తెలంగాణ భవన్ కు కేసీఆర్.. పంచాయతీ ఫలితాల ప్రభావమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ వీడి క్రియాశీల రాజకీయాలలోకి మళ్లీ ప్రవేశిస్తున్నారా? అంటే ఆ పార్టీ శ్రేణులు ఔననే అంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. ఈ తరువాత వరుసగా రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ పంచాయతీ ఎన్నికలు రెండు దశలు పూర్తయిన తరువాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. రెండు దశలలోనూ కూడా ఆ పార్టీకి ఎటువంటి సానుకూలతా లభించలేదు. రెండు దశలలోనూ కూడా అధికార కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులే సర్పంచ్ లుగానూ, వార్డు సభ్యులుగానూ అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బలహీనతలు ప్రస్ఫుటంగా ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ప్రధానంగా నాయకత్వ లోపం, గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేసి, ప్రజలతో మమేకమయ్యే నేత లేకపోవడం, అన్నిటికీ మించి కేడర్ కు స్ఫూర్తిని నింపే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ వైరాగ్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. 

పంచాయతీ ఎన్నికల రెండో దశ ఫలితాలనే తీసుకుంటే ఎన్నికలు జరిగిన దాదాపు 4,000 గ్రామ పంచాయతీలలో..  కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు దాదాపు సగం చోట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.  మొదటి దశలో చతికిల పడిన తరువాత  బీఆర్ఎస్ రెండో దశలోనైనా పుంజుకుంటుందని తిరిగి పుంజుకుంటుందని బీఆర్ఎస్ విశ్వాసంగా ఉంది. పరిశీలకులు సైతం బీఆర్ఎస్ పుంజుకుంటుందనే భావించారు. అయితే అందుకు భిన్నంగా తొలి దశకంటే దారుణంగా ఫలితాలు ఉండటం బీఆర్ఎస్ కు గ్రామీణ స్థాయిలో కూడా మద్దతు కరవైందని తేటతెల్లమైంది.  అన్నిటికీ మించి పంచయతీ ఎన్నికలలో పెరిగిన ఓటింగ్ కాంగ్రెస్ కే అనుకూలమని తేలిపోవడంతో  బీఆర్ఎస్ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాల తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నడుంబిగించి రాజకీయ రణక్షేత్రంలో దిగక తప్పదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. రాష్ట్రంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం నుంచి బీఆర్ఎస్ బయటపడాలంటే కేసీఆర్ మళ్లీ క్రియాశీలంగా ప్రజా క్షేత్రంలోకి రావలసిన అవసరం ఉందని అంటున్నాయి. 

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అడుగులు ఆ దిశగా పడుతున్నా యనడానికి సంకేతంగా  కేసీఆర్ ఈనెల 19న తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. గోదావరి, కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎల్ పి నేతలతో చర్చించనున్నారు. అలాగే  తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాలు, పార్టీ సంస్థాగత విధానాలపై నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu