ఏపీకి ఆర్ధిక ప్యాకేజీపై ప్రకటన ఇంకా ఎప్పుడు?
posted on Oct 14, 2015 10:59AM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం ఇంచుమించు తేల్చి చెప్పేసింది. దానికి బదులుగా మంచి ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాష్ట్రానికి ఎటువంటి ఆర్ధిక ప్యాకేజి అవసరమో తెలిపే రోడ్ మ్యాప్ సిద్దం చేయమని ప్రధాని నరేంద్ర మోడీ సంబందిత అధికారులను ఆదేశించి చాలా కాలమే అయ్యింది. వారు రాష్ట్ర అధికారులతో కలిసి అదే పని మీద ఉన్నారు. బహుశః ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చేలోగానే దానిపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన వెలువడవచ్చని అందరూ భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ లని కలిసి వారిని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానించినపుడు ప్రత్యేక ప్యాకేజి గురించి కూడా వారితో మాట్లాడే అవకాశం ఉందని భావించవచ్చును. కనుక ఈరోజు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ దాని గురించి ఏమయినా ప్రకటన చేస్తారా లేక ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా అమరావతి వచ్చినప్పుడు స్వయంగా ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.