బండి భగీరథ్ పోక్సో కేసులో దర్యాప్తు వేగవంతం
Publish Date:May 15, 2026
Advertisement
బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల.. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలను సేకరిస్తూ, బాధితురాలి వాంగ్మూలం ఇతర ఆధారాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బాధితురాలి స్టేట్మెంట్‌ను మెజిస్ట్రేట్ ముందు మరోసారి రికార్డ్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే పోలీసులు ఒకసారి, అలాగే భరోసా సెంటర్‌లో మరోసారి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇప్పుడు మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేయడం ద్వారా కేసుకు మరింత బలం చేకూర్చాలని భావిస్తున్నారు. బాధితురాలి వయస్సుపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆమె బర్త్ సర్టిఫికెట్‌ను పోలీసులు పరిశీలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జన్మించినట్లు బాలిక తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్ సమర్పించగా, జీహెచ్‌ఎంసీ రికార్డులను కూడా పోలీసులు క్రాస్ చెక్ చేశారు. బాధితురాలి రెండోసారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మొయినాబాద్ ఫామ్ హౌస్, నానాక్ రాంగూడాలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. అక్కడ కీలక ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఇక బండి భగీరథ్ మొబైల్ ఫోన్ సిగ్నల్ చివరిసారిగా కరీంనగర్‌లోని మేనమామ ఇంటి వద్ద కనిపించడంతో, ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్‌కు వెళ్లి అక్కడ కూడా విచారణ నిర్వహించింది. మరోవైపు, ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లి ఓ లేఖ విడుదల చేశారు. అందులో పలు సంచలన ఆరోపణలు చేశారు. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబమని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా కేవలం తన కుమార్తెకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చామని ఆమె స్పష్టం చేశారు. 2025లో బండి భగీరథ్‌తో తన కుమార్తెకు పరిచయం ఏర్పడిందని, అనంతరం అతడు శారీరక సంబంధాల కోసం తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడని ఆరోపించారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 రాత్రి మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనలను ఆమె ప్రస్తావించారు. అక్కడ మద్యం సేవించమని బలవంతం చేసి, తన కుమార్తె పట్ల భగీరథ్ అనుచితంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన చాట్స్, మెసేజ్‌లు సహా పలు డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, నిందితుడు క్షమాపణలు కోరిన సందేశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మే 8న తాము పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించామని, మైనర్ బాలికకు సంబంధించిన కేసు అయినప్పటికీ ఫిర్యాదు నమోదు చేయడానికి సుమారు ఐదు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తమ ఒత్తిడి తర్వాతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతో విచారణ వేగవంతమైందని చెప్పారు. ప్రస్తుతం భగీరథ్‌పై కఠినమైన నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, పోలీసుల నోటీసులకు స్పందించిన భగీరథ్ విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు కోరినట్లు సమాచారం. అలాగే, ఈ వ్యవహారంలో పరోక్షంగా రాజీ ప్రయత్నాలు, బెదిరింపులు కూడా ఎదురయ్యాయని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఏప్రిల్ 23న తాము స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసినప్పటికీ, తమకు భరోసా లభించకపోగా మరింత భయాందోళనలకు గురిచేశారని లేఖలో పేర్కొన్నారు. తమ కుటుంబంపై రివర్స్ కేసులు నమోదు చేసి, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో నిందితుల్లా చూపించే ప్రయత్నం జరిగిందని వాపోయారు. సోషల్ మీడియాలో జరుగుతున్న టార్గెటింగ్ నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, స్వతంత్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని మహిళా కమిషన్ మరియు న్యాయవ్యవస్థను ఆమె వేడుకున్నారు.మొత్తానికి ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, త్వరలోనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
http://www.teluguone.com/news/content/bandi-bhagirath-36-219878.html





