ఎక్కువ ఎమోషన్ అవుతుంటారా..ఇదెంత డేంజరో తెలుసా?

 

భావోద్వేగాలు జీవితానికి అర్థాన్ని, లోతును వ్యక్తం చేస్తాయి. అవి సంబంధాలను బలోపేతం చేస్తాయి.  ఎమోషన్ అయ్యే వారి పట్ల ప్రజల స్పందన కూడా చాలా వేరుగా ఉంటుంది. కానీ ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు అవి బలహీనతగా మారవచ్చని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు. చాలామంది ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావ్ అని అనడం వినే ఉంటారు. అంటే.. ఎమోషన్ అయ్యేవారిని అదే ఎమోషన్ ద్వారా వాడుకునే వారు ఉంటారు.   ఎమోషన్ అవ్వడం తప్పు కాదు కానీ.. ఎమోషన్స్ ను డీల్ చేయడం కూడా అంతే ముఖ్యం.  ముఖ్యంగా మహిళలు ఎమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఎమోషన్స్ ఎక్కువైతే ప్రమాదం అని ఎందుకు అంటున్నారు? వీటి గురించి తెలుసుకుంటే..

ఎమోషన్స్ వీక్నెస్ అవుతాయా?

ప్రతి వ్యక్తిలో బలాలు,  బలహీనతలు ఉంటాయి.  చాలామంది బలహీనతను కూడా బలంగా మార్చుకోవాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఇతరులు ఏమనుకుంటారో.. ఇతరులు మన వల్ల బాధపడతారేమో.. అనే కారణంగా కొందరు అందరికీ ఫేవర్ చేయడం,  అందరికీ నచ్చినట్టు ఉండటం,  కాదు అని చెప్పలేక ప్రతి పనిని అడిగినప్పుడల్లా చేసిపెట్టడం,  ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ ను నెరవేర్చడానికి వారి మెప్పు పొందడానికి ప్రయత్నించడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల జరిగేది ఏంటంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోవడం జరుగుతుంది.  ముఖ్యంగా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఈ సమస్యకు లోనవుతూ ఉంటారు.

ఇతరులు సెంటిమెంటల్ గా మాట్లాడటం, బాధపడటం,  నటించడం వంటి వాటిని కూడా చాలా సులువుగా నమ్మేసి ఆర్థికంగా, వ్యక్తిత్వ పరంగా కూడా నష్టపోతారు.  అందుకే ఎమోషన్స్ ఇతరుల వీక్నెస్ కాకూడదు అని చెబుతారు.

వద్దు అని చెప్పడం అవసరమా?

ఎవరైనా ఏదైనా మాట సహాయం లేదా ఆర్థిక సహాయం అడిగినప్పుడు, వేరే ఇంకైదైనా అవసరం కోసం అడిగినప్పుడు చాలామంది కాదనలేక అన్నింటికి సరే అని చెబుతుంటారు. ఇలాంటి మొహమాటాల వల్ల కొన్ని సార్లు నష్టపోతుంటారు. మరికొన్ని సార్లు అవమానాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.   కానీ లైఫ్ స్టైల్ నిపుణులు చెప్పే మాట ఏంటంటే.. నో చెప్పడం చాలా సమస్యలను దూరంగా ఉంచుతుంది.  ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సాధ్యం కాకపోతే లేదా ఆ  పని   తెలియకపోతే.. నో అని చెప్పడం వల్ల చాలా వరకు నెగిటివ్ ఫీలింగ్ పెంచుకుంటారు. కానీ.. నో చెప్పడం అలవాటు లేనివారిని అందరూ ఎక్కువగా వాడుకుంటారు. తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. అందుకే నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి.

ఎమోషన్స్ ను డీల్ చేయాలి..

ఎమోషన్స్ ఉన్న వ్యక్తే నిజానికి  సరైన మనిషి అంటారు.  కానీ ఎమోషన్ లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అది చాలా ప్రమాదం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి, సబబు అనిపిస్తే మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.  ముఖ్యంగా ఇతరుల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు లేదా ఎవరి విషయంలో అయినా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెంటనే కాకుండా కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి.

బౌండరీస్ ఉండాలి..

ప్రతి విషయానికి కొన్ని బౌండరీస్ ఉండటం చాలా మంచిది. ఇది జీవితాన్ని స్పష్టతతో ఉండేలా చేస్తుంది. అలాగే బౌండరీస్ నిర్థేశించుకున్నవారు బలహీనులుగా కాకుండా బలమైన వ్యక్తులుగా అనిపిస్తారు. బౌండరీస్ ఉంటే.. తన గౌరవాన్ని తాను కాపాడుకుంటూ ఇతరులను ఒక పరిథి వరకు మాత్రమే సహాయం చేయడం చేయవచ్చు.  ఆరోగ్యకరమైన రిలేషన్ కు ఇది చాలా అవసరం.

బాధ కాదు.. అర్థం చేసుకునే మనసు కావాలి..

ప్రతి వ్యక్తి ఇతరులకు వంద శాతం నచ్చరు. అలాగే అందరికీ నచ్చరు. అంతే కాదు.. ఏ వ్యక్తి ఇతరులకు ఎల్లకాలం అందుబాటులో ఉండరు కూడా. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే డిపెండింగ్ అనేది దానికదే  తగ్గుతుంది. అంతేకాదు.. ఎమోషన్స్ ను నియంత్రించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.

                             *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu