తప్పటడుగులలో విజయాలు!!

"బుడిబుడి అడుగులు వేసే పిల్లలు ఎన్నో తప్పటడుగులు వేస్తారు. వాటి నుంచేగా సరిగ్గా నడవడం నేర్చుకునేది".- ఇది పెద్దల మాట. 

అడుగు ఎలా??

పెద్దలంటే పెద్దలు, జీవితంలో అనుభవం సాదించేసి, జీవిత సారాన్ని ఒడిసిపట్టి, తప్పేది, ఒప్పేది అనేది చిటికెలో చెప్పేసేవాళ్లే కాదు, బాల్య దశ దాటి, యౌవనంలో దూకి, గందగరగోళంలో, ఆవేశాల నిర్ణయాల్లో బోల్తా పడుతూ, మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ అదే ఆవేశంలో మళ్ళీ అదే పడటాలు, లేవడాలతో కుస్తీ పడుతూ  చివరకు ఒక అనుభవం అర్థమయ్యి దానికొక అర్థవంతమైన దారి తెలిసి అప్పుడు అటూఇటూ ఊగకుండా, ఎలాంటి భయం లేకుండా ధీమాగా అడుగేసి, ఆ అడుగు తాలూకూ భయాన్ని కడిగేసి విజయమనే సంతకాన్ని చేస్తారు.

కానీ పెద్దలు ఏమి చేస్తున్నారు??

తప్పటడుగు  పడగానే దాని అనుభవంతో తదుపరి సరైన అడుగు వేస్తారులే అనుకోవాల్సిన పెద్దలు తప్పు చేసేస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. నేటి కాలంలో తమ పిల్లలు తప్పు చేస్తే, వాటిని కవర్ చేసి ఆ పిల్లలను సేవ్ చేసే తల్లిదండ్రులే ఎక్కువ కనబడుతున్నారు. ఫలితంగా ఆ పిల్లలకు తప్పు అంటే ఏమిటో పూర్తిగా అర్థమవడం లేదు. దాని మూలంగానే అదేమీ పెద్ద సమస్య కాదుగా అన్నట్టు తయారవుతున్నారు పిల్లలు. పైగా తాము ఏదైనా తప్పు చేస్తే తమ తల్లిదండ్రులు తమను సేవ్ చేస్తారనే ధీమా వాళ్ళను ఇంకా, ఇంకా తప్పులు చేయిస్తోంది. కానీ పెద్దలు మాత్రం వాటిలో పిల్లల పట్ల ప్రేమను, వారిని కాపాడుకోవాలనే తపనను కనబరుస్తారే తప్ప, వాళ్ళ తప్పును తెలియచేసి, వాళ్ళను బాధ్యాతాయుత పౌరులుగా తయారు చేయడం లేదు.

పిల్లలకు ఏమి చెప్పాలి??

తప్పులు చేయడం సహజం. అందులో అవగాహన లేని ప్రాయంలో తప్పులు చేయడం మరింత ఎక్కువ. అది ఏ విధమైన తప్పు అనేది అనవసరం కానీ తప్పు చేసిన తరువాత ఆ తప్పుకు గల కారణాలు, దాని పర్యావసనాలు, దాని తాలూకూ ఇబ్బందులు, జీవితం మీద దాని ప్రభావం ఇలాంటివన్నీ పిల్లలకు దగ్గరుండి చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగింది?? అది ఎందుకు తప్పుగా పరిగణించబడుతోంది?? వంటి విషయాలను వివరించాలి. దానివల్ల పిల్లల్లో విస్తృత జ్ఞానం పెరుగుతుంది. ఏదైనా చేసేముందు దాని గూర్చి అన్ని కోణాలలో ఆలోచించడం అలవడుతుంది.

హద్దులు, ముద్దులు!!

చాలామంది పిల్లలు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు వెంటనే వద్దు అంటారు.  కానీ వారు చేయాలి అనుకుంటున్న పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళతోనే చెప్పిస్తూ, దాని తాలూకూ ప్రశ్నలు బయటకు తీస్తూ, ఆ ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళతోనే చెప్పిస్తూ ఉండటం వల్ల వాళ్లలో ఎలాంటి పనులు చేయాలనే అవగాహన వస్తుంది. 

ఏదో పిల్లల మీద ఇష్టం కొద్ది, ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల వారు అడిగింది సమంజసం కాకపోయినా దానికి సరేనని చెప్పే తల్లిదండ్రులు కూడా బోలెడు మంది ఉన్నారు. వాళ్లకు తాత్కాలిక సంతోషం కనబడుతుంది కానీ భవిష్యత్తు గురించి భయం ఉండదు. పైగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంత డబ్బుంది నా పిల్లల భవిష్యత్తుకు ఇంకేం సమస్య అని అనుకుంటారు. కానీ డబ్బు ఎంత పెట్టినా వ్యక్తిత్వం ఉన్నతంగా అభివృద్ధి చెందదు అనే విషయం అర్ధం చేసుకోరు.

మార్గదర్శి….  

తనను ఒక ఉదాహరణగా చెబుతూ కనువిప్పు కలిగించే వారిని మార్గదర్శి అనవచ్చు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉండాలి. అలాగని సారూప్యత లేని విషయాల్లో కాదు. కొన్ని ఉదాహరణలు, కొన్ని జీవిత అనుభవాలు, కొన్ని ప్రేరణాత్మక సంఘటనలు, కొన్ని కష్టాలు, కొన్ని కన్నీళ్లు జీవితంలో ఉన్నవి అన్ని పిల్లలకు కొన్ని చిన్న సంఘటనలుగానో, కథలుగానో, అనుభవాలుగానో చెబుతూ ఉండాలి. వాటి వల్ల పిల్లలు తప్పటడుగుల నుండి పాఠాలు నేర్చుకుని, అందులో నుండి విజయాలు సాదించగలుగుతారు!!

◆ వెంకటేష్ పువ్వాడ