బా(బ్ల)డీ షేమింగ్ చేస్తున్నా(రేమో)రా?.. జాగ్రత్త!

సమాజంలో మనుషులు తమని తాము చూసుకోవడం కంటే, పక్కన ఉన్న మనుషులను గమనించడానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. పక్కన మనిషిని విమర్శించడం అనేది ఎన్నో చోట్ల ఎక్కువగా కనబడే అంశం. తోటి విద్యార్థులు, సహా ఉద్యోగస్తులు, స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు ఇలా అందరి దగ్గర నుండి ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధమైన విమర్శను ఎదుర్కొంటూ ఉంటారు చాలా  మంది.

అయితే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, జీవిత నిర్ణయాలు, చేసే పనులు ఇలాంటి వాటి విషయంలో విమర్శ ఎదురైనా వాటిని ఆలోచించి ఒకవేళ దాని వల్ల ఏదైనా మార్పు చేర్పులు చేసుకోగలిగే అవకాశం ఉంటే తప్పక చేసుకుంటారు ఆలోచన గల వాళ్ళు అయితే. కానీ ఇప్పట్లో చాలామంది ఎదుర్కునే సమస్య బాడీ షేమింగ్. 

అసలేమిటి బాడీ షేమింగ్…
ఎదుటి మనిషి శరీరాన్ని, శరీర రూపాన్ని, అందులో లోపాలను వేలెత్తి చూపడం మరియు విమర్శించడమే బాడీ షేమింగ్. ఇది కేవలం లావుగా ఉన్న వాళ్ళ విషయంలో జరుగుతుందన్నది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం సమాజంలో అధిక శాతం మంది బాడీ షేమింగ్ కు గురవుతున్నారంటే ఇది ఎంతగా వ్యాప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు. 

బాడీ షేమింగ్ ఎందుకు??
ఎదుటి వ్యక్తులు లావుగా ఉన్నా, లావుగా లేకపోయినా ఎగతాళి చేస్తూ విమర్శించడం. అమ్మాయిలలో కొందరు సరైన ఆహారం లేక కండర సామర్థ్యము పెంపొందక అవయవ సౌష్టవం లేకుండా ఉంటారు వాళ్ళను ఎగతాళి చేయడం. కొందరు జన్యు పరంగా లావుగా లేదా సన్నగా ఉంటారు వాళ్ళను ఎగతాళి చేయడం. జుట్టు పొడవుగా లేదనో, రంగు తక్కువ ఉన్నారనో, అందంగా లేరనో ఇలాంటివి మాత్రమే కాకుండా సరైన బట్టలు వేసుకోలేదనో, ఫాషన్ గా లేరనో, ఇతరుల అలవాట్లను ఇలా బోలెడు ఈ బాడీ షేమింగ్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు అయినప్పుడు వాటిని ఇతరులు విమర్శించడం ఎంతవరకు సమంజసం.

నమ్మలేని నిజం!!
ప్రతి వ్యక్తి జీవితంలో బాడీ షేమింగ్ మొదలయ్యేది కుటుంబం నుండే!! ఈ విషయం వినగానే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇదే నిజం. ముఖ్యంగా పెళ్లి తరువాత అందులోనూ గర్భవతులు అయ్యి ప్రసవం తరువాత అమ్మాయిల శరీరాల్లో వచ్చే మార్పులను వారి భర్తలు అర్థం చేసుకోకపోగా శరీరాన్ని, సౌష్టవాన్ని విమర్శించడం, గేలి చేయడం వంటివి చేస్తారు. శరీర మార్పులకు కారణమైన స్థితులను అర్థం చేసుకోవాలి. అలాగే కంపెర్ చేయడం కూడా బాడీ షేమింగ్ లో ఫస్ట్ పాయింట్. ఇతరులను చూపించి వాళ్ళలా నువ్వు లేవు అని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అలాగే సినిమా హీరోయిన్లు, సెలబ్రిటీ లు ఇలాంటి వాళ్ళ ఫిట్నెస్ చూసి భార్యలను మాటలతో హింసించే వాళ్ళు కూడా ఉన్నారు. ఫలితంగా తిండి విషయంలో ఎంతో మాధనపడిపోతుంటారు మహిళలు.

కేవలం ఆడవాళ్లేనా??
ఈ బాడీ షేమింగ్ లో మగవాళ్ళు కూడా ఉన్నారండోయ్!! మగవాళ్ళు అంటే శరీరం కండలు తిరిగి హీరోల లెక్క ఉండాలని అపోహ పడేవాళ్ళు బోలెడు. అలాగే పొట్ట ఉందని, బట్టతల ఉందని విమర్శించేవాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టైల్ గా ఉన్నా దాన్ని కూడా విమర్శించేవాళ్ళు, వస్త్రధారణ  విషయంలో, ఇంకా కొందరు అబ్బాయిలలో జన్యు పరంగా మీసాలు సరిగా రాకపోవడం, అమ్మాయిలలా వక్షోజాల్లా ఎత్తుగా ఉండటం, ఇవి మాత్రమే కాకుండా కొందరు చెవిపోగులు వంటివి పెట్టుకున్నా, చేతులకు పచ్చబొట్టులు వంటివి వేయించుకున్న ఇలా ప్రతీ విషయంలో బాడీ షేమింగ్ చేసేవాళ్ళు బోలెడు. 

ఎలా మారుతుంది ఈ ధోరణి!!
ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కేవలం ఆ వ్యక్తి చేతిలో ఉన్నంతవరకు ఏ బాడీ షేమింగ్ ఎక్కడా కనబడదు. కానీ ఎప్పుడైతే ఇతరుల వ్యక్తిగత  విషయాల్లో తల దూర్చి ప్రతీది విమర్శించడం మొదలెడతామో అప్పుడే ఈ బాడీ షేమింగ్ పెరుగుతూ పోతుంది. కాబట్టి మొదట చేయాల్సింది ప్రతి ఒక్కరు ఇతరుల వ్యక్తిగత విషయాలను వేలెత్తి చూపకపోవడం. ఇక్కడ గమనించాల్సిన విషయమొక్కటే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం. కాబట్టి ఎవరిని ఇంకొకరితో పోల్చడం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ చేయకూడదు. 

ఒకవేళ మీరు గనుక ఇలాంటి బాడీ షేమింగ్ చేస్తుంటే బ్లడీ షేమింగ్ చేస్తున్నారనే అర్థం!! ఆలోచించండి మరి.