ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడుతాం: బొత్స సత్యనారాయణ

 

జగన్మోహన్ రెడ్డి ఆరు రోజుల ‘నిరవధిక నిరాహార దీక్ష’ చివరికి ఏవిధంగా ముగుస్తుందని అందరూ భావించారో అదే విధంగా ముగిసింది. కానీ దీక్ష మొదలుపెట్టిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తెదేపా-వైకాపా నేతల మధ్య చాలా రసవత్తరమయిన వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు సాగాయి. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసిన తరువాత సమావేశమయిన వైకాపా నేతలు ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందించారు.

 

దాని ప్రకారం బుదవారం నాడు విజయవాడ పి.డబ్ల్యూ డి మైదానం నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తారు. దీనిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొంటారు. ఆ తరువాత మళ్ళీ ఈనెల 17నుండి 21వ తేదీ వరకు అన్ని నియోజక వర్గాలలో రిలే నిరాహార దీక్షలు, 18న నియోజక వర్గాలలో ర్యాలీలు, 19న నియోజక వర్గ కేంద్రాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, 20వ తేదీ సాయంత్రం అన్ని నియోజక వర్గాలలో కొవ్వొత్తుల ర్యాలీలు, 21న అన్ని బస్సు డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తారు.

 

సాధారణంగా గ్రామస్థాయి నుండి ఇటువంటి కార్యక్రమాలతోనే ఉద్యమాలు మొదలుపెట్టి, చిట్ట చివరి అస్త్రంగా నిరాహార దీక్ష చేస్తుంటారు. కానీ కారణాలు ఎవయితేనేమీ జగన్మోహన్ రెడ్డి ముందు నిరాహార దీక్షకి కూర్చొన్నారు. ఆశించిన ఫలితం పొందకుండానే దీక్ష ముగిసిపోయింది. దీక్షతో పతాక స్థాయికి చేరవలసిన ఉద్యమాన్ని మళ్ళీ ఏబిసిడిల నుండి మొదలుపెట్టవలసి వస్తోంది. ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని వైకాపా నేత అంబటి రాంబాబు తెలిపారు. కానీ వైకాపా చేస్తున్న ఈ పోరాటానికి ఎంతకాలం ప్రజలు మద్దతు ఇస్తారు? ప్రజల మద్దతు లేకుండా వైకాపా ఎంతకాలం తన పోరాటం కొనసాగించగలదు? అని ఆలోచించుకొని మొదలుపెడితే మంచిదేమో? లేకపోతే మళ్ళీ మధ్యలోనే ముగిస్తే చివరికి నవ్వులపాలయ్యేది జగన్మోహన్ రెడ్డే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu