స‌రికొత్త సనాత‌న సార‌ధి.... సాయిరెడ్డి!?

 

విజ‌య‌సాయి రెడ్డి హిందుత్వ వైపు అడుగులు వేస్తున్నారా? ఎందుకీ మాట అనాల్సి వ‌స్తోంది? జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  సాయిరెడ్డి స‌నాత‌న‌త్వం అని ఒక‌టి వెలుగు చూస్తోందా? ఇలా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోంద‌ని చూస్తే ముచ్చ‌ట‌గా మూడు కామెంట్ల‌లో ఆయ‌న  ప్ర‌య‌త్నం, ప్ర‌యాణం, ప‌ద ప్ర‌యోగం ఏంటో చూడొచ్చు..

అందులో భాగంగా స్టెప్ వ‌న్.. ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న వైసీపీ  నుంచి అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి  పేరు ప‌దే ప‌దే చెప్పారు.  తాను రాజ‌కీయ స‌న్యాసం  త‌ర్వాత వ్య‌వ‌సాయం  చేస్తాన‌ని  చెప్పుకొచ్చారు. వీలుంటే  మీడియా సంస్థ పెడ‌తానేమోగానీ రాజ‌కీయాల్లోకి రాను. రాలేను. రాబోను.. అంటూ కుండ  బ‌ద్ధ‌లు కొట్టారు.

క‌ట్ చేస్తే మ‌రో కీల‌క‌మైన కామెంట్ ఏం చేశారో చూస్తే.. సిక్కోలు గ‌డ్డ మీద నుంచి తాను ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పార్టీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని.. బీజేపీలో చేర‌బోతున్న మాట అవాస్త‌వ‌మ‌నీ.. అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అదే స‌మ‌యంలో ఆయ‌న అవ‌స‌ర‌మైతే పార్టీ పెట్ట‌డానికి కూడా వెన‌కాడ‌న‌ని అన్నారు. 

ఈ టైంలో ఆయ‌న చివ‌రాఖ‌రిగా అన్న మాట‌లేంట‌ని చూస్తే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌న‌కు రెండు ద‌శ‌కాల‌కు పైగా  సాన్నిహిత్య‌ముంద‌ని ఒక చిన్న‌హింట్ ఇచ్చారు. సేనాని ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో మ‌నంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డో త‌మిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రిగిన‌ మురుగ‌న్ మానాడుకు హాజ‌ర‌య్యారు. 

నిన్న మొన్న  త‌మిళ కార్తీక దీపోత్స‌వం వ్య‌వ‌హారంలో తీర్పునిచ్చిన స్వామినాథ‌న్ అనే ఒకానొక జ‌డ్జిపై ఇండి కూట‌మి ఎంపీలు అవిశ్వాసం పెట్టే  య‌త్నం జ‌రిగింది. ఇలాంటి విష‌యాల్లో హిందుత్వ వాదుల వైపు పోరాడ్డానికి స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్యావ‌శ్య‌కంగా సెల‌విచ్చారు సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్. 

రీసెంట్ గా విజ‌య‌సాయి రెడ్డి  హిందుత్వ ప్రోగా అన్న మాట‌ల విష‌యానికి వ‌స్తే.. హిందూ దేవాలయాలపై ఒక‌ ట్వీట్ చేశారు. దీని సారాంశ‌మేంటో చూస్తే.. హైంద‌వ‌ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.. దేవాలయాలపై ప్రభుత్వ  నియంత్రణ- ఆర్టికల్ 14కు విరుద్ధమని అన్నారు. 

ఇతర మతాలకు చెందిన ప్రార్ధ‌నాలయాలు స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయనీ.. అన్ని మతాలకు సమానత్వం కల్పించాలనీ కోరారు స‌రికొత్త స‌నాత‌న సార‌ధి సాయిరెడ్డి. రాజ్యంగ బద్ధంగా మతాల మధ్య సమానత్వం ఉండాలనీ.. ప్రస్తుత విధానాలను కేంద్రం పున:పరిశీలించాలనీ డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. హోంమంత్రి అమిత్ షా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలని కూడా కోరారాయన.

వీట‌న్నిటిని బ‌ట్టీ.. సాయిరెడ్డి పోక‌డ చూస్తుంటే హిందుత్వ‌కే బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బీజేపీలో చేర‌డ‌మా?  లేక స‌నాత‌నాన్ని భుజానికెత్తుకుని తిరుగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ‌న చేర‌డ‌మా రెండిట్లో ఏదో ఒక‌టి జ‌రగ‌డం ఖాయంగా తెలుస్తోందంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. ఎనీహౌ అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ ఫ‌ర్ యువ‌ర్ లేటెస్ట్ స‌నాత‌న సార‌ధ్యం అని మ‌నం కూడా ఓ శుభాకాంక్ష‌లు చెప్పి ఉంచుదాం. ఎప్ప‌టికైనా ప‌నికొస్తుందేమో చూద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu