నీట్ పేపర్ లీకేజీపై రాహుల్ ఫైర్...విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?
Publish Date:May 12, 2026
Advertisement
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఉదంతం కేవలం ఒక పరీక్ష నిర్వహణ వైఫల్యం కాదని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై జరిగిన వ్యవస్థీకృత నేరమని ఆయన అభివర్ణించారు. దేశంలోని విద్యా వ్యవస్థలో అవినీతి వేళ్లూనుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష కోసం సుమారు 22 లక్షల మంది విద్యార్థులు అహోరాత్రులు శ్రమించారని రాహుల్ గుర్తు చేశారు. ఎంతో మంది పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని కలలు కన్నారని, ఆ ఆశలను బీజేపీ నేతృత్వంలోని అవినీతి వ్యవస్థ కుప్పకూల్చిందని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరీక్ష కోసం కొందరు తండ్రులు అప్పులు చేశారని, మరికొందరు తల్లులు తమ వద్ద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టారని రాహుల్ పేర్కొన్నారు. నిద్రలేని రాత్రులు గడిపి పరీక్షకు సిద్ధమైన యువతకు, చివరికి 'పేపర్ లీకేజీ' అనే వార్త వినాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పేపర్ మాఫియా పరోక్షంగా ప్రభుత్వ అండదండలతోనే చెలరేగిపోతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మరోసారి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ విమర్శించారు. ఒకవైపు ప్రధాని మోదీ 'అమృత్ కాల్' గురించి మాట్లాడుతుంటే, మరోవైపు దేశ యువతకు అది 'విషమయ కాలం'గా మారుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిసారి తప్పు చేసిన వారు తప్పించుకోవడం, అమాయక విద్యార్థులు శిక్ష అనుభవించడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షా నిర్వహణలో పారదర్శకత లోపించిందని విద్యార్థి సంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ పలు జాతీయ స్థాయి పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు వెలుగు చూడటం వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఈ అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/-rahul-gandhi-on-neet-36-219555.html





