రష్మిక మంథానకు విజయ్‌తో... ఇది ఎన్నో నిశ్చితార్ధమో తెలుసా!
posted on Oct 4, 2025 7:41PM

సినీ జంటల మధ్య పెళ్లిళ్లు ఈనాటివి కావు. కృష్ణ విజయనిర్మల, జీవిత రాజశేఖర్, సమంత నాగచైతన్య, ఇప్పుడు చూస్తే గీత గోవిందం జంట.. రష్మిక మంథాన, విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ, రష్మిక మంథాన కులాలు, ప్రాంతాలు వేర్వేరు. విజయ్ సంగతి మనకు తెలిసిందే. తండ్రి వర్ధన్ దేవరకొండ.. ఇండస్ట్రీని ఏలేయడానికి హైదరాబాద్ వచ్చారు.
ఇక దేవరకొండ ప్రొఫైల్ ఏంటో చూస్తే.. ఆయన 1989, మే 9న హైదరాబాద్ లో గోవర్ధన్, మాధవి దంపతులకు పుట్టారు. వీరి స్వస్తలం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా, తుమాన్పేట్ గ్రామం. తండ్రి వర్ధన్ దేవరకొండకు సినిమాలపై ఉన్న మక్కువ కారణంగా విజయ్ పుట్టక ముందే హైదరాబాద్ వచ్చారు. సినిమా నటుడవ్వాలనుకున్నారు. కానీ అది కుదరక దర్శకత్వ శాఖలో చేశారు. డీడీ వంటి పలు టీవీ చానెళ్లలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసి సీరియల్స్ లో చేస్తూ వచ్చారు.
ఇక విజయ్ విద్యాభ్యాసం మొత్తం అనంతపురం జిల్లా పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇక్కడే విజయ్ కి కథారచన, నటన పై మక్కువ ఏర్పడినట్టు చెబుతారు విజయ్. ఆపై ఇంటర్ హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో, బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు విజయ్.
ఆ తర్వాత నాటకాల్లో రాణించిన విజయ్.. నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోనూ ఒక పాత్ర పోషించారు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యంలో చేసిన రిషి కేరెక్టర్ తో బాగా గుర్తింపు వచ్చింది.
ఇక 2016లో విడుదలైన పెళ్లిచూపులు సినిమాలో హీరో పాత్ర ద్వారా ఆయన నటనకు ప్రేక్షకుల ప్రశంసలందాయి. ఇది విజయ్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2017లో ద్వారక, అంతగా విజయం సాధించలేదు. అదే సంవత్సరం విడుదలైన అర్జున్ రెడ్డితో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవర కొండ కల్ట్ క్లాసిక్, మాస్ ర్యాంపేజ్, ట్రెండ్ సెట్టర్ వంటి పదాలకే కొత్త నిర్వచనం చెప్పారు. ఈ నట విశ్వరూపానికి విజయ్ స్టార్ డమ్ ఆకాశానికి అంటింది.
2018 తొలినాళ్లలో వచ్చిన ఏ మంత్రం వేసావెతో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విజయ్. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చవి చూసాడు. ఆ తర్వాత 2018లో టాక్సీవాలాతో మరో చక్కటి విజయం నమోదు చేశాడు.
తాను వివాహమాడబోతున్న రష్మిక మంథానతో విజయ్ దేవరకొండ చేసిన చివరి సినిమా మాత్రం 2019లో వచ్చిన డియర్ కామ్రెడ్. తర్వాత ఈ ఇద్దరి మధ్య మూవీ లేదు. కానీ వీరికి గీత గోవిందంలో కలసి నటించడం ద్వారా చిగురించిన ప్రేమ పరిణయానికి దారి తీసినట్టు తెలుస్తోంది. అదే ఇప్పుడు వివాహ నిశ్చితార్ధం వరకూ వచ్చింది.
రష్మికా మంథాన 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట్ లో జన్మించారు. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదివిన రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించారు. 2016లో ఆమెకు 24వ స్థానం లభించగా, 2017లో తొలిస్థానంలో నిలిచారు..
కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన రష్మిక అంచెలంచెలుగా ఎదిగి నేషనల్ క్రష్ అంటూ అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే స్థాయికి చేరారు. 2024 అక్టోబర్ లో రష్మికను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్- I4C కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రష్మిక తన తొలి చిత్రం కిరాక్ పార్టీ చిత్రీకరణ సమయంలోనే రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. 2017 జూలైలో వీరి నిశ్చితార్ధం కూడా జరిగింది. తర్వాత ఏమైందో ఏమో వారి మధ్య అనుబంధం చెడినట్టుగా కనిపిస్తోంది. దానికి తోడు రష్మిక కర్ణాటక బోర్డర్ దాటి, ఛలోతో తెలుగులోకి ప్రవేశించి ఆపై గీత గోవిందంగా మేడం అనిపించుకుని అటు పిమ్మట డియర్ కామ్రెడ్ ద్వారా కామ్రెడ్ బిరుదాంకితురాలై సరిలేరు నీకెవ్వరులో అర్ధమవుతోందా! అంటూ ప్రేక్షకులను చక్కిలిగింతలు పెట్టి.. ఇలా చెప్పుకుంటూ పోతే చావాతోనూ నేషనల్ వైడ్ పాపులర్ కావడంతో.. ఆమె నెక్స్ట్ లెవల్ అన్న పేరు సాధించారు.
అలాంటి రష్మికతో లైగర్, కింగ్ డమ్ వంటి విరుస పరాజయాలు ఎదుర్కుంటున్న ఈ వరల్డ్ ఫేమస్ లవర్ తో నిశ్చితార్ధం వరకూ వచ్చింది ఆమె ప్రేమ వ్యవహారం. ఈ నిశ్చితార్ధమైనా రష్మిక జీవితంలో కళ్యాణ గడియలు తీస్కురావాలని.. పీపీపీ డుండుండుం మోత మోగించాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ విజ్-రష్. పెయిర్.. హ్యాపీ మేరీడ్ లైఫ్!!!