ఈ ఫార్ములా రేస్ కేసు.. ఇక అధికారుల అరెస్టేనా?
posted on Sep 24, 2025 2:52PM

ఈ ఫార్ములా రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల అరెస్టుకు రంగం సిద్ధమౌతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. తెలంగాణలో రాజకీయ హీట్ ను అమాంతంగా పెంచేసిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ రికమెంట్ చేసింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల ప్రాసిక్యూషన్ ను అనుమతి కోరుతూ ఏసీబీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి విదితమే.
దీనిపై విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి ఈ ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ఏసీబీ నివేదిక ఆధారంగా వీరిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేయడంతో వీరి అరెస్టు ఖాయమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. అయితే ఇదే కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతీ ఇంకా రాలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఏసీబీ ఇప్పటికే రెండు సార్లు విచారించింది. కాగా.. ఐఏఎస్ అధికారులు అరవింద్, బీఎల్ఎన్ రెడ్డిలను మూడేసి సార్లు విచారించింది.