మావోయిస్టులకు అమిత్ షా హెచ్చరిక

 

మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ కగార్‌లో మావోలతో ఎలాంటి చర్చలు ఉండవని తెలిపారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తాం అని పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికీ పునరాసం కల్పిస్తామని తెలిపారు.శనివారం ఆయన ‘బస్తర్ దసరా లోకోత్సవ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలు జరిపే అవసరం లేదని స్పష్టం చేశారు. 

మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. బస్తర్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి నక్సలిజమే. బస్తర్ శాంతికి భంగం కలిగిస్తే భద్రతా బలగాలు తగిన రీతిలో సమాధానం చెబుతాయంటూ అమిత్‌ షా హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ. 4 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. మావోయిజం వల్ల తప్పుదారి పట్టినవారు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అమిత్‌ షా పిలుపునిచ్చారు.దారి తప్పిన మావోయిస్టులను తిరిగి జనజీవన స్రవంతిలోకి రప్పించేందుకు ప్రజలు కృషి చేయాలని అమిత్ షా  పిలుపునిచ్చారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే 4.40 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశామని, దీని ఫలితంగా నూతన పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఏర్పాటయ్యాయని వివరించారు. నక్సల్ హింస బాధితుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15,000 ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు.గడిచిన నెలలోనే 500 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన పేర్కొన్నారు. ఏదైనా గ్రామం నక్సల్ రహితంగా మారితే, దాని అభివృద్ధికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయలు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu