భార్యను కాపురానికి పంపడం లేదని మామను చంపిన అల్లుడు
posted on Dec 12, 2025 2:53PM

భర్త వేధింపులు భరించలేక భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది... దీంతో ఆ భర్త ప్రతిరోజు అత్తగారింటికి వెళ్లి గొడవ పడుతూ చివరకు మామను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్పూర్ బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య (58) అనే వ్యక్తి తన కూతురు లక్ష్మిని గత కొన్ని సంవత్సరాల క్రితం రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ముగ్గురు కూతుర్లు ,ఒక కొడుకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు...
రామకృష్ణ మద్యానికి బానిస అయ్యాడు... ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించడం ఆ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం చేస్తూ ఉండేవాడు. రామకృష్ణ తన కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న వెంటనే భార్య లక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త రామకృష్ణ అత్తవారింటికి వచ్చి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.
అల్లుడు రామకృష్ణ, భార్యను తిరిగి తమ కాపురానికి పంపడం లేదని అత్తమామలతో తరుచుగా గొడవ చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మామ చంద్రయ్యతో గొడవపడ్డాడు.. ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.
కోపంతో రగిలిపోయిన అల్లుడు రామకృష్ణ కత్తితో ఒక్కసారిగా మామ చంద్రయ్యపై దాడి చేసి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకు నేందుకు ప్రయత్నించగా, వారిని కూడా చంపేస్తానని రామకృష్ణ బెదిరించాడు.
మామను హత్య చేసిన అనంతరం అల్లుడు రామకృష్ణ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి... పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు...