భారీ నిర్మాణాలు నిలిపివేతకు కేంద్రం నిర్ణయం.. అమరావతి పరిస్థితి ఏంటి?
Publish Date:May 13, 2026
Advertisement
రెండేళ్ల వరకూ పెద్ద పెద్ద నిర్మాణాలు చేయవద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది . సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం సైతం నిలుపుదల చేసిందన్న వార్తలు వినవస్తున్నాయి. దీంతో అమరావతి నిర్మాణం పరిస్థితి ఏంటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియా సంక్షోభం పెరుగుతున్న నిర్మాణ వ్యయాల దృష్ట్యా నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్ వంటి ప్రధాన ప్రాజెక్టులను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ సూచన నేపథ్యంలో కేంద్రం భారీ నిర్మాణాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రమే తాము నిర్మిస్తున్న భారీ నిర్మాణాలను నిలిపివేయడంతో.. ఇప్పుడు అందరి దృష్టీ అమరావతిలో సాగుతున్న నిర్మాణాలవైపు మళ్లింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించింది. అలాగే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకుల నుంచి 26వేల కోట్ల మేర నిధుల సేకరణ ప్రక్రియ కూడా సాగుతోంది. ఇవి నిర్దిష్టంగా అమరావతి కోసం కేటాయించినవే కాబట్టి ఇతర కేంద్ర భవనాల నిలుపుదల ప్రభావం దీనిపై ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లకు సంబంధించిన పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర క్యాబినెట్ సుమారు ఐదు వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన పనులకు ఇటీవలే పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ పేరిట అమరావతిలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం రూ. 2,534 కోట్లతో నిర్మాణానికి కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొన్ని భవనాల కూల్చివేత, పునర్నిర్మాణాలను వాయిదా వేసినప్పటికీ, అమరావతి వంటి అభివృద్ధి చెందుతున్న రాజధానుల్లో ఈ పనులు కొనసాగే అవకామే ఎక్కువగా ఉందంటున్నారు పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2026 ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం చట్టబద్ధం చేసింది. కాబట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ ప్రాజెక్టును ఆపడం వల్ల రాజకీయంగా, ఆర్థికంగా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో పనులు ఆపమని కేంద్రం కోరే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఢిల్లీలో పాత భవనాల పునర్నిర్మాణంపై ఉన్న ఆంక్షలు, అమరావతి వంటి కొత్త రాజధాని నిర్మాణాలకు వర్తిస్తాయనడం సరికాదు. ఎందుకంటే ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్. అయితే.. అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడిసరుకుల ధరలు పెరిగితే, పనుల వేగంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చుకానీ, పనులు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఎంత మాత్రం లేవని అధికారులు చెబుతున్నారు. అమరావతి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారికంగా కొత్త ఉత్తర్వులు వెలువడితే తప్ప పనులు యథావిధిగా సాగడానికి ఎటువంటి అడ్డంకులూ లేవని సీఆర్డీయే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/centre-decides-to-halt-major-constructions-36-219646.html





