రాంగ్ రిలేషన్.. దీన్ని గుర్తించడం ఎలా? ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని వదిలించుకోవాలి?

 


ప్రేమ, స్నేహం, బార్యాభర్తల బంధం, బంధుత్వం.. ఇలా రిలేషన్ ఏదైనా సరే.. ఆ బంధానికి కీలకంగా మారేది ప్రేమ.  ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే బంధాలు ఎంత కాలమైనా బాగుంటాయి. కానీ అవి లేకపోతే బంధం బలహీనం అవుతుంది. నిజానికి ఏ బందంలో అయినా ప్రేమ, గౌరవం, అభిమానం.. మొదలైనవన్నీ ఒక్కసారిగా పుట్టవు, అలాగే ఒక్కసారిగా తగ్గిపోవు. విచ్చిన్నమయ్యే బందాలు చాలా వరకు ప్రేమ కనుమరుగవుతూ చివరకు ఇది ఇక అవసరం లేదు అనుకునే స్థితికి చేరతాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ఇది బ్యాడ్ టైం.. కొంత కాలం ఓపిక పడితే అంతా సర్దుకుంటుంది అనుకుంటూ ఉంటారు.  తమకు తాము సర్దిచెప్పుకుంటారు, ఓదార్చుకుంటారు. అయితే ఎక్కువకాలం ఇబ్బంది పెట్టే బంధాలను వదిలేసుకోవడం అంటే జీవితంలో ఓడిపోయినట్టు అనుకుంటారు చాలామంది. అందుకే ఓపికగా భరిస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే.. అలాంటి బంధాలలో ఎక్కువ కాలం ఉంటే మనుషులు కూడా చాలా దెబ్బతింటారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.

అసలు ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టే బంధాలలో ఉండటం వల్ల కలిగే నష్టం ఏంటి?ఇలాంటి బంధాన్ని వదిలేయడం మేలు అని ఎలా నిర్ణయించుకోవాలి? తెలుసుకుంటే..

బంధం వదులుకోవడానికి ఎందుకు భయపడతారు..

బంధాలను విడిచిపెట్టడానికి చాలామంది  భయపడతారు. దీనికి సన్‌క్ కాస్ట్ ఫాలసీ కారణమని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. దీని అర్థం..  ఒక సంబంధంలో సంవత్సరాల తరబడి  ఎమోషన్స్ ను, ప్రేమను,  కాలాన్ని పెట్టుబడి పెట్టి, ఆ తరువాత  అకస్మాత్తుగా దాన్ని వదిలేస్తే, ప్రతిదీ వృధా అయినట్లు అనిపిస్తుందని అందరూ  నమ్ముతారు. ఇంత దాకా వచ్చాం, ఇంత ప్రయాణం చేశాం  ఎందుకు విడిపోవాలి? కాస్త సర్దుకుపోయి ముందుకు ప్రయాణం చేస్తే మేలు కదా  అని అనుకుంటారు.  గడిచిన కాలాన్ని, బంధంలో ఉన్న గత ఎమోషన్స్ ను చూసి  బంధాలను విడిచిపెట్టడానికి భయపడతారు.

కానీ ప్రేమ అనేది ప్రయత్నానికి ప్రతిఫలం ఇచ్చే ప్రాజెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక సంబంధం ఆరోగ్యంగా ముందుకు వెళ్లకుండా  ఆగిపోయినప్పుడు, విడిపోతే తప్పు చేసినట్టు అవుతుందనో  లేదా రిలేషన్ లో ఏం జరిగినా తప్పకుండా ఉండాలి అనే కారణంగానో దానిలో ఉండటం చాలా హాని కలగిస్తుందని  అంటున్నారు.

తప్పుడు సంబంధంలో ఆత్మగౌరవం పోతుంది..

చెడు సంబంధంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల  స్వీయ-గుర్తింపు,  ఆత్మగౌరవం క్రమంగా క్షీణిస్తుంది. ఎమోషన్ అవుతూ  ఇబ్బంది పెట్టే  సంబంధాలలో ఉండే చాలా మంది ఏదో బ్రతికేద్దాం అనే విధానంలో ఉంటారు. అంతే కానీ వారి జీవితంలో సంతృప్తి ఉండదు. ఇలాంటి సంబంధంలో ఎక్కువ కాలం జాప్యం చేస్తూ ఉండిపోవడం వల్ల  సొంత నిర్ణయాలను అనుమానించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బంధం గురించి ఆలోచిస్తూ చాలా వరకు అవసరాలను కూడా అణచివేస్తారు,  గొడవలు రాకుండా ఉండాలని, బంధాన్ని   కాపాడుకోవడానికి తమను తాము  తగ్గించుకుంటారు అని నిపుణులు అంటున్నారు.

అయితే నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తిని  ఎప్పుడూ తగ్గించదు. మనిషిని చులకనగా,  తక్కువ చేసి చూసే  సంబంధాలలో ఉండి   ఆత్మగౌరవం కోల్పోవడం,  మనసును బాధపెట్టుకోవడం   ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అందుకే సంబంధంలో విడిపోవాల్సిన అవసరం వచ్చినప్పుడు  తమను తాము మోసం చేసుకోకుండా విడిపోవడం మేలని అంటున్నారు.

సిగ్గు భారం

ఆరోగ్యంగా లేని  సంబంధాలలో వ్యక్తులు తరచుగా తమ భాగస్వాములను సమర్థించుకుంటారు. తమ ప్రవర్తనను సమర్థించుకుంటారు.  బంధంలో కలిగే  అసౌకర్యాన్ని విస్మరిస్తారు. ఇది చాలా వరకు వారిని స్నేహితులు,  కుటుంబం నుండి దూరం చేస్తుంది. పరిస్థితులు విచ్ఛిన్నం కావడం ప్రారంభించినప్పుడు, దానిని ఎదుర్కోవడం కష్టం, అలాంటప్పుడు  ఒంటరిగా,  ఇబ్బందిగా ఫీలవుతారు. చాలామంది సర్దుకుపోతే బంధాలు నిలబడతాయని అనుకుంటారు కానీ.. ఇది మనుషులను మానసికంగా దహించివేస్తుంది. అవతలి వ్యక్తులు మారతారు అనే ఆశ,  పొరపాటున లేదా అపార్థాల వల్ల ఏదైనా సమస్యలు వస్తే మనుషులు మారే అవకాశం ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా మనిషిని బాధపెట్టేవారు మారడం కష్టం.

 స్వార్థం కాదు,  అవగాహన..

బంధం  సరైనది కానప్పుడు దాన్ని  ముగించడం అనేది బలహీనత కాదు. బంధం గురించి అర్థం చేసుకోవడం ద్వారానే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిజాయితీగా ఉండటూ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తీసుకునే నిర్ణయాలు చాలా వరకు తప్పేమో అనిపిస్తూ ఉంటాయి.  బంధం నుండి విడిపోవడం చాలా బాధాకరమైనదే అయినా బాధను  జీవితాంతం భరించడం కంటే విడిపోయి కొద్ది రోజులలో తిరిగి జీవితాన్ని ఆశాజనకంగా మార్చుకోవడం ఎంతో ఉత్తమం.

                                      *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu