రేవంత్ రెండేళ్ల పాలనకు పాస్ మార్కులే!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత దాదాపు దశాబ్దకాలం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పాలన సాగింది.  2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  రేవంత్ సీఎంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయ్యింది.  ఈ రెండేళ్ల కాలంలో   సంక్షేమం, అభివృద్ధితో పాటుగా అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడం వంటి అనేక చర్యలతో  రేవంత్ ప్రభుత్వం మంచి మార్కులే సంపాదించింది.   

 రేవంత్ సర్కార్‌ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన  ఆరు గ్యారెంటీలను అమలుకు చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి  కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ  మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు.  దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం పట్టణ, గ్రామీణ అన్న తేడా లేకుండా మహిళాలోకం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తున్నది. పరిపాలనలో పారదర్శకత, అవినీతిపై కఠిన వైఖరి కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెరిగిందన్నది కూడా జనాభిప్రాయంగా వ్యక్తం అవుతోంది. ఈ సానుకూలతే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి సునాయాస విజయానికి కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అయితే అంత మాత్రాన రేవంత్ సర్కార్ పట్ల జనంలో ఆల్ ఈజ్ వెల్ భావన ఉందని కాదు. ఆయన పాలన పట్ల సానుకూలత, వ్యతిరేకత కూడా సమపాళ్లలో వ్యక్తం అవుతున్నాయి. అంటే కొంచం ఇష్టం, కొంచం కష్టం అన్నట్లుగా ప్రజలు రేవంత్ రెండేళ్ల పాలనను అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రగతి, పురోగతికి ఆర్థిక సవాళ్లు ప్రతిబంధకంగా మారాయి. అయితే ఈ పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం కారణంగా వారసత్వంగా వచ్చిందని చెప్పాలి.

ఈ అప్పుల భారం కారణంగానే  సంక్షేమ పథకాల పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం నిధుల సమీకరణ కష్ట సాధ్యంగా మారింది. పథకాల అమలు కోసం నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అప్పులు తేవడం, అలాగే భూములు అమ్మడం వంటి నిర్ణయాలు అనివార్యంగా తీసుకోవలసి వస్తున్నది. ఈ క్రమంలోనే  ప్రభుత్వం ఆదాయ సమీకరణ కోసం చేపట్టిన కంచన్‌బాగ్‌ భూముల విక్రయం, ‘హిల్ట్ పాలసీ  వంటి వాటిపై ప్రతిపక్షం నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇక పోతే రేవంత్ ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారంటీలలో భాగమైన  సామాజిక పింఛన్ల పెంపు,  తులం బంగారం హామీ వంటివి అమలు కాకపోవడం కూడా రేవంత్ సర్కార్ పై విమర్శలకు కారణమయ్యాయని చెప్పారు.   మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, డిసెంబర్‌ 8, 9తేదీల్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమిట్‌ ల పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా, వాటి ఫలితాలు ఇప్పుడే అంచనా వేయడం కష్టం.  

 ఇక పల్లెలలో రేవంత్ పాలనపై, మరీ ముఖ్యంగా రైతాంగంలో ఒకింత తక్కువ సానుకూలత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా విద్యుత్ కోతలు రైతాంగంలో రేవంత్ సర్కార్ పట్ల వ్యతిరేకతకు కారణమౌతున్నాయని అంటున్నారు.   సీఎంగా రేవంత్ రెడ్డి రెండేళ్ల  పాలనలో ఆర్థిక సవాళ్లు, రాజకీయ పరిమితులు  ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ప్రజలకు చేరువ అయ్యిందనే చెప్పాలి. రైతంగంలో ఉన్న వ్యతిరేకతను మినహాయిస్తే రేవంత్ రెండేళ్ల పాలనకు మంచి మార్కులే పడతాయని పరిశీలకులు అంటున్నారు.  అయితే.. రేవంత్ సర్కార్ బ్రహ్మాండం, అద్భుతం అన్న ఫీలింగ్ కూడా వ్యక్తం కావడం లేదు. రానున్న మూడేళ్ల కాలంలో రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి ఎజెండాతో ఎలా ముందుకు సాగుతారు అన్నది చూడాల్సి ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu