ఫార్ములా ఈకార్ రేస్ కేసు.. కేటీఆర్ కు బిగుస్తున్న ఉచ్చు!?
Publish Date:May 15, 2026
Advertisement
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు బిగుస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఫార్ములా ఈకార్ కేసులో తాజాగా కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 31న ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఈ కేసులో కేటీఆర్ ఎసీబీ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. చార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఆ చార్జిషీట్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కు విశ్వవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కేలా చేస్తామంటూ హైదరాబాద్ లో ఫార్ములా ఈకార్ రేస్ లు ఏర్పాటు చేసి ఇందుకోసం.. కారు రేసుల సంస్థకు చెల్లించిన 55 కోట్ల రూపాయలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని విదేశాల్లోని సదరు సంస్థకు చెల్లించేందుకు అదనంగా మరో 10 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో కేటీఆర్ మంత్రిగా ఉన్న పురపాలక శాఖ నిధుల నుంచి ఈ సొమ్మును బదలాయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ సొమ్ము చెల్లించారంటూ కేటీఆర్ తో పాటు అప్పటి హెచ్ఎండీఏ చీఫ్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, చీఫ్ ఇంచిజీన్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు ఈ కారు రేసుల సంస్థలపై ఏసీబీ కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కొన్నారు. ఆయనతో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ని కూడా ఏసీబీ విచారించింది. ఈ విచారణలలో సేకరించిన వివరాలు, తమ దర్యాప్తులో తేలిన అంశాలతో ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్ ను ఆమోదించిన ఏసీబీ కోర్టు వీరికి సమన్లు పంపింది. దీంతో ఈ కేసులో ఏ1 కేటీఆర్ కు ఉచ్చు బిగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ktr-in-deep-trouble-36-219841.html





