ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటే ఇవి ఫాలో అవ్వండి..!


సంతోషం సగం బలం అన్నారు.. ఈ వాక్యంతో పాట కూడా ఉంది. మనిషి సంతోషంగా ఉంటే అదే సగం బలంగా ఉన్నట్టు. మనిషి శరీరం ఎంత బలంగా ఉన్నా.. ఆ మనిషి సంతోషంగా  లేకపోతే ఏదో కోల్పోయిన అనుభూతి ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది.  చాలామంది తమ జీవితాలలో చాలా కారణాల వల్ల సంతోషాన్ని కోల్పోతుంటారు.  ఎప్పుడూ దిగులుగా ఉండటం,  ఆందోళనతో ఉండటం,  భయంతో ఉండటం, తమ మీద తమకు నమ్మకం లేకపోవడం.. ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ సంతోషాన్ని కోల్పోతుంటారు.  కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే దేంతోనూ, ఎవరితోనూ సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

పోలిక వద్దు..

మనిషికి ఉన్న అతిపెద్ద రోగం పోల్చుకోవడం. ఇతరులతో ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటారు.అది కూడా జీవితానికి మేలు చేసే విషయాల కంటే మనిషి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టే వాటినే పోల్చుకుంటూ ఉంటారు.   వాళ్లు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం?  వాళ్లకు డబ్బు చాలా ఉంది,  మనకు లేదు. వాడు ఏకంగా చాలా పెద్ద తప్పు చేశాడు. నేను చేసింది చిన్నదే.. వాళ్లలాగా మనం స్టైల్ గా ఉండాలి.  వాళ్ళలాగా మనకు కారు,  ఇల్లు,  లగ్జరీ లైఫ్ ఉండాలి. ఇలా చాలామంది పోల్చుకోవడం వల్ల తమకున్న కాసింత తృప్తిని కూడా పోగొట్టుకుంటారు.

అతి ఆలోచనలు..

గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.  భవిష్యత్తు గురించి ఒక హద్దు వరకు ఆలోచన,  ప్రణాళిక ఉండాలి. కానీ కొందరు జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచన చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇదే ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సమయాన్ని ఇలా అతి ఆలోచనలతో వృధా చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. సంతోషంగా ఉండాల్సిన భవిష్యత్తు కూడా క్లిష్టంగా మారుతుంది.

పగ వద్దు..

ఒకరిని మరొకరు బాధ పెట్టుకోకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ నేటికాలంలో ఒకరిని ఒకరు బాధపెట్టుకుంటే దాని వల్ల బాధపడాల్సింది ఏమీ లేదు.  ఎవరైనా ఏదైనా అంటే దానికి రివేంజ్ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల మనసులో ప్రశాంతత, సంచోషం కనుమరుగవుతాయి.  ఇతరులు అన్న మాటలను, చేసిన మోసాన్ని పట్టించుకోవడం మానేసి, తప్పు చేసిన వారిని మనసారా క్షమించేసి ,  ఆ విషయం గురించి అక్కడితో మరచిపోతే సంతోషంగా ఉండొచ్చు.

నెగిటివ్ కు దూరం..

మంచి మనుషులను కూడా చాలా చెడ్డగా మార్చేది నెగిటివ్ ఆలోచన.  నెగిటివ్ గా ఆలోచించే వారికి దగ్గరగా ఉన్నా, అలాంటి వాతావరణంలో ఉన్నా అది క్రమంగా మెదడుకు స్లో పాయిజన్ లా పని చేస్తుంది. ఇది క్రమంగా బుర్రను పాడు చేసి ఏ విషయాన్ని అయినా సరే.. చాలా చెడ్డగా చిత్రీకరిస్తుంది. దీని వల్ల మంచి విషయాలను కూడా చెడుగా ఊహించి సంతోషాన్ని కోల్పోతారు.

అందరి సంతోషం కోసం..

మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండగలం అని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమే అయినా కేవలం చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం అనే ప్రయత్నంలో కాలాన్నిగడిపేసి తమ సంతోషాన్ని పట్టించుకోని వారు చాలామంది ఉంటారు. అందరి సంతోషం మాత్రమే కాదు.. తమ సంతోషం తాము చూసుకోవడం, తమ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం చుట్టూ ఉన్న అందరి కోసం త్యాగం అయిపోతుంది.

వాయిదాలు వద్దు..

ఎప్పటి పనిని అప్పుడు చేసుకోవడం వల్ల మానసకి ప్రశాంతత ఉంటుంది. అలా కాకుండా పనులను వాయిదా వేస్తూ ఉంటే అవన్నీ పేకుకుని పోయి ఆందోళన,  ఒత్తిడి పెంచుతాయి. ఇవి మనిషి జీవితంలో సంతోషకర క్షణాలను తినేస్తాయి.

ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలి..

నెగిటివ్ పీపుల్స్ చాలా చోట్ల తారసపడుతూ ఉంటారు.  బంధువులలో అయినా,  స్నేహితులలో అయినా,  ఆఫీసులో అయినా,  వేరే ఎక్కడైనా సరే.. చెడ్డ వ్యక్తులు  ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.  వీరి ఆలోచనలు, ప్రవర్తన,  వీరు చేసే పనులు అన్నీ చాలా నెగిటివ్ గా ఉంటాయి. ఇలాంటి వారికి దగ్గరగా ఉంటే.. వారు కూడా చెడ్డ వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది.

పర్ఫెక్షన్ ను పట్టుకుని వేలాడకూడదు..

చాలామంది మంచివారికి,  బాగా పని చేసేవారికి ఉండే చెడ్డ అలవాటు పర్ఫెక్షన్ ను పట్టుకుని వేలాడటం.  పర్పెక్ట్ గా ఉండటం మంచిదే కానీ.. పూర్తీ ఎఫర్ట్ పెట్టి పని చేశాక కూడా ఇంకా పర్ఫెక్ట్ గా లేదు అనుకుంటూ ఒత్తిడికి లోనవడం మాత్రం సంతోషాన్ని దెబ్బతీస్తుంది.  పర్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉన్నా, అన్నింటిలో దాన్ని ఎక్స్‌పెక్ట్ చేసినా ప్రశాంతత పోతుంది.

                 *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu