గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయ పదం : సీఎం రేవంత్
posted on Oct 19, 2025 3:01PM
.webp)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం సద్భావన యాత్ర చేపట్టారని, ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. “మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశ సేవలో అంకితమై ఉంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి గాంధీ అనే పేరు పర్యాయ పదం” అని సీఎం రేవంత్ అన్నారు.
సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందజేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. “సల్మాన్ ఖుర్షీద్ కుటుంబానికి గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. ఈ అవార్డు ఆయనకు దక్కడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువతకు అధిక హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి అన్నారు: “18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది. అదే రాజీవ్ గాంధీ కల.”
ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అదే కుట్ర జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతు తనకు ఎంతో ప్రత్యేకమని తన జీవితంలో దీనికి మించిన అవార్డు మరొక్కటి లేదన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ఈ యాత్ర చేశారని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే బాటలో నడుస్తున్నారని ఖుర్షీద్ తెలిపారు.