సరైన సమయంలో సరైన, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా?


వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్.. ఈ మాట చాలా మంది వినే ఉంటారు.  ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని అందరూ నమ్ముతారు. అట్లాగే ఒక  నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది.  సరైన సమయంలో సరైన, తెలివైన  నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితం చాలా మారిపోతుంది.  అదే సరైన నిర్ణయం కాకుండా చెత్త నిర్ణయం తీసుకుంటే జీవితం పూర్తీగా తలకిందులు అవుతుంది.  చాలామందికి తెలిసి కూడా పొరపాటు చేసేది ఇక్కడే.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. పూర్తీగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని దాని వల్ల నష్టం జరిగినప్పుడే అయ్యో అని అనుకుంటారు.  అసలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇలా సరైన నిర్ణయం తీసుకోగలగాలి అంటే ఏం చేయాలి?  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే జీవితాన్ని అద్బుతంగా మార్చుకోవచ్చు.

ఒక్క ఉదాహరణ.. స్టీవ్ జాబ్స్ నిర్ణయం..

1985లో స్టీవ్ జాబ్స్ కంపెనీతో విభేదాలు పెరిగినప్పుడు, అతను ఆపిల్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో అతని కెరీర్ ముగిసిందని అందరూ అనుకున్నరు. కానీ స్టీవ్ వదులుకోలేదు. అతను NeXT,  Pixar వంటి కంపెనీలను ప్రారంభించాడు. అతను కస్టమర్ల అవసరాలను తెలుసుకోవడం,  అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. తరువాత 1997లో, స్టీవ్ జాబ్స్ ఆపిల్‌కు తిరిగి వచ్చి దానిని ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చాడు. ఇదంతా అతని సరైన నిర్ణయాల వల్లే జరిగింది. సరైన నిర్ణయం వల్ల జరిగే అద్భుతం ఇదే..

నిర్ణయం తీసుకోవడం అంటే మ్యాజిక్ చేయడం  కాదు, అదొక కళ. జీవితంలో ప్రతి మలుపులోనూ మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి  హృదయాన్ని,  మనస్సును ఎలా బాలెన్స్  చేసుకోవాలో ఈ కళ నేర్పుతుంది.

నిర్ణయం తీసుకునే కళ..

మెదడు పనిచేసే విధానం చాలా ప్రత్యేకమైనది. నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కాహ్నెమాన్ తన "థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో" అనే పుస్తకంలో మానవులు రెండు విధాలుగా ఆలోచిస్తారని వివరించారు.

వేగంగా.. సహజంగా..

ఇది  త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే ఆలోచన. ఉదాహరణకు, మనం అకస్మాత్తుగా రోడ్డుపై కారును చూసినప్పుడు ఆగడం. కాహ్నెమాన్ దీనిని "సిస్టమ్ 1" అని పిలిచాడు.

నెమ్మదిగా..  తార్కికంగా..

నెమ్మదిగా.. తార్కికంగా చేసే  ఆలోచనలో లోతైన విశ్లేషణ ఉంటుంది, ఉదాహరణకు కొత్త ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు అన్ని అంశాలను  పరిగణలోకి  తీసుకోవడం. దీనిని "సిస్టమ్ 2" అంటారు.

విజయం వెనుక బలం ఇదే..

విజయవంతమైన వ్యక్తులు ఈ రెండింటిని సరిగ్గా ఉపయోగిస్తారట. అందుకే వారు విజేతలు కాగలరని, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగారని అంటారు.

భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో JLR నష్టాల్లో ఉంది, కానీ రతన్ టాటా తక్షణ నష్టాలను దాటి భవిష్యత్తు వైపు దృష్టి సారించాడు. ఆయన నిర్ణయం టాటా మోటార్స్‌కు లాభాలన అందించడమే కాకుండా, ప్రపంచంలో భారతీయ ఆటో పరిశ్రమ బలాన్నిచాటి చెప్పింది.

నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ఎలా మెరుగు పరచుకోవాలి?

నిర్ణయాలు తీసుకునే  నైపుణ్యం  సహజంగా రాదు. దీనిని నేర్చుకోవచ్చు,  మెరుగుపరచవచ్చు.  నిర్ణయాలను బలోపేతం చేయడానికి ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి:

 శ్వాస..

ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోాల్సి వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్క క్షణం ఆగి, లోతైన శ్వాస తీసుకొని ఆలోచించాలి. ఇది  మనసును ప్రశాంతపరుస్తుంది.

వాస్తవాలను చెక్ చేయాలి..:

ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు, కనీసం 2-3 ముఖ్యమైన సమాచారాన్ని సేకరించండి. ఉద్యోగ మార్పు, జీతం, పని సంస్కృతి,  వృద్ధిని పరిశీలించడం లాంటివి చూసుకోవాలి.

ఎమోషన్స్  అర్థం చేసుకోవాలి..

"నేను ఈ నిర్ణయం భయంతో తీసుకుంటున్నానా? లేక కోపంతో తీసుకుంటున్నానా?" అని  భావోద్వేగాలను  విశ్లేషించుకుని వాటిని అర్థం చేసుకోవాలి.

చిన్న ప్రారంభం..

పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు చిన్న నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏమి ధరించాలి, ఏమి తినాలి వంటి నిర్ణయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి.

నష్టాలన అర్థం చేసుకోవాలి..

 ప్రతి నిర్ణయం తీసుకునే ముందు, అది తప్పు అయితే ఏమి జరుగుతుందో అని ఆలోచించాలి. ఆ నష్టాన్ని  తట్టుకోగలరా లేదా అని ఆలోచించాలి.

అనుభవాల నుండి నేర్చుకోవాలి..

 గతంలో జరిగిన  తప్పులను ఎప్పటికీ  గుర్తుంచుకోవాలి.   వాటిని పునరావృతం చేయకుండా ఉండాలి.

 

                                *రూపశ్రీ.