప ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. త‌మ‌దైన శైలిలో ఆయ‌న్ను  క‌ల‌వ‌డం.. అందులో త‌న ఆత్మీయ అల్లువారు కూడా ఉండ‌టం.. అదో టైపు. ఇక్క‌డ మ‌రో అనుమానాస్ప‌దం.. ఆలోచ‌నాత్మ‌కం.. ఏంటంటే స‌రిగ్గా ఇదే అల్లువారు ప‌వ‌న్ ఇక్క‌డ ఉప‌ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తుంటే.. ఎక్క‌డో విదేశాల్లో ఉండి రాలేక పోవ‌డం ఇదో టైపు. ఇది దూరం మెయిన్ టైన్ చేయ‌డంలో భాగ‌మా.. లేక యాధృచ్చిక‌మా అర్ధం కానంత అయోమ‌యంలో జ‌న‌మేమీ లేరిక్క‌డ ఇది మ‌రో ఇంకో టైపు. ఇద‌లా ఉంచితే.. పుష్ప‌రాజ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే స‌రికి.. అడ‌వుల‌ను దోచేవాడు క‌థ‌నాయ‌కుడు ఎలా అవుతాడ‌న్న ప్ర‌శ్న‌ల‌కు బ‌దులివ్వ‌డంలో థియేట‌ర్ల మూత కార్య‌క్ర‌మం దాగి ఉందా? ఇదింకో సందేహాత్మ‌కం!!! ఏమో కౌంట‌ర్లు ఎన్ కౌంట‌ర్లు ఎప్పుడూ ఒక‌లాగానే ఉంటాయ‌ని ఎలా చెప్ప‌గ‌లం? కొంద‌రు నోటితో అంటారు. కొంద‌రు నొస‌టితో చెప్ప‌క చెబుతారు. మ‌రికొంద‌రు ఏకంగా చేసి చూపిస్తారు. ఇది ఆ టైపేమో..    ప్ర‌తీకార‌ముల యందు అతీకార‌ములు వేర‌యా విశ్వ‌దాభిరామ విన‌రా మామా! అంటూ కొంద‌రు అంటూ ఉంటారు. అందులో భాగంగా చూస్తే.. ఇది ప్ర‌తీకారానికే అతీ..కారమూ కావ‌చ్చు.  వీరీ వీరీ గుమ్మ‌డి పండు ఆ న‌లుగురి పేరేమీ అంటే ఎవ‌రు మాత్రం ఏం చెప్ప‌గ‌లం.. అందులో న‌లుగురు కాదు.. ఆ ఒక్క‌రే అని మ‌నం మాత్రం ఎందుకు చెప్పాలి.. వారికి వారికి ల‌క్ష ఉంటాయో కోటి కూడా ఉంటాయో ఎలా గెస్ చేయ‌గ‌లం? ఆ ప్ర‌తీకారం కొద్దీయే క‌దా.. జానీ చిత్ర‌ణ‌లో రోజుకు ఒక షాట్ మాత్ర‌మే తీసి.. ఆ క‌సీ క్రోధం చ‌ల్లార్చుకుంది.. అనంటారు మ‌రి కొంద‌రు. అబ్దో అదో పాత క‌థ‌.. పెద్ద క‌థ‌.. ఇప్పుడెందుకూ.. కాస్త డీటైలింగ్ లోకి వెళ్తే.. బేసిగ్గా రోజుకు నాలుగు సీన్లు తీస్తారు. కావాల‌ని నాలుగు షాట్లు కూడా తీయ‌కుండా అలా నాన్చి నాన్చి తీయ‌డం అందులో భాగ‌మే అంటారుగా. ఇలాంటివి అనుకోకుండా ఉండ‌లేం. ఇదో జ‌బ్బు జాడ్యం మ‌న‌ది.  హీరో మా వాడు. ఆట మాది. కానీ కాసు నీదా? స‌న్నాఫ్ స‌త్య‌మూర్తీ! అన్న గొడ‌వ ఈనాటిదా.. చెప్పండి. ఏనాటిదో. మా న‌డిపోడు తినాల్సిన తిండి.. ఎవ‌డో బావ‌గాడు తినిపోయాడ‌న్న బాధ ఇప్ప‌టిది కాదాయె. దీంతో ఆ ఇంటి వార‌సుడు పిల్ల ముందా- గుడ్డు ముందా?  అన్న కొచ్చిన మార్క్ రైజ్ చేశాడాయె. ఇలా కాంపౌండ్లు చీలి.. త‌లోదిక్క‌య్యింది క‌ల‌హాల కుటుంబ‌కం!!! ఇందులోనే సోష‌ల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ‌క‌డం కాక పోవ‌డం.. ఇందులో మ‌రో ట్విస్టు- లేటెస్టూ... ఈ క్ర‌మంలో వాళ్ల‌ల్లో వాళ్లు నంద్యాల హైడ్రామాలాడి హైపులు తెచ్చుకుని.. ఇప్పుడు మ‌రో స‌రికొత్త థియేట‌ర్ డ్రామాకు తెర‌లేపితిరి.. ఆ తెర దించ‌చేదెపుడు.. ఈ నాట‌కానికి ముగింపు ఎప్పుడు? తీస్తే ఇదీ ఒక సినిమా అవుద్దేమో హ‌రి హ‌ర మ‌ల్లూ.. మాలీవుడ్ అదే మ‌ల‌యాళంలో బాగా ఆడొచ్చేమో!!!  
హ‌రిహ‌ర‌మ‌ల్లుకు అడ్డొస్తున్న ఆ న‌లుగురెవ‌రు? Publish Date: May 24, 2025 10:47AM

మళ్ళీ మొదటికొచ్చిన భేతాళ ప్రశ్న.. బీజేపీ అధ్యక్షుడు ఎవరు ?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి  ఇంకా  రెండేళ్ళు అయినా అవకుండానే అట్టర్ ప్లాప్  సినిమా చూపిస్తోంది.  ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  మూడు ముక్కల ఆటలో మునిగి తేలుతోంది. మరో వంక కాళేశ్వరం మొదలు కారు రేసు వరకు అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు బీఆర్ఎస్ ను  వెంటాడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండీ లేనట్టుగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్,కాదంటే బీఆర్ఎస్ పంచన చేరడం మినహా లెఫ్ట్ పార్టీలకు మరో దారి కనిపించడం లేదు. ఒక విధంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి లేక పోయినా, రాష్ట్ర రాజకీయాల్లో మెల్లమెల్లగా  రాజకీయ శూన్యత ఏర్పడే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి.  ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభావం చూపగల పార్టీ ఏదైనా ఉందంటే..  అది బీజేపీ ఒక్కటే.  కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు. అయితే.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా..  కమల దళానికి అన్నీ ఉన్నాయి కానీ, సమర్ధ నాయకత్వమే కరవైంది. అలాగని నాయకులు లేరా అంటే ఉన్నారు. బీజేపీలో పుట్టి బీజేపీలో ఎదిగిన నాయకులు ఉన్నారు. కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు ఇతర పార్టీలలో ఎదిగొచ్చిన సీనియర్ నాయకులూ ఉన్నారు. అయితే.. నాయకుల మధ్య ఐక్యత లేదు.  నిజానికి.. ఐక్యత లేక పోవడం వల్లనే 2023లో చేతిదాక వచ్చిన ముద్ద నోటికి చేరకుండానే జారి పోయింది. ఈ మాట అన్నది మీరో నేనో, ఇంకెవరో కాదు.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ. అవును..  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు  తనను కలిసిన సందర్భంలో స్వయంగా మోదీనే చేతికి అందివచ్చిన అవకాశాన్ని రాష్ట నాయకులు  చేజార్చుకున్నారని అన్నారని  అప్పట్లో వార్తలొచ్చాయి.  నిజానికి.. బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య విబేధాలు,  అంతర్గత కుమ్ములాటల కారణంగానే, పార్టీ 2023 ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని అందుకోలేక పోయిందని  అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఆ కారణంగానే పార్టీ అధిష్టానం ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుని మార్చింది.  బండి సంజయ్ ని తప్పించి, కిషన్ రెడ్డి చేతికి  పార్టీ పగ్గాలు అప్పగించింది. బండి సంజయ్ నాయకత్వంలో తక్కువలో తక్కువ  కనీసం 25నుంచి 30 సీట్లు అవలీలగా గెలుస్తుందన్న ధీమాతో ఉన్న సమయంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి తప్పు చేసిందని  పార్టీలో ఇప్పటికీ ఆవేదన వ్యక్తమవుతోంది.  ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం ఎందుకు, ఎవరి ప్రోద్భలంతో  తీసుకుందో ఏమో కానీ.. అది పార్టీ చరిత్రలో ఒక  చారిత్రక తప్పిదంగా మిగిలిపోయిందని పార్టీ పట్ల నిబద్దత గల సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ వాపోతూనే ఉన్నారు.  అలాగని కిషన్ రెడ్డి  అసమర్ధుడని కాదు. పార్టీ పట్ల ఆయనకు  విధేయత లేదనీ కాదు.   అయితే.. బండి సంజయ్ ను తప్పించడంతో   కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.  మరో వంక కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి బీఆర్ఎస్ కు అక్రమ సంబంధాన్నిఅంటగట్టింది. కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ నాయకత్వం బండిని తప్పించారని, ప్రచారం సాగించింది.  బీజేపీకి వేసే ఓటు బీఆర్ఎస్ ఖాతాలోకి చేరుతుందని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విమర్శలను జనం విశ్వసించారు.  కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఫలితంగా, బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత బీజేపీనీ తాకింది. దీంతో 2019 లోక్ సభ, జీహెచ్ఎంసి ఎన్నికలు, దుబ్బాక, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ..  వెనక్కిపోయి, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యామ్నాయంగా ముందు కొచ్చింది. అదే ఊపులో అధికారాన్నీ  హస్తగతం  చేసుకుంది. బీజేపీ కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది. అయితే.. ఆ తర్వాత ఆరేడు నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ పుంజుకుంది. కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది.    సరే..  అదంతా చరిత్ర. గతం గతః అనుకున్నా..  ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం కళ్ళు తెరిచిందా అంటే అదీ లేదు. కాషాయ పార్టీలో ఇప్పటికీ కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక  సంవత్సరకాలంగా  ఒక ప్రహసనంలాగా సాగుతోంది.  ఎప్పటికప్పుడు కొత్త లెక్కలు, కొత్తకొత్త ఫార్ములాలు తెరపైకొస్తున్నాయి. కొంత కాలం పాత, కొత్త లెక్కలు..  ఆ తర్వాత బీసీ-ఓసీ ఈక్వేషన్లు.. ఇలా అనేక కోణాల్లో ఆలోచనలు అయితే సాగుతున్నాయి కానీ.  నిర్ణయం మాత్రం జరగలేదు.  మరో వంక మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఇంచుమించుగా ఖరారు అయినట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతో ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఖారైనట్లు పార్టీలో ప్రచారం జరిగింది. నిజానికి స్వయంగా ఈటల కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. అయితే..  వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు  ఈటల పేరు ఖరారై, ఇక రేపోమాపో ప్రకటన వెలువడుతుందని అనుకుంటున్న సమయంలో  పహల్గాం ఉగ్రదాడితో , ప్రకటన వాయిదా  పడింది. ఇప్పడు మళ్ళీ అంతా ఒకే అనుకుంటున్న సమయంలో  కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా.. టీఆర్ఎస్’ తొలి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన,ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది.  వచ్చే నెల (జూన్) 9 న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. దీంతో మరో  ‘సారీ’ ప్రకటన వాయిదా పడవచ్చని అంటున్నారు. మరోవంక.. ఇదే సమయంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన రావు, డీకే అరుణ కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  కానీ, ప్రధాన పోటీ మాత్రం ఇప్పటికీ..  ఈటల వర్సెస్ బండి గానే సాగుతోందని అంటున్నారు. అయితే చివరకు ఏమి జరుగుతుంది? బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుంది? అంటే, అదో సమాధానం లేని భేతాళ ప్రశ్న..అంటున్నారు.
మళ్ళీ మొదటికొచ్చిన భేతాళ ప్రశ్న.. బీజేపీ అధ్యక్షుడు ఎవరు ? Publish Date: May 24, 2025 10:05AM

జగన్ పై షర్మిల ప్రశ్నాస్త్రాలు? మద్యం కుంభకోణంలో విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీత

మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపిస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సొంత తల్లినీ, చెల్లినీ కూడా దూరం పెట్టేసిన సంగతి తెలిసిందే. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె జగన్ జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి అండగా నిలిచారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత షర్మిలను జగన్ దూరం పెట్టారు. ఆ తరువాత షర్మిల రాష్ట్రం  వదిలి వెళ్లి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుంచీ సందర్భం వచ్చినప్పుడల్లా సోదరుడిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇదంతా తెలిసిందే. కారణమేంటో తెలియదు కానీ ఇటీవల కొంత కాలంగా షర్మల జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం తగ్గించారు. కానీ తాజాగా మరోసారి షర్మిల జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ గురువారం ( మే 22) మీడియా సమావేశంలో మాట్లాడిన తరువాత  షర్మిల జగన్ కు కీలక ప్రస్నాస్త్రాలు సంధించారు.  ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉన్న ష‌ర్మిల‌ తాజా ప్రశ్నలతో మరో సారి జగన్ ను ఇరుకున పెట్టారని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్  మద్యం కుంభకోణంలో వరుసగా బయటపడుతున్న అంశాలు  థ్రిల్లర్ సిరీస్ ను త‌ల‌పిన్నాయన్న షర్మిల.. ఆ కుంభకోణం దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలతో వైసీపీలో భయం మొదలైందన్నారు.   మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు దారుణాతి దారుణంగా ఉన్నాయన్నారు. బట్టలూడదీస్తాను, తరిమితరిమి కొడతాను అంటూ జగన్ వ్యాఖ్యానించడాన్ని షర్మిల తప్పుపట్టారు. సీఎంగా ఉండగా జగన్ పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసన్న ష‌ర్మిల‌..  ఆ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసింది నువ్వే కదా అని జగన్ ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆమె  రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్, ముంబై న‌టి కాదంబరి జెత్వానీ ఉదంతాలను గుర్తు చేశారు.   లిక్కర్ కుంభకోణంలో జగన్ మీద ఆరోపణలు ఉన్నాయన్న షర్మిల వీటిని ఎదుర్కొనేందుకు ధైర్యం లేక పిరికిపందలా దాక్కుంటున్నారని విమర్శించారు. వైఎస్ కుమారుడిగా ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సిన జగన్ ఇలా పిరికిపందలా భయంతో వణికిపోవడమేంటని ప్రశ్నించారు. అంతే కాదు అసలు జగన్ అసెంబ్లీకి ఎందకు వెళ్లడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.  లిక్కర్ కుంభకోణంపై తనను విచారించాలని జగన్ అడగడం లేదంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా అని షర్మిల ప్రశ్నించారు.  వైసీపీ హయంలో మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ ను ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించిన ఆమె ఆ లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడకు పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.  
జగన్ పై షర్మిల ప్రశ్నాస్త్రాలు? మద్యం కుంభకోణంలో  విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీత Publish Date: May 24, 2025 9:45AM

జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నాలుగే అసలు కారణాలు..!

వేగంగా మారుతున్న జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా జుట్టుపై కూడా కనిపిస్తుంది.ఇప్పట్లో చాలామంది  జుట్టు రాలడం, జుట్టుకు సంబంధించి  అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి,  ఇతర కారణాల వల్ల, జుట్టు రాలే సమస్య తరచుగా మొదలవుతుంది. జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం, బట్టతల రావడం వల్ల ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుని,  దాని పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. జుట్టురాలడంలో ఈ 4 కారణాలే ప్రధానం... పోషకాహార లోపాలు.. ఇప్పట్లో ప్రజల  ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఇవి కూడా అనారోగ్యంగా తయారవుతున్నాయి.  శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, జుట్టు మీద కూడా లోతైన ప్రభావం చూపుతుంది. బయోటిన్ లేకపోవడం వల్ల  జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా విటమిన్ సి,  ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. జుట్టు రాలే సమస్య వేగంగా అరికట్టడానికి, జుట్టు తిరిగి ఆరోగ్యంగా పెరగడానికి  ఆరోగ్య నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. ఫలితాలు వేగంగా ఉంటాయి. ఒత్తిడి,  శారీరక సమస్యలు.. భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం,  శారీరక ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేసే టెలోజెన్ ఎఫ్లూవియం అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా, జుట్టు రాలడం పెరుగుతుంది.  జుట్టును దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు   జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని నివారించడానికి మొదట ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించాలి . దీని కోసం  రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, రెగ్యులర్ వ్యాయామం,  హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్  ఫాలో కావడం చేయాలి. జన్యు కారణాలు.. కొన్నిసార్లు హెయిర్ ఫాల్ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల అంటే కుటుంబ చరిత్ర వల్ల కూడా రావచ్చు. దీనిని ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు, ఇది చాలా మందిలో బట్టతలకి దారి తీస్తుంది. అలోపేసియా అరేటా అనే పరిస్థితిలో  రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడి చేస్తుంది.  ఫలితంగా జుట్టు రాలుతుంది. అలోపేసియా అరేటా శరీరంలో ఎక్కడైనా జుట్టు రాలడానికి కారణం అయినప్పటికీ, ఇది సాధారణంగా తల, ముఖాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స ఎంపికలు మారుతూ ఉంటాయి. . కార్టికోస్టెరాయిడ్స్, ఇమ్యునోథెరపీ లేదా ఆరోగ్య నిపుణులు సూచించిన ఇతర మందులు కూడా ఉండవచ్చు. జుట్టు సంరక్షణలో చెడు అలవాట్లు.. ఈ రోజుల్లో  స్టైలింగ్ కోసం జుట్టుపై అనేక రకాల వస్తువులను ప్రయోగిస్తున్నారు.  దీని కారణంగా జుట్టు పాడైపోతోంది.  దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు సంరక్షణ కోసం సరైన పద్ధతులను పాటించాలి. హీట్ స్టైలింగ్‌ను తగ్గించాలి.  బిగుతుగా ఉండే కేశాలంకరణను నివారించాలి.  జుట్టుకు సరైన ఉత్పత్తులను ఉపయోగించాలి.                                      *నిశ్శబ్ద.  గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నాలుగే అసలు కారణాలు..! Publish Date: May 24, 2025 9:30AM

మాటలతో కట్టిపడేయాలంటే ఇలా ఆకట్టుకోవాలి!

మాట ఆభరణం మనిషికి అంటారు పెద్దలు. మాటే మంత్రము అంటారు కవులు. మాట ఇతరులను ముగ్ధులను చేస్తుంది, ఆకర్షిస్తుంది. అందంగా ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా ఒక కళ. ఇప్పటి యూత్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడటం గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాట్లాడటంలో అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి.  ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణలో మనం ఎప్పుడూ ఇతరులతో వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. సంభాషణలో మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకానీ వాదనకు దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాదనే గొడవలకు దారి తీస్తుంది. సంభాషణలో ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. ఇతరులు చెప్పిన దాన్ని వారి ముఖం మీదే తప్పు అని ఖండిస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సంభాషణలో మనం మాట్లాడేది తప్పు అని మీరు గమనించినా లేక ఇతరులు తెలియజేసినా హుందాగా ఆ తప్పును అంగీకరించాలి. అంగీకరించడంలో కూడా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తం అవుతుంది. అంతేగానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకూడదు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ఇతర పనులు కూడా తప్పిదాలే అవుతాయి. ఒకదాని వెనుక ఒకటిగా తప్పుల చిట్టా పెరుగుతుంది. సంభాషణని ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ప్రారంభించాలి. అలాగే చిరునవ్వుతో ముగించాలి. అప్పుడే విలువను కాపాడుకోగలిగిన వారమవుతాము. నచ్చని విషయాలు ఉన్నా, న్యాయమైన విషయాలు లేకపోయినా వాటిని సుతిమెత్తగా నవ్వుతూనే చెప్పాలి తప్ప గొడవకు దారితీసేలా ఆవేశంగా ఉండకూడదు. ఇతరులు చెప్పే విషయాలను మనం ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి. వారు చెబుతున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీలో లేదా కూర్చున్న స్థానంలో కొంచెం ముందుకు వంగి వినాలి. వారికి అటెన్షన్ ఇస్తున్నామనే అభిప్రాయం  కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, దాపరికం లేకుండా చెబుతారు. ఇతరుల అభిప్రాయాలపట్ల సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడూ కూడా సంభాషణలో ఇతరులను ఆకర్షించాలంటే ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వాలి. మనం చెప్పాలనుకున్న విషయాలు, మనం చేయాలనుకున్న ఆలోచనలనూ ఇతరుల ఆలోచనలుగా చేసి వాటిని ఆమోదించాలి. విషయాలను మనం చూసే కోణంలో కాక ఇతరుల కోణంలోంచి చూడాలి, ఆలోచించాలి. మనం ఇతరులపట్ల చూపవలసింది గౌరవాన్ని అనే విషయం మరచిపోకూడదు. వారు చెప్పే మంచిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంభాషణలో అన్నీ నాకు తెలుసు అనుకొనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవతలి వారు అభిప్రాయాన్ని విషయాన్ని పూర్తిగా చెప్పేంతవరకూ వినాలి. అంతేకానీ మధ్యలో  తొందరపడి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. సూచనలు ఇచ్చే ముందు వారు చెప్పిన విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్నాకే ఇవ్వండి. ఇతరులతో సంభాషించే ముందు సంభాషణను అభినందనతో ప్రారంభించాలి. ఇతరులు చేసిన పొరబాట్లను బహిరంగంగా విమర్శించకూడదు. ఇతరులను విమర్శించే ముందు మీ తప్పుల్ని మీరు అంగీకరించాలి. ఇతరులకు ఆజ్ఞాపూర్వకమైన సూచనలు ఇవ్వవద్దు. దానికి బదులుగా సలహాపూర్వక సూచనలు ఇవ్వాలి. సంభాషణలో ఎప్పుడూ కూడా ఇతరులను అవమానించకూడదు. ఇతరులలో ఉన్న మంచి గుణాలను గాని లేక ఇతరులలో మీరు ఆశిస్తున్న మంచి గుణాలను వారికి ఆపాదించి, వారిని ఆ విధంగా ఉండేలా మలచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇతరులను ఆకర్షించుకోగలుగుతాము. ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచిని బయటకు చెప్పి వారిలో ఉన్న తప్పును ఇది ఇలా ఉండచ్చా?? అలా ఉంటుందని నాకు తెలియదు లాంటి మాటలతో చెప్పాలి. అలా చెబితే మన మాటల ద్వారా అది తప్పేమో అనే ఆలోచన చేసి చివరికి వారు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ మాటల్లో ఉన్న మర్మం, మాటకు ఉన్న ఆకర్షణ, మాటకున్న శక్తి.                                      ◆నిశ్శబ్ద.
మాటలతో కట్టిపడేయాలంటే ఇలా ఆకట్టుకోవాలి! Publish Date: May 24, 2025 9:30AM

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతంం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శనివారం (మే 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శుక్రవారం  శ్రీవారిని మొత్తం  74 వేల 374 మంది దర్శించుకున్నారు. వారిలో 37 వేల 477 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది. 
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు Publish Date: May 24, 2025 9:28AM